పంది మూత్రపిండం తయారీ సక్సెస్!
వాషింగ్టన్: కృత్రిమ మూత్రపిండాల ఉత్పత్తి దిశగా కీలక ముందడుగు పడింది. అమెరికా, నార్త్ కరోలినాలోని వేక్ ఫారెస్ట్ బాప్టిస్ట్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తలు ల్యాబ్‌లో పంది మూత్రపిండాలను తయారు చేయడంలో విజయం సాధించారు. పంది మూత్రపిండాలు కూడా మనిషి కిడ్నీలంత సైజులోనే ఉంటాయి. వాటి పనితీరు కూడా దాదాపుగా ఒకేలా ఉంటుంది. అందుకే తొలుత పంది మూత్రపిండాల తయారీపై శాస్త్రవేత్తలు దృష్టిపెట్టారు. ఇప్పటిదాకా ల్యాబ్‌లో సృష్టించిన మూత్రపిండాలన్నీ ఎలుకలకు ఉండే కిడ్నీల సైజులో మాత్రమే సాధ్యం అయ్యాయి.
పైగా రెండు గంటలు పనిచేయగానే వాటిలోని రక్తనాళాలు మూసుకుపోయేవి. ఈ నేపథ్యంలో పరిశోధనలను ముమ్మరం చేసిన వేక్ ఫారెస్ట్ శాస్త్రవేత్తలు.. ఎట్టకేలకు రక్తనాళాలు మూసుకుపోకుండా నాలుగు గంటల పాటు పనిచేసే మూత్రపిండాలను తయారు చేశారు. దీంతో ఇదే పద్ధతిని అనుసరించి మూలకణాలతో మనుషులకు కూడా కిడ్నీలను తయారు చేసేందుకు మార్గం సుగమం అయింది. ఇది పూర్తిస్థాయిలో విజయవంతం అయితే గనక.. కిడ్నీలతో పాటు కాలేయం, క్లోమం వంటి క్లిష్టమైన అవయవాల ఉత్పత్తి కూడా సాధ్యం కానుంది.