Menstruation pain
-
కలబందతో శానిటరీ న్యాప్కిన్స్ తయారీ..ఆ సమస్యలకు చెక్
పీరియడ్స్.. అందరు అమ్మాయిల జీవితంలో సర్వసాధారణమైన ప్రక్రియ. కానీ ఇప్పటికీ ఎందుకో ఈ విషయంపై చర్చించడానికి పెద్దగా ఇష్టపడరు. అదేదో మాట్లాడకూడని సబ్జెక్ట్ అన్నట్లు చూస్తారు. దీని ఆధారంగా బాలీవుడ్లో ప్యాడ్‌మ్యాన్ పేరుతో ఓ సినిమాను కూడా రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే ప్రధాన పాత్రలు పోషించారు. రుతస్రావం, నాప్‌కీన్స్ వాడకంపై అవగాహన కల్పిస్తూ రూపొందిన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు పొందింది. పీరియడ్స్ సాధారణమే అయినా ఆ సమయంలో పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. కొందరు ఆ నొప్పిని తట్టుకోలేక అల్లాడిపోతుంటారు. ఈ క్రమంలో ప్రతి నెలా ఆ సమయంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు పెట్టే వాళ్లూ లేకపోలేదు. అందుకే కొన్ని కంపెనీల్లో ప్రత్యేకంగా పీరియడ్ లీవ్స్ని కూడా ప్రవేశ పెట్టారు. పీరియడ్స్ సమయంలో సరైన పరిశుభ్రత పాటించకపోతే సమస్య మరింత ఇబ్బందిగా మారుతుంది. అందుకే ఆ సమయంలో హైజీన్ మరింత అవసరం. మంచి నాణ్యత కలిగిన ప్యాడ్ మాత్రమే వాడాలి. కానీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న ప్యాడ్స్ ఎంత వరకు ఈ ప్రమాణాలు పాటిస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకమే. కొందరు శానిటరీ ప్యాడ్స్ తయారు చేసేటప్పుడు వాటిని ఫైబర్ క్లోరిన్‌తో బ్లీచ్ చేస్తారు. దీనివల్ల డయాక్సైన్, ప్రమాదకరమైన కలుషితాలు విడుదలవుతాయి. వీటి కారణంగా పెల్విక్ ఇన్ఫ్లమేటరీ సమస్యలు, హార్మోన్ల సమస్యలు, ఎండోమెట్రియోసిస్, క్యాన్సర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే మంచి శానీటరీ న్యాప్కిన్స్ను వాడాలి. ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ మనూ ప్రకాశ్ నేతృత్వంలోని స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలోని బృందం తాజాగా తక్కువ ధరకే ప్యాడ్స్‌ను అందిస్తోంది. సాధారణంగా ప్యాడ్స్ తయారీకి ఎక్కువ మొత్తంలో కాటన్ అవసరం ఉంటుంది. కానీ వీళ్లు కాటన్ అవసరం లేకుండానే సిసల్(కలబంద)మొక్కను ఉపయోగించి తక్కువ ధరకు ప్యాడ్స్‌ను తయారు చేస్తున్నారు. ఇది సాధారణ ప్యాడ్స్ మాదిరిగానే చాలా సాఫ్ట్‌గా ఉంటాయని, అంతేకాకుండా వీటిని సులభంగా రీసైకిల్ చేయొచ్చని వివరించారు. -
నేను మగాడినైనా బాగుండేది.. ఈ కడుపునొప్పి వల్ల: టెన్నిస్ ప్లేయర్ భావోద్వేగం
Zheng Qinwen French Open 2022: ‘‘ఇది అమ్మాయిలకు సంబంధించిన విషయం. మొదటి రోజు పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. భరించలేని కడుపు నొప్పి. అయినా నేను గేమ్ ఆడాలనే ప్రయత్నిస్తాను. కానీ ఈరోజు అలా జరుగలేదు’’ అంటూ చైనా యువ టెన్నిస్ క్రీడాకారిణి జెంగ్ కిన్వెన్ తీవ్ర భావోద్వేగానికి లోనైంది. తాను పురుషుడినైనా బాగుండేదని ఉద్వేగానికి గురైంది. ప్రతిష్టాత్మక టెన్నిస్ టోర్నమెంట్ ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే నాలుగో రౌండ్‌కు చేరుకున్న నాలుగో చైనీస్ మహిళగా కిన్వెన్ చరిత్ర సృష్టించింది. ఈ క్రమంలో ప్రపంచ నంబర్, టాప్ సీడ్ ఇగా స్వియాటెక్‌తో తలపడే అవకాశం దక్కించుకుంది ఈ 19 ఏళ్ల చైనీస్ టీనేజర్. అయితే, సోమవారం నాటి ఈ మ్యాచ్ సందర్భంగా కిన్వెన్ రుతుస్రావ సమయంలో కలిగే నొప్పి కారణంగా విలవిల్లాడింది. స్వియాటెక్‌తో మ్యాచ్‌లో తొలి సెట్ వరకు బాగానే ఉన్న కిన్వెన్.. ఆ తర్వాత నొప్పి తీవ్రతరం కావడంతో అక్కడే బ్యాక్ మసాజ్ చేయించుకుంది. ఆ తర్వాత కుడి తొడకు కట్టు కట్టుకుని బరిలోకి దిగింది. ఈ క్రమంలో 6-7(5), 6-0, 6-2 తేడాతో స్వియాటెక్ చేతిలో ఆమెకు ఓటమి తప్పలేదు. దీంతో కిన్వెన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో తీవ్ర నిరాశకు లోనైన ఆమె విలేకరులతో మాట్లాడుతూ... ‘‘ఎంతకష్టమైనా మ్యాచ్ పూర్తి చేయడానికే నేను ఇష్టపడతా. నా స్వభావానికి విరుద్ధంగా వెళ్లను. అయితే, ఈరోజు కోర్టులో ఉన్న సమయంలో నేను పురుషుడినైతే బాగుండేదనిపించింది. ఆ క్షణంలో నిజంగా నేను మగాడిని అయి ఉంటే.. ఈ బాధ తప్పేది. పరిస్థితి ఇంకాస్త మెరుగ్గా ఉండేదేమో. ’’ అని వ్యాఖ్యానించింది. కడుపునొప్పి, కాలు నొప్పి కారణంగా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే, వరల్డ్ నెంబర్ 1తో పోటీపడిన సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించానని ఈ 74వ ర్యాంకర్ పేర్కొంది. అయితే, కడుపునొప్పి లేకుండా మరింత ఎక్కువగా ఎంజాయ్ చేసేదానినని, ఇంకాస్త బాగా ఆడేదానిని తెలిపింది. తనతో మరో మ్యాచ్ అవకాశం వచ్చినపుడు మాత్రం అస్సలు ఇలాంటి పరిస్థితి(రుతుస్రావం) ఎదురుకాకూడదని ఉద్వేగపూరితంగా మాట్లాడింది. ఇదిలా ఉంటే.. కిన్వెన్పై విజయంతో ఈ ఏడాది వరుసగా 32వ గెలుపు నమోదు చేసింది పోలాండ్‌కు చెందిన స్వియాటెక్. క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టిన ఆమె.. టైటిల్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. క్వార్టర్లో అమెరికాకు చెందిన జెసికా పెగులాతో ఆమె అమీతుమీ తేల్చుకోనుంది. చదవండి: IPL 2022: ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేదు.. కానీ రెండు టైటిల్స్.. ఐపీఎల్లో మోస్ట్ లక్కీ ప్లేయర్..! 📽️ It was a real battle for No.1 @iga_swiatek against Zheng Qinwen in their Round of 16 match:#RolandGarros pic.twitter.com/1FWNGZS5Im — Roland-Garros (@rolandgarros) May 30, 2022 -
పీరియడ్‌లో భయంకరమైన నొప్పా? ఇలా చేయండి!
మన ఇంటి అమ్మాయికి తొలిసారి నెలసరి రాగానే పదిమందినీ పిలిచి వేడుక చేసుకున్నంత ఈజీ కాదు పీరియడ్స్ అంటే. దాదాపు ప్రతీ ఆడబిడ్డకు ప్రతీ నెల అదొక చెప్పలేనంత ఇబ్బంది. దీనికి అధిక రక్త స్రావం, భరించలేని కడుపునొప్పి లాంటివి తోడైతే ఇక నరకమే. అసలు పీరియడ్స్ లేదా బహిష్టు సమయంలో ఇలాంటి సమస్యలు ఎందుకు వస్తాయి? వీటికి పరిష్కారా లేంటి అనే విషయాలపై ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డా. కవిత సాక్షి. కామ్‌తో వివరాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆహార నియమాలు, కొద్ది పాటి వ్యాయామం చేయాలని ఆమె సూచించారు. చాలామంది మహిళల్లో ఋతుక్రమం సమయంలో గర్భాశయ కండరాల్లో సంకోచం కారణంగా కడుపునొప్పి వస్తుంది. ఈ సంకోచాలు ఎంత బలంగా ఉంటే అంత తీవ్రంగా కడుపు నొప్పి వేధిస్తుంది. ఈ కారణంగా రక్త నాళాలపై ఒత్తిడి ఏర్పడి గర్భాశయానికి ఆక్సిజన్ తగ్గుతుంది. ఇలా ఆక్సిజన్ సరఫరా తగ్గి, మరింత నొప్పి, ఒక్కోసారి తిమ్మిరి వస్తుంది. ఈ సమయంలో హీట్ ప్యాడ్ చాలా చాలా ఉపశమనాన్ని ఇస్తుంది. కాళ్లను పొట్ట దగ్గరగా వచ్చేలా ముడుచుకొని హీట్ ప్యాడ్‌ను పొట్టపై పెట్టుకోవాలి. దీంతో కండరాల సంకోచాలు నియంత్రణలోకి వస్తాయి. నొప్పి మరీ భరించలేనంతగా ఉన్నపుడు మాత్రమే పెయిన్ కిల్లర్స్ వాడాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎక్కువ ద్రవపదార్థాలను సేవిస్తూ ఒత్తిడికి దూరంగా ఉంటూ తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. తక్కువ కొవ్వు, అధిక పీచు కలిగిన ఆహారం మేలు. తృణధాన్యాలు, కాయధాన్యాలు, బీన్స్, ముదురు ఆకు పచ్చఆకు కూరలు, ఇతర కూరగాయలు శ్రేయస్కరం. విటమిన్, ఈ, బీ1,బీ6, మెగ్నీషియం, జింక్ ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు లాంటి పోషకాలు పీరియడ్ బాధలనుంచి ఉపశమనం పొందడంలో సహాయపడతాయి. ముఖ్యంగా రోజుకు ఒక నువ్వులు, బెల్లం కలిపిన ఉండ తీసుకుంటే గర్భాశయ సమస్యలు తగ్గుముఖం పడతాయి. అలాగే మరో మూడు నాలుగు రోజుల్లో పీరియడ్ వస్తుందనగా, లావెండర్, నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో పొట్టపై సున్నితంగా 5 నుంచి 10 నిమిషాలు పాటు మాసాజ్ చేసుకోవాలి. ఫలితంగా గర్భాశయంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. చాలామంది టీనేజర్లలో మెన్స్ట్రువల్ సమస్యలు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవర్ బ్లీడింగ్, లేదంటే భరించలేని కడుపునొప్పితో మెలికలు తిరిగి పోతూ ఉంటారు. ఒక్కోసారి రెండు సమస్యలు వేధిస్తుంటాయి. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణమని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ వల్ల చాలా ప్రమాదమని సాధ్యమైనంత వరకు మైదాతో తయారు చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిదని సూచిస్తున్నారు. సాంప్రదాయ బద్ధ ఆహారాన్ని తీసుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయుర్వేద వైద్యులు డా. కవిత సూచించారు. ప్రతీ నిత్యం యోగ, సూర్య నమస్కారాలు చేయడం వలన మహిళల్లో పీరియడ్ సమస్యలే కాదు, హార్మోనల్ ఇంబేలన్స్ అనేది లేకుండా చూసుకోవచ్చన్నారు. . వీటన్నింటికి తోడు ఇంట్లోని వారందరూ పీరియడ్ టైంలో ఆడవాళ్ల సమస్యల్ని,బాధల్ని సహృదయంతో అర్థం చేసుకోవాలి. పీరియడ్ అనగానే అదేదో అంటు ముట్టు సమస్యగానో, లేదంటే అపవిత్రమైన విషయంగానో చూడటాన్ని మానేయాలి. పీరియడ్ సమయంలో ఉన్న మహిళలకు మరింత సపోర్ట్‌గా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. పీరియడ్‌లో బ్లీడింగ్ ఆగిపోయి, ప్యాడ్లు, కప్‌లు ఇలాంటి బాదర బందీ లేకుండా.. హాయిగా ఉండొచ్చు అని నిర్ధారించు కున్నపుడు వచ్చే ఆనందం మాటల్లో వర్ణించలేం. ఇది ఈ ప్రపంచంలో ప్రతీ అమ్మాయికీ, మహిళకు అనుభవమే -
నెలసరి సమయంలో నొప్పి సమస్య.. డాక్టర్ పరిష్కారం
నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 77 కేజీలు. పెళ్లయి నాలుగేళ్లయినా, ఇంకా పిల్లలు కలగలేదు. నెలసరి సమయంలో బాగా నొప్పిగా ఉంటుండటంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకున్నాను. యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు చెప్పారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – చంచల, టెక్కలి మీ ఎత్తు 5.2 అంటే, ఈ ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 17 కేజీలు అధికంగా బరువు ఉన్నారు. కొందరిలో కొద్దిగా కండరం లేదా ఫైబ్రస్ టిష్యూ అధికంగా ఎక్కడైనా పెరిగి గడ్డలాగా, కంతుల్లాగ తయారవుతాయి. వాటినే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఏ భాగంలోనైనా పెరగవచ్చు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల సమతుల్యత లోపం, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, అధిక బరువు వంటి కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు. ఇవి 0.5 మిల్లీమీటర్ల సైజు నుంచి 10 సెంటీమీటర్ల సైజు వరకు పెరగవచ్చు. ఇవి ఒకటి నుంచి రెండు మూడు కణితులు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఇవి గర్భాశయం పైన ఉంటే సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మయోమెట్రియమ్ పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటారు. మీకు ఉన్న ఫైబ్రాయిడ్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది వివరించలేదు. నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది. మీకు బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉందా లేక మామూలుగా ఉందా అనే విషయం కూడా తెలియవలసి ఉంది. సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా అధికంగా అవుతుంది. పీరియడ్స్ తొందరగా రావడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు ఉంటాయి. సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి చిన్నగా ఉన్నా, తప్పనిసరిగా వాటికి హిస్టరోస్కోపి మయోమెక్టమీ ద్వారా తొలగించవలసి ఉంటుంది. లేకపోతే అది ఎండోమెట్రియమ్ పొరలో బిడ్డను ఎదగనివ్వకుండా చెయ్యడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే వాటి పరిమాణం 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి, పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండి పిల్లలు కలగకపోతే వాటిని మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. ఒకవేళ వీటి వల్ల గర్భం రాకపోతే, ఇతరత్రా సమస్యలు లేకపోతే అవి తొలగించిన తర్వాత గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటి వల్ల గర్భం నిలవడానికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. అవి మరీ పెద్దగా ఉండి కడుపులో నొప్పి ఇతర ఒత్తిడి సమస్యలు ఉంటేనే తొలగించవలసి ఉంటుంది. మీకు ఇప్పటికే 33 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, మళ్లీ ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా తగిన చికిత్స తీసుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇంకా ఎంత కాలం ఆగాలి? చదవండి: నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? -
ఉరేసుకుని విద్యార్థిని ఆత్మహత్య
బహిష్టు బాధ వల్లే అఘాయిత్యానికి ఒడిగట్టిందంటున్న తల్లిబుద్ధిగా చదువుకుంటుంది.. ఎవ్వరితోనూ మాట్లాడదు.. ఎవరింటికీ వెళ్లదు.. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు.. గొడవలు, ప్రేమ వ్యవహారాలు అసలే తెలియవు. కానీ ఒక సమస్య మాత్రం ఆ చిన్నారిని నెలనెలా చిత్రవధ చేసేది. అప్పుడప్పుడూ తల్లికి చెప్పుకుని తల్లడిల్లేది. చివరికి నొప్పి భరించలేక ఇంట్లో తల్లిదండ్రులు లేని సమయంలో ఉరేసుకుని తనువు చాలించింది. దీనికంతటికీ కారణం.. నెలసరి సమయంలో వచ్చే తీవ్రమైన బాధే కావడం గమనార్హం. మదనపల్లె రూరల్: మదనపల్లె పట్టణం చీకిలిగుట్టలో ఏడో తరగతి చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తీవ్ర సంచలనం కలిగించింది. వివరాల్లోకి వెళితే.. తెట్టు ఆదినారాయణ, సరస్వతమ్మల దంపతుల కుమార్తె లిఖిత(13) స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఆదినారాయణ స్థానికంగా ఓ సైకిల్షాపును నిర్వహిస్తున్నాడు. తల్లి స్థానికంగా ఉన్న ఇళ్లలో పాచి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో లిఖిత మంగళవారం స్కూల్‌కు వెళ్లేందుకు సిద్ధమైంది. తర్వాత ఇంటిలో ఎవరూ లేనిది చూసి తలుపుకు గడిపెట్టి తన తల్లి చీరను ఫ్యాన్‌కు తగి లించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రలు బిడ్డ ఇంటిలో గడిపెట్టుకుని ఉరివేసుకున్న విషయాన్ని గమనించి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఏం జరిగిందో తెలియక గుండెలు బాదుకున్నారు. అల్లారు ముద్దుగా సాకిన బిడ్డ ఇక లేదని తెలిసి కుప్పకూలిపోయారు. సమాచారం అందుకున్న టూటౌన్ సీఐ హనుమంతు నాయక్, ఎస్ఐ గంగిరెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థిని మృతికిగల కారణాలపై ఆరా తీశారు. బహిష్టు సమయంలో వచ్చే బాధవల్లే తన కూరుతు ఈ అఘాయిత్యానికి పాల్పడిందని తల్లి సరస్వతమ్మ తెలిపింది. అనంతరం పంచనామా నిర్వహించి మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.