సగటున ప్రతి కార్మికుడికి రూ.1.90 లక్షల దసరా కానుక
సంస్థ చరిత్రలో తొలిసారి 25 వేల మంది కాంట్రాక్టు సిబ్బందికి రూ.5 వేల చొప్పున బోనస్
బోనస్‌తోపాటు సంస్థ కార్యకలాపాల విస్తరణ.. రూ.4,701 కోట్ల లాభం
రూ.2,289 కోట్లు పెట్టుబడి పెడుతున్నాం.. నైనీ బ్లాక్ దగ్గర పవర్ ప్రాజెక్టు,
జైపూర్‌లో 800 మెగావాట్ల ప్లాంటు.. మరో 800 మెగావాట్ల ప్లాంట్ జెన్‌కోతో కలిసి ఏర్పాటు
రామగుండం ఏరియాలో 500 మెగావాట్ల పంప్‌స్టోరేజీ కూడా : డిప్యూటీ సీఎం భట్టి వెల్లడి
సింగరేణి కార్మికుల కుటుంబాల్లో ఆనందం చూసేందుకే బోనస్: సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: సింగరేణి కార్మికులకు ప్రభు త్వం దసరా బోనస్ ప్రకటించింది. సంస్థ లాభాల్లో మూడోవంతు సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు దసరా కానుకగా ఇవ్వనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రూ.796 కోట్ల బోనస్ ప్రకటిస్తున్నామని, దీని ప్రకారం సింగరేణి పర్మనెంట్ ఉద్యోగులందరికీ సగటున రూ.1.90 లక్షల బోనస్ వస్తుందని, వీరితో పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న కార్మికులకు కూడా తొలిసారి బోనస్ కింద రూ.5 వేలు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర కేబినెట్ సమావేశానికి ముందు సచివాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర మంత్రు లు, సింగరేణి అధికారులు, ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, కార్మిక సంఘాల నేతలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సింగరేణి కార్మికులకు బోనస్ వివరాలను ప్రకటించారు.
ఉద్యమాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లారు: ముఖ్యమంత్రి రేవంత్
సింగరేణి సంస్థ లాభాల్లో కార్మికులకు వాటా పంచడం ద్వారా వారి కుటుంబాల్లో ఆనందాన్ని చూడాలనే సింగరేణి యాజమాన్యం, మంత్రివర్గంతో కలిసి బోనస్ ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ‘తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియలో అగ్రభాగాన నిలబడ్డ సింగరేణి గని కార్మికులు ఉద్యమాన్ని పతాక స్థాయికి కెళ్లారు. వారి పోరాట పటిమ రాష్ట్ర సాధనలో క్రియాశీల పాత్ర పోషించింది. అలాంటి సంస్థ వ్యాపార లాభాల్లో కార్మికులకు వాటా ఇవ్వాలని నిర్ణయించాం. సింగరేణి యాజమాన్యంతోపాటు డిప్యూటీ సీఎం భట్టి ప్రతిపాదన మేరకు బోనస్ ప్రకటిస్తున్నాం’అని రేవంత్ వెల్లడించారు.
సింగరేణితో తెలంగాణకు పేరు ప్రఖ్యాతులు: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి మాట్లాడుతూ తెలంగాణకు తలమానికమైన సింగరేణిలో సంస్థ కార్మికుల శ్రమశక్తి కారణంగా ఉత్పత్తి పెరుగుతోందని చెప్పారు. సింగరేణి కార్మికులు సాధించిన లాభాలను కార్మికులకు పంచడం సంతోషంగా ఉందన్నారు. పన్నులన్నీ మినహాయించుకున్న తర్వాత ఈ ఏడాది సింగరేణికి రూ.4,701 కోట్ల లాభం వచి్చందని, అందులో పెట్టుబడి కింద రూ.2,289 కోట్లు పోను మిగిలిన రూ.2,412 కోట్లలో 33 శాతం అంటే రూ.796 కోట్లను సింగరేణి కార్మికులకు బోనస్ కింద ప్రకటిస్తున్నామని చెప్పారు. ఈ ప్రకటన ద్వారా సగటున ప్రతి ఉద్యోగికి రూ.1.90లక్షల బోనస్ లభిస్తుందని, గత ఏడాదితో పోలిస్తే ఇది రూ.20 వేలు అధికమని చెప్పారు. సింగరేణిలో పనిచేస్తున్న 41,837 మంది శాశ్వత ఉద్యోగులతోపాటు కాంట్రాక్టు ప్రాతిపదికన 25 వేల మంది పనిచేస్తున్నారని, చరిత్రలో తొలిసారిగా కాంట్రాక్టు సిబ్బందికి కూడా బోనస్ ఇస్తున్నామని చెప్పారు.
విస్తరణ కార్యాచరణ కూడా...
సింగరేణి కార్మికులకు బోనస్‌తోపాటు సంస్థ విస్తరణ కార్యాచరణ కూడా చేపడుతున్నామని డిప్యూటీ సీఎం భట్టి చెప్పారు. సంస్థ ఆధ్వర్యంలోని 100 మెగావాట్ల సోలార్ పవర్‌ప్లాంట్ విస్తరణ చేపడతామని, 500 మెగావాట్ల పంప్ స్టోరేజీ (రామగుండం ఏరియా) ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామని, జైపూర్‌లో 800 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ జెన్‌కోతో కలిసి మరో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు ప్రారంభిస్తామని, ఒడిశాలోని నైనీ బ్లాక్‌పైన అంగూల్ జిల్లాలో 2,400 మెగావాట్ల సామర్థ్యం గల సూపర్ క్రిటికల్ థర్మల్ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వీకే, గోలేటీ, నైనీ ఓపెన్‌కాస్ట్‌ల విస్తరణ చేపడతామని తెలిపారు. సింగరేణి కార్మికులు, ఉద్యోగుల పిల్లల కోసం నూతన రెసిడెన్షియల్ పాఠశాలలు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఏరియా ఆస్పత్రుల ఆధునీకరణతోపాటు హైదరాబాద్‌లో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment