ఈటల, కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరిన మాజీ మంత్రులు కృష్ణయాదవ్, చిత్తరంజన్‌దాస్
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది.. ప్రగతి భవన్‌లో కేసీఆర్ ఉండేది కేవ లం 90 రోజులే.. ఆ తర్వాత శాశ్వతంగా ఫాంహౌస్‌లోనే ఆయన ఉండబోతున్నారు’అని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘ప్రగతి భవన్.. కేసీఆర్ కుటుంబ భవన్ తప్ప తెలంగాణ ప్రజలది కాదు. కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్ల దోపిడీ చేసింది.
అందుకే అడుగడుగునా బీఆర్‌ఎస్‌ను ప్రజలు నిలదీస్తున్నారు. కేసీఆర్ హఠావో.. తెలంగాణ బచావో... ఇది తెలంగాణ ప్రజల నినాదం’అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు రాష్ట్రానికి వస్తుంటే వాటిలో పాల్గొనే తీరికలేని, కుట్రలు చేసే సీఎం తెలంగాణకు అవసరమా? అని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ ఎన్ని కుట్రలు పన్నినా.. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
శనివారం పార్టీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి, రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పార్టీ నేత టి. ఆచారిల సమక్షంలో మాజీ మంత్రులు సి. కృష్ణయాదవ్, జె.చిత్తరంజన్‌దాస్, సిర్పూర్ జెడ్పీటీసీ రేఖా సత్యనారాయణ, మరో నేత బండల రామచంద్రారెడ్డి, పలువురు ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, పెద్దసంఖ్యలో కార్యకర్తలు బీజేపీలో చేరారు. వారికి కిషన్‌రెడ్డి, ఈటల, అరుణ కాషాయ కండువాలు కప్పి సాదరంగా పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ అనేక సర్వేల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఓటమి ఖాయమని తెలియడంతో కేసీఆర్ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాదు
కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే బీఅర్‌ఎస్‌కు ఓటేసినట్టేనని కిషన్‌రెడ్డి ఆరోపించారు. గెలిచే పరిస్థితి లేదు కాబట్టే ఇష్టమొచ్చిన హామీలను కాంగ్రెస్ ఇస్తోందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీలు కాదు... 60 గ్యారెంటీలు ఇచ్చినా కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు.
పార్టీ గెలుపునకు కృషి: కృష్ణయాదవ్, చిత్తరంజన్‌దాస్
‘రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతం చేయాల్సిన అవసరం ఉంది. కిషన్‌రెడ్డి నాయకత్వంలో సైనికుడిలా పనిచేస్తా. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తా’అని మాజీ మంత్రి కృష్ణయాదవ్ చెప్పారు. మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపులో నా పాత్ర కూడా ఉంటుందని అనుకుంటున్నా’అని పేర్కొన్నారు.
తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగనుంది: ఈటల
‘బీఅర్‌ఎస్‌కు బీజేపీని ప్రత్యామ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక మంది బీజేపీలోకి వస్తున్నారని... రాబోయే కాలంలో తెలంగాణ గడ్డపై తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదగబోతోందని చెప్పారు. డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment