
అప్ సైక్లింగ్ వార్డ్‌రోబ్‌లను చెక్ చేసుకుంటే కుప్పలుగా ఉన్న చీరలు, దుపట్టాలు కొన్నిచీరలు తమ పెళ్లినాటివి అయి ఉంటాయి. అమ్మ, అమ్మమ్మలు ఇచ్చిన జ్ఞాపకాల చీరలు సరేసరి మరికొన్నింటికి బ్లౌజ్‌లు పాతవయ్యావని పక్కన పడేసినవి కొన్ని... ఓల్డ్‌మోడల్ అయ్యాయని కొన్నిపక్కన పెట్టేసినవి ఉంటాయి.ఇలాంటి వాటన్నింటినీ ఈ సమ్మర్ రోజుల్లో కొత్తగా రూపు కట్టేలా ప్లాన్ చేయవచ్చు. మారుతున్న ఫ్యాషన్ ట్రెండ్‌లను గమనిస్తూ కాలానుగుణంగా పాతచీరలను అప్‌సైక్లింగ్ చేసి, మీదైన కొత్తశైలిని వ్యక్తీకరించవచ్చు.
అప్‌సైక్లింగ్ విధానం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, పర్యావరణ అనుకూలతకు ప్రాధాన్యం ఇచ్చినవారం అవుతాం. వృధానూ అరికట్టవచ్చు.
అంచులను మార్చి...
అంచు ఉన్న కాటన్, పట్టుచీరలతో చేసిన ఇండోవెస్ట్రన్ మోడల్ డ్రెస్సులు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. షిఫాన్, సిల్క్, కాటన్, ఆర్గంజా, నెటెడ్ చీరల నుండి అనార్కలీలు, లాంగ్ గౌన్లు, కుర్తీలు డిజైన్ చేయించవచ్చు. పట్టు, బ్రొకేడ్, బెనారస్ వంటి వాటితో ఓవర్ కోట్స్, లాంగ్ జాకెట్స్, పలాజోలు, స్కర్ట్‌లు డిజైన్ చేయవచ్చు.
ప్యాచ్ వర్క్
పల్లూ, లేదా అంచులు కొద్దిగా చిరిగిన చీరలకు చిరిగిన అంచును తీసివేసి, జరీ, సీక్వెన్స్, కుందన్ వర్క్ చేసిన ప్యాచ్‌వర్క్ అంచును జత చేసి, తిరిగి వాడచ్చు. పాతకాలం నాటి చీరలను సల్వార్ సూట్‌లుగా మార్చవచ్చు. చీర పల్లూని పైభాగానికి ఉపయోగించవచ్చు. అంచులను నెక్‌కి, చేతులకు వాడచ్చు. కాంట్రాస్ట్ ప్యాచ్‌వర్క్ బోర్డర్‌లనూ జత చేయవచ్చు. బాటమ్, దుపట్టా కోసం మరొక పాత చీరను ఉపయోగించవచ్చు.
లాంగ్ గౌన్లు
వన్‌పీస్ లాంగ్‌గౌన్లు ఎప్పుడూ ట్రెండ్‌లోనే ఉంటున్నాయి. అందుకని, పాతచీరను ఉపయోగించి లాంగ్ గౌన్‌ను తయారు చేయించుకోవచ్చు. అదనపు మెటీరియల్‌కి కాంట్రాస్ట్ కలర్ లేదా మ్యాచింగ్ ఫ్యాబ్రిక్‌ను వాడచ్చు.
చీరలను ఉపయోగించిన డ్రెస్సులనే కాదు, కటింగ్‌లో వృథాగా పడేసే ఫ్యాబ్రిక్‌తో ఫ్యాషన్ జ్యువెలరీనీ రూపొందించవచ్చు. ఇది ఇండోవెస్ట్రన్ వేర్‌కి ముఖ్యంగా వేసవిలో మరింత ఆధునిక అట్రాక్షన్‌ను అద్దుతుంది.
(చదవండి: పేరెంట్స్ 'నో' చెప్పడం నేర్చుకోవాలి..! హెచ్చరిస్తున్న నిపుణులు)