తండ్రితో పిల్లలు సాయినిఖిత, సుశీల్ సూర్య
అగ్నికి ఆహుతైన తల్లి.. జీవచ్ఛవంలా తండ్రి పిల్లల పరిస్థితి అగమ్యగోచరం
అమ్మానాన్నలే వారికి లోకం.. నిన్నటి వరకూ అమ్మే అల్లారుముద్దుగా చూసుకుంది.. పేదరికం వెంటాడుతున్నా ఏ లోటూ తెలియకుండా చేసింది.. కదలలేని స్థితిలో ఉన్నా.. నాన్న అంతులేని ప్రేమను పంచాడు. కానీ.. ఒక్క ఘటన ఈ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. అన్నీ తానై చూసుకుని గోరుముద్దలు తినిపించిన అమ్మ విగతజీవిగా మారింది. ఆదరించాల్సిన నాన్న రెండు కిడ్నీలు చెడిపోయి జీవచ్ఛవంలా పడివున్నాడు. అమ్మానాన్న తరపు బంధువులు ఆలనాపాలనా చూసే పరిస్థితి లేకపోవడంతో ఆ చిన్నారులిద్దరూ రెక్కలు తెగిన పక్షులయ్యారు. సోమవారం రాంనగర్‌లో ఆత్మహత్య చేసుకున్న శ్రీలక్ష్మి, వినోద్ దంపతుల కుమారుడు, కుమార్తెల దీనస్థితి ఇదీ.
- హైదరాబాద్
రెండు కిడ్నీలు చెడిపోయి మంచానికే పరిమితమైన భర్త వినోద్ కళ్లెదుటే భార్య లక్ష్మి అగ్నికి ఆహుతి కావడంతో వారి ఇద్దరు పిల్లలూ ఇప్పుడు దిక్కులేని పక్షులయ్యారు. వీరి కుమారుడు సుశీల్ సూర్య(9) రంగారెడ్డి జిల్లాలోని చీకటి మామిడి వేద పాఠశాలలో వేద విద్యను అభ్యసిస్తున్నాడు. కుమార్తె సాయినిఖిత(6) రాంనగర్‌లోని జేవీ హైస్కూల్‌లో 1వ తరగతి చదువుతోంది.
ఇంటి అవసరాలు మొదలుకుని భర్తకు వైద్య ఖర్చులు, పిల్లల చదువులు ఇలా అన్నింటికీ శ్రీలక్ష్మి రెక్కల కష్టమే ఆధారం. ఆమె ఆత్మహత్యకు పాల్పడటంతో ఇప్పుడు ఆ కుటుంబం చుక్కాని లేని నావలా మారింది. శ్రీలక్ష్మి స్వస్థలం రాజమండ్రి. తండ్రి లేడు. తల్లి ఉన్నా ఆర్థిక స్థితి అంతంత మాత్రమే. వినోద్‌కు తల్లిదండ్రులు లేరు. బంధువులు పిల్లలను అక్కున చేర్చుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం వేద విద్యను అభ్యసిస్తున్న సుశీల్‌కు అతని ఖర్చులు, దుస్తులు, ఇతరత్రా వ్యవహారాలు చూడాల్సి ఉంది. నిన్నటివరకూ అమ్మ చేతి గోరు ముద్దలు తిన్న సాయినిఖిత తల్లిలేని జీవితాన్ని ఊహించడం కష్టమే. ఇప్పుడు ఆమె ఆలనాపాలనా ఎవరు చూస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇక వినోద్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. నిన్నటివరకు భోజనం, స్నానం, ఆస్పత్రికి తీసుకెళ్లడం.. ఇలా అన్నీ తానై చూసుకున్న భార్య అనంత లోకాలకు వెళ్లిపోవడంతో అతని పరిస్థితి దయనీయంగా తయారైంది.
తాను మరణించి భార్య బతికి ఉండాల్సిందని వినోద్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన జీవితం చివరి దశలో ఉందని తన పిల్లలను ఎవరైనా ముందుకొచ్చి ఆదుకోవాలని అతను వేడుకున్నాడు. కాగా, వీరి ఆర్థిక పరిస్థితి తెలుసుకుని పలువురు సాయం చేయడానికి ముందుకొచ్చారు. బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నాయకుడు ద్రోణంరాజు రవికుమార్ రూ. 5 వేలు, కొండపల్లి మాధవ్ రూ. 2 వేలు పిల్లలకు అందించారు. వీరికి సాయం చేయాలనుకునే దాతలు 9705347212 నంబర్‌లో సంప్రదించాలి.
అంత్యక్రియలకూ వెళ్లలేకపోయిన భర్త..
కళ్లెదుటే భార్య అగ్నికి ఆహుతవుతున్నా కాపాడలేని దయనీయ స్థితిలో ఉన్న వినోద్ మంగళవారం జరిగిన భార్య అంత్యక్రియలకు సైతం వెళ్లలేకపోవడం దురదృష్టకరం. గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం లక్ష్మి భౌతికకాయాన్ని బంధువులు నేరుగా అంబర్‌పేట శ్మశాన వాటికకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే వినోద్‌ను ఎవరూ శ్మశాన వాటికకు తీసుకెళ్లకపోవడంతో అతను కడసారి చూపునకు కూడా నోచుకోలేదు.