ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి | Singareni union recognition election on 27th of this month | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ రంగం సిగలో విరిబోణి సింగరేణి

Published Sat, Dec 23 2023 3:53 AM | Last Updated on Sat, Dec 23 2023 3:53 AM

Singareni union recognition election on 27th of this month - Sakshi

సింగరేణికి ప్రభుత్వ రంగంలో 103 ఏండ్లు వచ్చాయి. మరో 150 ఏండ్లకు సరిపడా నిక్షేపాలున్నాయి. 10 వేల మిలయన్‌ టన్నులకు పైగా ఇప్పటికే గోదావరి తీరంలో గుర్తించిన నల్లబంగారం ఉన్నది. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలు వల్ల సంస్థ భవిష్యత్తుకు ప్రమాదం వచ్చి పడింది. మళ్ళీ అస్తిత్వం కోసం, ప్రభుత్వ రంగంలో నిలదొక్కు కోవడం కోసం యూనియన్లకు, రాజకీయ పార్టీ లకు అతీతంగా పోరు బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

ఎన్నో కష్టాలు, ఒడిదుడుకులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడి కార్మికుల, అధికారుల సమష్టి కృషితో నిల దొక్కుకున్న ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులూ, వారి కుటుంబ సభ్యులూ ముందు వరుసలో నిలబడ్డారు. తెలంగాణ కోసం 42 రోజులు సమ్మె చేశారు. ఇప్పుడు భవిష్యత్తు కోసం పోరాడుతున్నారు. 

దేశంలోనే ప్రభుత్వ రంగంలో మొట్ట మొదటి సంస్థగా సింగరేణి ఆవిర్భవించింది. దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే సింగరేణి ప్రభుత్వ రంగంలో ఉన్నది. 1889లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభించిన సింగరేణికి 134 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1920 డిసెంబరు 23న సింగరేణి లిమిటెడ్‌ కంపెనీగా మారింది. రాష్ట్రం 51 శాతం.. కేంద్రం 49 శాతం వాటాతో సంస్థ పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీగా ఉంది. 1990 దశకంలో రెండుసార్లు  దాదాపు ఖాయిలా జాబితాలో పడి బయటకు వచ్చిన మొట్ట మొదటి ప్రభుత్వ రంగసంస్థ సింగరేణి ఒక్కటే. ఈ సంవత్సరం డిసెంబర్‌ 23 నాటికి ‘సింగరేణి లిమిటెడ్‌’ సంస్థగా మారి 103 సంవ త్సరాలు పూర్తి చేసుకున్న సందర్భం ఇది. సంస్థ నష్టాల నుంచి బయటపడి 1998 నుంచి లాభాల్లోకి వచ్చింది.

సింగరేణి 2001–02 నుంచి కార్మికులకు తన నికర లాభాల నుంచి వాటా బోనస్‌ను చెల్లిస్తూ వస్తోంది. భారతదేశంలోని ప్రభుత్వరంగ సంస్థలలో ఎక్కడా కూడా లాభాలలో వాటా బోనస్‌ను ఉద్యోగులకు పంచి ఇస్తున్న సంస్థ లేదు. డిపెండెంట్‌ ఎంప్లాయి మెంట్‌ను కూడా అనారోగ్యంగా ఉన్న కార్మికుల ఇన్‌ వ్యాలి డేషన్‌ అనంతరం రెండు సంవత్సరాల మిగులు సర్వీసు నిబంధన మేరకు కొనసాగిస్తున్నారు.

సింగరేణి సొంతంగా మంచిర్యాల జిల్లా జైపూర్‌ వద్ద ఏర్పాటు చేసిన 1,200ల మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నుంచి రాష్ట్రానికి విద్యుత్తును అందిస్తూ 50 శాతం రాష్ట్ర విద్యుత్‌ అవసరాలను తీరుస్తున్నది. దీని వల్ల సంస్థకు ప్రతి ఏటా నాలుగు వందల కోట్ల రూపాయల లాభాలు వస్తు న్నాయి. సోలార్‌ విద్యుత్‌ రంగంలోనూ అడుగు పెట్టి 300 మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే సగం వరకు సౌర విద్యుత్‌ ఉత్పత్తి జరుగుతోంది.

మరో 800 మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తికి రంగం సిద్ధం చేశారు. డిపెండెంటు, ఇతర కేట గిరీల కింద మొత్తంగా 9 వేల వరకు ఉద్యోగాలను సింగరేణి గడిచిన 7 సంవత్సరాలలో యువతకు కల్పించడం జరిగింది. ఉద్యోగులకు సొంత గృహం నిర్మించుకోవడానికి బ్యాంకుల ద్వారా రుణ సౌకర్యం, ఇంటింటికీ ఏసీలు పెట్టు కునే అవకాశం కల్పించింది సంస్థ.  

ఐతే కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చి అమలు చేస్తున్న ‘ప్రైవేటీకరణ చట్టం’ వల్ల ప్రైవేట్‌ మల్టీ నేష నల్స్‌తో కలిసి ఫీజులు చెల్లించి వేలంలో పాల్గొంటే తప్ప కొత్త బొగ్గు బ్లాకులు సింగరేణికి కేటాయించే పరిస్థితి లేదు. అటు కోల్‌ ఇండియా దుఃస్థితి కూడా ఇలాగే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెండ్లు, పన్నులు, రాయల్టీల పేరిట ప్రతి సంవత్సరం ఆరు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తున్నా సింగరేణికి వేలంలో పాల్గొంటే తప్ప ఇప్పుడు కొత్త బ్లాక్‌లు వచ్చే పరిస్థితి లేదు.

బొగ్గు బ్లాక్‌ల కోసం గత ఏడాది 72గంటల సమ్మె కూడా చేశారు. ఈ పోరు ఇంకా కొనసాగు తూనే ఉంది. ఈ విషయాన్ని కొత్తగా ఎంపికైన ఆ ప్రాంత ప్రజా ప్రతి నిధులూ, కాంగ్రెస్‌ ప్రభుత్వం సీరియస్‌గా తీసు కోవాలి. లేకపోతే సంస్థ భవిష్యత్తు ఇరకాటంలో పడుతుంది. సింగరేణి అంటే తెలంగాణకు గుండెకాయ లాంటిది. వేలాది మందికి భవిష్యత్తులో ఉపాధి కల్పించే తల్లి లాంటిది. అలాంటి సంస్థను ప్రభుత్వరంగంలో కాపాడు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. 

స్వాతంత్య్రానికి ముందు నుంచి ప్రభుత్వరంగంలో ఉన్న సింగరేణిలో కార్మిక సంఘాలకు కూడా దశబ్దాల పోరాట చరిత్ర ఉంది. హక్కుల కోసం 1936లో ‘ఉబాసి లాల్‌ ఫాసి’ అనే కార్మికుడి నేతృత్వంలో 13 రోజులు సమ్మె జరిగిన దాఖలాలున్నాయి. 1945 నుంచి కార్మిక సంఘాల కార్యకలాపాలు, పోరాటాలు కొనసాగు తున్నాయి. 1998 నుంచి దేశంలోని ఎక్కడా కూడా బొగ్గు సంస్థలలో లేని విధంగా యూనియన్‌ గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఈ నెల 27న యూనియన్‌ గుర్తింపు ఎన్నికలు ఉన్నాయి. 7వ సారి ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అలాంటి సింగ రేణిని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సింగరేణి లాభాలలో ఉంది నిజమే. అయితే సంస్థకు రావాల్సిన బకాయిలు వసూలు కాకపోవడంతో క్యాష్‌ రిచ్‌ కంపెనీ కాలేక పోతున్నది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎలాగూ బడ్జెటరీ మద్దతు లేదు. బొగ్గు విద్యుత్‌ సరఫరా చేసిన వేల కోట్ల బకాయీలనైనా అవి చెల్లించాలి. అందుకు తెలంగాణ ప్రజా ప్రతినిధులు చిత్తశుద్ధి, నిజాయితీతో కృషి చేయాలి.

- ఎం.డి. మునీర్‌
- వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ ‘ 99518 65223
(నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement