సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు ఈనెల 27న జరగబోతున్నాయి. ఈ మేరకు కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం సోమవారం సాయంత్రంతో ముగిసింది.
పాతికేళ్ల కిందట మొదలైన ఎన్నికల పోరు
దక్షిణ భారత్‌లోనే ఏకైక బొగ్గు ఉత్పత్తి సంస్థగా నిలిచిన సింగరేణి పరిధిలో 24 భూగర్భ, 18 ఓపెన్ కాస్ట్ గనులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 39 వేల మంది కార్మికులు పని చేస్తు న్నారు. 1998 నుంచి సింగరేణిలో కార్మిక సంఘాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గుర్తింపు సంఘం కాలపరిమితి మొదట రెండేళ్లు ఉండగా తర్వాత నాలుగేళ్లకు పెంచారు.
చివరి సారిగా 2017 అక్టోబర్‌లో ఎన్నికలు జరగగా గెలుపొందిన యూనియన్ కాల పరిమితి 2021 అక్టోబర్‌తో ముగిసింది. ఆ తర్వాత ప్రభుత్వం ఎన్నికలకు మొగ్గు చూపలేదు. దీంతో ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కోర్టును ఆశ్రయించగా ఎన్నికల ప్రక్రియ మొదలైంది.
అక్టోబర్ 6న నోటిఫికేషన్ వచ్చినా..
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల నోటిఫికేషన్ గత అక్టోబర్ 6న వెలువడింది. అదేనెల 10వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేసి కార్మిక సంఘాలకు గుర్తులు కేటాయించారు. అక్టోబర్ 30న పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా అసెంబ్లీ ఎన్నికలు రావడం, రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు మరోసారి అభ్యంతరం చెప్పడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. చివరకు ఈనెల 27న పోలింగ్ నిర్వహించాల్సిందేనని హైకోర్టు ఈనెల 21న స్పష్టం చేసింది. దీంతో కార్మిక సంఘాలు ప్రచారంలో ఉధృతి పెంచాయి.
మొత్తం 39,773 మంది కార్మికులు
సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో మొత్తం 39,773 మంది కార్మికులు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. 13 కార్మిక సంఘాలు పోటీ పడుతున్నాయి. ఎన్నికల విధులకు 650 మంది ప్రభుత్వ ఉద్యోగులను, బందోబస్తు విధులకు 460 మంది పోలీసులను కేటాయించారు. రహస్య బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరుగుతాయి.
11 ఏరియాల్లో 84 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. అత్యధికంగా శ్రీరాంపూర్ ఏరియాలో 15 కేంద్రాలు ఉండగా ఇల్లెందులో అత్యల్పంగా 3 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7 గంటలకు మొదలయ్యే పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తర్వాత ఏరియాల వారీగా ఓట్లు లెక్కిస్తారు. ముందు ఏరియా వారీగా విజేతలను ప్రకటిస్తారు. ఆ తర్వాత మొత్తం పోలైన ఓట్లలో సగానికంటే ఎక్కువ ఓట్లు సా«ధించిన సంఘానికి గుర్తింపు హోదా కేటాయిస్తారు.
‘గుర్తింపు’ఎవరికో..?
తెలంగాణ ఉద్యమం 2009లో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత సింగరేణిలో బీఆర్‌ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీజీబీకేఎస్) అనూహ్యంగా బలపడింది. వరుసగా 2012, 2017 ఎన్నికల్లో గెలుపొందింది. 2017లో ఏకంగా టీజీబీకేఎస్ తొమ్మిది ఏరియాల్లో గెలుపొందగా, ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కేవలం మందమర్రి, భూపాలపల్లి ఏరియ్లాలోనే విజయం సాధించింది.
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ.. ఏఐటీయూసీకి మద్దతు ఇచ్చింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. ఒక దశలో పోటీకి టీజీబీకేఎస్ వెనుకంజ వేసింది. గత ఎన్నికల్లో పోటీ చేయని ఐఎన్‌టీయూసీ ఇప్పుడు అనూహ్యంగా పుంజుకుంది. మెజారిటీ ఏరియాలను కైవసం చేసుకోవాలని, గుర్తింపు సంఘం హోదా కూడా సాధించాలని గురి పెట్టింది.
Comments
Please login to add a commentAdd a comment