పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి
నా వయసు 15. రెండేళ్ల క్రితం మెన్సెస్ రావడం మొదలైంది. అప్పట్నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. దీనివల్ల భవిష్యత్తులో ఏమైనా ప్రమాదమా? భవిష్యత్తులో నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉందా? తగిన సలహా ఇవ్వండి.
- ధరణి, ఏలూరు
రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలామంది యువతుల్లో ఇది కనిపించడం మామూలే. దీన్ని చాలామంది ఒక జబ్బుగానో, లోపంగానో పరిగణిస్తారు. పిల్లలు పుడతారో లేదోనని అపోహలు పెంచుకుంటారు. అయితే ఇది చాలా సహజమైన అంశం.
చాలామంది యువతులు పీరియడ్స్ సమయాన్ని అండం విడుదలైన దశగా (ఓవ్యులేషన్ పీరియడ్‌గా) భావిస్తారు. కానీ... నిజానికి దీనికి 14 రోజుల ముందే అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందే ఓవ్యులేషన్ పీరియడ్. అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం అన్నది పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. కాబట్టి దీన్ని అన్ ఓవ్యులేటెడ్ పీరియడ్‌గా పరిగణించాలి. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతుల్లో పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ.
పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది. ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే నొప్పి తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి పన్నెండు గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది.
ఇలా రుతుసమయంలో వచ్చే నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా అలాగే వస్తున్నా, లేదా నొప్పి నివారణ మందులు వాడాక కూడా నొప్పి తగ్గనంతటి తీవ్రతతో వస్తున్నా, లేదా పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... డాక్టర్‌ను సంప్రదించండి. అంతేతప్ప పైన పేర్కొన్నట్లు సాధారణంగా వచ్చే రుతు సమయపు నొప్పి గురించి ఆందోళన చెందవలసిన అవసరమే లేదు.
డాక్టర్ సుశీల వావిలాల, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్