వేములవాడ రాజన్న ఆలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్, వాచ్‌మెన్ కం హెల్పర్‌గా పనిచేస్తున్న....
మద్యం మత్తులో రాజన్న ఆలయంలోకి ప్రవేశించిన ఉద్యోగులు
ఇద్దరిని సస్పెండ్ చేసిన ఈవో
వేములవాడ : వేములవాడ రాజన్న ఆలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న పి.శ్రీనివాస్, వాచ్‌మెన్ కం హెల్పర్‌గా పనిచేస్తున్న డి.శ్రీనివాస్ ఈనెల 19న మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయ అధికారులు, సిబ్బంది, భక్తులను దుర్భాషలాడారు. ఏఈవో గౌరీనాథ్, సూపరింటెండెంట్ విచారణ జరిపి ఈవోకు నివేదిక సమర్పించారు.
దీంతో సదరు ఉద్యోగులను ఆలయ ఈవో దూస రాజేశ్వర్ సస్పెండ్ చేశారు. వీరు గతంలోనూ పలుమార్లు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించారని, క్రమశిక్షణా చర్యలు తీసుకున్నప్పటికీ మార్పు రాలేదని అధికారులు తెలిపారు. ఉద్యోగులు మద్యం మత్తులో ఆలయంలోకి ప్రవేశించడం వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని అర్చకులు పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను అరికట్టేందుకు ఆలయ ప్రవేశమార్గంలో బ్రీత్ అనలైజర్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరముందని భక్తులు అభిప్రాయపడ్డారు.
కాగా.. గతంలో ఒకరిద్దరు అర్చకులు సైతం మద్యం మత్తులో ఆలయంలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించి ఆలయ అధికారులకు సమాచారం అందించినట్లు స్థానికులు తెలిపారు. మద్యం సేవించి ఆలయంలోకి ప్రవేశించినా, మద్యం మత్తులో విధులు నిర్వహించినా అధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసముంది.