సింగరేణి ఎన్నికల టెన్షన్.. ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న రాజకీయ పార్టీలు | Telangana: Singareni Elections, Brs Party Facing Critical Situation This Time | Sakshi
Sakshi News home page

సింగరేణి ఎన్నికల టెన్షన్.. ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న రాజకీయ పార్టీలు

Published Sun, Mar 26 2023 6:27 PM | Last Updated on Sun, Mar 26 2023 6:49 PM

Telangana: Singareni Elections, Brs Party Facing Critical Situation This Time - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు సింగరేణి ఎన్నికల గుబులు పట్టుకుందా.. త్వరలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. ఈఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న అధికార పార్టీ బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘ టిబిజికెఎస్ తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. గతంలో సింగరేణికి అన్నితానై వ్యవహరించిన గౌవర అధ్యక్షురాలు కవిత రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండడం టిబిజికెఎస్ కు సవాల్ గా మారుతుంది. ఆరు జిల్లాలు 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సిరుల మాగాణి సింగరేణి ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రీ ఫైనల్ గా మారనున్న వైనంపై సాక్షి ప్రత్యేక కథనం.

ఎన్నికల పండుగ.. సత్తా చాటేందుకు శ్రమిస్తున్న పార్టీలు
నల్లబంగారు లోకం సింగరేణికి ఎన్నికల పండుగ వచ్చింది. రెండేళ్ళకోసారి జరగాల్సిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కోవిడ్ ఎఫెక్ట్, కార్మిక సంఘాలు కోర్టు మెట్లు ఎక్కడంతో మూడేళ్ళు ఆలస్యమయ్యింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడంతో ఏఐటీయూసీతోపాటు మరికొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశంతో కేంద్ర కార్మికశాఖ,సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఎప్రిల్ లో నోటిపికేషన్ జారీ చేసి మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీతోపాటు విపక్షపార్టీల అనుబంధకార్మిక సంఘాలు అస్తశస్త్రాలు ప్రయోగించేందుకు సన్నహాలు చేస్తున్నాయి.

2017 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార పార్టీ టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ కు తాజా ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను గుర్తింపు కార్మిక సంఘం నెరవేర్చకపోవడం ఆపార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశాలున్నాయి. ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాల్లో అక్రమాలు, ఆదాయపన్ను పరిమితి పెంపు విషయంలో పట్టించుకోకపోవడం ఆ సంఘానికి మైనస్ గా మారుతుంది. పనిబారం విషయంలో గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కుకావడంతో కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారు.

వాటితోపాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో టిబిజికెఎస్ కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంతో విపక్షాలు ప్రచార అస్త్రాలుగా చేసుకుని రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ముందుగా జరుగుతున్న సింగరేణి ఎన్నికలు అధికార పార్టీతోపాటు విపక్షాలు కాంగ్రెస్, బిజేపి, వామపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సన్నహాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ కు సవాల్ గా మారనున్నాయి సింగరేణి ఎన్నికలు. 

11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి
సింగరేణి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. గత 2017 అక్టోబరు 5న జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ 11 స్థానాలకుగాను 9స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మందమర్రి, భూపాలపల్లి మినహా అన్ని డివిజన్ లలో టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పోటీకి దూరంగా ఉండి, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి మద్దతిచ్చింది. సింగరేణిలో మొత్తం 52,543 ఓట్లు ఉండగా గత ఎన్నికల్లో 49,877 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.

వీటిలో టీబీజీకేఎస్ కు 23,848 ఓట్లు పోలు కాగా ఏఐటీయూసీ కూటమికి 19,631 ఓట్లు వచ్చాయి. 4,217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా అధికారం దక్కించుకుంది. 2020 ఫిబ్రవరితో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. 2017కు ముందు నాలుగేళ్ల కాల పరిమితి ఉండగా, కేంద్ర కార్మిక శాఖ రెండేళ్లకు కుదించటంపై టీబీజీకేఎస్ కోర్టుకెక్కింది. తీర్పు ఆలస్యం కావటంతో ఆనాలుగేళ్ల పదవీ కాలం కూడా 2021 ఫిబ్రవరిలోనే ముగిసింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశంతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఎప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేసి మేనెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ప్రచారం సాగించే పనిలో నిమగ్నమయ్యాయి. 

హామీలు ఇచ్చారు.. కానీ
2017లో జరిగిన సింగరేణి ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సింగరేణి కార్మికులను ప్రగతి భవన్ కు పిలుపించుకుని అనేక హామీలిచ్చారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత సింగరేణి వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొని హామీలు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో దళారులు లక్షల్లో వసూలు చేసి అనర్హులకు అవకాశాలిస్తున్నారని కార్మికుల్లో అగ్రహం వ్యక్తమవుతోంది. వేల మంది పేర్లను సరిచేసేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలుకు నోచుకోలేదు.

ప్రతి కార్మికుడికి 200 గజాల ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 10లక్షల రూపాయలు వడ్డీలేని రుణం ఇస్తామని మాటిచ్చారు. కొత్తగా 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుని భూగర్భ గనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని, భవిష్యత్తులో సింగరేణిలో డిస్మిస్ అనేదే ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయినా డిస్మిస్ లు ఆగటం లేదు. మరోవైపు తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణిలో 3వేల 800 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం 10వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని కార్మికులు అంటున్నారు. ఇలా నష్టాల్లో కొనసాగటానికి కేసీఆర్ పాలనే కారణమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీకి ఝలక్ ఇస్తున్న సింగరేణి కార్మికులు
ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ కేసు రాజకీయ పరిణామాల నేపద్యలో కోల్ బెల్ట్ లో గులాబీ సంఘానికి తీవ్ర నష్టంవాటిల్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ లో ఆరు జిల్లాల్లో 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే సింగరేణి ఏరియాలోని కార్మికులు మొదటి నుంచి అధికార పార్టీకి ఝలక్ ఇస్తూనే ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుపొందింది.

మూడు స్థానాల్లో మాత్రమే టిఆర్ఎస్ గెలిచినప్పటికి తర్వాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏడుగురు ఇతర పార్టీల నుంచి గెలిచినవారు గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇప్పుడు పది స్థానాల్లో ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో కార్మికలోకంలో టిబిజికెఎస్ వీక్ గానే ఉందనే ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా మునుగోడు ఉపఎన్నికల నాటి నుంచి అధికారపార్టీతో దోస్తాన్ చేస్తున్న కమ్యూనిష్టులు కాస్త సింగరేణి ఎన్నికల విషయంలో మాత్రం పొత్తులేకుండా ఒంటరిగాన పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గులాబీతో కలిసివచ్చే వారుకానరాక కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం, మావోయిస్ట్ ప్రాబల్యంగల ఏరియా కావడంతో అధికార పార్టీకి  ప్రతికూల ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement