డయాబెటిస్ ఉంది... ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా?
నా వయసు 28. గత రెండేళ్ల నుంచి షుగర్ ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- రమణ కుమారి, విజయవాడ
గర్భవతుల్లో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండురకాలుగా చెప్పవచ్చు. మొదటిది డయాబెటిస్‌పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భందాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెరపాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జస్టెషనల్ డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ఇలా జస్టెషనల్ డయాబెటిస్ వచ్చినవారికి ఆ తర్వాత డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ.
ఇక రెండోదైన ప్రెగ్నెన్సీపై డయాబెటిస్ కారణంగా పిండంపై దుష్ర్పభావాలు పడి పిండం ఎదిగే దశలో అంటే... మొదటి లేదా రెండో ట్రైమిస్టర్‌లో పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెరపరీక్షలు ఇప్పుడు సునిశితంగా, శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఇలాంటివేవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలో అందరిలోనూ నిర్వహించే టిఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయించాల్సి ఉంటుంది.
ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయులు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థతకు లోనవుతారు. ఈ కండిషన్‌ను కీటో అసిడోసిస్ అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యవసర చికిత్స చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8, 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించడం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి, ఒకవేళ చక్కెరపాళ్లు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని... చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది.
అలా చక్కెరను అదుపు చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ, వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్‌ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని... వాటన్నింటినీ పాటిస్తూ, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే... వీరూ అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంది.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్