Singareni Workers Union Elections
-
నేడు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు
సాక్షిప్రతినిధి, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రానికి కొంగుబంగారంగా నిలిచిన సింగరేణి సంస్థ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు బుధవారం జరగనున్నాయి. నిధులు, నియామకాల్లో నంబర్‌వన్‌గా నిలిచిన సింగరేణి సంస్థ ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. ఈసారి ఎన్నికల్లో 39,748 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 11 ఏరియాల్లో ఈ ఎ న్నికలను నిర్వహించేందుకు కార్మికశాఖ ఏర్పా ట్లుచేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సింగరేణి సంస్థలో తరచూ సమ్మెలు జరగడం, ఉత్పత్తికి తీవ్రవిఘాతం కలగడం సర్వసాధారణంగా మారింది. దీంతో సంస్థకు గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. 1998లో వాస్తవ పరిస్థితులు సమీక్షించిన అప్ప టి ముఖ్యమంత్రి సమ్మెల నివారణ లక్ష్యంగా గుర్తింపు సంఘం ఎన్నికలకు శ్రీకారం చుట్టా రు. ఇలా మొదలైన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు మొదటి రెండుసార్లు రెండేళ్ల కాలపరిమితితో సాగాయి. ఆ తర్వాత మూడు దఫాలు సింగరేణి యాజమాన్యంతో జరిగిన ఒప్పందం నేపథ్యంలో నాలుగేళ్ల కాలపరిమితితో నిర్వహించారు. అయితే 2017లో కేంద్ర కార్మిక శాఖ రెండేళ్ల కాలపరిమితి అని తేల్చింది. ఎన్నికలకు ముందు నాలుగేళ్లు అని చెప్పి తాము గెలిచాక రెండేళ్లు అంటున్నారని పేర్కొంటూ గుర్తింపు సంఘం హైకోర్టులో పిటిషన్ వేసింది. ఈ క్రమంలో 2021 వరకు ఎన్నికలు జరగలేదు. ఆ తర్వాత కరోనా వైరస్ విజృంభించడంతో మరో రెండేళ్ల పాటు జాప్యం జరిగింది. చివరకు ఏఐటీయూసీ హైకోర్టులో కేసు వేయడంతో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల విషయంలో చలనం వచ్చింది. అయితే ఎన్నికల సన్నాహాలు ఇతర కారణాలతో వాయిదా వేయాలని రాష్ట్ర ఇంధన కార్యదర్శి కోర్టులో పిటిషన్ వేశారు. కానీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. రిటర్నింగ్ అధికారి రెండేళ్ల కాలపరిమితితో నోటిఫికేషన్ జారీ చేసినా, ఎన్నికల తర్వాత గెలిచిన సంఘం నాలుగేళ్ల కాలపరిమితి ఒప్పందాన్ని తెరపైకి తెచ్చే అవకాశం ఉండటంతో..గుర్తింపు సంఘం రెండేళ్లే ఉంటుందా? నాలుగేళ్ల వరకు కొనసాగుతుందా? అని సింగరేణి వర్గాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి. 2012 నుంచి ప్రతిష్టాత్మకంగా.. సింగరేణి ఎన్నికలు 2012 నుంచి అన్ని పార్టీల కు ప్రతిష్టాత్మంగా మారాయి. సంస్థ విస్తరించి న 11 ఏరియాల్లో 11 మంది ఎమ్మెల్యేలు ప్రాతి నిధ్యం వహిస్తుండటంతో కీలకంగా మారాయి. అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యే క పరిశీలకులను నియమించారు. ఈ క్రమంలో రెండుసార్లు గుర్తింపు యూనియన్‌గా బీఆర్ఎస్ పార్టీ అనుబంద టీబీజీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గెలిచింది. తాజా ఎన్నికలు టీబీజీకేఎస్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్టీయూసీ, సీపీఐ అనుబంధ ఏఐటీ యూసీ మధ్య జరుగుతున్నాయి. -
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సర్వం సిద్ధం
-
రేపే ‘సింగరేణి’ ఎన్నికలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈనెల 27న జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది. పాతికేళ్ల కిందట మొదలైన ఎన్నికల పోరు దక్షిణ భారత్‌లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39 వేల మంది కార్మికులు పని చేస్తు న్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు. చివరి సారిగా 2017 అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాల పరిమితి 2021 అక్టోబర్‌తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది. అక్టోబర్ 6న నోటిఫికేషన్ వచ్చినా.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదేనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు ఈనెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో ఉధృతి పెంచాయి. మొత్తం 39,773 మంది కార్మికులు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి. 11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు సా«ధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు. ‘గుర్తింపు’ఎవరికో..? తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ తొమ్మిది ఏరియాల్లో గెలుపొందగా, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురి పెట్టింది. -
250 గజాల స్థలం.. వడ్డీలేని రుణం
సింగరేణి (కొత్తగూడెం): సింగరేణి కార్మికులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. కార్మికుల సొంతింటి కల సాకారం చేసేందుకు ఒక్కొక్కరికి 250 గజాల స్థలం ఇవ్వడంతో పాటు గృహ నిర్మాణానికి రూ.20 లక్షల వడ్డీలేని రుణం అందజేస్తామని ప్రకటించారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల్లోని బొగ్గు గనుల వద్ద జరిగిన సభల్లో మాట్లాడారు. సింగరేణి డే రోజున కార్మికులకు సెలవు దినంగా ప్రకటిస్తామని, మహిళా ఉద్యోగులకు అండర్ గ్రౌండ్లో కాకుండా సర్ఫేస్ విధులు కేటాయించేలా ఆధికారులతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. కొత్తగూడెం ఏరియాలో రాంపూర్ భూగర్భ గని, వీకే– 7తో పాటు మరో ఓసీ ఏర్పాటుకు కృషి చేస్తామని, గత ప్రభుత్వ నిర్వాకంతో తగ్గిన కార్మికుల సంఖ్యను గణనీయంగా పెంచుతామని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో మెడికల్ ఇన్‌వాలిడిటేషన్ కోసం కార్మికులు రూ.6 నుంచి రూ.8 లక్షలు వెచ్చించాల్సి వచ్చేదని, ఈ ప్రభుత్వంలో ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అర్హులందరికీ అవకాశం కలి్పస్తామని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అందరి నాయకుడని, కార్మికుల సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పారు. మాయమాటలు చెప్పి రెండుసార్లు కార్మికుల ఓట్లతో గెలుపొందిన బీఆర్ఎస్ అనుబంధ టీబీజీకేఎస్.. ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శించారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి కాగానే, సింగరేణి కార్మికులకు ఆదాయపన్ను నుంచి మినహాయింపు ఇచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈనెల 27న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుపై ఓటు వేసి ఐఎన్టీయూని గెలిపించాలని పొంగులేటి కోరారు. ఆయా కార్యక్రమాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు, సత్తుపల్లి ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, జారే ఆదినారాయణ, కోరం కనకయ్య, మట్టా రాగమయి తదితరులు పాల్గొన్నారు. -
‘సింగరేణి కార్మికుల సొంత ఇంటి కల నిజం చేస్తాం’
సాక్షి, పెద్దపల్లి: ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఐఎన్టీయూసీ) కార్మిక సంఘాన్ని గెలిపించాలని సింగరేణి కార్మికులను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సోమవారం సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. సింగరేణి ఆర్జీ 3 పరిధిలోని ఏఎల్పీ, ఓసీపీ 1, ఓసీపీ 2 బొగ్గుగనుల్లో కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం ఐఎన్టీయూసీ తరుపున మంత్రి శ్రీధర్ బాబు ఎన్నికల ప్రచారం చేశారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మట్లాడారు. సింగరేణి కార్మికుల సొంత ఇంటి కలను నిజం చేస్తామని తెలపారు. నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు. డిపెండెంట్ కార్మికులకు డబ్బులు ఖర్చు కాకుండా ఉద్యోగాలు వచ్చే విధంగా కృషి చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిస్కారానికి హైపవర్ కమిటీ నియమిస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. -
ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి
సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్ సెక్టార్ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది. సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్‌ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్‌ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్ ఎంప్లాయి మెంట్‌ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్ వ్యాలి డేషన్ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు. సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్ విద్యుత్ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్ ఉత్పత్తి జరుగుతోంది. మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ. ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్ మల్టీ నేష నల్స్తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్‌లు వచ్చే పరిస్థితి లేదు. బొగ్గు బ్లాక్‌ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 27న యూనియన్ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్ రిచ్ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి. - ఎం.డి. మునీర్ - వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ ‘ 99518 65223 (నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం -
27న సింగరేణి ఎన్నికలు
శ్రీరాంపూర్ (మంచిర్యాల), గోదావరిఖని, సింగరేణి (కొత్తగూడెం): హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 27న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించి సోమవా రం హైదరాబాద్‌లోని డిప్యూటీ సీఎల్సీ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యా రు. మొత్తం 13 కార్మిక సంఘాల నాయకులు, కంపెనీ అధికారులు పాల్గొన్నారు. ఇప్పటివరకు ఎన్ని కల షెడ్యూల్ ప్రకారం నామినేషన్ల పర్వం, స్క్రూటి నీ పూర్తయిన విషయం తెలిసిందే. కోర్టుకు వెళ్లిన కారణంగా విడుదల చేయని ఓటరు జాబితాను కంపెనీ విడుదల చేసింది. జాబితా ప్రతుల ను రిటర్నింగ్ అధికారి కార్మిక సంఘాలకు అందజేశారు. 8న తుదిజాబితా ఈనెల 6లోగా అభ్యంతరాలు స్వీకరిస్తారు. 8న తుదిజాబితా ప్రచురించనున్నారు. బీఆర్ఎస్ అను బంధ టీబీజీకేఎస్‌తోపాటు ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఏఐటీయూసీ సహా 13 సంఘాలు బరిలో ఉంటున్నాయి. గుర్తింపు, ప్రాతినిధ్య సంఘం కోసం ఒకే ఓటు పద్ధతి అమలు చేస్తారు. ఎన్నికల నిర్వహణకు ఆరు జిల్లాల కలెక్టర్ల ద్వారా రెవెన్యూ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని కోరా రు. గుర్తులను రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు ఇప్పటికే కేటాయించారు. ఈ ఎన్నికల్లో 39748 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకో నున్నారు. శాశ్వత ఉద్యోగులు మాత్రమే ఓటు హ క్కు వినియోగించుకుంటారు. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిన ఈనెల 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి 7గంటల నుంచి ఓట్లు లెక్కిస్తారు. సమావేశంలో ఏఐటీయూసీ అధ్యక్షుడు వి.సీతారామయ్య, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బి.వెంకట్రావు, ఐఎనీ్టయూసీ సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్, బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, సీఐటీయూ కార్యదర్శి మంద నర్సింహారావు తదితరులు పాల్గొన్నారు. ఏరియాల వారీగా ఓటర్లు బెల్లంపల్లి ఏరియాలో 985 మంది ఓటర్లు, మందమర్రిలో 4876, శ్రీరాంపూర్‌లో 9124, కార్పొరేట్లో 1192, కొత్తగూడెంలో 2370, మణుగూరులో 2414, ఎల్లందులో 603, నైనీబ్లాక్‌లో 2, భూపాలపల్లిలో 5350, ఆర్జీ 1లో 5430, ఆర్జీ 2లో 3479, అడ్రియాలాలో 944, ఆర్జీ 3లో 3063 మంది ఓటర్లు ఉన్నారు. ఈ నెల ఒకటి నాటికి రిటైర్డ్ అయిన వారు పోనూ మొత్తం 39748మంది ఉన్నారు. -
సింగరేణి ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ
-
సింగరేణి ఎన్నికల సమరంపై సర్వత్రా ఉత్కంఠ
-
సింగరేణి ఎన్నికలపై కొనసాగుతోన్న ఉత్కంఠ
-
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో.. 'సింగరేణి గుర్తింపు ఎన్నికలు' వాయిదా!
కుమరం భీం: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలపై మళ్లీ కొర్రీ పడింది. షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటిస్తారని అనుకుంటే ఎటూ తేలకుండా మళ్లీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 27న తిరిగి సమావేశమై చర్చిస్తామని ఎన్నికల రిట్నరింగ్ అధి కారి, డెప్యూటీ సీఎల్సీ శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో ఎన్నికలపై సమావేశం జరిగింది. దీనికి 14 కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఉదయం నిర్వహించి న సమావేశంలో ఇంతకుముందు జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఎన్నికల షెడ్యూ ల్ విడుదల చేయాలని కార్మిక సంఘాల నేతలు రిటర్నింగ్ అధికారిని కోరారు. దీనిపై కార్మిక సంఘాల నేతలంతా తమ వాదనలు వినిపించారు. అ నంతరం సాయంత్రం మళ్లీ సమావేశం నిర్వహించా రు. దీనికి కంపెనీ నుంచి డైరెక్టర్ (పా) ఫైనాన్స్ బలరాం హాజరయ్యారు. డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉండనున్నందున ప్రస్తుతం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కలెక్టర్లు పేర్కొంటున్నారని సమావేశం దృష్టికి తీసుకువచ్చినట్లు బీఎంఎస్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, హెచ్ఎమ్మెస్ అధ్యక్షుడు రియాజ్ అహ్మద్ తెలిపారు. ఇదే విషయమై కంపెనీ హైకోర్టుకు తిరిగి వెళ్లడం.. దీనిపై వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో పెట్టడంతో ఉన్న ఫలంగా షెడ్యూల్ ఇవ్వద్దని కంపెనీ కోరింది. దీంతో ఈ నెల 27న తిరిగి సమావేశం అవుదామని చెప్పి రిటర్నింగ్ అధికారి షెడ్యూ ల్ ఇవ్వకుండా సమావేశాన్ని వాయిదా వేశారు. ఉత్తర్వులు జారీ.. గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసి ఎన్నికలు నిర్వహించడానికి జాప్యం జరుగుతున్నందున ఎన్నికలు నిర్వహించేదాకా అన్ని కార్మిక సంఘాలను సమానంగా గుర్తిస్తూ, ప్రాతినిధ్యం కల్పించాలని కార్మిక సంఘాల నేతలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఈ సమావేశంలోనే డైరెక్టర్ (పా) ఉత్తర్వుల కాపీని నేతలకు అందించారు. ఎన్నికలు జరిగేదాకా 14 రిజిస్ట్రర్డ్ సంఘాల ప్రతినిధులను గుర్తింపు సంఘం నాయకులతో పాటు సమానంగా గనులు, ఏరియా, కంపెనీ స్థాయిలో జరిగే అధికారిక సమావేశాలు, చర్చలు, సంప్రదింపులు, కార్యక్రమాలకు ఆహ్వానించేలా ఏరియా జీఎంలకు డైరెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. -
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా.. ఇక నాలుగో ప్రయత్నంగా
ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండేళ్లుగా వాయిదా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్‌లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి. కారు జోరుకు బ్రేకులు.. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది. కానీ కోల్‌బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తే రానీ.. పోతే పోనీ.. సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. -
సింగరేణి ఎన్నికల టెన్షన్.. ప్రీ ఫైనల్‌గా భావిస్తున్న రాజకీయ పార్టీలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీ బిఆర్ఎస్ కు సింగరేణి ఎన్నికల గుబులు పట్టుకుందా.. త్వరలో జరగబోయే గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను ప్రతిపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయా?.. అంటే ఔననే సమాధానం వస్తుంది. ఈఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల ముందు జరుగుతున్న సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుర్తింపు కార్మిక సంఘంగా ఉన్న అధికార పార్టీ బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘ టిబిజికెఎస్ తాజా పరిణామాలు మింగుడుపడడంలేదు. గతంలో సింగరేణికి అన్నితానై వ్యవహరించిన గౌవర అధ్యక్షురాలు కవిత రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండడం టిబిజికెఎస్ కు సవాల్ గా మారుతుంది. ఆరు జిల్లాలు 11అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న సిరుల మాగాణి సింగరేణి ఎన్నికలు రాజకీయ పార్టీలకు ప్రీ ఫైనల్ గా మారనున్న వైనంపై సాక్షి ప్రత్యేక కథనం. ఎన్నికల పండుగ.. సత్తా చాటేందుకు శ్రమిస్తున్న పార్టీలు నల్లబంగారు లోకం సింగరేణికి ఎన్నికల పండుగ వచ్చింది. రెండేళ్ళకోసారి జరగాల్సిన గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు కోవిడ్ ఎఫెక్ట్, కార్మిక సంఘాలు కోర్టు మెట్లు ఎక్కడంతో మూడేళ్ళు ఆలస్యమయ్యింది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టత లేకపోవడంతో ఏఐటీయూసీతోపాటు మరికొన్ని సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. కోర్టు ఆదేశంతో కేంద్ర కార్మికశాఖ,సింగరేణి యాజమాన్యం ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమయ్యింది. ఎప్రిల్ లో నోటిపికేషన్ జారీ చేసి మే నెలలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మికశాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార పార్టీతోపాటు విపక్షపార్టీల అనుబంధకార్మిక సంఘాలు అస్తశస్త్రాలు ప్రయోగించేందుకు సన్నహాలు చేస్తున్నాయి. 2017 అక్టోబర్ లో జరిగిన ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన అధికార పార్టీ టిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టిబిజికెఎస్ కు తాజా ఎన్నికలు గుబులు పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఇచ్చిన పలు హామీలను గుర్తింపు కార్మిక సంఘం నెరవేర్చకపోవడం ఆపార్టీకి ఇబ్బందిగా పరిణమించే అవకాశాలున్నాయి. ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాల్లో అక్రమాలు, ఆదాయపన్ను పరిమితి పెంపు విషయంలో పట్టించుకోకపోవడం ఆ సంఘానికి మైనస్ గా మారుతుంది. పనిబారం విషయంలో గుర్తింపు సంఘం యాజమాన్యంతో కుమ్మక్కుకావడంతో కార్మికులు తీవ్ర అసహనంతో ఉన్నారు. వాటితోపాటు తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో గతంలో టిబిజికెఎస్ కు గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న కల్వకుంట్ల కవిత డిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇరుక్కోవడంతో విపక్షాలు ప్రచార అస్త్రాలుగా చేసుకుని రంగంలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది చివరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల నేపద్యంలో ముందుగా జరుగుతున్న సింగరేణి ఎన్నికలు అధికార పార్టీతోపాటు విపక్షాలు కాంగ్రెస్, బిజేపి, వామపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. కార్మిక సంఘం ఎన్నికల్లో సత్తా చాటేందుకు ఇప్పటి నుంచే సన్నహాలు చేస్తుండడంతో బీఆర్ఎస్ కు సవాల్ గా మారనున్నాయి సింగరేణి ఎన్నికలు. 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధి సింగరేణి కొత్తగూడెం, ఖమ్మం, భూపాలపల్లి, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలోని 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో విస్తరించి ఉంది. గత 2017 అక్టోబరు 5న జరిగిన ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజీకేఎస్ 11 స్థానాలకుగాను 9స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మందమర్రి, భూపాలపల్లి మినహా అన్ని డివిజన్ లలో టీబీజీకేఎస్ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్టీయూసీ పోటీకి దూరంగా ఉండి, సీపీఐ అనుబంధ ఏఐటీయూసీకి మద్దతిచ్చింది. సింగరేణిలో మొత్తం 52,543 ఓట్లు ఉండగా గత ఎన్నికల్లో 49,877 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీటిలో టీబీజీకేఎస్ కు 23,848 ఓట్లు పోలు కాగా ఏఐటీయూసీ కూటమికి 19,631 ఓట్లు వచ్చాయి. 4,217 ఓట్ల తేడాతో టీబీజీకేఎస్ గుర్తింపు కార్మిక సంఘంగా అధికారం దక్కించుకుంది. 2020 ఫిబ్రవరితో గుర్తింపు సంఘం కాలపరిమితి ముగిసింది. 2017కు ముందు నాలుగేళ్ల కాల పరిమితి ఉండగా, కేంద్ర కార్మిక శాఖ రెండేళ్లకు కుదించటంపై టీబీజీకేఎస్ కోర్టుకెక్కింది. తీర్పు ఆలస్యం కావటంతో ఆనాలుగేళ్ల పదవీ కాలం కూడా 2021 ఫిబ్రవరిలోనే ముగిసింది. ఎట్టకేలకు కోర్టు ఆదేశంతో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సింగరేణి యాజమాన్యం ఏర్పాట్లు చేస్తుంది. ఎప్రిల్ 2న నోటిఫికేషన్ జారీ చేసి మేనెలలో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించడంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగి ప్రచారం సాగించే పనిలో నిమగ్నమయ్యాయి. హామీలు ఇచ్చారు.. కానీ 2017లో జరిగిన సింగరేణి ఎన్నికలను సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సింగరేణి కార్మికులను ప్రగతి భవన్ కు పిలుపించుకుని అనేక హామీలిచ్చారు. టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలిగా కల్వకుంట్ల కవిత సింగరేణి వ్యాప్తంగా అనేక సభల్లో పాల్గొని హామీలు ఇచ్చారు. వీటిలో ప్రధానంగా డిపెండెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. అందులో దళారులు లక్షల్లో వసూలు చేసి అనర్హులకు అవకాశాలిస్తున్నారని కార్మికుల్లో అగ్రహం వ్యక్తమవుతోంది. వేల మంది పేర్లను సరిచేసేందుకు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినప్పటికి అమలుకు నోచుకోలేదు. ప్రతి కార్మికుడికి 200 గజాల ఇంటి స్థలం ఇస్తామని, ఇంటి నిర్మాణం కోసం 10లక్షల రూపాయలు వడ్డీలేని రుణం ఇస్తామని మాటిచ్చారు. కొత్తగా 30వేల మందిని ఉద్యోగాల్లోకి తీసుకుని భూగర్భ గనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. డిస్మిస్ చేసిన కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని, భవిష్యత్తులో సింగరేణిలో డిస్మిస్ అనేదే ఉండదని కేసీఆర్ హామీ ఇచ్చారు. అయినా డిస్మిస్ లు ఆగటం లేదు. మరోవైపు తెలంగాణ ఏర్పడక ముందు సింగరేణిలో 3వేల 800 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉండేది. ప్రస్తుతం 10వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని కార్మికులు అంటున్నారు. ఇలా నష్టాల్లో కొనసాగటానికి కేసీఆర్ పాలనే కారణమని కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీకి ఝలక్ ఇస్తున్న సింగరేణి కార్మికులు ప్రస్తుతం లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవిత సింగరేణి ఎన్నికలపై దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈడీ కేసు రాజకీయ పరిణామాల నేపద్యలో కోల్ బెల్ట్ లో గులాబీ సంఘానికి తీవ్ర నష్టంవాటిల్లే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ లో ఆరు జిల్లాల్లో 11అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే సింగరేణి ఏరియాలోని కార్మికులు మొదటి నుంచి అధికార పార్టీకి ఝలక్ ఇస్తూనే ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు స్థానాల్లో గెలుపొందింది. మూడు స్థానాల్లో మాత్రమే టిఆర్ఎస్ గెలిచినప్పటికి తర్వాత రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏడుగురు ఇతర పార్టీల నుంచి గెలిచినవారు గులాబీ గూటికి చేరారు. అసెంబ్లీ నియోజకవర్గాల పరంగా చూస్తే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఇప్పుడు పది స్థానాల్లో ఉన్నప్పటికి క్షేత్ర స్థాయిలో కార్మికలోకంలో టిబిజికెఎస్ వీక్ గానే ఉందనే ప్రచారం జరుగుతుంది. గత కొంతకాలంగా మునుగోడు ఉపఎన్నికల నాటి నుంచి అధికారపార్టీతో దోస్తాన్ చేస్తున్న కమ్యూనిష్టులు కాస్త సింగరేణి ఎన్నికల విషయంలో మాత్రం పొత్తులేకుండా ఒంటరిగాన పోటీ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో గులాబీతో కలిసివచ్చే వారుకానరాక కోల్ బెల్ట్ ఏరియా అంతా కూడా గోదావరి పరివాహక ప్రాంతం, మావోయిస్ట్ ప్రాబల్యంగల ఏరియా కావడంతో అధికార పార్టీకి ప్రతికూల ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
సింగరేణిలో ‘గుర్తింపు’ ఎప్పుడో?
సాక్షి,పెద్దపల్లి: సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికల ఊసులేకుండా పోయింది. కోల్‌బెల్ట్ ప్రాంతం, ఎమ్మెల్యే, ఎంపీల భవిష్యత్‌తో ముడిపడి ఉన్న ఈ ఎన్నికలను ఆచితూచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుండగా, కేంద్రం మాత్రం సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలనే పట్టుదలతో ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిలిచే ఈ ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. గుర్తింపు ఎన్నికల గడువు దాటి నాలుగేళ్లు అవుతోందని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. ప్రస్తుతం గుర్తింపు యూనియన్‌గా ఉన్న టీబీజీకేఎస్ కూడా ఎన్నికలకు సిద్ధమని ప్రకటించింది. 11 ఏరియాలు 42 వేల మంది కార్మికులు సంస్థ పరిధిలోని 11 ఏరియాల్లో సుమారు 42 వేల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. ఆరు కార్మిక సంఘాలు పోటీలో ఉంటున్నాయి. 1998లో మొదటిసారి రెండేళ్ల కాలపరిమితితో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ తర్వాత నాలుగేళ్లకోసారి నిర్వహించారు. ఈసారి కోవిడ్ కారణంగా గుర్తింపు ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. కోవిడ్ సెకండ్‌వేవ్ తగ్గిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని జాతీయ కార్మిక సంఘాలు కోరినప్పటికీ యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. ఈ క్రమంలో బొగ్గుగని కారి్మకుల సమస్యల పరిష్కారం కోసం కోలిండియావ్యాప్తంగా సమ్మె చేపట్టారు. దీనిపై స్పందించిన సింగరేణి యాజమాన్యం బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహాయించి మిగతా డిమాండ్లపై చర్చలకు ఆహ్వానించింది. చర్చల సమయంలో సింగరేణిలో సాధ్యమైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేశాయి. అయితే ఉత్పత్తి లక్ష్యాల సాధనకు మార్చి చివరినెల కావడంతో యాజమాన్యం స్పందించలేదు. దీంతో ఎన్నికల ప్రక్రియ మళ్లీ వెనక్కివెళ్లింది. కార్మిక సంఘాల పట్టు సింగరేణి గుర్తింపు సంఘం గడువు ముగిసిన నేపథ్యంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని టీబీజీకేఎస్, జాతీయ కార్మిక సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో గుర్తింపు యూనియన్ టీబీజీకేఎస్, అలాగే ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, బీఎంఎస్, సీఐటీయూ, ఐఎన్టీయూసీ ఎన్నికలకు ముందే కారి్మకులకు దగ్గర కావాలని చూస్తున్నాయి. బస్సుయాత్ర, జీపుయాత్ర, శిక్షణతరగతులు, జనరల్‌బాడీ సమావేశాల పేరుతో ఇప్పటికే గనుల్లో ఈ సంఘాల నేతలు పర్యటించారు. ఇంకా తేల్చని యాజమాన్యం సింగరేణి గుర్తింపు ఎన్నికలపై యాజమాన్యం ఇంకా తేల్చలేదు. మార్చి¯ నెలాఖరుతో ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఎన్నికలుంటాయని కార్మిక సంఘాలు భావించినా ఎలాంటి నిర్ణయం వెలుబడలేదు. సింగరేణిలో గుర్తింపు ఎన్నికల పక్రియ ప్రారంభిస్తే ఒక్కో షిఫ్టుకు రెండు గంటల మేర అంతరాయం ఉంటుందని యాజమాన్యం భావిస్తోంది. దీంతో ఉత్పత్తికి విఘాతం కలుగుతుందని ఆలోచిస్తోంది. ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవునికే ఎరుక సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు ఎప్పుడొస్తాయో దేవుడికే ఎరుక. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా మేము సిద్ధం. గుర్తింపు యూనియన్లకు సంబంధించిన పత్రాలన్నీ ఎప్పుడో సమర్పించాం. – వెంకట్రావ్, టీబీజీకేఎస్ అధ్యక్షుడు -
‘సింగరేణి’పై రాజకీయ పార్టీల సిగపట్లు
శ్రీరాంపూర్ (మంచిర్యాల): మొన్నటి వరకు గప్‌చుప్‌గా ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా బొగ్గుబాయి బాట పడుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయా సంఘాల నేతలు గనులపై కవాతు చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనలు మొదలు పెట్టిన అన్ని సంఘాలు సెప్టెంబర్ నెలంతా కార్మికుల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. ప్రాతినిధ్య సంఘాలు ఆందోళన బాటపడుతుంటే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మాత్రం తాము సాధించిన హక్కులు, కల్పించిన సదుపాయాలను కార్మికులకు గుర్తుచేస్తోంది. (చదవండి: కుక్కర్లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!) ఈ నెలంతా ఆందోళనలే.. గడిచిన రెండు నెలల నుంచి కార్మికుల డిమాండ్లపై ధర్నాలు, జీఎం కార్యాలయాల ఎదుట దీక్షలు చేసిన ప్రతిపక్ష సంఘాలు సెప్టెంబర్ నెలంతా మరింత ఉధృతంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. 10 శాతం హెచ్ఆర్ఏ, అన్‌ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ జాబ్, లాభాల్లో 35 శాతం వాటా వంటి డిమాండ్లపై ఏఐటీయూసీ ఇప్పటికే గనులపై నిరసనలు, జీఎం కార్యాలయాల ఎదుట పలుమార్లు దీక్షలు చేపట్టింది. సెప్టెంబర్ నెలలో సింగరేణి వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. కార్మికుల ప్రధాన సమస్యలు, గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతూ యాత్ర సాగుతుందని నాయకులు పేర్కొంటున్నారు. ఇక ఐఎన్టీయూసీ కార్మికుల 10 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి సింగరేణి వ్యాప్తంగా గనులపై మెమోరాండాల సమర్పణ, 8న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. మరో సంఘం హెచ్ఎమ్మెస్ ప్రధానంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తోపాటు ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి గనులపై గేట్ మీటింగులు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఎంఎస్ కూడా ప్రత్యేక ఉద్యమ కార్యచరణ చేపట్టింది. 16 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి ధర్నాలు , దీక్షలతో సంఘం నాయకులు కార్మికులకు మధ్యకు రాబోతున్నారు. సీఐటీయూ కూడా కార్మికుల డిమాండ్లపై ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తోంది. చేసింది చెప్పుకుంటే చాలని.. ప్రతిపక్ష సంఘాల ఉద్యమ బాటపడుతుంటే టీబీజీకేఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు చేసిన మేలు చెప్పుకుంటే సరిపోతుందనే భావనలో ఉన్నారు. కారుణ్య ఉద్యోగాలు, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపు, లాభాల్లో వాటా పెంచి ఇవ్వడం, ఇప్పటి వరకు సాధించిన హక్కులు, సదుపాయాలను గేట్ మీటింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలని ఆసంఘం నాయకులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీ ప్రకటించకముందే కార్మిక సంఘాలు సమరానికి సై అంటుండడం కొసమెరుపు. కార్మిక సంఘాల డిమాండ్లు.. పర్మినెంట్ పనిస్థలాల్లో ఔట్ సోర్సింగ్ ఆపివేయాలి. ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయాలి లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలి మారు పేర్లతో పనిచేసే వారిని క్రమబద్ధీకరించాలి సొంత ఇంటి పథకం అమలు చేయాలి అండర్ గ్రౌండ్లో అన్‌ఫిట్ అయి సర్ఫేస్‌లో ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, టెక్నీషియన్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి మున్సిపాలిటీ పరిధిలో 10 శాతం హెచ్ఆర్ఏ చెల్లించాలి కంపెనీలో రాజకీయ ప్రమేయాన్ని నివారించి... నిధుల మళింపు ఆపాలి డిపెండెంట్ల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలి కొత్త బావులు తవ్వి కొత్త ఉద్యోగాలు కల్పించాలి -
'సింగరేణి కార్మికులకు వడ్డీలేని రుణాలు'
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని నిజామాబాద్ ఎంపీ టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు. అలాగే సింగరేణి కార్మికుల ఇన్ కంట్యాక్స్ పై పార్లమెంట్లో పోరాడిన ఘనత టీఆర్ఎస్దేనని కవిత అన్నారు. కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించాలని ఆమె కోరారు. -
జైలుకెళ్లిన నేతలను ఎలా నమ్ముతారు
మాజీ ఎమ్మెల్సీప్రేంసాగర్రావు మంచిర్యాల టౌన్ : కార్మికుల డబ్బులు కాజేసిన కెంగర్ల మల్లయ్య, కనకయ్య, మిర్యాల రాజిరెడ్డి ముగ్గురు జైలుకు వెళ్లి వచ్చిన వారేనని, వారని కార్మికులు ఎలా నమ్ముతారని మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివారం పట్టణంలోని ఆయన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కార్మికులు ఎన్నో ఆశలతో టీబీజీకేఎస్‌కు పట్టం కట్టితే, వారు కార్మికుల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ప్రతి నెలా కార్మికులు వారి సంక్షేమం కోసం రూ.10 చొప్పున వేతనాల్లో నుంచి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్న డబ్బులను టీబీజీకేఎస్ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. కార్మికుల డబ్బులు కాజేసిన నాయకులను కార్మికులు నమ్మొద్దన్నారు. ఐఎన్టీయూసీ నుంచి టీబీజీకేఎస్‌కు వెళుతున్నప్పుడు వెంకట్రావు ఐఎన్టీయూసీ కార్మికుల సంక్షేమం ఖాతా నుంచి సుమారు రూ.36 లక్షలు డ్రా చేసి వెళ్లాడని, దీనిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సింగరేణిలో రిటైర్డ్ కార్మికులకు సీలింగ్ పది లక్షలు ఇస్తారని, అది ఎత్తి వేయాలని, లాభాల నుంచి బోనస్ 30 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే సింగరేణి కార్మిక ఎన్నికల్లో ఐఎన్టీయూసీ గెలుపునకు ప్రతీ ఒక్కరు కలిసి కృషి చేయాలని కోరారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏమయ్యాయి? తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ప్రజలను మభ్య పెడుతుందని, డబుల్ బెడ్రూం ఇళ్లు ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఉపాధిహామీ పథకంలో పనులు సక్రమంగా లేవని, ఆసరా పింఛన్లు కూడా సరిగా అందడం లేదని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో జరిగే అవినీతిని బయట పెడతామన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కమలాకర్‌రావు, యువజన సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు సులేమాన్, నాయకులు సుంకి సత్యం, మందమర్రి, బెల్లంపల్లి ఐఎన్టీయూస్ నాయకులు జె.శంకర్రావు, వెంకటస్వామి, గరిగె స్వామి, బాబురావు, లింగయ్య, చంద్రయ్య, శ్రీనివాస్, సూర్యనారాయణ, ఎల్లయ్య, వెంకటస్వామి, భూమయ్య, భిక్షపతి, రాజయ్య ఉన్నారు.