
కిడ్నీ.. మానవ శరీరంలో అతిముఖ్యమైన అవయవం. తినేతిండి, తాగే నీటిని వడకట్టి వడబోసి.. శరీరానికి అవసరమైన శక్తిని రక్తంలోకి, మలినాలను, వ్యర్థాలను మలమూత్రవిసర్జన ద్వారా బయటికి పంపించే ప్రక్రియను కిడ్నీ నిర్వహిస్తుంది. ఇటీవలకాలంలో తెలంగాణ కరీంనగర్ జిల్లాలో కిడ్నీవ్యాధి బాధితులు పెరుగుతున్నారు. పిల్లలు, యువతను సైతం సమస్య వెంటాడుతోంది. అనేక మందికి ముందస్తు లక్షణాలు లేకపోవడం, మధుమేహం లేకపోయినా మూత్రపిండాలు పనిచేయడం ఆగిపోవడం కనిపిస్తోంది. దశాబ్దకాలంలో వేలాదిమంది మరణాలకు కారణమైన వ్యాధికి ప్రధాన కారణాలు మధుమేహం, అధిక రక్తపోటు కాగా పెయిన్ కిల్లర్స్ అధిక వినియోగం, డీహైడ్రేషన్ మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా కథనం.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం జిల్లెల్లకు చెందిన పబ్బతి విజయేందర్‌రెడ్డి(55) వ్యవసాయం చేస్తుంటాడు. ఒకరోజు అనూహ్యంగా వాంతులయ్యాయి. కాళ్లు వాపులు వచ్చాయి. వెంటనే కరీంనగర్ వెళ్లగా రక్త పరీక్షలు చేసిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిలయ్యాయని నిర్ధారించారు. విజయేందర్‌రెడ్డి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని, వారానికి రెండుసార్లు డయాలసిస్ చేశారు.
ప్రతిసారీ రూ.5000 చొప్పున నెలకు రూ.40వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చు అయ్యాయి. విజ యేందర్‌రెడ్డిని ఆస్పత్రిలో అచేతన స్థితిలో చూసిన తమ్ముడు జితేందర్‌రెడ్డి(51) తన రెండు కిడ్నీల్లోని ఒక్కటి ఇచ్చేందుకు ముందుకొచ్చాడు. ఆపరేషన్ సక్సెస్ అయింది.
విజయేందర్‌రెడ్డికి జితేందర్‌రెడ్డి కిడ్నీ మ్యాచ్ అయింది. అదిపని చేయడం ప్రారంభించింది. మృత్యుముంగిట అసహాయంగా చేతులు కట్టుకుని నిల్చున్న సోదరుడికి ఆత్మీయ రక్తబంధం పునర్జన్మనిచ్చింది.
కిడ్నీలు ప్రతిరోజు దేహంలో 200 లీటర్ల రక్తాన్ని శుభ్రం చేస్తూ, యూరియా, క్రియాటినిన్ లాంటి జీవరసాయనాలను వడపోస్తాయి. కిడ్నీల పనితీరు దాదాపు 70 నుండి 80 శాతానికి పడిపోయే వరకు బాధితులకు ఆ విషయమే తెలియదు. ఒకసారి కిడ్నీలు గనక చెడిపోతే, జీవక్రియల్లో వెలువడే ఎన్నో విషరసాయనాలు దేహంలోనే పేరుకుపోవడం మొదలవుతుంది.
దీంతో ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అవగాహన లేమి, నిర్లక్ష్యం, విచ్చలవిడిగా పెయిన్ కిల్లర్స్ మందులు వాడకంతో ఉమ్మడి జిల్లాలో జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. మూత్రపిండాలు ఒకసారి దెబ్బతింటే తిరిగి బాగు చేయటం సాధ్యం కాదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే పాడవకుండా చూసుకోవచ్చని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. గురువారం ‘ప్రపంచ మూత్రపిండాల దినోత్సవం’ సందర్భంగా కథనం.
ఇదీ నేపథ్యం
2006లో తొలిసారిగా మార్చి 14న ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని ప్రారంభించారు. ఏటా ప్రత్యేక థీమ్‌ని ప్రకటించి కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూత్రపిండాల ఆరోగ్యం, డయాలసిస్ అవగాహన కోసం ఏటా మార్చి రెండవ గురువారం “ప్రపంచ కిడ్నీ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
థీమ్: “మీ మూత్రపిండాలు బాగున్నాయా? ముందుగానే గుర్తించండి.., మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడండి..’' అనేది ఈ ఏడాది నినాదం. కిడ్నీ వ్యాధికి సంబంధించిన ప్రమాద కారకాలు మధుమేహం(షుగర్), రక్తపోటు(బీపీ) కుటుంబంలో మూత్రపిండాల వ్యాధి చరిత్ర ఉండడమని వైద్యులు పేర్కొంటున్నారు.
కిడ్నీల పనితీరు కీలకం
మూత్రపిండాలు మూత్రం తయారీతోపాటు రక్తం వడపోతలో కీలకంగా పనిచేస్తాయి. కణాలు ఉత్పత్తి చేసే ఆమ్లాలను (యాసిడ్)ను బయటకు పంపిస్తాయి. రక్తంలో నీరు, లవణాలు, సోడియం, కాల్షియం, భాస్వరం, పోటాషియం వంటివి సమతుల్యంగా ఉండేలా చేస్తాయి.
కిడ్నీలు దెబ్బతింటే ప్రాణాలు కోల్పేయే ప్రమాదం ఉంది. సీరం క్రియాటిన్ పరీక్ష ద్వారా కిడ్నీ పనితీరును తెలుసుకునే వీలుంది. ఏడాదికోసారైనా ఈ పరీక్ష చేయించుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, రక్తపోటు, మధుమేహం, అధిక బరువు వంటివి తలెత్తకుండా చూసుకోవాలి. ధూమపానం, మద్యపానం మానుకోవాలి. పుష్కలంగా నీరు తాగాలి, వ్యాయామం చేయాలి. ఉప్పు తక్కువ తీసుకోవాలి. అధికంగా మాంసం తీసుకోవద్దు. ఆహారంలో సగభాగం పీచు పదార్ధాలు ఉండేలా చూసుకోవాలి. నొప్పి గోళీలు, అనవసరంగా స్టెరాయిడ్స్ వాడకూడదు.
ఉమ్మడి జిల్లాలో మూత్రపిండ వ్యాధిగ్రస్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యరంగంలో కిడ్నీ బాధితులకు నామమాత్రపు వైద్య సేవలు అందుతున్నాయి. స్థానికంగా ప్రైవేటు రంగంలో నెఫ్రాలజిస్టులు ఉన్నప్పటికీ సదుపాయాల కొరతతో రోగులు పెద్ద నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ప్రభుత్వ వైద్యశాలల్లో నెఫ్రాలజీ, యూరాలజీ విభాగాలు లేవు. చికిత్స మాత్రమే అందిస్తున్నారు.
గోదావరిఖని జీజీహెచ్‌తోపాటు పెద్దపల్లి జిల్లా ఆస్పత్రి, మంథని ప్రభుత్వాస్పత్రుల్లో ఐదు మిషన్లు చొప్పున మూడు డయాలసిస్ కేంద్రాలున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం కింద జీజీహెచ్‌లో రోజుకు 16 మందికి నాలుగు షిప్టుల ద్వారా నెలలో 40మందికి, పెద్దపల్లిలో రోజుకు 15 మందికి మూడు షిఫ్టుల చొప్పున నెలకు 33 మంది పేషెంట్లకు, మంథనిలో రోజుకు తొమ్మిది మందికి ఒక షిఫ్టులో నెలలో 9మంది పేషెంట్లకు డయాలసిస్ చేస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లావ్యాప్తంగా 95మంది కిడ్నీలు (మూత్రపిండాలు) ఫెయిల్ అయి డయాలసిస్‌పై జీవిస్తున్నారు. వందలాది మంది సకాలంలో వైద్యం అందక, కిడ్నీ అందించే రక్తసంబంధీకులు ఎవరూ ముందుకు రాక.. ప్రాణాలు కోల్పోయారు.
కరీంనగర్ జిల్లా ఆస్పత్రిలో డయాలసిస్ సేవలు అందిస్తున్నారు. జిల్లా ఆస్పత్రితో పాటు నగర శివా రులో ఉన్న రెండు వైద్యకళాశాలల్లో సైతం డయాలసిస్ సేవలు ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్నారు.
పెయిన్ కిల్లర్స్ తీసుకోవద్దు
ఈ మధ్య చాలా మంది పేయిన్ కిల్లర్స్, ఇతర హానికరమైన మందులను విచ్ఛలవిడిగా మింగుతున్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి మందులను వాడకూడదు. నాటు వైద్యం జోలికి వెళ్ల కూడదు. జీవన శైలిలో మార్పులు, ఆహారపు అలవాట్లు, వంశపారంపర్య రుగ్మతలు కిడ్నీ వ్యాధులకు కారణం. సంపూర్ణ ఆరోగ్యం కోసం మన జీవనశైలిని మార్చుకోవాలి.
– కుందరాపు గోపికాంత్, యూరాలజిస్టు, గోదావరిఖని
లక్షణాలు తెలియడం లేదు
చాలా మంది వ్యాధి ముదిరే వరకు లక్షణాలు తెలియపోవడం వల్ల పరిస్థితి విషమించిన తర్వాత వైద్యం కోసం వస్తున్నారు. తగ్గని జ్వరం, కాళ్లు, ముఖం వాపులు, యూరిన్‌లో ప్రొటీన్లు పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకోవాలి. అశ్రద్ధ చేయడం వల్ల ప్రాణాలకే ప్రమాదం ఏర్పడవచ్చు.
– రాంచందర్ తొర్రెం, నెఫ్రాలజిస్టు
(చదవండి: డీహైడ్రేషన్‌కు రీహైడ్రేషన్‌తో చెక్..! ఎండాకాలం ఈ జాగ్రత్తలు తప్పనిసరి..)
Comments
Please login to add a commentAdd a comment