Telangana Latest News
-
కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలు
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్లో కేసీఆర్ ఉండేది కేవ లం 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే ఆయన ఉండబోతున్నారు’అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబ భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు. కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్ల దోపిడీ చేసింది. అందుకే అడుగడుగునా బీఆర్ఎస్ను ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తుంటే వాటిలో పాల్గొనే తీరికలేని, కుట్రలు చేసే సీఎం తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేత టి. ఆచారిల సమక్షంలో మాజీ మంత్రులు సి. కృష్ణయాదవ్, జె.చిత్తరంజన్‌దాస్, సిర్పూర్ జెడ్పీటీసీ రేఖా సత్యనారాయణ, మరో నేత బండల రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి, ఈటల, అరుణ కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సర్వేల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి ఖాయమని తెలియడంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి రాదు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఅర్ఎస్కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు... 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. పార్టీ గెలుపునకు కృషి: కృష్ణయాదవ్, చిత్తరంజన్‌దాస్ ‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ చెప్పారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో నా పాత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు. తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగనుంది: ఈటల ‘బీఅర్ఎస్కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోందని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు. -
ఏటేటా.. ఉద్యోగులకు టాటా!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: రాష్ట్రంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ సింగరేణిలో కార్మిక, ఉద్యోగ భాగస్వామ్యం ఏటేటా భారీగా తగ్గుతోంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కార్మికులు, ఉద్యోగుల సంఖ్య పడిపోతోంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత కూడా కొత్తగా గనులు ఏర్పడక క్రమేపి ప్రైవేటీకరణ పెరుగుతోంది. ప్రస్తుతం కార్మికులసంఖ్య 39 వేలకు చేరింది. 134 ఏళ్ల చరిత్ర ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లక్షలాది మందికి ఉపాధి కల్పించింది. గత రెండు దశాబ్దాలుగా సంస్థలో యాంత్రీకరణ, ప్రైవేటీకరణతో కాంట్రాక్టు వ్యవస్థ పెరిగిపోయింది. స్వచ్ఛంద ఉద్యోగ విరమణ(వీఆర్ఎస్) కోసం గోల్డెన్ షేక్‌హ్యాండ్ పథకం కింద, విధుల్లో నిర్లక్ష్యం పేరిట 1997 నుంచి 2014 వరకు వందలాది కార్మికులను తొలగించారు. ప్రస్తుతం సింగరేణిలో కార్మిక సంఘ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంతమంది కార్మికులు ఉంటారనే చర్చ మొదలైంది. కంపెనీలో గుర్తింపు కార్మిక సంఘ ఎన్నికల ప్రక్రియ మొదలై వచ్చే నెల 5న ఓటర్ల జాబితా వెలువడితే పూర్తిస్థాయిలో సంఖ్య తేలనుంది. కార్మిక ఎన్నికలు మొదలైనప్పటి నుంచి పరిశీలిస్తే 1998లో 1,08,212 మంది కార్మికులు ఉన్నారు. ఇప్పుడా సంఖ్య 39 వేలకు చేరింది. వీటితోపాటు రెండు వేల వరకు ఎగ్జిక్యూటివ్ కేడర్ ఉద్యోగులు ఉంటారు. గత 25 ఏళ్లలో 68 వేల మంది కార్మికులు తగ్గారు. కంపెనీలో ఇప్పటివరకు ఆరుసార్లు కార్మిక ఎన్నికలు జరిగాయి. నాటికీ, నేటికీ ఓటర్ల సంఖ్యలో చాలా వ్యత్యాసం ఉంది. గత ఆరేళ్లలోనే 13 వేలకుపైగా కార్మికులు తగ్గారు. -
ఏపీ పంచాయితీ హైదరాబాద్‌లో పెడితే ఎలా?
సాక్షి, హైదరాబాద్: ‘చంద్రబాబు నాయుడి అరెస్టు ఏపీకి సంబంధించిన అంశం. రెండు రాజకీయ పార్టీల నడుమ యుద్ధానికి సంబంధించినది. ఆ రెండు పార్టీల ఉనికి ఇక్కడ లేదు. అక్కడి రాజకీయాలతో మాకేం సంబంధం? అక్కడి పరిణామాలు తెలంగాణ ప్రజలపై ఎలాంటి ప్రభా వం చూపలేవు. ఎవరైనా వచ్చి ఇక్కడ నాటకాలు వేస్తే ‘బేగానీ షాదీ మే అబ్దుల్లా దీవానా’ అన్నట్లు (ఎవరిదో పెళ్లికి వేరెవరో హడావుడి చేసినట్లు..) ఉంటుంది. చంద్రబాబు అరెస్టు అయింది ఏపీ లో. అక్కడ ర్యాలీలు, ధర్నాలు చేసుకుంటే ఎవరొ ద్దంటారు. హైదరాబాద్‌లో ర్యాలీలు తీస్తే ఎలా? పక్కింటి పంచాయతీ ఇక్కడ తీర్చుకోవడం ఎక్కడి పద్ధతి? ఏపీలో ఒకరితో ఒకరు తేల్చుకోండి. రాజమండ్రిలో భూమి దద్దరిల్లేలా ర్యాలీలు తీయండి. అక్కడి పంచాయితీ హైదరాబాద్‌లో పెడితే ఎలా? ఇక్కడ శాంతి భద్రతలు కాపాడే బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. ఎలా అను మతి ఇస్తారు? ఇవాళ వీళ్లు చేస్తే రేపు ఇంకొకరు చేస్తారు. వాళ్ల ఘర్షణకు హైదరాబాద్‌కు వేదిక కావాలా? విజయవాడ, రాజమండ్రి, అమరా వతి లేవా? అక్కడ ఏమీ చేయకుండా ఇక్కడ రాద్ధాంతం, రాజకీయం చేయడం ఏంటి?. లోకేశ్ తన స్నేహితుడి ద్వారా మాట్లాడించారు.. చంద్రబాబు అక్కడ న్యాయ పోరాటం చేస్తున్నపుడు ఇక్కడ ఎవరు పడితే వాళ్లు రోడ్డు మీదకు వచ్చి మాట్లాడతారా? లోకేశ్, జగన్, పవన్‌తో నాకు మితృత్వం ఉంది. అందరూ దోస్తులే.. ఆంధ్రాతో తగాదాలు లేవు. అలాంటపుడు మాకు లేని పోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారు. హైదరాబాద్‌లో దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన వారు కలసిమెలసి ఉన్నారు. అక్కడి పంచాయితీ ఇక్కడ పెట్టి ఇక్కడ స్థిరపడిన వారి నడుమ లేని వైషమ్యాలు, కక్షలు, కార్పణ్యాలు లేపి దానిని మాకు చుడతామంటే ఎలా? హైదరాబాద్‌లో నిరసనలకు అనుమతి ఎందుకు ఇవ్వ డం లేదని లోకేశ్ తన స్నేహితుడి ద్వారా మాట్లాడించారు. ఇక్కడి ఐటీ కారిడార్‌లో శాంతిభద్రతలు ఏం కావాలి? ఇక్కడ పెట్టుబడులు పెడుతున్న ఆంధ్రా వారికి లాభాలు రావాలంటే శాంతిభద్రతలు బాగుండాలి. అక్కడి రాజకీయ గొడ వల్లో మేము తలదూర్చం. చంద్రబాబు అరెస్టుపై మా పార్టీ నేతలు ఎవరైనా మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయం. మేము న్యూట్రల్‌గా ఉంటున్నాం.. సహకరించాలి..’ అని అన్నారు. -
రేపు టెట్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టీఎస్‌టెట్) ఫలితాలను ఈనెల 27న విడుదల చేయనున్నారు. ఇందుకు కోసం అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే ఫలితాలు విడుదలవుతాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక ‘కీ’ విడుదలైంది. 27వ తేదీన తుది ‘కీ’ తో పాటు ఫలితాలు వెల్లడించనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. టెట్ పరీక్ష పేపర్–1కు 2,69,557 మంది దరఖాస్తు చేశారు. ఇందులో 2,26,744 (84.1 శాతం) మంది పరీక్ష రాశారు. పేపర్–2కు 2,08,498 మంది దరఖాస్తు చేస్తే, 1,89,963 మంది (91.11 శాతం) పరీక్ష రాశారు. వచ్చే నెల జరిగే ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ)కి టెట్ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసే వీలుంది. ఈ కారణంగా టెట్ ఫలితాలను ఆలస్యం చేయకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సీటెట్ ఫలితాల విడుదల సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫలితాలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్ష ఆగస్టు 20వ తేదీన దేశవ్యాప్తంగా జరిగింది. మొత్తం 29 లక్షల మంది ఈ పరీక్షకు రిజిస్టర్ చేసుకున్నారు. పేపర్–1కు (1–5 తరగతి బోధకు అర్హత) 15 లక్షల మంది, పేపర్–2కు (6–8 తరగతులకు బోధనకు అర్హత) 14 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో అర్హత సాధిస్తే దేశవ్యాప్తంగా ప్రముఖ స్కూళ్లలో ఉపాధ్యాయులుగా పనిచేసే వీలుంది. -
ఉన్నత విద్య పేదవాళ్లకి అందాలి
సాక్షి, హైదరాబాద్: నాణ్యమైన ఉన్నత విద్య పేదవాళ్లందరికీ అందాలని రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఆకాంక్షించారు. ఈ దిశగా విద్యా సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. జాతీయ విద్యావిధానం–2020 ఈ తరహా మార్పు లకు శ్రీకారం చుడుతుందన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. ’’విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు– పూర్వ విద్యార్థులతో సంబంధాలు’’ అనే అంశంపై సోమవారం రాజ్‌భవన్‌లో చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్రంలోని పలు విశ్వవి ద్యాలయాల వీసీలు, ఉన్నతాధికారులు, వివిధ రంగాల్లో స్థిరపడిన వర్సిటీల పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతు లు పెంచి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన బోధన విధానాలు తీసుకురావాలని సూచించారు. అకడమిక్ యాక్టివిటీని వర్సిటీలు మర్చిపోయాయి ప్రపంచంతో పోటీ పడగల సత్తా రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఉందని, అయితే అకడమిక్ యాక్టివిటీని విశ్వవిద్యాలయాలు మరిచిపోయా యని ఆమె వ్యాఖ్యానించారు. సరైన బోధన విధానాలు, మౌలిక వసతులు కల్పిస్తే ఇప్పుడు ప్రపంచ విశ్వవిద్యాలయాల గురించి చెప్పుకున్నట్టే, భవిష్యత్‌లో మన యూనివర్సిటీల గురించి చర్చించుకునే వీలుందన్నారు. విద్యావికాసానికి డిజిటల్ లైబ్రరీ మంచి అవకాశంగా పేర్కొన్నారు. పూర్వ విద్యార్థుల సహకారం విశ్వవిద్యాలయాలకు అత్యంత ముఖ్యమని, దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. -
ఆ పార్టీలు చేతులు కలిపేనా? కాంగ్రెస్‌లో కొరవడిన స్పష్టత
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఎన్నికల్లో ఇతర పార్టీలతో పొత్తుపై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత రావడం లేదు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలతో పాటు తెలంగాణ జన సమితి (టీజేఎస్), బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ)లతో ఈసారి పొత్తు కుదిరే అవకాశముందనే చర్చ జరుగుతోంది. కానీ ఎన్నికల షెడ్యూల్ వెలువడే సమయం సమీపిస్తున్నా రాష్ట్రస్థాయిలో ఇంతవరకూ ఎలాంటి స్పష్టమైన ప్రతిపాదనలు లేకపోవడం, ఈ దిశగా ఎలాంటి తాజా కదలిక లేకపోవడంతో పొత్తు ఉంటుందా? ఉండదా? అనే అంశంపై పార్టీ కేడర్ గందరగోళానికి గురవుతోంది. ముఖ్యంగా సీపీఐ, సీపీఎంలతో పొత్తు విషయంలో అయోమయం నెలకొంది. వాస్తవానికి ఆ పార్టీలతో గతంలో ఢిల్లీ స్థాయిలో చర్చలు జరిగాయి. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ హైదరాబాద్‌లో సీపీఐ నేత నారాయణతో మంతనాలు జరిపారు. కానీ ఇంతవరకు ఏమీ తేల్లేదు. కామ్రేడ్లు అడిగినట్టుగా భావిస్తున్న సీట్లపై ఎలాంటి స్పష్టత రాలేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక కసరత్తును వేగవంతం చేయడంతో వామపక్షాలతో పొత్తు ఉంటుందా? ఉండదా? అన్న దానిపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.దీనిపై అధిష్టానం వీలున్నంత త్వరగా స్పష్టత ఇవ్వాలని, ఏదో ఒకటి త్వరగా తేల్చితేనే ఎన్నికలను సమర్థంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని, లేదంటే గత ఎన్నికల్లో మహాకూటమి పొత్తు లాగానే విఫలమయ్యే ప్రమాదం ఉందని అంటున్నారు. ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి విశ్వసనీయ సమాచారం ప్రకారం.. టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాంను కూడా ఇప్పటికే కాంగ్రెస్ వర్గాలు సంప్రదించాయి. ఢిల్లీ నుంచి ఆయనతో మంతనాలు జరిగాయని, ఈ సందర్భంగా పార్టీ విలీనం ప్రస్తావన వచ్చిందని, ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించిన ప్రొఫెసర్.. పొత్తుకు మాత్రం అభ్యంతరం లేదని చెప్పారని తెలిసింది. అయితే ఈసారి ఆరు స్థానాలపై టీజేఎస్ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సూర్యాపేట, జహీరాబాద్, నర్సంపేట, ఎల్లారెడ్డి, గద్వాల, కోరుట్లపై ప్రధానంగా దృష్టి సారించామని, ఒంటరిగా పోటీ చేయాల్సి వస్తే మిగిలిన చోట్లా తమకు అభ్యర్థులు ఉన్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో బీఎస్పీతో సంబంధాలు ఎలా ఉన్నా రాష్ట్ర స్థాయిలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే ప్రతిపాదన ఉందని కాంగ్రెస్ నేతలు చెపుతున్నారు. అయితే ఇంతవరకూ ప్రాథమిక స్థాయిలో కూడా చర్చలు ప్రారంభం కాకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు ఈసారి పొత్తుల విషయమై కాంగ్రెస్ పార్టీలో రెండు అభిప్రాయాలు స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీలకు వీలున్నన్ని తక్కువ స్థానాలు ఇచ్చి పొత్తు కుదుర్చుకుంటే మంచి ఫలితం వస్తుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. మరికొందరు మాత్రం ఏ పార్టీ తోనూ పొత్తు అవసరం లేదని, ఒంటరిగా ఎన్నికలకు వెళితేనే కచ్చితంగా మేలు జరుగుతుందని అంటున్నారు. అయితే పార్టీ అధిష్టానం రాష్ట్ర నాయకులకు సమాచారం లేకుండానే ఇతర పార్టీలతో చర్చలు జరుపుతుండటంతో భవిష్యత్తులో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. -
గద్దర్ మృతితో.. మెతుకు బిడ్డ.. మరువదు ఈ గడ్డ..
మెదక్: గజ్వేల్ మట్టి పరిమళం.. భిన్న సంస్కృతులకు నెలవైన గజ్వేల్ నియోజకవర్గం ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచింది. ఈ ప్రాంతంలో గద్దర్ జన్మించాడు. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో పుట్టి ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజాఉద్యమాలకు బాసటగా నిలిచారు. 1978–80 ప్రాంతంలో పీడిత ప్రజల కష్టాలకు కళ్లకు కడుతూ ఇదే ప్రాంతంలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన బీ.నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’ చిత్రంలో గద్దర్ పాడిన ‘బండెనక బండి గట్టి...పదహారు బండ్లు కట్టి...ఏ బండ్లే పోతవ్ కొడుకో నైజాం సర్కారోడా’ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 1986లో రాడికల్ విద్యార్థి సంఘం సభకు గద్దర్ హాజరయ్యారు. 1994లో గజ్వేల్ పట్టణం వేదికగా వర్కింగ్ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభకు హాజరైన గద్దర్ పీడిత ప్రజల గొంతకయ్యాడు. తూప్రాన్‌కు ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.3.61కోట్లు మంజూరు చేయించి ఆయనే ప్రారంభించారు. తూప్రాన్ పట్టణంపై ‘మై విలేజ్ ఆఫ్టర్ సిక్టీ ఇయర్స్’ పేరుతో పుస్తక రచన చేశారు. పోరుబిడ్డల దుబ్బాక గడ్డ అంటే.. గద్దర్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గాయకులు, పీపుల్స్‌వార్ (మావోయిస్టు) సానుభూతిపరులు, పలు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆయనతో ఉమ్మడి జిల్లాకు విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మంటల్లో మాడిపోతిరా.. నా బిడ్డల్లారా.. మా భూమి మాకేనని జంగుచేస్తిరా నా బిడ్డల్లారా.. ఉరికొయ్యలకు.. ఊయలలయితిరా నా బిడ్డలారా.., అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా..., పొడుస్తున్న పొద్దుమీద పోరు తెలంగాణమా.. అంటూ గద్దర్ తన పాటలతో విప్లవోద్యమాల పురిటిగడ్డ దుబ్బాక ప్రాంతంలో హల్చల్ చేశారు. వంద లాది పోరుబిడ్డలను ఉద్యమానికి అందించిన దుబ్బాక గడ్డ అంటే తనకెంతో ఇష్టమని ఆయన ఇక్కడ పర్యటించినప్పుడు పలుమార్లు ప్రస్తావించారు. ఈ గడ్డ మీద పుట్టినోళ్లు చాలా అదృష్టవంతులని, ఎందరో గొప్పోళ్లు అయినరు అని పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ నాయకుడు సోలిపేట కొండల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి చిట్టాపూర్‌కు వచ్చిన సందర్భంలో తేనెటీగలు దాడిచేశాయి. ఈ సంఘటనను గద్దర్ చాలాసార్లు గుర్తు చేసేవారు. ఆరేళ్ల క్రితం చివరిసారిగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో అంబేడ్కర్, భాగ్యరెడ్డివర్మల విగ్రహాలను ఆవిష్కరించేందుకు వచ్చారు. రెండు రోజులు దుబ్బాకలో ఉండి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సీఎం చదివిన బడి, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గురించి తెలుసుకుంటూ తన పాటలతో హోరెత్తించారు. సాదాసీదాగానే చిన్నపిలలు, కార్మికులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. లచ్చపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి అంబేడ్కర్, భాగ్యరెడ్డివర్మ విగ్రహాల ఆవిష్కరణలో గద్దర్ పాల్గొన్నారు. ఆయన వచ్చిన సమయంలో స్థానికులు సెల్ఫీలు దిగడానికి ఎగబడేవారు. జగదేవ్‌పూర్ ధూంధాంకు హాజరై.. గద్దర్‌కు జగదేవ్‌పూర్ ఉమ్మడి మండలంతో అనుబంధం ఉంది. చాలా గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎర్రవల్లి, చేబర్తి, తిగుల్ గ్రామాల్లో అంబేడ్కర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, ఆవిష్కరణల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిపై పాటలు పాడి హల్చల్ చేశారు. జగదేవ్‌పూర్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధూంధాంకు హాజరై పాటలు పాడారు. హుస్నాబాద్ బహిరంగ సభలో.. ప్రజా యుద్దనౌక గద్దర్ మృతి హుస్నాబాద్ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. 1990 అప్పటి పీపుల్స్‌వార్ జిల్లా కార్యదర్శి సందె రాజమౌళి అలియాస్ ప్రసాద్, హుస్నాబాద్ దళనాయకుడు కొడముంజ ఎల్లయ్య అలియాస్ భూపతి ఆధ్వర్యంలో ఆసియాలోనే రెండో ఎతైన అమరవీరుల స్థూపం నిర్మించారు. అక్టోబర్ 25న ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. తహసీల్దార్ విద్యుత్‌శాఖ ఏఈ, మరో అధికారిని పీపుల్స్‌వార్ కిడ్నాప్ చేయడంతో స్థూపం ఆవిష్కరణకు సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గద్దర్ పాటలతో పల్లె ప్రజలను చైతన్య పరిచాడు. మీర్జాపూర్లో గాయకుడు నేర్నాల కిశోర్ ఏర్పాటు చేసిన ధూం ధాంకు హాజరై పీపుల్స్‌వార్ సానుభూతిపరులు ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చారు. నర్సాపూర్ ఎన్కౌంటర్ సమయంలో.. నర్సాపూర్: ఎన్కౌంటర్లు జరిగినపుడు గద్దర్ పలుమార్లు నర్సాపూర్‌కు వచ్చారు. 1997 ఫిబ్రవరిలో ప్రస్తుత గుమ్మడిదల్ల మండలంలోని ప్యారానగర్ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో పీపుల్స్‌వార్ గ్రూపు హైదరాబాద్ నగర కమిటీ నాయకులు గోరంట్ల రామేశ్వర్, మజ్జిగరాజులు మృతి చెందారు. వారి మృతదేహాలను పోలీసులు నర్సాపూర్‌లో దహనం చేసేందుకు ప్రయత్నించగా గద్దర్ వచ్చి అడ్డుకున్నారు. ఇదిలాఉండగా అదే సంవత్సరం మార్చి నెలలో ప్రస్తుత గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్ గ్రామ పరిధిలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు పీపుల్స్‌వార్ నక్సలైట్లు చనిపోయారు. వారిలో పీపుల్స్‌వార్ రాష్ట్ర కమిటీ నాయకుడు దామోదర్‌రెడ్డి ఉన్నారు. అక్కడికి గద్దర్ వచ్చి మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు.