కొత్త గనులు రాకపోతే కష్టమే | What is the condition of Singareni after twenty years | Sakshi
Sakshi News home page

కొత్త గనులు రాకపోతే కష్టమే

Published Tue, Dec 5 2023 3:07 AM | Last Updated on Tue, Dec 5 2023 3:07 AM

What is the  condition of Singareni after twenty years - Sakshi

సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి మనుగుడపై నీలినీడలు కమ్ముకున్నాయి. కొత్త బొగ్గు గనుల ప్రస్తావన లేకపోవడంతో మరో ఇరవై ఏళ్ల తర్వాత పరిస్థితి ఏమిటని సింగరేణి కార్మికులు ఆందోళన చెందుతున్నారు. విలియమ్‌ కింగ్‌ అనే శాస్త్రవేత్త 1870 సంవత్సరంలో బొగ్గు నిక్షేపాలు కనుగొన్నారు. ఆనాటి లెక్కల ప్రకారం సుమారు 11వేల మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది.

ఇందులో ఏ సమస్య ఎదురుకాకుండా తీసే బొగ్గు 3వేల మిలియన్‌ టన్నులు మాత్రమేనని తేల్చారు. ఇప్పటివరకు సింగరేణి సుమారు 1,600 మిలియన్‌ టన్నులు వెలికి తీయగలిగింది. ప్రస్తుతానికి సింగరేణి సంస్థ జియాలజికల్‌ విభాగ లెక్కల ప్రకారం మరో 1,400 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలే ఉన్నాయి. ఈ బొగ్గు తీసేందుకు ఇంకో ఇరవై ఏళ్ల సమయం పడుతుంది.

ఎప్పటికప్పుడు కొత్త గనులు ప్రారంభిస్తూ వెళితే ఈ కాలపరిమితి పెరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనులను వేలం వేస్తున్నా, రకరకాల కారణాలతో ఈ వేలంలో సింగరేణి యాజమాన్యం పాల్గొనడం లేదు. దీంతో ఇరవై ఏళ్ల తర్వాత సింగరేణి పరిస్థితి ఏమిటనేది తెలియడం లేదు.  

వేలంలో పాల్గొంటే మరో 300 మిలియన్‌ టన్నులు 
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బొగ్గు బ్లాక్‌ల ప్రైవేటీకరణ విధానంలో భాగంగా ఎవరైనా సరే వేలంలో పాల్గొంటేనే బొగ్గు గనులు దక్కుతాయి. అయితే సింగరేణి యాజమాన్యం రూ.25 లక్షలు వెచ్చించి టెండర్‌ ఫారాలు ఖరీదు చేసినా వేలంలో పాల్గొనలేదు. దీంతో కోయగూడెం ఓసీ–3, శ్రావణపల్లి ఓసీతో పాటు సత్తుపల్లి ఓసీలు దూరమయ్యాయి. ఒకవేళ ఇవి దక్కించుకుంటే సుమారు 300 మిలియన్‌ టన్నుల బొగ్గు నిక్షేపాలు సింగరేణికి అందుబాటులోకి ఉండేవి. ఈ మూడు గనుల్లో బొగ్గు నిల్వల గుర్తింపు, ఇతర పనులకు సింగరేణి యాజమాన్యం రూ.60 కోట్లు ఖర్చు చేసినా, వేలంలో మాత్రం పాల్గొనలేదు.  

భూగర్భగనులతో నష్టం వస్తుందని..  
భూగర్భ గనుల ఏర్పాటుతో బొగ్గు ఉత్పత్తికి ఎక్కువ ఖర్చువుతుందని చెబుతున్న యాజమాన్యం ఓసీల ఏర్పాటుకు మొగ్గుచూపుతోంది. ఓసీల ద్వారా అత్యధిక ఉత్పత్తి సాధ్యమవుతుందని, భూగర్భగనుల్లో అలా సాధ్యం కాకపోవడంతో అటువైపు దృష్టి సారించడం లేదని చెబుతున్నారు. కొత్తగూడెం ఏరియాలో 8, 9, 10, 11వ గనుల్లో మిగిలిన సుమారు 60 మిలియన్‌ టన్నుల బొగ్గును జీకే ఓసీ ద్వారా 1994 నుంచి 30 ఏళ్ల కాలంలో వెలికి తీయడం పూర్తిచేశారు. ఓసీల ద్వారా ఇంత వేగంగా బొగ్గు తీయడం సాధ్యమవుతున్నా, ఓసీల ద్వారా పర్యావరణం దెబ్బతింటుందని తెలిసి కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

పదేళ్లలో ఒక్క గనీ లేదు.. 
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, కొత్తగా ఒక్క గనిని కూడా ప్రారంభించలేదు. గతంలో బొగ్గు తీసిన భూగర్భ గనులను ఓపెన్‌ కాస్ట్‌(ఓసీ)లుగా మార్చా రే తప్ప కొత్త ఓసీలు, భూగర్భ గనులు ప్రారంభించిన దాఖలాలు లేవు. రూ.60 కోట్లు వెచ్చించి సర్వే లు, డ్రిల్లింగ్‌లు వేయించడంతో అధికారులు, కార్మికులు శ్రమదోపిడీకి గురయ్యారే తప్ప ఫలితం రాలే దు. తెలంగాణ వస్తే ఓసీలు ఉండవు..భూగర్భగనులే ఉంటాయని తొలినాళ్లలో చెప్పినా, 2018లో వర్చువల్‌గా ప్రారంభించిన రాంపురం గనిలోనూ ఇప్పటివరకు బొగ్గు ఉత్పత్తి మొదలుకాలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement