విడిపోతామని భయం!
భారతికి ఇద్దరు పిల్లలు. భర్త భరత్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. భారతి గతంలో పనిచేసినప్పటికీ, ప్రస్తుతం పిల్లలకోసం ఇంట్లోనే ఉంటోంది. కానీ పిల్లలను స్కూల్‌కు పంపాలంటే విపరీతంగా భయపడుతోంది. వాళ్లు తనకు దూరమవుతారేమోనని ఆందోళన చెందుతోంది. స్కూలుకెళ్తే పిల్లలు దూరమవుతారనే భయమేంటోయ్ అని భరత్ జోక్ చేసినా ఆమె ఆందోళన తగ్గకపోగా, భర్త ఎక్కడ దూరమవుతాడోననే భయమూ మొదలైంది. నీవన్నీ పిచ్చి భయాలని భర్త ఎంత చెప్పినా ఆమెకు ధైర్యం రావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో కౌన్సెలింగ్‌కి అటెండ్ అయింది.
భారతితో మాట్లాడుతున్న క్రమంలో ఆమె చిన్నప్పుడు తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో పెరిగిందనే విషయం తెలిసింది. తల్లిదండ్రుల మధ్య గొడవల వల్ల ఆమెను హాస్టల్లో ఉంచారని చెప్పింది. పేరెంట్స్ ఎక్కడ విడిపోతారోనని రోజూ భయపడేదాన్నని, తాను భయపడినట్లు వాళ్లు విడిపోయారని బాధపడింది. అప్పటినుంచీ ఒంటరిగానే ఉంటున్నానని, కానీ ఒంటరితనం విపరీతమైన ఆందోళనను పెంచిందని చెప్పింది. భారతి గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఆమె సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌తో బాధపడుతోందని అర్థమైంది. ఇష్టమైన వ్యక్తి నుంచి విడిపోతామనే భయమే ఈ డిజార్డర్. ఇది పిల్లల్లో సహజం. అయితే భారతిలానే కొందరు పెద్దల్లో కూడా ఉంటుంది.
ఎప్పడు మొదలవుతుంది?
విడిపోతామనే ఆందోళన సాధారణంగా ఎనిమిది నెలల వయసు నుంచి ప్రారంభమవుతుంది. ఈ వయస్సులో పిల్లలను విడిచిపెట్టి తల్లిదండ్రులు పక్కకు వెళ్లినప్పడు ఆందోళన చెందుతారు. రెండేళ్ల వయసు వచ్చేసరికి తల్లిదండ్రులు తమను వదిలి వెళ్లరని, తిరిగి వస్తారని అర్థం చేసుకోవడం మొదలుపెడ్తారు. అయితే కొందరిలో ఇది ఆ తర్వాత కూడా కొనసాగుతుంది. జీవిత భాగస్వామితో లేదా రక్తసంబంధీకులు, స్నేహితులతో విడిపోతామని ఆందోళన చెందుతుంటారు.
పిల్లల్లో సెపరేషన్ యాంగ్జయిటీకి కారణాలు..
సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జన్యుపరమైనది కావచ్చు. ఇది కుటుంబ పరంగానూ రావచ్చు. జీవితంలో జరిగే సంఘటనలూ కారణం కావచ్చు. ఉదాహరణకు..
కుటుంబ సభ్యుల మరణం
తల్లిదండ్రులు విడిపోవడం
తల్లిదండ్రులు లేకపోవడం
వలస వెళ్లాల్సి రావడం
పాఠశాల మార్పు
తల్లిదండ్రుల్లో ఆందోళన
తల్లిదండ్రుల మద్య వ్యసనం
దత్తతకు వెళ్లడం
పెద్దల్లో కారకాలు..
ప్రియమైన వ్యక్తిని కోల్పోవడం
కఠినమైన పెంపకం
జీవితంలో నిత్యం సవాళ్లు, ఒత్తిళ్లు
చిన్నతనంలో ఆందోళన రుగ్మత
పిల్లల్లో కనిపించే లక్షణాలు..
పిల్లల్లో తరచుగా ప్రీస్కూల్, డేకేర్ సమయంలో ఇది ప్రారంభమవుతుంది. మిమ్మల్ని వదిలివెళ్లడానికి బిడ్డ నిరాకరించవచ్చు, కోపం ప్రదర్శించవచ్చు.
· కుటుంబ సభ్యులకు ఏదైనా చెడు జరుగుతుందనే భయం
· ఒంటరిగా మిగిలిపోతానేమోనని భయం
· తప్పిపోతామేమో, ఎవరైనా ఎత్తుకెళ్తారేమోననే భయం
· పీడ కలలు
· నిద్రలో మూత్రం పోయడంపెద్దల్లో కనిపించే ఇతర లక్షణాలు..
· ఇష్టమైన వారు దగ్గర లేనప్పుడు భయాందోళనలు
· ప్రియమైన వ్యక్తి గాయపడతారనే భయం · ఎవరితోనూ కలవకపోవడం
· ఏకాగ్రత కోల్పోవడం.జీవితంపై తీవ్ర ప్రభావం..
సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్ జీవన నాణ్యతను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అది పాఠశాల, ఉద్యోగ జీవితం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడుపు నొప్పి, తలనొప్పి, తల తిరగడం, వికారం, వాంతులు, అతిసారం, ఛాతీ నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు. వీటితో పాటు డిప్రెషన్, ఇతర యాంగ్జయిటీ డిజార్డర్స్, అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్‌లూ తలెత్తవచ్చు.నివారించడమెలా?
సెపరేషన్ యాంగ్జయిటీ డిజార్డర్‌ను నివారించడానికి ఎలాంటి మార్గాలూ లేవు. అయితే పిల్లల్లో ఈ సమస్య రాకుండా ఉండేందుకు తల్లిదండ్రులు కొన్ని చర్యలు తీసుకోవచ్చు.
· నమ్మకమైన బేబీ సిట్టర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా వేరుగా ఉండటం ప్రాక్టీస్ చేయాలి..
· కొద్ది సమయంపాటు విడిగా ఉండటం పిల్లలకు అలవాటు చేయాలి..
· ఎక్కడైనా వదిలివెళ్లినప్పుడు, చెప్పిన సమయానికి రావడం ద్వారా నమ్మకాన్ని పెంచాలి..
· అయినప్పటికీ పిల్లల్లో ఆందోళన కనిపిస్తుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ను కలవాలి..
· కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ద్వారా ఈ రుగ్మతకు చికిత్సను అందించొచ్చు.
· డయలెక్టికల్ బిహేవియరల్ థెరపీతో పాటు ఫ్యామిలీ థెరపీ, గ్రూప్ థెరపీ కూడా ఎమోషనల్ మేనేజ్‌మెంట్‌లో సహాయపడతాయి.
· అవసరమైతే సైకియాట్రిస్ట్‌ను కలసి మందులు తీసుకోవాల్సి ఉంటుంది.
— సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment