పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ! | Avoid eating a series of stomachs | Sakshi
Sakshi News home page

పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!

Published Mon, Jan 16 2017 12:08 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 AM

పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!

పొద్దుపొద్దున్నే పరగడుపున వద్దువద్దండీ!

థీమ్‌.. త న న

ఇవి తినండి, అవి తినకండి అని డాక్టర్లు సలహాలు ఇస్తుంటారు. అవన్నీ గుర్తుంచుకుని పాటించడం కాస్త కష్టమే. అయినా అన్నీ బుర్రతోనే గుర్తుపెట్టుకోవాలనేముందీ? ఈ పది పదార్థాలనీ కళ్లతో స్కాన్‌ చేసేయండి. పరగడుపునే తినడం మానేయండి. తింటే ఏమవుతుందో కూడా తెలుసుకోండి. ఇవీ డాక్టర్లు చెప్పినవే. సందేహించకుండా ఫాలో అవండి.

స్వీట్లు
ఉదయాన్నే చిన్న చాక్లెట్‌ నోట్లో వేసుకుంటే బుర్ర ఫ్రెష్‌గా ఉంటుందని వైద్యంలో ఓ థియరీ! దాన్నొదిలేయండి. ఉదయాన్నే కడుపులోకి తీపి పదార్థాలు వెళ్తే ఒంట్లో ఇన్సులిన్‌ లెవల్స్‌ ఎక్కువౌతాయి. దీనర్థం ఏమిటంటే.. షుగర్‌ను కంట్రోల్‌ చేసే హార్మోన్‌ అయిన ఇన్సులిన్‌... పరగడుపునే వచ్చి పడిన స్వీట్‌ని కంట్రోల్‌ చెయ్యడానికి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దాంతో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే పాంక్రియాస్‌ గ్రంథి మీద లోడ్‌ ఎక్కువౌతుంది. ఇలా లోడ్‌ పెరుగుతూ పోతుంటే డయాబెటిస్‌ వచ్చేస్తుంది!

పేస్త్రీలు, పఫ్‌ పేస్త్రీలు
ఉదయాన్నే ఇవి ఎవరు తింటారండీ బాబూ అని మీరు అనుకోవచ్చు. రాత్రి తిన్నవి తినగా మిగిలిపోతే.. ఎవరో ఎందుకు మీరే తింటారు తెలుసా! సరే, తిన్నాక ఏం జరుగుతుంది? కడుపులోపలి మృదువైన పొర ల్లో మంట రేగుతుంది. గ్యాస్‌ ఫామ్‌ అవుతుంది. కడుపుబ్బరం వచ్చేస్తుంది. త్రేన్పులు వస్తాయి. ఉదయాన్నే వీటిని అలవాటుగా తినేవారికి అనతికాలంలోనే కడుపులో ఐపీఎల్‌ (మ్యాచ్‌ అన్నమాట) స్టార్ట్‌ అవుతుంది.

పెరుగు, పులియబెట్టిన పాల పదార్థాలు
పరగడుపునే పెరుగు తినేస్తే కడుపులో హైడ్రోక్లోరిక్‌ ఆసిడ్‌ల మోతాదులు ఎక్కువౌతాయి. ఈ ఆసిడ్‌లు ఏం చేస్తాయంటే.. మనకు మేలు చేసే లాక్టిక్‌ ఆసిడ్‌ బాక్టీరియాను చంపేస్తాయి. ఆ కారణంగా తిన్నదేదీ ఒంటికి పట్టదు. అంటే.. పోషకాలను లోనికి లాక్కునే శక్తిని మన బాడీ కోల్పోతుంది. పెరుగు ఒక్కటే కాదు. పాలతో చేసినవి ఏవి తిన్నా ఇంతే.

దోసకాయలు, పచ్చని కాయగూరలు
దోసకాయలు, ఇతర కాయగూరలు పచ్చివి తింటే ఆరోగ్యం అని మీరు వినే ఉంటారు. కానీ... ఖాళీ కడుపుతో తింటే.. ఈ మంచివి కూడా చెడ్డవి అయిపోతాయి! కడుపులో గ్యాస్‌ ఉత్పత్తి అవుతుంది. కడుపు నొప్పి, ఛాతీనొప్పి కూడా వస్తాయి.

పియర్స్‌ (బేరీ పండ్లు)
ఇప్పుడివి మార్కెట్‌లో బాగా కనిపిస్తున్నాయి. సేమ్‌ ఇవే కాకున్నా, ఈ జాతి పండ్లు విరివిగా దొరుకుతున్నాయి. చూడగానే ఆకర్షించడం ఈ పండ్ల ప్రత్యేకత. ఉదయాన్నే మాత్రం మీరు వీటి ఆకర్షణకు లోను కాకండి. బేరీ çపండ్లలోని ముతగ్గా (రఫ్‌గా) ఉండే పీచుపదార్థం మీ ఖాళీ కడుపులోని మృదువైన ‘మ్యూకస్‌ మెంబ్రేన్‌’ (సున్నితమైన కణజాలం)ని గిన్నెల్ని తోమినట్టు తోమేస్తుంది. ఫలితం.. కడుపులో ట్వంటీ ట్వంటీ. (ఇదీ మ్యాచే).

పుల్లని పండ్లు
నారింజ, ఇతర పుల్లని పండ్లలో టన్నులకొద్దీ ఆసిడ్లు ఉంటాయి. వాటిని సాధారణ పరిభాషలో ఫ్రూట్‌ ఆసిడ్స్‌ అంటారు. పరగడుపునే వీటిని తినడం అస్సలు మంచిది కాదు. గ్యాస్ట్రైటిస్, గ్యాస్ట్రిక్‌ అల్సర్లు, హార్ట్‌ బర్న్‌.. ఇదిగో ఇలాంటివన్నీ వచ్చేస్తాయి.

శీతలపానీయాలు
అంటే.. కూల్‌ డ్రింక్స్‌. వీటిల్లో టేస్ట్‌ కోసం కొద్దిగానైనా కార్బన్‌డైఆక్సైడ్‌ని చొప్పిస్తారు. అందుకే వీటిని కార్బొనేటెడ్‌ డ్రింక్స్‌ అంటారు. అందరికీ తెలిసిన పేరు ‘సాఫ్ట్‌ డ్రింక్స్‌’. ఉదయాన్నే ఖాళీ కడుపుతో సాఫ్ట్‌ డ్రింక్‌ తాగితే కడుపు హార్డ్‌ అయిపోతుంది. బిగుసుకుపోతుందని కాదు. కడుపు మన మాట వినదని. మరి వీటిల్లోని కెఫీన్‌ రోజంతా మనల్ని ఉత్సాహంగా ఉంచుతుంది కదా అని మీకు డౌట్‌ రావచ్చు. ఆక్చువల్లీ కెఫిన్‌ ఇంకో పని కూడా చేస్తుంది. పేగుల లోపలి కణజాలాన్ని దెబ్బతీస్తుంది. దాంతో కడుపు కండరాలకు రక్తం సరఫరా మందగించి జీర్ణక్రియల శక్తి సన్నగిల్లుతుంది. ఏదైనా జీర్ణం కాకపోతే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా! త్రేప్పులు, గుండె మంట వగైరా.

టమాటాలు
టమాటా జ్యూస్‌ ఆకలిని రేకెత్తిస్తుందని అంటారు. నిజమే. స్టార్టర్‌గా కొన్నిచోట్ల భోజనానికి ముందు టమాటా సూప్‌ ఇస్తారు. అయితే చేదునిజం ఏమిటంటే.. ఖాళీ కడుపుతో టమాటా జ్యూస్‌ను తీసుకుంటే టమాటాల్లోని ట్యానిక్‌ ఆసిడ్‌లు అసిడిటీని పెంచి, పేగులు పుండ్లు పడేలా చేస్తాయి.

అరటిపండ్లు
ఒంట్లో మెగ్నీషియం ఎక్కువైతే గుండెకు హాని కలుగుతుంది. అరటిపండ్లలోని ఒక చెడ్డ గుణం ఏమిటంటే... అవి ఒంట్లోని మెగ్నీషియం మోతాదులను సర్రున పెంచేస్తాయి. వట్టప్పుడు తింటే ఏం కాదు కానీ, పరగడుపున అరటిపండ్లను తింటే మాత్రం మన లోపలి మెగ్నీషియంకు ఇక అడ్డూఆపూ లేకుండా పోతుంది.

మసాలాలు
అసలు విలన్‌ దగ్గరికి వచ్చేశాం. మసాలాలు అంటే.. స్పైసీ ఫుడ్‌. ఉదయాన్నే బ్రెష్‌ చేసుకున్న వెంటనే ఆకలిగా ఉందని చెప్పి.. ‘అమ్మడు.. కుమ్ముడు’ టైప్‌లో స్పైసీ ఫుడ్డుని లాగిస్తే గొంతు నుంచి కడుపు వరకు ‘పిచ్‌’ రెడీ అయిపోతుంది. నానా రకాల గ్యాస్‌లు జట్లుగా విడిపోయి ఇష్టం వచ్చినట్టు బ్యాటింగ్, బౌలింగ్‌ చేసేస్తుంటాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement