డేవిడ్ ప్రతిష్ఠాత్మక టెక్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. చాలా ప్రాజెక్టులు చేశాడు. ఇప్పుడు ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఉన్నాడు. కొలీగ్స్, సీఈఓ కూడా అతని పనిని మెచ్చుకుంటారు. అయినా ఏదో భయం. తనను మోసగాడు అనుకుంటారేమోననే భయం! దానివల్ల సరిగా పనిచేయలేక పోతున్నాడు. డేవిడ్ ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’తో బాధపడుతున్నాడని అర్థమైంది. దాంతో అతని బాల్యంలోకి వెళ్లాల్సి వచ్చింది.
పర్‌ఫెక్ట్ పేరెంటింగ్ ప్రభావం..
డేవిడ్ తల్లిదండ్రులు ఇద్దరూ వైద్యులు. బాల్యం నుంచి డేవిడ్‌ను బాగా ప్రోత్సహించేవారు. చదువులోనే కాదు, అన్నింటిలో పర్‌ఫెక్ట్‌గా ఉండాలని తరచుగా చెప్పేవాళ్లు. ఏ చిన్న తప్పు చేసినా వెంటనే సరిదిద్దేవాళ్లు. డేవిడ్ మంచి గ్రేడ్‌లు, ర్యాంకులు సాధించినా.. ఏ తప్పూ లేకుండా చేయాలనే ఒత్తిడి అనుభవించేవాడు. ఏ చిన్న తప్పు జరిగినా దాన్ని పెద్ద ఫెయిల్యూర్‌గా చూసేవాడు.
స్కూల్, కాలేజీ రోజుల్లో బాగానే ఉన్నా యూనివర్సిటీకి వెళ్లేసరికి డేవిడ్ పై ఒత్తిడి తీవ్రమైంది. కంప్యూటర్ సై¯Œ ్సలో కాంప్లెక్స్ కాన్సెప్ట్‌లను అర్థం చేసుకోవడానికి తాను కష్టపడుతుండగా, తన ఫ్రెండ్స్ ఈజీగా అర్థం చేసుకోవడం చూసి ఒత్తిడికి లోనయ్యేవాడు. తాను అందరూ అనుకున్నంత తెలివైన వాడినేం కాదని, అందుకే ఇప్పుడు కంప్యూటర్ సై¯Œ ్సను అర్థం చేసుకోవడానికి కష్టపడుతున్నానని అనుకునేవాడు. ఆ విషయం ఎవరికీ చెప్పలేక, చెప్పుకోలేక లోలోపల మథనపడేవాడు.
మీ అపనమ్మకమే సమస్య..
తనపై తనకు అపనమ్మకమున్నా డేవిడ్ టాలెంట్ వల్ల టాప్ టెక్ కంపెనీలో ఉద్యోగం సాధించాడు. కొద్ది కాలంలోనే మంచి గుర్తింపు పొందాడు. అతని టాలెంట్‌ను అందరూ మెచ్చుకునేవారు. కానీ డేవిడ్ లోలోపల మాత్రం అంతా లక్ వల్లే జరిగిందని, తనకేం పెద్ద టాలెంట్ లేదని, ఆ విషయం ఎప్పుడో ఒకసారి, ఎవరో ఒకరు కనుక్కుంటారనే భయపడుతుండేవాడు. ప్రాజెక్టులు సక్సెస్ అవ్వడానికి టీమ్ మెంబర్సే కారణమని అనుకునేవాడు. తనను తాను నిరూపించుకోవాలని నిరంతరం ఒత్తిడి అనుభవించేవాడు. పనులను వాయిదా వేసేవాడు. ఇవన్నీ కలసి అతన్ని డిప్రెషన్‌లోకి తోసేశాయి. నిద్ర సమస్యలు మొదలయ్యాయి. టాలెంట్ ఉన్నా, ఉందని అందరూ చెప్తున్నా, మెచ్చుకుంటున్నా.. అలాంటి టాలెంటేం లేదని సందేహపడటం, తన మోసం బయట పడుతుందని భయపడటాన్ని ‘ఇంపోస్టర్ సిండ్రోమ్’ అంటారు.
ఈ సిండ్రోమ్ నుంచి బయటపడాలంటే..
మీ లోపల నిరంతరం విమర్శిస్తుండే వాడి స్వరాన్ని గుర్తించండి. మీ అర్హత, యోగ్యత, సాధించిన విజయాలతో వాడి మాటలను సవాల్ చేయండి.
ఊరికే మీపై మీరు సందేహపడుతూ బాధపడకుండా.. మీపై మీరు నమ్మకం పెంచుకోవడానికి మీరు సాధించిన విజయాలు, పూర్తయిన ప్రాజెక్టులను సమీక్షించండి.
మీ నైపుణ్యాలు, ప్రతిభను అభినందించడానికి సమయాన్ని వెచ్చించండి. గ్రాటిట్యూడ్ డైరీ రాయండి.
చిన్నదైనా పెద్దదైనా మీ ప్రోగ్రెస్‌ను గుర్తించి, సెలబ్రేట్ చేసుకోండి. ఇది మీరు మరింత సాధించడానికి ప్రేరేపిస్తుంది.
మీ మనసులోని భావాలను స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబసభ్యుల సహాయం తీసుకోండి.
క్రిటికల్ లేదా పర్‌ఫెక్షనిస్ట్ పేరెంటింగ్, దానివల్ల ఏర్పడే ఒత్తిడి వల్ల వచ్చే ఇంపోస్టర్ సిండ్రోమ్‌ను అధిగమించాలంటే మీపై మీరు నమ్మకం పెంచుకోవాలి. అలా జరగాలంటే ఈ సూచనలు పాటించాలి.
Fail అంటే first attempt in learning అని రీఫ్రేమ్ చేయండి. ఎక్కడ తప్పు జరిగిందో గుర్తించి, దాన్నుంచి పాఠాలు నేర్చుకోండి.
మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలని కాకుండా, మీ స్కిల్స్ పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకోండి.
అన్నిటికంటే ముఖ్యంగా, ఇంపోస్టర్ సిండ్రోమ్ అనేది ఒక మానసిక సమస్యే తప్ప మీ సామర్థ్యాలకు కొలమానం కాదని గుర్తించండి. మీ ప్రతికూల ఆలోచనలను సవాలు చేయడం ద్వారా, మీ ప్రతిభకు సంకేతాలను గుర్తించడం ద్వారా మీపై మీరు నమ్మకాన్ని తిరిగి సాధించుకోవచ్చు.
– సైకాలజిస్ట్ విశేష్
Comments
Please login to add a commentAdd a comment