postpone elections
-
సార్వత్రిక ఎన్నికలను వాయిదా వేయాలి
ఇస్లామాబాద్: ఫిబ్రవరి 8వ తేదీన సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన పాకిస్తాన్లో రాజకీయ అనిశ్చితి మరింత ముదురుతోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు, ఖైబర్ ఫంక్తున్వా వంటి ప్రావిన్సుల్లో భద్రతాపరమైన ఆందోళనల నేపథ్యంలో ఫిబ్రవరి 8వ తేదీన జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ సెనేట్ తీర్మానం ఆమోదించింది. స్వతంత్ర సభ్యుడు దిలావర్ ఖాన్ చేసిన ప్రతిపాదనకు ఊహించని మద్దతు లభించింది. అయితే, పాకిస్తాన్ ఎన్నికల సంఘం(ఈసీపీ) సెనేట్ తీర్మానాన్ని తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వు ద్వారా మాత్రమే ఎన్నికల షెడ్యూల్ మారుతుందని పేర్కొంది. -
ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా.. ఇక నాలుగో ప్రయత్నంగా
ఖమ్మం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల నిర్వహణ అంశం ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్నట్టుగా మారింది. ఇప్పటికే మూడుసార్లు ఎన్నికల నిర్వహణ వాయిదా పడింది. తాజాగా నాలుగో ప్రయత్నంగా ఇదే అంశంపై కార్మిక సంఘాలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర కార్మిక శాఖ సిద్ధమైంది. ఈ మేరకు కార్మిక సంఘాలు, సింగరేణి అధికారులతో కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ నేతృత్వంలో సోమవారం హైదరాబాద్‌లో సమావేశం జరుగనుంది. ఇందులో ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ఓటర్ల జాబితా ఎప్పుడు ప్రకటించాలి తదితర అంశాలపై చర్చించనున్నారు. రెండేళ్లుగా వాయిదా సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు తొలిసారిగా 1998లో జరగగా, చివరిసారి 2017 అక్టోబర్‌లో నిర్వహించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపొందింది. ఈ సంఘం గుర్తింపు కాలపరిమితి 2021తో ముగిసింది. ఆతర్వాత వివిధ కారణాలతో యాజమాన్యం వాయిదా వేస్తూ వస్తోంది. ఈ అంశంపై సీపీఐ అనుబంధ సింగరేణి కోల్‌మైన్స్ యూనియన్ (ఏఐటీయూసీ) హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ కార్మిక సంఘాలకే అనుకూలంగా తీర్పు వచ్చినా సాంకేతిక కారణా లను సాకుగా చూపుతూ సింగరేణి సంస్థ ఎన్నికలు వాయిదా వేస్తోంది. బీఆర్ఎస్ సర్కార్ ఆదేశాల మేరకే ఎన్నికల నిర్వహణలో వెనుకంజ వేస్తోందనే విమర్శలు సంస్థపై ఉన్నాయి. కారు జోరుకు బ్రేకులు.. ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాల పరిధిలో సింగరేణి బొగ్గు గనులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. ఈ సంస్థలో 42 వేల మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. 12 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణికి సంబంధించిన అంశాలు గెలు పోటమలును ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2014, 2018లో రెండుసార్లు జరిగిన సాధారణ ఎన్నికల్లో మిగిలిన ప్రాంతాల్లో కారు పార్టీ జోరు చూపించింది. కానీ కోల్‌బెల్ట్ ఏరియాల్లో మాత్రం ఆ పార్టీకి భంగపాటు ఎదురైంది. దీంతో గత రెండేళ్లుగా గుర్తింపు సంఘం ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వస్తే రానీ.. పోతే పోనీ.. సింగరేణి ఎన్నికల నిర్వహణ విషయంలో బీఆర్ఎస్ పార్టీ వైఖరిలో ఇటీవల మార్పు వచ్చిందంటున్నారు. ఇప్పటికే కమ్యూనిస్టులతో తెగదెంపులు చేసుకున్న బీఆర్ఎస్.. తొలి జాబితా ప్రకటన తర్వాత అసమ్మతి నేతలు పార్టీని వీడి వెళ్తున్నా డోంట్ కేర్ అన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఇప్పుడు గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక విషయంలోనూ ఏది జరిగినా సరే అనే భావన పార్టీలో నెలకొందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. ఎన్నికల సాధ్యాసాధ్యాలను కేంద్ర కార్మిక శాఖ చూసుకుంటుందని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలకు తగ్గట్టుగా ముందుకు పోవడమే మంచిదనేది గులాబీ నేతల అభిప్రాయంగా చెబుతున్నారు. -
కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలు వాయిదాపడ్డాయి. దేశంలో కోవిడ్ సంక్షోభ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికలను ప్రస్తుతం వాయిదా వేయాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) తీర్మానించింది. కాంగ్రెస్ చీఫ్ పదవికి రాహుల్‌గాంధీ రాజీనామా చేసిన అనంతరం 2019 ఆగస్ట్ నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియాగాంధీ కొనసాగుతుండటం తెల్సిందే. ఈ నేపథ్యంలో పార్టీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించి బాధ్యతలు అప్పగించాలని గత కొంతకాలంగా సోనియాగాంధీ భావిస్తున్నారు. అందులోభాగంగా జూన్‌లో నిర్వహించాలని గతంలో నిర్ణయించారు. సోమవారం వర్చువల్ వేదికగా జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నూతన అధ్యక్ష ఎన్నిక ప్రక్రియపై చర్చించారు. అయితే దేశంలో ప్రస్తుతం కోవిడ్ పరిస్థితులు విషమించిన కారణంగా అధ్యక్ష ఎన్నికను వాయిదా వేయడమనే సబబు అని సీడబ్ల్యూసీ సభ్యులు అందరూ ఏకాభిప్రాయం వ్యక్తపరిచారు. దీంతో సంక్షోభం సద్దుమణగగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారు. కోవిడ్ పరిస్థితులు చక్కబడితే మూడు నెలల తర్వాత ఎన్నికలు నిర్వహించే అవకాశముందని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా చెప్పారు. మోదీ తన తప్పులు సరిదిద్దుకోవాలి సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దేశంలో కరోనా విస్తృత వ్యాప్తిపై చర్చించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేసిన తప్పుకు దేశం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోందని సీడబ్ల్యూసీ అభిప్రాయపడింది. మోదీ తన తప్పులను సరిదిద్దుకోవాలని, వ్యక్తిగత ఎజెండాను పక్కనబెట్టాలని దేశానికి సేవ చేయాలని సీబ్ల్యూసీ హితవుపలికింది. విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలపై ప్రభుత్వం వాస్తవ గణాంకాలను బహిర్గతంచేయడంలేదని ఆరోపించింది. నిజాన్ని దాచేస్తే సరిపోదని, సవాళ్లను ఎదుర్కొంటేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే, కరోనా కట్టడి కోసం చేపట్టే చర్యలు, కార్యక్రమాల్లో ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని సీబ్ల్యూసీ నిర్ణయించింది. కరోనా వైరస్ పరిస్థితి చాలా భయంకరంగా మారిందని సోనియా వ్యాఖ్యానించారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాల కారణంగా వైఫల్యాలు ఎక్కువై పరిస్థితులు మరింత కష్టతరంగా మారాయని వ్యాఖ్యానించారు. వైరస్ సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లను ప్రభుత్వం వారి ప్రయోజనం కోసం ఆమోదించిందని విమర్శించారు. నత్తనడకన కోవిడ్ వ్యాక్సినేషన్ ఈ సమావేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సోనియా గాంధీ మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. వ్యాక్సినేషన్ విషయంలో మోదీ ప్రభుత్వం తన బాధ్యతను విరమించుకుందని, ఆ బాధ్యతను రాష్ట్రాలపై వదిలేసిందని సోనియా గాంధీ ఆరోపించారు. కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం ఆర్థికంగా మరింత సమర్థించదగ్గ విషయమని అభిప్రాయపడ్డారు. కోవిడ్ కారణంగా దేశంలో పరిస్థితి మరింత భయంకరంగా మారిందని ఆమె ఆందోళన వ్యక్తంచేశారు. పాలన వైఫల్యాల కారణంగా దేశవ్యాప్తంగా ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలిందని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడకన కొనసాగుతోందన్నారు. ప్రజాభిప్రాయాలు, సద్విమర్శలను పక్కకునెట్టి మోదీ సర్కార్ తన స్వప్రయోజనాలు, ఇతర భారీ ప్రాజెక్టులకు ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఇప్పటికైనా అఖిలపక్ష సమావేశం నిర్వహించి ప్రజాభీష్టానికి తగ్గట్లు కోవిడ్ చర్యలు చేపట్టాలని సోనియా కోరారు. ఢిల్లీలో కోవిడ్కాలంలోనూ కొనసాగుతున్న సెంట్రల్ విస్టా ప్రాజెక్టును నేరపూరిత వృథాగా సీడబ్ల్యూసీ అభివర్ణించింది. దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితుల్లో అంతర్జాతీయ సమాజం దేశానికి సహాయం చేయడానికి ముందుకొస్తున్న అన్ని దేశాలకు, సంస్థలకు కాంగ్రెస్ తరపున సోనియా కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల ముగిసిన నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పేలవమైన పనితీరును సమీక్షించారు. ఎన్నికల ఫలితాలతో చాలా నిరాశ చెందుతున్నామని చెబితే సరిపోదని, ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సోనియా తెలిపారు. కేరళ, అస్సాంలో మనం ఎందుకు ఓడిపోయామో, పశ్చిమ బెంగాల్లో కనీసం ఒక్క సీటు ఎందుకు రాలేదు అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సోనియా అన్నారు. మనం వాస్తవికతను అర్థంచేసుకోకపోతే, భవిష్యత్తు కోసం ఎలా పాఠాలు నేర్చుకుంటామని సోనియా గాంధీ సభ్యులను ప్రశ్నించారు. నాలుగు రాష్ట్రాల ఓటమి నుంచి కాంగ్రెస్ గుణపాఠాలు నేర్చుకోవాలన్నారు. పార్టీ ఓటమికి గల వాస్తవ కారణాలను తెలపాలంటూ ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి, రాష్ట్రాల ఇన్‌చార్జ్‌లను సోనియా ఆదేశించారు. కోవిడ్ కారణంగా ఈ చర్చలో రాహుల్‌గాంధీ పాల్గొనలేదు. -
ట్రంప్‌కి ఎన్ని కల్లలేనా?
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట పదే పదే ఎన్నికల వాయిదా మాట వస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా, భద్రంగా ఓటు వేసే రోజు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు. ట్రంప్ ఎందుకీ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఓటమి భయం ఆయనను వెంటాడుతోందా? అసలు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యమేనా ? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికి కరోనా వైరస్ ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఆరోగ్యం కంటే ఆర్థికానికే ప్రాధాన్యమిచ్చిన ట్రంప్ మార్కెట్లను గాడిలో పెట్టడానికి చేసే ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష రేసులో ముందున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. జూలైలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా ప్రజల్లో 50శాతం మంది బైడెన్‌కు మద్దతుగా నిలిస్తే, ట్రంప్‌కి 41శాతం మంది మద్దతుగా ఉన్నారు. మరో 9 శాతం ఎవరివైపు మొగ్గు చూపడం లేదు. ట్రంప్ కంటే బైడెన్ 9శాతం ఓట్లతో ముందంజలో ఉండడంతో తన పీఠం కదులుతుందనే ఎన్నికలు వాయిదా అంటూ ట్రంప్ కొత్త నాటకాలు ఆడుతున్నారని డెమొక్రాట్లు విరుచుకు పడుతున్నారు. గతంలో వాయిదా పడ్డాయా? అమెరికాలో స్థానిక ఎన్నికలు పలుమార్లు వాయిదా పడ్డాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్ని వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం 244 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. అమెరికా అంతర్యుద్ధం (1861–65) సమయంలోనూ, 1918లో స్పానిష్ ఫ్లూ అతలాకుతలం చేసినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఎప్పుడూ అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వెయ్యలేదని చరిత్రకారుడు మైకేల్ బెస్చ్లాస్ చెప్పారు. మెయిల్ ఇన్ ఓటింగ్‌కు ట్రంప్ ఎందుకు వ్యతిరేకం? కరోనా వైరస్ విజృంభణ ఆగే సూచనలు కనిపించకపోవడంతో అమెరికా ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతినే ఎంచుకున్నారు. దీని ప్రకారం జాబితాలో ఉన్న ఓటర్లకు సంబంధిత అధికారులు బ్యాలెట్ పేపర్ని అందిస్తారు. ఆ ఓటరు దానిని నింపి తిరిగి అధికారులకి పంపించాలి. ఈ విధానంలో విదేశీ జోక్యం ఎక్కువగా ఉంటుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫలితాల్లో తీవ్ర జాప్యం ఉంటుందనే ఆందోళన ఉంది. బ్యాలెట్ పేపర్ని సరిగా నింపకపోయినా, గడువు కంటే ముందే పంపినా దానిని లెక్కించకపోవచ్చునన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఓడిపోతే మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంపైనే తప్పంతా నెట్టివేయొచ్చునన్నది ట్రంప్ ఆలోచనగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే కొలరాడో, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, ఉటా వంటి రాష్ట్రాల్లో మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ విధానంలో అవకతవకలు జరిగే అవకాశం 0.4%కూడా ఉండదని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఎన్నికల విశ్లేషకుడు రిచర్డ్ ఎల్ హసన్ పేర్కొన్నారు. మొత్తమ్మీద అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలైతే కనిపించడం లేదు. వాయిదా పడితే ఏం జరుగుతుంది? అమెరికాలో ఎన్నికలు నాలుగేళ్లకి ఒకసారి నవంబర్ నెల మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం ఎన్నికలు జరగాలని చట్టంలోనే ఉంది. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని వాయిదా వేయాలంటే కాంగ్రెస్ ఆమోదంతో జరగాలి. కాంగ్రెస్‌లో సెనేట్‌లో రిపబ్లికన్లకి పట్టుంటే, హౌజ్ ఆఫ్ కామన్స్‌లో డెమొక్రాట్లది పైచేయి. వీరికి ఏకాభిప్రాయం కుదిరి ఎన్నికలు వాయిదా వేసినా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగలేరు. ఎందుకంటే చట్టం ప్రకారం జనవరి 20లోగా కొత్త అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి తీరాలి. అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేస్తే ప్రతినిధుల సభని నిర్వహించడానికి వీలుండదు. అప్పుడు సెనేట్ అధ్యక్షుడిని ఎంపిక చేయాలి. సెనేట్ ఆ పని చేయలేకపోతే స్పీకర్‌కే అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి అర్హత వస్తుంది. -
విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికపై గందరగోళం
► సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వుల మేరకు వాయిదా వేసిన కార్మిక శాఖ ► కానీ ఈ ఎన్నిక నిర్వహణకు అనుమతినిచ్చిన హైకోర్టు ► ‘వాయిదా’పై స్పందించని అధికారులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ కార్మిక సంఘం ఎన్నికలు గందరగోళంగా మారాయి. శుక్రవారం జరగాల్సిన ఈ ఎన్నికలపై ఇటీవల సిటీ సివిల్‌కోర్టు స్టే విధించడంతో.. వాటిని వాయిదా వేస్తూ కార్మిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఈ ఎన్నికలను యథాతథంగా నిర్వహించుకోవచ్చని హైకోర్టు గురువారమే అనుమతినిచ్చింది. సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేసింది. అయితే హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. ఎన్నికల నిర్వహణపై కార్మిక శాఖ అధికారులు స్పందించకపోవడంతో గందరగోళం నెలకొంది. స్పందించని కార్మిక శాఖ గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థలకు కలిపి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నారంటూ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ కొద్దిరోజుల కింద సిటీ సివిల్ కోర్టులో కేసు వేసింది. దాంతో ఈ నెల 8న జరగాల్సిన ఎన్నికలపై కోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఎన్నికలను వాయిదా వేస్తూ రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇస్లావత్ గంగాధర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సిటీ సివిల్ కోర్టు ఉత్తర్వులపై జెన్కో హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శుక్రవారం గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక నిర్వహించేందుకు మార్గం సుగమమైంది. కానీ ఎన్నికలపై రిటర్నింగ్ అధికారి, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎలాంటి ప్రకటనా చేయకపోవడంతో గందరగోళం నెలకొంది. శుక్రవారం ఎన్నికలు జరుగుతాయా? లేదా ? అన్న దానిపై స్పష్టత లేక క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణ అధికారులు తల పట్టుకుంటున్నారు. దీనిపై కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.