Kidneys
-
కిడ్నీలు జర భద్రం!
సాక్షి, హైదరాబాద్: మూత్రపిండాలు మానవ శరీరంలో చాలా కీలకమైన అవయవాలు. అవి సక్రమంగా పనిచేస్తేనే శరీరంలోని మిగతా అన్ని అవయవాలు సరిగ్గా ఉంటాయి. ఆరోగ్యంగా నాలుగు కాలాల పాటు జీవించగలడు. మూత్ర పిండాలు సరిగ్గా పనిచేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నట్టు తొలి దశలో అర్థం కాదు. ఎలాంటి లక్షణాలు కూడా బయటపడవు. దాదాపు 80 శాతంపైగా కిడ్నీలు పాడైన తర్వాతే చాలా మందికి అర్థం అవుతుంది. అప్పటికే జరగాల్సిన అనర్థం జరిగిపోతుంది. కొందరిలో కిడ్నీ సమస్యలు ఉన్నాయని తెలిసిన రెండు మూడు వారాలకే మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థాలను బయటకు వెళ్లిపోవు. దీంతో అవి కాస్తా విషపదార్థాలుగా మారి శరీరంలోని ఒక్కో అవయం దెబ్బతింటుంది. అలా ప్రాణాంతకంగా మారుతుంది. అందుకే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎంతో ముఖ్యం. వారికి అదొక్కటే మార్గం.. కిడ్నీ ఫెయిల్యూర్ రెండు రకాలుగా ఉంటుంది. కొందరికి తాత్కాలికంగా, మరికొందరు పూర్తిగా కిడ్నీలు పాడైపోతాయి. డీహైడ్రేషన్, పెయిన్ కిల్లర్స్ అతిగా వాడటం, ఇన్ఫెక్షన్లు, గుండెకు రక్త ప్రసరణ నిలిచిపోవడం తదితర కారణాల వల్ల కిడ్నీలు తాత్కాలికంగా పనిచేయవు. తాత్కాలిక కిడ్నీ ఫెయిల్యూర్‌కు కూడా డయాలసిస్ చేయాలి. అయితే శాశ్వత కిడ్నీ ఫెయిల్యూర్‌కు మాత్రం దీర్ఘకాలిక డయాలసిస్ ఒక్కటే మార్గం. డయాబెటిస్, బీపీ, ఆటోఇమ్యూన్ డిసీజ్, జన్యుపరమైన సమస్యల వల్ల మూత్రపిండాలు శాశ్వతంగా పాడవుతాయి. డయాలసిస్ అంటే ఏంటి? సాధారణంగా కిడ్నీలు రక్తంలోని వ్యర్థాలను వడపోస్తాయి. కిడ్నీలు 80 శాతం పాడయ్యే వరకు ఆ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. అప్పటివరకు ఎలాంటి లక్షణాలు బయటపడవు. అంతకుమించి పాడైతే మాత్రం కిడ్నీలు చేయాల్సిన పనులను చేయలేక మొరాయిస్తాయి. అలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. ఇలాంటి వారికి డయాలసిస్ ప్రక్రియ వరప్రదాయిని అని చెప్పొచ్చు. డయాలసిస్ ప్రక్రియలో కిడ్నీలు చేయాల్సిన పనిని మెషీన్ సాయంతో రక్తాన్ని వడపోసి వ్యర్థాలను తొలగిస్తారు. హీమోడయాలసిస్ ప్రక్రియను వారానికి మూడు సార్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ నాలుగు గంటల పాటు జరుగుతుంది. ఆలస్యమైతే ఏమవుతుంది? కిడ్నీలు పాడైన వారు నిరంతరం డయాలసిస్ చేయించుకోవాలి. డయాలసిస్ ఆలస్యమైతే రక్తంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి మిగతా అవయవాల్లో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. ఈ విషయంలో కాస్త అలసత్వం వహించినా.. సమస్య మరింత జఠిలం కావచ్చు. కొద్ది రోజులు ఆగి చేయించుకుందామని నిర్లక్ష్యం వహిస్తే ప్రాణానికే ప్రమాదం ఉంటుంది. మూత్రం సరిగ్గానే వస్తోందని, ఆరోగ్యం బాగానే ఉందని ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం జరుగుతుంది. మూత్రపిండాలు మందకొడిగా పనిచేస్తాయి. నీటిని వడగట్టలేకపోవడంలో విఫలమవుతాయి. విషపదార్థాలు రక్తంలోనే ఉండిపోతాయి. కొన్నిసార్లు నీరు ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. దీనివల్ల ‘పల్మనరీ ఎడిమా’ అనే సమస్య ఏర్పడుతుంది. దీంతో శ్వాస తీసుకోవడంతో ఇబ్బందులు, ఆయాసం వస్తుంది. సమయానికి డయాలసిస్ చేయించుకునేవారు ఎక్కువ కాలం జీవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఫిస్టులా చేయించుకోవాల్సిందే.. డయాలసిస్ కన్నా ముందు ఫిస్టులా అనే ప్రక్రియ తప్పనిసరి. ఈ పద్ధతిలో చేయి పైన ధమని, సిరాను ఫిస్టులా అనే లావు పాటి సూది(క్యాథటీర్) ద్వారా కలుపుతారు. డయాలసిస్ ప్రక్రియ చేసే సమయంలో ఫిస్టులా లేకపోవడం వల్లే చాలా వరకు రోగి ప్రాణాపాయ స్థితిలో వెళ్లి.. చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే డయాలసిస్ ముందు ఫిస్టులా వేయించుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్లు చెబుతున్నారు. నీరు తీసుకోకపోవడం వల్లే.. చాలావరకు కిడ్నీ సమస్యలు పరిశుభ్రమైన నీరు తీసుకోకపోవడం వల్ల వస్తుంటాయి. ముఖ్యంగా నీళ్లలో ఉండే పాదరసం, సీసం, ఫ్లోరిన్ వంటి లోహాలు కిడ్నీలను పాడు చేస్తాయి. పారిశ్రామిక వాడల్లో ఉండే వారు తరచూ కిడ్నీ పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలను గుర్తించవచ్చు. దీంతో సరైన సమయంలో చికిత్స తీసుకుని ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చు. సౌందర్య సాధనాల్లో ఉండే కెమికల్స్ కూడా కిడ్నీలు పాడయ్యేందుకు కారణం అవుతాయి.ఆహారం విషయంలో అపోహలొద్దు.. సాధారణంగా కిడ్నీ సమస్యలు ఉన్నప్పుడు మంచి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి అపోహలకు తావివ్వకుండా వైద్యులు సూచించిన మేరకు సరైన ఆహారం తీసుకోవాలి. అప్పుడే శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. సరైన ఆహారం లేకపోతే ఎముకలు, కండరాలు, రక్తనాళాలు, నరాలు బలహీనమై సమస్య మరింత జఠిలమవుతుంది. అది ప్రాణాపాయస్థితికి కూడా దారి తీయొచ్చు. డయాలసిస్ ప్రక్రియ ఇప్పుడు దాదాపు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉంది. ఎలాంటి భయం, అనుమానాలు, అపోహలు లేకుండా రెగ్యులర్‌గా డయాలసిస్ చేయించుకుంటే ప్రాణాపాయస్థితి నుంచి బయటపడొచ్చని మూత్రపిండాల నిపుణులు చెబుతున్నారు.డయాబెటిస్, హైబీపీ కూడా కారణమే.. డయాబెటిస్ వల్ల కూడా కిడ్నీలు పాడవుతున్నాయి. డయాబెటిస్ సోకిన తర్వాత సరైన శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల పదేళ్లలో కిడ్నీలు పాడవుతుంటాయి. 30– 40 ఏళ్ల వయసు వారు ఎక్కువగా ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక అధిక రక్తపోటు ఉన్న వారిలో కూడా కిడ్నీలు సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. బీపీ ఉన్న వారు కిడ్నీ సంబంధిత పరీక్షలు కచి్చతంగా చేయించుకోవాలి. పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్ వంశపారంపర్యంగా వస్తుంది. ప్రతి నలుగైదుగురిలో ఒకరిలో వస్తుంది. ఇంట్లో ఎవరికైనా ఇలాంటి సమస్య ఉంటే మిగిలిన వారు కూడా పరీక్షలు చేయించుకుంటే ముందుగానే సమస్యలు గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.పెయిన్ కిల్లర్స్ వల్ల.. చిన్న నొప్పి వచి్చనా ఇటీవల పెయిన్ కిల్లర్ మందులు వాడటం ఎక్కువైంది. అలాగే కడుపులో మంట తగ్గించే మందులు, యాంటీ బయాటిక్స్ వంటి మందులను ఎక్కువగా వాడటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. కిడ్నీల్లో రాళ్లు వస్తే సరైన చికిత్స తీసుకోకపోవడం, వాటిని తొలగించుకోకపోవడంతో ఇన్ఫెక్షన్లు పెరుగుతాయి. దీంతో కిడ్నీలు పాడైపోతాయి. 60 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ల వల్ల, పెయిన్ కిల్లర్ల, ఎసిడిటీ మందులు వాడకం వల్ల కిడ్నీలు చెడిపోతుంటాయి. కొందరిలో క్యాన్సర్ సోకిన వారిలో కూడా కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. మైలోమా, బోన్‌మ్యారో, ల్యుకేమియా కొన్ని రకాల క్యాన్సర్లు కిడ్నీ పరీక్షల ద్వారా కూడా తెలుస్తుంది.కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తాయి? చిన్నపిల్లల్లో కిడ్నీ సమస్యలు పుట్టుకతోనే వస్తున్నాయి. కడుపులో ఉండగానే స్కానింగ్‌ల ద్వారా ఈ విషయాలను గుర్తిస్తున్నారు. కిడ్నీలు సరిగ్గా ఎదగకపోవడం, మూత్ర నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం, ఫిల్టర్లు పాడైపోవడం వల్ల చిన్న వయసులోనే డయాలసిస్ అవసరం పడుతోంది. ఈ పరిస్థితి జన్యుపరమైన లోపాల వల్ల వస్తుంటుంది. ఈ సమస్యలు ఉన్న పిల్లలు వాడే మందుల వల్ల కూడా సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది. వీరి శరీరాల్లో రక్త నాళాలు సరిగ్గా అభివృద్ధి చెందకపోవడం వల్ల వారికి డయాలసిస్ ప్రక్రియ చేయడం కాస్త సంక్షిష్టంగా ఉంటుంది. యువతీ యువకుల్లో కిడ్నీలో రాళ్లు, అనవసరమైన మందులు వాడటం వల్ల కిడ్నీలు పాడవుతున్నాయి.అలసత్వం వద్దు.. డయాలసిస్ చేయించుకోవడంలో అస్సలు అలసత్వం వద్దు. వారానికి మూడుసార్లు కచి్చతంగా చేయించుకుంటే ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటారు. రేపు, మాపు అంటూ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం. కుటుంబంలో ఎవరికైనా కిడ్నీ సమస్యలు ఉంటే అందరూ పరీక్షలు చేయించుకోవడం మంచిది. దీంతో ప్రాథమిక దశలోనే చికిత్స తీసుకోవచ్చు. ముఖ్యంగా పారిశ్రామికవాడల్లో ఉండేవారు కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి. సౌందర్య సాధనాల వల్ల కూడా కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉంది. – శ్రీభూషణ్ రాజు, నెఫ్రాలజీ విభాగం అధిపతి, నిమ్స్ -
80 కోట్ల మంది కిడ్నీ రోగులు, రిస్కు తగ్గిస్తున్న సముద్ర చేపలు.. కీలక విషయాలు
చమురు చేపలుగా పిలిచే సముద్ర చేపల్ని ఆహారంగా తీసుకుంటే దీర్ఘకాలిక రోగాలు దరిచేరవని ఇప్పటికే శాస్త్రీయంగా రుజువైంది. క్రమం తప్పకుండా చేపలు తినేవారిలో క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం వంటి రోగాల బారినపడే ప్రమాదం తక్కువని తేలింది. కాగా, తీవ్రమైన కిడ్నీ రోగాల బారిన పడినవారు సముద్ర చేపల్ని తింటే 8 నుంచి 10 శాతం రిస్క్ తగ్గుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌కు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ ఈ విషయాన్ని వెల్లడించింది. సాక్షి, అమరావతి: ప్రపంచ జనాభాలో 10 శాతం (80 కోట్ల) మంది తీవ్రమైన మూత్రపిండాల వ్యాధుల (క్రానిక్ కిడ్నీ డిసీజెస్)తో బాధపడుతున్నారు. మూత్రపిండాల వైఫల్యం మనుషుల మరణానికి కూడా దారి తీస్తోంది. ఇలాంటి వారికి సముద్ర చేపలు రిస్క్ తగ్గిస్తున్నాయని తేలింది. సముద్ర చేపల్లో అధికంగా ఉండే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ మూత్రపిండాల సమస్యల నుంచి ఉపశమనం ఇస్తున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది. మొక్కల నుంచి వచ్చే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ కంటే సముద్ర చేపల్లో ఉండే యాసిడ్స్ ఎక్కువగా ప్రభావితం చూపిస్తున్నాయని ఆస్ట్రేలియాకు చెందిన జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనల్లో తేలింది. సముద్రంలో దొరికే కవ్వలు, కానాగంతలు (కన్నంగదాత), పొలస, మాగ వంటి వందకు పైగా చమురు చేపలు, సముద్రపు మంచి పీతలు తిన్న వారిపై జార్జ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ పరిశోధనలు జరిపింది. ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే సముద్ర చేపల్ని తినడం వల్ల మూత్రనాళాలు శుభ్రపడతాయని, వాటిలో పేరుకుపోయే రాళ్లు, కొవ్వు పదార్థాలు బయటకు పోతాయని గుర్తించారు. 12 దేశాలకు చెందిన 25 వేల మందికి పైగా కిడ్నీ రోగాల బాధితులపై జరిపిన 19 రకాల అధ్యయనాల ఫలితాలను వర్సిటీ వెల్లడించింది. కచ్చితంగా ఏ చేపలు ఎక్కువగా మూత్రపిండాల వ్యాధుల రిస్క్‌ను తగ్గిస్తున్నాయో చెప్పలేకపోయినప్పటికీ.. వాటిలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ రక్తం స్థాయిలను పెంచడంలో ప్రభావం చూపిస్తున్నాయని గుర్తించారు. వారానికి రెండుసార్లు తింటే.. తీవ్రమైన కిడ్నీ వ్యాధుల బారినపడిన 49 నుంచి 77 ఏళ్ల వయసు వారిపై ఈ పరిశోధనలు జరిపారు. శరీరం బరువు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్నవారితో పాటు శారీరక దైనందిన కార్యకలాపాలు, గుండె జబ్బులు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. అధిక మోతాదులో సముద్ర చేపలు తిన్న వారిపై వివిధ రూపాల్లో పరిశోధనలు జరిపారు. ఈ చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ప్రభావం మూత్రపిండాల వ్యాధుల తీవ్రతను 8నుంచి 10 శాతం వరకు తగ్గించిందని గుర్తించారు. వారానికి కనీసం రెండుసార్లు సముద్ర చేపలు తింటే రోజుకు 250 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువగా ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ సమకూరుతున్నట్టు తేల్చారు. అవి కిడ్నీ వ్యాధులు రాకుండా అడ్డుకట్ట వేస్తాయని.. ఒకవేళ కిడ్నీ వ్యాధులతో బాధపడుతుంటే రిస్క్ శాతం తగ్గుతోందని పరిశోధనల్లో వెల్లడైనట్టు శాస్త్రవేత్త డాక్టర్ మట్టిమార్క్ లుండ్ వెల్లడించారు. చమురు చేపలు/సముద్ర చేపలు ఆరోగ్యకరమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నట్టు ఇటీవల వర్సిటీ విడుదల చేసిన జర్నల్‌లో ఆయన పేర్కొన్నారు. -
నిద్ర సరిగ్గా పట్టట్లేదా? ఈ మినరల్ లోపిస్తే అంతే! నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడై!
Health Tips In Telugu: మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎ, బి, సి, డి, ఈ, కె, బీకాంప్లెక్స్, బీట్వెల్వ్(బీ12) వంటి విటమిన్లు ఏవిధంగా అవసరమో, అదేవిధంగా క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ కూడా అవసరం. మన శరీరం ఫిట్‌గా ఉండాలంటే మెగ్నీషియం దేహంలో అధికంగా ఉండాలి. కార్బోహైడ్రేట్స్, కొవ్వు, ప్రోటీన్స్ నుంచి మనకు శక్తి వచ్చేలా చేయడంలో మెగ్నీషియం కీలకపాత్ర పోషిస్తుంది. ఇది మంచి శక్తితోపాటు చక్కటి నిద్ర పట్టేలా చేస్తుంది. రక్తంలో చక్కెరలను, హార్మోన్లను క్రమబద్ధీకరిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు చేకూర్చే మెగ్నీషియం తగినంత లేకపోతే కలిగే అనర్థాలేమిటో తెలుసుకుందాం. మెగ్నీషియం లోపిస్తే ఈ అనారోగ్యాలు వస్తాయి..!! ►సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం దేహానికి అందిస్తాయి. ►ఇలా ఎక్కువసార్లు మెగ్నీషియం కోసం కిడ్నీలపై ఆధారపడితే అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అంతేకాకుండా కిడ్నీలు కూడా పాడవుతాయి. ►శరీరంలో తగినంత మెగ్నీషియం లేనప్పుడు మనకు కొన్ని సూచనలు వస్తాయి. వాటిని గమనిస్తే ముందుగానే ఈ లోపం గురించి తెలుసుకొని నివారించవచ్చు. లక్షణాలు..( Magnesium Deficiency Symptoms) ►మెగ్నీషియం లోపం ఉంటే ఆకలి వేయదు. ►వికారంగా ఉంటుంది. ►వాంతులు వస్తున్నట్లు అనిపిస్తుంది. ►నీరసంగా ఉంటారు. ► హార్ట్ బీట్‌రేట్ లో హెచ్చుతగ్గులు వస్తాయి. ► కళ్ళు మసక బారిన ఎక్కువగా ఉంటుంది. ►కండరాలలో నొప్పి వస్తుంది. ►ఒత్తిడి పెరుగుతుంది. ►నిద్ర సరిగ్గా పట్టదు. ►అధిక రక్తపోటు వస్తుంది. ►ఆస్తమాతో బాధపడేవారు మెగ్నీషియం లోపిస్తే ఈ సమస్య తీవ్రంగా మారుతుంది. మెగ్నీషియం ఉండే ఆహార పదార్థాలు..!! (Magnesium Rich Foods) ►ఆకుకూరలలోనూ, అవకాడో, అరటి పండ్లు, రాస్ బెర్రీస్, ఫిగ్స్ వంటి పండ్లలోనూ మెగ్నీషియం ఉంటుంది. ►అలాగే బ్రకోలీ, క్యాబేజి, పచ్చి బఠానీలు, మొలకలు వంటి వాటిలో కూడా ఇది దొరుకుతుంది. ►బ్రౌన్ రైస్, ఓట్స్, సీఫుడ్స్‌లో కూడా మెగ్నీషియం లభిస్తుంది. ►మెగ్నీషియం వెంటనే రావాలి అంటే ఒక కప్పు కాఫీ తాగాలి. ►డార్క్ చాక్లెట్ తిన్నా ఫలితం ఉంటుంది. ►మెగ్నీషియం లోపించినట్లు అనిపిస్తే వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్యానికి గురవుతారు. ►సబ్జా గింజలు, ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ఎక్కువైతే..? ►మెగ్నీషియం ఎక్కువైనా కూడా ఇబ్బందులు తప్పవు. ► కడుపునొప్పి, డయేరియా వచ్చే అవకాశం ఉంది. ►మెగ్నీషియం ఎంత అవసరమో అంతే ఉండేలా చూసుకోవాలి. లోపించినా ప్రమాదమే; ఎక్కువైనా ప్రమాదమే కాబట్టి సమంగా ఉండేలా చూసుకోవాలి. చదవండి: Vitamin D Deficiency: విటమిన్- డి.. ఆ హార్మోన్ ఉత్పత్తికి ఇది అవసరం! Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! -
ఈ రోజే బతుకుతాను.. ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు
భవిష్యత్తు గురించి ఆలోచించనివారుండరు. రాబోయే రోజులు, వచ్చే ఏడాది, ఇంకో పదేళ్లపాటు.. రేపటి ఆనందకర జీవనం కోసం ఆశపడుతూనే ఉంటారు. కానీ, హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లో ఉంటున్న ఐలా మమతను కలిస్తే ఈ రోజుకున్న విలువ ఏంటో తెలుస్తుంది. రెండు కిడ్నీలు చెడిపోయి, 22 ఏళ్లుగా డయాలసిస్ మీద ఆధారపడి జీవిస్తున్నారు మమత. కష్టాలను అధిగమిస్తూ సొంతంగా మ్యాగజీన్ నడుపుతూ, కిడ్నీ రోగులకు మానసిక స్థైర్యం ఇస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ‘మీ నవ్వు చాలా బాగుందండి’ అని పలకరిస్తే.. రేపటి నవ్వు కూడా ఈ రోజే నవ్వేస్తాను. ఈ రోజును ఆనందంగా బతకడానికి ప్రయత్నిస్తాను’ అన్నారు. ‘ఇన్నేళ్లు కష్టాలన్నీ ఒక్కోటి అధిగమిస్తూ వచ్చాను. కానీ, ఇప్పుడు డయాలసిస్ చేయించుకోవడానికి కూడా ఆర్థికంగా లేక.. ఈ రోజు బతికితే చాలు అనుకుంటున్నాను’ అంటూ నవ్వు వెనకాల దాచుకున్న ఒక్కో వాస్తవాన్ని ఇలా కళ్లకు కట్టారు మమత. ‘‘నన్ను చూసి ఎవరు పలకరించినా ముందు నవ్వేస్తాను. ‘ఇంతబాధలోనూ నవ్వుతూ ఉంటావు’ అంటారు. కష్టం మరింత పరీక్ష పెట్టడానికే వస్తుందేమో అనిపిస్తుంటుంది. 22 ఏళ్ల క్రితం బాబు పుట్టినప్పుడు డెలివరీ తర్వాత యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆ ఇన్ఫెక్షన్ పాకి, రెండు కిడ్నీలూ చెడిపోయాయి. దీంతో రెండు కిడ్నీలను తొలగించారు. అప్పటినుంచి డయాలసిస్ తప్పనిసరైంది. మా వారికి ఉద్యోగం లేదు. ఊళ్లో ఉన్న తన తల్లిదండ్రులని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇటు నా ఆరోగ్యపరిస్థితి ఏ మాత్రం బాగాలేదు. అమ్మ వెన్నుదన్నుగా ఉండటంతో బిడ్డ పెంపకం భారంగా అనిపించలేదు. రాత మార్చుకున్నాను.. ఆర్థికంగా ఏమీ లేదు. ఆరోగ్యమూ లేదు. నా స్థితిని అప్పటి కలెక్టర్‌కు చెప్పాను. నా మాటతీరు చూసి, పుస్తకాలు రాయమన్నాడు. అలా ‘భారతీయ సంస్కృతి’ పేరుతో మ్యాగజీన్ పెట్టుకొని, ప్రకటనలు తెచ్చుకొని నాకంటూ ఓ చిన్న లోకాన్ని ఏర్పరుచుకున్నాను. పత్రిక ద్వారా నలుగురికి సాయం చేయగలిగాను. వారంలో మూడు రోజులు డయాలసిస్. నెలకు సరిపడా చేతినిండా పని. ఈ సమయంలోనే నాలాంటి డయాలసిస్ పేషెంట్ల కోసం ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశాను. కిడ్నీ రోగులకు అవగాహన కార్యక్రమాల ఏర్పాటుతో పాటు, కౌన్సిలింగ్ ఇచ్చాను. ప్రభుత్వంతో పోరాడి, వేలాది మందికి ఉచిత డయాలసిస్ అవకాశం వచ్చేలా చేశాను. మారిన రాత.. కరోనా టైమ్‌లో శారీరకంగా చాలా దెబ్బతిన్నాను. అసలే డయాలసిస్ పేషెంట్‌ను. దీనికితోడు కరోనా సోకింది. మ్యాగజీన్ ఆగిపోయింది. ఎన్జీవోలోని సభ్యులు కరోనా బారినపడి చాలామంది చనిపోయారు. సపోర్ట్‌గా ఉందనుకున్న అమ్మ మరణం... మానసికంగా బాగా కుంగిపోయాను. దీంతో చాలా ఒంటరిగా అనిపించింది. దాని నుంచి కోలుకుంటానన్న నమ్మకం కూడా కొన్నిరోజులపాటు లేదు. మా అబ్బాయి ‘ఎంతోమందికి కౌన్సెలింగ్ ఇచ్చావు. నువ్వు ఇలా ఉంటే ఎలా..’ అని ధైర్యం ఇచ్చాడు. మా అబ్బాయి ఫిల్మ్‌మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇంకా వాడి జీవితం సెట్ అవ్వాల్సి ఉంది. ప్రాణం నిలబడాలంటే.. మ్యాగజీన్ నడిపించాలన్నా, చేపట్టిన ఆర్గనైజేషన్‌ను ముందుకుతీసుకువెళ్లాలన్నా మళ్లీ సున్నా నుంచి జీవితం మొదలుపెట్టాను. ఈ ఉగాదికి మ్యాగజీన్‌ను మళ్లీ ప్రారంభించాను. కానీ, ఆర్థిక లేమి కారణంగా నడపలేకపోతున్నాను. అంతకుముందున్న శక్తి ఇప్పుడు ఉండటం లేదు. హిమోగ్లోబిన్ సడెన్‌గా పడిపోతోంది. ఇన్నేళ్లుగా డయాలసిస్ వల్ల శరీరంలో అకస్మాత్తు గా మార్పులు వస్తుంటాయి. డయాలసిస్‌కు డబ్బుల్లేక ఎప్పుడు మానేస్తానో, ఈ ప్రాణం ఎప్పుడు పోతుందో.. తెలియదు. నా కొడుకు జీవితం ఏం అవుతుందో అని మనసులో ఆందోళనగా ఉంటుంది. ఎవరైనా సాయం అందిస్తే, ఇంకొంతమందికి నా పని ద్వారా సాయం అందించగలను’’ అని వివరించారు మమత. నిన్నటి వరకు రేపటి గురించిన ఆలోచన లేకున్నా గుండెధైర్యంతో నిలదొక్కుకున్న మమత నేటి జీవనం కోసం చిరునవ్వు వెనుక దాగున్న విషాదాన్ని పరిచయం చేశారు. సాయమందించే మనసులు ఆమె చిరునవ్వును కాపాడతాయని ఆశిద్దాం. – నిర్మలారెడ్డి -
Health Tips: నీటితో పోయేది రాయి దాకా వస్తే...
రీనల్ కాల్కులీ, నెఫ్రోలిథియాసిస్, యురోలిథియాసిస్... ఇవన్నీ మనం వాడుక భాషలో కిడ్నీ స్టోన్స్‌గా వ్యవహరించే వ్యాధుల వైద్యపరిభాష పదాలు. ఆహారంలో దేహానికి అందిన మినరల్స్, సాల్ట్స్ మూత్రం ద్వారా విసర్జితం కాకుండా ఒకచోట కేంద్రీకృతం కావడం ద్వారా ఏర్పడుతాయి. కాంపౌండ్స్‌ను బట్టి వీటిని కాల్షియం స్టోన్స్, స్ట్రక్టివ్ స్టోన్స్, యూరిక్ యాసిడ్స్టోన్స్, క్రిస్టైన్ స్టోన్స్‌గా వర్గీకరిస్తారు. ఎందుకు వస్తాయి? కొందరిలో ఫ్యామిలీ హెల్త్ హిస్టరీ కారణమవుతుంది. దేహం డీ హైడ్రేషన్‌కు గురికావడంతోపాటు ప్రోటీన్, సోడియం, షుగర్స్ మితిమీరి తీసుకోవడం స్వీయ తప్పిదాల వల్ల ఈ సమస్య వస్తుంది. కొన్ని రకాల ఆపరేషన్ల సైడ్ ఎఫెక్ట్‌గా కూడా కిడ్నీ రాళ్లు ఏర్పడుతుంటాయి. దేహం అధిక బరువు, కొన్ని రకాల అనారోగ్యాలు, ఆ అనారోగ్యం తగ్గడానికి తీసుకునే మందులు కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి పరోక్షంగా కారణమవుతుంటాయి. ఇలా ఇబ్బంది పెడతాయి కిడ్నీలో రాళ్లు మూత్రపిండాల నుంచి మూత్రాశయానికి మధ్యలో ఏదో ఒక చోట యూరినరీ ట్రాక్ట్‌ను ఇబ్బందికి గురిచేస్తుంటాయి. ఈ రాళ్లు సైజును బట్టి మూత్ర విసర్జన సమయంలో కొద్దిపాటి అసౌకర్యం నుంచి తీవ్రమైన నొప్పి కలిగిస్తుంటాయి. రాయి ఒరుసుకుపోవడంతో మూత్రవిసర్జన మార్గంలో గాయమవుతుంటుంది. మూత్రాశయం, మూత్రనాళాల్లో ఇన్ఫెక్షన్కు కారణమవుతుంటాయి. నాళం ద్వారా బయటకు రాలేనంత పెద్ద రాళ్లు ఆ మార్గంలో ఏదో ఒక చోట స్థిరపడిపోతాయి. నిజానికి కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వెంటనే వాటి లక్షణాలు బయటకు తెలియవు. కొంతకాలం పాటు అవి స్వేచ్ఛగా మూత్రాశయం, మూత్రనాళాల మధ్య సంచరిస్తుంటాయి. మూత్రనాళం సైజ్ కంటే చిన్నవిగా ఉన్న రాళ్లు మూత్రంతోపాటు బయటకు వెళ్లిపోతుంటాయి. అంతకంటే పెద్దవైన తర్వాత మాత్రమే లక్షణాలు బహిర్గతమవుతాయి. మూత్రనాళం వాపుకు లోనవడం, కండరాన్ని పట్టినట్లు నొప్పి రావడం తొలి లక్షణాలు. పక్కటెముకల కింద ఒక పక్క నుంచి వెనుక వైపుకు తీవ్రమైన నొప్పి, ఒక్కోసారి నొప్పి షాక్ కొట్టినట్లు ఉంటుంది. పొత్తి కడుపు కింద నుంచి పాకినట్లు నొప్పి నొప్పి తీవ్రత పెరుగుతూ – తగ్గుతూ అలలు అలలుగా రావడం మూత్ర విసర్జన చేసేటప్పుడు నొప్పి, మంట వీటితోపాటు మూత్రం రంగు మారడం (రక్తం కలిసినట్లు), దుర్వాసన, తరచూ విసర్జనకు వెళ్లాల్సి రావడం, విసర్జన తర్వాత కూడా వెళ్లాల్సిన అవసరం ఉన్నట్లు అనిపించడం, మూత్రాశయం నిండిపోయినట్లు అనిపిస్తున్నప్పటికీ కొద్దిమోతాదులో మాత్రమే విడుదల కావడం, తల తిరగడం– వాంతులు, ఇన్ఫెక్షన్ తీవ్రమై చలిజ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రాయిని బట్టి చికిత్స మూత్రం పలుచగా ఉన్నప్పుడు మినరల్స్, సాల్ట్స్ అన్నీ సులువుగా బయటకు వెళ్లిపోతాయి. కానీ మూత్రం చిక్కబడినప్పుడు ఇవి ఒక చోట కేంద్రీకృతమవుతుంటాయి. కాబట్టి దేహం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీటిని తీసుకోవడం ప్రధానమైన జాగ్రత్త. చికిత విషయానికి వస్తే... రాయి కాంపౌండ్స్, సైజ్‌ను బట్టి కరిగించడం, శస్త్ర చికిత్స చేసి తొలగించడంతోపాటు లేజర్ కిరణాల ద్వారా రాయిని పలుకులుగా చేయడం అనే నొప్పి లేని పద్ధతులు కూడా పాటిస్తారు. తక్షణ వైద్యం కిడ్నీలో రాళ్లు ఏర్పడినట్లు సందేహం కలిగిన వెంటనే డాక్టర్ని సంప్రదించి తీరాలి. ఎందుకంటే కొంతకాలం సొంత వైద్యం చేసుకుని వేచి చూసే పరిస్థితి కాదు. లక్షణాలు బయటపడేటప్పటికే వ్యాధి తక్షణ వైద్యం అందాల్సిన స్థితికి చేరి ఉంటుంది. ఆలస్యం చేస్తే ఎదురయ్యే పరిణామాలు ఇలా ఉంటాయి. ∙నొప్పి తీవ్రమవడంతోపాటు కనీసం కూర్చోలేకపోతారు. ఈ భంగిమలో కూర్చుంటే కొంచెం ఉపశమనంగా, సౌకర్యంగా ఉంది అనడం కూడా సాధ్యం కాని స్థితి ∙నొప్పితోపాటు చలిజ్వరం ∙మూత్రంలో రక్తం పడడం, మూత్ర విసర్జన కష్టం కావడంతోపాటు నొప్పి, తలతిరగడం, వాంతులు కావడం అన్నీ ఏకకాలంలో సంభవిస్తాయి. -
బీపీ షుగర్ ఉంటే క్రమం తప్పక పరీక్షలు చేయించాలి
నా వయస్సు 66 ఏళ్లు. నాకు గత పదిహేనేళ్లుగా షుగర్, బీపీతో బాధపడుతున్నాను. ఈమధ్య నా ముఖం బాగా ఉబ్బింది. పొట్ట నొప్పి కూడా వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే పరీక్షలు చేసి మూత్రపిండాల్లో సమస్య ఉందన్నారు. కిడ్నీలు ముప్ఫయి శాతం దెబ్బతిన్నాయని చెప్పారు. నష్టపోయిన దాన్ని మళ్లీ బాగు చేయలేమని కూడా చెప్పారు. నాకు వచ్చిన సమస్య ఏమిటి? నా మూత్రపిండాలు మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే నేనేం చేయాలి. షుగర్, బీపీ... ఈ రెండు సమస్యలు ఉన్నవారిలో చాలామందికి కొంతకాలం తర్వాత మూత్రపిండాలపై వాటి దుష్ప్రభావం పడి అవి దెబ్బతినడం చాలా సాధారణంగా కనిపిస్తుంది. అందువల్లనే బీపీ, షుగర్... ఈ రెండూ ఉన్నవారు ఏడాదికి ఒక్కసారైనా వాటికి సంబంధించిన పరీక్షలు చేయించుకొని చికిత్సలో తగు మార్పులు (అంటే... మందులు, వాటి మోతాదుల్లో మార్పులు) చేయించుకోవాల్సి ఉంటుంది. బహుశా మీరు ఈ పరీక్షలు తరచూ చేయించకపోవడం వల్లనో లేదా మీకు ఈ సమస్యల దుష్ప్రభావాల ఫలితాలపై అవగాహన లేకపోవడం వల్లనో ఇప్పటికే ముప్పయి శాతం డ్యామేజీ జరిగిపోయి ఉంవడచ్చు. ఇప్పుడు బాగా ఉన్న మిగతా 70 శాతం చెడిపోకుండా ఉండాలంటే మీరు మీ బీపీ, షుగర్లను ఎపుపడూ అదుపులో పెట్టుకోవడం అవసరం. అందుకోసం వైద్యులను తరచూ సంప్రదిస్తూ క్రమం తప్పకుండా పీరియాడికల్ చెక్–అప్ చేయించుకోవడం అవసరం. ఇలా రెగ్యులర్‌గా పరీక్షలు చేయించుకుంటే ఆరోగ్యాన్ని బాగా కాపాడుకుని మరింత నష్టం జరగకుండా చూసుకోవచ్చు. -
కాళ్ల వాపులు కనిపిస్తున్నాయా?
కొంతమంది పెద్దవయసువారు తమ కాళ్లపై కాస్తంత నొక్కుకుని పరిశీలనగా చూసుకుంటూ ఉంటారు. అలా నొక్కగానే కొద్దిగా గుంట పడ్డట్లుగా అయి... అది మళ్లీ క్రమంగా నెమ్మదిగా పూడుకుపోయి మామూలు స్థితికి వస్తుంది. ఇది చాలామందిలో కనిపించే సాధారణ సమస్య. చాలావరకు హానిలేనిదే అయినా కొన్నిసార్లు ఈ కాళ్లవాపు లోపల ఉన్న ప్రమాదకరమైన పరిస్థితికి ఒక సంకేతం కావచ్చు. రెండు కాళ్లలోనూ వాపు కనిపిస్తే అది మూత్రపిండాలు, కాలేయం, హార్ట్ ఫెయిల్యూర్ వంటి సమస్యలకు సూచన కావచ్చు. అదే ఒకే కాలిలో వాపు ఉంటే అది ఫైలేరియాసిస్లాంటి సమస్యకు సంకేతం కావచ్చు. కాళ్లవాపులపై అవగాహన పెంచుకునేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. కాళ్లలో నొక్కిన చోట గుంట పడి, అది మెల్లగా సర్దుకోడాన్ని సాధారణ పరిభాషలో ‘పిట్టింగ్’ అంటారు. ఇదే సమస్యను వైద్యపరిభాషలో ‘ఎడిమా’ అని చెబుతారు. సాధారణంగా పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్యకు అనేక కారణాలుంటాయి. మనమందరమూ సాధారణంగా ఈ తరహా కాళ్లవాపును మన జీవితంలోని ఏదో ఒక దశలో గమనించే ఉంటాం. అన్నిటికంటే సాధారణమైన దేమిటంటే చాలా దూరం కూర్చుని ప్రయాణం చేయడం వల్ల చాలామందిలో కాళ్లవాపు వస్తుంటుంది. ఇది నిరపాయకరం. కాసేపట్లో తగ్గిపోతుంది. కానీ కొన్ని సమస్యలు అంత సింపుల్‌గా ఉండవు. ఈ సమస్యకు గల కారణాలేమిటో చూద్దాం. నిర్ధారణ పరీక్షలు ►సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) ►యూరిన్ స్పాట్ ప్రోటీన్ / కియాటినిన్ రేషియో ►బ్లడ్ యూరియా క్రియాటినిన్ లివర్ ఫంక్షన్ పరీక్ష 2–డీ ఎకో కార్డియోగ్రామ్ టీ3, టీ4, టీఎస్‌హెచ్ ►అల్ట్రా సౌండ్ హోల్ అబ్డామిన్ ►వీనస్ డాప్లర్ ఆఫ్ ద లెగ్స్ ►నైట్ స్మియర్ ఫర్ మైక్రోఫైలేరియా లాంటి పరీక్షలతో పాటు, డీడైమర్ అనే పరీక్షను కాళ్ల వాపులు ఉన్నవారిలో చేయించాల్సి ఉంటుంది. చికిత్స రెండు కాళ్లూ వాచినప్పుడు... సాధారణంగా కాళ్ల వాపు వచ్చిన అన్ని సందర్భాల్లోనూ ఒకేలాంటి నిర్దిష్టమైన చికిత్స ఉండదు. కారణాన్ని బట్టి చికిత్స మారుతుంది. అందుకే ముందుగా పరీక్షలు చేయించి కాళ్ల వాపుకు కారణాన్ని కనుగొనాల్సి ఉంటుంది. ►మూత్రపిండాల సమస్యలో: ఇమ్యునోసప్రెసెంట్స్, డైయూరెటిక్స్ వంటి మందులు. ►కాలేయ సమస్య అయితే : స్పైరనోలాప్టోన్ అనే మందులు. ►గుండెకు సంబంధించిన సమస్యలో : అయనోట్రోపిక్స్, డైయూరెటిక్స్ వంటి మందులు వాడాల్సి ఉంటుంది. ►హైపోథైరాయిడిజమ్‌లో : థైరాక్సిన్ అనే హార్మోన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకే కాలి వాపునకు చికిత్స ►ఫైలేరియాసిస్‌లో: డై ఇథైల్ కార్బోమైసిన్ను సాధారణంగా ఉపయోగిస్తారు. ►వేరికోస్ వెయిన్స్ : నిర్దిష్టంగా మందులు ఉండవు. అయితే కాళ్లకు తొడిగే తొడుగు (స్టాకింగ్స్) వల్ల ఈ సమస్యను నియంత్రణలో ఉంచవచ్చు. అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స చేయించాల్సి రావచ్చు. ►వీనస్ ఇన్సఫిషియెన్సీ : ఈ సమస్యకు కూడా నిర్దిష్టంగా చికిత్స ఉండదు. అయితే ప్రత్యేకమైన ఎలాస్టిక్ తొడుగుల ద్వారా కాళ్ల వాపును అదుపు చేయవచ్చు. ఒకవేళ కాళ్ల వాపు మరీ ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ►సెల్యులైటిస్ : ఈ సమస్య వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని రకాల కాళ్ల వాపుల విషయంలో ఈ సాధారణ జాగ్రత్తలు తీసుకోవాలి. 1. ఆహారంలో ఉప్పు తగ్గించాలి. 2. చాలాసేపు అదేపనిగా కూర్చోవడం, నిలబడటం తగ్గించాలి. 3. రాత్రివేళల్లో కాళ్లను ఎత్తుగా తలగడపై విశ్రాంతిగా ఉంచాలి. 4.అవసరాన్ని బట్టి ఎలాస్టిక్ స్టాకింగ్స్ వాడాలి. ఈ అవగాహన కల్పించుకుని కాళ్లవాపు తరచూ వస్తుంటే వైద్యుణ్ణి సంప్రదించి తగిన చికిత్స చేయించుకోవాల్సి ఉంటుంది. తెలుసుకోవాల్సిన కారణాలివే ►రెండు కాళ్లకూ నీరొస్తుంటే... ఈ కింది సమస్యలు ఉండే అవకాశం ఉంది. ►గుండె సమస్యలు : హార్ట్ ఫెయిల్యూర్ వంటి గుండెకు సంబంధించిన సమస్యలున్నప్పుడు ఇలా కాళ్లపై నీరు రావడం చాలా మామూలే. ►కాలేయ సమస్యలు : సిర్రోసిస్ ఆఫ్ లివర్ వంటి కాలేయ సమస్య ఉన్నప్పుడు ►కిడ్నీ సమస్యలు : నెఫ్రోటిక్ సిండ్రోమ్, గ్లామరూలో నెఫ్రైటిస్ వంటి మూత్రపిండాల వ్యాధులు ఉన్నవారిలో ►హైపోథైరాయిడిజం : మహిళల్లో సాధారణంగా కనిపించే ఈ సమస్యలో కాళ్ల వాపు అనేది నీరుపట్టడం వల్ల జరగదు. కానీ... ‘ప్రీటిబియల్ మిక్స్ ఎడిమా’ అనే తరహా కాళ్లవాపు కనిపిస్తుంది. ఇది గ్రేవ్స్ డిసీజ్ అనే థైరాయిడ్ సమస్యలో కనిపిస్తుంది. ►పోషకాహార లోపాలు : ఆహారంలో తగినంతగా ప్రోటీన్లు తీసుకోకపోవడం (హైపో ప్రోటీనీమియా), బెరిబెరీ వంటి పోషకాహార లోపాలు ఉండటం ►కొన్ని రకాల మందుల వల్ల : కొన్ని రకాల హైబీపీ మందుల వల్ల (క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్స్), డయాబెటిస్‌కు వాడే మందులు (పయోగ్లిటజోన్స్), నివారణ మందులు (పెయిన్ కిల్లర్స్ ఎన్ఎస్ఏఐడీస్) వాడే వారిలోనూ, స్టెరాయిడ్స్ (గ్లూకో కార్టికాయిడ్స్), అసిడిటీకి వాడే మందుల (ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్)... వల్ల కాళ్లవాపు కనిపించవచ్చు. ►ఎలాంటి కారణాలు లేకుండా : కొంతమందిలో నిర్దిష్టంగా ఎలాంటి కారణం లేకుండానే కాళ్లవాపులు రావచ్చు. ముఖ్యంగా పిల్లలను కనే వయసులోని మహిళల్లో ఇది కనిపించడం చాలా సాధారణం. దీన్ని ఇడియోపాథిక్ సైక్లిక్ అడిమా అంటారు. ఒకే కాలిలో వాపు వస్తుంటే... 1 ఫైలేరియాసిస్: క్యూలెక్స్ దోమకాటు వల్ల వచ్చే వాపు. 2 వేరికోస్ వెయిన్స్ : కాళ్లపై ఉండే రక్తనాళాల్లోని (సిరలు) కవాటాలు పనిచేయకపోవడం వల్ల నరాలు ఉబ్బినట్లుగా కనిపిస్తాయి. ఇలాంటప్పుడు కూడా ఏదో ఓ కాలిపై వాపు రావచ్చు. 3 డీప్ వెయిన్ థ్రాంబోసిస్ : రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ సమస్య వస్తుంది. 4 వీనస్ ఇన్సఫిషియెన్సీ : కాళ్లలోని రక్తనాళాల్లో రక్తం... తాను పయనించాల్సిన మార్గంలో ప్రయాణం చేయకపోవడం వల్ల వచ్చే సమస్య ఇది. 5 సెల్యులైటిస్ : కాళ్ల చర్మంలోని డెర్మల్, సబ్‌క్యుటేనియస్ అనే పొరలలో ఉండే కనెక్టివ్ టిష్యూలో సమస్యల వల్ల ఈ వాపు వస్తుంది. ఇతర సమస్యల కారణంగా... ►పోషకాహార లోపాల్లో : ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ►ఏదైనా మందుల వల్ల కాళ్ల వాపు వస్తే... పేషెంట్ వాడుతున్న నొప్పినివారణ మందులు, హైబీపీ మందులు, స్టెరాయిడ్స్ నిలిపివేసి, వాటికి బదులుగా ఇతర మందులు మార్చాలివస్తుంది. ►ఏ కారణం లేకుండా వచ్చే వాపు : ఇది ఏ కారణం లేకుండా వచ్చే ఇడియోపథిక్ సైక్లిక్ ఎడిమా అయితే ఎలాంటి మందులు వాడనవసరం లేదు. దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ అప్పటికీ తగ్గకపోతే కొద్ది రోజుల పాటు (షార్ట్ కోర్స్) డైయూరెటిక్స్ వాడవచ్చు. ►ప్రయాణంలో వచ్చే వాపులు... వీటికి ఎలాంటి మందులు వాడాల్సిన అవసరం లేదు. కాస్త ఎత్తుగా ఉండేలా తలగడపై కాళ్లు పెట్టుకోవడంతో కాళ్ల వాపు తగ్గుతుంది. అరికాళ్లను ప్రతి అరగంటకోసారి గుండ్రంగా తిప్పుతున్నట్లుగా (రొటేటింగ్ మోషన్లో) చేయాలి. ప్రయాణంలో ఉన్నప్పటికీ ప్రతి గంటకోసారి కాస్తంత లేచి అటు ఇటు నడవాలి. బస్‌లోనో లేదా రైల్లోనో ఉన్నప్పటికీ ఈ పని చేయాలి. ఫ్లైట్స్‌లో యూఎస్ వంటి దూరప్రాంతాలకు వెళ్లేవారిలో ఇది మరీ ముఖ్యం. ఇలా తప్పక నడవాల్సిందేనంటూ డాక్టర్లు సిఫార్సు చేస్తుంటారు. డాక్టర్ టి.ఎన్.జె. రాజేశ్, సీనియర్ కన్సల్టెంట్ ఫిజీషియన్ ఇంటర్నల్ మెడిసిన్ – ఇన్ఫెక్షియస్ డిసీజెస్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
హైబీపీ వల్ల ముప్పేమిటి?
నా వయసు 52 ఏళ్లు. ఇంతవరకు ఎప్పుడూ బీపీ చూసుకోలేదు. కానీ ఇటీవల చూసుకున్నప్పుడు నా బీపీ 150 / 98 ఉంది. దాంతో డాక్టర్‌గారు కనీసం నాలుగైదు బీపీ సార్లు చూసుకొని, రీడింగ్స్ నోట్ చేసుకొని వారం తర్వాత రమన్నారు. అంతకుముందు ఎలాంటి ఆలోచనా లేదు కానీ... ఆ మాట చెప్పినప్పటి నుంచి నాకెందుకో ఆందోళనగా ఉంది. బీపీ పెరిగితే వచ్చే సమస్యలపై అవగాహన కలిగేలా నాకు సమగ్రంగా వివరించండి. ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న రక్తపోటు కండిషన్ విపరీతంగా పెరుగుతోంది. రక్తపోటు పెరగడానికి కారణాలు చాలావరకు నిర్దిష్టంగా తెలియవు. ఇలా కారణం తెలియని బీపీని ‘ఇడిపోపథిక్ హైపర్‌టెన్షన్’ అంటారు. కుటుంబ ఆరోగ్య చరిత్ర, శారీరక శ్రమ తక్కువగా ఉండే కూర్చుని చేసే వృత్తుల్లో ఉండటం, రోజురోజుకూ పెరుగుతున్న ఒత్తిడి, ఊబకాయం వంటి అంశాలు దీనికి కారణమని ఊహిస్తున్నారు. రక్తపోటు వచ్చినవారిలోలో దాదాపు 90 శాతం ఇడియోపథిక్ హైపర్‌టెన్షన్ కేసులే ఉంటాయి. అయితే మిగతా 10 శాతం మందిలో రక్తపోటు పెరగడానికి నిర్దిష్టంగా కారణం ఉంటుంది. ఇలా కారణం తెలిసిన రక్తపోటును సెకండరీ హైపర్‌టెన్షన్ అంటారు. కారణం తెలియకుండా వచ్చే ఇడియోపథిక్ హైపర్టెన్షన్స్ కంటే నిర్దిష్ట కారణంతో వచ్చే సెకండరీ హైపర్టెన్షన్లతో చాలా ప్రమాదం. ఇలాంటి సెకండరీ హైపర్టెన్షన్లతో వచ్చే రక్తపోటును అదుపులో పెట్టేందుకు చాలాసార్లు మూడు నుంచి నాలుగు రకాల మందులు వాడాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఏడు నుంచి ఎనిమిది రకాలు కూడా వాడాల్సి రావచ్చు. సాధారణ ఇడియోపథిక్ రక్తపోటుతో మూత్రపిండాలు దెబ్బతినే పరిస్థితి కాస్తంత అరుదుగా వస్తుంది. కానీ సెకండరీ హైపర్‌టెన్షన్ ఉన్నవారిలో మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. రక్తపోటు ఉన్నట్లు అనుమానించేవారు చేయించుకోవాల్సిన సాధారణ పరీక్షలు ►పూర్తిస్థాయి మూత్ర పరీక్ష ( కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్) ►రక్తంలో పొటాషియమ్ స్థాయి ►బ్లడ్ యూరియా అండ్ క్రియాటిన్ లెవెల్స్ ►ఈసీజీ ►కిడ్నీ సైజ్‌ను తెలుసుకునేందుకు అల్ట్రాసౌండ్ స్కాన్ ఆఫ్ అబ్డామిన్ పరీక్ష ►రక్తంలో చక్కెర పాళ్లు తెలుసుకునే రాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పరీక్ష మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అత్యధిక రక్తపోటు వల్ల మూత్రపిండాలకు ఏదైనా ప్రమాదం జరిగిందేమో తెలుసుకోడానికి మరికొన్ని ప్రత్యేక పరీక్షలు అవసరం. అవి... ►24 గంటలలో మూత్రంలో పోయే ప్రోటీన్లు, క్రియాటిన్ పాళ్లు తెలుసుకునే పరీక్ష. (మూత్రంలో పోయే ప్రోటీన్ల సంఖ్యను ఇటీవల కేవలం ఒక శాంపుల్తోనే తెలుసుకునే పరీక్షలు అందుబాటులోకి వచ్చాయి) ►కిడ్నీ బయాప్సీ ►మూత్రపిండాల్లోని రక్తనాళాల పరిస్థితిని తెలుసుకునేందుకు డాప్లర్ అల్ట్రాసౌండ్ స్కాన్ ►బ్లడ్ గ్యాస్ అనాలిసిస్ ►రీనల్ యాంజియోగ్రామ్ కొన్ని ప్రత్యేక పరీక్షలు ఎవరికి అవసరం ►కుటుంబ చరిత్రలో రక్తపోటు వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్న వారికి.. ►డయాబెటిస్ పేషెంట్లు అందరిలో.. ►కాళ్లలో, పాదాల్లో వాపు వస్తున్నవారిలో .. ►రక్తపోటు అదుపు చేయడానికి రోజూ రెండు కంటే ఎక్కువ మందులు ఉపయోగిస్తున్నవారు ►ముప్ఫయి ఏళ్ల వయసు రాకముందే రక్తపోటు వచ్చిన వారికి, రక్తపోటు కనుగొని ఐదేళ్లు దాటిన వారికి.. ►తీవ్రమైన తలనొప్పి వస్తున్నవారు, రక్తపోటు పెరగడం వల్ల గుండెదడ, శ్వాస తీసుకోవడం లో ఇబ్బందిపడే వారికి.. రక్తపోటు వల్ల వచ్చే అనర్థాలు: ►గుండెపోటు రావడం, గుండె ఫెయిల్యూర్ ►కిడ్నీ దెబ్బతినడం ►పక్షవాతం ►జీవన వ్యవధి (లైఫ్ స్పాన్) తగ్గడం ►కిడ్నీ దెబ్బతింటే డయాలసిస్ వంటివి చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియలు కావడం పై అంశాలను అన్నింటినీ దృష్టిలో ఉంచుకుని రక్తపోటు ఉన్నవారు తమ హైబీపీని అదుపులో ఉంచుకుని ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ఎంతో మేలు. రక్తపోటును నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ఒత్తిడిని తగ్గించుకోవాలి. ►తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ►ఆహారంలో ఉప్పు పాళ్లను తగ్గించాలి. ►ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారం... పచ్చళ్లు, అప్పడాల వంటి వాటికి దూరంగా ఉండాలి. ►డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మాత్రలనూ (ఓవర్ ద కౌంటర్ తీసుకుని) ఉపయోగించకూడదు. ►రక్తపోటు ఉన్నప్పుడు దాన్ని ఎప్పుడూ 130 / 80 ఉండేలా క్రమం తప్పకుండా జాగ్రత్త తీసుకోవాలి. నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్లా? నా వయసు 45 ఏళ్లు. నాకు తరచూ తలనొప్పిగా ఉండటంతో పాటు ఇటీవల బాగా తలతిరుగుతున్నట్లుగా ఉంది. ఒక్కోసారి ముందుకు పడిపోతానేమో అన్నంత ఆందోళనగా ఉంటోంది. నా లక్షణాలు చూసిన కొంతమంది మిత్రులు నీకు ’హైబీపీ ఉందేమో, ఒకసారి డాక్టర్‌కు చూపించుకో’ అంటున్నారు. వారు చెబుతున్నదాన్ని బట్టి నాకు మరింత ఆందోళన పెరుగుతోంది. దాంతో బీపీ లేకపోయినా హైబీపీ ఉన్నట్లుగా చూపిస్తుందేమో అని భయంగానూ ఉంది. ఇంతకూ నాకు హైబీపీ ఉన్నట్లా లేనట్టా? హైబీపీని కేవలం మీరు చెప్పిన లక్షణాలతోనే నిర్ధారణ చేయడం సాధ్యం కాదు. మనలో రక్తపోటు పెరగడం వల్ల ఎండ్ ఆర్గాన్స్‌లో ముఖ్యమైనదైన మెదడులోని రక్తనాళాల చివరల్లో రక్తం ఒత్తిడి పెరగడం వల్ల తలనొప్పి రావచ్చు. అలాగే మన భంగిమ (పోష్చర్)ను అకస్మాత్తుగా మార్చడం వల్ల ఒకేసారి మనలో రక్తపోటు తగ్గవచ్చు. దీన్ని ఆర్థోస్టాటిక్ హైపోటెన్షన్ అంటారు. అలాంటి సమయాల్లోనూ మీరు చెప్పినట్లుగా ముందుకు పడిపోతారేమో లాంటి ఫీలింగ్, గిడ్డీనెస్ కలగవచ్చు. బీపీలో మార్పులు చోటు చేసుకోవడం వల్ల మీరు చెప్పిన లక్షణాలు కనిపించినప్పటికీ, అవి బీవీ వల్లనే అని కూడా నిర్దిష్టంగా చెప్పలేం. సాధారణంగా బీపీ వల్ల ఉదయం వేళల్లో తలనొప్పి కనిపించనప్పటికీ, మరెన్నో ఆరోగ్య సమస్యలలోనూ తలనొప్పి ఒక లక్షణంగా ఉంటుంది. అలాగే మీరు చెప్పిన గిడ్డీనెస్ సమస్యకూ వర్టిగో, సింకోప్ లాంటి మరెన్నో సమస్యలు కారణం కావచ్చు. అందుకని కేవలం లక్షణాల ఆధారంగానే బీపీ నిర్ధారణ చేయడం సరికాదు. అందుకే మీరు నిర్భయంగా ఒకసారి డాక్టర్‌ను కలవండి. వారు కూడా కేవలం ఒక్క పరీక్షలోనే హైబీపీ నిర్ధారణ చేయరు. అనేక మార్లు, అనేక సందర్భాల్లో బీపీని కొలిచి, ఒకవేళ నిజంగానే సమస్య ఉంటే అప్పుడు మాత్రమే దాన్ని కచ్చితంగా నిర్ధారణ చేసి, దానికి తగిన చికిత్స సూచిస్తారు. మీరు ఆందోళన పడకుండా వెంటనే డాక్టర్‌ను కలవండి. డా. నవోదయ కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
బతికించండి!
హిమాయత్‌నగర్: రెండు కిడ్నీలు పూర్తిగా పాడయ్యాయి. దీంతో భర్త వదిలేశాడు. డయాలసిస్ చేయించుకునేందుకు చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ‘పెర్మ్‌క్యాత్’ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇది చేయని పక్షంలో డయాలసిస్ చేయడం కష్టమవుతుంది. డయాలసిస్ చేయకపోతే మనిషి బతికే చాన్స్ లేదంటూ వైద్యులు తెలిపారు. ఇదీ కేతావత్ కస్తూరి నాయక్ దీనగాథ. ఈ సమయంలో ఆమె దాతల కోసం ఎదురుచూస్తోంది. ఆదుకోవాలని అభ్యర్థిస్తోంది. బాలానగర్‌కు చెందిన కేతావత్ కస్తూరి నాయక్(37)కు రెండేళ్ల క్రితం కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయి. అప్పటికే కస్తూరికి ఇద్దరు పిల్లలు కూడా ఉండగా... భర్త వదిలేసి వెళ్లిపోయాడు. పుట్టింటికి వెళ్దామంటే.. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ‘వెల్ఫేర్ అసోసియేషన్ ఫర్ కిడ్నీ పేరెంట్స్’ ఫౌండర్, ప్రెసిడెంట్ ఐ.మమతను ఆమె ఆశ్రయించింది. కస్తూరిని వెస్ట్‌మారేడ్‌పల్లిలోని ఓ హాస్టల్లో ఉంచి ప్రతి నెలా వీరే డబ్బులు చెల్లిస్తున్నారు. అలాగే రెండేళ్లుగా అసోసియేషన్ ద్వారా డయాలసిస్ చేయిస్తున్నారు. రూ.2 లక్షలు అవసరం.. కస్తూరి నాయక్ శరీరంలో ‘ఫిస్టుల’ ఫెయిలైంది. దీంతో ఇప్పుడు ‘వాస్కులర్ సర్జన్’ ద్వారా ‘పెర్మ్‌క్యాత్’ చేయాల్సి ఉంది. దీనికి గాను రూ.లక్ష పైన అవసరం. ఈ చికిత్స చేసిన తర్వాత మందుల కోసం, తాను ఉండేందుకు గాను మొత్తం రూ.2లక్షల వరకు అవసరం కానుంది. దాతలు స్పందించి తనకు సాయం చేస్తే అందరిలాగే తన పిల్లలతో ఆనందంగా ఉంటానంటోంది కస్తూరి నాయక్. దాతలు సాయం చేయాలనుకుంటే.. బ్యాంకు వివరాలు పేరు: కేతావత్ కస్తూరి నాయక్ అకౌంట్ నంబర్: 0670101029026 బ్యాంకు: కెనరా బ్యాంక్ బ్రాంచి: ఉప్పల్ బ్రాంచ్ ఐఎఫ్‌సీ కోడ్: సీఎన్ఆర్బీ0000670 ఫోన్: 95055 90393,79950 56739, 94402 18174 -
కృత్రిమ కిడ్నీ వచ్చేస్తోంది!
మీరు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? తరచూ డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తోందా? కిడ్నీ మార్పిడికి దాత కోసం ఎదురు చూస్తున్నారా? నరకప్రాయం అనిపించే డయాలసిస్ వద్దని అనుకుంటున్నారా? మీ సమస్యలన్నీ తీరే రోజు ఎంతో దూరం లేదంటున్నారు యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా శాస్త్రవేత్త షువో రాయ్. ఎందుకంటారా?.... ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా మూత్రపిండాల మాదిరిగానే పని చేసే కృత్రిమ కిడ్నీ సిద్ధమైంది కాబట్టి!! అక్షరాలా 2.20 లక్షలు... దేశంలో ఏటా కిడ్నీ సమస్యలతో డయాలసిస్ అవసరమవుతున్న వారి సంఖ్య ఇది. ఈ సంఖ్య పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా వైద్య సదుపాయాలు మాత్రం పెరగట్లేదు. కిడ్నీ దాతలూ తక్కువగా ఉండటంతో కిడ్నీ మార్పిడి చుట్టూ నేరాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. ఉన్న సెంటర్ల లోనే గంటలకొద్దీ నానా అవస్థలు పడుతూ డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు ఎట్టకేలకు శుభవార్త. షువో రాయ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం కృత్రిమ కిడ్నీ తయారీలో విజయం సాధించడమే కాదు.. మరో రెండేళ్లలో అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. డయాలసిస్‌తో సమస్యలెన్నో... మధుమేహం, అధిక రక్తపోటు వంటి సమస్యల కారణంగా శరీరంలోని రక్తాన్ని శుద్ధి చేసే మూత్రపిండాల పనితీరు మందగిస్తుంది. సకాలంలో తగిన చికిత్స తీసుకోకపోతే పనిచేయడమూ మానేస్తాయి. ఇది కాస్తా మరణానికి దారితీస్తుంది. మూత్రపిండాలు కొంతవరకే పనిచేస్తున్న పరిస్థితుల్లో ఓ భారీ యంత్రం సాయంతో రక్తాన్ని అప్పుడప్పుడూ శుద్ధి చేసి మళ్లీ ఎక్కిస్తూంటారు. డయాలసిస్ అని పిలిచే ఈ చికిత్స ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటుంది. కొంత మందికి వారానికి ఒకసారి డయాలసిస్ అవసరమైతే ఇతరులకు నెల, రెండు నెలలకు ఒకసారి సరిపోతుంది. ఇదంతా కొంత ఖరీ దైన వ్యవహారమే. అదే సమయంలో సమస్యలను పూర్తిగా తగ్గించదు కూడా. శుద్ధి చేసే క్రమంలో శరీరానికి అవసరమైన కొన్ని పదార్థాలూ నష్టపోవాల్సి ఉంటుంది. ప్లాస్టిక్‌లాంటి పదార్థాలతో తయారైన ఫిల్టర్ల వాడకం దీనికి కారణం. మూత్రపిండాల్లో సహజసిద్ధంగా ఉండే నెఫ్రాన్లు ఏడు నానోమీటర్ల సైజులో ఉంటే ప్లాస్టిక్ ఫిల్టర్‌లోని రంధ్రాలు ఇంతకంటే ఎక్కువ సైజులో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక మంది మధుమేహ రోగులున్న భారత్‌లో ఈ సమస్య పెరుగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా చీమకుర్తితోపాటు శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానంలో అత్యధిక కిడ్నీ రోగులు ఉండటం తెలిసిందే. ఏపీ సీఎం వై.ఎస్. జగన్ ప్రభుత్వం డయాలసిస్ రోగులకు ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా డయాలసిస్ జరిగేలా ఏర్పాట్లు చేయాలని సంకల్పించినా అవన్నీ సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన చర్యలే. ఈ నేపథ్యంలోనే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకు చెందిన షువో రాయ్ పరిశోధన అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎలా పనిచేస్తుంది? శరీరంలో ఏదైనా కొత్త అవయవం చేరితే రోగ నిరోధక వ్యవస్థ వెంటనే దాన్ని నిరోధించే ప్రయత్నం చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. కానీ షువోరాయ్ తయారు చేసిన కృత్రిమ కిడ్నీతో మాత్రం ఈ సమస్య రాదు. ఎందుకంటే ఇందులో రోగి కణాలనే వాడతారు. స్థూలంగా ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకదాంట్లో నానోస్థాయి రంధ్రాలున్న ఫిల్టర్లు ఒక కట్టలా ఉంటాయి. సిలికాన్‌తో తయారైన ఈ ఫిల్టర్లు రక్తం ప్రవహించే వేగాన్ని ఉపయోగించుకొని రక్తంలోని విషపదార్థాలు, చక్కెరలు, లవణాలను తొలగిస్తాయి. ఫిల్టర్‌లోని రంధ్రాలు కచ్చితమైన సైజు, ఆకారంలో ఉండటం వల్ల రక్త కణాలపై ఒత్తిడి తగ్గుతుంది. లేదంటే రక్తం గడ్డకట్టి రోగికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక రెండో భాగంలో బయో రియాక్టర్ ఉంటుంది. ఇందులో మూత్రపిండాల కణాలే ఉంటాయి. శుద్ధి చేసిన రక్తంలో తగుమోతాదులో నీళ్లు, అవసరమైన లవణాలు, చక్కెరలు ఉండేందుకు బయో రియాక్టర్‌లోని మూత్రపిండ కణాలు ఉపయోగపడతాయి. ఫిల్టర్ల ద్వారా శుద్ధి అయిన రక్తాన్ని పరిశీలించి.. ఏయే పదార్థాలు ఎంత మోతాదులో ఉన్నాయో గుర్తించడం నియంత్రణకు అవసరమైన పనులు చేసేందుకు ఒక మైక్రో కంట్రోలర్‌ను వాడతారు. గతేడాది షువో రాయ్ బృందం సిద్ధం చేసిన కృత్రిమ కిడ్నీ పరికరం నిమిషానికి లీటర్ రక్తాన్ని శుద్ధి చేయగలదని పరీక్షల్లో తేలింది. ఈ పరికరంలో వాడే బయో రియాక్టర్లను 1999 నుంచి జంతువుల్లో విజయవంతంగా పరీక్షిస్తున్నారు. ఎలా అమరుస్తారు షువో రాయ్ అభివృద్ధి చేసిన కృత్రిమ కిడ్నీ సైజు చాలా చిన్నది. ముందుగా ఫిల్టర్లు ఉన్న భాగాన్ని కడుపు భాగంలో చిన్న గాటు పెట్టి మూత్రనాళాలకు కలుపుతారు. రక్తం గడ్డ కట్టే ప్రమాదాన్ని నివారించేందుకు నెలరోజులపాటు పరిశీలిస్తారు. ఆ తరువాత రక్తం సక్రమంగా శుద్ధి అవుతున్నదీ లేనిదీ చూస్తారు. ఈ దశలో బయో రియాక్టర్‌ను జోడిస్తారు. కృత్రిమ కిడ్నీని అమర్చుకున్న వారు తమ దైనందిన కార్యకలాపాలను చేసుకోవచ్చు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్లకు కూడా ఈ కృత్రిమ కిడ్నీ ప్రత్యామ్నాయం కానుందని అంచనా. జంతు పరీక్షలు ఇప్పటికే పూర్తయిన నేప థ్యంలో త్వరలోనే మానవ పరీక్షలు నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. అమెరికాలోని కిడ్నీ రోగుల సంస్థ ఈ ప్రయోగాల్లో పాల్గొనడంతోపాటు ప్రాజెక్టు సాకారమయ్యేందుకు ఆర్థికంగానూ సాయపడతామని ఇప్పటికే ప్రకటించింది. అన్నీ సవ్యంగా సాగితే వచ్చే ఏడాదికల్లా ఈ కృత్రిమ కిడ్నీని అందుబాటులోకి తెస్తామని షువో రాయ్ చెబుతున్నారు. కిడ్నీ మార్పిడికి 5ృ10 ఏళ్లు పట్టొచ్చని, ఈలోగా కృత్రిమ కిడ్నీ ద్వారా రోగులు సాంత్వన పొందొచ్చని వివరించారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ డయాలసిస్ ప్రక్రియ తొలగింపే లక్ష్యం డయాలసిస్ ప్రక్రియను పూర్తిగా తొలగించాలన్ననే నా లక్ష్యం. రక్తాన్ని శుద్ధి చేస్తూనే సహజసిద్ధ మూత్రపిండాలు చేసే పనులన్నీ నిర్వహించే కృత్రిమ కిడ్నీని తయారు చేయాలని దశాబ్దం కంటే ఎక్కువ కాలం నుంచి ప్రయత్నిస్తున్నా. ఇప్పుడున్న పరిస్థితుల్లో తగినన్ని నిధులు అందుబాటులోకి వస్తే ఒకట్రెండేళ్లలో మానవ ప్రయోగాలను పూర్తి చేయొచ్చు. ప్రపంచంలో ఏమూల ఉన్న వారికైనా దీన్ని అం దుబాటులోకి తీసుకురావచ్చు. నాతోపాటు మా బృందం మొత్తం ఇదే లక్ష్యంతో పనిచేస్తోంది. - సాక్షితో షువో రాయ్ -
బాబుకు పొత్తికడుపులో నొప్పి, మూత్రంలో ఎరుపు
మా బాబుకి తొమ్మిదేళ్లు. మూడు నెలల క్రితం బాబుకి మూత్రంలో రక్తం పడింది. అల్ట్రాసౌండ్ స్కాన్, ఎంసీయూ... ఇలా కొన్ని టెస్ట్‌లు చేశారు. రిపోర్ట్స్ నార్మల్ అనే వచ్చాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ అని యాంటిబయటిక్స్ రాశారు. అయితే మూత్రం పోసేటప్పుడు పొత్తికడుపులో నొప్పిగా ఉందంటూ బాబు మళ్లీ బాధ పడుతున్నాడు. పదిరోజుల కిందట మళ్లీ మూత్రంలో రక్తం పడింది. డాక్టర్ దగ్గరకెళితే మళ్లీ పరీక్షలు చేశారు. అవి కూడా నార్మలే. అసలు మా బాబుకి ఏమై ఉంటుంది, రక్తం ఎందుకు పడుతోంది? మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ అబ్బాయికి ఉన్న కండిషన్‌ను హిమెచ్యూరియా అంటారు. ఇది చాలా సాధరణమైన సమస్య. ఈ లక్షణం చూడటానికి భయపెట్టేదిగా అనిపించినా చాలా వరకూ ఎలాంటి ప్రమాదం ఉండదు. కొంతమందిలో మాత్రమే ఈ లక్షణం సీరియస్ సమస్య ఉండటానికి సూచన. పిల్లల యూరిన్‌లో రక్తం కనబడానికి గల కొన్ని కారణాలు: మూత్రనాళంలో రాళ్లు, రక్తానికి సంబంధించిన సికిల్ సెల్ డిసీజ్, కోయాగ్యులోపతి వంటి హెమటలాజికల్ సమస్యలు. వైరల్ / బ్యాక్టీరియల్, మూత్రనాళంలో ఇన్ఫెక్షన్స్, మూత్రనాళంలో ఏవైనా అడ్డంకులు, కొల్లాజెన్ వ్యాస్క్యులార్ డిసీజ్, వ్యాస్క్యులైటిస్, పీసీజీఎన్, ఐజీఏ నెఫ్రోపతి వంటి ఇమ్యున్లాజికల్ సమస్యలు, పుట్టుకతోనే మూత్రపిండాల్లో లోపాలు ఉండటం వల్ల పిల్లలు మూత్రవిసర్జన చేసే సమయంలో రక్తం కనిపించవచ్చు. ఇక పిల్లల్లో అన్నిసార్లూ కంటికి కనబడేంత రక్తం రాకపోవచ్చు. అందుకే దీన్ని తెలుసుకోవాలంటే మైక్రోస్కోపిక్, కెమికల్ పరీక్షలు అవసరమవుతాయి. మీ అబ్బాయికి చేసిన అన్ని పరీక్షల్లో నార్మల్ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి యూరినరీ ఇన్ఫెక్షన్, హైపర్ కాల్సీ యూరియా అంటే మూత్రంలో అధికంగా కాల్షియం ఉండటం లేదా రక్తానికి సంబంధించిన సమస్యలతో పాటు థిన్ బేస్మెంట్ మెంబ్రేన్ డిసీజ్, ఐజీఏ నెఫ్రోపతి వంటి సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవడం ప్రధానం. కొన్ని సందర్భాల్లో ఇటువంటి సమస్యలు కొన్ని జన్యుపరంగా వస్తుంటాయి. మీ అబ్బాయికి మూడు నుంచి ఆరు నెలలకోసారి సాధారణ మూత్రపరీక్షలతో పాటు యూరిన్‌లో ప్రొటీన్ల శాతం, రక్త కణాల మార్ఫాలజీ, క్రియాటినిన్ లెవెల్స్ వంటి పరీక్షలు తరచూ చేయిస్తుండటం ముఖ్యం. బాబుకి పొత్తికడుపులో నొప్పి వస్తుందంటున్నారు కాబట్టి ఇది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ వల్ల అయి ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు యాంటీబయాటిక్స్‌తో చికిత్స అవసరం. అయితే ఈ సమస్య కిడ్నీ వల్లగాని, జన్యుపరంగా గాని ఉత్పన్నమవుతున్నట్టు అనిపిస్తే బయాప్సీ చేయడం కూడా చాలా ముఖ్యం. మీ అబ్బాయికి రొటీన్ పరీక్షలు నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి, పైన చెప్పిన విషయాలను మీ డాక్టర్‌తో మరోసారి చర్చించి తగిన సలహా, చికిత్స తీసుకోండి. రోజుల పాప... తలలో తెల్ల వెంట్రుకలు మాకు కొద్దిరోజుల క్రితం పాప పుట్టింది. పాపకు తలలో కొంత మేర వెంట్రుకలు తెల్లగా ఉన్నాయి. ఇదేమైనా భవిష్యత్తులో ల్యూకోడెర్మా వంటి జబ్బుకు దారితీసే ప్రమాదం ఉందా? మీ పాపకు ఉన్న కండిషన్ (లోకలైజ్డ్ ప్యాచ్ ఆఫ్ వైట్ హెయిర్)ను పోలియోసిస్ అంటారు. సాధారణంగా ఇది తల ముందు భాగంలో అంటే నుదుటిపై భాగంలో కనిపిస్తుంటుంది. అయితే మరెక్కడైనా కూడా వచ్చేందుకు అవకాశం ఉంది. ఇలా ఉందంటే అది ప్రతీసారీ తప్పనిసరిగా ఏదో రుగ్మతకు సూచిక కానక్కర్లేదు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని జన్యుపరమైన సమస్యలకు సూచన కావచ్చు. చర్మంలోని పిగ్మెంట్లలో మార్పుల వల్ల కూడా రావచ్చు. కంట్లో పిగ్మెంట్కు సంబంధించిన ఏవైనా మార్పులు ఉన్నాయేమో తెలుసుకోవడం చాలా ముఖ్యం. పిల్లల్లో ఏదైనా హార్మోనల్ సమస్యలు (అంటే థైరాయిడ్, జననేంద్రియాలకు సంబంధించినవి) ఉండటానికి సూచన కావచ్చు. ఇలాంటి అసోసియేటెడ్ సమస్యలేవీ లేకపోతే మీ పాపకు ఉన్న ఈ లక్షణం... ల్యూకోడెర్మా లాంటి సమస్యకు దారితీసే అవకాశం లేదు. పాపను ఒక్కసారి పీడియాట్రీషియన్‌కు చూపించండి. మీరు రాసినదాన్ని బట్టి పాపకు తక్షణ చికిత్స ఏదీ అవసరం లేదు. మీరూ ఈ విషయంలో ఆందోళన పడకుండా ఒకసారి డాక్టర్‌ను కలిసి ఇతరత్రా ఏ సమస్యలూ లేవని నిర్ధరించుకొని నిశ్చింతగానే ఉండండి. పాపకు తలలో ర్యాష్... పరిష్కారం చెప్పండి మా పాపకు ఆరు నెలలు. తల మీద విపరీతమైన ర్యాష్‌తో పాటు ఇన్ఫెక్షన్ వచ్చింది. మా డాక్టర్గారికి చూపించాం. మొదట తగ్గిందిగానీ, కొన్నాళ్లకు మళ్లీ వచ్చింది. పాపకు తలలోని కొన్నిప్రాంతాల్లో జుట్టు సరిగా రావడం లేదు. మా పాప సమస్యకు పరిష్కారం చెప్పండి. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలకు ఏదైనా సూచనా? మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాపకు మాడు (స్కాల్ప్) భాగంలో చర్మం మీద ర్యాష్ వచ్చినట్లుగా, కొద్దిగా సూపర్ యాడ్ ఇన్ఫెక్షన్ కూడా అయినట్లుగా అనిపిస్తోంది. ఈ కండిషన్‌ను వైద్య పరిభాషలో సెబోరిక్ డర్మటైటిస్ అంటారు. ఇది కాస్త దీర్ఘకాలికంగా కనిపించే సమస్యగా చెప్పవచ్చు. దీన్ని ప్రధానంగా నెలల పిల్లల్లో, యుక్తవయసుకు వచ్చిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. ఈ సమస్య ఉన్న పిల్లలకు మాడు (స్కాల్ప్)పైన పొరల్లా ఊడటం, అలాగే కొన్నిసార్లు తలంతా అంటుకుపోయినట్లుగా ఉండటం, కొన్ని సందర్భాల్లో మాడుపై పొర ఊడుతున్నట్లుగా కనిపిస్తుంటుంది. ఇది రావడానికి ఇదమిత్థంగా కారణం చెప్పలేకపోయినప్పటికీ... కొన్నిసార్లు ఎమ్. పర్ఫూరా అనే క్రిమి కారణం కావచ్చని కొంతవరకు చెప్పుకోవచ్చు. చిన్నపిల్లల్లో... అందునా ముఖ్యంగా నెల నుంచి ఏడాది వయసు ఉండే పిల్లల్లో ఈ సమస్యను మరీ ఎక్కువగా చూస్తుంటాం. కొన్నిసార్లు ఈ ర్యాష్ ముఖం మీదకు, మెడ వెనకభాగానికి, చెవుల వరకు వ్యాపిస్తూ ఉండవచ్చు. ఇది వచ్చిన పిల్లల్లో పై లక్షణాలతో పాటు కొందరిలో నీళ్ల విరేచనాలు (డయేరియా) లేదా నిమోనియా వంటి ఇన్ఫెక్షన్స్ తరచూ వస్తుంటే దాన్ని ఇమ్యూనో డెఫిషియెన్సీ డిసీజ్‌కు సూచికగా చెప్పవచ్చు. అలాగే కొన్ని సందర్భాల్లో ఇతర కండిషన్స్... అంటే అటోపిక్ డర్మటైటిస్, సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ కూడా ఇదేవిధంగా కనిపించవచ్చు. ఇక చికిత్స విషయానికి వస్తే ఈ సమస్య ఉన్నవారికి యాంటీసెబోరిక్ (సెలీనియం, సెల్సిలిక్ యాసిడ్, టార్) షాంపూలతో క్రమం తప్పకుండా తలస్నానం చేయిస్తుండటం, తక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉన్న కీమ్స్ తలకు పట్టించడం, ఇమ్యూనోమాడ్యులేటర్స్ వంటి మందుల వల్ల తప్పనిసరిగా వీళ్లకు నయమవుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న భాగాన్ని తడిబట్టతో తరచూ అద్దుతూ ఉండటం చాలా ముఖ్యం. ఇదేమీ భవిష్యత్తు వ్యాధులకు సూచిక కాదు. మీరు ఒకసారి మీ పిల్లల డాక్టర్‌ను లేదా డర్మటాలజిస్ట్‌ను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోండి. ఈ సమస్య తప్పక తగ్గిపోతుంది. డా. రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, రోహన్ హాస్పిటల్స్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ -
కిడ్నీపై దుష్ప్రభావం పడిందంటున్నారు
నాకు గతంలో లూపస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. అయితే కొంతకాలం కిందట మూత్రపరీక్ష చేయించినప్పుడు లూపస్ కారణంగా నా కిడ్నీలపై దుష్ప్రభావం పడి, లూపస్ నెఫ్రైటిస్ వచ్చినట్లు చెప్పారు. దయచేసి ఈ వ్యాధి గురించి విపులంగా వివరించి, నాకు తగిన సలహా ఇవ్వగలరు. మన శరీరంలో మూత్రపిండాలు (కిడ్నీలు) అత్యంత ప్రధానమైన అవయవాలు. అవి అధిక రక్తపోటును నియంత్రించడం, తగినన్ని లవణాలనూ, ఖనిజాలనూ రక్తంలో నిర్వహితమయ్యేలా చూడటం, ఎర్రరక్తకణాలను తయారు చేయడం, ఎముకకు బలాన్ని చేకూర్చడం వంటి అత్యంత కీలకమైన కార్యకలాపాలను నిర్వహిస్తుంటాయి. అంతేకాదు... రక్తంలోని విషపూరితమైన పదార్థాలను వడపోసి మూత్రం ద్వారా విసర్జితమయ్యేలా చూస్తాయి. మూత్రపిండాల సాధారణ వడపోత కార్యకలాపాలలో ఎర్రరక్తకణాలుగానీ, ప్రోటీన్లు గానీ బయటకు పోవు. అయితే ఏ కారణంగానైనా కిడ్నీల పనితీరు దెబ్బతింటే ఎర్రరక్తకణాలూ, ప్రోటీన్లు బయటకు పోతూ, హానికరమైన విషపదార్థాలు శరీరంలోనే ఉండిపోతాయి. ఇలా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసే అంశాలు చాలానే ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా పేర్కొనవలసింది ‘లూపస్ నెఫ్రైటిస్’ లూపస్ నెఫ్రైటిస్ లక్షణాలు అదుపు తప్పిన రోగనిరోధక శక్తి ప్రభావం కిడ్నీల మీద పడినప్పుడు ‘లూపస్ నెఫ్రైటిస్’ వ్యాధి వస్తుంది. లూపస్ లక్షణాలు మొదలైన రెండు లేదా మూడేళ్ల తర్వాత కిడ్నీపై దాని దుష్ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు లూపస్ ప్రారంభదశలోనే నేరుగా కిడ్నీపై ప్రభావం పడవచ్చు కూడా. ఈ వ్యాధి ప్రారంభదశలో పైకి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. తరచూ కాళ్ల వాపు, ముఖంలో వాపు, కనురెప్పలు బరువుగా ఉండటం, మూత్రంలో అధికంగా నురుగు కనిపించడం, కొన్నిసార్లు మూత్రంలో ఎరుపు, అధిక రక్తపోటు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుందంటేలూపస్ ఉన్న వ్యక్తుల్లో 60 శాతం మందిలోనూ, చిన్నపిల్లల్లో దాదాపు మూడింట రెండు వంతుల మందిలో దాని ప్రభావం కిడ్నీ మీద పడుతుంది. దీని తీవ్రత మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువ. గుర్తించడం ఎలా సాధ్యమైనంత వరకు తొలిదశలోనే గుర్తించడం వల్ల రోగికి ఎంతో మేలు చేకూరేందుకు అవకాశం ఉంది. దీని లక్షణాలు నిర్దుష్టంగా పైకి కనిపించవు కాబట్టి ఎస్‌ఎల్‌ఈ (సిస్టమిక్ లూపస్ ఎరిథమెటోసిస్) వ్యాధి నిర్ధారణ అయినప్పటి నుంచే తరచూ మూత్రపరీక్ష చేయించుకుంటూ ఉండాలి. మూత్రంలో ప్రోటీన్లు, ఎర్రరక్తకణాలు, తెల్లరక్తకణాలు ఎక్కువగా ఉన్నట్లయితే మూత్రపిండాల బయాప్సీ చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. వ్యాధి ఏ స్థాయిలో ఉందన్న విషయం బయాప్సీ ద్వారా తెలుస్తుంది. దాన్ని బట్టి అవసరమైన చికిత్సను రుమటాలజిస్టులు సూచిస్తారు. లూపస్ నెఫ్రైటిస్ వల్ల కలిగే నష్టాలు లూపస్ నెఫ్రైటిస్ రెండు కిడ్నీల మీద కూడా సమానంగా ప్రభావం చూపుతుంది. ఎంత మెరుగైన చికిత్స తీసుకున్నప్పటికీ దాదాపు 10 నుంచి 20 శాతం మందిలో కిడ్నీల పై ఒక పొర ఏర్పడి, కిడ్నీలు శాశ్వతంగా పాడైపోతాయి. దాంతో ఒంట్లో నీరు పేరుకుపోవడం, రక్తహీనత, అధికరక్తపోటు వంటి అనర్థాలు ఏర్పడతాయి. అలాంటివారికి దీర్ఘకాలికంగా డయాలసిస్, కిడ్నీ మార్పిడి అవసరం. అంతేకాదు... ఈ జబ్బు ఉన్నవారు తేలిగ్గా అంటువ్యాధులకు గురవుతుంటారు. క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే లూపస్ వ్యాధి నిర్ధారణ జరగగానే వెంటనే రుమటాలజిస్టుల పర్యవేక్షణలో కిడ్నీలపై ఆ వ్యాధి ప్రభావాన్ని తరచూ పరీక్షించుకుంటూ ఉండాలి. చికిత్స విధానాలు ఎస్ఎల్ఈకి శాశ్వతమైన చికిత్స అందుబాటులో లేదు. అయితే జబ్బు ప్రభావం కిడ్నీ మీద పడుతున్నప్పుడు సరైన సమయంలో మందులు మొదలుపెట్టాలి. దానివల్ల సమస్య ముదరకుండా జాగ్రత్త తీసుకోవచ్చు. దీనికోసం ఇమ్యూనోసప్రసెంట్స్ మందులను వాడాల్సి ఉంటుంది. ఇవి అదుపుతప్పిన రక్షణ వ్యవస్థను సరైన దారిలో పెట్టి కిడ్నీ ఫెయిల్ కాకుండా కాపాడతాయి. కీళ్లవాతానికి మందులు వాడినా ప్రయోజనం లేదు... నా వయసు 45 ఏళ్లు. గత పన్నెండేళ్లుగా కీళ్లవాతంతో బాధపడుతున్నాను. ఎన్నో రకాల మందులు వేసుకున్నా ఫలితం కనిపించలేదు. ఈ వ్యాధి కారణంగా బాధ చాలా తీవ్రంగా ఉంది. నొప్పులు భరించలేకుండా ఉన్నాను. ఈ సమస్యకు మంచి పరిష్కారాలు ఏవైనా ఉంటే వివరంగా చెప్పండి. కీళ్లవాతం సమస్య చాలా తీవ్రమైనది. దీని కారణంగా అనేకమంది కాళ్లు, చేతులు వంకర్లుపోయి, ఇంకొకరి సహాయం లేకుండా కదలలేని పరిస్థితుల్లో ఉండటం చాలా సాధారణంగా కనిపించే అంశం. కీళ్లవాతపు జబ్బులపై సరైన అవగాహన లేకపోవడంతో దీన్ని నిర్లక్ష్యం చేసి, వ్యాధిని ముదరబెట్టుకొని, చివరకు మృత్యువు బారిన పడుతుంటారు. ఆధునిక వైద్యం అందుబాటులోకి రాకముందు మూలికలు, పూతమందుల వంటి చాలా పరిమితమైన చికిత్స మాత్రమే ఉండేది. గతంలో తీవ్రమైన ఆటోఇమ్యూన్ వ్యాధులతో బాధపడేవారిలో జబ్బులు తగ్గడం ఒకింత తక్కువ. అలాగే మరణాలు ఎక్కువగా ఉండేవి. కానీ ఇటీవల ఈ వ్యాధులకు సైతం సరికొత్త చికిత్స విధానాలు అందుబాటులోకి రావడం వల్ల పరిస్థితిలో గణనీయమైన మార్పు వచ్చింది. ఇరవయ్యో శతాబ్దం మొదటిభాగంలో మెథోట్రెగ్జేట్, సైక్లోఫాస్ఫమైడ్ అనే మందులు అందుబాటులోకి రావడంతో ఈ వ్యాధులతో బాధపడేవారి సంఖ్య తగ్గింది. ఈ మందులు ప్రాథమిక చికిత్సగా మారాయి. కానీ గత దశాబ్దంలో ఈ సమస్యకు అనేక కొత్త మందులు అందుబాటులోకి వచ్చాయి. వీటిని ‘బయోలజిక్స్’ అంటారు. కీళ్లవాతం వంటి సమస్యలకు ప్రాథమిక స్థాయిలో నొప్పినివారణ మందులు (పెయిన్‌కిల్లర్స్), చిన్న చిన్న మోతాదుల్లో స్టెరాయిడ్స్ వాడటం తప్పనిసరి. వీటితో పాటు వ్యాధి తీవ్రతను బట్టి ‘డీఎమ్ఆర్డీఎస్’ (డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమాటిక్ డ్రగ్స్) మందులను సూచిస్తారు. ఇవి లోపలి నుంచి పనిచేస్తాయి. అయితే చికిత్స మొదలుపెట్టిన వెంటనే పెద్దగా మార్పు కనిపించదు. అలాగే ఈ మందులు క్యాన్సర్‌కి వాడేలాంటివనే అపోహ ఉంది. దాంతో బాధ తీవ్రంగా ఉన్నప్పటికీ కొంత మంది చికిత్సను మధ్యలోనే వదిలేస్తారు. నెమ్మదిగా పనిచేసినప్పటికీ వీటి వల్ల మంచి మెరుగదలే ఉంటుంది. అయితే 20% నుంచి 30% మందిలో ఎన్ని మందులు వేసుకున్నా పెద్దగా ప్రయోజనం ఉండదు. బయోలజిక్స్ గురించి... సాధారణ మందులతో పెద్దగా ప్రయోజనం లేని సందర్భాల్లో బయోలజిక్స్ మందులు సమర్థంగా పనిచేసే అవకాశాలున్నాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్, లూపస్, స్క్లీరోడెర్మా, యాంకైలోజింగ్ స్పాండిలోసిస్ వంటి అనేక రకాల ఆటోఇమ్యూన్ వ్యాధులలో ఈ బయోలజిక్స్ మందుల వల్ల వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఈ కారణంగా సంభవించే మరణాలూ బాగా తగ్గుతాయి. ఇక మధ్యలోనే చికిత్స మానేసిన రోగుల్లో... వ్యాధి ముదరడం వల్ల బాధల తీవ్రత పెరుగుతుంది. ఇలాంటి రోగులకు స్మాల్ మాలెక్యూల్స్, స్టెమ్‌సెల్ థెరపీ వంటి మరింత ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఇవి మరింత సమర్థమైన ప్రత్యామ్నాయ చికిత్సలు. అయితే ఈ ఆధునిక చికిత్సా విధానాలను విచ్చలవిడిగా వాడటం సరికాదు. రోగి పరిస్థితిని బట్టి, వారిలోని వ్యాధి తీవ్రతను బట్టి, ఈ చికిత్సావిధానాల వల్ల కలిగే ప్రయోజనాలూ, నష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా విచక్షణతో వాడాల్సి ఉంటుంది. అందుకే రుమటాజిస్టులు ఈ మందుల వల్ల కలిగే లాభనష్టాల నిష్పత్తిని బేరీజు వేసుకొని, సరైన అంచనాకు వచ్చి ఈ మందులను సూచిస్తారు. కాబట్టి మీరు పై అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని నిపుణులైన రుమటాలజిస్టును సంప్రదించండి. దాంతో మీ ఇబ్బందులు తొలగి, మీ జీవనశైలి మరింత మెరుగవుతుంది. డాక్టర్ విజయ ప్రసన్న పరిమి సీనియర్ కన్సల్టెంట్ రుమటాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, రోడ్ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్. -
కాళ్లలో వాపు... నురగలుగా మూత్రం!
నా వయసు 45 ఏళ్లు. నేను వృత్తిరీత్యా ఎప్పుడూ ప్రయాణాల్లోనే ఉంటాను. ఇప్పటివరకు నాకెలాంటి ఆరోగ్య సమస్యా రాలేదు. కానీ గత రెండు మూడు నెలల నుంచి దూరప్రయాణాలు చేసి వచ్చిన తర్వాత నా రెండు కాళ్లు వాస్తున్నాయి. మూత్రం కూడా బాగా నురగతో వస్తోంది. అంతేకాకుండా రాత్రిళ్లు ఎక్కువగా మూత్రం వస్తోంది. ఇలా ఎందుకు జరుగుతోంది? దయచేసి సలహా ఇవ్వండి. మూత్రపిండాల సమస్యలో ఐదు దశలు ఉంటాయి. మొదటి దశ, రెండో దశలో అసలు వ్యాధి లక్షణాలు కనిపించవు. మూడో దశలో ఆకలి మందగించడం, నీరసం, ముఖం వాచినట్లుగా ఉండటం, కాళ్లలో వాపు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నాలుగో దశ, ఐదో దశలో కన్ను చుట్టూ వాపు రావడం, జబ్బు ఎక్కువవుతున్న కొద్దీ వాపు ఎక్కువవుతుండటం, మూత్రం తగ్గిపోవడం, ఫిట్స్ రావడం, కొన్ని సందర్భాల్లో నడుము నొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇక ఐదో దశ వచ్చేసరికి కిడ్నీ పనితీరు బాగా తగ్గిపోతుంది. దురదృష్టవశాత్తు చాలామందిలో వ్యాధి ఈ దశకు చేరుకున్న తర్వాతనే వైద్యులను సంప్రదిస్తున్నారు. వ్యాధి ఐదో దశకు చేరిన తర్వాత మళ్లీ దానిని సాధారణ స్థితికి తీసుకురాలేము. అందువల్ల క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదిస్తూ చికిత్స కొనసాగించడం ఒక్కటే మార్గం. అయితే మీరు చెబుతున్న లక్షణాలను బట్టి చూస్తుంటే మీ కిడ్నీలో ఏవో అసాధారణ మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పవచ్చు. కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న వారిలో మీరు చెప్పిన లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిపుణులైన వైద్యులను సంప్రదించండి. మీకు తగిన పరీక్షలు నిర్వహించి చికిత్స చేస్తారు. ఆలస్యం చేయకూడదు. గుండెజబ్బులాగా కిడ్నీ సంబంధిత వ్యాధులకు కూడా సమయమే అత్యంత కీలకం. వ్యాధి మొదటి దశలో ఉంటే మీకు సులువుగా చికిత్స నిర్వహించే అవకాశం ఉంది. అలాగే మీ కిడ్నీ కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా పరీక్షలలో ఏదైనా సివియారిటీ కనిపిస్తే కూడా మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య ప్రక్రియలతో మీ కిడ్నీ సంబంధిత వ్యాధులను సమూలంగా పరిష్కరించే అవకాశం ఉంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకోవచ్చా? నా వయసు 52 ఏళ్లు. టైప్–2 డయాబెటిస్ కారణంగా నా రెండు మూత్రపిండాలూ పాడైపోయాయి. చాలాకాలంగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. అయితే ప్రతిసారీ డయాలసిస్ కోసం ఆస్పత్రికి వెళ్లిరావడం ఇబ్బందిగా ఉంటోంది. ఇంట్లోనే డయాలసిస్ చేసుకునేందుకు అవకాశం ఉందా? దయచేసి వివరంగా చెప్పండి. ఆస్పత్రి లేదా నర్సింగ్‌హోమ్‌లలో నిర్వహించే డయాలసిస్‌ను హీమోడయాలసిస్ అంటారు. ఇది చాలా సాధారణమైన ప్రక్రియ. అత్యధికులు అనుసరించేది కూడా ఇదే. అయితే మీరు రెగ్యులర్‌గా డయాలసిస్ కోసం ఆస్పత్రికి రావడానికి ఇబ్బందిగా ఉన్నందున, ఇంటి దగ్గర మీరే స్వయంగా, మీ కుటుంబ సభ్యుల సహాయంతో డయాలసిస్ చేసుకునే మరో ప్రక్రియ కూడా ఉంది. ఇదే పెరిటోనియల్ డయాలసిస్. దీన్ని ఇంటిదగ్గర, ఆఫీసులో, ప్రయాణాల్లో స్వయంగా చేసుకోవచ్చు. అయితే ఇంటి దగ్గర డయాలసిస్ చేసుకోగల నేర్పు, ఓర్పు పేషెంట్‌కు ఉండాలి. లేదా దీనిని చేయగలవారు ఇంట్లో అందుబాటులో ఉండాలి. పెరిటోనియల్ డయాలసిస్ ద్వారా కడుపు లోపల అంటే ఉదర కుహరంలో ఆవరించిన పొరలలో ఉండే రక్తనాళాల్లోకి డయాలసేట్ అనే ద్రవాన్ని నింపుతూ ఎప్పటికప్పుడు రక్తంలో వ్యర్థాలను బయటకు తీయవచ్చు. రక్తాన్ని శుద్ధి చేసే ద్రవాన్ని కేథెటర్ ద్వారా కడుపులోకి పంపిస్తారు. ఈ ద్రవం నిర్ణీతకాలం వరకు కడుపులో ఉంటుంది. ఈ సమయంలో రక్తంలోని వ్యర్థాలు, రసాయనాలు, ద్రవాలు... కడుపులోపలి పొరను అంటిపెట్టుకుని ఉండే రక్తనాళాల నుంచి బయటకు వచ్చి డయాలసిస్ ద్రవంలో కలుస్తాయి. నిర్ణీత సమయం తర్వాత వ్యర్థాలు కలిసిన ద్రవం పేషెంట్ శరీరం వెలుపల అమర్చిన సంచిలోకి డ్రెయిన్ అవుతుంది. కడుపులోకి ద్రవాన్ని పంపడం, కొంతసేపటి తర్వాత దాన్ని బయటకు తీయడం ప్రక్రియను ఎక్సే ్చంజ్ అంటారు. రాత్రివేళ పేషెంట్ నిద్రించే సమయంలో కూడా డయాలసిస్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆటోమేటెడ్ సైక్లర్‌ను వినియోగిస్తారు. ఈ సైక్లర్ తనంతట తానుగా డయాలసిస్ ద్రవాన్ని కడుపులోపలికి పంపించడం, నిర్ణీత వ్యవధి తర్వాత దాన్ని బయటకు డ్రెయిన్ చేయడం వంటి విధులు నిర్వహిస్తుంది. దీని వల్ల ఉదయం నిద్రలేచిన వెంటనే బ్యాగులో చేరిన వ్యర్థ ద్రవాన్ని ఖాళీ చేయవచ్చు. బ్లడ్ గ్రూపులు కలవడం లేదు... కిడ్నీ మార్పిడి ఎలా? మా అమ్మగారి వయసు 69 ఏళ్లు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. రోజు విడిచి రోజు హీమోడయాలసిస్ అందిస్తున్నాము. కానీ ఆమె తన వయసు రీత్యా దాన్ని తట్టుకోలేకపోతోంది. చాలా వేదన అనుభవిస్తోంది. మాలో ఎవరైనా కిడ్నీని దానం చేద్దాం అనుకున్నాం గానీ బ్లడ్‌గ్రూపు కలవడం లేదు. ఇప్పుడు మేమేం చేయాలి? మా అమ్మగారి వేదనను తొలగించడానికి తగిన పరిష్కారం చూపండి. కిడ్నీ వంద శాతం పాడైపోయినప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి ద్వారా రోగిని రక్షిస్తారు. అయితే ఇది అందరి విషయంలోనూ సాధ్యం కాదు. దీనికి దాత అవసరమవుతారు. లైవ్ డోనార్ (బతికి ఉన్న వారి నుంచి కిడ్నీ సేకరించడం), కెడావర్ డోనార్ (చనిపోయిన వ్యక్తి నుంచి కిడ్నీని సేకరించడం) అని రెండు రకాల దాతల నుంచి కిడ్నీని సేకరిస్తారు. లైవ్ డోనార్స్ విషయంలో రక్తసంబంధీకులు మాత్రమే కిడ్నీని దానం చేయాలి. అంతేగాక వీరి బ్లడ్ గ్రూపు కిడ్నీని పొందే వ్యక్తి బ్లడ్ గ్రూపుతో కలవాల్సి ఉంటుంది. కిడ్నీ దానం చేసేవారికి అధిక రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బులు, మెదడు జబ్బులు, కాలేయవ్యాధులైన హెపటైటిస్–బి, సి ఉండకూడదు. దాత ఒక కిడ్నీ దానం చేయడం వల్ల ఎలాంటి నష్టం లేదని నిర్ధారణ చేశాకే కిడ్నీ మార్పిడి చేస్తారు. రక్తసంబంధీకుల బ్లడ్ గ్రూపులు కలవకపోతే రెండు మార్గాలు ఉన్నాయి. మొదటిది... స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్, రెండోది ఏబీఓ ఇన్కంపాటబుల్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్. స్వాప్ రీనల్ ట్రాన్స్‌ప్లాంటేషన్... తమ రక్త సంబంధీకులకు కిడ్నీ దానం చేయాలని ఉన్నాగానీ బ్లడ్ గ్రూపులు కలవకపోవడం వల్ల అది సాధ్యపడనప్పుడు... అదే సమస్యతో బాధపడుతున్న వేరొకరి రక్త సంబంధీకులలో బ్లడ్ గ్రూపు సరిపడిందనుకోండి. ఇలా ఒకరి రక్తసంబంధీకులకు మరొకరు పరస్పరం కిడ్నీలు దానం చేసుకునే ప్రక్రియను స్వాప్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. ఈ విధానంలో వీరి కిడ్నీని వారి బంధువుకూ, వారి కిడ్నీని వీరి బంధువుకు అమర్చే ఏర్పాటు చేస్తారు. వీరిద్దరికీ ఒకేసారి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరుగుతుంది. బ్లడ్ గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయవచ్చు... అందివస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, వైద్యులలో పెరుగుతున్న నైపుణ్యాల వల్ల ప్రస్తుతం బ్లడ్‌గ్రూపులు కలవకపోయినా కిడ్నీ మార్పిడి చేయడం వీలవుతుంది. దీనికి కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు అనుసరించాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన మందులను ఉపయోగించాల్సి ఉంటుంది. బ్లడ్‌గ్రూపు సరిపడకపోయినప్పటికీ ఈ విధానంలో చేసిన కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు కూడా... కంపాటబుల్ కిడ్నీ మార్పిడి సర్జరీల మాదిరిగానే విజయవంతం అవుతున్నాయి. కాబట్టి మీరు మీ అమ్మగారికి తగిన విధానాన్ని అనుసరించేందుకు ఉపయుక్తమైన మార్గాలను తెలుసుకునేందుకు ఒకసారి అత్యంత ఆధునిక వైద్య సదుపాయాలు ఉన్నచోట, నిపుణులైన వైద్యులను సంప్రదించి తగిన సూచనలు తీసుకోండి. డాక్టర్ ఎ. శశి కిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
పైల్స్ నయమవుతాయా?
నా వయసు 30 ఏళ్లు. నాకు గర్భధారణ సమయంలో పైల్స్ సమస్య మొదలైంది. ఎన్ని మందులు వాడినా తరచూ ఈ సమస్య వస్తూనే ఉంది. దాంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. నా సమస్య హోమియోతో నయమయ్యే అవకాశం ఉందా? దయచేసి సలహా ఇవ్వగలరు. గర్భధారణ సమయంలో కొన్ని హార్మోన్ల కారణంగా రక్తనాళాలు రిలాక్స్ అవుతాయి. దాంతో కొంతమంది మహిళల్లో పైల్స్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. పైల్స్ సమస్యలో మలద్వారం దగ్గర ఉండే రక్తనాళాలు ఉబ్బిపోయి, వాపు రావడం జరుగుతుంది. తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కూడా అవుతాయి. కారణాలు : దీర్ఘకాలికంగా మలబద్దకం, పొత్తికడుపు ఎక్కువ కాలం ఒత్తిడికి గురికావడం, దీర్ఘకాలిక దగ్గు, గర్భధారణ సమయంలో కాలేయ సంబంధిత వ్యాధుల వల్ల పైల్స్ వచ్చే అవకాశం ఉంది. పైన పేర్కొన్న కారణాలతో మలద్వారం వద్ద ఉండే రక్తనాళాలపై దీర్ఘకాలికంగా ఒత్తిడి ఏర్పడుతుంది. వాటిలో రక్తం నిల్వ ఉండటం వల్ల మలవిసర్జన సమయంలో మలద్వారం దగ్గర ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా తీవ్రమైన నొప్పి వస్తూ, రక్తనాళాలు చిట్లి, రక్తస్రావం అవుతుంది. పైల్స్‌లో రకాలు ఉంటాయి. అవి... 1. ఇంటర్నల్ పైల్స్ 2. ఎక్స్టర్నల్ పైల్స్. మలద్వారం వద్ద ఏర్పడే సమస్యల్లో పైల్స్ మాత్రమే గాక ఫిషర్, ఫిస్టులా వంటి ఇతర సమస్యలను కూడా మనం గమనించవచ్చు. ఫిషర్స్ : మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను యానల్ ఫిషర్ అంటారు. ఈ చీలిక వల్ల ఆ ప్రాంతంలో ఉండే కండర కణజాలం బహిర్గతం కావడం వల్ల అది మలవిసర్జన సమయంలోగానీ, మలవిసర్జన అనంతరం గానీ తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. రక్తస్రావం కూడా అవుతుంది. ఫిస్టులా : మలద్వారం వద్ద రెండు ఎపిథీలియల్ కణజాలాల మధ్య భాగంలో ఒక గొట్టం లాంటి నిర్మాణాన్ని ఫిస్టులా అంటారు. ఇది శరీరంలో ఎక్కడైనా ఏర్పడవచ్చు. కానీ మలద్వారం వద్ద యానల్ ఫిషర్ ఏర్పడటం సర్వసాధారణం. మలద్వారం పక్కన ముందుగా చిన్న మొటిమలాగా ఏర్పడి నొప్పి, వాపుతో రెండు రోజులలో పగిలి చీమును వెలువరుస్తుంది. దీని తీవ్రతను బట్టి తరచూ తిరగబెడుతుంటుంది. సాధారణ జీవనానికి అడ్డంకిగా నిలుస్తూ తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుంది. ఆపరేషన్ చేసినా, 90 శాతం మందిలో మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటుంది. చికిత్స : జెనెటిక్ కన్స్టిట్యూషన్ చికిత్స విధానం ద్వారా పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా సమస్యలను హోమియో వైద్యంతో పూర్తిగా నయం చేయవచ్చు. అంతేకాదు... మళ్లీ తిరగబెట్టకుండా సంపూర్ణమైన చికిత్స అందించవచ్చు. పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? మా అమ్మాయి వయసు 27 ఏళ్లు. ఈమధ్య జుట్టులో ఒకేచోట వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో పరిష్కారం చెప్పండి. పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగానీ ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు : ►మానసిక ఆందోళన ►థైరాయిడ్ సమస్య ►డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ►వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు : ►తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. ►తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ►సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ : ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స : పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు. దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ మూత్రవిసర్జన సమయంలో మంట...తగ్గేదెలా? నా వయసు 36 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. డాక్టరుకు ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను. దయచేసి నా సమస్యకు హోమియోలో పరిష్కారం చెప్పండి. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ప్రతివారూ యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడతారు. వీటిని రెండు రకాలుగా విభజించవచ్చు. అప్పర్ యూరినరీ టాక్ట్ ఇన్ఫెక్షన్స్ :ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు :మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంటు ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం వ్యాధినిర్ధారణ పరీక్షలు : యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్ హోమియోపతి చికిత్స : యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ -
రెండు కిడ్నీలు చెడిపోయాయి.. ట్రాన్స్‌ప్లాంటేషన్ వివరాలు చెప్పండి
కిడ్నీ కౌన్సెలింగ్స్ మావారి వయసు 36 ఏళ్లు. సాఫ్ట్వేర్ కంపెనీలో సీనియర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. మా కుటుంబంలో వంశపారంపర్యంగా షుగర్ వ్యాధి ఉంది. గత ఐదేళ్లుగా విదేశాల్లోనే ఉండి పనిచేసి, ఇటీవలే స్వదేశం వచ్చారు. విదేశాల్లో ఉన్నప్పుడు ఫాస్ట్‌ఫుడ్, కూల్‌డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. మద్యం, సిగరెట్ల అలవాటు కూడా ఉంది. ఈమధ్య హఠాత్తుగా ఆరోగ్యం చెడిపోతే డాక్టర్‌కు చూపించాం. రెండు కిడ్నీలు చెడిపోయాయని చెప్పారు. వారానికి మూడు, నాలుగు సార్లు డయాలసిస్ చేయించుకోవాలి. ట్రాన్స్‌ఫ్లాంటేషన్ అవసరమని చెప్పారు. మూత్రపిండాల మార్పిడి ఎలా చేస్తారు? కిడ్నీ ఎవరు ఇవ్వవచ్చు? దయచేసి వివరంగా తెలపండి. – కె. సింహాచలం, విశాఖపట్నం మన శరీరంలోని అత్యంత కీలకమైన అవయవాల్లో మూత్రపిండాలు కూడా చాలా ప్రధానమైనవి. ఇవి మన శరీరంలోని రక్తాన్ని శుద్ధిచేసి, అనవసర, ప్రమాదకర, విసర్జన పదార్థాలను నీటితో కలిపి బయటకు పంపిస్తుంటాయి. కిడ్నీలకు తీవ్రమైన వ్యాధులు సోకినప్పుడు అవ రక్తాన్ని శుద్ధి చేయలేవు. మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధుల్లో ప్రాథమిక దశలో నొప్పిగానీ, స్పష్టమైన వ్యాధి లక్షణాలేమీ కనిపించవు. దాంతో కీలకమైన ఈ అవయవాలకు వ్యాధి సోకినట్లు గుర్తించడలంలో చాలా ఆలస్యం అవుతుంది. కానీ కిడ్నీ వ్యాధుల గుర్తింపులో సమయం చాలా కీలకం. ఆలస్యం అవుతున్నకొద్దీ వ్యాధి మరింత ముదిరి చివరకు అది రీనల్ ఫెయిల్యూరుకు దారితీస్తుంది. దాంతో మూత్రపిండం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడం చాలా సందర్భాల్లో అసాధ్యం అవుతుంది. ఆ పరిస్థితిలో మూత్రపిండాల మార్పిడి (కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్) తప్ప మరో మార్గం లేని పరిస్థితి ఏర్పడుతుంది. కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు దాత అవసరం. దాత నుంచి కిడ్నీ పొందడానికి ప్రభుత్వ నిర్వహణలో ఉండే ‘జీవన్‌దాన్’లో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దాత లభించేలోగా డయాలసిస్‌పై ఆధారపడటమే మార్గం. డయాలసిస్‌లో రక్తంలోని మలినాలు, అదనపు నీటిని తొలగించివేస్తారు. డయాలసిస్‌లో రెండు రకాలు ఉన్నాయి. మొదటిది హీమోడయాలసిస్, రెండోది పెరిటోనియల్ డయాలసిస్. హీమోడయాలసిస్ కోసం ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. పెరిటోనియల్ డయాలసిస్ ఇంటిదగ్గరే చేసుకోడానికి వీలవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో లాగే మన దేశంలోనూ కిడ్నీ దాతల సంఖ్య చాలా తక్కువగా ఉంటున్నది. అందువల్ల వ్యాధిగ్రస్తుడి పరిస్థితిని బట్టి తొందరగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స అవసరమైనప్పుడు కుటుంబసభ్యులు, రక్తసంబంధీకుల్లో ఎవరైనా దానం చేయవచ్చు. దాతల ఆరోగ్యం, రక్తం గ్రూపు తదితర అంశాలను పరిశీలించి డాక్టర్లు సరైన దాతను నిర్ణయిస్తారు. కిడ్నీ వ్యాధుల చికిత్సతో పాటు మూత్రపిండాల మార్పిడికి అవసరమైన పూర్తిస్థాయి సదుపాయాలు, వైద్యనిపుణులు ఇప్పుడు హైదరాబాద్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ శస్త్రచికిత్సలో సక్సెస్‌రేటు 95 శాతం వరకు ఉండి, దాదాపు అన్నీ విజయవంతమవుతూ అనేక మందికి మంచి ఆయుర్దాయాన్ని ఇస్తున్నాయి. శస్త్రచికిత్స తర్వాత దాదాపు 10, 15 ఏళ్ల వరకు దాదాపు ఎలాంటి సమస్యలూ ఎదురుకాకుండా జాగ్రత్తలు తీసుకోడానికి వీలవుతుంది. మీవారి విషయంలో వ్యాధి నిర్ధారణ జరిగిందంటున్నారు కాబట్టి ఇక మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీ డాక్టర్ల సూచన మేరకు చికిత్స చేయించండి. డాక్టర్ ఎ. శశికిరణ్, సీనియర్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజీషియన్, యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
యాంటీబయాటిక్ మోతాదును లెక్కించే గాడ్జెట్...
యాంటీబయాటిక్ మందులతో జబ్బులు నయం కావచ్చునేమోగానీ.. దుష్ప్రభావాలు కొన్ని ఉండనే ఉంటాయి. అయితే మందు ఏ స్థాయిలో వాడితే దుష్ప్రభావాలు తక్కువ అవుతాయో తెలుసుకుంటే ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. మిగిలిన వాటి మాటెలా ఉన్నా వాన్కోమైసిన్ అనే యాంటీబయాటిక్ మోతాదును రక్తంలో సులువుగా గుర్తించేందుకు ఈపీఎఫ్‌ఎల్ విద్యార్థులు కొందరు ఓ విన్నూతమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. సెన్స్ యూ పేరుతో నిర్వహహిస్తున్న అంతర్జాతీయ బయోసెన్సర్ల పోటీ కోసం తయారుచేసిన ఈ వినూత్నమైన పరికరం భవిష్యత్తులో ఇతర యాంటీబయాటిక్‌లకూ ఉపయోగపడుతుందని ఈ విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ వాడకం వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయని, బధిరత్వం వచ్చేందుకు అవకాశం ఉంటుందని తెలిసినప్పటికీ అత్యవసర పరిస్థితుల్లో వైద్యులు దీన్ని ఉపయోగిస్తూంటారు. రక్తంలో యాంటీబయాటిక్ ఎంత మోతాదులో ఉందో తెలిస్తే.. అందుకు తగ్గట్టుగా తదుపరి డోస్‌లను నిర్ణయించుకోవచ్చునని, తద్వారా సైడ్ ఎఫెక్ట్స్‌ను తక్కువ చేయవచ్చునని విద్యార్థులు తెలిపారు. వాన్కోమైసిన్ తో జట్టుకట్టగల ఒక పెప్టైడ్‌ను సృష్టించి, ప్రతిదీప్తి లక్షణమున్న పదార్థాన్ని జోడించడం ద్వారా తాము ఈ సెన్సర్‌ను తయారు చేసినట్లు వివరించారు. -
నిరూపిస్తే జైలుకెళ్తా: వీరమాచినేని
హైదరాబాద్: తాను వైద్యుడిని కానని సామాజిక చైతన్యం తీసుకొచ్చే కార్యకర్తను మాత్రమేనని డైట్ గురు వీరమాచినేని రామకృష్ణ అన్నారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కిడ్నీలు చెడిపోవడానికి మధుమేహం ఎంత మాత్రం కారణం కాదని చెప్పారు. దీని కోసం తీసుకునే ట్రీట్మెంట్తో అనేక సైడ్ ఎఫెక్ట్స్ సంక్రమిస్తాయని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజలను డయాబెటిస్ పేరుతో దోచుకుంటున్నారని ఆరోపించారు. తాను చేసే ఆరోగ్య విధానం రోగాలను నయం చేస్తుందే తప్ప అనారోగ్యానికి గురి చేయదని స్పష్టం చేశారు. ఈ విధానం ద్వారా కిడ్నీ చెడిపోయిందని నిరూపిస్తే జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధమేనని చెప్పారు. -
డబ్బు కట్టలేదని అవయవాల దోపిడీ
టీ.నగర్ (చెన్నై): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని చికిత్సకైన ఖర్చును కుటుంబ సభ్యులు చెల్లించలేక పోవడంతో సదరు ఆసుపత్రి ఆ యువకుడి శరీరం నుంచి అవయవాలను కాజేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం పట్టణంలో చోటుచేసుకుంది. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామం తమిళనాడు సరిహద్దుల్లో, పొల్లాచ్చికి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన మణికంఠన్ అనే యువకుడు (24) రోడ్డు ప్రమాదంలో ఇటీవల తీవ్రంగా గాయపడగా సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చనిపోయే సమయానికి మణికంఠన్ చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చవ్వగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సుకు మరో రూ. 25 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం మణికంఠన్ కుటుంబీకులను కోరింది. ఆ డబ్బును తాము కట్టలేమని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులను మోసం చేసి కొన్ని పత్రాలపై ఆసుపత్రి యాజమాన్యం సంతకాలు చేయించుకుంది. అనంతరం మణికంఠన్ మృతదేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలను తీసుకుంది. `ఈ విషయాన్ని ఇంటికెళ్లాక గుర్తించిన మణికంఠన్ కుటుంబీకులు వెంటనే పాలక్కాడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం సీఎం పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాస్తూ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించారు. కాగా, ఇదే ప్రమాదంలో గాయపడి, బ్రెయిన్‌డెడ్ అయిన మణికంఠన్ అనే మరో యువకుడి నుంచి కూడా ఇదే ఆసుపత్రి వైద్యులు అవయవాలు కాజేసేందుకు ప్రయత్నించారని సమాచారం. -
కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చేయవచ్చా?
నా వయసు 32 ఏళ్లు. నాకు గతంలో కిడ్నీలో రాళ్లు వచ్చాయి. శస్త్రచికిత్స చేసి వాటిని తొలగించారు. ఆ తర్వాత మళ్లీ కొంతకాలంగా నడుంనొప్పి రావడంతో డాక్టర్‌ను సంప్రదించాను. వారు స్కాన్ తీయించి, మళ్లీ కిడ్నీలో రాళ్లు ఏర్పడ్డాయని చెప్పారు. నా సమస్యకు హోమియోలో చికిత్స ఉందా? మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడకుండా చేసేలా పరిష్కారం లభిస్తుందా? సలహా ఇవ్వండి. – సిరాజుద్దిన్, నల్లగొండ కిడ్నీలో రాళ్లు ఏర్పడటమనే సమస్య ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. కొందరిలో వీటిని శస్త్రచికిత్స ద్వారా తొలగించినప్పటికీ 50% మందిలో ఇవి మళ్లీ ఏర్పడే అవకాశం ఉంటుంది. కానీ కాన్స్టిట్యూషనల్ హోమియో చికిత్స ద్వారా వీటిని మళ్లీ ఏర్పడకుండా చేసే అవకాశం ఉంటుంది. మన శరీరంలో మూత్రపిండాలు అత్యంత కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని వడపోసి చెడు పదార్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి, శరీరంలోని లవణాల సమతుల్యతను కాపాడతాయి. ఎప్పుడైతే మూత్రంలో అధికంగా ఉండే లవణాలు స్ఫటికరూపాన్ని దాల్చి ఘనస్థితికి చేరతాయో, అప్పుడు కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. మూత్రవ్యవస్థలో భాగమైన మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం... ఇలా ఎక్కడైనా రాళ్లు ఏర్పడవచ్చు. కిడ్నీరాళ్లలో రకాలు : క్యాల్షియమ్ స్టోన్స్, ఆక్సలేట్ స్టోన్స్, సిస్టిక్ స్టోన్స్, స్ట్రూవైట్ స్టోన్స్, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఇలా కిడ్నీస్టోన్స్లో అనేక రకాలు ఉంటాయి. కారణాలు: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, మరికొన్ని ఇతర కారణాలతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. కొందరిలో మూత్రకోశ ఇన్ఫెక్షన్స్, మూత్రమార్గంలో అడ్డంకులు ఏర్పడటం, ఒకేచోట ఎక్కువసేపు కూర్చొని పనిచేయడం, శరీరంలో విటమిన్–ఏ పాళ్లు తగ్గడం వంటి ఎన్నో అంశాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి కారణాలుగా చెప్పవచ్చు. ఇవేకాకుండా కిడ్నీలో రాళ్లను ప్రేరేపించే అంశాలు... ఆహారంలో మాంసకృత్తులు, ఉప్పు ఎక్కువ మోతాదులో తీసుకోవడం; సాధారణం కంటే తక్కువగా (అంటే రోజుకు 1.5 లీటర్ల కంటే తక్కువగా) నీళ్లు తాగడం వంటి వాటితో కిడ్నీలో రాళ్లు రావచ్చు. ఇక కొన్ని ఇతర జబ్బుల వల్ల... ముఖ్యంగా హైపర్ కాల్సీమియా, రీనల్ ట్యూబులార్ అసిడోసిస్, జన్యుపరమైన కారణాలతో, ఆస్పిరిన్, యాంటాసిడ్స్, విటమిన్–సి ఉండే కొన్ని మందులు, క్యాల్షియమ్ సప్లిమెంట్లతోనూ కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. లక్షణాలు: విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట వంటివి కిడ్నీలో రాళ్లు ఉన్నప్పటి ప్రధాన లక్షణాలు. కొందరిలో ఒకవైపు నడుమునొప్పి రావడం, నొప్పితో పాటు జ్వరం, మూత్రంలో మంట వంటి లక్షణాలు కనిపిస్తాయి. మరికొందరిలో మూత్రనాళాల్లో రాళ్లు ఏర్పడతాయి. దీనివల్ల నడుము, ఉదరమధ్య భాగాల్లో నొప్పి, ఇక్కడి నుంచి నొప్పి పొత్తికడుపు, గజ్జలకు, కొన్నిసార్లు కాళ్లలోకి పాకడం జరుగుతుంది. మరికొందరిలో కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలూ, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు. వీటిని సైలెంట్ స్టోన్స్ అంటారు. చికిత్స: హోమియోలో కిడ్నీలో రాళ్లను తగ్గించేందుకూ, మళ్లీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం పడకుండా, రాళ్లను నియంత్రించేందుకూ అవకాశం ఉంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ వేసవి విహారయాత్ర తర్వాత కామెర్లు... చికిత్స ఉందా? నా వయసు 36 ఏళ్లు. ఈ వేసవిలో విహారయాత్రకు వెళ్లొచ్చిన తర్వాత ఆకలి తగ్గింది. మలబద్దకంగా అనిపించడంతో పాటు మూత్రం పచ్చగా వస్తోంది. కొందరు కామెర్లు వచ్చాయని అంటున్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా? – కె. సెల్వరాజ్, హైదరాబాద్ కామెర్లు అనేది కాలేయ సంబంధిత వ్యాధి. ఇటీవలి కాలంలో తరచూ తలెత్తుతున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటిగా చెప్పవచ్చు. ఒక వ్యక్తి ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు అతని కంటే ముందుగా ఇతరులే దీన్ని గుర్తిస్తారు. రక్తంలో బిలురుబిన్ పాళ్లు పెరిగినప్పుడు (హైపర్ బిలురుబినీమియా) చర్మం, కనుగుడ్లు, మ్యూకస్ మెంబ్రేన్స్‌లో పసుపుపచ్చ రంగు తేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. శరీరానికి ప్రాణవాయువు అయిన ఆక్సిజన్‌ను రక్తంలోకి ఎర్రరక్తకణాలు సరఫరా చేస్తాయి. ఇందులో హిమోగ్లోబిన్ అనే ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. దీని జీవితకాలం 120 రోజులు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత హీమోగ్లోబిన్‌లోని హీమ్ అనే పదార్థం ప్లీహం (స్లీ్పన్)లో శిథిలమైపోయి బైలురుబిన్, బైలివర్డిన్ అనే పసుపు రంగు వ్యర్థ పదార్థాలుగా మారిపోతాయి. శరీరంలో పసుపు రంగు పదార్థాలు పేరుకుపోవడాన్ని కామెర్లుగా చెప్పవచ్చు. సాధారణంగా కాలేయం ఈ వ్యర్థ పదార్థాలను సేకరించి, పైత్యరసంతో పాటు కాలేయ వాహిక (బైల్ డక్ట్) ద్వారా పేగుల్లోకి పంపుతుంది. అక్కడి నుంచి మలంతో పాటు ఈ పసుపు రంగు వ్యర్థపదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. కామెర్లకు కారణాలు: ∙హెపటైటిస్ ఏ, బి, సి, డి, ఈ అనే వైరస్ల కారణంగా కామెర్లు వచ్చే అవకాశం ఉంది ∙ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం ∙పుట్టుకతో వచ్చే కొన్ని లోపాలు ∙కాలేయం పాడైపోవడం ∙కాలేయం నుంచి పేగుల్లోకి వెళ్లే కాలేయ వాహికలో అంతరాయం ఏర్పడటం వంటివి జరిగితే కామెర్ల సమస్య తలెత్తే అవకాశం ఉంది. లక్షణాలు: ∙వికారం, వాంతులు ∙పొత్తికడుపులో నొప్పి ∙జ్వరం, నీరసం, తలనొప్పి కడుపు ఉబ్బరంగా ఉండటం కామెర్లు సోకినప్పుడు కళ్లు పచ్చబడటం. వ్యాధి నిర్ధారణ: సీబీపీ, ఎల్ఎఫ్టీ, సీటీ స్కాన్, ఎమ్మారై, అల్ట్రా సౌండ్ స్కాన్ చికిత్స: కామెర్లను తగ్గించడానికి హోమియోపతిలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి లక్షణాలను, శారీరక, మానసిక స్థితని పరిగణనలోకి తీసుకొని డాక్టర్లు మందులు సూచిస్తారు. ప్రారంభదశలోనే వాడితే కామెర్లను పూర్తిగా నయం చేయవచ్చు. ఈ సమస్యకు హోమియోలో చెలిడోనియం, సెలీనియం, లైకోపోడియం, మెర్క్‌సాల్, నాట్‌సల్ఫ్ వంటి మందులు డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన మంట... ఎందుకు? నా వయసు 35 ఏళ్లు. మూత్రవిసర్జన చేస్తున్నప్పుడు మంటగా ఉంటోంది. మహిళను కావడంతో ఈ సమస్య చెప్పుకోడానికి చాలా ఇబ్బందిగా ఉంది. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – సోదరి, కరీంనగర్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది. మూత్ర విసర్జక వ్యవస్థలో వచ్చే ఇన్ఫెక్షన్లను యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్గా పేర్కొంటారు. మహిళల్లో చాలా సాధారణంగా వస్తుంటాయి. వీటిలో రెండు రకాలు... అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రపిండాలు, మూత్రనాళాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది. మూత్రపిండాలకు వచ్చే ఇన్ఫెక్షన్ను పైలోనెఫ్రైటిస్ అంటారు. విపరీతమైన జ్వరం, చలి, వికారం, వాంతులు దీని లక్షణాలు. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్: ఇందులో మూత్రాశయం, యురెథ్రాలు ఉంటాయి. మూత్రాశయం ఇన్ఫెక్షన్ను సిస్టయిటిస్ అంటారు. యురెథ్రా ఇన్ఫెక్షన్ను యురెథ్రయిటిస్ అంటారు. కారణాలు: యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో దాదాపు 90 శాతం కేసుల్లో ఈ–కొలై అనే బ్యాక్టీరియా ప్రధానంగా కారణమవుతుంది. ఇది పేగుల్లో, మలద్వారం వద్ద పరాన్నజీవిగా జీవిస్తూ ఉంటుంది. సరైన వ్యక్తిగత పరిశుభ్రత పాటించనివారిలో ఈ–కొలై బ్యాక్టీరియా పైపైకి పాకుతూ మూత్రకోశ ఇన్ఫెక్షన్స్కు దారితీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉండటం కూడా మూత్రవిసర్జనకు ప్రధాన అడ్డంకిగా మారి, దీనివల్ల కూడా బ్యాక్టీరియా త్వరగా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్కు దారితీయవచ్చు. రోగనిరోధకశక్తి తగ్గినవారిలో తరచూ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అందుకే హెచ్ఐవీ/ఎయిడ్స్, డయాబెటిస్, క్యాన్సర్‌తో బాధపడేవారికి తరచూ ఈ ఇన్ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించే మహిళల్లో, ప్రోస్టటైటిస్‌తో బాధపడే పురుషుల్లో సులభంగా ఈ ఇన్ఫెక్షన్లు వస్తాయి. లక్షణాలు: మూత్రవిసర్జనకు ముందుగానీ, తర్వాతగానీ విపరీతమైన మంట ఉండటం, ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం, మూత్రంలో రక్తం పడటం, పొత్తికడుపు వద్ద నొప్పి, చలిజ్వరం, వాంతులు, వికారం. వ్యాధి నిర్ధారణ పరీక్షలు: యూరిన్ ఎగ్జామినేషన్, రక్తపరీక్ష, అల్ట్రాసౌండ్ స్కానింగ్. హోమియోపతి చికిత్స: రోగిలో మళ్లీ మళ్లీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడానికి హోమియో మందులు తోడ్పడతాయి. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి హోమియోలో మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యా«ధిలక్షణాలను పరిగణనలోకి తీసుకొని, వ్యక్తి తత్వాన్ని బట్టి – బెల్లడోనా, ఎపిస్, క్యాంథరిస్, సరసాపరిల్లా వంటి మందులను నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో, క్రమం తప్పకుండా, నిర్ణీతకాలం వాడితే మంచి ఫలితాలు ఉంటాయి. డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ, పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
అంపశయ్యపై ‘శిరీష’
దుగ్గొండి (నర్సంపేట): వరంగల్ రూరల్ జిల్లా దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన రేగుల శోభన్–సౌందర్య దంపతులది నిరుపేద కుటుంబం. వారికి ప్రశాంత్, శిరీష ఇద్దరు సంతానం. భార్యాభర్తలు కూలి పనులకు వెళ్లి వచ్చిన దాంతో పిల్లలను పోషించుకుంటున్నారు. డిగ్రీ పూర్తి చేసిన కుమారుడు ప్రశాంత్ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కూతురు శిరీష డిగ్రీ ఫైనలియర్ చదువుతోంది. అయితే ఆమె కొన్నేళ్ల నుంచి రక్తహీనతతో బాధపడుతుండేది. దీంతో తల్లిదండ్రులు వరంగల్, హన్మకొండలోని పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. రూ.3 లక్షల వరకు ఖర్చయ్యాయి. ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో 6 నెలల క్రితం ఇదే మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లి చేశారు. వైద్యానికి, వివాహానికి అప్పులు చేయడంతో ఉన్న 2 ఎకరాల భూమి రూ.8 లక్షలకు అమ్మి వేశారు. శిరీష పెళ్లి అయిన 3 రోజులకే వ్యాధి తిరగబెట్టింది. కాళ్లు, ముఖం వాచిపోవడంతో హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు కిడ్నీలు పాడైపోయాయని తప్పనిసరిగా మార్చాలని చెప్పారు. 6 నెలలుగా హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రుల్లో చికిత్స కోసం మరో రూ.3 లక్షలు ఖర్చు చేసినా ఫలితం దక్కలేదు. మంచం పై నుంచి లేవలేని స్థితిలో ఉన్న శిరీష డయాలసిస్‌తో కాలం గడుపుతోంది. తల్లి ముందుకొచ్చినా.. శిరీషకు కనీసం ఒక కిడ్నీ మారిస్తేనే బతుకుతుం దని డాక్టర్లు చెప్పడంతో తల్లి సౌందర్య తన కిడ్నీ ఇచ్చేందుకు సిద్ధమైంది. రక్త పరీక్షలు సరిపోలడం తో కిడ్నీ మార్చడానికి ఇబ్బందులు తొలగాయి. ఆపరేషన్‌కు రూ.లక్ష వరకు ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పారు. తన కిడ్నీ ఇచ్చి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కూతురిని బతికించుకుందామన్నా ఆపరేషన్‌కు డబ్బులు లేక కన్నపేగు తల్లడిల్లుతోంది. మానవతావాదులు సాయం అందించి శిరీషను ఆదుకోవాలని తల్లి వేడుకుంటోంది. సాయం చేయాలనుకునే వారు సెల్ నంబర్ 7732045246 ఫోన్ చేయాలని కోరారు. -
గ్రాఫీన్‌తో వేగవంతమైన డయాలసిస్!
కిడ్నీలు పాడైతే డయాలసిస్ చేయించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. అయితే డయాలసిస్ చేయించుకోవాలంటే దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఆ సమయంలో విపరీతమైన నొప్పి అనుభవించాల్సి ఉంటుంది. ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుక్కున్నారు. గ్రాఫీన్ అనే పదార్థంతో తయారు చేసిన ఫిల్టర్లను ఉపయోగిస్తే.. డయాలసిస్ పదిరెట్లు ఎక్కువ వేగంతో జరుగుతుందని నిరూపించారు. దీంతో ఈ ప్రక్రియ అతితక్కువ సమయంలోనే పూర్తవుతుందన్న మాట. డయాలసిస్ యంత్రాల్లో ఉపయోగిస్తున్న ఫిల్టర్లు చాలా మందంగా ఉంటాయని, గ్రాఫీన్ ఒక నానోమీటర్ మందం మాత్రమే ఉండటం వల్ల రక్తంలోని వ్యర్థ పదార్థాలను సులువుగా, వేగంగా వేరు చేయొచ్చని మెకానికల్ ఇంజనీరింగ్‌కు చెందిన పిరన్ కిడాంబి అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వేర్వేరు సైజుల గ్రాఫీన్ పొరలను తయారు చేసేందుకు కొత్త పద్ధతిని సిద్ధం చేశామని చెప్పారు. ఈ పద్ధతి ద్వారా కేవలం 0.66 నానోమీటర్ల సైజుండే పొటాషియం క్లోరైడ్ అణువులను కూడా ఫిల్టర్ చేయగల పొరలను సిద్ధం చేశామని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు అడ్వాన్స్ మెటీరియల్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు
-
పోలీసుల దాడితో పాడైన కిడ్నీలు
► ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి బాధితుడి కుటుంబ సభ్యుల వినతి వికారాబాద్ అర్బన్: పోలీసులు అకారణంగా ఓ యువకుడిపై దాడి చేయడంతో రెండు కిడ్నీలు పాడై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీనికి బాధ్యులైన ఎస్ఐ తోపాటు కానిస్టేబుళ్లపై బాధితుడి కుటుం బ సభ్యులు సోమవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ అన్నపూర్ణకు ఫిర్యాదు చేశారు. వికారాబాద్ మండలం ఎర్రవల్లికి చెందిన కన్నారెడ్డి డిగ్రీ పూర్తి చేశాడు. మోమిన్‌పేట మండల కేంద్రంలో ఫర్టిలైజర్ షాపు ప్రారంభిద్దామని మండల వ్యవసాయ అధికారి(ఏవో) నీరజను సంప్రదించాడు. 2 నెలలపాటు కార్యాలయానికి తిప్పించుకున్న ఆమె వ్యాపారానికి అనుమతి ఇచ్చేందుకు రూ.20 వేల లంచం ఇవ్వా లని అడిగారని బాధితుడు ఆరోపిస్తు న్నాడు. దీనికి కన్నారెడ్డి అంగీకరించక పోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరి గింది. ఈ నెల 20న మోమిన్‌పేట పోలీ సులకు నీరజ ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ రాజు కార్యాలయానికి వెళ్లి కన్నారెడ్డిని చితకబాదారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులతో తీవ్రంగా కొట్టిం చారు. తీవ్ర అస్వస్థతకు గురైన కన్నారెడ్డిని కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతడి రెండు కిడ్నీలు పాడైనట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం కన్నా రెడ్డి ఆస్పత్రిలోనే చికిత్స పొందున్నాడు. ఎస్ఐతోపాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని బాధితుడి కుటుంబీకులు వికారాబాద్ ఎస్పీ అన్నపూర్ణను కలసి విజ్ఞప్తి చేశారు. -
కిడ్నీ రోగులపై నిర్లక్ష్యం
ప్రైవేటు భాగస్వామ్యం కన్నా ప్రభుత్వ సేవలే మిన్న నెల్లూరు పెద్దాస్పత్రిలో పరిస్థితి కిడ్నీలు దెబ్బతిని.. డయాలసిస్ కోసం నిత్యం పెద్ద సంఖ్యలో రోగులు నెల్లూరులోని పెద్దాస్పత్రికి వస్తున్నారు. ఆస్పత్రిలో పీపీపీ పద్ధతిలో ప్రైవేటు సేవలు అందుతున్నాయి. ఒక డయాలసిస్ విభాగాన్ని అధునాతన మిషనరీ పేరుతో ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోంది. మరో డయాలసిస్ విభాగాన్ని ఆస్పత్రి యాజమాన్యం నిర్వహిస్తోంది. ప్రైవేటు సంస్థ నిర్వహిస్తోన్న డయాలసిస్‌లో రోగులకు సౌకర్యాలు అందడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లూరు(అర్బన్):నగరంలోని పెద్దాస్పత్రిలో ఓ ప్రైవేటు సంస్థ ఆరోగ్యశ్రీ నిధులతో కిడ్నీ రోగులకు సేవలందిస్తోంది. ఆరోగ్యశ్రీ ద్వారా రోగులకు నిధులు విడుదల చేస్తారు. వార్డు పెద్దాస్పత్రికి చెందినదైనప్పటికీ మిషనరీ, పారిశుద్ధ్యం, ఏసీ లాంటి వసతులన్నీ ఆ ప్రైవేటు సంస్థే సమకూర్చుకోవాలి. రోగులకు డయాలసిస్ విభాగంలో ఏసీ కచ్చితంగా ఉండాలి. ఆ సంస్థ పరిధిలో 12 యూనిట్లు(బెడ్లు) ఉన్నాయి. ఒక రోగికి వివిధ సిటింగ్‌లలో డయాలసిస్ చేస్తే ప్రభుత్వం ఆ ప్రైవేటు సంస్థకు రూ.12,500 ఇస్తుంది. వార్డును, నీటిని , విద్యుత్‌ను వాడుకున్నందుకు డిశ్చార్జి అయ్యేనాటికి ఎన్ని రోజులున్నా ఆ నగదులో రూ.1500 ప్రభుత్వ ఆస్పత్రికి ఆ సంస్థ చెల్లిస్తోంది. డిశ్చార్జి అయి మళ్లీ సేవలందించేటప్పుడు మరో రూ.12,500ను ప్రైవేటు సంస్థకు ఆరోగ్యశ్రీ వారు చెల్లిస్తారు. ఇలా రోగి అడ్మిట్ అయినప్పుడల్లా చెల్లిస్తారు. సేవలు దారుణం డబ్బులు తీసుకుంటున్న ఆ సంస్థ రోగులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలమయిందనే ఆరోపణలున్నాయి. రోగులు నిరుపేదలు, నిరక్షరాస్యులు కావడం, ప్రశ్నించలేని తత్వమే కాబోలు ఇలా చేస్తున్నారని విమర్శలున్నాయి. సేవల్లో లోపాల్లో కొన్ని.. ► రెండు ఏసీలు మరమ్మతులకు గురైనా పట్టించుకోలేదు. ఉన్న ఏసీల నుంచి సరిగా గాలి రావడం లేదు. ఉక్కపోత ఉంటుంది. ఈ విషయాన్ని ఇటీవల తనిఖీల సందర్భంగా ఆస్పత్రి అ«భివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహారావే నిర్వాహకులను నిలదీశారు. ► పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. బాత్రూం వద్ద నుంచి వస్తున్న దుర్గంధం రోగులు భరించలేకున్నారు. ► వార్డులో పైన కొన్ని లైట్లు మరమ్మతులకు గురయ్యాయి ఆస్పత్రి డయాలసిస్ మిన్న.. ప్రభుత్వ ఆస్పత్రి నేరుగా మూడు డయాలసిస్ యూనిట్లను నిర్వహిస్తోంది. ఇక్కడ ఏసీ బాగా పనిచేస్తుండడంతోపాటు పారిశుద్ధ్యం మెరుగ్గా ఉంది. లోపాలు సరిచేయమని చెప్పా రోజు వారి తనిఖీల్లో భాగంగా ప్రైవేటు సంస్థ నిర్వహిస్తున్న డయాలసిస్ విభాగాన్ని ఇటీవల తనిఖీ చేశా. అందులో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. ఏసీలు పనిచేయడం లేదు. వాటిని బాగు చేయించాలని నిర్వాహకులను కోరా. –చాట్ల నరసింహారావు,పెద్దాస్ప అభివృద్ధి కమిటీ చైర్మన్ -
చర్మం దురదపెడుతోంది.. తగ్గేదెలా?
నా వయసు 46 ఏళ్లు. నాకు చాలాకాలంగా తలలో, ముఖం మీద, కనురెప్పల దగ్గర చర్మం ఎర్రటి, తెల్లటి పొరలతో దురదగా ఉంటోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే సెబోరిక్ డర్మటైటిస్ అని చెప్పారు. మందులు వాడినప్పుడు సమస్య తగ్గినట్లే అనిపిస్తోంది కానీ వెంటనే మళ్లీ తిరగబెడుతోంది. ఈ సమస్య అసలెందుకు వస్తోంది? ఇది హోమియోలో పూర్తిగా నయమవుతుందా? దయచేసి తగిన సలహా ఇవ్వండి. – నిరంజన్‌రెడ్డి, కర్నూలు చర్మంలో సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉండే భాగాలు ఎర్రగా మారడం, దురద వంటి లక్షణాలు సెబోరిక్ డర్మటైటిస్ ఉన్నవారిలో కనిపిస్తుంటాయి. ఇది 30 నుంచి 70 ఏళ్ల వారితో పాటు మూడు నెలల శిశువులలోనూ కనిపిస్తుంది. వీళ్లలో 6 నుంచి 12 నెల వయసు వరకు ఇది తగ్గిపోతుంటుంది. తలలో వచ్చే తేలికపాటి సెబోరిక్ డర్మటైటిస్‌ని చుండ్రు అని అంటారు. ఇది ఎక్కువ మందిని వేధించే సమస్య. ఈ వ్యాధి ఎక్కువగా తల, ముఖం, ఛాతీ, వీపు, చెవి లోపలి భాగాలతో పాటు వెంట్రుకలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో కనిపిస్తుంటుంది. కారణాలు ఈ వ్యాధికి కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ చర్మంలోని సెబేషియస్ గ్రంథులు ఎక్కువగా ఉన్న చోట మలసేజియా అనే ఒక రకం జీవజాతి అధికంగా అభివృద్ధి చెంది కొన్ని హానికరమైన పదార్థాలను విడుదల చేస్తుంది. ఈ అంశం సెబోరిక్ డర్మటైటిస్‌ను ప్రేరేపిస్తుంది. ∙రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉండే హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లోనూ, పార్కిన్సన్ వ్యాధిగ్రస్తుల్లోనూ ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ. ∙మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండేవారిలో, జిడ్డు చర్మం ఉండేవారిలో ఇది కనిపించే అవకాశాలు అధికం. ∙వాతావరణం, హార్మోన్ సమస్యలు, కొన్ని జన్యుపరమైన అంశాలు ఈ వ్యాధిని ప్రభావితం చేయవచ్చు. లక్షణాలు ∙సెబోరిక్ డర్మటైటిస్ లక్షణాలు క్రమంగా ఏర్పడతాయి ∙చర్మంపై ఎర్రటి, తెల్లటి లేదా పసుపు వర్ణంలో పొరలు ఏర్పడతాయి. దురద, మంట కనిపిస్తుంటుంది ∙దీని తీవ్రత సాధారణంగా చలికాలంలో ఎక్కువగానూ, వేసవిలో ఒకింత తక్కువగానూ ఉంటుంది. నిర్ధారణ వ్యాధి లక్షణాలను బట్టి దీన్ని గుర్తించవచ్చు. ఇది సోరియాసిస్‌ను పోలి ఉంటుంది. కానీ సోరియాసిన్ ముఖాన్ని ప్రభావితం చేయకపోవడం వల్ల ఈ రెండింటి మధ్య తేడాను గుర్తించవచ్చు. మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఆధునిక జెనెటిక్ కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా రోగనిరోధక శక్తిని సరిచేయడం వల్ల సెబోరిక్ డర్మటైటిస్‌ను పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ నా కిడ్నీలు పని చేయడం లేదా?! నా వయసు 65 ఏళ్లు. గత ఐదేళ్లుగా నేను హైబీపీతో బాధపడుతున్నాను. కిందటి ఏడాది ఒకసారి రక్తపరీక్షలు చేయించుకుంటే క్రియాటినిన్ 6, యూరియా 120 వరకు ఉన్నాయి. నా కిడ్నీలు పనిచేయడం లేదన్నారు గానీ నాకు ఎలాంటి ఇబ్బందులూ లేవు. నాకు ఇలా ఏ లక్షణాలూ కనిపించకపోయినా లోపల ఏవైనా సమస్యలు ఉండి ఉంటాయా? నాకు తగిన సలహా ఇవ్వండి. – శ్రీనివాసరావు, ఇల్లందు మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీరు క్రానిక్ కిడ్నీ డిసీజ్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ జబ్బు వచ్చినవారిలో రెండు కిడ్నీల పనితీరు బాగా తగ్గిపోతుంది. రక్తపరీక్షలూ ఏమీ తెలియకపోవచ్చు. సాధారణంగా అయితే కిడ్నీ పనితీరు 30 శాతం కంటే తగ్గగానే ఈ జబ్బు లక్షణాలు వెంటనే తెలుస్తాయి. కాబట్టి మీరు ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. హైబీపీ, డయాబెటిస్, కిడ్నీలో రాళ్లు, కిడ్నీ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న కుటుంబాల్లో ఎవరికైనా కిడ్నీ వ్యాధులు ఉంటే... వారికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి వాళ్లు ప్రతి ఏడాదీ కిడ్నీ ఎంత శాతం పనిచేస్తుందో తెలుసుకునే పరీక్షలు చేయించుకోవాలి. ఈ వ్యాధిని ఎంత త్వరగా గుర్తిస్తే... కిడ్నీలను కాపాడుకునే వీలు అంత ఎక్కువ. నా వయసు 42 ఏళ్లు. ఒక ఏడాదిగా క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటున్నాను. నాకు ఈమధ్య విపరీతంగా చర్మం దురద పెడుతోంది. ఎందుకిలా జరుగుతోంది? దురద రాకుండా ఉండటానికి ఏం చేయాలి? – ఈశ్వరయ్య, నల్లగొండ డయాలసిస్ చేయించుకునే పేషెంట్స్‌లో చర్మం పొడిగా అవుతుంది. అంతేకాకుండా వాళ్ల రక్తంలో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంవల్ల కూడా దురద ఎక్కువగా వస్తుంటుంది. చర్మం పొడిగా ఉన్నవాళ్లు స్నానం తర్వాత చర్మంపై వాజిలేన్ లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. రక్తంలో ఫాస్పరస్ తగ్గించే మందులు తీసుకోవడంతో పాటు ఆహారంలో పాల ఉత్పాదనలు, మాంసాహారం తీసుకోవడం తగ్గించాలి. రక్తహీనత ఉన్నవాళ్తు రక్తం పెరగడానికి మందులు వాడాలి. నా వయసు 52 ఏళ్లు. నాకు గత పన్నెండేళ్లుగా షుగర్ ఉంది. ఈమధ్య ఎక్కువగా ప్రయాణం చేసేటప్పుడు కాళ్ల వాపులు వస్తున్నాయి. నా రక్తపరీక్షలో క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్, యూరియా 28 ఎంజీ/డీఎల్, ప్రోటీన్ మూడు ప్లస్ ఉన్నాయని చెప్పారు. నాకు షుగర్ వల్ల సమస్య వస్తోందా? నాకు తగిన సలహా ఇవ్వండి. – సుబ్బారావు, పెందుర్తి మీ రిపోర్డులను బట్టి మీకు మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతోంది. ఇది మీకు ఉన్న షుగర్ వ్యాధి వల్ల వచ్చిన కిడ్నీ సమస్యా (డయాబెటిక్ నెఫ్రోపతి) లేక మరోదైనా సమస్యతో ఇలా జరుగుతోందా అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. మీరు ఒకసారి కంటి డాక్టర్ దగ్గకు కూడా వెళ్లి రెటీనా పరీక్ష చేయించుకోవాలి. షుగర్ వల్ల రెటీనా దెబ్బతింటే (డయాబెటిక్ రెటినోపతి) అనే సమస్య వస్తుంది. మీ మూత్రంలో యూరియా ఎక్కువగా పోవడం కూడా షుగర్ వల్లనే అయి ఉంటుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీ దెబ్బతినకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొదటగా షుగర్ నియంత్రణలో ఉంచుకోవాలి. తినకముందు బ్లడ్ షుగర్ 100 ఎంజీ/డీఎల్, తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా నియంత్రించుకోవాలి. బీపీ 125/75 ఎమ్ఎమ్హెచ్జీ ఉండేలా చూసుకోవాలి. మూత్రంలో ప్రోటీన్ పోవడం తగ్గించడం కోసం ఏసీఈ, ఏఆర్‌బీ అనే మందులు వాడాలి. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు 150 ఎంజీ/డీఎల్ లోపలే ఉండేలా జాగ్రత్తపడాలి. ఇవే కాకుండా ఉప్పు బాగా తగ్గించి వాడాలి. (రోజుకు రెండు గ్రాముల కంటే తక్కువే తీసుకోవాలి). పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి. డాక్టర్ సూచించకుండా నొప్పి నివారణ మందులు వాడకూడదు. డాక్టర్ విక్రాంత్‌రెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్