సింగరేణిలో సమ్మె సైరన్‌.. కారణాలు ఇవే.. | Workers Serve Strike Notice In Singareni Collieries | Sakshi
Sakshi News home page

Singareni Collieries: సింగరేణిలో సమ్మె సైరన్‌.. కారణాలు ఇవే..

Published Thu, Dec 2 2021 8:23 AM | Last Updated on Thu, Dec 2 2021 8:45 AM

Workers Serve Strike Notice In Singareni Collieries - Sakshi

సాక్షి,భూపాలపల్లి అర్బన్‌: కేంద్ర ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల నాయకులు సమ్మె బాట పట్టేందుకు సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసులు అందజేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 9 నుంచి 11వ తేదీ వరకు సమ్మె చేపట్టేందుకు సిద్ధమయ్యారు. గత నెల 25న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సమ్మె నోటీసు ఇవ్వగా 30వ తేదీన అన్ని జాతీయ కార్మిక సంఘాలతో కలిసి సమ్మె నోటీసు అందజేశారు. గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ రెండు పర్యాయాలు ఉన్నప్పటికీ సమ్మె నోటీసులు ఇవ్వడం ఇదే మొదటి సారి. రాష్ట్రంలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనుబంధ కార్మిక సంఘమైన బీఎంఎస్‌ సంఘాలు కూడా సమ్మెకు పూర్తి మద్దతు ప్రకటించాయి. ఐఎన్‌టీయూసీ, సీఐటీయూ, ఏఐటీయూసీ, హెచ్‌ఎంఎస్, ఐఎఫ్‌టీయూలతో పాటు ఇతర కార్మిక సంఘాలు కూడా సమ్మెకు కదం తొక్కనున్నాయి.

 ప్రైవేట్‌ పరంతో నష్టాలు
► సత్తుపల్లి ఓసీపీ–3, కోయగూడెం ఓసీపీ–3, శ్రావణపల్లి గని, కేకే–6 గనులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ టెండర్లు పూర్తి చేసింది. 
► బొగ్గు గనులను ప్రైవేట్‌ పరం చేయడం వలన బొగ్గు అమ్మకాల్లో పోటీ పెరుగుతుంది. ప్రైవేట్‌ మాఫియా వారు పేద కార్మికులను పీల్చి పిప్పి చేస్తారు. 
► రక్షణ, పర్యావరణానికి ప్రైవేట్‌ సంస్థలు ప్రాధాన్యత ఇవ్వ వు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ కూడా పాటించరు. 
► సింగరేణి బ్లాకులన్నీ క్రమంగా ప్రైవేట్‌పరం చేస్తారు. అప్పడు సింగరేణిలో కొత్త గనుల రావు. 
► ప్రస్తుత కారుణ్య నియామకాల ద్వారా చేపడుతున్న వారసత్య ఉద్యోగాలు ఉండవు.
► క్రమంగా సింగరేణి యాజమాన్యం కూడా ఇప్పటి హక్కులు, బోనసులు, అలవెన్సుల తగ్గిస్తుంది. 
► దేశ  సంపద ప్రైవేటు కంపెనీ చేతిలో పెడితే వారి అభివృద్ధికే ఉపయోగపడుతుంది.

కార్మికుల డిమాండ్లు ఇవే.. 
► కార్మిక సంఘాల నాయకులు బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణతో పాటు సింగరేణి పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నోటీసులో డిమాండ్ల పత్రాలను  అందజేశారు.
► సింగరేణిలో ఉన్న ఓపెన్‌కాస్ట్‌లో మట్టి తొలగింపు విధానం, అండర్‌గ్రౌండ్‌ గనుల్లో కాంట్రాక్ట్‌ పద్దతిని నిలిపివేయాలి. 
► గని ప్రమాదాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ఇవ్వాలి.
► మెడికల్‌ బోర్డులో ఆన్‌ఫిట్‌ అయిన మైనింగ్‌స్టాఫ్, ట్రెడ్‌మెన్స్, ఈపీ ఆపరేటర్లకు సర్ఫెస్‌ ఉద్యోగాల్లో సుటబుల్‌ జాబ్‌ ఇవ్వాలి.
► సింగరేణిలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులకు హైపవర్‌ కమిటీ నిర్ణయించిన ప్రకారం వేతనాలు చెల్లించాలి.
► వివిధ కారణాలతో పెండింగ్‌లో ఉన్న వారందరికీ డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలి.
► సీఎం కేసీఆర్‌ ఇచ్చిన çహామీ మేరకు సింగరేణి కార్మికుల ఇంటి పేర్లు మార్చాలి.
► డిపెండెంట్‌ ఉద్యోగ అర్హత వయస్సు 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలి.
► కోల్‌ఇండియా లిమిటెడ్‌ ఉద్యోగుల మాదిరిగా సింగరేణి ఉద్యోగులకు ఆదాయపన్నును సింగరేణి యాజమాన్యమే చెల్లించాలి.

ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాం..
సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్టీకరణ, ప్రైవేటీకరణ పేరుతో కేంద్రం కార్మిక వ్యతిరేకత విధానాలు అవలంభిస్తోంది. ఈ వి«ధానాలను వ్యతిరేకిస్తూ మూడు నెలలుగా సమ్మె చేద్దామని చూస్తున్నాం. ఈ విధానాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. 
–అప్పాని శ్రీనివాస్, బీఎంఎస్‌ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు

సమ్మెను విజయవంతం చేయాలి
సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొని విజయవంతం చేయాలి. కేంద్రం సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటీకరణ చేస్తోంది. ఇప్పటి నుంచే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. అన్ని సంఘాలు కలిసి ప్రైవేటీకరణ ను రద్దు చేసే వరకు నిరంతర పోరాటాలు నిర్వహిస్తాం.  కార్మికులు సిద్ధంగా ఉండాలి.
–జోగు బుచ్చయ్య, ఐఎన్‌టీయూసీ బ్రాంచ్‌ ఉపాధ్యక్షుడు 

చదవండి: ఈ ఆదివారం ట్యాంక్‌బండ్‌పై సండే– ఫన్‌డే రద్దు.. కారణమిదే!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement