అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోట పదే పదే ఎన్నికల వాయిదా మాట వస్తోంది. ప్రజలు స్వేచ్ఛగా, భద్రంగా ఓటు వేసే రోజు వచ్చే వరకు ఎన్నికలు వాయిదా వేయాలన్న ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారు. ట్రంప్ ఎందుకీ వ్యాఖ్యలు చేస్తున్నారు? ఓటమి భయం ఆయనను వెంటాడుతోందా? అసలు అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేయడం సాధ్యమేనా ? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ జరుగుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవికి కరోనా వైరస్ ఎసరు పెట్టేలా కనిపిస్తోంది. ఆరోగ్యం కంటే ఆర్థికానికే ప్రాధాన్యమిచ్చిన ట్రంప్ మార్కెట్లను గాడిలో పెట్టడానికి చేసే ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. ప్రత్యర్థి డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అధ్యక్ష రేసులో ముందున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. జూలైలో నిర్వహించిన సర్వేల్లో అమెరికా ప్రజల్లో 50శాతం మంది బైడెన్‌కు మద్దతుగా నిలిస్తే, ట్రంప్‌కి 41శాతం మంది మద్దతుగా ఉన్నారు. మరో 9 శాతం ఎవరివైపు మొగ్గు చూపడం లేదు. ట్రంప్ కంటే బైడెన్ 9శాతం ఓట్లతో ముందంజలో ఉండడంతో తన పీఠం కదులుతుందనే ఎన్నికలు వాయిదా అంటూ ట్రంప్ కొత్త నాటకాలు ఆడుతున్నారని డెమొక్రాట్లు విరుచుకు పడుతున్నారు.
గతంలో వాయిదా పడ్డాయా?
అమెరికాలో స్థానిక ఎన్నికలు పలుమార్లు వాయిదా పడ్డాయి. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత న్యూయార్క్ మేయర్ ఎన్నికల్ని వాయిదా వేశారు. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ప్రిలిమినరీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. కానీ అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడడం 244 ఏళ్ల అమెరికా చరిత్రలో ఇప్పటివరకు జరగలేదు. అమెరికా అంతర్యుద్ధం (1861–65) సమయంలోనూ, 1918లో స్పానిష్ ఫ్లూ అతలాకుతలం చేసినప్పుడు, రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కూడా ఎప్పుడూ అధ్యక్ష ఎన్నికల్ని వాయిదా వెయ్యలేదని చరిత్రకారుడు మైకేల్ బెస్‌చ్లాస్ చెప్పారు.
మెయిల్ ఇన్ ఓటింగ్‌కు ట్రంప్ ఎందుకు వ్యతిరేకం?
కరోనా వైరస్ విజృంభణ ఆగే సూచనలు కనిపించకపోవడంతో అమెరికా ఎన్నికల్లో ఎక్కువ మంది మెయిల్ ఇన్ ఓటింగ్ పద్ధతినే ఎంచుకున్నారు. దీని ప్రకారం జాబితాలో ఉన్న ఓటర్లకు సంబంధిత అధికారులు బ్యాలెట్ పేపర్‌ని అందిస్తారు. ఆ ఓటరు దానిని నింపి తిరిగి అధికారులకి పంపించాలి. ఈ విధానంలో విదేశీ జోక్యం ఎక్కువగా ఉంటుందని ట్రంప్ ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫలితాల్లో తీవ్ర జాప్యం ఉంటుందనే ఆందోళన ఉంది. బ్యాలెట్ పేపర్‌ని సరిగా నింపకపోయినా, గడువు కంటే ముందే పంపినా దానిని లెక్కించకపోవచ్చునన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ ఓడిపోతే మెయిల్ ఇన్ ఓటింగ్ విధానంపైనే తప్పంతా నెట్టివేయొచ్చునన్నది ట్రంప్ ఆలోచనగా ఉన్నట్టు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇప్పటికే కొలరాడో, హవాయి, ఒరెగాన్, వాషింగ్టన్, ఉటా వంటి రాష్ట్రాల్లో మెయిల్ ఇన్ ఓటింగ్ విధానాన్నే అనుసరిస్తున్నారు. ఈ విధానంలో అవకతవకలు జరిగే అవకాశం 0.4%కూడా ఉండదని కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ఎన్నికల విశ్లేషకుడు రిచర్డ్ ఎల్ హసన్ పేర్కొన్నారు. మొత్తమ్మీద అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశాలైతే కనిపించడం లేదు.
వాయిదా పడితే ఏం జరుగుతుంది?
అమెరికాలో ఎన్నికలు నాలుగేళ్లకి ఒకసారి నవంబర్ నెల మొదటి సోమవారం మర్నాడు వచ్చే మంగళవారం ఎన్నికలు జరగాలని చట్టంలోనే ఉంది. ఈ ఏడాది నవంబర్ 3న ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటిని వాయిదా వేయాలంటే కాంగ్రెస్ ఆమోదంతో జరగాలి. కాంగ్రెస్‌లో సెనేట్‌లో రిపబ్లికన్లకి పట్టుంటే, హౌజ్ ఆఫ్ కామన్స్‌లో డెమొక్రాట్లది పైచేయి. వీరికి ఏకాభిప్రాయం కుదిరి ఎన్నికలు వాయిదా వేసినా ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగలేరు. ఎందుకంటే చట్టం ప్రకారం జనవరి 20లోగా కొత్త అధ్యక్షుడికి పగ్గాలు అప్పగించి తీరాలి. అధ్యక్ష ఎన్నికలు వాయిదా వేస్తే ప్రతినిధుల సభని నిర్వహించడానికి వీలుండదు. అప్పుడు సెనేట్ అధ్యక్షుడిని ఎంపిక చేయాలి. సెనేట్ ఆ పని చేయలేకపోతే స్పీకర్‌కే అధ్యక్ష పగ్గాలు చేపట్టడానికి అర్హత వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment