సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలు, యూరినరీ ఇన్ఫెక్షన్లు ఎక్కువ. దీనికి తోడు బయటకు వెళ్లి పనిచేసే మహిళల్లో అంటే వర్కింగ్ ఉమెన్‌లో ఈ సమస్యలు మరింత ఎక్కువ. అంతేకాదు... ఈ సమస్యలు కేవలం వర్కింగ్ ఉమెన్‌లోనే కాకుండా స్కూళ్లు కాలేజీలకు వెళ్లే బాలికలు, యువతుల్లోనూ అలాగే ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సిన వృత్తుల్లో ఉన్న మహిళల్లోనూ కనిపించవచ్చు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకుందాం.
గృహిణుల (హోమ్ మేకర్స్)తో పోలిస్తే బయటికి వెళ్లి పనిచేసే మహిళలు (వర్కింగ్ ఉమెన్) తమకు ఉన్న కొన్ని రకాల పరిమితుల కారణంగా నీళ్లు తక్కువగా తాగుతుండటంతోపాటు మూత్రానికి వెళ్లాల్సి వచ్చినా బయట వాళ్లకు వసతిలేని కారణంగా ఎక్కువసేపు ఆపుకుంటుంటారు. దాంతో వారిలో కొన్ని సమస్యలు వస్తుంటాయి. అవి...
1. మూత్రంలో ఇన్ఫెక్షన్ (యూరినరీ ఇన్ఫెక్షన్స్), 2. మూత్ర విసర్జనలో సమస్యలు.... మళ్లీ ఈ మూత్ర విసర్జన సమస్యలు రెండు రకాలుగా ఉంటాయి. మొదటిది బ్లాడర్ సామర్థ్యం తగ్గి త్వరత్వరగా మూత్రానికి వెళ్లాల్సి రావడం. రెండోది మూత్రం వస్తున్నట్లు అనిపిస్తున్నా విసర్జన సాఫీగా జరగక తీవ్రమైన నొప్పి రావడం. ఇవిగాక తక్కువగా నీళ్లు తాగడం వల్ల మూడో సమస్యగా కిడ్నీల్లో రాళ్లు వచ్చే ముప్పు కూడా ఉంటుంది.
ఎందుకీ సమస్యలు..
సాధారణంగా వర్కింగ్ ఉమెన్ మూత్రవిసర్జన చేసే పరిస్థితి రాకుండా ఉండటం కోసం నీళ్లు చాలా తక్కువగా తాగుతుంటారు. సౌకర్యాలు బాగుండే కొన్ని పెద్ద / కార్పొరేట్ ఆఫీసులు మినహాయిస్తే చాలా చోట్ల రెస్ట్‌రూమ్స్ అపరిశుభ్రంగా ఉండటం, శుభ్రం చేసుకోడానికి నీళ్లు అందుబాటులోకి లేకపోవడం, ఉన్నా అవి పరిశుభ్రంగా లేకపోవడం వంటి అనేక కారణాలతో నీళ్లు తక్కువగా తాగుతుంటారు.
ఇక మూత్రవిసర్జన చేయాల్సివచ్చినప్పుడు బయటి రెస్ట్‌రూమ్/బాత్‌రూమ్‌లు బాగుండవనే అభిప్రాయంతో మూత్రవిసర్జనకు వెళ్లకుండా ఆపుకుంటారు. ఇలా ఎక్కువ సేపు బిగబట్టడం వల్ల బ్లాడర్ సామర్థ్యం తగ్గుతుంది. ఇలా బిగబట్టడం చాలాకాలం పాటు కొనసాగితే మహిళల్లో మూత్రసంబంధమైన సమస్యలొస్తాయి. ఆ సమస్యలేమిటో చూద్దాం.
మూత్ర సంబంధమైన ఇన్ఫెక్షన్లు (యూటీఐ) : మూత్రమార్గంలో వచ్చే ఇన్ఫెక్షన్‌ను ‘యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్’ అంటారు. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే... మూత్రపిండాలు దేహంలోని వ్యర్థాలను వడపోశాక, వ్యర్థాలను మూత్రం రూపంలో ఓ కండరనిర్మితమైన బెలూన్ లాంటి బ్లాడర్‌లో నిల్వ ఉంచుతాయి. ఈ బ్లాడర్ చివర స్ఫింక్టర్ అనే కండరాలు ఎప్పుడు బడితే అప్పుడు మూత్రస్రావం కాకుండా ఆపుతుంటాయి.
మూత్రాన్ని చాలాసేపటి వరకు (దాదాపు నాలుగ్గంటలకు పైబడి) ఆపుతుంటే అక్కడ బ్యాక్టీరియా వృద్ధిచెందుతుంది. ఆ బ్యాక్టీరియా కారణంగానే మూత్రంలో ఇన్ఫెక్షన్లు (యూటీఐ) వస్తుంటాయి. కొన్నిసార్లు ఈ ఇన్ఫెక్షన్లు మూత్రపిండాలకీ పాకవచ్చు. ఇది కాస్త ప్రమాదకరమైన పరిణామం. మొదటిసారి ఇన్ఫెక్షన్ రావడాన్ని ‘ప్రైమరీ ఇన్ఫెక్షన్’ అంటారు. అవే ఇన్ఫెక్షన్లు మళ్లీ మళ్లీ వస్తుంటే వాటిని ‘రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్స్’ అని అంటారు. మూత్రపిండాల్లో వచ్చే ఇన్ఫెక్షన్‌ను పైలోనెఫ్రైటిస్ అని అంటారు. ఇది కొంచెం సీరియస్ సమస్య.
లక్షణాలు..
మూత్ర విసర్జన సమయంలో మంట, తరచూ
మూత్రవిసర్జనకు వెళ్లాలని అనిపిస్తుండటం, చలిజ్వరం వంటి
లక్షణాలు కనిపిస్తాయి.
నిర్ధారణ పరీక్షలు..
సాధారణ మూత్ర సమస్యలకు పెద్దగా పరీక్షలేమీ అవసరం ఉండవు. కానీ సమస్య మాటిమాటికీ వస్తుంటే అందుకు కారణాలు తెలుసుకునేందుకు కొన్ని అడ్వాన్స్‌డ్ పరీక్షలు అవసరమవుతాయి. సాధారణంగా ∙సీయూఈ ∙యూరిన్ కల్చర్ ∙అల్ట్రాసౌండ్ స్కానింగ్ ∙సీటీ, ఎమ్మారై, ఎక్స్‌రే (ఐవీయూ, ఎంజీయూజీ లాంటివి) ∙సిస్టోస్కోప్ (యూటీఐ) ∙అవసరాన్ని బట్టి కొన్ని రక్తపరీక్షలు చేస్తుంటారు.
చికిత్స..
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లకు డాక్టర్లు సాధారణంగా నోటి ద్వారా తీసుకునే యాంటీబయాటిక్ మందులతో చికిత్స చేస్తుంటారు. అవసరాన్నిబట్టి ఒక్కోసారి అడ్వాన్స్‌డ్ యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి రావచ్చు. సమస్య ఇంకా ముదిరితే ఆసుపత్రిలో అడ్మిట్ చేసి, సమస్యకు అనుగుణంగా చికిత్స ఇస్తుంటారు.
బ్లాడర్ సంబంధమైన సమస్యలు..
యూరినరీ బ్లాడర్ దాదాపు 500 ఎమ్‌ఎల్ మూత్రం నిల్వ ఉండే సామర్థ్యంతో ఉంటుంది. మూత్రం చాలాసేపు ఆపుకునేవారికి రెండు రకాల సమస్యలొస్తుంటాయి. మొదటిది... అదేపనిగా ఆపుకుంటూ ఉంటే బ్లాడర్ కండరాలు క్రమంగా నిల్వ చేసే సామర్థ్యాన్ని కోల్పోతాయి. అలాంటప్పుడు 200 ఎమ్‌ఎల్ మూత్రం నిల్వకాగానే మూత్రవిసర్జన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎంతగా ఆపుకుందామన్నా ఆగక... మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంటుంది. ఇక రెండో రకం సమస్యలో... తరచూ మూత్రాన్ని ఆపుకోవడం అలవాటైపోవడంతో మూత్రాన్ని ఆపేందుకు ఉపయోగపడే స్ఫింక్టర్ కండరాలు గట్టిగా బిగుసుకుపోతాయి. ఈ రెండు రకాల సమస్యల్లో బ్లాడర్ పనితీరు (బ్లాడర్ ఫంక్షన్) తగ్గుతుంది. కొన్నాళ్ల తర్వాత అర్జెంట్‌గా వెళ్లాల్సి రావడం... లేదా కొంతమందిలో పాస్ చేసిన తర్వాత కూడా బ్లాడర్‌లో కొంత మిగిలిపోయుంటుంది. ఈ రకమైన సమస్యను ‘డిస్‌ఫంక్షనల్ వాయిడింగ్’ అంటారు.
