శ్రీరాంపూర్ (మంచిర్యాల): మొన్నటి వరకు గప్‌చుప్‌గా ఉన్న కార్మిక సంఘాలు ఒక్కసారిగా బొగ్గుబాయి బాట పడుతున్నాయి. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సింగరేణి గుర్తింపు ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయా సంఘాల నేతలు గనులపై కవాతు చేస్తున్నారు. కార్మికుల సమస్యలపై గళమెత్తుతున్నారు. ఇప్పటికే ప్రత్యక్ష ఆందోళనలు మొదలు పెట్టిన అన్ని సంఘాలు సెప్టెంబర్ నెలంతా కార్మికుల మధ్య ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకున్నాయి. ప్రాతినిధ్య సంఘాలు ఆందోళన బాటపడుతుంటే గుర్తింపు సంఘం టీబీజీకేఎస్ మాత్రం తాము సాధించిన హక్కులు, కల్పించిన సదుపాయాలను కార్మికులకు గుర్తుచేస్తోంది. (చదవండి: కుక్కర్‌లో ఇరుక్కున్న చిన్నారి తల.. డాక్టర్ ఫీజు ఒక్క రూపాయే!)
ఈ నెలంతా ఆందోళనలే..
గడిచిన రెండు నెలల నుంచి కార్మికుల డిమాండ్లపై ధర్నాలు, జీఎం కార్యాలయాల ఎదుట దీక్షలు చేసిన ప్రతిపక్ష సంఘాలు సెప్టెంబర్ నెలంతా మరింత ఉధృతంగా ఆందోళనలు చేయాలని నిర్ణయించాయి. 10 శాతం హెచ్‌ఆర్‌ఏ, అన్‌ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్‌కు సూటబుల్ జాబ్, లాభాల్లో 35 శాతం వాటా వంటి డిమాండ్లపై ఏఐటీయూసీ ఇప్పటికే గనులపై నిరసనలు, జీఎం కార్యాలయాల ఎదుట పలుమార్లు దీక్షలు చేపట్టింది. సెప్టెంబర్ నెలలో సింగరేణి వ్యాప్తంగా బస్సు యాత్రకు శ్రీకారం చుట్టింది. కార్మికుల ప్రధాన సమస్యలు, గుర్తింపు సంఘం వైఫల్యాలను ఎండగడుతూ యాత్ర సాగుతుందని నాయకులు పేర్కొంటున్నారు. ఇక ఐఎన్టీయూసీ కార్మికుల 10 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి సింగరేణి వ్యాప్తంగా గనులపై మెమోరాండాల సమర్పణ, 8న జీఎం కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించాలని నిర్ణయించింది. మరో సంఘం హెచ్‌ఎమ్మెస్ ప్రధానంగా గుర్తింపు సంఘం టీబీజీకేఎస్‌తోపాటు ప్రాతినిధ్య సంఘం ఏఐటీయూసీని టార్గెట్ చేస్తూ సెప్టెంబర్ మొదటి వారం నుంచి గనులపై గేట్ మీటింగులు, ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించింది. బీఎంఎస్ కూడా ప్రత్యేక ఉద్యమ కార్యచరణ చేపట్టింది. 16 డిమాండ్లతో సెప్టెంబర్ 3 నుంచి ధర్నాలు , దీక్షలతో సంఘం నాయకులు కార్మికులకు మధ్యకు రాబోతున్నారు. సీఐటీయూ కూడా కార్మికుల డిమాండ్లపై ఉద్యమ కార్యచరణ సిద్ధం చేస్తోంది.
చేసింది చెప్పుకుంటే చాలని..
ప్రతిపక్ష సంఘాల ఉద్యమ బాటపడుతుంటే టీబీజీకేఎస్ నాయకులు మాత్రం ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికులు చేసిన మేలు చెప్పుకుంటే సరిపోతుందనే భావనలో ఉన్నారు. కారుణ్య ఉద్యోగాలు, రిటైర్మెంట్ వయసు ఏడాది పెంపు, లాభాల్లో వాటా పెంచి ఇవ్వడం, ఇప్పటి వరకు సాధించిన హక్కులు, సదుపాయాలను గేట్ మీటింగ్‌లు పెట్టి ప్రచారం చేయాలని ఆసంఘం నాయకులు ఆలోచిస్తున్నారు. ఏదేమైనా ఎన్నికల తేదీ ప్రకటించకముందే కార్మిక సంఘాలు సమరానికి సై అంటుండడం కొసమెరుపు.
కార్మిక సంఘాల డిమాండ్లు..
- పర్మినెంట్ పనిస్థలాల్లో ఔట్ సోర్సింగ్ ఆపివేయాలి. ప్రైవేటీకరణను పూర్తిగా నిలిపివేయాలి
- లాభాల్లో 35 శాతం వాటా ఇవ్వాలి
- మారు పేర్లతో పనిచేసే వారిని క్రమబద్ధీకరించాలి
- సొంత ఇంటి పథకం అమలు చేయాలి
- అండర్ గ్రౌండ్‌లో అన్‌ఫిట్ అయి సర్ఫేస్‌లో ఫిట్ అయిన మైనింగ్ స్టాఫ్, టెక్నీషియన్లకు సూటబుల్ జాబ్ ఇవ్వాలి
- మున్సిపాలిటీ పరిధిలో 10 శాతం హెచ్‌ఆర్‌ఏ చెల్లించాలి
- కంపెనీలో రాజకీయ ప్రమేయాన్ని నివారించి... నిధుల మళింపు ఆపాలి
- డిపెండెంట్ల వయోపరిమితి 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచాలి
- కొత్త బావులు తవ్వి కొత్త ఉద్యోగాలు కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment