ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది.
ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు.
రెండేళ్లుగా వాయిదా
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్‌లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది.
ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్‌ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి.
కారు జోరుకు బ్రేకులు..
ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది.
కానీ కోల్‌బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వస్తే రానీ.. పోతే పోనీ..
సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్‌ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది.
ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్‌ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment