ఇంకా సంతానం లేదు..! | Not to have more children ..! | Sakshi
Sakshi News home page

ఇంకా సంతానం లేదు..!

Published Thu, Aug 25 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 10:52 AM

ఇంకా సంతానం లేదు..!

ఇంకా సంతానం లేదు..!

 ఫెర్టిలిటీ కౌన్సెలింగ్

 

నా వయసు 32 ఏళ్లు. నా భార్య వయసు 27 ఏళ్లు. మాకు పెళ్లై ఆరేళ్లవుతోంది. ఇంకా పిల్లలు కలగలేదు. డాక్టర్లను కలిశాం. చాలా పరీక్షలు చేశారు. అన్నీ నార్మల్ అంటున్నారు. మరి మాకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు? - ఒక సోదరుడు, నిర్మల్
దాదాపు 20 శాతం మంది దంపతుల్లో అన్ని పరీక్షలూ నార్మల్‌గానే ఉన్నా ఒక్కోసారి సంతాన సాఫల్యం కనిపించకపోవచ్చు. దీన్ని ‘అన్‌ఎక్స్‌ప్లెయిన్‌డ్ ఇన్‌ఫెర్టిలిటీ’ అంటారు. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. కొందరు మహిళల్లో అండం నాణ్యత తక్కువగా ఉండవచ్చు. ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ సమస్యలు ఉండవచ్చు. అలాగే కొంతమంది పురుషుల వీర్యంలో నాణ్యత లోపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో చికిత్స కంటే ముందుగా జీవనశైలిలో ఆరోగ్యకరమైన మార్పులు తెచ్చుకోవడం అవసరం. అంటే బరువు ఎక్కువగా ఉంటే దాన్ని తగ్గించుకోవడం, రక్తంలోని చక్కెర పాళ్లను, కొలెస్ట్రాల్ పాళ్లను అదుపులో ఉంచుకోవడం, ఆల్కహాల్ అలవాటు ఉంటే మానేయడం వంటివి.  ఇక దీనితో పాటు సమస్యకు అనుగుణంగా చికిత్స తీసుకోవడం మరింతగా ఉపయోగపడుతుంది. అండాల పెరుగుదలకు ఉపయోగపడే హార్మోన్ ట్యాబ్లెట్లూ, ఇంజెక్షన్లూ ఈ చికిత్సలో భాగంగా ఇస్తారు. ఐయూఐ (ఇంట్రా యుటెరైన్ ఇన్‌సెమినేషన్) అనే ప్రత్యేక ప్రక్రియలు అవలంబిస్తారు. ఒకవేళ అన్ని చికిత్సలూ విఫలం అయినా నిరుత్సాహపడాల్సిందేమీ లేదు. ఇలాంటి వాళ్లకు ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ ప్రక్రియ ద్వారా సంతాన సాఫల్యం కలిగించవచ్చు.


డాక్టర్ ప్రీతిరెడ్డి 
ఇన్‌ఫెర్టిలిటీ కన్సల్టెంట్,  బర్త్ రైట్ బై రెయిన్‌బో, హైదరాబాద్

 

ఆస్తమా నయమవుతుందా?
నా వయస్సు 58. నేను చాలా సంవత్సరాలుగా ఆస్తమాతో బాధపడుతున్నాను. డాక్టరు గారి సూచనల మేరకు మందులు వాడుతున్నాను. వారు ఈ సమస్య పూర్తిగా తగ్గడానికి చికిత్స అందుబాటులో లేదని చెప్పారు. చల్లటి వాతావరణం ఏర్పడితే ఈ సమస్య తీవ్రం అయి శ్వాస తీసుకోవడంలో కష్టంగా మారుతోంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్య పూర్తిగా నయం అయే అవకాశం ఉందా? - తేజ, భీమవరం
ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించిన ఒక దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య. సాధారణంగా మనం ఊపిరి పీల్చుకున్న గాలి వాయుద్వారాల ద్వారా ఊపిరితిత్తులకు చేరుతుంది. అదేవిధంగా బయటకు వెళ్లిపోతుంది. ఈ వాయుద్వారాలు  వాచడం వల్ల అవి సన్నగా, ఇరుకుగా మారి ఎక్కువగా శ్లేష్మాన్ని ఉత్పత్తి చేయటాన్ని ఆస్తమా అని అంటారు.

 
మన శరీరానికి సరిపడని పదార్థాలు గాలి ద్వారా పీల్చుకున్నప్పుడు వాయుద్వారాలు వాటికి బలంగా స్పందిస్తాయి. ఇలా స్పందించిన వాయుద్వారాల కండరాలు బిగుసుకుపోతాయి. దీనివల్ల వాయుద్వారాలు కాస్త సన్నగా మారతాయి. అవి వాచి సాధారణ స్థాయికి మించి శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తాయి. దాంతో అవి మరింత ఇరుకుగా మారుతాయి. దాంతో  ఆస్తమా వస్తుంది.

 
కారణాలు: ఆస్తమా రావడానికి గల కారణాలలో ఇంతవరకు స్పష్టత లేదు. కానీ జన్యుపరమైన అంశాలు, వంశపారంపర్యత, వాతావరణం వంటి అంశాల కారణంగా ఈ వ్యాధి వస్తుందని భావిస్తున్నారు.


ఆస్తమాని ప్రేరేపించే అంశాలు: ఇవి అందరిలోనూ ఒకేరకంగా ఉండవు. పూలమొక్కల నుండి వెలువడే పుప్పొడి రేణువులు, జంతువుల వెంట్రుకలు, దుమ్ము, బొద్దింకలు, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, జలుబు, అధిక శారీరక శ్రమ, వ్యాయామాల వల్ల చల్లగాలి లేదా చల్లటి వాతావరణం, వాతావరణ కాలుష్యం, పొగతాగటం, రసాయనాలు, వృత్తిరీత్యా దుమ్ములో గడపవలసి రావటం, ఆస్పిరిన్, బీటా బ్లాకర్స్ వంటి మందులు, ఆహారాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించే ప్రిజర్వేటివ్స్, అధిక మానసిక ఒత్తిడి వంటివన్నీ ఆస్తమాను ప్రేరేపిస్తాయి.


లక్షణాలు: ఇవి ఒక  వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, ఛాతీ బిగువుగా లేదా నొప్పిగా అనిపించటం, శ్వాస బయటకు వదిలినప్పుడు పిల్లికూతల వంటి శబ్దాలు వినిపించడం, దగ్గు (ఆస్తమా వల్ల కలిగే దగ్గు రాత్రివేళలో, తెల్లవారు ఝామున అధికంగా ఉంటుంది)తో పాటు శ్వాస ఆడకపోవడం, దగ్గు వల్ల నిద్రకు ఇబ్బంది కలగడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

 
హోమియోలో చికిత్స: హోమియోలో అధునాతనమైన జెనెటిక్ కాన్‌స్టిట్యూషనల్ చికిత్సా విధానం ద్వారా ఎలాంటి శ్వాస సంబంధిత వ్యాధులనైనా నయం చేయవచ్చు.

 

డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement