కొత్తగూడెంలోని జీకేఓసీలో బొగ్గు ఉత్పత్తి లేక వెలవెలబోతున్న బంకర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్రంలో నాలుగు బొగ్గు గనులను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మె రెండో రోజు శుక్రవారం కూడా విజయవంతమైంది. విధులను బహిష్కరించిన కార్మికులు పలుచోట్ల నిరసనలు చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రోడ్డుపై వెళుతున్న ప్రయాణికులను ఆపి పూలు ఇచ్చి సమ్మెకు మద్దతు తెలపాలని వేడుకున్నారు.
సమ్మెతో రాష్ట్ర వ్యాప్తంగా 11 ఏరియాలు, నాలుగు రీజియన్ల పరిధిలోని 25 ఓపెన్ కాస్టులు, 20 భూగర్భ గనులు బోసిపోయాయి. డంపర్లు, డోజర్లు ఎక్కడికక్కడే నిలిచిపోవడంతో గనులన్నీ నిర్మానుష్యంగా మారాయి. మొదటి, రెండో షిఫ్టుల్లో మొత్తం 34,753 మంది కార్మికులు విధులకు హాజరు కావాల్సి ఉండగా 29,300 మంది గైర్హాజరయ్యారు.
భూగర్భ గనుల్లో పని చేసే అత్యవసర సేవల సిబ్బంది 4,709 మంది మాత్రమే విధులకు వచ్చారు. మరోవైపు 13,701 మంది కాంట్రాక్ట్ కార్మికుల్లో 4,340 మంది గైర్హాజరై సమ్మెకు మద్దతు తెలిపారు. రెండు రోజుల సమ్మెతో 4 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. దీంతో సంస్థకు సుమారు రూ.160 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇటు కార్మికులు సైతం వేతన రూపంలో రూ.40 కోట్లు నష్టపోయారు.
బొగ్గు రవాణాపై ఎఫెక్ట్..
రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి ఉత్పత్తి చేస్తున్న బొగ్గు తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్‌గఢ్, హరియాణా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్‌లో ఉన్న థర్మల్ విద్యుత్ కేంద్రాలకు, సిమెంట్, ఐరన్, హెవీ వాటర్ ప్లాంట్, సిరామిక్స్, ఫార్మా, ఆగ్రో తదితర నాన్ పవర్ కంపెనీలకు రవాణా అవుతుంది.
తెలంగాణలోని ప్రతిరోజూ 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి అవుతుంది. ఇందులో ప్రతి రోజూ 1.30 లక్షల టన్నుల బొగ్గు ఇతర రాష్ట్రాలకు రవాణా అవుతుంది. 70 వేల టన్నుల బొగ్గును రాష్ట్ర అవసరాలకు వాడుతుంటారు. రెండు రోజుల సమ్మెతో ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన 2.40 లక్షల టన్నుల బొగ్గు రవాణాకు బ్రేక్ పడింది.
15న కేంద్రమంత్రితో చర్చలు..
సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెను విరమింపజేసేందుకు కేంద్రం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే రీజినల్ లేబర్ కమిషనర్ సమ్మెకు ముందే పలుమార్లు కార్మిక సంఘ నేతలతో హైదరాబాద్‌లో భేటీ అయ్యారు. సమ్మె కొనసాగుతున్నా సంఘ నేతలతో చర్చలు జరిపారు. మొత్తం 12 డిమాండ్లతో సమ్మె చేపట్టగా, వాటిలో రాష్ట్రంలో నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణ మినహా మిగిలిన డిమాండ్లను దశల వారీగా పరిష్కరించేందుకు సింగరేణి సిద్ధమైంది.
ప్రధానమైన బ్లాకుల ప్రైవేటీకరణ డిమాండ్ విషయంలో యాజమాన్యం ఎలాంటి హామీ ఇవ్వలేదు. దీంతో అధికారులు, కార్మిక సంఘ నేతలతో ఏర్పడిన జేఏసీ బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషితో చర్చించేందుకు ఈనెల 15, 16 తేదీల్లో ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందులో సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ (పీఏడబ్ల్యూ) బలరాంనాయక్, జీఎం (పర్సనల్) ఆనందరావు, యూనియన్ నాయకులు వెంకట్రావ్ (టీబీజీకేఎస్), వాసిరెడ్డి సీతారామయ్య (ఏఐటీయూసీ), జనక్ ప్రసాద్ (ఐఎన్‌టీయూసీ), రాజిరెడ్డి (సీఐటీయూ), రియాజ్ (హెచ్‌ఎంఎస్), మాధవన్‌నాయక్ (బీఎంఎస్) ఢిల్లీలో జరిగే చర్చల్లో పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment