ఆహారం తినగానే ఛాతీలో ఎందుకీ మంట..?
నాకిప్పుడు ఆరోనెల. భోజనం చేశాక గుండెలో మంటగా ఉంటోంది. ఛాతీపై బరువు పెట్టినట్లుగా ఉంటోంది. తేన్పులు వస్తున్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి.
- సుమలత, కోదాడ
గర్భవతుల్లో సాధారణంగా 28వారాల సమయంలో గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణ పరిభాషలో హార్ట్‌బర్న్‌గా వ్యవహరిస్తుంటాం. ఈ సమస్య 28 వారాల తర్వాతి ప్రెగ్నెన్సీలో సాధారణమే అయినా ఒక్కోసారి వేవిళ్ల కారణంగా అర్లీ ప్రెగ్నెన్సీలోనూ కనిపిస్తుంటుంది. కడుపులో ఊరే జఠరరసం... అంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పైకి అంటే అన్నవాహిక వైపునకు ఎగదన్నడమే దీనికి కారణం.
గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి మాయ (ప్లాసెంటా) నుంచి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలో ఉండే పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటిది.
ఈ హార్మోన్ తన సహజ నైజం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం-అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్) మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపుతుంది. ఆ స్ఫింక్టర్ వదులైపోవడంతో తిన్న పదార్థం, దానితో పాటు జఠరరసం వంటివి జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. ఫలితంగా గుండెలో మంట, ఛాతీపై బరువు ఉన్న ఫీలింగ్, తేన్పులు, ఆహారం జీర్ణం కాకుండా ఉన్న ఫీలింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇది మాత్రమేగాక గర్భసంచిలో బిడ్డ పెరుగుతున్నకొద్దీ గర్భసంచి కూడా పెరుగుతుంటుంది. అది పెరుగుతున్నకొద్దీ తనకు పైభాగంలో ఉండే అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి ప్రభావం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తాయి.
కొద్దిపాటి ఆహార మార్పులతో, కొన్ని చిన్న చిన్న సూచనలతో ఈ సమస్యను చాలా తేలిగ్గా అధగిమించవచ్చు. ఇలా ఉన్నవారు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువ పర్యాయాలు భోజనం చేయాలి. అలాగే భోజనంలో మసాలాలు తక్కువగా తీసుకోవాలి. అంతేకాదు... తాము తీసుకునే పదార్థాలలో ఏ తరహా ఆహారంతో సమస్య పెరుగుతుందో గుర్తించి, దాన్ని పరిహరించాలి. ఇక కాఫీలు, చాక్లెట్‌లు, కూల్‌డ్రింక్స్, గ్యాస్‌ను పెంచే ఆహారం, జంక్‌ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి.
భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం అంత సరికాదు. దీనికి బదులు భోజనం పూర్తయ్యాక పుష్కలంగా నీళ్లు తాగడం శ్రేయస్కరం. భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయంలో ఆ నీళ్ల ఒత్తిడితో స్ఫింక్టర్ తెరచుకుని ఈ సమస్య రావచ్చు. అందుకే ఈ సూచన. ఇక భోజనం పూర్తయిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేశాక రెండు గంటల తర్వాతే పడుకోవాలి. తలను మిగతా శరీరం కంటే కాస్త పైభాగంలోనూ ఉండేలా తలగడను అడ్జెస్ట్ చేసుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మార్కెట్‌లో లభించే యాంటాసిడ్స్‌ను వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్