‘పదే పదే ఏం చేస్తామో అదే మనం. ఎక్సలెన్స్ అనేది ఒక పని కాదు, ఒక అలవాటు’ అంటాడు అరిస్టాటిల్. ఉదయం లేచిన దగ్గర్నుంచీ మనం చేసే పనులే మన అలవాట్లుగా మారతాయి. అవే మన విజయాన్ని నిర్ణయిస్తాయి. తొమ్మిది అలవాట్లు 90శాతం సమయాన్ని వృథా చేస్తాయని సైకాలజిస్టులు గుర్తించారు. వాటిని మార్చుకునే మార్గాలు కూడా సూచించారు. వాటిని తెలుసుకుని ఆచరించడం ద్వారా మీరు జీవితంలో అనుకున్నది సాధించవచ్చు. అవేమిటో ఈరోజు తెలుసుకుందాం.
1. అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం..
అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం ఒక కాగ్నిటివ్ డిస్టార్షన్. అలా అనుకోవడం వల్ల ఏ చిన్న తప్పు జరిగినా మొత్తం నాశనమైందంటూ బాధపడుతుంటారు. అందుకే అందరిలోనూ, అన్నిటిలోనూ.. చిన్నవో, పెద్దవో లోపాలు ఉంటాయనే విషయాన్ని అంగీకరించాలి. పాజిటివ్స్‌ను చూస్తూ ముందుకు సాగాలి.
2. మల్టీ టాస్కింగ్..
ఒకేసారి పలు పనులు చేయడం గొప్ప విషయంగా భావిస్తుంటారు. కానీ నిజానికి మెదడు ఒకసారి ఒక అంశంపైనే ఫోకస్ చేయగలదు. ఈ విషయం అర్థంకాక మల్టీ టాస్కింగ్ చేయలేకపోతున్నామని బాధపడుతుంటారు. దీన్ని అధిగమించేందుకు ‘పోమోడోరో టెక్నిక్’ ఉపయోగించండి. అంటే, ఒక పని మొదలుపెట్టాక 20 నిమిషాల పాటు ఎలాంటి డిస్ట్రాక్షన్ లేకుండా ధ్యాస పెట్టడం. ఆ పని పూర్తయ్యాకనే మరో పని ప్రారంభించడం.
3. చేసిందే చేస్తూ భిన్నమైన ఫలితాలను ఆశించండి..
చేసిన పనే చేస్తుంటే వచ్చిన ఫలితాలే వస్తాయి. భిన్నమైన ఫలితాలు రావాలంటే భిన్నంగా ప్రయత్నించాలి. అందుకే మీ అలవాట్లను ట్రాక్ చేయండి. అందులో ఏవి పునరావృతం అవుతున్నాయో గుర్తించండి. అవసరమైతే వాటిని మార్చుకోండి.
4. ప్రతిదానికీ ‘అవును‘ అని చెప్పడం..
కొందరికి మొహమాటం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరేం అడిగినా ‘నో’ చెప్పలేక, ‘ఎస్’ చెప్పేస్తుంటారు. దానివల్ల ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల ‘నో’ చెప్పడం నేర్చుకోండి. ఎందువల్ల మీరు ఆ పని లేదా సహాయం చేయలేరో వివరించడం నేర్చుకోండి.
5. వాయిదా వేయడం..
ఎప్పటిపని అప్పుడు చేయకుండా ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ ఉండటం మిమ్మల్ని విజయానికి దూరం చేస్తుంది. మీ కలలను నాశనం చేస్తుంది. మిమ్మల్నో పరాజితుడిగా నిలుపుతుంది. అందుకే నిద్ర లేవగానే, ఉదయాన్నే ముఖ్యమైన పనిని చేయడం అలవాటుగా మార్చుకోండి. అలా చేయడం ఈ రోజే మొదలుపెట్టండి. నెల రోజుల్లో అది అలవాటుగా మారుతుంది.
6. అతిగా ఆలోచించడం..
వర్తమానం కంటే ఎప్పడో జరిగిన వాటి గురించో లేదా ఏదో జరుతుందనో అతిగా ఆలోచిస్తూ ఎక్కువ బాధపడతాం. అందుకే మీ ఆలోచనలను ఎప్పటికప్పుడు పుస్తకంలో లేదా డైరీలో రాసుకోండి. నాలుగు రోజుల తర్వాత అందులో ఎన్ని నిజమయ్యాయో, ఎన్ని నిజం కాలేదో పరిశీలించండి. ఆలోచనలన్నీ నిజం కావని, అతిగా ఆలోచించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మీకే అర్థమవుతుంది.
7. క్లోజ్డ్ మైండ్ సెట్..
చాలామంది ‘నాకు లెక్కలు రావు’, ‘నాకు ఇంగ్లిష్ రాదు’ అని క్లోజ్డ్ మైండ్ సెట్‌తో ఉంటారు. కానీ మనందరం ఒకే రకమైన మెదడుతో పుట్టాం. ఆ తర్వాతే అన్నీ నేర్చుకుంటాం. అంటే, మనందరం లెర్నింగ్ మెషి¯Œ లా పుట్టాం. అందువల్ల ఏదైనా నేర్చుకోవచ్చనే ‘గ్రోత్ మైండ్ సెట్’ను అలవరచుకోండి. జీవితాంతం నేర్చుకుంటూనే ఉండండి.
8. నెగెటివ్ వ్యక్తులు..
కొంతమంది మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని నిరంతరం నిరాశపరుస్తూ ఉంటారు, మీ ఉత్సాహాన్ని తమ మాటలతో నీరు కారుస్తుంటారు. అలాంటి వారిని గుర్తించి దూరంగా ఉండండి. మీ లక్ష్యసాధనను ప్రోత్సహించే వ్యక్తులకు దగ్గరవ్వండి. వారితో స్నేహం చేయండి.
9. బాధిత మనస్తత్వం..
ప్రపంచమంతా అన్యాయంగా ఉందని, అందరూ ద్రోహమే చేస్తారని కొందరు నిత్యం ఏడుస్తూనే ఉంటారు. అది విక్టిమ్ మైండ్ సెట్. అలా ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా, మానసిక సమస్యల పాలవుతారు. అందుకే తక్షణం ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. ఇతరులపై నిందలు వేయడం ఆపండి. మీ చర్యలకు, మీ జయాపజయాలకు మీరే బాధ్యత తీసుకుని ముందుకు సాగండి.
— సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment