నో కిక్ | No kick | Sakshi
Sakshi News home page

నో కిక్

Published Tue, Jun 17 2014 4:33 AM | Last Updated on Fri, Aug 17 2018 7:42 PM

నో కిక్ - Sakshi

నో కిక్

 ప్రొద్దుటూరు: కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు దాదాపు సమాజంలోని అన్ని వర్గాల వారు  ఎంతో కొంత మేరకు మద్యం  సేవిస్తున్న వారే. ఇందు కోసం ప్రతి నెల వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. అయితే ఏ ఒక్కరు మద్యం సేవించడంపై సంతృప్తి చెందడం లేదు.మద్యం కల్తీయే ఇందుకు అసలు కారణం. ప్రొద్దుటూరు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 19 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. వీటి పరిధిలో నెలకు రూ.6కోట్ల వ్యాపారం జరుగుతోంది.  కొంత మంది వ్యాపారులు విచ్చల విడిగా మద్యం కల్తీ చేసి అమ్ముతున్నారు. గుట్టుచప్పుడు కాకుండా ఈ వ్యవహారం చాలా రోజులుగా సాగుతోంది.
 
కల్తీ ఇలా ...
వ్యాపారులు ప్రతి నెల దుకాణానికి సంబంధించిన మద్యాన్ని కడప పరిధిలో ఉన్న డిపో నుంచి కొనుగోలు చేస్తారు. మద్యాన్ని తెచ్చిన వెంటనే దుకాణంలో దించడం, కల్తీ చేయడం జరుగుతోంది. ఇందుకుగాను నైపుణ్యం గల కొంత మంది వ్యక్తులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. వీరు సీల్ తీయకుండానే పరికరంతో మద్యం బాటిల్‌ను ఓపెన్ చేసి అందులో కల్తీ చేస్తారు. కొన్ని బాటిళ్లకు సీల్ తీయడం కల్తీ చేసిన తర్వాత తిరిగి అతికించడం జరుగుతోంది. తక్కువ ధర గల చీఫ్ లిక్కర్ లాంటి క్వార్టర్ బాటిల్‌లో 6 ఔన్స్‌లకు గాను రెండు, మూడు ఔన్స్‌ల వరకు డెరైక్ట్‌గా నీటిని కలుపుతున్నారు.

ధర అధికంగా ఉన్న మద్యానికి సంబంధించి ఆ బాటిళ్లను ఓపెన్ చేసి వాటిలో చీఫ్ లిక్కర్‌ను కలుపుతారు. చాలా కాలంగా పట్టణంలో ఈ వ్యవహారం కొనసాగుతోంది. దీంతో మద్యం ప్రియులు కల్తీ మద్యంపై తరచూ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఎంత తాగినా కిక్ ఎక్కడం లేదని, బాటిళ్లలో నీరు కలుపుతున్నారని స్వయంగా ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.  ఎక్సైజ్ అధికారులు అప్పుడప్పుడు శాంపిళ్లు తీసి పంపుతున్నా పరిస్థితి మాత్రం యధావిధిగానే ఉంది. ఒరిజనల్ మద్యం ఎక్కడ లభిస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రొద్దుటూరుకు వచ్చిన జిల్లా టాస్క్ ఫోర్స్ అధికారులు మద్యం కల్తీపై గట్టి హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది.
 
ఈ విషయంపై ఓ మద్యం వ్యాపారి న్యూస్‌లైన్‌తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రివిలైజ్ రూపంలో అధికంగా టాక్స్ వసూలు చేస్తోందని, అలాంటి పరిస్థితుల్లో ఇలాంటివి చేయాల్సి వస్తోందని అన్నారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ఉన్న ప్రొద్దుటూరులోనే ఇలాంటి సంఘటనలు జరుగుతుండటం గమనార్హం.
 
క్వార్టర్‌పై రూ.10 పెంపుదల

 నిబంధనలకు విరుద్ధంగా మద్యం వ్యాపారులు అధిక ధరలు వసూలు చేస్తున్నారు. క్వార్టర్ బాటిల్‌పై అదనంగా రూ.10 చొప్పున వసూలు చేస్తున్నారు.  ఎన్నికల సమయంలో మద్యానికి డిమాండ్ ఏర్పడింది. అప్పటి నుంచి యధావిధిగా రూ.10 చొప్పున పెంచి అమ్ముతున్నారు. ఈ విధంగా ఫుల్ బాటిల్‌పై రూ.40 వరకు వసూలు చేస్తున్నారు. అలాగే బీరు బాటిల్‌పై రూ.20-40 వరకు పెంచి అమ్మకాలు చేపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement