నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 77 కేజీలు. పెళ్లయి నాలుగేళ్లయినా, ఇంకా పిల్లలు కలగలేదు. నెలసరి సమయంలో బాగా నొప్పిగా ఉంటుండటంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకున్నాను. యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు చెప్పారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు.
– చంచల, టెక్కలి
మీ ఎత్తు 5.2 అంటే, ఈ ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 17 కేజీలు అధికంగా బరువు ఉన్నారు. కొందరిలో కొద్దిగా కండరం లేదా ఫైబ్రస్ టిష్యూ అధికంగా ఎక్కడైనా పెరిగి గడ్డలాగా, కంతుల్లాగ తయారవుతాయి. వాటినే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఏ భాగంలోనైనా పెరగవచ్చు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల సమతుల్యత లోపం, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, అధిక బరువు వంటి కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు. ఇవి 0.5 మిల్లీమీటర్ల సైజు నుంచి 10 సెంటీమీటర్ల సైజు వరకు పెరగవచ్చు. ఇవి ఒకటి నుంచి రెండు మూడు కణితులు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఇవి గర్భాశయం పైన ఉంటే సబ్‌సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మయోమెట్రియమ్ పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటారు.
మీకు ఉన్న ఫైబ్రాయిడ్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏ పొజిషన్‌లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది వివరించలేదు. నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది. మీకు బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉందా లేక మామూలుగా ఉందా అనే విషయం కూడా తెలియవలసి ఉంది. సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా అధికంగా అవుతుంది. పీరియడ్స్ తొందరగా రావడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు ఉంటాయి. సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి చిన్నగా ఉన్నా, తప్పనిసరిగా వాటికి హిస్టరోస్కోపి మయోమెక్టమీ ద్వారా తొలగించవలసి ఉంటుంది. లేకపోతే అది ఎండోమెట్రియమ్ పొరలో బిడ్డను ఎదగనివ్వకుండా చెయ్యడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడతాయి.
ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే వాటి పరిమాణం 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి, పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండి పిల్లలు కలగకపోతే వాటిని మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. ఒకవేళ వీటి వల్ల గర్భం రాకపోతే, ఇతరత్రా సమస్యలు లేకపోతే అవి తొలగించిన తర్వాత గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. సబ్‌సిరీస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటి వల్ల గర్భం నిలవడానికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. అవి మరీ పెద్దగా ఉండి కడుపులో నొప్పి ఇతర ఒత్తిడి సమస్యలు ఉంటేనే తొలగించవలసి ఉంటుంది. మీకు ఇప్పటికే 33 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, మళ్లీ ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా తగిన చికిత్స తీసుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది.
-డా. వేనాటి శోభ
గైనకాలజిస్ట్
హైదరాబాద్
చదవండి: ఇంకా ఎంత కాలం ఆగాలి?
చదవండి: నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా?
Comments
Please login to add a commentAdd a comment