పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్‌లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది.
పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్‌ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం.
మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్‌ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అందుకే మంచి శానీటరీ న్యాప్‌కిన్స్‌ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment