అరుణ్ ఒక ఐటీ ప్రొఫెషనల్. 28 ఏళ్లుంటాయి అతనికి. ఈ మధ్య కాలంలో విపరీతంగా ఆందోళన పడుతున్నాడు. దాంతో పని మీద దృష్టి నిలపడం కష్టంగా మారింది అతనికి. కంప్యూటర్ ముందు కూర్చుంటే ఏవేవో ఆలోచనలు చికాకు పెడుతున్నాయి. ఆపాలని ప్రయత్నించినా ఆగడంలేదు. దానివల్ల గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఊపిరి ఆడటం లేదు. చేతులు చెమటలు పడుతున్నాయి. ఒళ్లంతా బిగుసుకుపోయినట్లు అనిపిస్తోంది. ఈ సంకేతాలన్నీ తనకు ఏదైనా ఐపోతుందేమోనన్న భయాన్ని, ఆందోళనను మరింత పెంచుతున్నాయి. ఈ పరిస్థితి పని మీదా ప్రభావం చూపి మేనేజర్ నుంచి వార్నింగ్స్ అందుకునేలా చేస్తోంది. నలుగురితో కలవలేకపోతున్నాడు. ఫ్రెండ్స్‌కు, పార్టీలకు దూరమయ్యాడు. నిద్ర పట్టడం లేదు. పట్టినా తరచూ మెలకువ వస్తోంది.
అరుణ్ ఆందోళనకు గల కారణాలను లోతుగా పరిశీలించినప్పుడు..
అతనికి ఇటీవల ప్రమోషన్ వచ్చింది. దాంతో పని, బాధ్యతలు పెరిగాయి. అన్నిటిలో పర్ఫెక్ట్‌గా ఉండాలని, అన్ని పనులూ పర్ఫెక్ట్‌గా చేయాలనే అతని తీరు ఒత్తిడిని పెంచింది. ఫలితంగా అతని జీవితంలోకి ఆందోళన ప్రవేశించి అతలాకుతలం చేస్తోంది. అరుణ్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతున్నాడని పరీక్షల ద్వారా నిర్ధారణ అయింది. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ మొదలైంది. తాత్కాలిక ఉపశమనం కోసం 5–4–3–2–1 టెక్నిక్‌నీ ఫాలో అయ్యాడు. దాంతో అతను కొంత ఊరట పొందాడు. థెరపీ ద్వారా కొన్ని సెషన్లలోనే తన ఆందోళనను అధిగమించి హాయిగా పనిచేసుకోగలుగుతున్నాడు.
5–4–3–2–1 గ్రౌండింగ్ టెక్నిక్..
ఒత్తిడి, ఆందోళనను మేనేజ్ చేసేందుకు 5–4–3–2–1 గ్రౌండింగ్ ఒక పవర్‌ఫుల్ టెక్నిక్. మీరు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా దీన్ని ప్రాక్టీస్ చేయవచ్చు. మీ పంచేంద్రియాలను నిమగ్నం చేయడం ద్వారా, ప్రస్తుత క్షణంపై దృష్టి పెట్టి.. మీకు బాధ కలిగించే ఆలోచనల నుంచి మీ దృష్టిని మళ్లించుకోవచ్చు. మీ ఆలోచనలపై కంట్రోల్, ఎమోషనల్ బ్యాలె¯Œ ్సను సాధించి ప్రశాంతతను పొందవచ్చు.
మీరు చూడగలిగే 5 విషయాలను గుర్తించండి..
మీ చుట్టూ ఒకసారి పరికించి ఐదు విభిన్న విషయాలను గమనించండి. అవి వస్తువులు, రంగులు, ఆకారాలు లాంటివి ఏవైనా కావచ్చు. వాటిని గమనించడానికి కొంత సమయం కేటాయించండి. ఇది మిమ్మల్ని బాధపెట్టే ఆలోచనల నుంచి మీ దృష్టిని బాహ్యప్రపంచంవైపు మళ్లించడానికి సహాయపడుతుంది.
మీరు తాకగల 4 విషయాలను గుర్తించండి..
మీ దుస్తులు, కుర్చీ, కంప్యూటర్ మౌస్ లాంటి మీరు తాకగల నాలుగు వస్తువులను గుర్తించండి. వాటిని తాకడం ద్వారా మీరు పొందుతున్న అనుభూతులపై దృష్టి పెట్టండి. ఇది మిమ్మల్ని మీ తక్షణ శారీరక అనుభూతులతో మళ్లీ కనెక్ట్ అవ్వడంలో సహాయపడుతుంది.
మీరు వినగలిగే 3 విషయాలను గుర్తించండి..
మీ చుట్టూ ఉన్న శబ్దాలను జాగ్రత్తగా వినండి. మీ కంప్యూటర్ శబ్దం, ట్రాఫిక్ ధ్వని, మీ శ్వాస శబ్దం లాంటివి ఏవైనా కావచ్చు. వాటిపై శ్రద్ధ చూపడం వల్ల మీ దృష్టిని అంతర్గత ఒత్తిళ్ల నుంచి∙దూరం చేసుకోవచ్చు.
మీరు వాసన చూడగల 2 విషయాలను గుర్తించండి..
మీ చుట్టూ ఉన్న వాతావరణంలో రెండు భిన్నమైన వాసనలను గుర్తించడంపై దృష్టి పెట్టండి. ఏవీ లేకుంటే అగర్బత్తి, కర్పూరం, డియోడరెంట్, పెర్ఫ్యూమ్ లాంటివి ఉపయోగించండి. ఆ పరిమళాలు మీ చుట్టూ ఉన్న వాతావరణంతో మీరు కనెక్ట్ అవ్వడానికి దోహదపడతాయి.
మీరు రుచి చూడగలిగే ఒక విషయాన్ని గుర్తించండి..
చివరగా, ఒక రుచిపై దృష్టి పెట్టండి. అది అంతకు ముందు మీరు తాగిన పానీయం లేదా తిన్న చాక్లెట్ లాంటిది ఏదైనా కావచ్చు. లేదంటే మీ నోటిలో ప్రస్తుతం ఎలాంటి రుచి ఉందో గమనించండి. ఇది మీ దృష్టిని రుచి ద్వారా ప్రస్తుత క్షణానికి తీసుకువస్తుంది.. ఇంద్రియ అనుభవాన్ని పూర్తి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment