'ఇది వేసవి. డీ–హైడ్రేషన్‌కు గురయ్యే కాలం. సాధారణంగా మూత్రపిండాల్లో (కిడ్నీల్లో) రాళ్లు వేసవిలో తరచూ బయటపడుతుంటాయి కాబట్టి ఈ సమస్యకు వేసవిని ఓ సీజన్‌గా పరిగణిస్తుంటారు. పైగా ఈనెల 14వ తేదీ ‘వరల్డ్ కిడ్నీ డే’ సందర్భంగా మూత్రపిండాల్లో రాళ్లలాంటి సాధారణ సమస్యలు మొదలుకొని, సీకేడీ వంటి మూత్రపిండాలకు సంబంధించిన అనేక సమస్యలూ, వాటి పరిష్కారాలపై అవగాహన కోసమే ఈ కథనాలు'.
కిడ్నీలో రాళ్లు ఎంత సాధారణ సమస్య అంటే ఒకరి 70 ఏళ్ల జీవితకాలంలో 20% మంది పురుషుల్లో, 10% మంది మహిళల్లో ఏదో ఒక దశలో అవి కనిపిస్తాయి. అయితే రాళ్లు రావడమన్నది పురుషుల్లో ఎక్కువ. వాటి వల్ల కిడ్నీ దెబ్బతిని, కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారితీసి, జీవితాంతం డయాలసిస్ మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వాటి గురించి తెలుసుకుని, కిడ్నీలో రాళ్లు ఏర్పడేందుకు అవకాశమున్నవారు జాగ్రత్త వహించాల్సిన అవసరముంది.
రాళ్లూ.. రకాలు..
మన ఆహారంలో, తాగే పానీయాల్లో క్యాల్షియమ్ వంటి అనేక ఖనిజాలూ, లవణాలు ఉంటాయి. జీవక్రియలు జరిగే సమయంలో ఆగ్జలేట్స్, యూరిక్ యాసిడ్, సిస్టయిన్ వంటి స్ఫటికాలు ఏర్పడవచ్చు. అలాగే ఇంకొందరిలో రాళ్లు రూపొందే ప్రక్రియను అరికట్టే సిట్రేట్‌లు తక్కువగా ఉండవచ్చు. అలాంటివారితో పాటు... నీళ్లు తక్కువగా తాగేవారిలో లవణాలన్నీ ఒకేచోట కేంద్రీకృతమై క్రమంగా గట్టిబడి రాయిలా మారేందుకు అవకాశాలు ఎక్కువ. దేహంలోని వడపోత ప్రక్రియ అంతా కిడ్నీలో జరుగుతుంది కాబట్టి ఇక్కడ రాళ్లు ఏర్పడే అవకాశాలెక్కువ.
కిడ్నీరాళ్లలో ప్రధానమైనవి కాల్షియమ్ ఆగ్జలేట్స్ (70 – 80%). మిగతావి క్యాల్షియమ్ ఫాస్ఫేట్, యూరిక్ యాసిడ్, సిస్టైయిన్స్ వంటివి. ఇక ట్రిపుల్ ఫాస్ఫేట్‌గా పేరున్న మెగ్నీషియమ్, అమోనియమ్ ఫాస్ఫేట్‌లతో తయారయ్యే స్ట్రువైట్ అనే రాళ్లు చాలా అరుదుగా, పెద్దగా ఏర్పడతాయి. దాంతో స్ట్రువైట్ రాళ్లతో కిడ్నీ ఫెయిల్యూర్‌కు అవకాశాలు ఎక్కువ. అంతేకాదు.. కొన్నిసార్లు యూరిన్ ఇన్ఫెక్షన్ బాధితుల్లో 'ప్రోటియస్ వల్గారిస్’ అనే బ్యాక్టీరియా కారణంగా కూడా స్ట్రువైట్ రాళ్లు ఏర్పడి, మరింత సంక్లిష్టతలకూ, ప్రమాదాలకూ దారితీసే అవకాశముంది.
ఎవరిలో ఎక్కువ..?
- నీళ్లు చాలా తక్కువగా తాగేవాళ్లలో
- ఉప్పు ఎక్కువగా తీసుకునేవారిలో
- మాంసాహారాలూ, చక్కెరలు ఎక్కువగా తినేవారిలో
- ఉబకాయం ఉన్నవారిలో
- డయాబెటిస్, పేగు వ్యాధులు లాంటి సమస్యలు ఉన్నవారిలో
- క్రోన్స్ డిసీజ్, ఇన్‌ఫ్లమేటరీ బవెల్ సిండ్రోమ్, యూరిక్ యాసిడ్ మోతాదులు ఎక్కువగా పెరిగే గౌట్, పాలీసిస్టిక్ కిడ్నీ డిసీజ్, రీనల్ ట్యుబ్యులార్ అసిడోసిస్, హైపర్‌పారాథైరాయిడిజమ్ వంటి సమస్యలున్న వారిలో
- సిప్రోఫ్లాక్సిన్ వంటి కొన్ని యాంటీబయాటిక్స్, సల్ఫా డ్రగ్స్, హెచ్‌ఐవీ మందులు వాడేవాళ్లతో పాటు, బరువు తగ్గడానికి బేరియాట్రిక్ సర్జరీ (అందులోనూ రూక్స్–ఎన్–వై గ్యాస్ట్రిక్ బైపాస్) చేయించుకున్నవారిలో.
లక్షణాలు...
నడుము లేదా వీపువైపు ఉరఃపంజరం కిందిభాగంలో భరించలేనంత తీవ్రమైన నొప్పి. ఒక్కోసారి ఈ నొప్పి పక్కలకూ, కిందివైపునకూ, పొట్ట వైపునకూ, కొందరు పురుషుల్లో వృషణాల సంచివైపునకూ పాకుతుంది. ఇది అలలు అలలుగా వస్తూపోతూ ఉంటుంది. నొప్పితో పాటు..
- వికారం లేదా వాంతులు
- జ్వరం
- మూత్రంలో రక్తం కనిపించడం
- మూత్రవిసర్జనలో మంట
- కొందరిలో రాయి కారణంగా మూత్రం వస్తున్న ఫీలింగ్ ఉన్నప్పటికీ, రాయి అడ్డుపడుతుండటం వల్ల మూత్ర విసర్జన జరగకపోవచ్చు. ఇలాంటి వాళ్లలో మూత్రం ఆగి, ఆగి చుక్కలు చుక్కలుగా పడుతుండవచ్చు.
అరుదుగా కొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కానీ మరేదో సమస్యతో డాక్టర్ దగ్గరికి వచ్చి, పరీక్షలు చేయించినప్పుడు చాలా పెద్దరాయి కారణంగా అప్పటికే కిడ్నీ చాలావరకు చెడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.
నిర్ధారణ..
మూత్రపిండాలు, యురేటర్, బ్లాడర్‌ల సీటీ స్కాన్, ఎక్స్–రే, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ వంటి పరీక్షలతో కిడ్నీలో రాళ్లను కనుగొంటారు. కొన్నిసార్లు మూత్రపరీక్ష, కిడ్నీ ఫంక్షన్ పరీక్ష అవసరం కావచ్చు.
చికిత్స..
- రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగమని బాధితులకు సూచిస్తుంటారు. దాంతో రాయి రూపొందడానికి వీల్లేకుండా లవణాలు ఎప్పటికప్పుడు మూత్రంలో కొట్టుకుపోవడంతో పాటు... కొన్నిసార్లు రాయి దానంతట అదే బయటపడేందుకు అవకాశముంటుంది.
- ఉప్పు, మాంసాహారం తగ్గించమని సూచిస్తుంటారు. అలాగే కొందరిలో రాయి ఏర్పడటానికి దోహదం చేసే పాలకూర, టమాటాకు దూరంగా ఉండమని సూచిస్తారు. ఇది కేవలం కిడ్నీలో రాయి ఏర్పడేందుకు అవకాశమున్నవారికి మాత్రమే. మిగతా ఆరోగ్యవంతులు వీటిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.
ఇక శస్త్రచికిత్సల విషయానికి వస్తే..
- యురేటరోస్కోపిక్ రిమూవల్ : ఎండోస్కోప్ సహాయంతో బ్లాడర్‌లోకీ, కిడ్నీ నుంచి బ్లాడర్ వరకు ఉండే నాళాలైన యురేటర్లలోంచి ఈ ప్రక్రియ ద్వారా రాళ్లు తొలగిస్తారు.
- ఎక్స్‌ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ లిథోట్రిప్సీ : రాళ్లు పెద్దవిగా ఉంటే ఈ షాక్ వేవ్స్ సహాయంతో వాటిని చిన్న చిన్న ముక్కలుగా /΄ûడర్‌గా పొడిపొడి చేస్తారు. దాంతో రాళ్ల ΄ûడర్ మూత్రంలో వెళ్లిపోతుంది.
- పర్‌క్యుటేనియస్ నెఫ్రోలిథోటమీ (పీసీఎన్‌ఎల్) : ఈ ప్రక్రియలో నడుం పక్క భాగం నుంచి కిడ్నీలోకి ఒక పైప్‌ను రాయి ఉన్నచోటికి పంపి, ఆ పైప్ ద్వారా రాయిని బయటకు తీసుకొస్తారు.
క్రానిక్ కిడ్నీ డిసీజ్ – సీకేడీ
క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి మొదటి కారణం మధుమేహం, రెండోది దీర్ఘకాలిక రక్తపోటు. మూడో కారణం గ్లోమరులార్ డిసీజ్. ఈ సమస్య ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటుంది. ఫలితంగా కాళ్లవాపు, ముఖం వాచినట్లుగా ఉండటం, మూత్రం నురగలా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో కారణాలేమీ లేకుండానే కిడ్నీలు దెబ్బతినవచ్చు. కిడ్నీలోని మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటస్టిషియల్ వ్యాధులు, కొన్ని జన్యుపరమైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కొన్నిసార్లు కిడ్నీలో రాళ్లు కూడా క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ)కి కారణం. అయితే ఈ కారణాలన్నింటిలోనూ డయాబెటిస్, హైబీపీ వల్లనే 70– 80 శాతం కిడ్నీవ్యాధికి దారితీస్తాయి.
ఎవరెవరిలో... ఎందువల్ల?
చిన్నపిల్లల్లో సీకేడీ ఉందంటే అది జన్యుపరమైన జబ్బుల వల్ల వచ్చిందేమోనని చూడాలి. మధ్యవయసు వారిలోనైతే... ఇందుకు అదుపులో లేని డయాబెటిస్, అధిక రక్తపోటు కారణమని అనుమానించాలి.
లక్షణాలు..
వికారం
ఆగకుండా వాంతులు
ఎప్పుడూ నీరసంగా ఉండటం
కాళ్లవాపులు
ముఖం వాపు
ఆకలి తగ్గడం
ఊపిరి అందకపోవడం
ఆయాసం
రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం,
మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఇవన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడవచ్చు.
చికిత్స.. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ బాధితులు ఓ సాధారణ వ్యక్తి జీవించినంత కాలం జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్.
హీమో డయాలసిస్ : ఇది యంత్రం ద్వారా రక్తాన్ని శుద్ధి చేసే ప్రక్రియ. వారానికి మూడు సార్లు రోజు విడిచి రోజు డయాలసిస్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాలి. ఈ ప్రక్రియకు నాలుగు గంటలు పడుతుంది.
పెరిటోనియల్ డయాలసిస్: ఇది ఇంట్లోనే చేసుకునే డయాలసిస్. దీన్నే ‘కంటిన్యువస్ అంబులేటరీ పెరిటోనియల్ డయాలసిస్’ (సీఏపీడీ) అని కూడా అంటారు.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స.. కిడ్నీ తొంభై శాతం పాడైనప్పుడు మాత్రమే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సను చివరి ఆప్షన్‌గా డాక్టర్లు సూచిస్తారు.
కిడ్నీలను పదిలంగా కాపాడుకోవాలంటే..
- డయాబెటిస్, హైబీపీ ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. మధుమేహం ఉన్నవారు మూడు నెలలకోసారి హెచ్‌బీఏ1సీ పరీక్షను చేయిస్తూ... రీడింగ్స్ 6.5 కంటే తక్కువగా ఉండేలా చూసుకోవాలి. హైబీపీ ఉన్నవారు తమ బీపీని 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
- రక్తంలో కొవ్వులు, కొలెస్ట్రాల్ పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందుకు కొవ్వులు ఎక్కువగా ఉండే మాంసాహారం తక్కువగా తీసుకుంటూ... శాకాహారం, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
- మన ఆహారంలో ఉప్పును చాలా తక్కువగా తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ మోతాదులో ఉండే బేకరీ ఐటమ్స్, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఆహారాలకు దూరంగా ఉండాలి.
- ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే గింజధాన్యాలు, సోయాబీన్స్, చాక్లెట్ల వంటి వాటిని తగ్గించాలి.
- క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది. నిమ్మజాతి పండ్లు, ఆరెంజ్ జ్యూస్ వంటివాటివి డాక్టర్ల సూచనల మేరకు తీసుకోవాలి.
- అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గించుకోవాలి.
- పొగతాగడం పూర్తిగా మానేయాలి.
- ఆల్కహాల్ వల్ల ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది. దాంతో దేహంలో నీళ్లు తగ్గి డీహైడ్రేషన్‌కు గురవుతాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశమిస్తుంది. కాబట్టి ఆల్కహాల్ పూర్తిగా మానేయాలి. కూల్‌డ్రింక్స్‌కూ దూరంగా ఉండటం మంచిది.
- ఏవైనా మందులు లేదా విషపదార్థాలు ఒంట్లోకి రాగానే వాటిని విరిచేసి, వడపోసి బయటకు పంపే బాధ్యతలు కాలేయం, కిడ్నీలవే. నొప్పి నివారణ మందుల వంటి కొన్ని ఔషధాలు దీర్ఘకాలంలో కిడ్నీలను దెబ్బతీసే అవకాశం ఉన్నందున డాక్టర్ సలహాలు, సూచనలు లేకుండా ఏ రకమైన ‘ఆన్ కౌంటర్ డ్రగ్స్’ వాడకూడదు.
- మూత్రం ఇన్ఫెక్షన్స్‌ని సరైన పద్ధతిలో, సరైన మందులతో, సరైన సమయంలో వైద్యం చేయించుకుని, పూర్తిగా తగ్గేలా చూసుకోవాలి.
— డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్.
ఇవి చదవండి: Siraj collection and Vlogs: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు...
Comments
Please login to add a commentAdd a comment