Gainik counseling
-
బ్లీడింగ్ ఎక్కువగా అవుతోంది...
నా వయసు 37. ఇటీవల నాకు పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. ఎందుకిలా జరుగుతోంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి. - కాత్యాయని, విజయవాడ పీరియడ్స్ సమయంలో రక్తం చాలా ఎక్కువగా పోతోందనడం చాలామంది చేసే ఫిర్యాదే. అయితే అది ఎక్కువా, తక్కువా అని నిర్ణయించడం కష్టం. ఎందుకంటే... నిర్ణీతంగా ఇంత పరిమాణంలో పోతే అది ఎక్కువని, లేదా ఇంత పోతే అది తక్కువని చెప్పడానికీ ప్రమాణాలేమీ లేవు. ఇలా రక్తం పోవడం అన్నది వాళ్లకు ఇబ్బందిగా అనిపిస్తే దాన్ని బట్టి ఎవరికి వాళ్లు అది ఎక్కువా, తక్కువా అని నిర్ణయించుకోవచ్చు. కాకపోతే బ్లీడింగ్ ఎక్కువగా జరగడం అన్నది మీకు వ్యక్తిగతంగా ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రం దానికి కారణమేమిటో తెలుసుకోవాలి. కొందరిలో ఫైబ్రాయిడ్స్ సమస్య ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. సాధారణంగా 40 ఏళ్లు దాటిన వారికి ఎక్కువగా బ్లీడింగ్ అవుతున్నా లేదా పీరియడ్స్ మధ్యలో రక్తస్రావం జరుగుతున్నా... దాన్ని క్యాన్సర్‌కు సంబంధించిన సమస్యగా అనుమానించి, వైద్యపరీక్షలు చేయించుకోవాలి. విదేశాల్లో అయితే మీ వయసు వారిని ఏడాదికోమారు పాప్‌స్మియర్ పరీక్ష చేయించుకోమని సలహా ఇస్తుంటారు. మన దేశంలో ఇంకా అంత అవగాహన పెంపొందలేదు. అయితే ఈ పరీక్ష వల్ల దాదాపు 10 ఏళ్ల తర్వాత రాబోయే గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్‌ను ముందే కనుక్కుని పూర్తిగా చికిత్స చేయవచ్చు. మీ వయసుకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. అయినా రిస్క్ తీసుకోకుండా ఒకసారి మీరు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి అల్ట్రాసౌండ్ స్కానింగ్‌తో పాటు ఇతర పరీక్షలు చేయించుకోండి. కారణాన్ని బట్టి, అవసరాన్ని బట్టి హార్మోన్ల చికిత్సతో లేదా ఇతరత్రా మార్గాల్లో ఈ సమస్యకు చికిత్స అందించవచ్చు. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..?
అన్ని విషయాల్లో లాగే బిడ్డ పుట్టడానికి అవసరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలన్నది తెలుసుకొని, ఆ మేరకు పర్యవేక్షించుకోవడాన్ని బర్త్ ప్లాన్‌గా చెప్పవచ్చు. ఈ బర్త్ ప్లాన్‌ను ఇటీవల చాలామంది చదువుకున్న మహిళలు తాము పురుడు పోసుకోడానికి ముందుగా తమ డాక్టర్‌తో చర్చించి, రాతపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. దీన్నే బర్త్ ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు. చాలామంది మహిళలు తమకు ఎలాంటి ప్రసూతి జరగాలో కోరుకుంటూ ఆ మేరకు తమకు జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కొందరు తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ డెలివరీయే కావాలని కోరుకుంటారు. మరికొందరు చాలా సందర్భాల్లో తమకు సిజేరియన్ జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కానీ ఇదంత మంచికోరిక కాదు. సిజేరియన్తో చాలా రకాల ఇబ్బందులు రావచ్చు. అటు అనస్థీషియా పరంగా, ఇటు పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ పరంగా... ఇలా అనేక రకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సాధారణ స్వాభావిక ప్రసూతితో పోలిస్తే సిజేరియన్ చేయడం అన్నది అటు తల్లికీ, ఇటు బిడ్డకూ అవసరమని, అదే సురక్షితమని డాక్టర్లు నిర్ణయిస్తేనే ఆ మేరకు డాక్టర్లు నిర్ణయం తీసుకుని, ఆ విషయాన్ని కాబోయే తల్లికి, ఆమె కుటుంబసభ్యులకు తెలిపి, తమకు అభ్యంతరం లేదనే అనుమతి (కన్సెంట్) తీసుకుంటారు. అందుకే ఈ నిర్ణయాన్ని పరిస్థితులను బట్టి డాక్టర్నే తీసుకోనివ్వాలి. ఇక దీనికి తోడు ప్రసూతికి వచ్చేప్పుడు ఎలా రావాలి? ఎవరితో రావాలి? ఆ టైమ్‌లో డాక్టర్ ఉంటారా? వంటి విషయాలను తెలుసుకుని, ఆ మేరకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఆసుపత్రికి వచ్చాక... నొప్పులు వస్తుంటే, వాటిని తట్టుకోడానికి సంసిద్ధంగా ఉంటారా లేదా నొప్పులు తట్టుకోలేనివారైతే అవి వచ్చీ, రాగానే నొప్పులు తెలియకుండా తీసుకోవాల్సిన ఇంజెక్షన్ కోరుకుంటారా అన్న విషయాలనూ తెలుసుకుంటారు. ఆసుపత్రికి వచ్చేప్పుడు కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన వస్తువులేమిటి, వాటిని ఎక్కడ నుంచి ఎలా పొందాలన్న అంశాలనూ తెలుసుకుంటారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక డెలివరీ అయ్యాక సిజేరియన్ అయితే ఎన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాలి, మామూలు ప్రసూతే అయితే ఎన్నాళ్లు ఉండాలన్న విషయాలతో పాటు, బిడ్డకు అవసరమైన వస్తువులు, ఇవ్వాల్సిన ఫీడింగ్ వంటి అంశాలు మొదలుకొని... ఆ తర్వాత బిడ్డకు అవసరమైన వ్యాక్సినేషన్ వివరాలనూ తెలుసుకుంటారు. తల్లిగా మారాక మొదటి చెకప్ ఎప్పుడన్న సంగతులతో పాటు, బిడ్డ జనన వివరాల నమోదు ఎలా అన్న సంగతి వరకు తెలుసుకోవడమే బర్త్ ప్లానింగ్‌గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కాబోయే తల్లులూ, తండ్రులూ... ఇక పెన్నూ పేపర్ తీసుకుని బర్త్ ప్లాన్‌కు సిద్ధమైపోండి. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
స్కానింగ్ వల్ల గర్భవతులకు, కడుపులోని బిడ్డకు ప్రమాదమా?
నేను ఇప్పుడు ఏడో నెల గర్భవతిని. డాక్టర్లు స్కాన్ చేయించమని చెప్పారు. అయితే ఇంతకు ముపును కూడా ఐదోనెలలో ఒకసారి స్కానింగ్ అయ్యింది. ఇలా తరచూ అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేయించడం బేబీకి మంచిదేనా? తెలియజేయండి. - సురేఖ, హైదరాబాద్ గర్భవతులకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ వల్ల చాలా ఉపయోగాలున్నాయి. సాధారణంగా గర్భధారణ మొత్తం వ్యవధిని... మొదటి మూడు నెలలను మొదటి ట్రైమిస్టర్‌గా, రెండో మూడు నెలల కాలాన్ని రెండో ట్రైమిస్టర్‌గా, ఆఖరి మూడు నెలల కాలాన్ని మూడో ట్రైమిస్టర్‌గా విభజిస్తారు. ఒక్కో ట్రైమిస్టర్ ఒక్కోసారి చొప్పున కనీసం మూడు స్కానింగ్‌లైనా తీయించి చూడటం తల్లికీ, బిడ్డకూ మేలు చేసేందుకే. మొదటి ట్రైమిస్టర్లో అంటే 14 వారాల లోపు చేసే స్కానింగ్‌లో గర్భాన్ని నిర్ధారణ చేయడంతో పాటు లోపల ఎంతమంది బిడ్డలు ఉన్నారు (అంటే కవలలా లేక ఒకే బిడ్డా) అన్న విషయాలు తెలుస్తాయి. దాంతో పాటు బిడ్డ సైజ్, దాన్ని బట్టి ప్రవసం అయ్యే తేదీని కూడా ఉజ్జాయింపుగా చెప్పవచ్చు. ఈ దశలో చేసే స్కానింగ్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం వచ్చే అవకాశాలను దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు అంచనా వేసేందుకు అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల కొంతవరకు డౌన్ సిండ్రోమ్ వంటి రుగ్మతలనూ అంచనా వేసే అవకాశమూ ఉంది. ఇక రెండో ట్రైమిస్టర్లో అంటే... 20 వారాల సమయంలో చేసే స్కాన్‌ను ‘టిఫా’ స్కాన్ లేదా ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటరు. అంటే ప్రత్యేకంగా బిడ్డలోని ప్రతి అవయవం నిర్దిష్టంగా ఎలా ఉందో టార్గెట్ చేసి చూస్తారు కాబట్టి దీన్ని ఫీటల్ టార్గెట్ స్కాన్ అంటారు. ఈ స్కాన్ ద్వారా బిడ్డకు అంగవైకల్యం కలిగే అవకాశాలను 80 శాతం వరకు కచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంది. అందుకే మొదటి ట్రైమిస్టర్లో స్కాన్ చేయించకపోయినా... 18 నుంచి 20 వారాల సమయంలో తప్పకుండా స్కానింగ్ చేయించాలి. ఇక మూడో ట్రైమిస్టర్లో అంటే 34వ వారంలో పొట్టలో బేబీ పొజిషన్‌ను చూస్తారు. ఆ సమయంలో తీసే స్కాన్‌లో బిడ్డ తలకిందులుగా ఉంటే సాధారణ ప్రవసం అవుతుందన్నమాట. ఒకవేళ ఎదురుకాళ్లతో కనిపిస్తే అప్పుడు శస్త్రచికిత్స ద్వారా బిడ్డను బయటకు తీసేలా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా భారతీయ ప్రమాణాలలో పుట్టినప్పుడు బిడ్డ బరువు 2.5 కిలోల నుంచి 2.8 కిలోల వరకు ఉంటుంది. బిడ్డ పెద్దదిగా ఉందా లేక చిన్నదిగా ఉందా అన్న విషయంతో పాటు ఉమ్మనీరు ఎలా ఉంది అన్న విషయం కూడా స్కాన్‌లో తెలుస్తుంది. దీన్ని బట్టి ఒకవేళ ఉమ్మనీరు తగ్గితే దానికి కారణాలు కనుక్కోవాల్సి ఉంటుంది. ఇక దాంతోపాటు మాయ (ప్లాసెంటా) తీరుతెన్నులు కూడా తెలుస్తాయి. ఉదాహరణకు గర్భాశయముఖద్వారానికి (సెర్విక్స్‌కు) దగ్గరగా మాయ ఉండటాన్ని ప్లాసెంటా ప్రివియా అంటారు. నిజానికి ప్రసవంలో బిడ్డ బయటకు వచ్చిన తర్వాత మాయ బయటకు రావాలి. కానీ ఒకవేళ ముందే మాయ బయటకు వస్తే అప్పుడు తల్లికి తీవ్రమైన రక్తస్రావం జరిగే అవకాశం ఉంది. ఇది బిడ్డకూ, తల్లికీ ప్రమాదకరమైన పరిస్థితే. అందుకే స్కానింగ్ ద్వారా ప్రసవం అయ్యే తీరును అంచనా వేసి, దానికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ఇక అల్ట్రా సౌండ్ స్కానింగ్‌లో కేవలం శబ్దతరంగాలను మాత్రమే ఉపయోగిస్తారు. ఎక్స్-రే లేదా సీటీ స్కాన్‌లో లాగా ప్రమాదకరమైన రేడియేషన్ తరంగాలను ఉపయోగించరు. ఈ శబ్దతరంగాలు ఎంత ప్రమాదరహితమైనవంటే... అవసరాన్ని బట్టి ఒక్కోసారి రోజూ డాప్లర్ స్కానింగ్ చేయించాల్సి రావచ్చు. అప్పుడు కూడా ప్రమాదాన్ని కలిగించవని అధ్యయనాల్లో తేలింది. కాబట్టి నిరభ్యంతరంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవచ్చు. కాకపోతే పుట్టబోయే బిడ్డ... ఆడా, మగా అని మాత్రం అడగవద్దు. అది మాత్రమే అభ్యంతరకరం. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
పీరియడ్స్ సమయంలో నొప్పి...ఏం చేయాలి?
నా వయసు 15 ఏళ్లు. ఏడాది క్రితం పుష్పవతిని అయినప్పటి నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి ఏం చేయాలి? భవిష్యత్తులో దీనివల్ల ఏమైనా ప్రమాదమా? దయచేసి వివరించగలరు. నాకు చాలా భయంగా ఉంది. - పారిజాత, విజయవాడ చాలామంది యువతుల్లో రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలా మంది దీని గురించి ఆందోళన పడతారు. అయితే ఇది చాలా సహజమైన విషయం. ఇలా నొప్పి రావడం చాలా మందిలో కనిపించేదే. పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందుది ఓవ్యులేషన్ పీరియడ్ అన్నమాట. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. చాలామందికి ఈ టైమ్‌లో నొప్పి వస్తుంది. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతులకే పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా... పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
డయాబెటిస్ ఉంది... ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా?
నా వయసు 28. గత రెండేళ్ల నుంచి షుగర్ ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - రమణ కుమారి, విజయవాడ గర్భవతుల్లో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండురకాలుగా చెప్పవచ్చు. మొదటిది డయాబెటిస్‌పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భందాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెరపాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జస్టెషనల్ డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ఇలా జస్టెషనల్ డయాబెటిస్ వచ్చినవారికి ఆ తర్వాత డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ. ఇక రెండోదైన ప్రెగ్నెన్సీపై డయాబెటిస్ కారణంగా పిండంపై దుష్ర్పభావాలు పడి పిండం ఎదిగే దశలో అంటే... మొదటి లేదా రెండో ట్రైమిస్టర్లో పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెరపరీక్షలు ఇప్పుడు సునిశితంగా, శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఇలాంటివేవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలో అందరిలోనూ నిర్వహించే టిఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయులు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థతకు లోనవుతారు. ఈ కండిషన్‌ను కీటో అసిడోసిస్ అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యవసర చికిత్స చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8, 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించడం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి, ఒకవేళ చక్కెరపాళ్లు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని... చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది. అలా చక్కెరను అదుపు చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ, వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్‌ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని... వాటన్నింటినీ పాటిస్తూ, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే... వీరూ అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంది. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
చికెన్‌పాక్స్ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడాను... నాకు సోకుతుందా?
నా వయసు 25. ఇప్పుడు నేను ఐదోనెల గర్భిణిని. టీచర్‌గా పనిచేస్తున్నాను. మా క్లాస్‌లో ఒక అబ్బాయికి చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) సోకింది. తగ్గేవరకు స్కూల్‌కు రావద్దని చెప్పినా... కాసేపు అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్నుంచి చికెన్‌పాక్స్ నాకు కూడా అంటుకుంటుందేమోమోనని ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సునందిని, హైదరాబాద్ చికెన్‌పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వెరిస్టెల్లా హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ వల్ల సోకుతుంది. చిన్నపిల్లల్లో ఇది చాలా సహజం. చిన్నప్పుడు దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెద్దల్లో వస్తే మాత్రం దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చికెన్‌పాక్స్ వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు శ్వాసతీసుకునే సమయంలో వెలువడే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. సాధారణంగా ఐదు నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల గాని, 15 నిమిషాల పాటు చికెన్‌పాక్స్ ఉన్నవారితో ఒకే గదిలో ఉండటం వల్ల గాని ఇది సోకే అవకాశాలు ఉంటాయి. నిజానికి మీరు చికెన్‌పాక్స్ వచ్చిన పిల్లాడితో కాసేపు మాట్లాడారు. అయితే చికెన్‌పాక్స్ వచ్చిన రెండు లేదా మూడోరోజుకుగాని అవి శరీరంపై పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలో బయటపడవు. కానీ అది సోకినవారిలో శరీరంపై పొక్కులు రావడానికి రెండు రోజుల ముందునుంచే వారు దీన్ని మరొకరికి వ్యాప్తి చేయగల స్థితిలో ఉంటారు. అందుకే మనకు తెలియకుండానే దీనికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. చికెన్‌పాక్స్ సోకగానే మొదట జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రెండు రోజులకు అవి తగ్గాక గానీ శరీరంపై చికెన్‌పాక్స్ పొక్కులు కనిపించవు. శరీరంపై పొక్కులు వచ్చాక అది మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్ అన్నది రెండు వారాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ వైరస్ వారి నరాల చివర్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వారు ఎప్పుడైనా బలహీనపడ్డా లేదా వారిలో వ్యాధినిరోధకశక్తి క్షీణించినా అది బయటపడుతుంది. ఇలా రెండోసారి పునరావృతమయ్యే చికెన్‌పాక్స్‌ను షింగిల్స్ అంటారు. షింగిల్స్లో చికెన్‌పాక్స్‌తో పోలిస్తే మరి కాస్త తీవ్రత ఎక్కువ. నిజానికి చిన్నప్పుడే చికెన్‌పాక్స్ సోకిన వారు మళ్లీ ఆ వ్యాధిగ్రస్తులతో ఎంత సన్నిహితంగా గడిపినా వారికి చికెన్‌పాక్స్ సోకదు. కాకపోతే అది చిన్నప్పుడు వచ్చిందో, రాలేదో తెలియదు కాబట్టి... గతంలో అది వచ్చి ఉందా అని నిర్ధారణ చేయడానికి ఒక రక్తపరీక్ష చేస్తారు. దానికి సంబంధించిన యాంటీబాడీస్ సహాయంతో అది గతంలో వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుస్తుంది. చిన్నప్పుడే ఆ వ్యాధి వచ్చి ఉన్నవారు ఇకపై దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి వస్తే ఇక జీవితకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది. అయితే ఒకవేళ రాకపోతే వారికి వారిస్టెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ కూడా చికెన్‌పాక్స్ ఉన్నవారికి ఎక్స్పోజ్ అయిన నాటి నుంచి 10 రోజుల లోపు ఇవ్వాలి. చికెన్‌పాక్స్‌కు యాక్టివ్ ఇమ్యూనైజేషన్గానూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే అది గర్భవతులకు ఇవ్వడానికి వీలుకాదు. కాకపోతే గర్భం రాకముందు మాత్రం తీసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకసారి మీరు మీ డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
ఆహారం తినగానే ఛాతీలో ఎందుకీ మంట..?
నాకిప్పుడు ఆరోనెల. భోజనం చేశాక గుండెలో మంటగా ఉంటోంది. ఛాతీపై బరువు పెట్టినట్లుగా ఉంటోంది. తేన్పులు వస్తున్నాయి. నా ఈ సమస్యకు పరిష్కారం చెప్పండి. - సుమలత, కోదాడ గర్భవతుల్లో సాధారణంగా 28వారాల సమయంలో గుండెలో మంట, ఛాతీలో ఇబ్బంది, కడుపులోని ఆహారం పైకి ఎగదన్నుతున్న ఫీలింగ్, అజీర్తి, తేన్పుల బాధ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. వీటిని సాధారణ పరిభాషలో హార్ట్బర్న్గా వ్యవహరిస్తుంటాం. ఈ సమస్య 28 వారాల తర్వాతి ప్రెగ్నెన్సీలో సాధారణమే అయినా ఒక్కోసారి వేవిళ్ల కారణంగా అర్లీ ప్రెగ్నెన్సీలోనూ కనిపిస్తుంటుంది. కడుపులో ఊరే జఠరరసం... అంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే గ్యాస్ట్రిక్ జ్యూస్... జీర్ణాశయం నుంచి పైకి అంటే అన్నవాహిక వైపునకు ఎగదన్నడమే దీనికి కారణం. గర్భవతుల్లో కండరాలను వదులుగా అయ్యేలా చేయడానికి మాయ (ప్లాసెంటా) నుంచి ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంటుంది. గర్భసంచిలో ఉండే పిండం పెరుగుతున్న కొద్దీ దానికి చోటు కల్పించడం కోసం గర్భసంచి కండరాలు వదులయ్యేలా చేయడం కోసం ప్రకృతి చేసిన ఏర్పాటిది. ఈ హార్మోన్ తన సహజ నైజం కొద్దీ కేవలం గర్భసంచిని మాత్రమే వదులు చేయకుండా ఇతర కండరాలు అంటే... పక్కనే ఉన్న జీర్ణాశయం-అన్నవాహిక మధ్యన ఉండే కవాటం వంటి స్ఫింక్టర్ (లోవర్ ఈసోఫేజియల్ స్ఫింక్టర్) మొదలైన వాటి మీద కూడా తన ప్రభావం చూపుతుంది. ఆ స్ఫింక్టర్ వదులైపోవడంతో తిన్న పదార్థం, దానితో పాటు జఠరరసం వంటివి జీర్ణాశయం నుంచి అన్నవాహికలోకి పైకి ఎగజిమ్ముతాయి. ఫలితంగా గుండెలో మంట, ఛాతీపై బరువు ఉన్న ఫీలింగ్, తేన్పులు, ఆహారం జీర్ణం కాకుండా ఉన్న ఫీలింగ్ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇది మాత్రమేగాక గర్భసంచిలో బిడ్డ పెరుగుతున్నకొద్దీ గర్భసంచి కూడా పెరుగుతుంటుంది. అది పెరుగుతున్నకొద్దీ తనకు పైభాగంలో ఉండే అవయవాలపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి ప్రభావం వల్ల కూడా పై లక్షణాలు కనిపిస్తాయి. కొద్దిపాటి ఆహార మార్పులతో, కొన్ని చిన్న చిన్న సూచనలతో ఈ సమస్యను చాలా తేలిగ్గా అధగిమించవచ్చు. ఇలా ఉన్నవారు కొద్ది కొద్ది మోతాదుల్లో ఎక్కువ పర్యాయాలు భోజనం చేయాలి. అలాగే భోజనంలో మసాలాలు తక్కువగా తీసుకోవాలి. అంతేకాదు... తాము తీసుకునే పదార్థాలలో ఏ తరహా ఆహారంతో సమస్య పెరుగుతుందో గుర్తించి, దాన్ని పరిహరించాలి. ఇక కాఫీలు, చాక్లెట్లు, కూల్‌డ్రింక్స్, గ్యాస్‌ను పెంచే ఆహారం, జంక్‌ఫుడ్ వంటి వాటిని తగ్గించాలి. భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం అంత సరికాదు. దీనికి బదులు భోజనం పూర్తయ్యాక పుష్కలంగా నీళ్లు తాగడం శ్రేయస్కరం. భోజనం మధ్యన ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల జీర్ణాశయంలో ఆ నీళ్ల ఒత్తిడితో స్ఫింక్టర్ తెరచుకుని ఈ సమస్య రావచ్చు. అందుకే ఈ సూచన. ఇక భోజనం పూర్తయిన వెంటనే పడుకోకూడదు. భోజనం చేశాక రెండు గంటల తర్వాతే పడుకోవాలి. తలను మిగతా శరీరం కంటే కాస్త పైభాగంలోనూ ఉండేలా తలగడను అడ్జెస్ట్ చేసుకోవాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే మార్కెట్లో లభించే యాంటాసిడ్స్‌ను వాడవచ్చు. అప్పటికీ తగ్గకపోతే డాక్టర్‌ను సంప్రదించాలి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
వేవిళ్ల బాధ ఎక్కువగా ఉంది...!
నా వయసు 24. ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఇదే తొలిచూలు. ప్రస్తుతం రెండోనెల. నాకు వేవిళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఇలా ఉండటంతో ఆహారం తీసుకోలేకపోతున్నాను. పైగా తిన్నది కాస్తా వాంతుల రూపంలో వెళ్లిపోతోంది. ఇదేమైనా ప్రమాదమా? నాకు సరైన సలహా ఇవ్వండి. - సులోచన, తుని గర్భధారణ జరిగాక వేవిళ్ల వల్ల వికారం (నాసియా), వాంతులు చాలా సాధారణం. ఇవి 10వ వారం ప్రెగ్నెన్సీ సమయంలో గరిష్ఠంగా ఉంటాయి. అంటే దాదాపు రెండున్నర నెలల సమయంలోనన్నమాట. సాధారణంగా ఇలా వికారం, వాంతులు అన్నవి ఉదయం వేళల్లోనే ఎక్కువ అన్న అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. కానీ ఇది సాయంత్రాలతో సహా ఏ వేళల్లోనైనా ఉండవచ్చు. ఇలా వేవిళ్ల వాంతులు కావడం అన్నది ఎన్నిసార్లు జరిగితే అది సమస్యగా పరిగణించవచ్చంటూ మీలాగే చాలామంది అడుగుతుంటారు. దీనికి నిర్దిష్టంగా ఒక లెక్కంటూ లేదు. చాలా సుకుమారంగా ఉండేవాళ్లలో కేవలం రెండు మూడుసార్లకే నీరసపడుతుంటారు. కానీ కొందరు మాత్రం ఐదారు సార్లు వాంతులైనా తట్టుకోగలరు. ఇక దీనివల్ల ఏదైనా ఇబ్బంది ఉందా అంటే... అన్నివిధాలా ఆరోగ్యంగా ఉండి, రక్తహీనత లేకుండా, తగినంత హిమోగ్లోబిన్ ఉన్నవాళ్లయితే వాంతులు అవుతున్న కారణంగా గర్భధారణ సమయాల్లో పెరగాల్సినంతగా బరువు పెరగకపోయినా... దాన్ని పెద్ద ఇబ్బందిగానూ, సమస్యగానూ పరిగణించాల్సి అవసరం లేదు. ఐదోనెల వరకూ ఇలా ఉండవచ్చు. అప్పటి వరకూ దీనివల్ల బరువు పెరగకపోయినా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. అయితే ఐదునెలల తర్వాత కూడా గర్భిణీ తగినంతగా బరువు పెరగకపోతే మాత్రం అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. వేవిళ్ల సమస్యను ఎదుర్కొనడానికి ప్రధానంగా ఇంటిచిట్కాలు, ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలు. ఇంటి చిట్కా విషయానికి వస్తే అల్లం మురబ్బా తీసుకోవడం గాని లేదా అల్లం, ఉప్పు, నిమ్మరసం కలిసిన మిశ్రమాన్ని తీసుకోవడంతో మంచి ఫలితం కనిపిస్తుంది. ఇదేమీ వేవిళ్లకు ఔషధం కాదు. అయితే వేవిళ్లతో బాధపడేవారికి చాలావరకు ఉపశమనంగా ఉంటుంది. ఇక ఆహార మార్పుల విషయానికి వస్తే... చాలామంది మహిళలకు ఈ సమయంలో వారి ఆహారపు అలవాట్లు మారినట్లుగా ఉంటాయి. అంటే... అంతకుమునుపు స్వీట్స్ ఇష్టపడని వారికి ఈ సమయంలో స్వీట్స్ ఎక్కువగా తినాలనిపిస్తుంది. అలాగే అంతకు మునుపు కారాలు, మసాలాలు అస్సలు ముట్టని వారికి, ఈ సమయంలో వాటిని ఎక్కువగా తీసుకోవాలని అనిపించవచ్చు. అయితే ఈ సమయంలో చేయాల్సిన ఆహారపు మార్పులంటూ పెద్దగా ఉండవు. అన్ని రకాల పదార్థాలూ తీసుకోవచ్చు. కాకపోతే మసాలాలు తగ్గించాలంతే. సాధారణంగా వేవిళ్ల బాధ మూడోనెల వరకూ ఉంటుంది. కొంతమందిలో ఐదో నెల వరకూ ఉండవచ్చు. అయితే ఐదునెలల తర్వాత కూడా తగ్గకుండా అదేపనిగా వాంతులవుతూ ఉంటే డాక్టర్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు వాంతులు తగ్గడానికి కొన్ని టాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక కొందరిలో వాంతులు చాలా ఎక్కువగా ఉంటాయి. కడుపులో కవలలు ఉన్నా లేదా కొందరిలో ముత్యాలగర్భం ఉన్నా ఇలా జరుగుతుంటుంది. అందుకే వేవిళ్లు మరీ ఎక్కువగానూ/ తీవ్రంగానూ ఉన్నవారు డాక్టర్‌ను సంప్రదించి అల్ట్రా సౌండ్ స్కానింగ్ తీయించుకుని, అసాధారణ గర్భం ఏదైనా ఉందేమో అన్నవిషయాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక మీ విషయానికి వస్తే మీరేమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నిర్భయంగా, నిశ్చింతగా మీ డాక్టర్ / గైనకాలజిస్ట్ ఫాలో అప్‌లో ఉండండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్