టీ.నగర్ (చెన్నై): రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, అతని చికిత్సకైన ఖర్చును కుటుంబ సభ్యులు చెల్లించలేక పోవడంతో సదరు ఆసుపత్రి ఆ యువకుడి శరీరం నుంచి అవయవాలను కాజేసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం పట్టణంలో చోటుచేసుకుంది. కేరళ పాలక్కాడ్ జిల్లాలోని మీనాక్షిపురం అనే గ్రామం తమిళనాడు సరిహద్దుల్లో, పొల్లాచ్చికి సమీపంలో ఉంటుంది. ఈ గ్రామానికి చెందిన మణికంఠన్ అనే యువకుడు (24) రోడ్డు ప్రమాదంలో ఇటీవల తీవ్రంగా గాయపడగా సేలంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
చనిపోయే సమయానికి మణికంఠన్ చికిత్సకు రూ. 3 లక్షలు ఖర్చవ్వగా, మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లేందుకు అంబులెన్సుకు మరో రూ. 25 వేలు చెల్లించాలని ఆసుపత్రి యాజమాన్యం మణికంఠన్ కుటుంబీకులను కోరింది. ఆ డబ్బును తాము కట్టలేమని వారు చెప్పడంతో కుటుంబ సభ్యులను మోసం చేసి కొన్ని పత్రాలపై ఆసుపత్రి యాజమాన్యం సంతకాలు చేయించుకుంది. అనంతరం మణికంఠన్ మృతదేహం నుంచి మూత్రపిండాలు, కళ్లు తదితర అవయవాలను తీసుకుంది.
`ఈ విషయాన్ని ఇంటికెళ్లాక గుర్తించిన మణికంఠన్ కుటుంబీకులు వెంటనే పాలక్కాడ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో విషయం సీఎం పినరయి విజయన్ దృష్టికి వెళ్లింది. వెంటనే ఆయన తమిళనాడు సీఎం పళనిస్వామికి లేఖ రాస్తూ ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో అధికారులు విచారణ జరిపి నివేదికను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలకు అందించారు. కాగా, ఇదే ప్రమాదంలో గాయపడి, బ్రెయిన్‌డెడ్ అయిన మణికంఠన్ అనే మరో యువకుడి నుంచి కూడా ఇదే ఆసుపత్రి వైద్యులు అవయవాలు కాజేసేందుకు ప్రయత్నించారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment