ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అమెజాన్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు మరోసారి వెలుగులోకి వచ్చింది. అమెజాన్‌లో పనిచేసే ఉద్యోగులకు వర్క్‌లోడ్‌తో ఆత్మహత్య చేసుకునే ధోరణి పెరిగిపోయింది. ఒక్కోసారి ఆ ఒత్తిడి తట్టుకోలేక తోటి ఉద్యోగులపై దాడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈకామర్స్ సంస్థ ఉద్యోగులకు మెయిల్ పెట్టింది. తోటి ఉద్యోగులపై దాడి చేయొద్దు. హింసను ప్రోత్సహించొద్దంటూ మెయిల్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఆ మెయిల్ లీకవ్వడంతో అమెజాన్ ఉద్యోగుల పట్ల ఎలా వ్యవహరిస్తుందో చూడండి అంటూ మాజీ ఉద్యోగులు, నెటిజన్‌లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అమెజాన్‌లో విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. అమెజాన్ యాజమాన్యం అందులో పనిచేసే ఉద్యోగులకు మెయిల్స్ పంపింది. పెరిగిన పనిభారం కారణంగా 'ఆత్మహత్య' చేసుకునే ఆలోచనలు ఎలా పెరుగుతుంటాయో నొక్కి చెప్పింది. 'మీ మానసిక ఆరోగ్యం ముఖ్యమని గుర్తుంచుకోండి. మీరు ఒత్తిడికి గురై నిరాశ, ఆందోళన లేదా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలు వస్తుంటే సంబంధిత విభాగానికి చెందిన మీ మేనేజర్, హెచ్ ఆర్ లేదా, మానసిక ఆరోగ్య నిపుణులతో మాట్లాడండి' అంటూ మెయిల్స్‌లో పేర్కొంది. అంతేకాదు పనిభారం కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు భావిస్తే వృత్తిపరమైన సహాయం తీసుకోవాలని అమెజాన్ ఉద్యోగుల్ని ప్రోత్సహించింది.
అయితే పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ మాజీ ఉద్యోగి అమెజాన్ ఉద్యోగులకు పంపిన మెయిల్‌ను లీక్ చేశారు. ఈ సందర్భంగా సదరు ఉద్యోగి మాట్లాడుతూ..ప్రతి సంవత్సరం ప్రైమ్ మెంబర్ల కోసం ప్రైమ్ డే సేల్ నిర్వహిస్తుంది. ఈ సేల్ సందర్భంగా ఆర్డర్‌ల సంఖ్య పెరిగిపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అమెజాన్ వన్ డే డెలివరీ ఆఫర్ లో లాజిస్టిక్స్ బృందంలో పని చేసే ఉద్యోగులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సెలవులు తీసుకోకుండా ఓవర్ టైం పని చేయాల్సి ఉంటుంది.
కస్టమర్‌లకు బుక్ చేసుకున్న ఆర్డర్స్‌ను పంపే సమయంలో ప్రతి ఒక్క ఉద్యోగి చాలా బిజీగా ఉంటాడు. ఒత్తిడి గురవ్వడం, ఆత్మహత్య చేసుకోవాలని అనిపించడం, లేదంటే తోటి ఉద్యోగులపై దాడి చేయాలనే ఆలోచనలు ఎక్కవైతుంటాయని సదరు అమెజాన్ మాజీ ఉద్యోగి తెలిపారు. అమెజాన్‌లో నాలుగేళ్లు పనిచేశాను. యాజమాన్యం ఎప్పుడూ ఇలాంటి మెయిల్స్‌ను ఉద్యోగులకు పంపిన దాఖలాలు లేవు. కానీ ఈ మధ్య కాలంలో అమెజాన్ ఉద్యోగుల పట్ల వ్యవహరిస్తున్న తీరు కారణంగా ఈ తరహా జాగ్రత్తలు తీసుకుటుందనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.
చదవండి: అమెజాన్ తీరుపై సర్వత్రా విమర్శ
Comments
Please login to add a commentAdd a comment