Dr. Sushila vavilala
-
ఆడుతూ.. పాడుతూ..
నువ్వు నేను : శ్రీకాంత్,సుశీల In all the world there is heart for me like yours.. In all the world there is no love for you like mine.. అని మాయా ఏంజిలో చెప్పినట్టే ఉంటుందీ జంట! ఆమె.. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్! అతను.. డాక్టర్ శ్రీకాంత్, సీనియర్ ఫిజీషియన్! ఇద్దరూ డాక్టర్లే అనే సారూప్యతే కాక మరో ప్రత్యేకతా ఉంది.. ఆలుమొగలిద్దరూ కళాకారులు. ఆయన స్వరం కర్ణాటక సంగీతంతో శృతి కలిపితే.. ఆమె అడుగులు కూచిపూడి లయను ఒలికిస్తాయి! వైద్యవృత్తి ఇరువురినీ ఏడడుగులు నడిపిస్తే.. కళ.. ఆ బంధాన్ని అందమైన అనుబంధంగా మలుస్తోంది! - సరస్వతి రమ శ్రీకాంత్‌ది కళాకారుల కుటుంబం. నాన్న ఉషాకాంత్ పేరున్న సంగీతకారులు. అమ్మా గాయినే. స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబం సుశీలది. వావిలాల గోపాలకృష్ణ తమ్ముడి కూతురు ఆమె. ఈ భిన్న నేపథ్యాల కలయిక అటు వ్యాధుల మీద సమరం ప్రకటిస్తూ .. ఇటు సంసారంలో సరిగమలు పలికిస్తోంది! ఎలా కలిశారు? ‘మాది అరేంజ్డ్ మ్యారేజ్. డాక్టరమ్మాయే కావాలని అనుకోలేదు. బాగా చదువుకున్న అమ్మాయైతే బాగుండు అనుకున్న. అయితే మా అమ్మకు మాత్రం డాక్టర్ కోడలు కావాలని ఉండేది’ అని శ్రీకాంత్ చెప్తే.. ‘మా అమ్మ కూడా డాక్టర్ అల్లుడు వస్తే బాగుండు అనుకుంది’ వాళ్లింటి ముచ్చట చెప్పారు సుశీల. అల్లుడు పాటగాడని ఇటువైపు, కోడలు నర్తకి అని అటువైపూ ఎప్పుడు తెలిసింది అని అడిగితే.. ‘సుశీల మంచి డ్యాన్సరని పెళ్లిచూపులకంటే ముందే తెలుసు!’ అంటూ శ్రీకాంత్ విషయాన్ని పరిచయం చేస్తే.. ‘మాది గుంటూరు. అక్కడే మెడిసిన్ చేశా. ఎంబీబీఎస్‌లో ఉన్నప్పుడే.. ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో పెర్ఫార్మ్ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఆ ప్రోగ్రామ్‌కి అత్తయ్య, మామయ్య కూడా వచ్చారు. నన్ను మెచ్చారు’ అంటూ వివరించారు సుశీల. ‘మామూలుగా మెచ్చుకోవడం కాదు.. అమ్మ అయితే తను చాలా మంచి డ్యాన్సర్రా.. అంటూ ఒకటే ప్రశంసలు’ మురిపెంగా ఆ ముచ్చట ముగించారు శ్రీకాంత్! ‘నేనూ పెళ్లికి ముందే తన పాటలు విన్నాను’ అని సుశీల కొసమెరుపు. పెళ్లి.. పాట.. ఆట.. ‘పెళ్లి చూపుల్లో మా కళల గురించి ఏమీ మాట్లాడుకోలేదు కానీ.. చదువు గురించి మాట్లాడుకున్నాం’ సుశీల. ‘తను అప్పటికి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసింది. నాదేమో పీజీ అయిపోయింది. పెళ్లయ్యాక తను ఎంతవరకు చదువుకుంటే అంతవరకు చదివించాలి అని అప్పుడే డిసైడ్ అయ్యాను. చెప్పాను కూడా’ శ్రీకాంత్. ‘అన్నట్టుగానే చదివించారు. ఏ కోర్స్ చేస్తే బాగుంటుందో కూడా సజెస్ట్ చేశారు..’ చెప్పారు సుశీల. మరి ఆట, పాట ఒకే వేదిక మీద వినిపించింది, కనిపించింది.. ఎప్పుడూ అని అడిగితే.. ‘పెళ్లిలో’ అంటారిద్దరూ. ‘పెళ్లప్పుడు జయదేవుడి గీతగోవిందం ఆయన పాడితే రాధగా నేను డ్యాన్స్ చేశాను’ అంటూ ఆ తీపి జ్ఞాపకాన్ని సుశీల గుర్తుచేసుకుంటే నవ్వుతో ఆస్వాదించారు శ్రీకాంత్. మల్టీటాస్క్లో అపశృతులు..? ‘అస్సలు లేవ్’ ముక్త కంఠంతో సమాధానం వచ్చింది. ‘ప్రొఫెషన్ అయినా, హాబీ అయినా ప్లాన్డ్గా ఉంటాం’ అంటారు శ్రీకాంత్. ‘ప్రైవేట్ నర్సింగ్ హోమ్ పెట్టుకోవాలనే ఆలోచన మా ఇద్దరికీ లేకపోవడం ప్లస్ అయింది. ఇద్దరికీ టీచింగ్ మీదే ఇంట్రెస్ట్. దాని ప్రకారమే ప్లాన్ చేసుకున్నాం. అయితే ఇది నల్లేరుపై నడకేం కాదు. రోజుకి 18 గంటలు పనిచేసిన సందర్భాలూ ఉన్నాయ్’ అని సుశీల పనితీరును వివరిస్తే.. ‘గెస్ట్ లెక్చర్స్‌తో టూర్స్లాంటి షెడ్యూల్స్‌తో ఒకరం బిజీగా ఉంటే మిగిలిన బాధ్యతలను ఇంకొకరం చూసుకుంటాం’ అంటారు శ్రీకాంత్. ‘నేను ఇంటి విషయాలంతగా పట్టించుకోను. అవన్నీ ఆయనే చూసుకుంటారు’ సుశీల. ‘తను టెక్నికల్ ఎక్స్పర్ట్. అందుకే నా వర్క్‌లోని టెక్నికల్ పార్ట్ తనే చేసి పెడుతుంది’ కితాబిస్తారు శ్రీకాంత్. ‘నా స్పెషలైజేషన్‌కి సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఆయన చెప్తుంటారు’ అంటూ సుశీల తమ పరస్పర సహకారాన్ని వివరించారు. కళాసహకారం? ‘అదీ అంతే. ఒకేసారి ఇద్దరం ప్రోగ్రామ్స్ పెట్టుకోం’ అంటారు సుశీల. ‘నా ప్రోగామ్ ఉన్నప్పుడు ప్లానింగ్ నుంచి ఇన్విటేషన్, బ్యాక్‌స్టేజ్ అరేంజ్మెంట్స్ దాకా అన్నీ తను చూసుకుంటుంది. తన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఆ పనులన్నీ నేను చూసుకుంటాను’ శ్రీకాంత్. సూచనలు, సలహాలు.. ఉంటాయ్. ఏదైనా ఇద్దరం కలిసే డిస్కస్ చేసుకుంటాం. మాది జాయింట్ ఫ్యామిలీ. ముందు నాన్నతో, తర్వాత సుశీలతో.. అన్నీ చర్చించాకే అడుగు వేస్తాం’ అంటారు శ్రీకాంత్. ప్రశంసలు, విమర్శలు.. ‘ఉంటాయ్. కించపర్చుకునేలా కాదు.. ఒకరికొకరు గైడ్ చేసుకునేలా’ సుశీల స్పందన. జెలసీ.. ‘ఆ మాటకు చోటే లేదు’ శ్రీకాంత్ దృఢస్వరం. ‘నీది, నాది అనుకున్నప్పుడు అవన్నీ ఉంటాయ్. మనది అనుకున్నప్పుడు అసూయ అన్న మాటే రాదు’ సుశీల. ‘అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నా భార్య స్పెషల్ వన్‌గా ఉండాలనేది నా కోరిక’ శ్రీకాంత్ ముక్తాయింపు. మరి కోపాలు.. ‘మనుషులమే కదా.. వస్తాయ్. కాస్త అరుస్తాను.. తగ్గుతాను. అంతేకాని ఆర్గ్యుమెంట్స్ చేసుకోం’ శ్రీకాంత్. ‘ఇంట్లో మామయ్య స్ట్రిక్ట్ వార్నింగ్.. డిస్కషన్సే కాని ఆర్గ్యుమెంట్స్ ఉండొద్దు అని. అయితే ఆయన కోపం పాలమీద పొంగే కానీ నాదే న్యాగింగ్గా ఉంటుంది’ తన బలహీనతను తెలిపారు సుశీల. ‘కోపం త్వరగా రాదు వస్తే త్వరగా పోదు. ఆ న్యాగింగ్ అంటేనే కాస్త ఇబ్బంది’ అని మైనస్‌ను కోట్ చేస్తూనే ‘అలాగే తను చాలా స్ట్రాంగ్, ఎనర్జిటిక్. తెల్లవారుజాము వరకు పనిచేసినా అలసిపోదు. అంతే ఫ్రెష్‌గా తిరిగి రోజును మొదలుపెడుతుంది. ఎలాంటి టాస్క్‌నైనా అవలీలగా చేసేస్తుంది’ అంటూ భార్యలోని ప్లస్‌నూ ప్రశంసించారు. ‘నా వృత్తి నేర్పిన నైపుణ్యం అది. నా ప్రొఫెషనంతా అప్పటికప్పుడు డెసిషన్స్ తీసుకోవడమే కదా. అయితే తనకున్నంత ఓపిక నాకులేదు’ అంటూ భర్తలోని ప్లస్కూ ప్లేస్ ఇచ్చారు సుశీల. ‘నన్ను భరించువాడు, మంచివాడు’ అని ఆమె, ‘మై స్పెషల్వన్’ అంటూ అతనూ ఒక్క మాటలో బెటర్ హాఫ్‌కు పరిపూర్ణ అర్థమిచ్చారు. మ్యూజిక్ ఫర్ హీలింగ్ డెబ్బైరెండు మేళకర్త రాగాల అనుసంధానం.. నాలుగేళ్ల శోధన.. ఈ శ్రమ ఫలితమే మ్యూజిక్ ఫర్ హీలింగ్! వైద్యం, సంగీతం కలిసి, కలిపి చేస్తున్న ట్రీట్మెంట్.. నాదతనుమనిశమ్! ఇది డాక్టర్ జె. శ్రీకాంత్ కృషి ఫలితం. ఈ రోజు రవీంద్రభారతిలో సాయంత్రం ఆరుగంటలకు ఆవిష్కరణ! -
గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా...?
నాకిప్పుడు ఆరోనెల నడుస్తోంది. మావారితో కలిసి విహార యాత్రకు వెళ్లాలని అనుకుంటున్నాను. గర్భవతులు ప్రయాణాలు చేయవచ్చా? నాకు కాస్త వివరంగా చెప్పండి. - సుచిత్ర, హైదరాబాద్ ఇది చాలా మంది గర్భవతులకు చాలా సాధారణంగా వచ్చే సందేహమే. తాము ఫంక్షన్లకు, పెళ్లిళ్లకు, విహారయాత్రలకు దూరప్రయాణాలు చేయవచ్చా అని తరచూ డాక్టర్‌ను అడుగుతుంటారు. గర్భవతిగా ఉండటం అన్నది ప్రయాణాలకు ఏమాత్రం అడ్డంకి కాదని గుర్తించాలి. అయితే అవసరాన్ని బట్టి కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. గర్భంతో ఉన్న వ్యవధిలో తొలి మూడు నెలలను ఫస్ట్ ట్రైమిస్టర్ అని, నాలుగు నుంచి ఆర్నెల్ల కాలాన్ని రెండో ట్రైమిస్టర్ అని, ఏడో నెల నుంచి ప్రసవం అయ్యేవరకు ఉన్న సమయాన్ని మూడో ట్రైమిస్టర్ అని అంటారన్నది తెలిసిందే. ఏ ట్రైమిస్టర్లో అయినా ప్రయాణాలు చేయవచ్చు. కాకపోతే మొదటి, మూడో ట్రైమిస్టర్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉదాహరణకు మొదటి ట్రైమిస్టర్లో ఉన్నప్పుడు గర్భిణికి వికారం, వాంతులు ఉంటాయి. అటువంటి సమయంలో ప్రయాణం చేయడం వల్ల వాంతులు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన మందులతో ప్రయాణం చేయవచ్చు. ఇకపోతే కొంతమందిలో కడుపునొప్పి, బ్లీడింగ్ మొదలైన సమస్యలు మొదటి ట్రైమిస్టర్లో ఉండవచ్చు. అలాంటివారు ప్రయాణాన్ని సాధ్యమైనంత వరకు వాయిదా వేసుకోవడం మంచిది. తప్పనిసరి పరిస్థితులలో వైద్యుల సలహా మేరకు ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రెండో ట్రైమిస్టర్లో తల్లి ఆరోగ్య పరిస్థితి, బిడ్డకు సంబంధించిన వివరాలు (స్కానింగ్ రిపోర్టులు) అన్నీ బాగా ఉంటే, అటువంటి వారు పెళ్లిళ్లకు, పేరంటాలకు మాత్రమే కాకుండా విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నిజానికి బిడ్డ పుట్టాక, చిన్నారి సపర్యలతో చాలాకాలం వరకు ఎటూ కదలడానికి, వెళ్లడానికి వీలుకాదు కాబట్టి ఒకవేళ విహార యాత్రలకు వెళ్లాలనుకుంటే రెండో ట్రైమిస్టర్ అన్నది చాలా సౌకర్యవంతమైన సమయం అనుకోవచ్చు. అయితే దూరప్రాంతాలకు వెళ్లాలనుకున్నవారు తమ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా తీసుకోవాలి. మూడో ట్రైమిస్టర్ కూడా ప్రయాణాలకు అనుకూలమే. కాకపోతే తొమ్మిదోనెల దాటాక ప్రయాణాలు అంత మంచివి కాదు. ఇక 32-34 వారాల ప్రెగ్నెన్సీ సమయం నాటికి తాము ప్రసూతి ప్లాన్ చేసుకున్న చోటికి వచ్చి ఉండటం అన్నివిధాలా మంచిది. ఎందుకంటే తొమ్మిదో నెల తర్వాత నొప్పులు ఏ సమయంలో అకస్మాత్తుగా మొదలవుతాయో తెలియదు. పైగా ఒక్కోసారి అకస్మాత్తుగా ఉమ్మనీరు బయటకు చిమ్మడం వంటివి కూడా కనిపించవచ్చు. అందుకే 34 వారాల తర్వాత ఎలాంటి ప్రయాణాలూ పెట్టుకోకుండా, తాము ప్రసూతి కావాలనుకున్న చోటే ఉండటం మంచిది. ఇక ప్రయాణాలు చేయాలనుకున్న వారు ఎలాంటి వాహనాలలో వెళ్లాలి, బస్‌లోనా, కారులోనా, రైల్లోనా, విమానప్రయాణాలు చేయవచ్చా...లాంటి సందేహాలను వెలిబుచ్చుతుంటారు. కుదుపులు లేకుండా ఉండే ఎలాంటి ప్రయాణమైనా చేయవచ్చు. ఇక కొందరు స్త్రీలు తాము ద్విచక్రవాహనం నడుపుతుంటామని, అలా నడపవచ్చా అని అడుగుతుంటారు. కుదుపుల్లేకుండా నడుపుతూ, ట్రాఫిక్‌లో తాము తీసుకునే జాగ్రత్తల విషయంలో ఇంకాస్త ఎక్కువ శ్రద్ధతీసుకుంటూ, తమ శరీరం సహకరించినంత వరకు మహిళలు స్కూటర్ లేదా కార్ వంటి వాహనాలను నడపవచ్చు. కాకపోతే అకస్మాత్తుగా బ్రేక్ వేయడం, ఎదురుగా గుంతల్లోకి వాహనాన్ని నడిపి శరీరాన్ని అకస్మాత్తుగా కుదుపునకు గురిచేయడం వంటి వాటిని అవాయిడ్ చేయాలి. అందుకే రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో వాహనం నడపకుండా అవాయిడ్ చేయడమే మంచిది. ఇక కార్ నడిపేవారు విధిగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. అయితే ఈ సీట్ బెల్ట్‌ను సౌకర్యంగా పొట్ట కింది భాగంలో ఉండేలా చూసుకోవాలి. ఇక విమాన ప్రయాణం చేసేవారు తాము ఏ కంపెనీకి చెందిన ఫ్లైట్‌లో వెళ్లాలనుకుంటున్నారో, వారిని సంప్రదించాలి. ఎందుకంటే కంపెనీని బట్టి వారు ప్రెగ్నెన్సీలో ఏ సమయం వరకు ప్రయాణాన్ని అనుమతిస్తారో, ఆ సమయం వరకు ప్రయాణం చేయవచ్చు. అయితే ఒకవేళ విమాన ప్రయాణం అన్నది ఆరు గంటల కంటే ఎక్కువగా కొనసాగాల్సి వస్తే మాత్రం... ప్రతి రెండు గంటలకొకసారి ఫ్లైట్‌లోనే అట్నుంచి ఇటు, ఇట్నుంచి అటూ తిరగాలి. ఇక ఎనిమిది గంటలకు పైగా ప్రయాణం కొనసాగించాల్సి వస్తే మాత్రం విధిగా స్టాకింగ్స్ ధరించాలి. దీనివల్ల కాలి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితిని నివారించవచ్చు. ఒకవేళ 8 నుంచి 10 గంటలకు పైగా విదేశాలకు వెళ్లడం వంటి దూరప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తే... ప్రయాణానికి ముందే తమ డాక్టర్‌ను విధిగా సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అవసరాన్ని బట్టి రక్తం గడ్డకట్టకుండా నివారించే ఇంజెక్షన్స్ (థ్రాంబోప్రొఫిలాక్టిక్ ఇంజెక్షన్స్) ఇచ్చి, ప్రయాణంలో పాటించాల్సిన జాగ్రత్తలు చెబుతారు. ఇక గర్భవతులు విమానం ఎక్కాల్సి వచ్చినప్పుడు విధిగా తమ డాక్టర్‌నుంచి ఫిజికల్ ఫిట్నెస్ / ట్రావెల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకుపోవడం మరచిపోవద్దు. ఇక మీ విషయానికి వస్తే... మీ రిపోర్టులన్నీ బాగున్నాయి కాబట్టి... ప్రసవం తర్వాత బిడ్డ సంరక్షణలో కనీసం ఆరు నెలల పాటు ఎటూ వెళ్లడానికి వీలుండదు కాబట్టి ఈ సమయంలో మీరు నిరభ్యంతరంగా విహారయాత్రను ప్లాన్ చేసుకోవచ్చు. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
బర్త్ ప్లానింగ్ అంటే ఏమిటి..?
అన్ని విషయాల్లో లాగే బిడ్డ పుట్టడానికి అవసరమైన ఏర్పాట్లు ఎలా ఉండాలన్నది తెలుసుకొని, ఆ మేరకు పర్యవేక్షించుకోవడాన్ని బర్త్ ప్లాన్‌గా చెప్పవచ్చు. ఈ బర్త్ ప్లాన్‌ను ఇటీవల చాలామంది చదువుకున్న మహిళలు తాము పురుడు పోసుకోడానికి ముందుగా తమ డాక్టర్‌తో చర్చించి, రాతపూర్వకంగా నమోదు చేసుకుంటున్నారు. దీన్నే బర్త్ ప్లాన్‌గా వ్యవహరిస్తున్నారు. చాలామంది మహిళలు తమకు ఎలాంటి ప్రసూతి జరగాలో కోరుకుంటూ ఆ మేరకు తమకు జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కొందరు తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ నార్మల్ డెలివరీయే కావాలని కోరుకుంటారు. మరికొందరు చాలా సందర్భాల్లో తమకు సిజేరియన్ జరిగేలా చూడమని డాక్టర్‌ను కోరుతుంటారు. కానీ ఇదంత మంచికోరిక కాదు. సిజేరియన్తో చాలా రకాల ఇబ్బందులు రావచ్చు. అటు అనస్థీషియా పరంగా, ఇటు పోస్ట్ ఆపరేటివ్ కాంప్లికేషన్స్ పరంగా... ఇలా అనేక రకాల సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. సాధారణ స్వాభావిక ప్రసూతితో పోలిస్తే సిజేరియన్ చేయడం అన్నది అటు తల్లికీ, ఇటు బిడ్డకూ అవసరమని, అదే సురక్షితమని డాక్టర్లు నిర్ణయిస్తేనే ఆ మేరకు డాక్టర్లు నిర్ణయం తీసుకుని, ఆ విషయాన్ని కాబోయే తల్లికి, ఆమె కుటుంబసభ్యులకు తెలిపి, తమకు అభ్యంతరం లేదనే అనుమతి (కన్సెంట్) తీసుకుంటారు. అందుకే ఈ నిర్ణయాన్ని పరిస్థితులను బట్టి డాక్టర్నే తీసుకోనివ్వాలి. ఇక దీనికి తోడు ప్రసూతికి వచ్చేప్పుడు ఎలా రావాలి? ఎవరితో రావాలి? ఆ టైమ్‌లో డాక్టర్ ఉంటారా? వంటి విషయాలను తెలుసుకుని, ఆ మేరకు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటారు. ఆసుపత్రికి వచ్చాక... నొప్పులు వస్తుంటే, వాటిని తట్టుకోడానికి సంసిద్ధంగా ఉంటారా లేదా నొప్పులు తట్టుకోలేనివారైతే అవి వచ్చీ, రాగానే నొప్పులు తెలియకుండా తీసుకోవాల్సిన ఇంజెక్షన్ కోరుకుంటారా అన్న విషయాలనూ తెలుసుకుంటారు. ఆసుపత్రికి వచ్చేప్పుడు కాబోయే తల్లికి, పుట్టబోయే బిడ్డకు అవసరమైన వస్తువులేమిటి, వాటిని ఎక్కడ నుంచి ఎలా పొందాలన్న అంశాలనూ తెలుసుకుంటారు. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక డెలివరీ అయ్యాక సిజేరియన్ అయితే ఎన్నాళ్లు ఆసుపత్రిలో ఉండాలి, మామూలు ప్రసూతే అయితే ఎన్నాళ్లు ఉండాలన్న విషయాలతో పాటు, బిడ్డకు అవసరమైన వస్తువులు, ఇవ్వాల్సిన ఫీడింగ్ వంటి అంశాలు మొదలుకొని... ఆ తర్వాత బిడ్డకు అవసరమైన వ్యాక్సినేషన్ వివరాలనూ తెలుసుకుంటారు. తల్లిగా మారాక మొదటి చెకప్ ఎప్పుడన్న సంగతులతో పాటు, బిడ్డ జనన వివరాల నమోదు ఎలా అన్న సంగతి వరకు తెలుసుకోవడమే బర్త్ ప్లానింగ్‌గా ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. కాబోయే తల్లులూ, తండ్రులూ... ఇక పెన్నూ పేపర్ తీసుకుని బర్త్ ప్లాన్‌కు సిద్ధమైపోండి. డాక్టర్ సుశీల వావిలాల ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
డయాబెటిస్ ఉంది... ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చా?
నా వయసు 28. గత రెండేళ్ల నుంచి షుగర్ ఉంది. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను. నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? - రమణ కుమారి, విజయవాడ గర్భవతుల్లో షుగర్ ఉన్నప్పుడు చక్కెర ప్రభావాన్ని రెండురకాలుగా చెప్పవచ్చు. మొదటిది డయాబెటిస్‌పై ప్రెగ్నెన్సీ ప్రభావం. సాధారణంగా గర్భందాల్చాక కలిగే హార్మోనల్ తేడాల వల్ల ఒంటిలో చక్కెరపాళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అదే జస్టెషనల్ డయాబెటిస్‌కు దారితీయవచ్చు. ఇలా జస్టెషనల్ డయాబెటిస్ వచ్చినవారికి ఆ తర్వాత డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అలాగే వాళ్ల పిల్లలకు కూడా చక్కెర వ్యాధి రిస్క్ ఎక్కువ. ఇక రెండోదైన ప్రెగ్నెన్సీపై డయాబెటిస్ కారణంగా పిండంపై దుష్ర్పభావాలు పడి పిండం ఎదిగే దశలో అంటే... మొదటి లేదా రెండో ట్రైమిస్టర్లో పుట్టబోయే బిడ్డలో అవయవలోపాలు రావడం వంటివి జరగవచ్చు. అందుకే గర్భవతికి చక్కెరపరీక్షలు ఇప్పుడు సునిశితంగా, శ్రద్ధగా నిర్వహిస్తున్నారు. ఇలాంటివేవైనా జరిగే అవకాశాలుంటే దాన్ని తెలుసుకోవడం కోసం 20 వారాల ప్రెగ్నెన్సీలో అందరిలోనూ నిర్వహించే టిఫా అనే పరీక్షతో పాటు ఫీటల్ ఎకో కార్డియోగ్రఫీ కూడా చేయించాల్సి ఉంటుంది. ఇక సాధారణ వ్యక్తుల్లో లాగే గర్భవతుల్లోనూ షుగర్ స్థాయులు అసాధారణంగా పెరిగిపోతే వాళ్ల ఒంట్లో చాలా రకాల ప్రతికూల పదార్థాలు విడుదలై అస్వస్థతకు లోనవుతారు. ఈ కండిషన్‌ను కీటో అసిడోసిస్ అంటారు. కొందరు కోమాలోకి కూడా వెళ్లే ప్రమాదం ఉంది. ఇలాంటి వారికి ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి అత్యవసర చికిత్స చేయించాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇప్పుడు గర్భం దాల్చిన మహిళలకు ప్రెగ్నెన్సీ 8, 9 వారాల్లో ఒకసారి చక్కెర పరీక్ష చేయించడం లేదా 16 వారాలప్పుడు ఓజీటీటీ అనే పరీక్ష చేయించి, ఒకవేళ చక్కెరపాళ్లు ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ ఇంజెక్షన్లు ఇచ్చి దాన్ని పూర్తిగా అదుపులో ఉంచడం అవసరం. ఒకవేళ ముందే పరీక్ష చేయించుకుని... చక్కెర ఉన్నట్లు తెలిసిన వారిలో దాన్ని అదుపులో ఉంచాల్సి ఉంటుంది. అలా చక్కెరను అదుపు చేస్తూనే మిగతా మహిళల్లా ఫోలిక్ యాసిడ్ మాత్రలు తీసుకుంటూ, వాళ్లు తీసుకోవాల్సిన డైట్ ప్లాన్‌ని రూపొందించుకుని అవలంబించాల్సిన వ్యాయామ ప్రక్రియలను తెలుసుకుని... వాటన్నింటినీ పాటిస్తూ, క్రమం తప్పకుండా డాక్టర్‌ను సంప్రదిస్తూ ఉంటే... వీరూ అందరిలాగే ఆరోగ్యకరమైన బిడ్డను పొందే అవకాశం ఉంది. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
చికెన్‌పాక్స్ ఉన్న స్టూడెంట్‌తో మాట్లాడాను... నాకు సోకుతుందా?
నా వయసు 25. ఇప్పుడు నేను ఐదోనెల గర్భిణిని. టీచర్‌గా పనిచేస్తున్నాను. మా క్లాస్‌లో ఒక అబ్బాయికి చికెన్‌పాక్స్ (ఆటలమ్మ) సోకింది. తగ్గేవరకు స్కూల్‌కు రావద్దని చెప్పినా... కాసేపు అతడితో మాట్లాడాల్సి వచ్చింది. అప్పట్నుంచి చికెన్‌పాక్స్ నాకు కూడా అంటుకుంటుందేమోమోనని ఆందోళనగా ఉంది. ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వగలరు. - సునందిని, హైదరాబాద్ చికెన్‌పాక్స్ అనే వైరల్ ఇన్ఫెక్షన్ వెరిస్టెల్లా హెర్పిస్ జోస్టర్ అనే వైరస్ వల్ల సోకుతుంది. చిన్నపిల్లల్లో ఇది చాలా సహజం. చిన్నప్పుడు దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. కానీ పెద్దల్లో వస్తే మాత్రం దీని తీవ్రత ఎక్కువగానే ఉంటుంది. చికెన్‌పాక్స్ వచ్చిన వారితో మాట్లాడుతున్నప్పుడు వారు శ్వాసతీసుకునే సమయంలో వెలువడే తుంపర్ల వల్ల ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించవచ్చు. సాధారణంగా ఐదు నిమిషాల పాటు ఒకరితో ఒకరు మాట్లాడటం వల్ల గాని, 15 నిమిషాల పాటు చికెన్‌పాక్స్ ఉన్నవారితో ఒకే గదిలో ఉండటం వల్ల గాని ఇది సోకే అవకాశాలు ఉంటాయి. నిజానికి మీరు చికెన్‌పాక్స్ వచ్చిన పిల్లాడితో కాసేపు మాట్లాడారు. అయితే చికెన్‌పాక్స్ వచ్చిన రెండు లేదా మూడోరోజుకుగాని అవి శరీరంపై పొక్కుల (బ్లిస్టర్స్) రూపంలో బయటపడవు. కానీ అది సోకినవారిలో శరీరంపై పొక్కులు రావడానికి రెండు రోజుల ముందునుంచే వారు దీన్ని మరొకరికి వ్యాప్తి చేయగల స్థితిలో ఉంటారు. అందుకే మనకు తెలియకుండానే దీనికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువే. చికెన్‌పాక్స్ సోకగానే మొదట జ్వరం, ఒళ్లునొప్పుల వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత రెండు రోజులకు అవి తగ్గాక గానీ శరీరంపై చికెన్‌పాక్స్ పొక్కులు కనిపించవు. శరీరంపై పొక్కులు వచ్చాక అది మరింత వేగంగా వ్యాప్తిచెందడానికి అవకాశం ఎక్కువ. సాధారణంగా చికెన్‌పాక్స్ అన్నది రెండు వారాల తర్వాత దానంతట అదే తగ్గిపోతుంది. అయితే ఆ వైరస్ వారి నరాల చివర్లో నిద్రాణంగా ఉండిపోతుంది. ఆ తర్వాత వారు ఎప్పుడైనా బలహీనపడ్డా లేదా వారిలో వ్యాధినిరోధకశక్తి క్షీణించినా అది బయటపడుతుంది. ఇలా రెండోసారి పునరావృతమయ్యే చికెన్‌పాక్స్‌ను షింగిల్స్ అంటారు. షింగిల్స్లో చికెన్‌పాక్స్‌తో పోలిస్తే మరి కాస్త తీవ్రత ఎక్కువ. నిజానికి చిన్నప్పుడే చికెన్‌పాక్స్ సోకిన వారు మళ్లీ ఆ వ్యాధిగ్రస్తులతో ఎంత సన్నిహితంగా గడిపినా వారికి చికెన్‌పాక్స్ సోకదు. కాకపోతే అది చిన్నప్పుడు వచ్చిందో, రాలేదో తెలియదు కాబట్టి... గతంలో అది వచ్చి ఉందా అని నిర్ధారణ చేయడానికి ఒక రక్తపరీక్ష చేస్తారు. దానికి సంబంధించిన యాంటీబాడీస్ సహాయంతో అది గతంలో వచ్చిందా రాలేదా అన్న విషయం తెలుస్తుంది. చిన్నప్పుడే ఆ వ్యాధి వచ్చి ఉన్నవారు ఇకపై దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది ఒకసారి వస్తే ఇక జీవితకాలం ఇమ్యూనిటీని ఇస్తుంది. అయితే ఒకవేళ రాకపోతే వారికి వారిస్టెల్లా జోస్టర్ ఇమ్యూనోగ్లోబ్యులిన్ అనే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఇది ప్యాసివ్ ఇమ్యూనైజేషన్ అన్నమాట. ఈ ఇంజెక్షన్ కూడా చికెన్‌పాక్స్ ఉన్నవారికి ఎక్స్పోజ్ అయిన నాటి నుంచి 10 రోజుల లోపు ఇవ్వాలి. చికెన్‌పాక్స్‌కు యాక్టివ్ ఇమ్యూనైజేషన్గానూ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయితే అది గర్భవతులకు ఇవ్వడానికి వీలుకాదు. కాకపోతే గర్భం రాకముందు మాత్రం తీసుకోవచ్చు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఒకసారి మీరు మీ డాక్టర్‌ను సంప్రదించండి. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్ -
పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి
నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడం మొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి. - ధరణి, ఏలూరు రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే. దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం. చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు. డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్