గద్దర్‌ మృతితో.. మెతుకు బిడ్డ.. మరువదు ఈ గడ‍్డ.. | - | Sakshi
Sakshi News home page

గద్దర్‌ మృతితో.. మెతుకు బిడ్డ.. మరువదు ఈ గడ‍్డ..

Published Mon, Aug 7 2023 7:08 AM | Last Updated on Mon, Aug 7 2023 8:17 AM

- - Sakshi

మెదక్‌: గజ్వేల్‌ మట్టి పరిమళం.. భిన్న సంస్కృతులకు నెలవైన గజ్వేల్‌ నియోజకవర్గం ఆది నుంచి ప్రజా ఉద్యమాలకు అండగా నిలిచింది. ఈ ప్రాంతంలో గద్దర్‌ జన్మించాడు. నియోజకవర్గంలోని తూప్రాన్‌లో పుట్టి ఆయన పీడితుల గొంతుకగా మారి ప్రజాఉద్యమాలకు బాసటగా నిలిచారు.

1978–80 ప్రాంతంలో పీడిత ప్రజల కష్టాలకు కళ్లకు కడుతూ ఇదే ప్రాంతంలోని ప్రజ్ఞాపూర్‌కు చెందిన బీ.నర్సింగరావు నిర్మించిన ‘మా భూమి’ చిత్రంలో గద్దర్‌ పాడిన ‘బండెనక బండి గట్టి...పదహారు బండ్లు కట్టి...ఏ బండ్లే పోతవ్‌ కొడుకో నైజాం సర్కారోడా’ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. 1986లో రాడికల్‌ విద్యార్థి సంఘం సభకు గద్దర్‌ హాజరయ్యారు.

1994లో గజ్వేల్‌ పట్టణం వేదికగా వర్కింగ్‌ జర్నలిస్టు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ సభకు హాజరైన గద్దర్‌ పీడిత ప్రజల గొంతకయ్యాడు. తూప్రాన్‌కు ఎత్తిపోతల పథకం కోసం ప్రభుత్వానికి వినతి పత్రాన్ని అందించారు. ఇరిగేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.3.61కోట్లు మంజూరు చేయించి ఆయనే ప్రారంభించారు. తూప్రాన్‌ పట్టణంపై ‘మై విలేజ్‌ ఆఫ్టర్‌ సిక్టీ ఇయర్స్‌’ పేరుతో పుస్తక రచన చేశారు.

పోరుబిడ్డల దుబ్బాక గడ్డ అంటే..
గద్దర్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ గాయకులు, పీపుల్స్‌వార్‌ (మావోయిస్టు) సానుభూతిపరులు, పలు సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు శోకసంద్రంలో మునిగిపోయారు.

ఆయనతో ఉమ్మడి జిల్లాకు విడదీయరాని అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. మంటల్లో మాడిపోతిరా.. నా బిడ్డల్లారా.. మా భూమి మాకేనని జంగుచేస్తిరా నా బిడ్డల్లారా.. ఉరికొయ్యలకు.. ఊయలలయితిరా నా బిడ్డలారా.., అమ్మా తెలంగాణమా ఆకలి కేకల గానమా..., పొడుస్తున్న పొద్దుమీద పోరు తెలంగాణమా.. అంటూ గద్దర్‌ తన పాటలతో విప్లవోద్యమాల పురిటిగడ్డ దుబ్బాక ప్రాంతంలో హల్‌చల్‌ చేశారు.

వంద లాది పోరుబిడ్డలను ఉద్యమానికి అందించిన దుబ్బాక గడ్డ అంటే తనకెంతో ఇష్టమని ఆయన ఇక్కడ పర్యటించినప్పుడు పలుమార్లు ప్రస్తావించారు. ఈ గడ్డ మీద పుట్టినోళ్లు చాలా అదృష్టవంతులని, ఎందరో గొప్పోళ్లు అయినరు అని పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ నాయకుడు సోలిపేట కొండల్‌రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనడానికి చిట్టాపూర్‌కు వచ్చిన సందర్భంలో తేనెటీగలు దాడిచేశాయి.

ఈ సంఘటనను గద్దర్‌ చాలాసార్లు గుర్తు చేసేవారు. ఆరేళ్ల క్రితం చివరిసారిగా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని లచ్చపేటలో అంబేడ్కర్‌, భాగ్యరెడ్డివర్మల విగ్రహాలను ఆవిష్కరించేందుకు వచ్చారు. రెండు రోజులు దుబ్బాకలో ఉండి ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సీఎం చదివిన బడి, డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. అంతేకాకుండా విప్లవోద్యమం, తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గురించి తెలుసుకుంటూ తన పాటలతో హోరెత్తించారు.

సాదాసీదాగానే చిన్నపిలలు, కార్మికులతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు. లచ్చపేటలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలతో కలిసి అంబేడ్కర్‌, భాగ్యరెడ్డివర్మ విగ్రహాల ఆవిష్కరణలో గద్దర్‌ పాల్గొన్నారు. ఆయన వచ్చిన సమయంలో స్థానికులు సెల్ఫీలు దిగడానికి ఎగబడేవారు.

జగదేవ్‌పూర్‌ ధూంధాంకు హాజరై..
గద్దర్‌కు జగదేవ్‌పూర్‌ ఉమ్మడి మండలంతో అనుబంధం ఉంది. చాలా గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఎర్రవల్లి, చేబర్తి, తిగుల్‌ గ్రామాల్లో అంబేడ్కర్‌ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ, ఆవిష్కరణల కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కొండపోచమ్మ ఆలయాన్ని సందర్శించి అమ్మవారిపై పాటలు పాడి హల్‌చల్‌ చేశారు. జగదేవ్‌పూర్‌లో తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ధూంధాంకు హాజరై పాటలు పాడారు.

హుస్నాబాద్‌ బహిరంగ సభలో..
ప్రజా యుద్దనౌక గద్దర్‌ మృతి హుస్నాబాద్‌ ప్రాంత ప్రజలను తీవ్రంగా కలచివేసింది. 1990 అప్పటి పీపుల్స్‌వార్‌ జిల్లా కార్యదర్శి సందె రాజమౌళి అలియాస్‌ ప్రసాద్‌, హుస్నాబాద్‌ దళనాయకుడు కొడముంజ ఎల్లయ్య అలియాస్‌ భూపతి ఆధ్వర్యంలో ఆసియాలోనే రెండో ఎతైన అమరవీరుల స్థూపం నిర్మించారు. అక్టోబర్‌ 25న ఆవిష్కరణకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు.

తహసీల్దార్‌ విద్యుత్‌శాఖ ఏఈ, మరో అధికారిని పీపుల్స్‌వార్‌ కిడ్నాప్‌ చేయడంతో స్థూపం ఆవిష్కరణకు సర్కార్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో గద్దర్‌ పాటలతో పల్లె ప్రజలను చైతన్య పరిచాడు. మీర్జాపూర్‌లో గాయకుడు నేర్నాల కిశోర్‌ ఏర్పాటు చేసిన ధూం ధాంకు హాజరై పీపుల్స్‌వార్‌ సానుభూతిపరులు ఉద్యమంలో పాల్గొనేలా చైతన్యం తీసుకొచ్చారు.

నర్సాపూర్‌ ఎన్‌కౌంటర్‌ సమయంలో..
నర్సాపూర్‌: ఎన్‌కౌంటర్లు జరిగినపుడు గద్దర్‌ పలుమార్లు నర్సాపూర్‌కు వచ్చారు. 1997 ఫిబ్రవరిలో ప్రస్తుత గుమ్మడిదల్ల మండలంలోని ప్యారానగర్‌ గ్రామ పరిధి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పీపుల్స్‌వార్‌ గ్రూపు హైదరాబాద్‌ నగర కమిటీ నాయకులు గోరంట్ల రామేశ్వర్‌, మజ్జిగరాజులు మృతి చెందారు.

వారి మృతదేహాలను పోలీసులు నర్సాపూర్‌లో దహనం చేసేందుకు ప్రయత్నించగా గద్దర్‌ వచ్చి అడ్డుకున్నారు. ఇదిలాఉండగా అదే సంవత్సరం మార్చి నెలలో ప్రస్తుత గుమ్మడిదల మండలం లక్ష్మాపూర్‌ గ్రామ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు పీపుల్స్‌వార్‌ నక్సలైట్లు చనిపోయారు. వారిలో పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీ నాయకుడు దామోదర్‌రెడ్డి ఉన్నారు. అక్కడికి గద్దర్‌ వచ్చి మృతదేహాలను వారి కుటుంబీకులకు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement