సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మిక, ఉద్యోగ భాగస్వామ్యం ఏటేటా భారీగా తగ్గుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా కొత్తగా గనులు ఏర్పడక క్రమేపి ప్రైవేటీకరణ పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికులసంఖ్య 39 వేలకు చేరింది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లక్షలాది మందికి ఉపాధి కల్పించింది.
గత రెండు దశాబ్దాలుగా సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో కాంట్రాక్టు వ్యవస్థ పెరిగిపోయింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్‌ఎస్) కోసం గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకం కింద, విధుల్లో నిర్లక్ష్యం పేరిట 1997 నుంచి 2014 వరకు వందలాది కార్మికులను తొలగించారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతమంది కార్మికులు ఉంటారనే చర్చ మొదలైంది.
కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ప్రక్రియ మొదలై వచ్చే నెల 5న ఓటర్ల జాబితా వెలువడితే పూర్తిస్థాయిలో సంఖ్య తేలనుంది. కార్మిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే 1998లో 1,08,212 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 39 వేలకు చేరింది. వీటితోపాటు రెండు వేల వరకు ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగులు ఉంటారు. గత 25 ఏళ్లలో 68 వేల మంది కార్మికులు తగ్గారు. కంపెనీలో ఇప్పటివరకు ఆరుసార్లు కార్మిక ఎన్నికలు జరిగాయి. నాటికీ, నేటికీ ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. గత ఆరేళ్లలోనే 13 వేలకుపైగా కార్మికులు తగ్గారు.
Comments
Please login to add a commentAdd a comment