సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. మొన్నటికి మొన్న బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిన్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సైతం బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్.. మంగళవారం భేటీ అయ్యారు. ఎర్రవల్లిలోని ఫాంహౌజ్‌లో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్, మాగంటి గోపీనాథ్, ముఠా గోపాల్, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్ రెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్, రావుల శ్రీధర్ రెడ్డిలు ఉన్నారు.
ఫాంహౌజ్‌కు వచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ లంచ్ చేశారు. అనంతరం ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పార్టీ నేతలెవరూ తొందరపడవద్దని తెలిపారు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టి మారటం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిణామాలు గతంలనూ జరిగాయని, అయినా మనం భయపడలేదని చెప్పారు.
ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని అన్నారు కేసీఆర్. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని విమర్శించారు. భవిష్యత్తులో బీఅర్ఎస్ మంచి రోజులు వస్తాయని, కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన బీఅర్ఎస్‌కు వచ్చే నష్టం లేదని తెలిపారు. రేపటి నుంచి(బుధవారం) వరుసగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.
కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినట్టయింది. ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు. అంతకంటే ముందు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే 2018లో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు. సీఎం, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్‌లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది.
మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరడం, సీఎం రేవంత్ రెడ్డి దగ్గరుండి వారిని పార్టీలోకి ఆహ్వానించడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రచారంలో నీతులు చెప్పి, ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారంటూ రేవంత్‌పై మండిపడ్డారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
‘ముఖ్యమంత్రి గారు..
ప్రచారంలో నీతులు..?
ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులా..?
నాడు..
ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరడం నేరమన్నారు.
ప్రలోభాలకు లొంగి పార్టీ ఫిరాయించడం ఘోరమన్నారు.
భుజాలపై మోసిన కార్యకర్తల పాలిట తీరని ద్రోహమన్నారు.
చివరికి...
ఎమ్మెల్యేలు పార్టీ మారితే రాళ్లతో కొట్టిచంపమన్నారు.
రాజీనామా చేయకుండా చేరితో ఊళ్లనుంచే తరిమికొట్టమన్నారు
మరి ఇవాళ మీరే..
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి మరీ..
కాంగ్రెస్ కండువాలు కప్పి కప్పదాట్లను ప్రోత్సహిస్తారా ?
జంప్ జిలానీల భరతం పడతా అని భారీ డైలాగులు కొట్టి..
ఏ ప్రలోభాలను ఎర వేస్తున్నారు !
ఏ ప్రయోజనాలను ఆశిస్తున్నారు !!
ఇప్పుడు రాళ్లతో కొట్టాల్సింది ఎవరిని ?
రాజకీయంగా గోరి కట్టాల్సింది ఎవరికి ??
ఏ ఎమ్మెల్యేనైనా రాజీనామా చేయకుండా పార్టీ ఫిరాయిస్తే..
రాళ్లతో కొట్టించే బాధ్యత తీసుకుంటా అన్నది మీరే
అందుకే జవాబు చెప్పాల్సింది కూడా మీరే..!!!
జై తెలంగాణ’
Comments
Please login to add a commentAdd a comment