లక్షణాలు..
మూత్రం వస్తున్న ఫీలింగ్ కలిగినప్పుడు మూత్రానికి వెళ్తే... స్ఫింక్టర్ కండరాలు బిగుసుకుపోయి, ఎంతకీ రిలాక్స్ కాకపోవడంతో మూత్ర విసర్జన ఓ సమస్యగా మారుతుంది. మూత్రం సాఫీగా తేలిగ్గా రాదు, మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన నొప్పి, బాధ కలుగుతుంది.
నిర్ధారణ / చికిత్స..
బ్లాడర్ ఫంక్షన్ పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేసి, దానికి అనుగుణంగా నొప్పిని నివారించే మందులతోనూ, కండరాలను రిలాక్స్ చేసే ఔషధాలతో చికిత్స అందిస్తారు.
మూత్రపిండాల్లో రాళ్లు..
ఇవి అనేక కారణాలతో వచ్చినప్పటికీ వర్కింగ్ ఉమన్‌లో మాత్రం నీళ్లు తక్కువగా తాగడం వల్ల ఇవి వస్తుంటాయి. ఎక్కువగా నీరు తాగని వారిలో వ్యర్థాలు స్ఫటికంలా మారడంతో ఇవి వస్తుంటాయి. ఇవి చాలా బాధాకరంగా పరిణమిస్తాయి. ఏర్పడ్డ స్ఫటికం సైజును బట్టి రకరకాల చికిత్సలు అవసరమవుతాయి.
నివారణ / పరిష్కారాలు..
ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వంటి చికిత్సలు తీసుకోవడం కంటే ఈ సమస్యల నివారణ కోసం జాగ్రత్తలు అవసరం. బయటకు వెళ్లిన మహిళల మూత్రవిసర్జనకు మనదగ్గర పెద్దగా వసతులు ఉండవు. కాబట్టి ఇది ఒక సామాజిక సమస్య కూడా. ఈ సమస్యతో వచ్చే మహిళలకు డాక్టర్లు కొంత కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా నివారణ చర్యలను తెలుపుతారు. అవి...
– మహిళలకు బయటి బాత్‌రూమ్‌లకు వెళ్లాల్సి వస్తుందన్న బెరుకువీడి దేహ జీవక్రియలను అవసరమైనన్ని నీళ్లు తాగుతుండాలి.
– మరీ తప్పనప్పుడు ఎప్పుడో ఒకసారి మినహా... వస్తున్నట్లు అనిపించగానే మూత్రవిసర్జనకు వెళ్లాలి.
– మూత్రపిండాల్లో రాళ్లను నివారించడానికి కొన్ని రకాల ఫాస్ట్‌ఫుడ్, యానిమల్ ్రపోటీన్, చీజ్, చాక్లెట్ల వంటివి వీలైనంత తక్కువగా తీసుకోవాలి. కొన్ని ఆహారాల కారణంగా కొందరిలో స్ఫటికాలు ఏర్పడే అవకాశాలు ఎక్కువ. అలాంటివారు తమకు సరిపడనివాటిని వాటికి దూరంగా ఉండాలి.
ఇవి చదవండి: సకాలంలో స్పందిస్తే ఆత్మహత్యలను నివారించవచ్చు
Comments
Please login to add a commentAdd a comment