సాక్షి, హైదరాబాద్: మధ్యప్రాచ్యాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు భారత్‌ను వణికిస్తోంది. దీన్నే మెర్స్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) అని అంటారు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల్లో ఈ జాడలు కనిపిస్తూండటం ప్రభుత్వాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. తాజాగా సౌదీ అరేబియా నుంచి అనంతపురం జిల్లాకు వచ్చిన ఇరవై ఏడేళ్ల మహిళకు కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానించి నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ల్యాబ్‌లో రక్తపరీక్షలు నిర్వహించారు. అయితే ఆమెకు ఆ వైరస్ సోకలేదని ల్యాబొరేటరీ తెలిపింది.
అయినా కరోనా వైరస్ దేశంలోకి వచ్చే అవకాశం ఉండటంతో అన్ని అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌లను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. ఎయిర్‌పోర్ట్‌ల్లో ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేసింది. ముఖ్యంగా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది గల్ఫ్ దేశాలకు వెళుతూంటారని, అక్కడ్నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఈ వైరస్‌ను తీసుకు వచ్చే అవకాశం ఉంటుందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వైరస్‌కు ఒకరి నుంచి ఒకరికి అతి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం ఉండటంతో ఎయిర్‌పోర్ట్‌లోనే దీన్ని నియంత్రించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో హైదరాబాద్‌లోనూ అధికారులు వైద్యులను ఏర్పాటు చేశారు. గత ఏడాది సౌదీలో కరోనా వైరస్ బారిన పడి 50 మంది మృతి చెందారు.
ప్రమాదకారి కరోనా...
కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరమైనదిగా వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా అరవై ఏళ్లు దాటిన వారికీ, మహిళలకూ ఎక్కువగా సోకే అవకాశం ఉందన్నారు. వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే నియంత్రించడం సాధ్యమేనని వైద్యాధికారులు చెప్పారు. కరోనా వైరస్ లక్షణాలు ఇలా ఉంటాయి..
స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలను పోలి ఉంటుంది వైరస్ సోకిన రెండ్రోజుల్లోనే తీవ్రమైన జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, దగ్గు తీవ్రత పెరుగి ఊపిరితిత్తుల సమస్యలు మొదలవుతాయి. విపరీతమైన ఆయాసంతో గాలి తీసుకోలేని పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత న్యుమోనియాకు దారితీసే అవకాశమూ ఉంటుంది. వ్యాధి తీవ్రత పెరిగితే మూత్రపిండాలకూ ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.
భారత్‌ను వణికిస్తున్న కరోనా వైరస్
Published Sat, Nov 16 2013 3:19 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM
Advertisement
Advertisement