
బాలిక బంధువుల ఆరోపణ..
నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్
పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ వాటర్ ట్యాంక్ ఎక్కిన బాలిక
ఖమ్మం: పెళ్లి చేసుకుంటానని నమ్మించి మైనర్ బాలికను గర్భవతిని చేశాడని, నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయాలని ఎర్రుపాలెం మండలం భీమవరం గ్రామానికి చెందిన పలువురు డిమాండ్ చేశారు. బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని దళిత కాలనీకి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన ముల్లంగి జమలయ్య అనే యువకుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడు. ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి కాగా, ఖమ్మం, విజయవాడలోని ఆస్పత్రులకు తీసుకెళ్లి అబార్షన్‌కు ప్రయత్నించాడని, ఇప్పుడు పెళ్లికి నిరాకరిస్తున్నాడని వారు ఆరోపించారు.
దీంతో ఈనెల 21న తాము ఎర్రుపాలెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు పట్టించుకోలేదని, 22వ తేదీన ఖమ్మంలో సీపీని కలిసినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఆదివారం గ్రామస్తులతో కలిసి మళ్లీ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఆందోళన చేశారు. ఆ తర్వాత మధిర – విజయవాడ ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అయినా పోలీసులు స్పందించకపోవడంతో బాలిక స్టేషన్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే ఆమె సోదరుడు ట్యాంక్ ఎక్కి నచ్చజెప్పినా బాలిక కిందకు దిగకపోవడంతో ఎస్‌ఐ పి.వెంకటేష్, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
దీంతో గ్రామస్తులు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు బాలికకు న్యాయం చేస్తామని, నిందితుడిపై కేసు నమోదు చేస్తామని హామీ ఇచ్చిన ఎస్‌ఐ ఇద్దరు మహిళా కానిస్టేబుళ్ల సాయంతో బాలికను కిందకు తీసుకొచ్చారు. కాగా, స్టడీ సర్టిఫికెట్‌లో ఉన్న వయసు ప్రకారం ఆమె మైనర్ కాదని ఎస్‌ఐ చెబుతుండగా, ఆధార్ కార్డు, ఆస్పత్రి రికార్డులు తమ వద్ద ఉన్నాయని, వాటి ప్రకారం అమ్మాయి మైనరేనని బంధువులు అంటున్నారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని చెబుతున్నారు. కేసు నమోదు కాకుండా ఇద్దరు పోలీస్ ఉన్నతాధికారులు, మాజీ ప్రజాప్రతినిధి అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment