అది  ఏ కారణం వల్ల వస్తుంది..? | Different spots on skin during pregnancy | Sakshi
Sakshi News home page

అది  ఏ కారణం వల్ల వస్తుంది..?

Published Sun, Dec 2 2018 2:23 AM | Last Updated on Sun, Dec 2 2018 2:23 AM

Different spots on skin during pregnancy - Sakshi

నాకు ఈ మధ్య డెలివరీ జరిగింది. పాలు బాగా తక్కువగా వస్తున్నాయి. మొదట్లో ఇది సహజమేనని పెద్దలంటున్నారు. ఇది నిజమేనా? తక్కువ పాలు వస్తున్నప్పుడు సీసా పాలు పట్టించవచ్చా? జలుబు చేసినప్పుడు పాలు పట్టించడం వల్ల బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా? ఎక్కువ పాలు రావాలంటే ప్రత్యేకమైన ఆహారం ఏదైనా తీసుకోవా? మాత్రలు ఏవైనా ఉన్నాయా అనేది వివరంగా తెలియజేయగలరు. – పి.సమత, పెంబర్తి
కాన్పు తర్వాత తల్లి మానసిక, శారీరక పరిస్థితిని బట్టి, బిడ్డ తల్లి రొమ్మును సరిగా పట్టుకుని చీకేదాని బట్టి, పాలు సరిగా రావడం ఆధారపడి ఉంటుంది. కాన్పు తర్వాత బిడ్డ రొమ్మును పట్టి పాలు త్రాగడం మొదలుపెట్టేదాకే మెదడు ప్రేరేపణకు గురైయ్యి దాని నుంచి ఆక్సిటోసిన్, ప్రొలాక్టిన్‌ హార్మోన్లు విడుదల అవుతాయి. దీని ద్వారా రొమ్ములలో పాల ఉత్పత్తి మొదలయ్యి బయటకు వస్తాయి. మొదటి మూడు రోజులు, నీరులాంటి ద్రవం (ఛిజిౌ ్ఛట్ట్ఛటౌ ) వస్తుంది. దీన్నే ముర్రిపాలు అని కూడా అంటారు. ఇందులో బిడ్డ రోగనిరోధక శక్తిని పెంచే యాంటిబాడీస్, ప్రొటీన్స్, కార్బోహైడ్రేట్స్‌ ఉంటాయి. చాలా మంది పాలు అవంతట అవే వచ్చే వరకు ఎదురు చూస్తూ, పాలు రావట్లేదని బిడ్డకు రొమ్ము పట్టకుండా బయట పాలు ఇస్తారు. దాంతో బిడ్డ పాలకు అలవాటుపడి రొమ్మును సరిగా పట్టడు. దాని వల్ల తల్లి పాలు సరిగారావు. కాబ్టటి బిడ్డ పుట్టిన గంట నుంచే పాలు వచ్చినా, రాకపోయినా తల్లి రొమ్మును పట్టించడం వల్ల పాలు ఉత్పత్తి మొదలవుతాయి. రోజుకి మూడు గంటలకు ఒకసారి రోజు మొత్తంలో 7–8 సార్లు ఇవ్వడం వల్ల, పాలు తొందరగా రావడం జరుగుతుంది. కాబట్టి వీలయినంతవరకు మొదట తల్లి పాలు పట్టి, రాకపోతే డాక్టర్‌ సలహా తీసుకుని మాత్రమే సీసా పాలు పట్టించాలి. జలుబు చేసినప్పుడు, తల్లిపాల వల్ల బిడ్డకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ముక్కు, నోటికి అడ్డం పెట్టుకుని పాలు ఇవ్వవచ్చు. మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం వల్ల కూడా పాల ఉత్పత్తి బాగా ఉంటుంది. ఆహారంలో మంచి నీరు, పాలు, ఆకుకూరలు, పండ్లు, వెల్లుల్లి రేకలు, పప్పులు వంటివి తీసుకోవడం వల్ల పాలు బాగా వస్తాయి. కొన్ని రకాల మందులు డాక్టర్‌ సలహా మేరకు వాడుకోవచ్చు.

మా కజిన్‌ ఒకరు జెస్టేషినల్‌ డయాబెటీస్‌తో బాధపడుతోంది. తన వయసు 26. ఇది  ఏ కారణాల వల్ల వస్తుంది. నివారణ మార్గాలు ఏమిటి? ముందస్తు జాగ్రత్తలు ఏమిటో తెలియజేయగలరు. – కె.సునిత, అవనిగడ్డ
గర్భం దాల్చిన తర్వాత షుగర్‌ పెరిగి మధుమేహం పెరగడాన్నే జెస్టేషినల్‌ డయాబెటిస్‌ అంటారు. వీరిలో గర్భం రాకముందు షుగర్‌ లెవల్స్‌ సాధారణంగానే ఉంటాయి. గర్భం దాల్చిన తర్వాత, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి, బరువును బట్టి, జరిగే హార్మోన్ల మార్పుల వల్ల, వాటి ప్రభావం వల్ల, జన్యుపరమైన కారణాల వల్ల అధిక బరువు ఉండటం, గర్భం సమయంలో ఎక్కువ ఆహారం తీసుకుని, ఎక్కువగా బరువు పెరగటం, లేటు వయసులో గర్భం దాల్చడం వంటి అనేక కారణాల వల్ల, కొందరిలో ప్రెగ్నెన్సీలో రక్తంలో చక్కెరశాతం పెరిగి జెస్టేషినల్‌ డయాబెటిస్‌ రావచ్చు. ఇది ఎక్కువ మట్టుకు 5వ నెల తర్వాత బయటపడుతుంది. దీనిని వందశాతం నివారించలేము కానీ, ప్రెగ్నెన్సీ రాకముందే, అధికబరువు ఉంటే.. బరువు తగ్గడం, ప్రెగ్నెన్సీలో ఎక్కువ బరువు పెరగకుండా చూసుకోవడం, ఆహారంలో అన్నం తక్కువ తీసుకోవడం, కొవ్వు పదార్థాలు, స్వీట్లు, కొన్ని రకాల చక్కెర శాతం ఎక్కువ ఉన్న తియ్యటి పండ్లు ఎంత వీలయితే అంత తక్కువ తీసుకోవడం, డాక్టర్‌ సలహామేరకు నడక, చిన్న చిన్న వ్యాయామాలు చెయ్యడం వల్ల, షుగర్‌ లెవల్స్‌ అదుపులో ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. ప్రెగ్నెన్సీలో అవసరాన్ని బట్టి షుగర్‌ లెవల్స్‌ పరీక్ష చెయ్యించుకుని వాటిలో మార్పు ఉంటే, మితమైన ఆహారంతో పాటు వాకింగ్, వ్యాయామాలు చేస్తూ ఉండాలి. అప్పటికీ షుగర్‌ లెవల్స్‌ ఎక్కువగా పెరిగితే డాక్టర్‌ సలహా మేరకు మందులు వాడటం మంచిది.

నా వయసు 28. నాకు ప్రస్తుతం మూడవ నెల. ప్రెగ్నెన్సీ సమయంలో చర్మంపైన రకరకాల మచ్చలు పడుతుంటాయని, అవి ఎప్పటికీ తగ్గవని ఇంతకుముందే నేను విన్నాను. పెగ్నెన్సీ çహార్మోన్ల ప్రభావం చర్మంపై పడకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డెర్మటాలాజిస్ట్‌ను తప్పనిసరిగా సంప్రదించాలా? – జి.రాణి, విజయనగరం
ప్రెగ్నెన్సీ సమయంలో సాధారణంగానే హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. ఇవన్నీ తొమ్మిది నెలల పాటు బిడ్డను మొయ్యడానికి దోహదపyýుతాయి. ఈ ప్రక్రియలో భాగంగా తల్లి శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయి. ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి హార్మోన్లలో మార్పలు ఉంటాయి. దాన్ని బట్టి శరీర మార్పుల తీవ్రత ఉంటుంది. కొందరిలో మార్పులు కొద్దిగానే, కొందరిలో ఎక్కువగానూ ఉంటుంది. వీటిని నూటికి నూరుశాతం రాకుండా జాగ్రత్తలు ఎక్కువ ఏమీ ఉండవు. ఈ మార్పులలో భాగంగా మెడచుట్టూ నల్లగా ఉండటం, పొట్టపైన తొడలపైన స్ట్రెచ్‌మార్క్స్‌ రావడం, నల్లని నిలువ గీతలు పడటం, మొహంపైన పిగ్మెంటేషన్, మొటిమలు, మెడపైన, వీపుపైన కూడా రావచ్చు. నరాలు ఉబ్బడం, శరీరంలో నీరురావడం వంటివి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉండొచ్చు. ఈ సమయంలో నీరు బాగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి లేకుండా ఉండటం, మితమైన పౌష్టికాహారం తీసుకోవడం, బరువు మరీ ఎక్కువగా పెరగకుండా చూడటం,  తేమ ఎక్కువగా ఉండే సోపులు వాడటం, మాయిశ్చరైజింగ్‌ లోషన్స్‌ వాడటం వల్ల కొద్దిగా చర్మం నిగనిగ లాడుతుంది. అలాగే చర్మంలో తేమ బాగా ఉంటే, దురద తక్కువగా ఉండటం, స్ట్రెచ్‌మార్క్స్‌ తక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. డెర్మెటాలాజిస్ట్‌ను సంప్రదించినా వారు చర్మంపైన ఎటువంటి ప్రభావం పడకుండా మందులు ఇవ్వలేరు.
డా‘‘ వేనాటి శోభ
బర్త్‌రైట్‌ బై రెయిన్‌బో
హైదర్‌నగర్‌ , హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement