♦ కిడ్నీలు దెబ్బతిని మంచాన పడ్డ మెకానిక్
♦ దయనీయ స్థితిలో దళిత కుటుంబం
♦ ప్రభుత్వ సాయం కోసం విన్నపాలు
వర్గల్ : అతనిది నిరుపేద కుటుంబం. రేకుల షెడ్డే ఇల్లు. అతను మెకానిక్‌గా.. భార్య కూలి పనిచేస్తే తప్ప కుటుంబం గడవలేని పరిస్థితి. అయినా, పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లో చదివిస్తున్నారు. ఇంతలో అతని ఆరోగ్యం దెబ్బతిన్నది. కిడ్నీలు పాడవడంతో డియాలసిస్ చేయించుకోవాల్సిన దుస్థితి. స్నేహితులు కొంతమేర సహాయం చేస్తున్నా.. ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. వర్గల్ మండలం పాములపర్తిలో దళిత కుటుంబానికి చెందిన చిగురుపల్లి శ్రీనివాస్(30) పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆపై ఫ్యాన్లు, కూలర్లు, సబ్‌మెర్సిబుల్ మోటార్ల రిపేరింగ్ నేర్చుకున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం ప్రజ్ఞాపూర్‌లో పనిచేస్తూ మంగమ్మను వివాహం చేసుకున్నాడు.
వారికి మహేశ్(8), మాధురి(7) పిల్లలు. శ్రీనివాస్ మెకానిక్‌గా కలిగారు. తాను మెకానిక్‌గా, భార్య కూలి చేస్తూ పిల్లల్ని ప్రైవేటు స్కూల్‌లో చదివిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఏడాది క్రితం శ్రీను అకస్మాత్తుగా జర్వపీడితుడై.. నడవలేని స్థితికి చేరాడు. ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించగా మూత్రపిండాలు దెబ్బతున్నట్టు తెలిసింది. దీంతో ఆ కుటుంబం ఒక్కసారిగా కుదుపునకు గురైంది. పొందుపు చేసిన డబ్బులు, తెచ్చిన అప్పులు ప్రాథమిక పరీక్షలు, చికిత్సలకే సరిపోయాయి. దీంతో పిల్లల చదువులు ప్రైవేటు స్కూల్ నుంచి ఊళ్లోని సర్కార్ బడికి మారింది. వారానికి మూడుసార్లు డయాలసిస్ చేసుకుంటే తప్ప.. ప్రాణాలు నిలవవని, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం లక్షల్లో ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం మరింత ఆందోళనకు గురైంది. డయాలసిస్, మందులకు వారానికి సగటున రూ.8 వేలు ఖర్చు అవుతున్నాయి. ఖరీదైన వైద్యం చేయించుకోలేక ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్నారు.
మిత్రులే అండగా..
గ్రామానికి చెందిన కరుణాకర్, రవి, రాజేశ్ తదితరులు స్నేహితుడు శ్రీనివాస్‌కు తోడుగా నిలిచారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకునే వీరంతా భారీగా ఆర్థిక సహాయం చేయలేకపోయినా.. డయాలసిస్‌కు అవసరమైన డబ్బులు సమకూర్చుతున్నారు. ఎవరైనా కనపడితే చాలు మిత్రుడి దుస్థితి వివరించి ఆదుకోవాలని కోరుతున్నారు.
కుటుంబానికి గుదిబండ అయ్యా
రేకుల షెడ్డే మా ఇల్లు. నిరుడు నా ఆరోగ్యం దెబ్బతిన్నది. హైదరాబాద్‌ల టెస్టులు చేయిస్తే రెండు కిడ్నీలు దెబ్బతిన్నట్టు తెలిసింది. వైద్యం కోసం నా దగ్గర ఉన్న డబ్బులు మొత్తం ఖర్చు చేసిన. జీవితాంతం డయాలసిస్ చేయించుకోవాలని డాక్టర్లు చెప్పిన్రు. వారానికి రెండుసార్లు బ్లడ్ ఇంజెక్షన్లు, ఐరన్ ఇంజెక్షన్లు తీసుకోవాలి. కిడ్నీలు మార్పించుకోవాలన్నరు. ఆరోగ్యశ్రీ ద్వారా గాంధీ ఆస్పత్రిల్లో డయాలసిస్ చేయించుకుంటున్న. వారానికి అన్ని ఖర్చులు కలిపి రూ. 8,000 అయితున్నయ్. దోస్తుల సాయంతోనే ఇప్పటిదాక నెట్టుకొచ్చిన. నెలకు రూ. 32,000 ఖర్చు ఎవలిస్తరు. ‘జీవన ధార’ల కిడ్నీల కోసం దరఖాస్తు పెట్టినం. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావులు సాయం చేస్తే బతికినంత కాలం రుణపడి ఉంట. సాయం చేయాలనుకున్నవారు సెల్‌నెంబర్: 83749 86639కు కాల్ చేయండి. - శ్రీనివాస్
దోస్తులే దేవుళ్లు
ఆయన, నేను కూలి చేసుకునేటోళ్లమే. అన్నదమ్ములు సా యం చేసే పరిస్థితి లేదు. మా ఆయన కిడ్నీలు దెబ్బతిని మంచం పట్టిండు. నీళ్లు ఎక్కువ తాగొద్దు, తిండి ఎక్కువ తినొద్దు. ఏది తేడా అయినా కడుపు ఉబ్బుతది, అజీర్ణం అయితది. మనిషి ఆగమాగం చేస్తడు. దీంతో కూలీ పని వదిలి ఇంటి వద్దే ఉంటున్న. ఆయన దోస్తులే దేవుళ్ల లెక్క మాకు సాయం చేస్తున్నరు. సర్కారు సాయం చేసి మా ఆయనను కిడ్నీ వ్యాధి నుంచి కాపాడాలె. కిరాణా దుకాణం పెట్టుకునేటందుకు సాయం జేస్తె బాగుంటది. - మంగమ్మ, శ్రీనివాస్ భార్య