Hormone
-
Pregnancy: సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా?
నాకు ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయింది. రెండు నెలలు. కొంచెం బ్లీడింగ్ అవుతోంది. హార్మోన్స్ ఇంజెక్షన్స్ ఏమైనా వాడాలా? వాటికి సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయా? – పి. హారిక, గన్నవరంప్రెగ్నెన్సీ మొదటి మూడు నెలల్లో బ్లీడింగ్ అనేది సర్వసాధారణం. అయితే బ్లీడింగ్ అవటంతోటే గర్భస్రావం అవుతుందేమోననే భయం ఉంటుంది చాలామందిలో. ప్రతి ముప్పైమందిలో ఒకరికి మాత్రమే గర్భస్రావమయ్యే ప్రమాదం ఉంటుంది. అంతేకానీ ప్రతి గర్భిణికీ అలాగే అవుతుందేమోనని హైడోస్ హార్మోన్స్, సపోర్ట్ మెడిసిన్స్ ఇవ్వటం సరికాదు. కేస్‌ను బట్టే నిర్ణయించాలి. ప్రెగ్నెన్సీలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ చాలా కీలకం. ఇది గర్భసంచి పొర పెరగటానికి తోడ్పడి, గర్భస్రావం కాకుండా ఉండటానికి సాయపడుతుంది. అయితే వజైనల్ బ్లీడింగ్ అవుతున్నవారికి ఈ హార్మోన్ సప్లిమెంటేషన్ వల్ల ఉపయోగం ఉంటుందని కొన్ని అధ్యయనాల్లో రుజువైంది. అలాగని అందరికీ ఇవ్వడం కరెక్ట్ కాదు. ఈ హార్మోన్.. టాబ్లెట్స్, పెసరీస్, ఇంజెక్షన్స్ రూపంలో అందుబాటులో ఉంటుంది. దీన్ని రోజుకి రెండుసార్లు, నాలుగవ నెల అంటే 16 వారాల వరకు ఇస్తే సరిపోతుంది. కొన్ని సైడ్ఎఫెక్ట్స్ ఉంటాయి. వాటిని నివారించడానికి భోజనం చేసిన వెంటనే వేసుకోవాలి. పొట్టలో నొప్పి, వాంతులు, బ్రెస్ట్ పెయిన్, నీరసం, మలబద్ధకం లాంటివి ఉండవచ్చు. ఎక్కువ ఇబ్బంది ఉన్న వారికి వజైనల్ లేదా రెక్టల్ రూట్లో యూజ్ చెయ్యమని సూచిస్తారు.నాకిప్పుడు మూడోనెల. తొలి చూలు. ఎలాంటి సమస్యలు రావద్దనుకుంటున్నాను. ఎమోషనల్‌గా బేబీకి దగ్గరవటానికి, ప్రెగ్నెన్సీ నుంచే కొన్ని చెయ్యాలంటుంటారు. అవేంటో సజెస్ట్ చేయగలరా? – సి. సత్య, కదిరితొలిసారి తల్లి కాబోతున్నప్పుడు చాలా సందేహాలు, ఇంకెన్నో భయాలుంటాయి. ఆన్లైన్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో కొంత అవగాహన పెరిగింది. అయితే భయాలు కూడా పెరిగాయి. గర్భస్థ శిశువుకు భావోద్వేగాలు, చొరవ తీసుకునే సామర్థ్యాలు, తల్లిదండ్రుల ప్రేమ వంటివి అర్థమవుతాయని పరిశోధనల్లో రుజువైంది. హెల్దీ అటాచ్మెంట్ ఉంటే బయటి వాతావరణం సురక్షితంగా, భద్రంగా ఉందని గర్భస్థ శిశువు భావిస్తుంది. అయిదవ నెల నుంచి గర్భస్థ శిశువు శబ్దాలను వినే చాన్స్ ఉంది. అందుకే పొట్టలో బిడ్డతో తల్లి కమ్యూనికేట్ చేయొచ్చు. ఇది పుట్టిన తరువాత బిడ్డ మీ వాయిస్‌ని గుర్తుపట్టేందుకు సాయపడుతుంది. పాజిటివ్ థింకింగ్ అండ్ థాట్స్ ఉంటే లోపల బిడ్డ గ్రోత్ బాగుంటుంది. పొట్టలో బిడ్డ గురించి ఆలోచించటం, మాట్లాడటం 5వ నెల నుంచి మొదలు పెట్టవచ్చు. దీని వలన మంచి బాండింగ్ డెవలప్ అవుతుంది. 5 నుంచి 6వ నెల మధ్య బిడ్డ కదలికలు తెలుస్తుంటాయి. వాటిని జాగ్రత్తగా గమనిస్తూండాలి. ఈ కదలికల తీరు అందరికీ ఒకేలా ఉండదు. ఒక వారం గమనిస్తే ఎప్పుడు, ఎలా కదులుతోందనేది తెలుస్తుంది. అకస్మాత్తుగా కదలికలు నెమ్మదిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. మంచి బుక్స్ చదవటం, హెల్దీ డైట్ తీసుకోవటం చాలా అవసరం.నాకు ఏడాది కిందట అబార్షన్ అయింది. ఇప్పుడు మళ్లీ ప్రెగ్నెంట్‌ని. మూడోనెల. రొటీన్ బ్లడ్ టెస్ట్‌లో హెపటైటిస్ – బి పాజిటివ్ అని చెప్పారు డాక్టర్. దీని వలన నాకు, నావల్ల బేబీకి ఎలాంటి రిస్క్ ఉండొచ్చు?– రుక్మిణి, మహబూబ్నగర్హెపటైటిస్ – బి అనేది ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది చాలామందిలో ఏ సింప్టమ్స్ లేకుండా సైలెంట్‌గా ఉండొచ్చు. ప్రెగ్నెన్సీలో అందరికీ రొటీన్‌గా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ని చెక్ చెస్తారు. ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌కి ముందు వచ్చిన వారికి ముందే చెక్ చేసి, అవసరమైన వాళ్లకి ప్రివెంటివ్ వాక్సినేషన్ ఇస్తారు. ఈ వైరస్ ఇన్ఫెక్షన్లో ముఖ్యంగా లివర్‌కి వాపు ఉంటుంది. ఇది చాలావరకు కలుషిత ఇంజెక్షన్స్, రక్తం, వీర్యం, ఉమ్మి ద్వారా వ్యాపిస్తుంది. ఒకసారి మీ భర్త కూడా హెపటైటిస్–బి టెస్ట్ చేయించుకోవాలి. ఈ పరిస్థితుల్లో హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేర్ చూసే డాక్టర్ని సంప్రదించాలి. డెలివరీ తరువాత బేబీకి కూడా స్పెషలిస్ట్ కేర్, వాక్సినేషన్స్ అవసరం. ప్రెగ్నెన్సీలో మీకు లివర్ సమస్య ఎక్కువవకుండా కొన్ని మందులను సూచిస్తారు. వైరల్ లోడ్ తగ్గిందా లేదా అని తరచు బ్లడ్ టెస్ట్స్ చెయ్యవలసి ఉంటుంది. లివర్ స్కాన్ చెయ్యాలి. ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నా నార్మల్ డెలివరీ అవచ్చు. బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చెయ్యవచ్చు. బేబీకి హెపటైటిస్–బి రాకుండా ప్రాపర్ టెస్ట్స్, వాక్సిన్స్ చేయించాలి. పుట్టిన వెంటనే నాలుగు వారాలకు, ఏడాదికి వాక్సిన్స్ ఇవ్వాలి. మీకు వైరల్ లోడ్ ఎక్కువుంటే, బేబీకి ఎక్స్ట్రా ఇంజెక్షన్స్ ఇవ్వాలి. అందరికీ ఇచ్చే రొటీన్ వాక్సిన్స్ కూడా ఇవ్వాలి. బేబీకి ఏడాది వయసు వచ్చే వరకు క్లోజ్‌గా ఫాలో అప్ చెయ్యాలి. డా‘‘ భావన కాసుగైనకాలజిస్ట్ – ఆబ్స్టెట్రీషియన్హైదరాబాద్ -
పరుగు ప్రాణాలు తీస్తోంది
►కరీంనగర్లో పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షల్లో పాల్గొన్న మమత (21) అనే యువతి 100 మీటర్ల పరుగు అనంతరం గుండె ఆగి మరణించింది. ►రాచకొండ కమిషనరేట్ పరిధిలో రన్నింగ్ చేస్తున్న ఏకాంబరం (23) కూడా ఇదే తరహాలో గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. పరుగుతో శరీరంలో ఏం జరుగుతుంది? మనం పరుగు తీసినపుడు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. బీపీ, శ్వాస రేటు, గుండె కొట్టుకునే వేగం పెరుగుతాయి. శరీరంలోని అవసరమైన భాగాలకు రక్తసరఫరా ఒక్కసారిగా పెరుగుతుంది. కండరాలకు రక్తం సరఫరా అయ్యే వేగం రెట్టింపవుతుంది. అవసరమైన కండర కణాలకు ఆక్సిజన్ సరఫరా అధికమవుతుంది. శరీరంలో ఉద్రేకతను పెంచే అడ్రినలిన్ హార్మోన్ విడుదలవుతుంది. సాధారణంగా విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గుండె నిమిషానికి 5 లీటర్ల రక్తం సరఫరా చేస్తుంది. వ్యాయామం లేదా పరుగు తీస్తున్నప్పుడు ఇది మూడింతలు పెరుగుతుంది. అంటే నిమిషానికి 15 లీటర్ల రక్తాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే తీవ్రమైన ఒత్తిడిలో ఉంటుంది. రోజూ వ్యాయామం చేసే వారిలో, క్రీడాకారుల్లో గుండెకు ఈ ఒత్తిడిని తట్టుకునే శక్తి ఉంటుంది. కానీ అంతర్గత అనారోగ్య సమస్యలు, సరైన ప్రాక్టీస్, ఫిట్నెస్ లేకుండా పరిగెత్తే వారి గుండెపై ఈ క్రమంలో తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా 100 మీటర్ల దూరం పరిగెత్తినా గుండెలు ఆగిపోతున్నాయి. హైపర్ ట్రాపిక్ కార్డియోమయోపతి అంటే? గుండెపై ఒత్తిడి పెరిగి మరణానికి దారి తీయడాన్నే హైపర్ ట్రాపిక్ అబ్స్ట్రక్టివ్ కార్డియోమయోపతి అంటారు. విపరీతమైన వ్యాయామం, అకస్మాత్తుగా తీసే పరుగు వల్ల గుండె కండరాలు మందం అవుతాయి. గుండెకు రక్తం సరఫరా చేసే రక్తనాళాలు కూడా ఆకస్మికంగా దళసరిగా మారుతాయి. ఫలి తంగా గుండె నుంచి ప్రవహించే రక్త సరఫరాలో అంతరాయం కలుగుతుంది. దీంతో గుండెపోటు వచ్చి మరణానికి దారి తీస్తుంది. ఈ విషయం అమెరికాలోని టెక్సాస్‌లోని బయలార్ యూనివర్సిటీ వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. అయితే రోజువారీ వ్యాయామం చేసేవారిలోనూ ఇవే రకమైన మార్పు లు చోటుచేసుకున్నా.. రోజూ అలవాటుగా చేసే వారి గుండెకు ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం పెరుగు తుంది. ఉన్నఫళంగా గుండెపై భారం పెరిగే పనులు చేయడం హైపర్ ట్రాపిక్ కార్డియోమయోపతికి దారి తీస్తుంది. 30 ఏళ్లలోపు ఇలాంటి మరణాలు చోటుచేసుకోవడం చాలా అరుదు. 50,000 మందిలో ఒకరికే ఇలా జరుగుతుంది. అందులోనూ పురుషు లకే వచ్చే అవకాశాలు అధికం. ఎండతో తస్మాత్ జాగ్రత్త రాష్ట్రంలో ఆకస్మికంగా పెరిగిన ఎండలు కూడా అభ్యర్థులకు ఆరోగ్య సమస్యలు తెచ్చిపెట్టొచ్చు. డీహైడ్రేషన్ సమస్యలు తలెత్తొచ్చని, దీని ద్వారా కూడా ప్రాణాపాయం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే అభ్యర్థులు ఆరోగ్యంపై నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇవి పరీక్షించుకుంటే మేలు ► కుటుంబంలో ముందుతరాల వారు ఎవరైనా గుండెపోటుతో మరణిం చారా? లేదా ధ్రువీకరించుకోవాలి. ►ఇంతకుముందు ఛాతీలో నొప్పి, హైబీపీ వంటి లక్షణాలు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి. ► 12–ఎల్‌ఈఏడీ ఈసీజీ చేయించుకోవడం చాలా ఉత్తమం. దీనివల్ల గుండెలోని లోపాలు బయటపడతాయి. ►ఎక్సర్సైజ్ చేస్తూ ఈసీజీ తీయడం ఇంకా ఉత్తమం. దీనిలో పై అన్ని పరీక్షల్లోనూ బయటపడని లోపాలు గుర్తించవచ్చు. ►బాడీ బిల్డింగ్ కోసం స్టెరాయిడ్స్ వాడేవారికి గుండెనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువే. ఇతర కారణాలూ ఉంటాయి.. చాలామంది అభ్యర్థులకు పోలీస్ పరుగుకు ముందు వారి బీపీ వంటి సాధారణ పరీక్షలు చేస్తారు. అందులో అంతా బాగానే ఉంటుంది. కానీ వారిలో కొందరి గుండెలోని లోపాలు, హైబీపీ, విపరీతమైన యాంగ్జయిటీ కారణంగా గుండెపై విపరీతమైన ఒత్తిడి పెరిగి గుండెపోటుకు దారితీస్తుందని వైద్యులు చెబుతున్నారు. అందుకే, పోలీసు అధికారులు ఎన్నిరకాల వైద్యసేవలు అందుబాటులో ఉంచినా.. వారి ప్రాణాలు కాపాడలేకపోతున్నారు. – డాక్టర్ శ్రీనివాస్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ప్రభుత్వాసుపత్రి, హుజూరాబాద్ – సాక్షి, హైదరాబాద్ -
వయసు పెరిగే కొద్దీ నాకూ వస్తుందా?
నా వయసు 41. మా దగ్గర బంధువు ఒకామె హాట్ప్లషెస్తో ఇబ్బంది పడుతోంది. వయసు పెరిగేకొలది తనలానే నాకూ హాట్‌ప్లషెస్ వచ్చే అవకాశం ఉందేమోనని భయంగా ఉంది. మెనోపాజ్ టైమ్‌లో హాట్‌ప్లషెస్ సమస్యను నియంత్రణలో ఉంచాలంటే ఎలాంటి జాగ్రత్తలు, ఆహారం తీసుకోవాలి? ఆ సమస్య తగ్గాలంటే హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ వల్ల ఉపయోగం ఉంటుంది అంటున్నారు. కానీ అసలు హాట్‌ప్లషెస్ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేయగలరు. – కె.శ్రీలత, కొత్తగూడెం మెనోపాజ్ సమయంలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి, శరీరంలో ఉన్నట్టుండి వేడిగా పుట్టడం, ఆవిర్లు రావటం, చెమటలు పట్టడం, నిద్రలో ఉన్నప్పుడు చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఏర్పడతాయి. వీటినే హాట్‌ప్లషెస్ అంటారు. ఇది కొందరిలో మెనోపాజ్‌కు 4–5 సంవత్సరాల ముందు మొదలవుతుంది. కొందరిలో మెనోపాజ్ వచ్చిన తర్వాత 6 నెలల నుంచి 10 సంవత్సరాల వరకు ఉండవచ్చు. వీటిని పూర్తిగా నివారించటం కష్టం. ఈ సమయంలో ఎక్కువగా నీళ్లు, పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, తీసుకోవటం, వాకింగ్, వ్యాయామాలు చెయ్యడం మానసిక ఒత్తిడికి దూరంగా ఉండటం, కాఫీలు తగ్గించటం వంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల కొంత వరకు హాట్‌ప్లషెస్ నుంచి ఉపశమనం దొరుకుతుంది. అలాగే సోయాబీన్స్‌లో ఉండే జీటౌజ ్చఠిౌn్ఛటఅనే పదార్థం, కొద్దిగా ఈస్ట్రోజన్ హార్మోన్లాగా పని చేస్తుంది. కాబట్టి సోయా ఉత్పత్తులను తీసుకోవటం మంచిది. అంటే సోయాగింజలు, సోయాపిండి, సోయాపాలు వంటివి తీసుకోవాలి. ఈ సమయంలో ఎక్కువగా ఫ్యాన్ కింద ఉండటం కూడా మంచిదే. పైన చెప్పిన జాగ్రత్తలు తీసుకున్నా హాట్ప్లషెన్ తీవ్రత ఎక్కువగా ఉంటే జీటౌజ ్చఠిౌn్ఛట కాంబినేషన్ ఉన్న విటమిన్, కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకోవచ్చు. డాక్టర్ పర్యవేక్షణలో ఈస్ట్రోజన్ హార్మోన్‌ను టాబ్లెట్స్ రూపంలో, లేదా ‘స్ప్రే’లాగా తక్కువ మోతాడులో వాడి చూడవచ్చు. దీనినే ‘హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ’ అంటారు. కొందరిలో వీటివల్ల దుష్పరిణామాలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి.. ఇది ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువుని బట్టి, ఫ్యామిలీ హిస్టరీని బట్టి డాక్టర్ సలహా మేరకు వాడవచ్చు లేదా తెలుసుకొని వాడటం మంచిది. నా వయసు 24. నాకు నెలసరి సమయంలో బాగా వాంతులు అవుతున్నాయి. మొదట్లో ఇది ఫుడ్ప్రాబ్లమ్ అనుకున్నాను. కానీ ప్రతి నెలసరికీ వాంతులు అవుతున్నాయి. ఆఫీసులో చాలా ఇబ్బందిగా ఉంటోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కావట్లేదు. దయచేసి నివారణమార్గాలు తెలియజేయగలరు. – ఆర్తి, విజయవాడ నెలసరి సమయంలో శరీరంలో ఎన్నో హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే కెమికల్ పదార్థాలు ఎక్కువగా విడుదలవుతాయి. ఇవి గర్భాశయ కండరాలపైన ప్రభావితం చూపి, గర్భాశయం కుచించుకుంటూ, బ్లీడింగ్ బయటకు వచ్చేలా చేస్తుంది. అలాగే ఇవి ఆ సమయంలో జీర్ణాశయ పేగులపైన కూడా ప్రభావం చూపటం వల్ల, ఈ సమయంలో ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, అవి విడుదలయ్యే మోతాదును బట్టి, కొందరిలో వికారం, వాంతులు, విరోచనాలు, తలనొప్పి వంటి ఎన్నో సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటిని పూర్తిగా రాకుండా నివారించలేము. కాకపోతే కొద్దిగా ఉపశమనానికి నడక, యోగా, మెడిటేషన్ వంటివి చెయ్యడం మంచిది. అవసరమైతే ఆ సమయంలో ప్రోస్టాగ్లాండిన్స్ కెమికల్ పదార్థాలు తక్కువగా విడుదల చేసే "anti inflammatory" మందులయిన నొప్పి నివారణ మాత్రలు, వాంతులు తగ్గడానికి ranitidine, ondansetron మాత్రలు ఆ రెండు, మూడు రోజులు వాడుకోవచ్చు. భయపడాల్సిన అవసరం లేదు. ∙నా వయసు 27, నాకు మూడో నెల. ప్రెగ్నెన్సీ సమయంలో కారు డ్రైవింగ్ చేయవచ్చా? మా వారికి ఆటిజమ్ లక్షణాలు ఉన్నాయి. ఆయన లక్షణాలు బేబీకి వస్తాయేమోనని భయంగా ఉంది. ముందస్తు జాగ్రత్తలు తీసుకునే వీలుందా? దయచేసి వివరంగా తెలియజేయగలరు. – టిఆర్, నూజివీడు ప్రెగ్నెనీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని కారు డ్రైవింగ్ చెయ్యవచ్చు. కారు మరీ స్పీడుగా కాకుండా మెల్లగా డ్రైవింగ్ చెయ్యాలి. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర సడన్‌గా బ్రేక్ వెయ్యకుండా మెల్లగా డ్రైవింగ్ చెయ్యాలి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. వెన్నుపూసకి సపోర్ట్ ఉండేలాగా కూర్చుని డ్రైవింగ్ చెయ్యాలి. ఆటిజమ్ అనేది మెదడుకు, అందులోని నరాల పనితీరులో లోపాలు ఏర్పడటం వల్ల వచ్చే వ్యాధి. దీనికి జన్యుపరమైన, ప్రకృతిపరమైన మార్పులు, తల్లిలో ఇన్ఫెక్షన్లు మానసిక ఒత్తిడి, దురలవాట్లు, ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల పిల్లల్లో మానసిక ఎదుగుదలలో వినికిడిలో లోపాలు, ఇంకా అనేక లక్షణాలతో కూడిన ఆటిజమ్ వ్యాధి రావచ్చు. తండ్రికి ఆటిజమ్ లక్షణాలు ఉన్నప్పుడు, ఆ లక్షణాల తీవ్రతను బట్టి, జన్యులోపాలను బట్టి బిడ్డకు 10 నుంచి 20 శాతం వరకు వచ్చే అవకాశాలు ఉంటాయి. జన్యుపరంగా సంక్రమించే సమస్యలను చాలా వరకు నివారించలేము. కాకపోతే నూటికి నూరుశాతం రావాలని ఏమీ లేదు కాబట్టి, మీరు ఆందోళన చెందకుండా మానసిక ఒత్తిడిలేకుండా, ప్రశాంతంగా, సంతోషంగా ఉంటూ సరైన పౌష్టికాహారం తీసుకుంటూ, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తూ ఉండటం ఈ సమయంలో చాలా అవసరం. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
అది ఏ కారణం వల్ల వస్తుంది..?
నాకు ఈ మధ్య డెలివరీ జరిగింది. పాలు బాగా తక్కువగా వస్తున్నాయి. మొదట్లో ఇది సహజమేనని పెద్దలంటున్నారు. ఇది నిజమేనా? తక్కువ పాలు వస్తున్నప్పుడు సీసా పాలు పట్టించవచ్చా? జలుబు చేసినప్పుడు పాలు పట్టించడం వల్ల బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? ఎక్కువ పాలు రావాలంటే ప్రత్యేకమైన ఆహారం ఏదైనా తీసుకోవా? మాత్రలు ఏవైనా ఉన్నాయా అనేది వివరంగా తెలియజేయగలరు. – పి.సమత, పెంబర్తి కాన్పు తర్వాత తల్లి మానసిక, శారీరక పరిస్థితిని బట్టి, బిడ్డ తల్లి రొమ్మును సరిగా పట్టుకుని చీకేదాని బట్టి, పాలు సరిగా రావడం ఆధారపడి ఉంటుంది. కాన్పు తర్వాత బిడ్డ రొమ్మును పట్టి పాలు త్రాగడం మొదలుపెట్టేదాకే మెదడు ప్రేరేపణకు గురైయ్యి దాని నుంచి ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్ హార్మోన్లు విడుదల అవుతాయి. దీని ద్వారా రొమ్ములలో పాల ఉత్పత్తి మొదలయ్యి బయటకు వస్తాయి. మొదటి మూడు రోజులు, నీరులాంటి ద్రవం (ఛిజిౌ ్ఛట్ట్ఛటౌ ) వస్తుంది. దీన్నే ముర్రిపాలు అని కూడా అంటారు. ఇందులో బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచే యాంటిబాడీస్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. చాలా మంది పాలు అవంతట అవే వచ్చే వరకు ఎదురు చూస్తూ, పాలు రావట్లేదని బిడ్డకు రొమ్ము పట్టకుండా బయట పాలు ఇస్తారు. దాంతో బిడ్డ పాలకు అలవాటుపడి రొమ్మును సరిగా పట్టడు. దాని వల్ల తల్లి పాలు సరిగారావు. కాబ్టటి బిడ్డ పుట్టిన గంట నుంచే పాలు వచ్చినా, రాకపోయినా తల్లి రొమ్మును పట్టించడం వల్ల పాలు ఉత్పత్తి మొదలవుతాయి. రోజుకి మూడు గంటలకు ఒకసారి రోజు మొత్తంలో 7–8 సార్లు ఇవ్వడం వల్ల, పాలు తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి వీలయినంతవరకు మొదట తల్లి పాలు పట్టి, రాకపోతే డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే సీసా పాలు పట్టించాలి. జలుబు చేసినప్పుడు, తల్లిపాల వల్ల బిడ్డకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముక్కు, నోటికి అడ్డం పెట్టుకుని పాలు ఇవ్వవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది. ఆహారంలో మంచి నీరు, పాలు, ఆకుకూరలు, పండ్లు, వెల్లుల్లి రేకలు, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల పాలు బాగా వస్తాయి. కొన్ని రకాల మందులు డాక్టర్ సలహా మేరకు వాడుకోవచ్చు. మా కజిన్ ఒకరు జెస్టేషినల్ డయాబెటీస్‌తో బాధపడుతోంది. తన వయసు 26. ఇది ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ మార్గాలు ఏమిటి? ముందస్తు జాగ్రత్తలు ఏమిటో తెలియజేయగలరు. – కె.సునిత, అవనిగడ్డ గర్భం దాల్చిన తర్వాత షుగర్ పెరిగి మధుమేహం పెరగడాన్నే జెస్టేషినల్ డయాబెటిస్ అంటారు. వీరిలో గర్భం రాకముందు షుగర్ లెవల్స్ సాధారణంగానే ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువును బట్టి, జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, వాటి ప్రభావం వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల అధిక బరువు ఉండటం, గర్భం సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుని, ఎక్కువగా బరువు పెరగటం, లేటు వయసులో గర్భం దాల్చడం వంటి అనేక కారణాల వల్ల, కొందరిలో ప్రెగ్నెన్సీలో రక్తంలో చక్కెరశాతం పెరిగి జెస్టేషినల్ డయాబెటిస్ రావచ్చు. ఇది ఎక్కువ మట్టుకు 5వ నెల తర్వాత బయటపడుతుంది. దీనిని వందశాతం నివారించలేము కానీ, ప్రెగ్నెన్సీ రాకముందే, అధికబరువు ఉంటే.. బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, కొవ్వు పదార్థాలు, స్వీట్లు, కొన్ని రకాల చక్కెర శాతం ఎక్కువ ఉన్న తియ్యటి పండ్లు ఎంత వీలయితే అంత తక్కువ తీసుకోవడం, డాక్టర్ సలహామేరకు నడక, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల, షుగర్ లెవల్స్ అదుపులో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి షుగర్ లెవల్స్ పరీక్ష చెయ్యించుకుని వాటిలో మార్పు ఉంటే, మితమైన ఆహారంతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అప్పటికీ షుగర్ లెవల్స్ ఎక్కువగా పెరిగితే డాక్టర్ సలహా మేరకు మందులు వాడటం మంచిది. నా వయసు 28. నాకు ప్రస్తుతం మూడవ నెల. ప్రెగ్నెన్సీ సమయంలో చర్మంపైన రకరకాల మచ్చలు పడుతుంటాయని, అవి ఎప్పటికీ తగ్గవని ఇంతకుముందే నేను విన్నాను. పెగ్నెన్సీ çహార్మోన్ల ప్రభావం చర్మంపై పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెర్మటాలాజిస్ట్ను తప్పనిసరిగా సంప్రదించాలా? – జి.రాణి, విజయనగరం ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగానే హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ తొమ్మిది నెలల పాటు బిడ్డను మొయ్యడానికి దోహదపyýుతాయి. ఈ ప్రక్రియలో భాగంగా తల్లి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్లలో మార్పలు ఉంటాయి. దాన్ని బట్టి శరీర మార్పుల తీవ్రత ఉంటుంది. కొందరిలో మార్పులు కొద్దిగానే, కొందరిలో ఎక్కువగానూ ఉంటుంది. వీటిని నూటికి నూరుశాతం రాకుండా జాగ్రత్తలు ఎక్కువ ఏమీ ఉండవు. ఈ మార్పులలో భాగంగా మెడచుట్టూ నల్లగా ఉండటం, పొట్టపైన తొడలపైన స్ట్రెచ్‌మార్క్స్ రావడం, నల్లని నిలువ గీతలు పడటం, మొహంపైన పిగ్మెంటేషన్, మొటిమలు, మెడపైన, వీపుపైన కూడా రావచ్చు. నరాలు ఉబ్బడం, శరీరంలో నీరురావడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. ఈ సమయంలో నీరు బాగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, బరువు మరీ ఎక్కువగా పెరగకుండా చూడటం, తేమ ఎక్కువగా ఉండే సోపులు వాడటం, మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడటం వల్ల కొద్దిగా చర్మం నిగనిగ లాడుతుంది. అలాగే చర్మంలో తేమ బాగా ఉంటే, దురద తక్కువగా ఉండటం, స్ట్రెచ్‌మార్క్స్ తక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. డెర్మెటాలాజిస్ట్ను సంప్రదించినా వారు చర్మంపైన ఎటువంటి ప్రభావం పడకుండా మందులు ఇవ్వలేరు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ , హైదరాబాద్ -
ఈ టైమ్‌లో అవన్నీ చేయవచ్చా?
∙నా వయసు 22 సంవత్సరాలు. నేను ఈమధ్య కాస్త బరువు పెరిగాను. గడ్డం దగ్గర మొటిమలు వస్తున్నాయి. అవాంఛిత రోమాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితురాలికి చెబితే ‘పీసీఓయస్ కావచ్చు’ అంటోంది. ఇది నిజమేనా? ఈ డిజార్డర్ గురించి, నివారణ చర్యల గురించి వివరంగా తెలియజేయగలరు. – యంఎన్, కొవ్వూరు పీసిఓయస్ అంటే Polycystic ovary syndrome (pcos) అందులో గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాల్లో చిన్న చిన్న ఫాలికల్స్ ఎక్కువగా ఉండి, నీటి బుడగలులాగా ఉంటాయి. ఇవి కొన్ని హార్మోన్ల మార్పుల వల్ల, అధికబరువు, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, జన్యుపరమైన కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఏర్పడతాయి. మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ pఛిౌటఉన్నవాళ్లలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల బరువు పెరగటం, అవాంఛిత రోమాలు, జుట్టు ఊడటం, మొటిమలు రావటం, పీరియడ్స్ క్రమం తప్పటం, గర్భం దాల్చడానికి ఇబ్బంది వంటి ఎన్నో లక్షణాలు బయటపడతాయి. చిన్న సమస్యగానే భావించి నిర్లక్ష్యం చేస్తే.. చిన్నవయసులోనే బీపి, షుగర్, గుండెజబ్బులు వంటి ఇతర సమస్యలు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నిజానికి pఛిౌటస్కానింగ్ ద్వారా మరియు కొన్ని రక్త పరీక్షల ద్వారా నిర్ధారిస్తారు. ఇవి ఎవరికి, ఎందుకు వస్తాయి అని చెప్పలేం. జన్యుపరమైన కారణాల వల్ల, కొందరు సన్నగా ఉన్నా కూడా pఛిౌటరావచ్చు. ఇవి అనేక కారణాల వల్ల వస్తాయి కాబట్టి.. వీటికి నివారణ చర్యలు చెప్పటం కూడా కష్టం. కాకపోతే ఇవి ఇంకా ఎక్కువ పెరగకుండా లక్షణాల తీవ్రతను అదుపులోకి పెట్టుకోవటానికి బరువు పెరగకుండా వ్యాయామాలు, మితమైన డైటింగ్ చెయ్యటం మంచిది. అలాగే వారివారి లక్షణాలను బట్టి డాక్టర్ సలహా మేరకు మందులు వాడవలసి ఉంటుంది. వీరిలో షుగర్ ఉన్నవారిలోలాగా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తగ్గించడానికి కొందరికి షుగర్‌కి వాడే మందులు కూడా ఇవ్వడం జరుగుతుంది. నా వయసు 27 సంవత్సరాలు. నేను అధిక బరువు ఉంటాను. ప్రస్తుతం నేను ప్రెగ్నెంట్. ఈ టైమ్‌లో డైట్, వ్యాయామాల ద్వారా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయవచ్చా? ఒకవేళ చేసే వీలు ఉంటే ఎలాంటి వ్యాయామాలు చేయాలో తెలియజేయగలరు. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు బరువు తగ్గించుకునే ప్రయత్నాలు మంచిది కాదని మా వారు అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం? దయచేసి వివరంగా తెలపండి. – కె.నీలిమ, సంగారెడ్డి అధిక బరువు ఉండటం వల్ల హార్మోన్స్‌లో తేడాలు ఏర్పడి పిరియడ్స్‌లో ఇబ్బందులు, గర్భం దాల్చడానికి ఇబ్బందులు, త్వరగా చిన్నవయసులోనే బీపి, షుగర్, మోకాళ్లనొప్పులు వంటి ఇబ్బందులు వస్తుంటాయి. గర్భం దాల్చిన తర్వాత హార్మోన్ అసమతుల్యత వల్ల అబార్షన్లు, బీపి, షుగర్ పెరిగే అవకాశాలు, కాన్పు సమయంలో కాన్పు తర్వాత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువ. కాబట్టి బరువు తగ్గి సాధారణ బరువుకి వస్తే పైన చెప్పిన సమస్యల నుంచి బయటపడవచ్చు. బరువు తగ్గడానికి వాకింగ్, యోగా, జాగింగ్ వంటి వ్యాయామాలతో పాటు, మితమైన డైటింగ్ చెయ్యవచ్చు. ఇవన్నీ గర్భందాల్చక ముందే చెయ్యవలసిన పనులు. గర్భం వచ్చిన తర్వాత ఉన్న అధికబరువును తగ్గించడమనేది ఎంతమాత్రం మంచి పని కాదు. కానీ ఇంకా ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. ఆహారంలో అన్నం తక్కువ తీసుకుంటూ.. కూరలు ఎక్కువ తినడం, జంక్‌ఫుడ్, నూనె వస్తువులు, వేపుళ్లు, స్వీట్స్, చక్కెర వంటివి వాడకపోవటం, అరటిపండు, సపోటా వంటి చక్కెర శాతం ఎక్కువగా ఉండే పండ్లను అతి తక్కువగా తీసుకోవటం వంటివి పాటిస్తే ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవచ్చు. అలాగే రోజూ ఉదయం, సాయంకాలం 15 నిమిషాల పాటు సాధారణ వాకింగ్, మీ డాక్టర్ సలహా మేరకు అధికశ్రమలేని చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవచ్చు. చిన్న చిన్న ఇంటి పనులను కూడా చేసుకోవచ్చు. నేను ప్రెగ్నెంట్. నా వయసు 27. నేను ‘మార్నింగ్‌సిక్‌నెస్’ కు గురువుతున్నాను. ఏది తింటున్నా వికారంగానే అనిపిస్తోంది. దీని గురించి డాక్టర్‌ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందా? ‘మార్నింగ్‌సిక్‌నెస్’ పోవడానికి హోమ్రెమిడీల గురించి వివరంగా తెలియజేయగలరు. – జి.భార్గవి, నందిగామ ప్రెగ్నెన్సీ మొదలయిన మొదటి మూడు నెలల్లో, ఎదిగే పిండం దగ్గర నుంచి బీటా హెచ్‌సిజి (ఏఇఎ) అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో కొద్దిగా, మరికొందరిలో ఎక్కువగా విడుదల అవుతుంది. దీని ప్రభావం వల్ల ఒక్కొక్కరిలో వికారం, వాంతులు, ఆకలిలేకపోవడం, నీరసం బద్ధకం, ఓపిక లేకపోవడం, నిద్ర ఎక్కువగా ఉండటం, లేదా నిద్రపట్టకపోవడం, కొన్ని రకాల ఆహారపు పదార్థాలు నచ్చకపోవడం, ఎసిడిటీ వంటి ఇబ్బందులు ఉంటాయి. వీటినే మార్నింగ్ సిక్నెస్ అంటారు. ఏఇఎ మోతాదుని బట్టి.. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. మార్నింగ్ సిక్నెస్ లక్షణాలు ఉంటాయి. ఇవి మెల్లగా మూడు నెలలు దాటిన తర్వాత చాలావరకు తగ్గిపోతాయి. ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నప్పుడు త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్ని కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. తినే ఆహారంలో నూనె వస్తువులు, వేపుళ్లు, పచ్చళ్లు, కారం, మసాలాలు, కాఫీ, టీ వంటివి తీసుకోకపోవటమే అన్ని విధాల మంచిది. లేదా ఎంత తక్కువ తీసుకుంటే అంతమంచిది. కొబ్బరి నీళ్లు, మజ్జిగ, మంచినీళ్లు, రాగిజావ, పండ్లు, పండ్లరసాలు, పాలు వంటివి ఎక్కువసార్లు తీసుకోవచ్చు. లక్షణాలు మరీ ఎక్కువగా ఉంటే డాక్టర్ సలహా మేరకు.. ఛీ్ఠౌజీn్చ్ట్ఛ, ట్చnజ్టీజీఛీజీn్ఛ వంటి మాత్రలు, వాంతులు బాగా ఎక్కువగా ఉంటే ౌnఛ్చీnట్ఛ్టటౌn మాత్రలు వాడుకోవచ్చు. అంతేకానీ వికారం, వాంతులు అవుతున్నాయని, తినాలని అనిపించడంలేదని తినకుండా ఉండకూడదు. దీని వల్ల ఇంకా గ్యాస్ ఎక్కువగా ఏర్పడి.. లక్షణాల తీవ్రత పెరిగి.. సమస్య మరింత పెద్దదిగా మారవచ్చు. అందుకే వాంతులు అవుతున్నా, ఏదోఒకటి, కొద్దికొద్దిగా తాగుతూ, తింటూ ఉండాలి. మార్నింగ్‌సిక్‌నెస్ లక్షణాలు పెరుగుతూ బాగా ఇబ్బందిగా మారి కళ్లు తిరగడం, బీపీ తగ్గిపోవడం వంటివి ఉన్నప్పుడు నిర్లక్ష్యం చేసి డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే.. డీహైడ్రేషన్‌లోకి వెళ్లి, ప్రాణాపాయస్థితికి చేరుకునే అవకాశాలూ లేకపోలేదు. ఇంటి చిట్కాలు, డాక్టర్ సలహాలు, మందులు పనిచెయ్యకపోతే.. తప్పనిసరిగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి, అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని సెలైన్స్ పెట్టించుకోవలసి ఉంటుంది. అంతేకానీ నిర్లక్ష్యం ఎంతమాత్రం మంచిది కాదు. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్నగర్హైదరాబాద్ -
ఎప్పుడూ అదే గొడవ
నాకు రెండేళ్ల క్రితం పెళ్లయ్యింది. మావారు తాగుతారు. తాగినప్పుడల్లా సెక్స్ కావాలని గొడవ చేస్తారు. అయితే మద్యం తాగి ఉన్నప్పుడు సెక్స్‌లో పాల్గొంటే... ఆ సమయంలో విడుదలైన అండం ఆరోగ్యంగా ఉండదని, తద్వారా పిల్లలు రకరకాల వ్యాధులతో పుడతారని ఎవరో అనగా విన్నాను. అందుకే తాగి వున్నప్పుడు ఆయనకు దగ్గర కావాలంటే భయంగా ఉంటోంది. నన్నేం చేయమంటారు? – సునీత, గుడివాడ మద్యం తాగడం అన్నది పుట్టబోయే పిల్లలకే కాదు... మీ భర్తకు కూడా మంచిది కాదు. ఆ అలవాటు వల్ల సంతానోత్పత్తి తగ్గిపోతుంది. వృషణాలు దెబ్బ తింటాయి. వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోతుంది. వాటి కదలికలో, నాణ్యతలో తేడా వస్తుంది. మెల్లగా కోరికలు తగ్గిపోవడం, అంగస్తంభన లేకపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. వీర్యకణాల నాణ్యత తగ్గడం వల్ల పిండం సరిగ్గా తయారవదు. అలాంటప్పుడు ఒక్కోసారి అబార్షన్ అవుతుంది. లేదంటే పిండం ఎదుగుదలలో లోపాలు తలెత్తుతాయి. అవయవ లోపాలు, జన్యు లోపాలు ఏర్పడే అవకాశమూ ఉంది. కొందరు పిల్లలకు పుట్టిన తర్వాత ఐదేళ్లలోపు మతిమరుపు, బుద్ధిమాంద్యం, ఇతరత్రా మానసిక సమస్యలు కూడా కలుగుతాయి. ఈ విషయాలన్నీ మీవారికి వివరించండి. మంచి భవిష్యత్తు కోసమైనా తాగుడు మానేయమని చెప్పండి. వినకపోతే మంచి డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించండి. నాకు మూడేళ్ల బాబు ఉన్నాడు. పిల్లల మధ్య ఎడం కోసమని నేను డాక్టర్ సలహా మేరకు రెండేళ్లుగా హార్మోన్ ఇంజెక్షన్లు వాడుతున్నాను. అయితే అప్పట్నుంచీ పీరియడ్స్ సరిగ్గా రావడం లేదు. డాక్టర్ని సంప్రదిస్తే హార్మోన్ ఇంజెక్షన్లు వాడే చాలామందికి అలా అవుతుందని చెప్పారు. ఇక రెండో బిడ్డ కోసం ప్రయత్నం చేద్దామని ఆరు నెలల క్రితం ఇంజెక్షన్లు ఆపేశాను. అయినా పీరియడ్స్ రాకపోవడంతో డాక్టర్ని కలిస్తే ట్యాబ్లెట్లు ఇచ్చారు. ఆ తర్వాత నెలసరి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ రావడం లేదు. నాకు మరో బిడ్డ కావాలంటే ఏం చేయాలి? – ఎన్.ప్రీతి, కర్నూలు గర్భం త్వరగా రాకుండా ఉండటానికి depo provera అనే ప్రొజెస్టరాన్ హార్మోన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇది మూడు నెలలకు ఒకటి చొప్పున మూడు నాలుగు కంటే ఎక్కువసార్లు తీసుకోకూడదు. అంతకుమించి తీసుకోవడం వల్ల ఒక్కోసారి గర్భాశయ లోపలి పొర బాగా పల్చబడిపోయి, చాలా నెలలు లేదా సంవత్సరాలు పీరియడ్స్ రాకుండా పోతాయి. లేదంటే కొందరిలో ఎక్కువసార్లు వచ్చేయడం, ఎక్కువగా బ్లీడింగ్ కావడం, లేదంటే బ్లీడింగ్ మధ్యమధ్యలో కనబడటం వంటివి కూడా జరుగుతాయి. మీరు ఇప్పటికే రెండేళ్లు వాడేశారు కాబట్టి వాటిని ఆపి ఆరు నెలలు అయినా కూడా మీ శరీరంలో ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ ఇంకా ఉంది. అది పూర్తిగా పోయేవరకు ఆగాల్సి ఉంటుంది. అలాగే డాక్టర్ పర్యవేక్షణలో కొన్ని రోజుల పాటు ఈస్ట్రోజన్ హార్మోన్లు వాడాల్సి ఉంటుంది. అలా అని కంగారు పడాల్సినదేమీ లేదు. మీరు మెల్లగా ప్లాన్ చేసుకుని, తప్పకుండా మరో బిడ్డను కనవచ్చు. ‘మూత్రనాళ ఇన్ఫెక్షన్’ అనేది ఎందుకు వస్తుంది? మన శరీరతీరువల్ల వస్తుందా? తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే వస్తుందా? ఈ ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే రోజువారీ జీవితంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? బిగుతైన దుస్తులు ధరించడం వల్ల ఈ సమస్య వచ్చే అవకాశం ఉందా? మూత్రం రంగును బట్టి ఈ ఇన్ఫెక్షన్ను గుర్తించవచ్చా? తెలియజేయగలరు.– కె.సుబ్బలక్ష్మి, తిరుపతి మూత్రనాళ ఇన్ఫెక్షన్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. ఆడవారిలో మూత్రం బయటకు వచ్చే రంధ్రం (యురెత్రా), కిందకే, యోని రంధ్రం, దాని కిందనే, మలద్వారం ఉంటాయి. చాలావరకు మలద్వారం నుండి బ్యాక్టీరియా, క్రిములు, పైకి పాకే అవకాశాలు చాలా ఉంటాయి. ఇవి యోనిలోకి కాని, మూత్ర ద్వారంలోకి పాకి, ఇన్ఫెక్షన్లను కలిగించే ప్రయత్నాలు చేస్తాయి. వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, రక్తహీనత, వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉండటం... వంటి కొన్ని సందర్భాలలో ఈ క్రిములు పెరిగి ఇన్ఫెక్షన్ రావటానికి కారణం అవుతాయి. సాధారణంగా ఆరోగ్యంగా ఉన్నవారిలో, అంటే రోగ నిరోధక శక్తి బాగా ఉన్నవారిలో, ఈ క్రిములు పెరగకుండా రోగ నిరోధక శక్తి ఆపుతుంది. నీళ్లు బాగా తాగుతూ ఉంటే మూత్రంలో క్రిములు కొట్టుకుపోతాయి. లేకపోతే ఈ క్రిములు మెల్లగా పెరుగుతూ మూత్రం సంచి (యూరినరీ బ్లాడర్) నుంచి పైకి అంటే మూత్రం పైపులకు (యూరేటర్స్) తద్వారా కిడ్నీలకు పాకి, ఇన్ఫెక్షన్ బాగా వృద్ధి చెంది కిడ్నీలను దెబ్బతీసే స్థాయికి, తద్వారా ప్రాణహాని వరకు చేరే అవకాశాలు ఉంటాయి. మూత్రంలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు, మూత్రంలో మంట, మూత్రం ఎక్కువసార్లు వెళ్లాలనిపించడం, మూత్రం బాగా పసుపుపచ్చగా రావడం, పొత్తికడుపులో నొప్పి, నడుం నొప్పి, జ్వరం వంటి అనేక లక్షణాలు, ఇన్ఫెక్షన్ తీవ్రతను బట్టి ఉంటాయి. బిగుతుగా వుండే జీన్స్ ఎక్కువసేపు గంటల తరబడి వేసుకోవడం వల్ల కూడా, గాలి చొరబడక, ఇన్ఫెక్షన్ కలిగించే క్రిములు పైకి పాకి ఇబ్బంది కలిగించవచ్చు. మంచినీళ్లు రోజుకు కనీసం రెండు లీటర్లు తీసుకోవాలి. మల విసర్జన తర్వాత ముందు నుంచి వెనక్కి కడుక్కోవాలి. దాని ద్వారా మలద్వారంలోని క్రిములు ముందుకి పాకకుండా ఉంటాయి. మూత్రం వచ్చినప్పుడు వెళ్లిపోవాలి కాని, ఎక్కువసేపు మూత్రాన్ని ఆపి పెట్టడం వల్ల కూడా కొంతమందిలో యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. డా‘‘ వేనాటి శోభ రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
కరవును తట్టుకునే హార్మోన్ ఇదే..
వాతావరణం మారిపోతోంది... అకాల వర్షాలు, వరదలు సాధారణమైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మొక్కలు అతి తక్కువ నీటితోనూ బతికేయగలిగేందుకు ఉపకరించే ఓ హార్మోన్‌ను జపాన్ శాస్త్రవేత్తలు గుర్తించారు. నేలలో తేమ తక్కువగా ఉన్నప్పుడు సీఎల్ఈ 25 పెప్టైడ్ వేళ్లను వదిలి ఆకుల్లోకి చేరిపోతుంది. దాంతోపాటు ఆకుల ఉపరితలంపై ఉండే రంధ్రాలు మూసుకుపోయేలా చేసి మొక్కలోని నీరు ఆవిరైపోకుండా కాపాడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మనుషుల్లోనూ ఇలాంటి పెపై్టడ్లు ఉంటాయని.. శరీరం వాతావరణ పరిస్థితులకు తట్టుకుని నిలిచేందుకు ఇవి ఉపయోగపడతాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త టకహషి అంతున్నారు. మొక్కల్లోనూ ఇలాంటి వాటి కోసం పరిశోధనలు చేపట్టగా తమకు సీఎల్ఈ 25 గురించి తెలిసిందని చెప్పారు. రకరకాల సీఎల్ఈ పెప్టైడ్లను మొక్కల వేళ్లకు అందించి చూసినప్పుడు.. నీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు సీఎల్ఈ25 ఒక్కటే ఆకుల్లోకి చేరుతున్నట్లు తాము గుర్తించామని వివరించారు. ఏబీఏ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఈ పెప్టైడ్ రంధ్రాలను పూడుస్తున్నట్లు తెలిసింది. ఈ పరిశోధనల ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని సమర్థంగా ఎదుర్కోగల కొత్త వంగడాల తయారీకి వీలేర్పడుతుందని అంచనా. -
బయటి తిండితో హార్మోన్ సమస్యలు
అవసరం కొద్దీ అనివార్యంగా కొందరు బయటి తిండి తింటుంటారు. ఇంకొందరు రుచుల కోసం బయటి తిండికి అలవాటు పడుతుంటారు. కారణాలు ఏవైనా సరే, బయటి తిండి వల్ల హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుందని ఒక తాజా అధ్యయనం వెలుగులోకి వచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తినే తిండి వల్ల జీర్ణకోశ సమస్యలు, స్థూలకాయం, డయాబెటిస్, హైబీపీ వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిసిందే. రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో ఫుడ్ ప్రాసెసింగ్ కోసం, ప్యాకింగ్ కోసం వాడే పదార్థాల్లో ఉండే ఫ్తాలేట్స్ అనే రసాయనాలు ఆహారంలో కలుస్తాయని, ఇలాంటి చోట్ల ఆహారం తీసుకున్నట్లయితే, ఆ రసాయనాలు శరీరంలోకి చేరి, హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తాయని పరీక్షల్లో తేలినట్లు ‘ఎన్విరాన్మెంట్ ఇంటర్నేషనల్’ జర్నల్ ఒక వ్యాసంలో వెల్లడించింది. -
డెలివరీ తర్వాత...
నా జుట్టు చాలా ఒత్తుగా ఉండేది. అయితే డెలివరీ తర్వాత మాత్రం జుట్టు ఎక్కువగా ఊడిపోతోంది. ఇది ఇతర సమస్యల వల్ల తలెత్తుతుందా? లేక డెలివరీ తర్వాత ఇలాంటి సమస్యలు ఏర్పడతాయా? దీనికి నివారణ మార్గాలేంటి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? – నళిని, గుంటూరు గర్భం ధరించిన తర్వాత శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో ఈస్ట్రోజన్ ప్రభావం వల్ల జుట్టు ఒత్తుగా ఉండి, ఊడటం తక్కువగా ఉంటుంది. కాన్పు తర్వాత ఈస్ట్రోజన్ తగ్గిపోయి, మామూలు స్థాయికి వచ్చేస్తుంది. దీని ప్రభావం వల్ల కాన్పు తర్వాత జుట్టు బాగా ఊడిపోవడం జరుగుతుంది. అంతే కాకుండా కాన్పు తర్వాత పాలిచ్చేటప్పుడు... తల్లిలో పోషకాలు, విటమిన్స్, ప్రొటీన్స్, మినరల్స్ తగ్గిపోవడం వల్ల కూడా పోషకపదార్థాల లోపం వల్ల జుట్టు ఊడిపోవడం జరుగుతుంది. ఇది తాత్కాలికం మాత్రమే. కొన్ని నెలలకు జుట్టు ఊడటం తగ్గుతుంది. ఆహారంలో పప్పులు, ఆకుకూరలు, పండ్లు, పాలు, పెరుగు, మాంసాహారులైతే మాంసం, గుడ్లు వంటి పోషకాహారం తీసుకోవడం వల్ల కొద్దిగా జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి లేకుండానూ చూసుకోవాలి. సరైన నిద్ర కూడా అవసరం. మంచి నీళ్లు ఎక్కువగా తాగాలి. బయోటిన్ విటమిన్ కలిగిన మల్టీవిటమిన్ మాత్రలు వాడి చూడొచ్చు. కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గర్భధారణ తొలినాళ్లలో లిస్టీరియా ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉందని ఒక అధ్యయనంలో వెల్లడైనట్లు చదివాను. దీని గురించి పూర్తి వివరాలు తెలియజేయగలరు.– వి.సరళ, వనపర్తి లిస్టీరియా అనే బ్యాక్టీరియా మన రక్తంలోకి ప్రవేశించడం వల్ల లిస్టీరియా ఇన్ఫెక్షన్ వస్తుంది. లిస్టీరియా అనేది మట్టిలో, నీళ్లలో ఉంటుంది. అలా లిస్టీరియా బ్యాక్టీరియా మట్టిలో పండే పచ్చి కూరగాయలు, పండ్లు, పాలు, చికెన్, మటన్, చేపలు, గుడ్లకు చేరుతుంది. వీటిని బాగా కడగకుండా, ఉడకబెట్టకుండా తినడం వల్ల ఇన్ఫెక్షన్ శరీరంలోకి సోకుతుంది. సాధారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత కొద్ది రోజులకు అదే మెల్లిగా తగ్గుతుంది. కానీ గర్భిణులలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల లిస్టీరియా ఇన్ఫెక్షన్ సోకితే, అది తీవ్రంగా మారి తల్లికి, తల్లి నుంచి బిడ్డకు సోకే ప్రమాదం ఉంటుంది. దానివల్ల జ్వరం, వికారం, ఒళ్లు, కండరాల నొప్పులు, తలనొప్పి, అదే నరాలకు పాకితే.. అయోమయం, ఫిట్స్ వంటి లక్షణాలు ఉండొచ్చు. గర్భిణులలో అబార్షన్లు, నెలలు నిండకుండానే కాన్పు జరగటం, బిడ్డ బరువు పెరగకపోవడం, కడుపులోనే చనిపోవడం, కాన్పు సమయంలో చనిపోవడం వంటి సమస్యలు ఏర్పడొచ్చు. కాబట్టి గర్భిణులు ఏదైనా తినే ముందు చేతులు కడుక్కోవడం, పండ్లు, కూరగాయలను వాడే ముందు బాగా కడగటం, పచ్చి పాలు, గుడ్లు తీసుకోకుండా ఉండటం, మాంసాహారాన్ని బాగా ఉడకబెట్టి తీసుకోవడం వంటి జాగ్రత్తలు పాటిస్తే లిస్టీరియా ఇన్ఫెక్షన్ నుంచి దూరంగా ఉండొచ్చు. నేనిప్పుడు ప్రెగ్నెంట్‌ని. నాకు పచ్చళ్లు తినడం అంటే చాలా ఇష్టం. ఈ సమయంలో పచ్చళ్లు తినొచ్చా? ఏమీ కాదని కొందరు, తినొద్దు అని మరికొందరు అంటున్నారు. ఏది నిజం? – మణి, వినుకొండ పచ్చళ్లు తయారు చేసేటప్పుడు, అవి ఎక్కువ రోజులు నిలువ ఉండటానికి నూనె, ఉప్పు, కారం వంటివి ఎక్కువగా వెయ్యడం జరుగుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో పచ్చళ్లు ఎక్కువగా తినడం వల్ల, కొందరిలో కడుపులో మంట, గొంతులో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అలాగే బీపీ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఎక్కువగా పచ్చళ్లు తినడం వల్ల ఇబ్బందులు రావొచ్చు. మరీ అంతగా పచ్చళ్లు తినాలని ఇష్టంగా ఉంటే, ఎప్పుడైనా కొద్దిగా తినొచ్చు. అంతే కానీ అదే పనిగా రోజూ తినడం మంచిది కాదు. వీలైనంత వరకు తినకుండా ఉండటమే మేలు. నాకు ఆస్త్తమా ఉంది. ఆస్తమా ఉన్న స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని ఎక్కడో చదివాను. దీంతో పెళ్లంటేనే భయంగా ఉంది. గర్భధారణపై ఆస్తమా ప్రభావం ఏ మేరకు ఉంటుంది? – వీకే, హైదరాబాద్ ఆస్తమా ఉన్న స్త్రీలలో శ్వాస తీసుకునే నాళాల్లో వాపు రావడం, దాని ద్వారా గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది, ఆయాసం వంటి లక్షణాలు ఉంటాయి. అలాగే వారిలో కొందరికి గర్భాశయం, ట్యూబ్‌లు, అండాశయాల్లో వాపు రావడం లేదా పిండం గర్భాశయంలో నిలువలేకపోవడం వంటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఆస్తమా ఉన్న అందరిలోనూ ఉండాలని ఏమీ లేదు. కొందరిలో ప్రెగ్నెన్సీ కొద్దిగా ఆలస్యంగా రావచ్చు. ఆస్తమా ఉన్నవాళ్లు గర్భం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఆస్తమాను పూర్తిగా అదుపులో పెట్టుకోవడం మంచిది. ఇప్పటి నుంచే మీరు, ఆస్తమా ఉంటే ప్రెగ్నెన్సీ రాదని అపోహ పడి, పెళ్లి చేసుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. భయాన్ని పక్కకు పెట్టి, ఒకసారి డాక్టర్ని సంప్రదించి మీ సందేహాలను తీర్చుకోవడం మంచిది. డా‘‘ వేనాటి శోభ బర్త్‌రైట్ బై రెయిన్బో హైదర్‌నగర్ హైదరాబాద్ -
పిల్లలు స్వీట్ అయిపోతున్నారు!
పిల్లలకు స్వీట్స్ ఇష్టం.పిల్లలు స్వీట్‌గా ఉంటారు.వాళ్ల పంచదార చిలకపలుకులుమన జీవితాన్ని స్వీట్‌గా చేస్తాయి.కానీ ఇప్పుడు పసికందుల్లోనే టైప్–1 డయాబెటిస్ కనిపిస్తోంది.భయపడాల్సిన అవసరం లేదు.కానీ... తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిస్ వ్యాధి రోగులను ఎంతటి యాతనలకు గురిచేస్తుంటుందో తెలియనిది కాదు. దీనిపై అవగాహన కోసం ప్రతి ఏడాది నవంబర్ 14న ‘వరల్డ్ డయాబెటిస్ డే’గా నిర్వహించాలని ఇంటర్నేషనల్ డయాబెటిస్ ఫౌండేషన్ నిర్ణయించింది. అలా దీన్ని 1991 నుంచి నిర్వహిస్తున్నారు. డయాబెటిస్ మిల్లిటస్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఇది సోకినవాళ్ల రక్తంలోని చక్కెరపాళ్లు నార్మల్‌గా కాకుండా చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతో కొన్ని సమస్యలు రావచ్చు. అవేవీ రాకుండా పిల్లలను కాపాడుకునేందుకు అవసరమైన అవగాహన కోసం ఈ కథనం... పిల్లల్లోనూ డయాబెటిస్ కనిపిస్తుందన్నది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసే విషయం. పిల్లల్లో వచ్చే డయాబెటిస్‌ను టైప్–1 డయాబెటిస్ అంటారు. ఇది పెద్దల్లో కనిపించే డయాబెటిస్‌కు భిన్నంగా ఉంటుంది. మనం టైప్–1 డయాబెటిస్ అని పిలిచే పిల్లలకు వచ్చే వ్యాధిని ‘ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్’ అని కూడా అంటారు. ఈ వ్యాధి ఉన్న పిల్లల్లో రక్తంలోని చక్కెరను తగినన్ని పాళ్లలో ఉంచాల్సిన హార్మోన్ అయిన ‘ఇన్సులిన్’ స్రవించదు. దాంతో పిల్లలు వ్యాధికి గురవుతారు. మన శరీరంలో ప్యాంక్రియాస్ గ్రంథి ఇన్సులిన్‌ను స్రవిస్తుంది. ఈ స్రావమే చక్కెర పాళ్లను అదుపులో ఉంచుతుంది. మనకు హాని చేసే వ్యాధి కారకాలు, వైరస్ లేదా బ్యాక్టీరియా మన ఒంట్లోకి ప్రవేశించినప్పుడు మన రోగనిరోధక శక్తి వాటితో పోరాడి బయటకు తరిమేస్తుంది. అయితే ఈ ‘టైప్–1 డయాబెటిస్’ వచ్చిన పిల్లల్లోని వ్యాధి నిరోధక శక్తి వారిలోని ఇన్సులిన్ హార్మోన్ స్రవించేందుకు ఉపయోగపడే ప్యాంక్రియాస్ గ్రంథిలోని కణాలను దెబ్బతీస్తుంది. దీనికి జన్యుపరమైన, వైరస్లు, పర్యావరణ అంశాలు కారణాలుగా చెప్పవచ్చు. ఆ అంశాల ప్రభావం వల్ల ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ హార్మోన్ స్రావం తగ్గుతూపోయి ఒక దశలో పూర్తిగా ఆగిపోతుంది. మనం తిన్న ఆహారం శక్తిగా మారే ప్రక్రియలో గ్లూకోజ్‌గా మారుతుంది. కార్లు నడవటానికి అవసరమైన ఇంధనమైన పెట్రోల్ లాగే మన రోజువారీ కార్యకలాపాలు సజావుగా సాగడానికి ఇంధనం అవసరం. గ్లూకోజ్ మనకు ఇంధనంలా ఉపయోగపడేలా మన శరీరంలోని కణాల్లోకి చేరాలంటే ఈ ఇన్సులిన్ అవసరం. ఒకవేళ మన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే గ్లూకోజ్ కణంలోకి ప్రవేశించలేదు. కేవలం రక్తంలోనే ఉండిపోతుంది. దాంతో రక్తంలో గ్లూకోజ్/చక్కెర పాళ్లు పెరిగిపోతాయి. ఒక దశ దాటిన తర్వాత ఇలా రక్తంలో ఎక్కువైపోయిన చక్కెర మూత్రంలో బయటకు వెళ్తుంది. దాంతో పిల్లలకు మాటిమాటికీ మూత్రవిసర్జన అవుతుండటం, ఎక్కువగా దాహం అవుతుండటం జరుగుతుంటుంది. పిల్లల్లో డయాబెటిస్ ఉందని గుర్తించడం ఎలా? పిల్లల్లో డయాబెటిస్ రావడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ. అందుకే డయాబెటిస్ ఉన్నవారిలో కనిపించే వివిధ లక్షణాలు అందరు పిల్లల్లోనూ ఒకేలా ఉండకపోవచ్చు. డయాబెటిస్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాల్లో ప్రధానమైనవి... ►చాలా ఎక్కువ నీరు తాగుతూ ఉండటంతో పాటు మాటిమాటికీ మూత్ర విసర్జనకు వెళ్తుండటం ∙రాత్రిళ్లు నిద్రలో పక్క తడిపే అలవాటును అప్పటికే మానేసిన పిల్లలు అకస్మాత్తుగా మళ్లీ పక్క తడపటం మొదలుపెడుతుంటే ∙మంచి ఆహారం తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గుతుండటం ∙చాలా తేలిగ్గా వెంటవెంటనే అలసి పోతుండటం, చాలా నిస్సత్తువగా, నీరసంగా ఉండటం జననేంద్రియాల దగ్గర మాటిమాటికీ ఫంగల్ ఇన్ఫెక్షన్లు (క్యాండిడియాస్) కనిపిస్తుండటం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు పిల్లల్లో డయాబెటిస్‌ను వెంటనే గుర్తించి, వెంటనే ఇన్సులిన్‌తో వైద్యం మొదలుపెట్టకపోతే ప్రమాదకరమైన పరిణామాలు సంభవించవచ్చు. అధిక గ్లూకోజ్ వల్ల కీటోన్స్ అనే విషపూరితమైన పదార్థాలు రక్తంలో పేరుకుపోతాయి. దీనివల్ల ఈ కింది లక్షణాలు కనిపిస్తాయి. ►తీవ్రమైన కడుపునొప్పి ∙వాంతులు, ∙మత్తుగా ఉండటం (చురుకుదనం లోపించడం) శ్వాసతీసుకోవడం కష్టం కావడం ∙స్పృహతప్పి పడిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలా స్పృహతప్పిపడిపోయే పరిస్థితిని కీటో అసిడోసిస్ అంటారు. ఇలాంటి కండిషన్ చాలా ప్రమాదకరం. పిల్లలను తప్పనిసరిగా హాస్పిటల్‌కు తరలించి తక్షణ వైద్య సహాయం అందించాల్సిన మెడికల్ ఎమర్జెన్సీ పరిస్థితి ఇది. టైప్–1 డయాబెటిస్‌ను ఎదుర్కొనే తీరు (మేనేజింగ్ టైప్–1 డయాబెటిస్) పిల్లల్లో టైప్–1 డయాబెటిస్ వ్యాధి కనిపించినప్పుడు దాన్ని ఎదుర్కోవడం అన్నది సమతౌల్యంగా జరగాల్సిన ప్రక్రియ. ఒక బల్లకు నాలుగు కాళ్ల ఉన్నప్పుడు కలిగే స్థిరత్వం లాగే... టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో నాలుగు అంశాల నిర్వహణ ద్వారా దీన్ని సమర్థంగా ఎదుర్కోవచ్చు. ఒక బల్లలోని ఏ కాలు లోపించినా దాని స్థిరత్వం దెబ్బతిన్నట్లుగానే టైప్–1 డయాబెటిస్ వ్యాధిగ్రస్తులను మేనేజ్ చేసే ప్రక్రియలో ఈ కింద పేర్కొన్న నాలుగు అంశాల్లో ఏది జరగకపోయినా దీని నిర్వహణ సమతౌల్యం దెబ్బతింటుంది. ఆ నాలుగు అంశాలివి... 1. ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే పిల్లల విషయంలో ప్రస్తుతానికి ఇన్సులిన్ ఇవ్వడం మాత్రమే రక్తంలో పెరిగే చక్కెరను అదుపు చేస్తుంది. అందుకే ఇప్పటికైతే ఇది మాత్రమే అందుబాటులో ఉన్న చికిత్స ప్రక్రియ అని భావించవచ్చు. దురదృష్టవశాత్తు ఇలా ఇన్సులిన్ ఇవ్వడం అన్నది ఇంజెక్షన్ ద్వారానే జరగాల్సిన ప్రక్రియ. అందునా ఈ ఇంజెక్షన్‌ను కండలోకి కాకుండా చర్మంలోని ‘సబ్‌క్యుటేనియస్ పొర’లో ఇవ్వాలి. ఇలా ఇన్సులిన్‌ను ఒంట్లోకి పంపేందుకు సిరంజీలు, పెన్ వంటి ఉపకరణాలు (పెన్ డివైజెస్), ఇన్సులిన్ పంప్స్ వంటి చాలా రకాల ఉపకరణాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లోని ఏదో ఒక ఉపకరణం సహాయంతో డాక్టర్లు చెప్పిన మోతాదులో క్రమం తప్పకుండా ఇన్సులిన్ ఇచ్చినంత కాలం డయాబెటిస్ ఉన్న పిల్లల రక్తంలోని చక్కెర పాళ్లు నియంత్రణలో ఉంటాయి. ఇక్కడ ఇన్సులిన్ చేసే పని గురించి కాస్త తెలుసుకోవడం మేలు చేస్తుంది. మనం ఏదైనా పదార్థాన్ని తిన్నవెంటనే... ఆరోగ్యవంతులైన వ్యక్తుల్లో ఇన్సులిన్ రక్తంలోకి స్రవిస్తుంది. అది స్వాభావికంగా గ్లూకోజ్‌ను శక్తివనరుగా మార్చుతుంది. ఇది మనం తిన్నప్పుడల్లా చాలా నేచురల్‌గా జరిగే ప్రక్రియ. ఇలా స్వాభావికంగా మన ఒంట్లో పాంక్రియాస్ నిర్వహించే ప్రక్రియలాంటిదాన్ని మనం కూడా అనుసరిస్తూ రక్తంలోని చక్కెరను మాటిమాటికీ నియంత్రణలో ఉంచేందుకు వీలుగా రోజులో చాలాసార్లు ఇంజెక్షన్లు ఇవ్వాలి. పిల్లల్లోని తినే అలవాటు (ఫుడ్ హ్యాబిట్స్)ను బట్టి ఈ ఇంజెక్షన్లు ఇవ్వాల్సిన తీరు ఆధారపడి ఉంటుంది. 2. పర్యవేక్షణ (మానిటరింగ్) : పిల్లల్లో కేవలం ఇన్సులిన్ ఇస్తుండటం మాత్రమే సరిపోదు. వారు తిన్న దాన్ని బట్టి ఎంత మోతాదులో ఇన్సులిన్ ఇస్తుండాలన్న అంశాన్ని నిత్యం పర్యవేక్షించుకుంటూ ఉండాలి. రక్తంలోని చక్కెర పాళ్లను ప్రతిరోజూ ఎప్పటికప్పుడు తెలుసుకోడానికి ‘గ్లూకోమీటర్’ అనే పరికరం ఉపయోగ పడుతుంది. 3. ఆహారం : పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అనుగుణంగా వారి ఆహారం ఉండటం అవసరం. అదే సమయంలో వారు తాము తీసుకునే ఆహారం కారణంగా స్కూల్లో వివక్షకు గురికాకూడదు. ఇతరులు తీసుకునే ఆహారాలు వారు తీసుకోకూడదన్న ఆంక్షల కారణంగా వారు స్కూల్లోని ఇతర పిల్లల నుంచి భిన్నంగా కనిపించకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా తల్లిదండ్రుల బాధ్యత. 4. శారీరక శ్రమ : ఇటీవలి రోజుల్లో పిల్లలు ఆరుబయట ఆడుకోవడం, ఒంటికి పనిచెప్పడం చాలా తక్కువగా జరుగుతోంది. పిల్లలు ఒళ్లు అలిసేలా ఆడుకోవడం వల్ల వారి ఒంట్లోని చక్కెర పాళ్లు స్వాభావికంగానే నియంత్రితమయ్యే అవకాశం ఎక్కువ. అంతేకాదు వారు ఆరోగ్యకరంగా ఎదగడం కూడా జరుగుతుంది. శారీరక, మానసిక వికాసమూ జరుగుతుంది. అందుకే పిల్లలందరూ బాగా ఆడుకోవడం అవసరమే అయినా మరీ ముఖ్యంగా ఇలాంటి పిల్లల్లో ఆరుబయట ఒళ్లు అలిసేలా ఆడుకోవడం మరింత అవసరం. ఇక ఇన్సులిన్ మోతాదును నిర్ణయించడంలో వారు తీసుకునే ఆహారంతో పాటు వారి శారీరక శ్రమను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇంత జాగ్రత్తగా రక్తంలోని చక్కెరను నియంత్రించాల్సిన అవసరమేమిటి? పిల్లల రక్తంలో చాలాకాలం పాటు చక్కెర పాళ్లు అలాగే నియంత్రణలో లేకపోతే వాళ్లలో దీర్ఘకాలం తర్వాత చాలా రకాల అనర్థాలు సంభవించే అవకాశం ఉంది. అలా అనియంత్రితమైన చక్కెర వల్ల పిల్లల మూత్రపిండాలు, గుండె, రక్తనాళాలు, కళ్లు వంటి కీలకమైన అవయవాలు దెబ్బతినవచ్చు. వారి నాడీవ్యవస్థపై తీవ్రమైన దుష్ప్రభావాలు పడవచ్చు. అయితే ఇవన్నీ బాల్యంలోనే కనిపించకపోవచ్చు. వారు పెరిగి పెద్దయ్యే క్రమంలో చక్కెరవ్యాధి తాలూకు దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దాంతో భవిష్యత్తులో పెరిగి పెద్దయ్యాక అది వారి జీవన నాణ్యతను దెబ్బతీయవచ్చు. అందుకే రక్తంలో చక్కెర పాళ్లను నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. ఇటీవలి పురోగతి : టైప్–1 డయాబెటిస్ ఉన్న పిల్లల్లో ఆ వ్యాధిని నయం చేసేలా ఇప్పటికిప్పుడు చికిత్స ఏదీ అందుబాటులో లేదు. కానీ రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుంది. అలాగే సెన్సర్ ఆగ్యుమెంటెడ్ పంపులు, క్లోజ్డ్ లూప్ సిస్టమ్ వంటి పద్ధతులతో కొన్ని దేశాల్లో పిల్లల్లో చక్కెరపాళ్లను ఎప్పుడూ ఒకేలా ఉండేలా నియంత్రణలో ఉంచడం సాధ్యమవుతోంది. అయితే ఆధునిక సాంకేతికత సహాయంతో వచ్చిన ఈ పురోగతి ప్రస్తుతం ఈ రోగుల కుటుంబాలపై చాలా ఆర్థిక భారాన్నే మోపుతోంది. అయితే భవిష్యత్తులో ఈ వ్యయం తగ్గేందుకు అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం ఇన్సులిన్ అందేలా చూసేందుకు – ఇన్సులిన్ జీన్ థెరపీ, స్టెమ్‌సెల్ థెరపీ కంప్లీట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్స్ వంటి సులభమైన, సరళమైన, నొప్పిలేని ప్రక్రియలను అందుబాటులోకి తెచ్చేందుకు విస్తృతంగా పరిశోధనలు సాగుతున్నాయి. టైప్–1 డయాబెటిస్తో బాధపడే చిన్నారుల విషయంలో రక్తంలోని చక్కెరపాళ్లను ఎప్పుడూ అదుపులో ఉంచేలా చూసుకోవడం తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చాలా ఒత్తిడికి గురిచేసే అంశం. అయితే నొప్పిలేకుండా ఇన్సులిన్ ఇచ్చే కొత్త కొత్త ఉపకరణాలు వారి జీవన నాణ్యతను పెంచుతున్నాయి. అందుబాటులోకి వస్తుండటంతో పాటు కొత్త కొత్త పరిశోధనల ఫలితాలు ఇలాంటి పిల్లల విషయంలో ఆశాజనకంగా ఉన్నాయి. దీర్ఘకాలికంగా బాధించే ఈ వ్యాధికి ఒక శాశ్వత చికిత్సను కనుగొనే దిశగా జరిగే ప్రయత్నాల్లో ఆశారేఖ కనిపిస్తూ ఉంది. అప్పటివరకు మన అవగాహనతోనే మన భవిష్యత్తరానికి సంపద అయిన పిల్లలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అందరిలోనూ ఆ అవగాహన పెంపొందాల్సిన ఆవశ్యకత ఉంది. డాక్టర్ లీనతారెడ్డి పీడియాట్రిక్ ఎండోక్రైనాలజిస్ట్, రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
సేఫ్ సైకిల్
మహిళగా పుట్టడం మహాభాగ్యమైనా మహిళలకు సామాజికంగా మానసికంగా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఆ కష్టాలు చాలవన్నట్లు ప్రకృతి ఇచ్చిన ఇంకో కష్టం రుతుచక్రంలో అపశ్రుతులు. ఈ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? మెన్స్ట్రువల్ సైకిల్‌ను సేఫ్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకోడానికే ఈ సమగ్ర ప్రత్యేక కథనం. మెన్స్ట్రువల్ సమస్యలు – మహిళలకు సూచనలు మరో జీవిని సృష్టించడం కోసం ప్రతి జీవీ తపన పడుతుంది. సృష్టి ధర్మం ఇది. ఈ ధర్మాన్ని నెరవేర్చడం కోసం పురుషులు, మహిళల్లో వేర్వేరు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఇందుకు మహిళల్లో కొనసాగే క్రతువే రుతుక్రమం. ఈ రుతుక్రతువు ప్రతినెలా సజావుగా సాగాలంటే ఎన్నో సంక్లిష్టతలతో కూడిన సమతౌల్యాలు అవసరం. అవన్నీ సమంగా సాగితేనే సక్రమంగా వస్తుంది నెలసరి. నిజంగా నెలసరి సరిగా రావడం అన్నది మహళకు సిరి. ఈ సంక్లిష్ట హార్మోన్లలో ఏ ఒక్కదానిలో కాస్త తేడా ఏర్పడ్డా నెలసరి అస్తవ్యస్తం. అంటే సైకిల్ సరిగ్గా నడవదన్నమాట. అందుకే యుక్తవయసు మహిళ గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లగానే మొదట అడిగే మాట ‘నెలసరి సరిగానే వస్తోందా?’ అని. అంతటి ప్రాధాన్యం ఉంటుందా ప్రశ్నకు. రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకు అవకాశాలూ, రాకపోవడానికి కారణాలు తెలుసుకొని... మహిళ తన సైకిల్‌ను సేఫ్‌గా ఉంచుకోడానికి అవసరమైన అవగాహన కోసం... ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ రుతుస్రావం మొదలయ్యే కొంత కాలం ముందుగా ఈ బాధలు కనపడుతుంటాయి. కాబట్టి దీనిని పీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. హార్మోన్ల పరిమాణాల్లో మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పీఎంఎస్‌తో బాధపడే మహిళలు అత్యంత తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. వేగంగా, విపరీతంగా కోపం తెచ్చుకోవడం, టెన్షన్, తీవ్రమైన విచారం వంటి భావోద్వేగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరిలో ఇలాంటి మానసికమైన ఉద్వేగాలు లేకుండా కేవలం శారీరకమైన బాధలు మాత్రమే ఉంటాయి. అంటే కండరాలు బిగదీసుకు పోవడం (ముఖ్యంగా పొట్ట కండరాలు), కింది నుంచి గ్యాస్ పోతుండటం వంటివి ఇబ్బంది పెడతాయి. రుతుక్రమం రాబోయే ముందు కనిపించే ఈ బాధలన్నీ రుతుస్రావం మొదలయ్యాక క్రమంగా తగ్గిపోతాయి. కొందరు యువతుల్లో ఈ బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... అవి రోజువారీ జీవితాన్ని సజావుగా సాగనివ్వవు. ఆ సమయంలో కనిపించే కొన్ని తీవ్ర ఇబ్బందులివే... ⇒ఎవరైనా పలకరిస్తే తీవ్రంగా విసుక్కోవడం ∙ ⇒త్వరగా కోపం తెచ్చుకోవడం ⇒తీవ్రమైన వెన్నునొప్పులు ⇒తలనొప్పి, ∙రొమ్ములలో సలపరం ⇒మొటిమలు ⇒ఎప్పుడూ ఏదో తినాలనిపించడం ⇒తీవ్రమైన నిస్సత్తువ ⇒వ్యాకులత (డిప్రెషన్) ⇒యాంగై్జటీ ⇒తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న భావన ⇒నిద్రలేమి ⇒మలబద్దకం కడుపు కండరాలు తీవ్రంగా బిగదీసుకుపోయి విపరీతంగా నొప్పిని కలిగించడం వంటివి... ఉపశమనం ఇలా : ఉప్పును తగ్గించడం లేదా పరిమితంగా తీసుకోవడం, కాఫీ వంటి కెఫిన్ ఉండే ద్రవాల జోలికి పోకపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వంటివి పీఎంఎస్ లక్షణాలను తగ్గిస్తాయి. క్యాల్షియమ్, విటమిన్ – డి సప్లిమెంట్లు వాడటం కూడా చాలావరకు ఉపయోగపడుతుంది. ‘ప్యూబర్టీ’తో మొదలు... ‘మెనోపాజ్’తో ముగింపు మహిళ జీవితంతో దాదాపు సమాంతరంగా సాగే ఈ రుతుక్రమం ‘సైకిల్’ తాను వ్యక్తురాలు కాగానే (ప్యూబర్టీ అటెయిన్ చేయగానే) మొదలై మెనోపాజ్‌తో ఆగుతుంది. అప్పటి వరకూ క్రమం తప్పకుండా నడుస్తూనే ఉంటుందీ ‘సైకిల్’. రక్తస్రావం అయ్యే రోజు ‘డేట్’... నెల తర్వాత రుతుస్రావం వచ్చే రోజును వాడుక భాషలో ‘డేట్’ వచ్చిందా అని అడుగుతుంటారు. అది వచ్చాక నాలుగైదు రోజులు ఉంటుంది కాబట్టి ఆ వ్యవధి ‘పీరియడ్’. తన నుంచి మరో చిన్నారికి జన్మనివ్వడానికి ఒక మహిళ తన దేహాన్ని సంసిద్ధపరచేందుకు అవసరమైన జీవ, రసాయన ప్రక్రియలన్నీ ఈ ‘పీరియడ్’లో క్రమం తప్పకుండా చోటు చేసుకుంటుంటాయి. ఏదైనా క్రమం తప్పితే... ఆ ‘అ’క్రమతే సమస్యగా ముందుకొస్తుంది. ముంచుకొస్తుంది. ►సైకిల్ నడిపే అనేక డ్రైవర్లు ‘హార్మోన్లు’... మహిళకు వచ్చే ఈ సైకిల్‌ను ఏమాత్రం క్రమం తప్పకుండా నడిపేవి ‘హార్మోన్లు’. అందుకే ఏమాత్రం అంతరాయం రాకుండా నడపాలంటే ప్రతి హార్మోన్ అత్యంత సక్రమంగా పనిచేయాలి. వాటిల్లో ఏ హార్మోన్ కాస్త క్రమం తప్పినా సైకిల్ దెబ్బతింటుంది. ప్రతి మహిళలోనూ సైకిల్ (రుతుస్రావం) మొట్టమొదట ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌తో మొదలవుతుంది. ఇది అండాశయం (ఓవరి)లోని అండాన్ని అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఈ ప్రక్రియలను ఓవ్యులేషన్ అంటారు. ఇందులో అండం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ►తర్వాతి స్టెప్ ప్రో – జెస్టెరాన్... ఓవ్యులేషన్ జరిగాక గర్భసంచిలోని లోపలి లైనింగ్ పొరలు కాస్త మందంగా మారుతాయి. ఇలా మారేందుకు ప్రోజెస్టెరాన్ అనే హోర్మోన్ త్పోడుతుంది. ప్రో... అంటే ముందుదశ... అని అర్థం. జెస్టెషన్ అంటే గర్భధారణ... రాన్ అంటే అందుకు సిద్ధం చేసే హార్మోన్. ఓవ్యులేషన్లో అభివృద్ధి జరిగిన ‘అండం’ గనక... వీర్యకణ సంపర్కంతో ‘పిండం’గా రూపొందితే... ఆ పిండం సక్రమంగా పెరగడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్ల కోసమే ఈ ‘ప్రో’... ‘జెస్టెషన్’ ఏర్పాట్లన్నటమాట. ఈలోకంలోకి రాబోయే చిన్నారి అతిథి కోసం ప్రకృతి చేసిన అద్భుత ఏర్పాటిది. అండంతో వీర్యకణం సంపర్కం చెంది పిండంగా ఏర్పడితే జరిగేది ఇక అది క్రమంగా పెరగడమే. ►గర్భం రాకపోతే... మరి ఒకవేళ గర్భం రాకపోతే... సుమారు నెలరోజుల్లో ఆ డేట్‌కి రుతుస్రావం మొదలవుతుంది. పిండానికి మంచి ఆవాసం ఇవ్వడం కోసం మందంగా మారిన లైనింగ్ పొరలు... గర్భధారణ జరగనప్పుడు క్రమంగా క్షీణించిపోతాయి. అలా క్షీణించే సమయంలో అవి రక్తస్రావాన్ని వెలువరుస్తాయి. దాంతో ఆ పీరియడ్ ముగుస్తుంది. మళ్లీ దేహం మరో పీరియడ్‌కు కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవడం మొదలు పెడుతుంది. అంటే మరో సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదీ ఒక నెల వ్యవధిలో సాగే క్రమం. అత్యంత సక్రమం. కానీ ఏదైనా కారణాల వల్ల ఈ సైకిల్లో క్రమత్వం తప్పే అవకాశాలు, దాంతో సమస్య ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి. రుతుసంబంధ సమస్యలు – నిర్ధారణ పరీక్షలు రుతుక్రమానికి సంబంధించిన అనేక సమస్యల నిర్ధారణ కోసం సాధారణంగా కొన్ని పరీక్షలు చేస్తుంటారు. అవే... ∙ఎండోమెట్రియల్ బయాప్సీ (ఇందులో యుటెరస్లోని చిన్న పొరను తొలగించి, దాన్ని విశ్లేషణకు పంపుతారు) ∙హిస్టెరోస్కోపీ (ఒక చిన్న గొట్టానికి కెమెరా అమర్చి గర్భసంచిలోకి పంపి, అక్కడి అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నాయేమోనని తెలుసుకుంటారు ∙అల్ట్రాసౌండ్ పరీక్ష (ఇందులో శబ్దతరంగాల సహాయంతో గర్భసంచి ఎలా ఉందో తెలుసుకుంటారు). రుతుక్రమం ఆగిపోయిన తర్వాత (మెనోపాజ్) వచ్చే సమస్యలు మహిళల సంతానోత్పత్తి వయసు దాటాక రుతుక్రమం కూడా ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. ఈ సాధారణ పరిణామం కొందరిలో మరిన్ని సమస్యలు తెస్తుంది. ఉదాహరణకు మూడ్స్ సరిగా లేకపోవడం, మాటిమాటికీ భావోద్వేగాలకు లోనుకావడం, ఒంట్లోంచి ఆవిర్లు... వంటివి. ఈ లక్షణాలను బట్టి మెనోపాజ్ తర్వాత జీవితాన్ని సాధారణంగా ఉండేలా చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటి అనేక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. రుతుక్రమానికి సంబంధించి సమస్యలు మహిళలందరిలోనూ ఒకేలా ఉండవు. వేర్వేరు యువతులు వేర్వేరు తరహా రుతు సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. తమ సైకిల్ విషయంలో వారు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని ... మెనోరియా... పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుండటాన్ని మెనోరియా అంటారు. పీరియడ్స్ సమయంలో 80 ఎం.ఎల్. వరకు రక్తస్రావం సాధారణం. అంతకు మించితే ఇబ్బందికరం. హార్మోన్ల అసమతౌల్యతే దీనికి ప్రధాన కారణం. కొందరిలో భారీగా అయ్యే ఈ రక్తస్రావం 5 నుంచి 15 రోజులు, మరికొందరిలో అంతకు మించి కూడా కొనసాగుతుంది. కొన్నిసార్లు రక్తపు గడ్డలుగా కూడా రుతుస్రావం అవుతుంటుంది. రుతుక్రమం మొదలైన మొదటి రెండురోజుల్లో ఉండే తీవ్రత నాలుగు, ఐదు రోజుల వరకు కూడా కొనసాగుతుంది. ఇలాంటప్పుడు కారణాలను తెలుసుకోడానికి వైద్యపరీక్షలు చేయించాలి. రక్తహీనత (అనీమియా) ఉన్న మహిళలకు రుతుసమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అసలే రక్తం తక్కువగా ఉండడం, దానికి తోడు మళ్లీ ఎక్కువ రక్తం కోల్పోవడంతో తీవ్రమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కొరవడటంలో ఇలాంటి వారికి ఆయాసం వస్తుంటుంది. సాధారణ మోతాదుకు మించి రక్తస్రావం అవుతుందంటే... హైపోథైరాయిడిజమ్, ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, యుటెరస్ (గర్భసంచి)లో లేదా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో ఇన్ఫెక్షన్లు వంటివి కారణం కావచ్చు. కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందిస్తారు. తొలి దశలో హార్మోన్ పిల్స్‌తో జీవన నాణ్యత మెరుగవుతుంది. దాంతో నయం కాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ►డిస్ మెనోరియా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘డిస్మెనోరియా’గా వ్యవహరిస్తారు. సాధారణంగా పీరియడ్స్ మొదలు కాగానే... ఆ టైమ్‌లో పొత్తికడుపులో నొప్పి, పొట్ట, నడుము ప్రాంతపు కండరాలు అతిగా బిగదీసుకుపోయి తీవ్రంగా నొప్పి కలిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో కొద్దిపాటి నొప్పి ఉండటం సహజమే. కానీ తట్టుకోలేనంత నొప్పి ఉంటే ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వంటి ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయేమోనని ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ►ఉపశమనం కోసం తాత్కాలిక ఉపశమనం కోసం పొట్ట దగ్గర వేడినీళ్ల కాపడం (హీటింగ్ ప్యాడ్) పెట్టడం, నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడటం వంటివి చేయవచ్చు. అంతటి నొప్పికి అసలు కారణాన్ని కనుగొని దానికి తగిన చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ తరహా సమస్యనుంచి విముక్తి పొందవచ్చు. ఇలాంటి వారు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు. వ్యవధి పరమైన సమస్యలిలా... సాధారణంగా రుతుక్రమ చక్రం అంటే 28 రోజులు. చాలామందిలో క్రమం తప్పకుండా 28 రోజులకే పీరియడ్స్ మొదలవుతుంటే... కొందరిలో 25 రోజులకే వస్తుంటుంది. మరికొందరిలో 35 రోజులు పట్టవచ్చు. అదే నిడివి కొనసాగినా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకసారి 23 – 25 రోజులు... మరోసారి 32 – 35 రోజులు ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌గా చెబుతారు. ఇక మరికొందరిలో నెలల తరబడి నెలసరి రాకపోవచ్చు కూడా. ఇలా జరుగుతున్నప్పుడు హార్మోన్ల స్రావాలలో అపసవ్యతలు ఉన్నాయనీ, అవి పీరియడ్స్ క్రమతపై ప్రభావం చూపుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు అసలు కారణం ఏమిటో తెలుసుకొని ఆ మూల కారణాన్ని సరిదిద్ది సైకిల్‌ను మళ్లీ ‘సేఫ్’గా కొనసాగేలా చూసుకోవాలి. అమెనోరియా కొందరిలో రావాల్సిన సమయానికి పీరియడ్స్ రావు. అవి వచ్చే దాఖలా కూడా కనిపించదు. ఇలా పీరియడ్స్ రాకుండా పోవడాన్ని వైద్య పరిభాషలో ‘అమెనోరియా’ అంటారు. పిల్లలకు పాలిచ్చే సమయంలో ‘అమెనోరియా’ సర్వసాధారణం. సాధారణంగా యుక్తవయసు నాటికి రుతుక్రమం మొదలువుతుంది. కానీ... ఈ వయసు దాటుతున్నా రుతుక్రమం రాకపోతే ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. పుట్టుకతోనే ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు, గర్భసంచి (యుటెరస్) లేకపోవడం, అండాశయాలు (ఓవరీస్) పెరగకపోవడం వంటి సమస్యలు ఉంటే యుక్తవయసు వచ్చాక సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్... రొమ్ములు పెరగడం, బాహుమూలాలు, ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు పెరగడం వంటివి జరగవు. దీన్ని ప్రైమరీ అమెనోరియా అనవచ్చు. అయితే కొందరిలో సెంకడరీ సెక్సువల్ కారెక్టర్లు పెరిగినా 16వ ఏట వరకూ వ్యక్తురాలు కాకపోతే సెకండరీ అమెనోరియా అంటారు. ఇక కొందరిలో ఒకటి రెండు రుతుస్రావాలు కనిపించాక చాలా కాలం పీరియడ్ రాదు. దానిని సెకండరీ అమెనోరియా అంటారు. క్రమంతప్పకుండా నెలసరి వచ్చే వచ్చే మహిళల్లో కంటిన్యువస్‌గా మూడు నెలలు రుతుక్రమం రాకపోవడాన్ని అమెనోరియా అనవచ్చు. ఒకవేళ తొమ్మిది నెలల వ్యవధిలో అస్సలు రాకపోవడం, వచ్చీరానట్లుగా అనిపిస్తూ... అంటే... ఆ స్రావాలు తగినంతగా కాక ఏదో చుక్కలుగా రావడాన్ని ఆలిగోమెనిరియా అంటారు. అమెనోరియాకు సందర్భాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. ఉదాహరణకు గర్భనిరోధక మాత్రలు లేదా హార్మోన్ మాత్రలు ఇస్తారు. దాంతో రుతుక్రమం మొదలయ్యేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల లోపాల వల్ల రుతుస్రావం ఆగిపోయిన వారికి తగిన మందులతో చికిత్స చేస్తారు. ఒకవేళ శరీర నిర్మాణంలో అడ్డంకులు ఉంటే, దాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. ఇలాంటి ఏ లోపాలు లేనప్పుడు మహిళలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడం, తగినంత విశ్రాంతి, ఆహ్లాదకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం, ఒత్తిడిని తగ్గించడం వంటి వాటితో పీరియడ్స్‌ను పునరుద్ధరించవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి మహిళల్లో వచ్చే రుతుక్రమంలోని కొన్ని సాధారణ సమస్యలు మాత్రమే. ఇవి సక్రమంగా కొనసాగితే వారిది ‘సేఫ్ సైకిల్’గానే పరిగణించవచ్చు. ఇక్కడి పరిమిత సమాచారంలో మీ సమస్యలేమైనా ఉంటే వాటి గురించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోండి. అవగాహనను పెంపొందించుకోండి. తగిన చికిత్స తీసుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే మాకు రాయండి. డాక్టర్ ప్రభా అగర్వాల్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్ మ్యాక్స్‌క్యూర్ సుయోషా ఉమన్ అండ్ ఛైల్డ్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!
థీమ్.. త న న ఇవి తినండి, అవి తినకండి అని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అవన్నీ గుర్తుంచుకుని పాటించడం కాస్త కష్టమే. అయినా అన్నీ బుర్రతోనే గుర్తుపెట్టుకోవాలనేముందీ? ఈ పది పదార్థాలనీ కళ్లతో స్కాన్ చేసేయండి. పరగడుపునే తినడం మానేయండి. తింటే ఏమవుతుందో కూడా తెలుసుకోండి. ఇవీ డాక్టర్లు చెప్పినవే. సందేహించకుండా ఫాలో అవండి. స్వీట్లు ఉదయాన్నే చిన్న చాక్లెట్ నోట్లో వేసుకుంటే బుర్ర ఫ్రెష్‌గా ఉంటుందని వైద్యంలో ఓ థియరీ! దాన్నొదిలేయండి. ఉదయాన్నే కడుపులోకి తీపి పదార్థాలు వెళ్తే ఒంట్లో ఇన్సులిన్ లెవల్స్ ఎక్కువౌతాయి. దీనర్థం ఏమిటంటే.. షుగర్‌ను కంట్రోల్ చేసే హార్మోన్ అయిన ఇన్సులిన్... పరగడుపునే వచ్చి పడిన స్వీట్‌ని కంట్రోల్ చెయ్యడానికి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఇన్సులిన్ని ఉత్పత్తి చేసే పాంక్రియాస్ గ్రంథి మీద లోడ్ ఎక్కువౌతుంది. ఇలా లోడ్ పెరుగుతూ పోతుంటే డయాబెటిస్ వచ్చేస్తుంది! పేస్త్రీలు, పఫ్ పేస్త్రీలు ఉదయాన్నే ఇవి ఎవరు తింటారండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. రాత్రి తిన్నవి తినగా మిగిలిపోతే.. ఎవరో ఎందుకు మీరే తింటారు తెలుసా! సరే, తిన్నాక ఏం జరుగుతుంది? కడుపులోపలి మృదువైన పొర ల్లో మంట రేగుతుంది. గ్యాస్ ఫామ్ అవుతుంది. కడుపుబ్బరం వచ్చేస్తుంది. త్రేన్పులు వస్తాయి. ఉదయాన్నే వీటిని అలవాటుగా తినేవారికి అనతికాలంలోనే కడుపులో ఐపీఎల్ (మ్యాచ్ అన్నమాట) స్టార్ట్ అవుతుంది. పెరుగు, పులియబెట్టిన పాల పదార్థాలు పరగడుపునే పెరుగు తినేస్తే కడుపులో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ల మోతాదులు ఎక్కువౌతాయి. ఈ ఆసిడ్లు ఏం చేస్తాయంటే.. మనకు మేలు చేసే లాక్టిక్ ఆసిడ్ బాక్టీరియాను చంపేస్తాయి. ఆ కారణంగా తిన్నదేదీ ఒంటికి పట్టదు. అంటే.. పోషకాలను లోనికి లాక్కునే శక్తిని మన బాడీ కోల్పోతుంది. పెరుగు ఒక్కటే కాదు. పాలతో చేసినవి ఏవి తిన్నా ఇంతే. దోసకాయలు, పచ్చని కాయగూరలు దోసకాయలు, ఇతర కాయగూరలు పచ్చివి తింటే ఆరోగ్యం అని మీరు వినే ఉంటారు. కానీ... ఖాళీ కడుపుతో తింటే.. ఈ మంచివి కూడా చెడ్డవి అయిపోతాయి! కడుపులో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీనొప్పి కూడా వస్తాయి. పియర్స్ (బేరీ పండ్లు) ఇప్పుడివి మార్కెట్లో బాగా కనిపిస్తున్నాయి. సేమ్ ఇవే కాకున్నా, ఈ జాతి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. చూడగానే ఆకర్షించడం ఈ పండ్ల ప్రత్యేకత. ఉదయాన్నే మాత్రం మీరు వీటి ఆకర్షణకు లోను కాకండి. బేరీ çపండ్లలోని ముతగ్గా (రఫ్‌గా) ఉండే పీచుపదార్థం మీ ఖాళీ కడుపులోని మృదువైన ‘మ్యూకస్ మెంబ్రేన్’ (సున్నితమైన కణజాలం)ని గిన్నెల్ని తోమినట్టు తోమేస్తుంది. ఫలితం.. కడుపులో ట్వంటీ ట్వంటీ. (ఇదీ మ్యాచే). పుల్లని పండ్లు నారింజ, ఇతర పుల్లని పండ్లలో టన్నులకొద్దీ ఆసిడ్లు ఉంటాయి. వాటిని సాధారణ పరిభాషలో ఫ్రూట్ ఆసిడ్స్ అంటారు. పరగడుపునే వీటిని తినడం అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్ అల్సర్లు, హార్ట్ బర్న్.. ఇదిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి. శీతలపానీయాలు అంటే.. కూల్ డ్రింక్స్. వీటిల్లో టేస్ట్ కోసం కొద్దిగానైనా కార్బన్‌డైఆక్సైడ్‌ని చొప్పిస్తారు. అందుకే వీటిని కార్బొనేటెడ్ డ్రింక్స్ అంటారు. అందరికీ తెలిసిన పేరు ‘సాఫ్ట్ డ్రింక్స్’. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్ డ్రింక్ తాగితే కడుపు హార్డ్ అయిపోతుంది. బిగుసుకుపోతుందని కాదు. కడుపు మన మాట వినదని. మరి వీటిల్లోని కెఫీన్ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది కదా అని మీకు డౌట్ రావచ్చు. ఆక్చువల్లీ కెఫిన్ ఇంకో పని కూడా చేస్తుంది. పేగుల లోపలి కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కడుపు కండరాలకు రక్తం సరఫరా మందగించి జీర్ణక్రియల శక్తి సన్నగిల్లుతుంది. ఏదైనా జీర్ణం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! త్రేప్పులు, గుండె మంట వగైరా. టమాటాలు టమాటా జ్యూస్ ఆకలిని రేకెత్తిస్తుందని అంటారు. నిజమే. స్టార్టర్‌గా కొన్నిచోట్ల భోజనానికి ముందు టమాటా సూప్ ఇస్తారు. అయితే చేదునిజం ఏమిటంటే.. ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్‌ను తీసుకుంటే టమాటాల్లోని ట్యానిక్ ఆసిడ్లు అసిడిటీని పెంచి, పేగులు పుండ్లు పడేలా చేస్తాయి. అరటిపండ్లు ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే గుండెకు హాని కలుగుతుంది. అరటిపండ్లలోని ఒక చెడ్డ గుణం ఏమిటంటే... అవి ఒంట్లోని మెగ్నీషియం మోతాదులను సర్రున పెంచేస్తాయి. వట్టప్పుడు తింటే ఏం కాదు కానీ, పరగడుపున అరటిపండ్లను తింటే మాత్రం మన లోపలి మెగ్నీషియంకు ఇక అడ్డూఆపూ లేకుండా పోతుంది. మసాలాలు అసలు విలన్ దగ్గరికి వచ్చేశాం. మసాలాలు అంటే.. స్పైసీ ఫుడ్. ఉదయాన్నే బ్రెష్ చేసుకున్న వెంటనే ఆకలిగా ఉందని చెప్పి.. ‘అమ్మడు.. కుమ్ముడు’ టైప్‌లో స్పైసీ ఫుడ్డుని లాగిస్తే గొంతు నుంచి కడుపు వరకు ‘పిచ్’ రెడీ అయిపోతుంది. నానా రకాల గ్యాస్‌లు జట్లుగా విడిపోయి ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్, బౌలింగ్ చేసేస్తుంటాయి. -
ఇంకా సంతానం లేదు..!
ఫెర్టిలిటీ కౌన్సెలింగ్ నా వయసు 32 ఏళ్లు. నా భార్య వయసు 27 ఏళ్లు. మాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇంకా పిల్లలు కలగలేదు. డాక్టర్లను కలిశాం. చాలా పరీక్షలు చేశారు. అన్నీ నార్మల్ అంటున్నారు. మరి మాకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? - ఒక సోదరుడు, నిర్మల్ దాదాపు 20 శాతం మంది దంపతుల్లో అన్ని పరీక్షలూ నార్మల్‌గానే ఉన్నా ఒక్కోసారి సంతాన సాఫల్యం కనిపించకపోవచ్చు. దీన్ని ‘అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫెర్టిలిటీ’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు మహిళల్లో అండం నాణ్యత తక్కువగా ఉండవచ్చు. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ సమస్యలు ఉండవచ్చు. అలాగే కొంతమంది పురుషుల వీర్యంలో నాణ్యత లోపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు తెచ్చుకోవడం అవసరం. అంటే బరువు ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకోవడం, రక్తంలోని చక్కెర పాళ్లను, కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోవడం, ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయడం వంటివి. ఇక దీనితో పాటు సమస్యకు అనుగుణంగా చికిత్స తీసుకోవడం మరింతగా ఉపయోగపడుతుంది. అండాల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ ట్యాబ్లెట్లూ, ఇంజెక్షన్లూ ఈ చికిత్సలో భాగంగా ఇస్తారు. ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్సెమినేషన్) అనే ప్రత్యేక ప్రక్రియలు అవలంబిస్తారు. ఒకవేళ అన్ని చికిత్సలూ విఫలం అయినా నిరుత్సాహపడాల్సిందేమీ లేదు. ఇలాంటి వాళ్లకు ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్యం కలిగించవచ్చు. డాక్టర్ ప్రీతిరెడ్డి ఇన్ఫెర్టిలిటీ కన్సల్టెంట్, బర్త్ రైట్ బై రెయిన్బో, హైదరాబాద్ ఆస్తమా నయమవుతుందా? నా వయస్సు 58. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రం అయి శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారుతోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? - తేజ, భీమవరం ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు వాచడం వల్ల అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు. మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీనివల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి వాచి సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారుతాయి. దాంతో ఆస్తమా వస్తుంది. కారణాలు: ఆస్తమా రావడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల కారణంగా ఈ వ్యాధి వస్తుందని భావిస్తున్నారు. ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతువుల వెంట్రుకలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, అధిక శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, రసాయనాలు, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి. లక్షణాలు: ఇవి ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది)తో పాటు శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బంది కలగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి. హోమియోలో చికిత్స: హోమియోలో అధునాతనమైన జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ -
వయసు తగ్గించే హార్మోన్ దొరికింది!
నిత్య యవ్వనంతో జీవితాన్ని కొనసాగించాలని కోరుకోని వారెవరు ఉంటారు? ఇందుకోసం ఏళ్లుగా పరిశోధనలూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా బ్రెజిల్, అమెరికా శాస్త్రవేత్తలు ఈ దిశగా కీలకమైన ముందడుగు వేశారు. మానవ కణాల్లో వయోభారాన్ని తిరోగమింపజేసే హార్మోన్ ఒకదాన్ని వీరు గుర్తించారు. ఈ ఆవిష్కరణ మనల్ని చిరాయువులుగా చేయకపోయినా వయోభారంతో వచ్చే సమస్యలకు మరింత సమర్థమైన చికిత్స అందించడంలో మాత్రం ఉపయోగపడనుంది. ఇది ఓ పురుష హార్మోన్. పేరు డనాజోల్. కృత్రిమంగా తయారు చేసిన ఈ హార్మోన్ టెలిమెరేస్ అనే ఎంజైమ్ ఉత్పత్తిని ఎక్కువ చేస్తుంది. ఈ ఎంజైమ్ మన కణాల్లోని క్రోమోజోమ్‌ల చివరలో ఉండే టెలిమోర్లు కుంచించుకుపోకుండా ఉండేలా చేస్తుంది. వయసుతోపాటు ఈ టెలిమోర్ల పొడవు తగ్గిపోతుందని ఇప్పటికే రుజువైన నేపథ్యంలో ఈ పరిశోధన ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటోంది. కణం విడిపోయిన ప్రతిసారీ టెలిమోర్ల పొడవు కొంత తగ్గుతుందాని, పూర్తిగా లేని పరిస్థితి వచ్చినప్పుడు కణం చనిపోతుందని అంటున్నారు సావోపాలో విశ్వవిద్యాలయ శాస్త్రవేత్త రోడ్రిగో కలాడో. టెలిమరేస్ ఎంజైమ్ ఈ ప్రక్రియను నిలిపివేస్తుంది కాబట్టి కణం విడిపోవడం కొనసాగుతుందన్న మాట. ఈ కొత్త ఆవిష్కరణతో అప్లాస్టిక్ అనీమియా, పల్మనరీ ఫైబ్రోసిస్ వంటి వ్యాధులకు మెరుగైన చికిత్స లభించే అవకాశముందని అంచనా. -
లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది
ఆగిపోకండి! సాగిపోండి! మెనోపాజ్... ఋతుక్రమం ఆగిపోవడం... ఇది శారీరకంగా ప్రతి స్త్రీ జీవితంలో వచ్చే దశ. కానీ, ఆ దశలో ఎదురయ్యే శారీరక, మానసిక బాధల గురించి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. కానీ, ‘మెనోపాజ్’ గురించి పీడకలలా భయపడాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. స్త్రీ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక మజిలీ. అక్కడ కాసేపు ఆగి, సేద తీరి, స్వీయపరిశీలన చేసుకొని, మరింత దృఢచిత్తంతో ముందుకు సాగాలి. వయస్సు మీద పడుతున్నప్పుడు దాన్ని హుందాగా అంగీకరించడం నేర్చుకోవాలి. హార్మోన్లలో తేడా వల్ల.... మెనోపాజ్ దశలో ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలో తేడాల వల్ల ఒళ్ళు వెచ్చపడడం, ఉన్నట్టుండి మూడ్ మారిపోవడం, రాత్రివేళ విపరీతంగా చెమటలు పట్టడం, జననేంద్రియం లోపల పొడిబారిపోవడం, సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం లాంటి లక్షణాలు తలెత్తుతాయి. చాలామందికి తెలియనిదేమిటంటే, ఆడవారికి ఈస్ట్రోజెన్ లాగే టెస్టోస్టీరాన్ హార్మోన్ కూడా కీలకమే. మెనోపాజ్‌తో టెస్టోస్టీరాన్ స్థాయి తగ్గడం వల్ల కూడా లైంగిక ఆసక్తి, భావప్రాప్తి లాంటివి తగ్గిపోతాయి. వాటితో బెంగపడకుండా, స్త్రీలు సమస్యను అర్థం చేసుకొని, జీవితంలో ముందడుగు వేయాలి. జీవిత భాగస్వాములైన పురుషులు కూడా ఈ విషయం సహృదయంతో అర్థం చేసుకోవాలి. తగినంత సేపు మాటలు, చేష్టల ద్వారా వారిని సిద్ధపరచాలి. సుప్రియ ఈ మధ్య తరచూ చీకాకుగా ఉంటోంది... తెచ్చిన కాఫీ కాస్తంత చల్లగా ఉందనో, అరగంట క్రితమే చెప్పిన పని ఇంకా కాలేదనో... ప్రతి చిన్న విషయానికీ పనివాళ్ళ మీద భద్రకాళిలా విరుచుకుపడుతోంది.ఆమె మూడ్ ఉన్నట్టుండి... మారిపోతోంది. సీరియస్ అవుతోంది. నిజానికి... 56 ఏళ్ళ సుప్రియ ఎప్పుడూ ఇలా ఉండేవారు కాదు. అందరితో నవ్వుతూ, తుళ్ళుతూ ఉండేవారు. కానీ, ఇప్పుడు ఇంట్లోనూ, ఆఫీసులోనూ అయినదానికీ, కానిదానికీ గొంతు చించుకుంటున్నారు. శారీరకంగా కూడా ఆమెలో ఇప్పుడు చాలా మార్పులు వస్తున్నాయి. విపరీతమైన అలసట, నీరసంగా అనిపించడం, బద్ధకం, ఉన్నట్టుండి ఒళ్ళంతా వెచ్చబడడం, చెమటలు పట్టడం! సుప్రియకు వచ్చిందేదో తగ్గని అనారోగ్యం, తీరని జబ్బు కాదు. ఈ మూడ్‌లో మార్పులు ఆడవారందరిలో జీవితంలో ఒక దశలో కనిపించేవే! అవును... మెనోపాజ్... ఋతుక్రమం ఆగిపోవడం... ఇది శారీరకంగా ప్రతి స్త్రీ జీవితంలో వచ్చే దశ. కానీ, ఆ దశలో ఎదురయ్యే శారీరక, మానసిక బాధల గురించి చాలామంది బెంబేలెత్తిపోతుంటారు. కానీ, ‘మెనోపాజ్’ గురించి పీడకలలా భయపడాల్సిన పని లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. మెనోపాజ్ ముందు దశలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినప్పుడు రక్తస్రావం ఎక్కువగా ఉండడం, మానసికంగా చీకాకుగా అనిపించడం - ఎవరికైనా కొద్దిగా ఇబ్బందే. మెనోపాజ్ దశలోని స్త్రీలు నెమ్మదిగా నడుస్తారు. అలాగే, కొద్దిగా బరువు పెరుగుతారు. మెడ కింద చర్మం వదులుగా మారుతుంది. కొద్దిగా ముడతలు కూడా వస్తాయి. ముఖ్యంగా, ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల చర్మం పొడిబారి, సాగే గుణాన్ని కోల్పోతుంది. గాయాలు త్వరగా తగ్గవు. జుట్టు పలచబడుతుంది. ఒంటిమీద వెంట్రుకలు రావడం పెరుగుతుంది. అయితే, జీవితంలో శారీరకంగా వచ్చే మార్పుల్లో మెనోపాజ్ కూడా ఒకటని గ్రహించాలి. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫ్లూ తదితర సమస్యల లాగానే దీన్ని కూడా హాయిగా ఎదుర్కోవాలి. అంతే తప్ప, శారీరకంగా, మానసికంగా వచ్చిన మార్పులతో పోరాటానికి దిగకూడదు. అలాగని విస్మరించి, అందరికీ దూరంగా మీదైన లోకంలో ఉండిపోయి, ముడుచుకుపోకూడదని డాక్టర్లు చెబుతున్నారు. ఆగిపోతాయి! అంతే! శాస్త్రీయంగా చూస్తే, ఆడపిల్లకు పుట్టుకతోనే అండాశయంలో 20 లక్షల అండాల దాకా ఉంటాయి. ఆ అమ్మాయి పెద్దమనిషి అయ్యే నాటికల్లా వాటి సంఖ్య 4 లక్షలకు తగ్గిపోతుంది. వాటిలో దాదాపు 500 అండాలు మాత్రమే మెచ్యూర్ అయి, అండోత్సర్గ సమయంలో అండాశయం నుంచి బయటకు వస్తుంటాయి. పెద్దమనిషి అయిన దగ్గర నుంచి మెనోపాజ్ దశ దాకా నెలకు ఒకసారి జరిగే ఋతుక్రమం ఇదే! మెనోపాజ్ వచ్చిందంటే, అండాశయంలో అండాల ఉత్పత్తీ జరగదు, ఈ అండాల విడుదలా ఆగిపోతుందన్న మాట! మరోమాటలో చెప్పాలంటే, సహజసిద్ధంగా ఆమె గర్భవతి అయ్యే అవకాశం ఇక ఉండదన్న మాట! లైంగిక ఆసక్తి కూడా తగ్గుతుంది. అంతమాత్రాన ‘మెనోపాజ్’ అంటే సెక్స్ జీవితానికి శుభం కార్డు అని ఫీలవ్వాల్సిన పని లేదు. కేవలం ‘కృష్ణా... రామా’ అనుకోవాల్సిందే అనుకోకూడదు. ఈస్ట్రోజెన్ హార్మోన్ తగ్గడం వల్ల లూబ్రికేషన్ కరవై, కలయిక సమయంలో నొప్పి అనిపిస్తుంది. శారీరకంగా వచ్చిన మార్పులకు అనుగుణంగా లైంగిక జీవితానికి సిద్ధమైతే చాలు. ఎంత వయసు వచ్చిందనే దాని కన్నా, మానసికంగా ఎంత యౌవనంగా ఫీలవుతున్నామన్నది ముఖ్యం. స్త్రీలకు ఎందుకు సమస్యంటే... ఏమైనా, ‘మెనోపాజ్’ స్త్రీలకు మానసికంగా ఇది కొద్దిగా కష్టసమయమేనని మానసిక వైద్య చికిత్సా నిపుణులు సైతం అంగీకరిస్తున్నారు. ఆ సమయంలో హార్మోన్లపరంగా వచ్చే మార్పుల వల్ల నిద్రలేమి ఏర్పడుతుంది. మానసికంగా ఆందోళన తలెత్తుతుంది. దాంతో, ఏ పని మీదా శ్రద్ధ, ఏకాగ్రత లేకుండా పోతాయి. నిజానికి, ఆ వయసులో ఆడవాళ్ళకు ఒకపక్క ఇంటి సమస్యలు కూడా ఎక్కువే. భర్త రిటైర్మెంట్ దగ్గర పడుతుంటుంది. అమ్మానాన్నలు, అత్తమామలు పెద్దవాళ్ళైపోయి, వాళ్ళకు అండగా నిలబడాల్సి ఉంటుంది. ఇంకోపక్క పిల్లలేమో పెరిగిపెద్దవడంతో, వాళ్ళ తాలూకు సమస్యలు ఉండనే ఉంటాయి. ఇవన్నీ చాలవన్నట్లు కెరీర్లో కూడా బాధ్యతాయుతమైన పదవిలోకి వచ్చి ఉంటారు. ఆ సమయంలో మెనోపాజ్ రావడంతో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు శారీరక సమస్యలు కూడా తోడవుతాయి. మానసికంగా నిరాశా నిస్పృహలకు లోనవుతారు. అత్యవసరమైతే... హార్మోన్ థెరపీ మెనోపాజ్ ఇబ్బందులు మరీ ఎక్కువగా ఉండి, జీవన స్థాయినే దెబ్బతీస్తుంటే హార్మోన్ థెరపీ చేయించుకోవచ్చని ‘ఇంటర్నేషనల్ మెనోపాజ్ సొసైటీ’ ఎడ్యుకేషన్ కమిటీకి సారథ్యం వహిస్తున్న డాక్టర్ దురూ షా సలహా ఇస్తున్నారు. ‘‘మరీ ఇబ్బంది పడుతున్న ఆడవారికీ, 40 ఏళ్ళ లోపే మెనోపాజ్ వచ్చినవారికీ హార్మోన్ థెరపీ ఒక వరం. అయితే, సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి కాబట్టి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ థెరపీ తీసుకుంటే, ఎముకలు విరగడాన్ని నివారించవచ్చు. పెద్దపేగు క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించవచ్చు. జీవనస్థాయి కూడా మెరుగవుతుంది’’ అని డాక్టర్ దురూ షా వివరించారు. అయితే, మధుమేహం ఉన్నవారు, తమ కుటుంబంలో ఎవరికైనా సెర్వికల్ క్యాన్సర్ వచ్చిన చరిత్ర ఉన్నవాళ్ళు మాత్రం ఈ ‘హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ’ (హెచ్.ఆర్.టి) చేయించుకోకూడదు. మీ కోసం... మీ వ్యాయామం! మెనోపాజ్ తర్వాత ఎముకలు గుల్లబారిపోవడం అనేది చాలామంది స్త్రీలను పీడిస్తున్న సమస్య. దానివల్ల మణికట్టు, తుంటి, వెన్నెముక లాంటివి ఫ్రాక్చర్స్‌కు లోనయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ రకమైన ఆస్టియో పోరోసిస్‌కు చికిత్సకన్నా నివారణే కీలకం. అందుకే, ఎముకల సాంద్రత సరిగ్గా ఉండేలా చూసుకొనేందుకు స్త్రీలు మొదటి నుంచి వ్యాయామం చేస్తూ, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవాలి. ఉద్యోగం, పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతల లాంటివి ఎన్ని ఉన్నప్పటికీ, ముందునుంచీ వ్యాయామం చేయడం భవిష్యత్తుకు మంచిది. అందుకే, ఆడవాళ్ళు మొదటి నుంచీ వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, కాళ్ళమీద - పాదాల మీద నిల్చొని... శరీరం బరువు వాటి మీద ఉండేలా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. ఇవి తినండి! ఈ వయసు ఆడవాళ్ళు సలాడ్లు, పండ్లు ఎక్కువగా తినాలి. ఎముకలు పటిష్ఠంగా ఉండడం కోసం క్యాల్షియం, ‘డి’ విటమిన్ ఒంటికి ఎక్కువగా పట్టేలా ఆకుకూరలు, కూరగాయలు, పాల ఉత్పత్తులు, సీతాఫలాలు, జామపండ్లు ఎక్కువగా తినాలి. అలాగే, ఈస్ట్రోజెన్ హార్మోన్ లోపాన్ని ఎదుర్కోవడం కోసం సోయాబీన్స్, సోయా పాలతో చేసిన ‘టోఫూ’ పెరుగు, అవిసె గింజలు, బీన్స్, బఠాణీలు, నువ్వులు బాగా తినాలి. వారానికి రెండుసార్లయినా మినుములు, మినప్పప్పు లాంటివి తింటే టెస్టోస్టీరాన్ స్థాయి మెరుగవుతుంది. నిజం చెప్పాలంటే, స్త్రీ జీవితచక్రంలో మెనోపాజ్ అనేది ఒక మజిలీ. అక్కడ కాసేపు ఆగి, సేదతీరి, స్వీయపరిశీలన చేసుకొని, మరింత దృఢచిత్తంతో ముందుకు సాగాలి. వయస్సు మీద పడుతున్నప్పుడు దాన్ని హుందాగా అంగీకరించడం నేర్చుకోవాలి. మూడేళ్ళక్రితం మెనోపాజ్ వచ్చిన ప్రముఖ టీవీ, స్టేజ్ యాంకర్ సాధనా శ్రీవాస్తవ్ (55 ఏళ్ళు) మాటల్లో చెప్పాలంటే, ‘‘అనవసరమైన ఆందోళనలన్నీ దూరంగా నెట్టండి. శారీరకంగా వస్తున్న మార్పుల గురించి అతిగా ఆందోళనపడితే, చర్మం మరింత ముడతలు పడుతుంది. జుట్టు ఇంకా ఇంకా నెరిసిపోతుంది. జీవితం ఎలా ముందుకు సాగితే, అలా ముందుకు వెళ్ళండి. అన్నిటినీ సమానంగా ఆస్వాదించండి. వీలైనంత ప్రశాంతంగా ఉండండి!’’ అప్పుడు మెనోపాజే కాదు... జీవితంలో ఏదైనా ఒక చిన్న ఫేజ్. అంతే! ఆ కొద్దిపాటి ‘పాజ్’ను కూడా భరించి, ఆనందంగా ముందుకు సాగిపోండి! మనవాళ్ళకు... తొందరగా మెనోపాజ్ ! భారతీయ మహిళలకు సగటున 48 ఏళ్ళ వయస్సులో మెనోపాజ్ వస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ సగటు మాత్రం 51 ఏళ్ళు. ఆ రకంగా చూస్తే, మన దేశ స్త్రీలు పిన్న వయస్సులోనే తొందరగా మెనోపాజ్ వస్తోందన్న మాట! ఇటీవలి అధ్యయనాలు కూడా ఆ మాటే పేర్కొంటున్నాయి. ‘‘ఆలస్యంగా పిల్లల్ని కనడం, పెరిగిపోతున్న గొడ్రాలితనం, మారుతున్న ఆహారపుటలవాట్లు, పొగతాగడం, అన్నిటి కన్నా ముఖ్యంగా మానసిక ఒత్తిడి వల్ల ఇలా ‘ముందుగానే మెనోపాజ్’ వస్తోంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. అండాశయాలు రెంటినీ అలాగే ఉంచేసినప్పటికీ, ‘పెద్దాపరేషన్’ చేసి గర్భసంచీ తొలగించిన (హిస్టెరెక్టమీ) ఆడవారికి తొందరగా మెనోపాజ్ వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఆపరేషన్ ప్రక్రియలో వారి అండాశయాలపై ప్రభావం పడడం వల్ల కావచ్చు... గర్భసంచీ తొలగింపునకు గురైన ఆడవారిలో అకస్మాత్తుగా ఒళ్ళు వెచ్చబడడం, ముఖమంతా ఎర్రగా మారడం లాంటి మెనోపాజ్ లక్షణాలు కనిపిస్తుంటాయి. మెనోపాజ్ అంటే... ఋతుక్రమం శాశ్వతంగా ఆగిపోవడమనేది (మెనోపాజ్) ప్రతి స్త్రీ జీవితంలో జరిగేదే! సాధారణంగా 45 నుంచి 55 ఏళ్ళ మధ్య వయస్సులో ఇది జరుగుతుంది. ఇది అందరిలో జరిగే మామూలు శారీరక ప్రక్రియే తప్ప, మరేమీ కాదు. గ్రీకు తత్త్వవేత్త అరిస్టాటిల్ ఈ శారీరక స్థితిని కొన్ని వందల ఏళ్ళ క్రితమే పేర్కొన్నారు. అయితే, ‘మెనోపాజ్’ అనే పదాన్ని మాత్రం చార్లెస్ పియర్ లూయిస్ డి గార్డెనే 1821లో రాసిన ‘మెనోపాజ్ - ది క్రిటికల్ ఏజ్ ఆఫ్ ఉమెన్’ అనే వ్యాసంలో తొలిసారిగా వాడారు. కారణం అండాశయాల నుంచి హార్మోన్ల ఉత్పత్తి క్షీణించడం వల్ల మెనోపాజ్ వస్తుంది. మెదడు నుంచి చర్మం దాకా కణజాలం మొత్తం మీద దీని ప్రభావం ఉంటుంది. నూటికి ఒక్క మహిళలో మాత్రం 40 ఏళ్ళ వయస్సు లోపలే అండాశయాలు పనిచేయడం మానేస్తాయి. దీన్నే ‘ప్రిమెచ్యూర్ ఒవేరియన్ ఫెయిల్యూర్’ అంటారు. మధుమేహం, కెమోథెరపీ, ఆటో - ఇమ్యూన్ డిసీజ్‌ల లాంటి వాటి వల్ల ఇలా జరుగుతుంటుంది. కాగా, గర్భసంచీ తొలగింపు ఆపరేషన్, ధూమపానం, అధిక బరువు లాంటి కారణాల వల్ల కూడా కొన్నిసార్లు మెనోపాజ్ దశ తొందరగా రావచ్చు. దశలు {పీ-మెనోపాజ్ - ఋతుచక్రం క్రమం తప్పిపోయిన దశ.పెరీ-మెనోపాజ్ - మెనోపాజ్‌కు దారి తీసే సంధి కాలం. ఇది దాదాపుగా 4 నుంచి 8 ఏళ్ళ దాకా కూడా ఉండవచ్చు.పోస్ట్ - మెనోపాజ్ - కనీసం ఒక ఏడాది కాలంగా ఋతుక్రమం ఆగిపోతే, ఇక మెనోపాజ్ వచ్చినట్టే! వచ్చే ముప్పు మెనోపాజ్ వల్ల ఎముక కణజాలంలోని ప్రొటీన్, ఖనిజ లవణాల పరిమాణం తగ్గిపోయే ‘ఆస్టియోపేనియా’ రావచ్చు. క్యాల్షియం, ‘డి’ విటమిన్ లోపాల వల్ల ఎముకలు పెళుసుగా మారి, ఉత్తిపుణ్యానికే విరిగే ‘ఆస్టియోపోరోసిస్’ రావచ్చు. అలాగే, గుండె రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడడం వల్ల వచ్చే గుండెపోటు లాంటి ‘కార్డియో వాస్క్యులర్ డిసీజ్’లు రావచ్చు. మెనోపాజ్ వస్తే... ఏం చేయాలి? మెనోపాజ్ అనేది శారీరకంగా వచ్చే మార్పే తప్ప, చికిత్స చేయించుకోవాల్సిన వ్యాధి కాదని ముందుగా గుర్తించాలి మెనోపాజ్‌కు చేరువయ్యే సంధి కాలంలో శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలు మరీ ఇబ్బందికరంగా ఉంటే, హార్మోనల్ రీప్లేస్మెంట్ థెరపీని తీసుకోవచ్చు. అయితే, దీన్ని చాలా జాగ్రత్తగా, అతి కొద్దికాలం మాత్రమే వాడాలి ప్రత్యామ్నాయ వైద్య విధానంగా ఆక్యుపంక్చర్, ఔషధపరమైన ఆహార సప్లిమెంట్ల లాంటివి కూడా కొందరు వాడతారు మెనోపాజ్ వల్ల ఈస్ట్రోజెన్ తగ్గుతుంది. జననేంద్రియ స్రావాలు తగ్గుతాయి. కాబట్టి, ‘వాజినల్ మాయిశ్చరైజర్లు’, తక్కువ మొతాదు ఈస్జ్రోజెన్ క్రీమ్‌లను వాడితే ఉపశమనం ఉంటుంది పుష్కలంగా ద్రవపదార్థాలు తీసుకోవాలి. తేలికపాటి, వదులు దుస్తులు వేసుకోవాలి. మసాలా ఆహారం తినకూడదు. తింటే, ఉన్నట్టుండి ఒళ్ళు వెచ్చబడడం, చెమటలు పట్టడం లాంటివి ఎక్కువవుతాయి మెనోపాజ్ వచ్చే క్రమంలోని ఇబ్బందుల్ని భరించలేకపోతే, కౌన్సెలింగ్ తీసుకోవడం ద్వారా వాటిని ఎదుర్కోవాలి కాళ్ళ మీద - పాదాల మీద నిల్చొని... శరీరం బరువు వాటి మీద ఉండేలా తేలికపాటి వ్యాయామాలు చేయాలి. క్యాల్షియం, ‘డి’ విటమిన్ సప్లిమెంట్లు తీసుకోవాలి. బై ఫాస్ఫొనేట్స్ లాంటి మందులు వాడడం ద్వారా ‘ఆస్టియో పోరోసిస్’ను నివారించుకోవచ్చు. -
నేను మీ థైరాయిడ్‌ని..
ఊపిరితిత్తులకు గాలి అందించే వాయునాళం చుట్టు ఆవరించుకొని పింక్ రంగులో ఉంటాను. నేను కేవలం 20 గ్రాములు మాత్రమే తూగుతాను. ఒక గ్రామును 28,00,000 భాగాలు చేస్తే ఎంత ఉంటుందో ఒక రోజులో అంత పరిమాణంలోనే హార్మోన్ స్రవిస్తాను. నా చిన్న సైజ్నూ, నేను వెలవరించే హార్మోన్ మోతాదును చూసి నా పనితీరును తక్కువ అంచనా వేయకండి. నేనెంతో ప్రధానమైన భాగాన్ని. నేను ఆనంద్ థైరాయిడ్‌ను. ఒకవేళ ఆనంద్ పుట్టేనాటికి నేను పని ప్రారంభించకపోయి ఉంటే ఆనంద్ మందపాటి పెదవులతో, చప్పిడి ముక్కుతో, వెర్రిబాగులవాడిగా ఉండిపోయేవాడు. నిత్యం ఒకేలా శక్తిని వెలువరించే కొలిమిని... నేను నిప్పు రగిలించే కొలిమిలా పనిచేస్తుంటా. ఒకే వేగంతో ఎప్పుడూ ఒకేలా ఆనంద్‌లోని వందల కోట్ల కణాలన్నింటిలోనూ ఆహారాన్ని మండించి, వాటన్నింటికీ నిత్యం శక్తిని అందిస్తూ ఉంటా. ఆ కొలిమిలో కణికలెప్పుడూ ఆరిపోకుండా ఒకేలా రగిలిస్తుండటం లాంటి పనే నేనూ కణాల విషయంలో చేస్తుంటా. నా పనితీరు ఒకింత తగ్గితే ఆనంద్ ముఖం ఉబ్బిపోయినట్లుగా కనిపిస్తూ, ఒళ్లంతా ఊబకాయంతో, మందగించిన కదలికలతో, మందకొడిగా అయిపోతాడు. ఒకవేళ నా పనితీరుగానీ ఒకింత పెరిగిందా... అతడిలో తోడేలుకు ఉన్నంత ఆకలి ఉంటుంది. కానీ ఎంత తిన్నా తిన్నదంతా ఆవిరి అయిపోతుంది. అతడి కనుగుడ్లు ముందుకు పొడుచుకొని వచ్చినట్లుగా అవుతాయి. అతడి గుండె రేసులో పాల్గొన్నట్లుగా దౌడు తీస్తుంటుంది. చిన్న స్థలంలో పెద్ద రసాయన కర్మాగారాన్ని ఆనంద్ ఇతర ఎండోక్రైన్ గ్రంథులలాగే నేను అత్యంత చిన్న ప్రదేశంలో నెలకొల్పిన పెద్ద రసాయన కర్మాగారంలా పనిచేస్తుంటాను. ఆ కర్మాగారంలో అత్యంత సంక్లిష్టమైన రసాయనాలు ఉత్పిత్తి అవుతాయి. నానుంచి ఉత్పత్తి అయ్యే రెండు అతి ముఖ్యమైన రసాయనాల్లోని మూడింట రెండోవంతు అయోడిన్ ఉంటుంది. అందుకు నాకు కావాల్సిన అయోడిన్ పరిమాణం ఒక గ్రాములోని ఐదువేలవ వంతు. అంటే ఒక గ్రామును ఐదు వేల భాగాలు చేస్తే, అందులోని ఒక భాగం ఎంత ఉంటుందో అంతే మొత్తంలో అయోడిన్ కావాలి. ఇంత చిన్న మొత్తంలోనే అయినప్పటికీ నాకు అందాల్సిన అయోడిన్ అందకపోతే ఆనంద్ శక్తితో చురుగ్గా ఉండటానికి బదులు బలహీనంగా, నిస్సత్తువగా అయిపోయేవాడు. ఇక నాలోని రసాయనాల నిర్మాణాల సంక్లిష్టత గురించి చెబుతూ, నన్ను నేను పొగుడుకుంటూ మీకు బోరు కొట్టించను. కానీ కొన్ని విషయాలను చెప్పాల్సిందే. నాకు కావాల్సిన అయోడిన్‌ను నేను ఆనంద్‌లోని జీర్ణమైన అయోడైడ్స్నుంచి తయారు చేసుకుంటాను. ఆ తర్వాత అది టైరోసిన్ అనే అమైనో యాసిడ్‌తో జతగూడుతుంది. ఈ జంట నుంచి రెండు రకాల ప్రధాన హార్మోనులుగా రూపొందుతుంది. అవి రెండూ ఆనంద్ రక్తప్రవాహంలో కలిసి ఆనంద్ దేహంలోని మారుమూల ప్రాంతాలకూ వెళ్తుంటాయి. మోతాదు అతి తక్కువ... శక్తి చాలా ఎక్కువ... నాలోని హార్మోన్ల మోతాదు అతి తక్కువ అయినా చాలా శక్తిమంతమైనవి. అందుకే వాటిపై అదుపు ఉండేలా చూస్తుంటాను. నాలోని స్రావాలను ఉత్పత్తి చేయడానికి, వాటి పాళ్లను నియంత్రించడానికి మరో రెండు గ్రంథులు నాకు సహాయం చేస్తుంటాయి. అందులో ఒకటి ఆనంద్ మెదడులో ఉండే హైపోథెలామస్. అది పిట్యుటరీ అనే మరో గ్రంథిని ప్రేరేపిస్తుంది. పిట్యుటరీ నుంచి నన్ను ప్రేరేపించేందుకు థయోట్రోపిన్ అనే హార్మోన్ స్రవిస్తుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఉత్పత్తి చేయమని నన్ను ఆదేశిస్తుంది. దాంతో నేను పని మొదలుపెడతాను. నాలోని హార్మోన్ స్రావం మొదలు కాగానే పిట్యుటరీకి సిగ్నల్ అందుతుంది. దాంతో అది తన పని పూర్తయినట్లు గ్రహించి థైరోట్రోపిన్ను ఆపేస్తుంది. ఇలా ఒకరి నుంచి మరొకరికి అందే ఫీడ్‌బ్యాక్ ద్వారా ఒకరిని ఒకరం నియంత్రించుకుంటూ ఉంటాం. అయోడిన్ లభ్యమయ్యే వనరులివే... సముద్రపు చేపలూ (సీఫుడ్), సముద్రానికి దగ్గర్లో ఉండే భూభాగంలో పెరిగిన ఆకుకూరలు, కాయగూరల్లో అయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ విషయంలో హిమనీనదాలు (గ్లేషియర్స్) ఉన్నచోట నివసించేవారు సముద్రపు ప్రాంతంలో ఉండేవారంత అదృష్టవంతులు కాదు. ఎందుకంటే అక్కడ ప్రవహించే హిమనీనదాలు క్రమంగా కరిగి ప్రవహిస్తూ ఉండటం వల్ల అక్కడి అయోడిన్ కొట్టుకుపోతూ ఉంటుంది. అందుకే అలాంటి చోట ఉన్నవారు అయోడైజ్డ్ ఉప్పు వాడాలి. కొత్త కణాలకు అవసరమైన కార్యకలాపాలు నిర్వహించాల్సి రావడం వల్ల నా అయోడిన్ ఆకలి పెరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఒరిజినల్‌గా ఉండే 20 గ్రాముల నుంచి నా బరువు విపరీతంగా పెరుగుతుంది. ఒక్కోసారి అయోడిన్లోపం వల్ల వచ్చే అయోడిన్ డిఫెషియెంట్ గాయిటర్ / నాన్ టాక్సిక్ గాయిటర్ సమస్య వల్ల కూడా నా పరిమాణం పెరగవచ్చు. కానీ సాధారణంగా చాలా సందర్భాల్లో అది అంత ప్రమాదకరం కాదు. అయితే అలా పెరిగే సమయాల్లో అది వాయునాళాన్ని నొక్కేస్తూ పోతే మాత్రం ప్రమాదమే. అదీ అదృష్టం... అదృష్టవశాత్తు మిగతా ఎండోక్రైన్ గ్రంథులతో పోలిస్తే నాకు వచ్చే సమస్యలను తగ్గించే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కోసారి నేను మరీ చురుగ్గా పనిచేస్తుంటే ఆనంద్‌కు చికిత్స చేసే డాక్టర్లు రేడియోయాక్టివ్ అయోడిన్‌తో చికిత్స చేయవచ్చు. ఈ రేడియో యాక్టివ్ అయోడిన్ సాధారణ అయోడిన్లాగే నన్ను చేరుతుంది... ఆ తర్వాత నాపై ఉక్కుపాదం మోపుతుంది. నా అతి చురుకుదనాన్ని తగ్గిస్తుంది. అయితే కొద్ది వారాల్లోనే తర్వాత ఆ అయోడిన్ నుంచి వచ్చే రేడియో యాక్టివ్ పదార్థాలు తగ్గిపోతాయి. అందుకే నేను ఓవర్‌యాక్షన్ చేసే సమయంలో చాలా మంది ఈ చికిత్స మార్గాన్నే అనుసరిస్తారు. అయితే కొంతమందిలో మాత్రం నన్ను శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా తొలగించాల్సి రావచ్చు. అలాంటప్పుడు నేను స్రవించే హార్మోన్‌ను భర్తీ చేయడానికి జీవితాంతం మందులు వాడాల్సి రావచ్చు. నా పనితీరులో మార్పు వచ్చిందని డాక్టర్లు గ్రహించడం ఎలా? నేను వ్యవహరించే తీరులో మార్పులు వచ్చినప్పుడు ఆనంద్ వేళ్లు వణుకుతుండవచ్చు. నిద్రలోనూ, ఆకలి విషయంలోనూ మార్పులు రావచ్చు. బరువు పెరగవచ్చు లేదా తగ్గవచ్చు. ఆనంద్ ముఖం ఉబ్బవచ్చు. అతడి కదలికలు మందగించవచ్చు. అప్పుడు కొన్ని రక్త పరీక్షలు చేస్తే నా పనితీరులో వచ్చే మార్పులు తెలుస్తాయి. దాంతో అతడికి అవసరమైన చికిత్స అందించవచ్చు. పెరిగినా తగ్గినా ప్రమాదమే.. నేను కాస్త మందకొడిగా పనిచేస్తున్నాననే అంశానికి కొన్ని లక్షణాలు / కొండగుర్తులున్నాయి. అది వారసత్వంగా కావచ్చు లేదా కొన్ని మందుల వల్ల కూడా కావచ్చు. అలాంటి సందర్భాల్లో నా హార్మోన్ల ఉత్పాదన తగ్గుతుంది లేదా పూర్తిగా ఆగిపోతుంది. దానికి కారణాలు తెలియదు. ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి నుంచి నన్ను ప్రేరేపించే హార్మోన్లు తగ్గడమూ దీనికి కారణం కావచ్చు. మరికొన్ని సందర్భాల్లో అవసరమైన దానికంటే మరీ ఎక్కువగా నేను పనిచేస్తుంటా. నాకు అందాల్సిన అయోడిన్ తగ్గినప్పుడు అమాంతం ఎలా పెరుగుతానో, ఇలాంటప్పుడూ ఒక్కోసారి అలా పెరగవచ్చు. ఇలాంటప్పుడు నేను టాక్సిక్ గాయిటర్‌గా పెరుగుతాను. విచిత్రంగా ఒక్కోసారి నాకు అందే అయోడిన్ పాళ్లు పెరిగిపోయినా ఈ పరిస్థితి వస్తుంది లేదా ఒక్కోసారి పిట్యుటరీ గ్రంథి మీద కణితి పెరిగినప్పుడూ ఈ దుస్థితి దాపురిస్తుంది. దాంతో థైరోట్రోపిన్ పాళ్లు పెరిగిపోతాయి. నాకు వచ్చే క్యాన్సర్ కూడా ఒక్కోసారి ఆనంద్‌కు అనారోగ్యం తెస్తుంది. ఇలాంటప్పుడు ఆ అనారోగ్యం నాకు మాత్రమే పరిమితం కాకుండా చుట్టుపక్కలకూ పాకుతుంది. ఇలాంటి సందర్భాల్లో సర్జన్స్ శస్త్రచికిత్స చేసి, నన్ను తొలగిస్తారు. కొన్ని సార్లు నన్ను నిద్రపుచ్చడానికో లేదా నా పరిమాణం కుంచించుకుపోయేలా చేయడానికో మందులు ఇస్తారు. ఒత్తిడి ఎక్కువైతే ఇవీ దుష్ర్పభావాలు... నేను నరాలపై ప్రభావం చూపే గ్రంథినని, నా పనితీరు వల్ల నరాలు ఉత్తేజితమవుతాయని మీకిప్పటికి తెలిసే ఉంటుంది. ఇది మీకు తెలిస్తే జీవితంలో ఒత్తిడి వల్ల నాలోని హార్మోన్లు ఎక్కువగా ఎందుకు స్రవిస్తాయో మీకిప్పుడు తేలికగా అర్థమవుతుంది. జీవితాల్లో కనిపించే వ్యథ, కుటుంబ సభ్యులు దూరం కావడం వంటి అమితమైన బాధ, వ్యాపారంలో నష్టం, సీరియస్ యాక్సిడెంట్, వైవాహిక జీవితం వల్ల కలిగే మనోవేదన... ఇలాంటి తీవ్రమైన విచారం కలిగించే అంశాలన్నీ హైపోథెలామస్ను ఎక్కువగా ప్రేరేపిస్తాయి. అది ఎక్కువగా పనిచేస్తే, దాని స్రావాలతో నేనూ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దాంతో నా స్రావాలు నియంత్రణ లేకుండా పోతే... అది ఆనంద్‌ను అస్థిమితానికి గురిచేస్తుంది. అది చాలు ఆనంద్‌ను మానసిక రోగిగా మార్చేయడానికి. డాక్టర్ వి. శ్రీ నాగేష్ కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గైనిక్ కౌన్సెలింగ్
నా వయసు 25 ఏళ్లు. నాకు పెళ్లయి ఆర్నెల్లు అయ్యింది. ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయ్యింది. ఇప్పుడు మూడో నెల. నాకు బాగా వికారంగా, నీరసంగా ఉంటోంది. నిద్ర సరిగా పట్టడం లేదు. వాంతులు ఎక్కువగా అవుతున్నాయి. ఆకలి లేదు. పదిహేను రోజుల్లో రెండు కేజీల బరువు తగ్గాను. ఇలా అయితే లోపల బిడ్డ ఎలా పెరుగుతుందో అని ఆందోళనగా ఉంది. నా సమస్యకు సరైన పరిష్కారం చెప్పండి. - సౌమ్య, కర్నూలు ప్రెగ్నెన్సీ మొదలైన తర్వాత హెచ్‌సీజీ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కొంతమందిలో చాలా తక్కువ పాళ్లలోనూ, మరికొంతమందిలో చాలా ఎక్కువగానూ విడుదల అవుతుంది. దీన్ని బట్టి... వారి వారి శరీర తత్వాన్ని బట్టి కొందరిలో తక్కువగానూ, మరికొందరిలో ఎక్కువగానూ వాంతులు అవుతుంటాయి. మరికొందరిలో ఎలాంటి లక్షణాలూ ఉండవు. కాబట్టి వాంతులు అవుతున్నాయని ఆందోళనపడాల్సిన అవసరం లేదు. కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువసార్లు సులువుగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటూ ఉండండి. ద్రవపదార్థాలు అంటే... కొబ్బరినీళ్లు, మజ్జిగ, పండ్లరసాలు, ఎలక్ట్రాల్ ద్రవాలు, గ్లూకోజు నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. పండ్లు కూడా ఎక్కువగా తింటూ ఉండాలి. ఇక పచ్చళ్లు, నూనె వస్తువులు, మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలు ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. వాంతులు అవుతున్నా ఫర్వాలేదు, ఏదో ఒకటి తింటూ ఉండండి. అసలేవీ తినకపోతే అసిడిటీ వల్ల కడుపులో యాసిడ్ పేరుకొని పసరు వాంతులు, రక్తపు వాంతులు అయ్యే ప్రమాదం ఉంది. అవసరమైతే డాక్టర్ పర్యవేక్షణలో యాంటాసిడ్ మందులు లేదా వాంతులను, వికారాన్ని తగ్గించేందుకు యాంటీ ఎమెటిక్ మందులను వాడవచ్చు. మరీ నీరసంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను కలిసి చికిత్స చేయించుకోండి. అవసరాన్ని బట్టి సెలైన్ ఎక్కించుకోవడం/గ్లూకోజ్ పెట్టించుకోవడం చేయాల్సి రావచ్చు. అయితే మీరు ఆందోళపడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. డాక్టర్ వేనాటి శోభ సీనియర్ గైనకాలజిస్ట్ లీలా హాస్పిటల్, మోతీనగర్, హైదరాబాద్. -
హార్మోన్ల సమతౌల్యం... హోమియోతో సుసాధ్యం!
ఇటీవలి కాలంలో హైపో థైరాయిడ్, పి.సి.ఓ.డి, సంతానలేమి, డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల గురించి తరచూ వింటున్నాం. ఇవన్నీ హార్మోన్ అసమతుల్యతల వలన వచ్చే జబ్బులే. ఇవి మాత్రమే కాకుండా మన దేహక్రియలు సక్రమంగా జరగడానికి అనేక హార్మోన్లు దోహదం చేస్తుంటాయి. వాటి పనితీరులో తేడా వచ్చినప్పుడు దేహానికి ఎదురయ్యే సమస్యలు అనేకం. వాటిలో ముఖ్యమైన సమస్యలపై అవగాహన కోసం ఈ కథనం. హార్మోన్లు అంటే..? హార్మోన్లు పాలీపెప్టైడ్స్తో నిర్మితమైన రసాయన వాహకాలు. ఇవి శరీరంలోనే ఉత్పత్తి అవుతాయి. ఉత్పత్తి అయిన కణజాలం లేదా గ్రంథుల నుంచి దేహభాగాలకు రక్తం ద్వారా ప్రవహిస్తూ నిర్దిష్ట అవయవాలను ప్రభావితం చేస్తాయి. ఇవి సమతౌల్యంతో పని చేస్తేనే జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. ఈ ప్రక్రియలో ఒడుదొడుకులు ఎదురైతే ఆ ప్రభావం జీవక్రియల మీద పడుతుంది. ఈ హార్మోన్లు ఎండోక్రైన్, ఎక్సోక్రైన్ గ్రంథుల నుంచి ఉత్పత్తి అవుతాయి. ఇవి ఉత్పత్తి అయ్యే మోతాదు చాలా తక్కువే. అయినప్పటికీ వీటి ప్రభావం శరీరంలోని అనేక జీవక్రియల మీద చాలా కీలకంగా ఉంటుంది. సాధారణంగా జీవక్రియలైన జీర్ణక్రియ, శారీరక-మానసిక ఎదుగుదల, ప్రత్యుత్పత్తి, మానసిక సమతుల్యత వంటి ప్రధానమైన పనులను ప్రభావితం చేస్తాయి. ఈ హార్మోన్ల విడుదల అసమతుల్యతకు లోనయినప్పుడు అది జీవక్రియల మీద ప్రభావం చూపి క్రమంగా తీవ్రమైన దీర్ఘకాలిక జబ్బులకు దారి తీసే ప్రమాదం ఉంటుంది. థైరాయిడ్ సమస్యలు థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేసే (టి3, టి4) హార్మోన్లను థైరాయిడ్ హార్మోన్లు అంటారు. వీటి ఉత్పత్తిలో, పనితీరులో సమతుల్యత లోపించినప్పుడు ఎదురయ్యే సమస్యలను థైరాయిడ్ సమస్యలుగా పరిగణిస్తారు. థైరాయిడ్ హార్మోన్లు రక్తప్రవాహంలో కలిసి శారీరక ఎదుగుదల, జీవక్రియలను నిర్వహణకు తోడ్పడతాయి. థైరాయిడ్ గ్రంథిని మెదడులోని పిట్యూటరీ గ్రంథి నియంత్రిస్తుంది. దేహంలో థైరాయిడ్ హార్మోన్ల స్థాయులు తగినంతగా లేనప్పుడు పిట్యూటరీ గ్రంథి అవసరాన్ని గ్రహించి టిఎస్హెచ్ (థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్) హార్మోన్‌ని విడుదల చేస్తుంది. టిఎస్హెచ్ సంకేతంతో థైరాయిడ్ గ్రంథి టి3, టి4 హార్మోన్లను విడుదల చేసి రక్త ప్రవాహంలోకి పంపుతుంది. ఈ వ్యవస్థ విఫలమై థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైతే హైపర్ థైరాయిడిజమ్, తక్కువైతే హైపో థైరాయిడిజమ్ సమస్యలు తలెత్తుతాయి. వీటితోపాటు గాయిటర్ అనే దీర్ఘకాలిక సమస్య కూడా వస్తుంది. హైపోథైరాయిడిజమ్: ఇది పిల్లలు, స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. దీని లక్షణాలు ఇలా ఉంటాయి. నిస్సత్తువ, చర్మం పొడిబారడం, చెమట తక్కువ, కొద్దిగా బరువు పెరగడం, నెలసరి సరిగ్గా రాకపోవడం, జుట్టు రాలడం, మతిమరుపు, మలబద్ధకం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, పిల్లల్లో ఎదుగుదల తగ్గడం, ఆడపిల్లల్లో రజస్వల ఆలస్యం కావడం లేదా త్వరగా జరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వృద్ధుల్లో... కుంగుబాటు, మతిమరపునకు దారి తీస్తుంది. గర్భిణుల్లో... జీవక్రియల వేగం పెరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ హార్మోన్ అవసరం పెరుగుతుంది. ఆ పెరిగిన అవసరానికి తగినంత ఉత్పత్తి కాకపోయినట్లయితే హైపో థైరాయిడిజమ్ కండిషన్‌కి దారి తీస్తుంది. నిర్ణీత కాలపరిమితిలో పరీక్షలు చేయించుకుంటూ సరైన చికిత్స తీసుకుంటే పుట్టే పిల్లల్లో మానసిక ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. హైపర్ థైరాయిడిజమ్: హైపో థైరాయిడిజమ్లాగానే ఇది కూడా ఏ వయసులోనైనా రావచ్చు. అయితే ఇది 20-40 సంవత్సరాల మధ్య వయసులోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. దీనిని త్వరగా గుర్తించకపోయినా, నిర్లక్ష్యం చేసినా దుష్ర్పభావాలు తీవ్రంగా ఉంటాయి. హైపర్ థైరాయిడిజమ్ లక్షణాలు హైపో థైరాయిడిజమ్ లక్షణాలకు భిన్నంగా ఉంటాయి. ఆహారం సరైన మోతాదులో తీసుకున్నప్పటికీ బరువు గణనీయంగా తగ్గిపోవడం, నిద్రలేమి, గుండెదడ, వేడిని తట్టుకోలేకపోవడం, చెమట అధికంగా ఉండడం, చిరాకు, అస్థిమితం, విరేచనాలు, చేతులు వణకడం, నీరసంగా ఉండడం, నెలసరి త్వరగా రావడంతోపాటు రక్తస్రావం అధికంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. గాయిటర్ అంటే..? థైరాయిడ్ గ్రంథి అసహజంగా వాపుకు గురికావడాన్ని గాయిటర్ అంటారు. ఇది అయోడిన్ లోపం వలన వస్తుంది. స్త్రీలలో ఉండే హార్మోన్లు ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్, ప్రొలాక్టిన్, ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల, రుతుచక్రం, ద్వితీయ లైంగిక లక్షణాలు, సంతానోత్పత్తి, ప్రసవానికి ఉపకరిస్తాయి. ఈ హార్మోన్ల అసమతుల్యత వల్ల స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, పిసిఓడి (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్), హిర్సుటిజం (అవాంఛిత రోమాలు), సంతానలేమి సమస్యలు వస్తాయి. ఈ హార్మోన్ల ప్రభావం యుక్తవయస్సులో స్పష్టంగా కనిపించినప్పటికీ బాల్యం నుంచే మొదలవుతుంది. నవజాత శిశువులలో రొమ్ములు పెరగడం, కొన్నిసార్లు పాలు కూడా రావడం వంటివి జరుగుతాయి. సాధారణంగా తల్లి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్ మాయ ద్వారా బిడ్డకు చేరడం వలన ఇలా జరుగుతుంది. ఇది కొన్ని నెలలు లేదా కొన్నేళ్లలో పూర్తిగా తగ్గిపోతుంది. యుక్తవయసులో: ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరోన్ వంటి హార్మోన్లు స్త్రీలలో రజస్వల కావడానికి కీలక పాత్ర వహిస్తాయి. అండాశయం నుంచి విడుదలయ్యే స్త్రీబీజం పరిపక్వం చెంది గర్భాశయంలోకి చేరుతుంది. ఈ పరిపక్వత చెందిన స్త్రీ బీజం (అండం) ఫలదీకరణ చెందకపోతే అండాశయం నుంచి ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టిరోన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి రుతుస్రావం జరుగుతుంది. గర్భధారణ: పరిపక్వం చెందిన అండం ఫలదీకరణ చెందితే గర్భధారణ జరుగుతుంది. గర్భధారణ సమయంలో స్త్రీ హార్మోన్లు క్రమంగా మార్పు చెందుతూ ఉంటాయి. హెచ్‌సిజి అనే హార్మోన్ మాయ ద్వారా ఉత్పత్తి అవుతుంది. ఇది అండాశయాన్ని ప్రేరేపించి అధికమొత్తంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు విడుదలయ్యేలా చేస్తుంది. ఇది గర్భం కొనసాగించేందుకు సహాయపడుతుంది. ప్రసవం అనంతరం ఈ హార్మోన్ల మోతాదు క్రమంగా తగ్గిపోవడం జరుగుతుంది. మెనోపాజ్: రుతుక్రమం ఆగిపోయిన తర్వాత స్త్రీలలో హార్మోన్ల స్థాయులు పడిపోతాయి. దీంతో దేహం నుంచి వేడి ఆవిర్లు, నిద్రలేమి, మానసిక అశాంతి, నీరసం, కీళ్లు, కండరాల నొప్పుల వంటి సమస్యలు వస్తాయి. పిసిఓడి: స్త్రీలలో సాధారణంగా 20 శాతం మంది పిసిఓడి సమస్యతో బాధపడుతున్నారు. ఈ వ్యాధితో బాధపడే స్త్రీలలో అండాశయం నుంచి పురుష హార్మోన్లయిన టెస్టోస్టిరాన్ అధికంగా విడుదలవుతుంది. దీంతో సంతానలేమి, నెలసరి సమస్యలు (సరిగ్గా రాకపోవడం), అవాంఛిత రోమాల పెరుగుదల వంటి సమస్యలు ఏర్పడతాయి. ఇన్సులిన్ అసమతుల్యత మధుమేహం లేదా చక్కెరవ్యాధిగా వ్యవహరించే ఈ పరిస్థితిని వైద్యపరిభాషలో డయాబెటిస్ మెలిటస్ అంటారు. డయాబెటిస్ అనేది ఇన్సులిన్ హార్మోన్ స్థాయులు తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత జీవక్రియలు (మెటబాలిజమ్), రక్తంలో గ్లూకోజ్ స్థాయులు పెరగడం వంటి లక్షణాలతో కూడిన రుగ్మత. ఇందులో రెండు రకాలు ఉన్నాయి. అవి డయాబెటిస్ మిలిటస్ టైప్1, టైప్2. టైప్ 1 డయాబెటిస్: ఇది క్లోమ గ్రంథిలోని ఐలెట్స్ ఆఫ్ లాంగర్హ్యాన్స్లో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బీటా కణాల సంఖ్య తగ్గిపోవడం లేదా పూర్తిగా నశించిపోవడం వల్ల కలుగుతుంది. ఆటోఇమ్యూనిటీ వల్ల టి- కణాలు బీటా కణాలపై దాడి చేయడం ముఖ్యకారణం. ఈ వ్యాధిని చిన్నపిల్లల్లో ఎక్కువగా చూస్తుంటాం. కాబట్టి దీనిని ‘జువైనల్ డయాబెటిస్’ అంటారు. టైప్ 2 డయాబెటిస్: ఇది ఇన్సులిన్ నిరోధకత లేదా ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వలన వస్తుంది. కారణాలు: మధుమేహం వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ లోపించడం, గంటల తరబడి కూర్చుని ఉండడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారపదార్థాలను తీసుకోవడం, తీపి పదార్థాలు, కొన్ని రకాల మందుల వాడకం వల్ల ఎదురయ్యే దుష్పరిణామాలు ఈ వ్యాధికి కారణం. స్టిరాయిడ్స్, కొన్ని రకాల వైరస్ ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యత, మానసిక ఒత్తిడి వల్ల కూడా మధుమేహం వస్తుంది. లక్షణాలు: అతిమూత్రం, అతి ఆకలి, అతి దాహం ప్రధానంగా కనిపించే లక్షణాలు. ఆహారం బాగానే తీసుకుంటున్నప్పటికీ బరువు తగ్గిపోవడం, నీరసం, అలసట కూడా ఉంటాయి. కొందరిలో ఈ లక్షణాలేవీ పైకి కనిపించకపోవచ్చు. కొందరిలో చేతులు, పాదాలు తిమ్మిర్లు లేదా మంట, జననేంద్రియాల వద్ద దురద, ఒళ్లంతా దురదలు, దెబ్బలు గాయాలు త్వరగా మానకపోవడం, తరచూ దంతాల సమస్యలు, చిగుళ్ల వ్యాధులు కనిపిస్తుంటాయి. డయాబెటిస్తో అనర్థాలు: డయాబెటిస్తో బాధపడే వారిలో రక్తంలోని చక్కెర పాళ్లను సరిగ్గా నియంత్రణ చేయకపోవడం వలన దీర్ఘకాలంలో డయాబెటిక్ నెఫ్రోపతి, డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ రెటినోపతి, గుండె సమస్యలు వంటి అనుబంధ సమస్యలు వస్తాయి. డయాబెటిస్ ఇన్సిపిడస్: ఇది ఎడిహెచ్ (యాంటీ డైయూరిటిక్ హార్మోన్) లోపం వలన వస్తుంది. దీనినే అతిమూత్ర వ్యాధి అని కూడా అంటారు. పారాథార్మోన్ థైరాయిడ్ గ్రంథికి ఇరుపార్వ్శాలలో పారా థైరాయిడ్గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథుల నుంచి ఉత్పత్తి అయిన పారాథార్మోన్ దేహంలో కాల్షియం మెటబాలిజమ్‌ను నియంత్రణలో ఉంచుతుంది. దీని అసమతుల్యత వలన హైపో మరియు హైపర్ పారా థైరాయిడిజమ్ పరిస్థితులు తలెత్తుతాయి. ఈ లక్షణాలు... ఎముకలు ఆస్టియోపోరోసిస్‌కు గురి కావడం చేత బలహీన పడి త్వరగా విరిగే ప్రమాదం ఉంటుంది. కొన్నిసందర్భాలలో కీళ్ల నొప్పులకు దారి తీస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు, కండరాలు పట్టివేయడం, నీరసం, అలసట కూడా కలగవచ్చు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఇది పురుషులలో ఉండే హార్మోన్. దీని అసమతుల్యత వలన శీఘ్రస్కలనం, అంగస్తంభన సమస్యలు, శుక్రకణ సమస్యలు, సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి. కార్టికో స్టిరాయిడ్స్ ఇవి అన్ని ముఖ్యమైన జీవక్రియల్లోనూ, రోగనిరోధక వ్యవస్థలోనూ ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీని అసమతుల్యతల వలన కుషింగ్స్, అడిసన్స్ వ్యాధులు వస్తాయి. అపోహలు - వాస్తవాలు అపోహ: హోమియోపతి మందులు వాడుతున్నప్పుడు కఠినమైన పథ్యాన్ని పాటించాలి. వాస్తవం: హోమియో మందులకు ఎటువంటి పథ్యం అవసరం లేదు. అయితే మందు తీసుకునే ముందు తర్వాత కొద్ది నిమిషాల పాటు ఏమీ తీసుకోకపోతే మందు చక్కగా పనిచేస్తుంది. అపోహ: హోమియో మందులు తీసుకుంటున్న సమయంలో అల్లోపతి మందులు వాడితే అప్పటి వరకు వాడిన హోమియో మందుల ప్రభావం పోతుంది. వాస్తవం: అత్యవసరాలకు అల్లోపతి మందులు వాడవచ్చు. అయితే హోమియో మందులు వేసుకోవాల్సిన సమయంలోనే రెండూ కలిపి తీసుకోకుండా కనీసం 15 నిమిషాల విరామం ఉండాలి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి నిర్ధారణ పరీక్షలు హైపోథైరాయిడిజమ్, పి.సి.ఓ.డి, సంతానలేమి మధుమేహం... రక్తపరీక్ష, మూత్రపరీక్ష, ఎఫ్‌బిఎస్, పిఎల్‌బిఎస్, మూత్రంలో చక్కెరస్థాయులు వంటి పరీక్షలు థైరాయిడ్ సమస్యలు... టి3, టి4, టిఎస్హెచ్, అల్ట్రాసౌండ్ నెక్, ఎమ్ఆర్ఐ వంటి పరీక్షలు స్త్రీలలో రుతుచక్ర సమస్యలు, సంతానలేమి, హార్మోన్ సమస్యలకు... ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్, డిహెచ్‌ఇఎ, ఎల్‌హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రొలాక్టిన్, ఎస్హెచ్బిజి వంటి పరీక్షలు హోమియో మందులు సెపియా: ఇది హైపోథైరాయిడిజమ్తోపాటు స్త్రీలలో కలిగే హార్మోన్ సమస్యలకు ప్రధానంగా పనిచేస్తుంది. రుతుక్రమ సమస్యలతోపాటు గర్భాశయం జారిపోవడం వంటి అనేక జననేంద్రియ సమస్యలకు వాడదగిన ఔషధం. ఈ సమయంలో చిరాకుగా ఉండడం, కుటంబసభ్యులతో భిన్నంగా ప్రవర్తించడం, ఒంటరిగా ఉండాలనిపించడం వంటి సమస్యలు కలిగి ఉంటారు. వీటన్నింటికీ సెపియా మంచి ఔషధం. కాల్కేరియా కార్బ్: లావుగా ఉండి చలిని తట్టుకోలేకపోవడం, తల మీద ఎక్కువగా చెమట పట్టడం, రుతుక్రమ సమస్యలతోపాటు మలబద్ధకం ఉన్న వారికి చక్కటి ఔషధం ఫాస్ఫారిక్ యాసిడ్: మధుమేహ వ్యాధిగ్రస్తులకు వాడదగిన మందు. మూత్రంలో చక్కెర స్థాయులు ఎక్కువగా ఉండడం, ఫాస్ఫేట్ నిల్వలు ఎక్కువగా ఉండడం, శారీరక బలహీనత, ఆకలి లేకపోవడం, అతిదాహం, మానసికంగా శోకం, ఆందోళన, ఉదాసీనత వంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడాల్సి ఉంటుంది. లాకెసిస్: ఇది మెనోపాజ్ దశలో ఉన్న వారికి మంచి ఔషధం. హోమియో వైద్యంలో ప్రతి వ్యక్తికీ శరీర లక్షణాలను బట్టి మందులు ఇస్తారు. ఇద్దరు వ్యక్తులు మధుమేహంతో వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఇద్దరిలోనూ లక్షణాలు వేరుగా ఉండవచ్చు. మధుమేహంతోపాటు ఎవరికి వారికి విడిగా మరికొన్ని ఇతర వ్యాధులు కలిగి ఉండవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మందులను వాడాల్సి ఉంటుంది. -
లడ్డుబాబులకు ప్రొటీన్‌తో చెక్!
ప్రొటీన్ కోడ్‌ను కనుగొన్న భారత సంతతి శాస్త్రవేత్త లండన్: ఊబకాయం.. శాపం కాదు.. పాపమూ కాదు. కానీ నలుగురి మధ్యలో స్వేచ్ఛగా తిరగడానికిఏదో ఇబ్బంది! ఇలా లడ్డుబాబులు/పాపల బాధలు చెప్పాలంటే ఒక్కటి కాదు. కానీ త్వరలోనే ఈ బాధలన్నిటికీ చెక్ పెట్టే మాత్ర తీసుకురావడానికి భారత సంతతికి చెందిన అమెరికా శాస్త్రవేత్త భరత్ షింపుకదే తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సదరన్ డెన్మార్క్ యూనివర్సిటీకి చెందిన ఈయన ఇటీవలే సంబంధిత ప్రొటీన్ కోడ్ గుట్టును కనుగొన్నారు. ఎఫ్ఎఫ్ఏ4గా పిలిచే ఈ ప్రొటీను.. పేగుల్లోని కణత్వచాలు, రోగ నిరోధక కణాలు, కొవ్వులలో ఉంటుంది. ఆహారం నుంచి విడుదలయ్యే ఒమెగా 3 లాంటి కొవ్వు ఆమ్లాల ద్వారా ఇది క్రియాశీలమవుతుంది. అలా జరిగినపుడు అది మన ఆకలిని నియంత్రించి, రక్తంలోని చక్కెర వినియోగాన్ని పెంచే హార్మోన్లను విడుదల చేస్తుంది. అయితే ‘‘కొంత మందిలో ఈ ప్రొటీన్ విడుదల కాకపోవడం వల్ల వారు ఊబకాయం బారిన పడే ప్రమాదముంది’’ అని భరత్ షింపుకదే చెప్పారు. అలాంటి వారిలో ఈ ప్రొటీన్‌ను క్రియాశీలం చేయడానికి ఓ మార్గాన్ని కనుగొనటానికి యత్నిస్తున్నామని, తద్వారా ఊబకాయానికి చెక్ పెట్టే మాత్రలను రూపొం దించాలనుకుంటున్నామని చెప్పారు. పలు అణువులు ఈ ప్రొటీన్‌ను క్రియాశీలం చేయగలవని, చేయాల్సిందల్లా తగిన అణువును కనుక్కోవడమేనన్నారు. -
పీసీఓడీకి హోమియోపతిలో నివారణోపాయాలు
చాలామంది స్త్రీలలో సాధారణ ఆహార అలవాట్లు పాటిస్తున్నప్పటికీ అధిక బరువు, వెంట్రుకలు రాలిపోవడం, మొటిమలు, ముఖం మీద మగవారిలా వెంట్రుకలు రావడం, నెలసరి సరిగ్గా ఉన్నప్పటికీ సంతానలేమితో బాధపడుతూ ఉంటారు. దానికి కారణం అయిన పీసీఓడీ గురించి చర్చిద్దాం. పీసీఓడీ అనగా ఇమ్మెచ్యూర్ ఫాలికల్ (అండం) గర్భాశయానికి రెండువైపులా ఉన్న అండాశయాలపై నీటిబుడగల వలె ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (P.C.O.D) అంటారు. సాధారణ ఋతుచక్రం ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-14 రోజుల మధ్య రెండు అండాశయాలలో ఒక అండాశయం నుండి విడుదల అవుతుంది. ఈ విధంగా ప్రతినెలా ఎడమ లేదా కుడివైపు ఉన్న అండాశయం నుండి ఒక అండం విడుదలవుతుంది. ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది. కాని ఎవరిలో అయితే ఈ పీసీఓడీ ఉంటుందో వారి అండాశయం నుండి అండం విడుదల కాకుండా అపరిపక్వత అండాలు నీటి బుడగల వలె అండాశయపు గోడల మీద ఉండిపోతాయి. ఇది చూడడానికి ముత్యాల వలె అండాశయ గోడల మీద కనిపిస్తాయి. రెండు వైపులా ఉంటే బై ఆట్రల్ పీసీఓడీ అంటారు. కారణాలు F.S.H, L.H, ఈస్ట్రోజెన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల సమతుల్య లోపం వలన ఈ సమస్య వస్తుంది. సరైన జీవనశైలి లేకపోవడం అంటే, ఎక్కువ ఒత్తిడికి లోనవడం, తక్కువ శారీరక వ్యాయామం వల్ల, పిండిపదార్థాలు, కొవ్వుపదార్థాలు అతిగా తినడం మూలంగా ఇది ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు కూడా పీసీఓడీకి ఒక ముఖ్య కారణం. పనిచేసే హార్మోన్ల చక్రంలో మార్పులు, అధిక ఒత్తిడి, సరియైన వ్యాయామం లేకపోవడం, సరియైన ఆహారనియమాలు పాటించకపోవడం, అధికకొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలు తినడం వలన ఇది సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లక్షణాలు నెలసరి సరిగా రాకపోవడం నెలసరి సరిగా వచ్చినా కూడా అండాశయం నుండి అండం విడుదల కాకపోవడం, (అనోవ్యులేటరీ సైకిల్) మెనరీజియా - నెలసరిలో 4-5 రోజులు కావలసిన రక్తస్రావం ఎక్కువ మోతాదులో ఎక్కువకాలం కొనసాగడం మెట్రీజియా-నెలసరి ఆగి ఆగి రావడం, రెండు ఋతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం డిస్మనేరియా-నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పి రావడం అమెనోరియం- నెలసరి రాకపోవడం బరువు పెరగటం ముఖం, వీపు, శరీరంపైన మొటిమలు రావడం. ముఖం, ఛాతీ పైన మగవారిలోలా వెంట్రుకలు రావడం (హర్సుటిజమ్) టెస్టోస్టిరాన్ హార్మోన్ మోతాదు పెరగటం వలన ఈ లక్షణాలు కనిపిస్తాయి సాధారణంగా తలపైన జుట్టు రాలడం కాంప్లికేషన్స్ ఇన్ఫెర్టిలిటీ ఒబేసిటీ Dm type II నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటిస్ తీసుకోవలసిన జాగ్రత్తలు జీవనవిధానంలో మార్పు చేసుకొని ఒత్తిడిని తగ్గించుకోవడం సరియైన వ్యాయామం చేయడం వలన హార్మోన్ల సమతుల్యతను కాపాడటం అధిక కొవ్వు, కార్బోహైడ్రేట్ పదార్థాలను తగ్గించి, సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఈ సమస్య బారిన పడకుండా ఉండవచ్చు. హోమియో కేర్ ఇంటర్నేషనల్నందు... రోగి శరీర తత్త్వాన్ని బట్టి జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలియం విధానం ద్వారా, హార్మోన్ వ్యవస్థలోని అసమతౌల్యాన్ని సరిచేయటం ద్వారా ఎటువంటి దుష్ర్పభావాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీ సమస్యను దూరం చేయవచ్చు. ఈ చికిత్స విధానం ద్వారా హోమియోకేర్‌లో 94 శాతం మంది పీసీఓడీ పేషెంట్లలో మెరుగైన ఫలితాలు సాధించాం. ఇది ముఖ్యంగా యుక్తవయస్సులో ఉన్న ఆడవారిలో ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇది ప్రతి పది మందిలో ముగ్గురు యుక్తవయస్సులో ఉన్న అమ్మాయిలకు కనిపిస్తోంది. పీసీఓడీ అనేది పెళ్ళి అయి పిల్లలు ఉన్నవారిలో కూడా సాధారణంగా కనిపిస్తుంది. అంటే మధ్య వయస్సులో ఉన్నవారిలో ఇది కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో చేసిన పరిశోధనల వలన తెలిసిన విషయం ఏమిటంటే పీసీఓడీకి ఇతర వైద్యవిధానాలలో ఇచ్చే ట్రీట్మెంట్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్, హార్మోన్ ట్రీట్మెంట్, యాంటీ డయాబెటిక్ మందులతో పాలినియా 60 - 70 శాతం హోమియోకేర్ వైద్య విధానంలో మెరుగైన ఫలితాలు వచ్చాయని నిరూపించబడింది. చికిత్స హార్మోన్ అసమతుల్యం వలన వచ్చే ఇలాంటి జబ్బులను హోమియోపతి మందుల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చును. సరైన కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ చేయడం వలన, ఎలాంటి సైడ్‌ఎఫెక్ట్‌లు లేకుండా దీనిని పూర్తిగా నయం చేయడమే కాకుండా ఎలాంటి కాంప్లికేషన్లు ఉన్నా వాటిని తప్పక తగ్గించవచ్చు. యుక్తవయస్సులోనే దీనికి సరియైన ట్రీట్మెంట్ చేయించుకోవడం వలన ఇన్ఫెర్టిలిటీ, ఒటేసిటీ లాంటి కాంప్లికేషన్ల నుండి మనల్ని మనం కాపాడుకోవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్ సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత సలహా సంప్రదింపుల కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు. -
ఆహారం తినగానే ఛాతీలో ఎందుకీ మంట..?
నాకిప్పుడు ఆరోనెల. భోజనం చేశాక గుండెలో మంటగా ఉంటోంది. ఛాతీపై బరువు పెట్టినట్లుగా ఉంటోంది. తేన్పులు వస్తున్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుమలత, కోదాడ గర్భవతుల్లో సాధారణంగా 28వారాల సమయంలో గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణ పరిభాషలో హార్ట్బర్న్గా వ్యవహరిస్తుంటాం. ఈ సమస్య 28 వారాల తర్వాతి ప్రెగ్నెన్సీలో సాధారణమే అయినా ఒక్కోసారి వేవిళ్ల కారణంగా అర్లీ ప్రెగ్నెన్సీలోనూ కనిపిస్తుంటుంది. కడుపులో ఊరే జఠరరసం... అంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పైకి అంటే అన్నవాహిక వైపునకు ఎగదన్నడమే దీనికి కారణం. గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి మాయ (ప్లాసెంటా) నుంచి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలో ఉండే పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ తన సహజ నైజం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం-అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్) మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపుతుంది. ఆ స్ఫింక్టర్ వదులైపోవడంతో తిన్న పదార్థం, దానితో పాటు జఠరరసం వంటివి జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. ఫలితంగా గుండెలో మంట, ఛాతీపై బరువు ఉన్న ఫీలింగ్, తేన్పులు, ఆహారం జీర్ణం కాకుండా ఉన్న ఫీలింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మాత్రమేగాక గర్భసంచిలో బిడ్డ పెరుగుతున్నకొద్దీ గర్భసంచి కూడా పెరుగుతుంటుంది. అది పెరుగుతున్నకొద్దీ తనకు పైభాగంలో ఉండే అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి ప్రభావం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఆహార మార్పులతో, కొన్ని చిన్న చిన్న సూచనలతో ఈ సమస్యను చాలా తేలిగ్గా అధగిమించవచ్చు. ఇలా ఉన్నవారు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువ పర్యాయాలు భోజనం చేయాలి. అలాగే భోజనంలో మసాలాలు తక్కువగా తీసుకోవాలి. అంతేకాదు... తాము తీసుకునే పదార్థాలలో ఏ తరహా ఆహారంతో సమస్య పెరుగుతుందో గుర్తించి, దాన్ని పరిహరించాలి. ఇక కాఫీలు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్, గ్యాస్‌ను పెంచే ఆహారం, జంక్‌ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం అంత సరికాదు. దీనికి బదులు భోజనం పూర్తయ్యాక పుష్కలంగా నీళ్లు తాగడం శ్రేయస్కరం. భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయంలో ఆ నీళ్ల ఒత్తిడితో స్ఫింక్టర్ తెరచుకుని ఈ సమస్య రావచ్చు. అందుకే ఈ సూచన. ఇక భోజనం పూర్తయిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేశాక రెండు గంటల తర్వాతే పడుకోవాలి. తలను మిగతా శరీరం కంటే కాస్త పైభాగంలోనూ ఉండేలా తలగడను అడ్జెస్ట్ చేసుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మార్కెట్లో లభించే యాంటాసిడ్స్‌ను వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్