నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయా?
– పి. హారిక, గన్నవరం
ప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్‌ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్‌ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్‌లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.
నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్‌గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా?
– సి. సత్య, కదిరి
తొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్‌మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్‌ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.
నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్‌ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?
– రుక్మిణి, మహబూబ్‌నగర్
హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్‌ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్‌గా కొన్ని వైరల్ ఇన్‌ఫెక్షన్స్‌ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్‌ఫెక్షన్‌లో ముఖ్యంగా లివర్‌కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్‌ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్‌ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్‌ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్‌గా ఫాలో అప్ చెయ్యాలి.
డా‘‘ భావన కాసు
గైనకాలజిస్ట్ – ఆబ్‌స్టెట్రీషియన్
హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment