Menstruation
-
Anubhav Dubey: చాయ్ సుట్ట సహృదయం
ప్రముఖ చాయ్ కంపెనీ ‘చాయ్ సుట్ట’ పెయిడ్ మెనుస్ట్రుయేషన్ లీవ్‌ను అమలు చేస్తోంది. ఈ సెలవు గురించి కంపెనీ ఫౌండర్ అనుభవ్ దూబే మహిళా ఉద్యోగులతో నిర్వహించిన చర్చా కార్యక్రమం తాలూకు విషయాలు ఇంటర్నెట్లో వైరల్ అయ్యాయి. చర్చలో పాల్గొన్న వారి నుంచి భిన్నమైన అభిప్రాయాలు వినిపించాయి. కొందరు ‘సెలవు అనివార్యం కాదు’ అన్నట్లుగా మాట్లాడారు. ‘ఆ రోజుల్లో అసౌకర్యంగా ఉంటుంది కాబట్టి సెలవు తప్పనిసరి’ అని కొందరు మాట్లాడారు. చర్చ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకొని ఇండోర్‌కు చెందిన ఎంటర్ప్రెన్యూర్, చాయ్ సుట్ట ఫౌండర్ అనుభవ్ దూబే లింక్డ్ఇన్లో ఇలా రాశారు... ‘భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ ఆరోగ్యకరమైన చర్చ నడిచింది. మెనుస్ట్రువల్ లీవ్ ఇవ్వాలి అనుకోవడం కఠినమైన నిర్ణయం కాదు. కొన్ని విషయాలను స్త్రీలు మాత్రమే అర్థం చేసుకోగలరు’ -
‘కేంద్ర మంత్రి వైఖరి విచారకరం.. మహిళల బాధను విస్మరించారు’
సాక్షి, హైదరాబాద్: మహిళల బాధను కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీ విస్మరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోందని తెలిపారు. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇదని అన్నారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో సెలవులు ఇవ్వాలన్న ప్రతిపాదనను స్మృతీ ఇరానీ వ్యతిరేరించడాన్ని ఆమె తప్పుపట్టారు. కేంద్ర మంత్రి వైఖరి నిరుత్సాహపరిచిందని, మహిళల బాధను కేంద్ర మంత్రి విస్మరించారని ‘ఎక్స్’లో అసహనం వ్యక్తం చేశారు. రుతుక్రమ పోరాటాలను రాజ్యసభలో కేంద్ర మంత్రి కొట్టిపారేయడం విచారకరమని, మహిళల బాధలను స్మృతీ ఇరానీ విస్మరించడం దారుణమని పేర్కొన్నారు. “నెలసరి ఎంపిక కాదు. అది సహజమైన జీవ ప్రక్రియ. వేతనంతో కూడిన సెలవును తిరస్కరించడం అసంఖ్యాకమైన మహిళలు అనుభవిస్తున్న బాధను విస్మరించినట్లే. మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవిక సవాళ్ల పట్ల సానుభూతి చూపకపోవడం విస్తుగొల్పుతోంది. విధానాల రూపకల్పనకు, వాస్తవికతకు మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాల్సిన సమయం ఇది’ అని కవిత తెలిపారు. Disheartened by the Union Minister of Women and Child Development Smriti Irani Ji’s dismissal of menstrual struggles in Rajya Sabha. As a woman, it's appalling to see such ignorance, for our struggles, our journeys isn’t a consolation, it deserves a level playing field and that’s… pic.twitter.com/vj9wbb0A4f — Kavitha Kalvakuntla (@RaoKavitha) December 15, 2023 గురువారం జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి.. నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాద అన్నారు. నెలసరికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదని పేర్కొన్న విషయం తెలిసిందే. చదవండి: నెలసరి లీవ్ అవసరం లేదు -
హాట్‌టాపిక్‌గా 'పీరియడ్ లీవ్'! 'మాకొద్దు' అని వ్యతిరేకించటానికి రీజన్!
ప్రస్తుతం దేశంలో 'పీరియడ్ లీవ్' గురించే ప్రముఖులు, సెలబ్రెటీలు చర్చిస్తున్నారు. ఎక్కడ చూసినా ఇది ఒక హాట్‌టాపిక్‌గా సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. పైగా అందరూ ముక్తకంఠంతో పీరియడ్ లీవ్‌ని వ్యతిరేకించడమే ఆసక్తికరంగా మారింది. దీనికి సెలబ్రెటీలు, ప్రముఖులు మద్దతు ప్రకటించడం మరింత ఆసక్తిని రేకెత్తించే అంశం. ఎందుకిలా వ్యతిరేకిస్తున్నారు. ఇంతకీ "పీరియడ్ లీవ్" అవసరమా? లేదా ఎందుకు వద్దు..? తదితరాల గురించే ఈ కథనం!. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రభుత్వాలు, సంస్థలు నెలసరి సెలవులు(menstrual leave) ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ విషయమై పార్లమెంట్లో చర్చ జరుగుతోంది. ఈ పీరియడ్ సెలవు అంశమై నివేదిక కూడా పెట్టారు. ఈ విషయంపై కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో స్పందించి ధీటుగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రతిపాదనను ఆమె గట్టిగా వ్యతిరేకించారు. మహిళకు నెలసరి అనేది వైకల్యం కాదు. స్త్రీ జీవితంలో జరిగే సహజ ప్రక్రియ. అందుల్ల ఈ నెలసరి సెలవులు (menstrual leave ).. పని ప్రదేశంలో వివక్షకు దారితీసే ప్రమాదం ఉంటుందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. WCD Minister @smritiirani sums it up perfectly - "Menstruation is not a handicap!" Menstrual leave demand by pseudo-feminists will infact put females at a disadvantage as compared to a males. As a woman, I personally don't expect any special treatment. Gender equality, please! pic.twitter.com/14NYcwZFMs — Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) December 14, 2023 ఈ అంశంపై సోమవారం పార్లమెంట్లో నివేదక కూడా పెట్టారు. దీంతో బుధవారం రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకుడు మనోజ్ ఝా ఎగువ సభలో రుతుక్రమ పరిశుభ్రత విధానంపై, సెలవులపై ప్రశ్నలు లేవనెత్తడంతో స్మృతి ఈ విధంగా స్పందించారు. ఐతే ఇప్పటి వరకు పిరియడ్ సెలవులు తప్పనసరి చేసే ప్రతిపాదన ఏదీ ప్రభుత్వ పరిశీలనలో లేదు. స్మతీ ఇరానీ మాత్రం ఈ సెలవులను వ్యతిరేకిస్తున్నారు. దీని కోసం పోరాడి కష్టపడి సంపాదించకున్న సమానత్వాన్ని విలువ ఉండదని అన్నారు. అంతేగాదు దీన్ని ప్రత్యేక నిబంధనలు అవసరమయ్యే వికలాంగులు కోణంలో పరిగణించకూడదని చెప్పారు. ఐతే కొద్దిమంది మహిళలు మాత్రమే ఈ టైంలో డిస్మెనోరియా వంటి సమస్యలు ఉత్ఫన్నమవుతాయని, వీటిని చాలా వరకు మందుల ద్వారా నయంచేసుకోవచ్చని అన్నారు. అలాగే నెలసరి సమయంలో పాటించాల్సిన శుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించినట్లు కూడా చెప్పారు. దీనిలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ ముసాయిదా తీర్మానాన్ని రూపొందించిందని ప్రకటించారు. దీని ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడమే లక్ష్యమని నొక్కి చెప్పారు. ఇదే క్రమంలో, 10 నుంచి 19 ఏళ్లలోపు యుక్తవయస్సులో ఉన్న బాలికల కోసం ప్రస్తుతం అమలులో ఉన్న 'ప్రమోషన్ ఆఫ్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ (MHM)' పథకం గురించి కూడా ప్రస్తావించారు. అందరూ ఈ పీరియడ్స్‌ని సాధారణ దృక్పథంతో చూస్తే చాలు అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు మంజూరు చేయాల్సిన అవసరం లేదని అన్నారు. స్మృతి అభిప్రాయంతో పలువురు సెలబ్రెటీ మహిళలు ఏకీభవించి మద్దతు పలకడం విశేషం. కొద్దిమంది మహిళలు మాత్రమే డిస్మెనోరియా వంటి సమస్యలతో బాధపడుతుంటారు. చాలా వరకు ఇలాంటి సమస్యలను మందుల ద్వారా నయంచేసుకోవచ్చ We have fought for centuries for equal opportunities & women's rights and now, fighting for period leave might set back the hard-earned equality. Imagine employers factoring in 12-24 fewer working days for female candidates. A better solution? Supporting work from home for… — Ghazal Alagh (@GhazalAlagh) December 14, 2023 మహిళ చేయలేనిది ఏదీ లేదు..! ప్రముఖ బ్యూటీ బ్రాండ్ మామా ఎర్త్ సహ వ్యవస్థాపకుడు గజల్ అలగ్ మాట్లాడుతూ..స్మృతి పీరియడ్ లీవ్‌కి బదులుగా మెరుగైన పరిష్కారం సూచించారని ప్రసంసించారు. మహిళలు తాము ఏ పనై అయినా చేయగలమని నిరూపించారు. ఈ ఒక్క కారణంతో వారి సమానాత్వపు హక్కులను కాలరాయకూడదన్న ఆలోచన బాగుందని అన్నారు. అలాగే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం స్మృతికి మద్దతు తెలిపారు. మానవజాతి చరిత్రలో ఒక్క పని కూడా చేయని మహిళ లేదు. పిల్లలను పెంచడం దగ్గర నుంచి వ్యవసాయం వరకు అన్నిపనులు చేస్తూనే ఉన్నారు. ఈ పీరియడ్స్ అనేది జస్ట్ శరీరంలో వచ్చే ఓ నిర్దిష్ట వైద్య పరిస్థితే తప్ప అందుకోసం చెల్లింపుతో కూడిన సెలవులు అవసరం లేదంటూ స్మృతి అభిప్రాయంతో ఏకీభవించారు కంగనా. సరికొత్త మార్పు.. ఇదంతా చూస్తుంటే మహిళా సాధికారతకు అసైలన అర్థం ఏంటో చెప్పారు. మాకు దయాదాక్షిణ్యాలతో పనిలేదు. ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటే చాలు. సాటి మనుషులుగా ఒకరి బాధను అర్థం చేసుకుంటే చాలు తప్ప మాకదంతా అవసరంలేదని మహిళ ఆత్మివిశ్వాసాన్ని, ఔన్యత్యాన్ని చాటి చెప్పారు. ఒకరకంగా చెప్పాలంటే పురిటినిప్పిని పంటి కింద భరించగలిగే శక్తి ఉన్న స్త్రీకి ఇది ఒక లెక్క కాదు అని తేల్చి చెప్పింది. విమన్ పవర్ ఏంటో? వారి పంచ్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు కదా. ద టీజ్ విమెన్ అని మరోసారి బల్లగుద్ది చెప్పారు. ఈ పేరుతో మా అవకాశాలను లాక్కొవద్దని, తాము ఎందులోనూ తక్కువ కాదు జస్ట్ ప్రకృతి సిద్ధంగా వచ్చే చిన్న ప్రక్రియ అని అందరూ తెలుసుకోండి తామెంటో చూపిస్తామని సగర్వంగా చెబుతున్నారు మహిళామణులు. -
నెలసరి లీవ్ అవసరం లేదు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు నెలసరి రోజుకు వేతనంతో కూడిన సెలవుదినంగా కొన్ని దేశాల్లో పాటిస్తున్నారు. భారత్‌లోనూ మహిళా ఉద్యోగులకు నెలసరికి పెయిడ్ లీవ్ ఇవ్వాలన్న డిమాండ్ పెరిగిన నేపథ్యంలో కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఒక స్పష్టతనిచ్చారు. జనతాదళ్(యూ) సభ్యుడు మనోజ్ కుమార్ ఝా రాజ్యసభలో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా స్మృతి వివరణ ఇచ్చారు. ‘‘ నెలసరి అనేది మహిళల జీవితంలో ఒక సహజ ప్రక్రియ. అదేం వైకల్యం కాదు. దీనికి ప్రత్యేకంగా వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించాల్సిన అవసరం లేదు. నెలసరిని ప్రత్యేక సెలవు ఇవ్వాల్సిన సందర్భంగా పరిగణించకూడదు. నెలసరిని ఒక ఆటంకంగా కూడా భావించకూడదు. ఒకవేళ ఉద్యోగినులకు ఒక పెయిడ్ లీవ్ ఇస్తే తోటి పురుషులు తమకు ఒక సెలవు లభించలేదే అని భావించి పని ప్రదేశాల్లో వివక్షపూరిత వాతావరణం నెలకొనే ప్రమాదం ఉంది’’ అని ఇరానీ వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా నెలసరి శుభ్రత విధాన ముసాయిదాను కేంద్రం తీసుకొచి్చందని ఆమె గుర్తుచేశారు. 10–19 ఏళ్ల టీనేజర్లలో నెలసరి శుభ్రతపై అవగాహన పెంచేందుకు కేంద్రం ఇప్పటికే ప్రత్యేక పథకాన్ని అమలుచేస్తోందని ఆమె వెల్లడించారు. మరోవైపు, ‘‘నెలసరి రోజుల్లో చాలా మంది ఉద్యోగినులు ఇబ్బందులు పడుతూ అది పని ప్రదేశాల్లో ఉత్పత్తిపై ప్రభావం చూపుతోంది. వీరికి నెలసరి సెలవు లేదా సిక్ లీవ్ లేదా నెలకో సంవత్సరానికో సగం వేతనంతో కూడిన సెలవు ఇవ్వొచ్చు’’ అని సిబ్బంది, శిక్షణ వ్యవహారాలు, న్యాయ, సాధికారత వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒక నివేదికలో పేర్కొనడం గమనార్హం. -
ఇది మూణ్ణాళ్ళ కథ కాదు!
ప్రజల ఆరోగ్యం విషయంలోనూ పాలకులకు న్యాయస్థానాలు గడువు విధించాల్సి రావడం విచిత్రమే. అయితే, ఇప్పటికే అదే పనిలో ప్రభుత్వముంటే, త్వరితగతిన పనులు జరగడానికి ఈ గడువు విధింపు తోడ్పడుతుందనడంలో సందేహం లేదు. శానిటరీ న్యాప్కిన్ల పంపిణీపై దృష్టి పెడుతూ, జాతీయ స్థాయిలో ‘వాంఛనీయ’ ఋతుస్రావ కాల ఆరోగ్య విధానాన్ని 4 వారాల్లో ఖరారు చేయాలంటూ సుప్రీమ్ కోర్ట్ గత సోమవారం అన్నమాట అలాంటిదే. ప్రభుత్వ ఎయిడెడ్, రెసిడెన్షియల్ పాఠశాలల్లో సగటున ఎంతమంది ఆడపిల్లలకు ఎన్ని మరుగుదొడ్లు ఉండాలన్న దానిపైనా జాతీయ స్థాయిలో ఒక మోడల్‌ను నిర్ణయించాల్సిందిగా కోర్ట్ ఆదేశించింది.దాదాపు 37.5 కోట్ల మంది ఋతుస్రావ వయసువారున్న దేశంలో... 2011 నుంచి పెండింగ్‌లో ఉన్న కేసులో... దేశ ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ధర్మాసనం ఇచ్చిన ఈ ఆదేశం మహిళా లోకానికి కొంత ఊరట. ఋతుస్రావ ఆరోగ్య ప్రాధాన్యాన్ని కోర్ట్ గుర్తించడం, ప్రస్తావించడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో అనేకసార్లు ఆ పని చేసింది. పట్టని ప్రభుత్వాలకు అక్షింతలు వేసింది. ఏడు నెలల క్రితం ఏప్రిల్‌లో కూడా ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యంలో స్పందిస్తూ, ఋతుకాలపు ఆరోగ్యంపై ఏకరూప జాతీయ విధాన రూపకల్పనకు కేంద్రాన్ని సుప్రీమ్ ఆదేశించింది. తాజాగా, కోర్ట్‌లో ప్రభుత్వ వకీలు పేర్కొన్నట్టు జాతీయ విధానం ముసాయిదాను కేంద్రం ఇటీవలే ఆన్లైన్లో పెట్టింది. సామాన్య ప్రజల మొదలు నిపుణుల దాకా అందరి అభిప్రాయాలు కోరింది. తద్వారా ఋతుస్రావం పట్ల తరతరాలుగా మన దేశంలో నెలకొన్న అనేక అపోహలనూ, సవాళ్ళనూ నిర్వీర్యం చేయాలన్నది ప్రయత్నం. అర్ధంతరంగా బడి చదువు మానేయడం సహా అనేక సమస్యలకు కారణమవుతున్న ఈ ఆరోగ్య అంశం పట్ల దృష్టి పెట్టడానికి స్వతంత్ర దేశంలో ఏడున్నర దశాబ్దాలు పట్టింది. అలాగని అసలేమీ జరగలేదనలేం. కొన్నేళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా ఋతుస్రావ కాల ఆరోగ్యం, పరిశుభ్రత (ఎంహెచ్‌హెచ్) పట్ల దృష్టి పెరుగుతోంది. భారత్‌లో సైతం ప్రజారోగ్య చర్చల్లో ఈ అంశాన్ని భాగం చేశారు. ‘జాతీయ ఆరోగ్య మిషన్ 2011’లో గ్రామీణ ప్రాంతాల్లోని కౌమార బాలికల్లో ఋతుస్రావ కాలపు ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో దీన్ని చేర్చారు. కేంద్ర తాగునీటి, పారిశుద్ధ్య శాఖ సైతం 2015లోనే పాఠశాలలకు మార్గ దర్శకాలు జారీచేసింది. దాని ఫలితాలు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల్లో కొంత కనిపించాయి. పీరియడ్స్ వేళ ఆరోగ్యకర మైన పద్ధతులను పాటించడమనేది మునుపటి సర్వేతో పోలిస్తే, అయిదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో 15 నుంచి 24 ఏళ్ళ వయసు యువతుల్లో 20 శాతం పెరిగింది. ఇది కొంత సంతోషకరం. పైగా, ఐరాస పేర్కొన్న సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో ఎంహెచ్‌హెచ్ కూడా ఒకటనేది గమనార్హం. నిజానికి, ఆంధ్రప్రదేశ్‌లో ‘స్వేచ్ఛ’, కేరళలో ‘షీ ప్యాడ్’, రాజస్థాన్‌లో ‘ఉడాన్’ ఇలా రకరకాల పేర్లతో వివిధ రాష్ట్రాలు కౌమార బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లను పంపిణీ చేస్తున్నాయి. దీర్ఘకాలిక వినియోగ నిమిత్తం కేరళ, కర్ణాటకలు న్యాప్కిన్లకు బదులు ఋతుస్రావ కప్స్ అందిస్తున్నాయి. అయితే, సమాజంలోని దురభిప్రాయాలను పొగొట్టడమనే సవాలు మిగిలే ఉంది. పన్నెండేళ్ళ సోదరి దుస్తుల మీద ఉన్న తొలి ఋతుస్రావ రక్తపు మరకలను చూసిన ఓ అన్నయ్య ఆమెను అనుమానించి, కొట్టి చంపిన ఘటన ఆ మధ్య మహారాష్ట్రలో జరిగింది. ఆడవారికే కాక, మగవారికి సైతం పీరియడ్స్ పట్ల అవగాహన పెంచాలంటున్నది అందుకే. ‘ఆ 3 రోజులు’ ఆడవారిని ప్రాథమిక వసతులైనా లేని గుడిసెల్లో విడిగా ఉంచే మహారాష్ట్ర తరహా అమానుష పద్ధతుల్ని మాన్పించడం లక్ష్యం కావాలి. ఋతుక్రమం అపవిత్రత కాదనీ, శారీరక జీవప్రక్రియనీ గుర్తెరిగేలా చేయాలి. తగిన ఎంహెచ్‌హెచ్ వసతులు లేకపోవడంతో ఏటా మన దేశంలో 2.3 కోట్ల మందికి పైగా బాలికలు అర్ధంతరంగా బడి చదువులు మానేస్తున్నట్టు సర్వేల మాట. సరిగ్గా చదువుకోని వారు ఋతుస్రావ ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపలేకపోతున్నారన్నది దాని పర్యవసానం. అంటే, ఇది ఒక విషవలయం. దీన్ని ఛేదించాలి. బడిలో వసతులు పెంచడంతో పాటు జాతీయ విధానం ద్వారా ఆరోగ్యంలో, సామాజిక అనాచారాలను మాన్పించడంలో టీచర్లు కీలక పాత్ర పోషించేలా తగిన శిక్షణనివ్వాలి. విధానాల నిర్ణయం, కార్యక్రమాల రూపకల్పనలో తరచూ ఓ పొరపాటు చేస్తుంటారు. యువతుల మీదే దృష్టి పెట్టి, ఋతుక్రమం ఆగిపోయిన లక్షలాది మహిళల ఆరోగ్యాన్ని విస్మరిస్తుంటారు. అది మారాలి. మెనోపాజ్ అనంతర ఆరోగ్యం, అపోహల నివృత్తిపైనా చైతన్యం తేవాలి. ఆరోగ్య కార్యకర్తలకు అందుకు తగ్గ శిక్షణనివ్వాలి. ప్యాడ్ల పంపిణీతో బాధ్యత ముగిసిందను కోకుండా సంక్లిష్ట సామాజిక అంశాలపై జనచైతన్యం ప్రధానాంశం కావాలి. ఇన్నేళ్ళకు ఒక జాతీయ విధానం తేవడం విప్లవాత్మకమే కానీ దానితో పని సగమే అయినట్టు! గ్రామప్రాంతాల్లోనూ అందరికీ అందుబాటు ధరలో న్యాప్కిన్లుండాలి. శుభ్రమైన మరుగుదొడ్లు, నీటి వసతి బడిలో భాగం కావాలి. ఆరోగ్యం, ఆచారం లాంటి అంశాల్లో తరతరాలుగా సమాజంలో నెలకొన్న అభిప్రాయాలను పోగొట్టడం సులభం కాకపోవచ్చు. కానీ, అందుకు ప్రయత్నించకపోతే నేరం, ఘోరం. ఋతుస్రావ ఆరోగ్యంపై చైతన్యం తేవడంలో భారత్ మరింత ముందడుగు వేసేందుకు సత్వర జాతీయ విధానం తోడ్పడితే మేలు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సైతం ఏళ్ళు పూళ్ళు తీసుకొని, మరో అయిదేళ్ళ తర్వాత అమలు అంటున్న పాలక వర్గాలు ఆకాశంలో సగమనే ఆడవారి తాలూకు శారీరక, మానసిక ఆరోగ్యం గురించి వెంటనే పట్టించుకుంటే అదే పదివేలు. -
యూపీ స్కూల్ టీచర్
లక్నో: నిరుపేద యువతులు, మహిళల్లో రుతుస్రావంలో పరిశుభ్రతపై అవగాహన పెంచడానికి ఉత్తరప్రదేశ్‌లో ఒక స్కూలు టీచర్ వినూత్న ప్రయత్నం చేస్తున్నారు. తన సొంత డబ్బులతో ‘‘ప్యాడ్ బ్యాంక్’’ను ఏర్పాటు చేసి గ్రామంలో అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు. బరేలి జిల్లా బొరియా బ్యాంకులో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పని చేస్తున్న రాఖీ గంగ్వార్ తమ ఊళ్లో యుక్త వయసుకి వచి్చన అమ్మాయిలు, మహిళలు రుతుస్రావం సమయంలో ఇంకా పాతకాలం పద్ధతుల్లో బట్టలనే వాడడం పట్ల ఆవేదనతో ఉండేవారు. వారిలో శానిటరీ ప్యాడ్స్‌పై అవగాహన పెంచడానికి స్కూల్లోనే ప్యాడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. తన సొంత డబ్బుతో ప్యాడ్స్ కొని ఆ బ్యాంకులో ఉంచుతున్నారు. అవి వాడడానికి ముందుకొచి్చన వారికి ఉచితంగా ఇస్తూ ఎలా వాడాలో నేరి్పస్తూ వారిలో అవగాహన పెంచుతున్నారు. మే 15న మదర్స్ డే సందర్భంగా ఈ బ్యాంక్ ప్రారంభించారు. మొదట్లో శానిటరీ ప్యాడ్స్ వాడడానికి ఎవరూ ముందుకు రాలేదు. కానీ ఆ సమయంలో పరిశుభ్రత గురించి వివరంగా చెప్పాక ఒక్కొక్కరు వచ్చి ప్యాడ్స్ తీసుకోవడం మొదలు పెట్టారు. అలా ప్రస్తుతం ప్రతీ నెలా 150 వరకు మహిళలు ప్యాడ్ బ్యాంక్‌కి వస్తున్నారని రాఖీ గంగ్వార్ వివరించారు. -
Smriti Irani: ఆ అయిదు రోజులు... అయితే ఏంటీ!
మెనుస్ట్రుయేషన్కు సంబంధించిన విషయాలు బహిరంగంగా మాట్లాడడానికి సంకోచించే రోజుల్లో, శానిటరీ యాడ్స్‌లో నటించడానికి నటీమణులు ససేమిరా అనే రోజుల్లో కెరీర్ తొలి అడుగుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్ లో నటించింది స్మృతి ఇరానీ. అది తన తొలి యాడ్. ‘అది ఫ్యాన్సీ యాడ్ కాదు. వదిలేయ్’ ‘ఈ యాడ్ చేస్తే తక్కువ చేసి చూస్తారు. నటిగా అవకాశాలు రావు’ అని అందరూ భయపెట్టారు. కానీ వాటిని పట్టించుకోకుండా ఆ యాడ్‌లో నటించింది స్మృతి. 25 సంవత్సరాల క్రితం నాటి ఆ వీడియోను స్మృతి ఇరానీ(ప్రస్తుతం కేంద్రమంత్రి) ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తే వైరల్ అయింది. ఆ వీడియోలో... పీరియెడ్స్, వాటిపై ఉండే అపోహలు... మొదలైన వాటి గురించి స్మృతి ఇరానీ మాట్లాడింది. ‘ఆ అయిదు రోజులు. అయితే ఏంటీ? పీరియెడ్స్ అంటే వ్యాధి కాదు. ప్రతి మహిళకు ఉండే సహజ లక్షణం. నేను, మా అమ్మ, మీరు... లక్షలాదిమంది భారతీయ మహిళల కోసం శానిటరీ ప్యాడ్లు ఉన్నాయి...’ అంటూ సాగే స్మృతి మాటలకు ఆ రోజుల్లో ఎలాంటి స్పందన వచ్చిందో తెలియదుగానీ ఇప్పుడు మాత్రం వైరల్ అవుతోంది. ‘ఇది తప్పనిసరిగా గుర్తుచేసుకోదగిన జ్ఞాపకం’ అని తన వీడియో గురించి కాప్షన్ రాసింది స్మృతి ఇరానీ. ‘ఈరోజుల్లో శానిటరీ ప్యాడ్ యాడ్లు చేయడానికి నటీమణులు సంకోచించడం లేదు. కాని ఆరోజుల పరిస్థితి వేరు. ఆ రోజులు నాకు ఇంకా బాగా గుర్తు ఉన్నాయి. పీరియెడ్స్ గురించి మాట్లాడడానికి ఇబ్బంది పడే రోజుల్లో ధైర్యంగా స్మృతి ఆ యాడ్ చేయడం అభినందనీయం’ అంటూ ఒక యూజర్ కామెంట్ సెక్షన్లో స్పందించారు. -
Pureathon 2022: ప్రతి ఒక్కరికి రుతుక్రమంపై అవగాహన అవసరం.. అందుకే ఈ పరుగు
Menstruation Awareness 2K 5K Run: మహిళల్లో రుతుక్రమం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని డాక్టర్ మంజుల అనగాని, టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ అన్నారు. ప్యూరథాన్ పేరుతో ఈ నెల 9న పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించబోయే అవగాహన 2కే, 5కే రన్ సన్నాహక సమావేశాన్ని బంజారాహిల్స్‌లోని బ్లూ ఫాక్స్ హోటల్లో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ మంజుల అనగాని, హీరో సందీప్ కిషన్, దర్శకుడు మెహర్ రమేష్, నటి ఝన్సీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మంజుల అనగాని మాట్లాడుతూ ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బహిష్టు సమయంలో బాలికలను, మహిళలను అంటరాని వారుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదన్న ఆమె.. మహిళల్లో రుతుక్రమం అనేది సర్వసాధారణమైన విషయమని ప్రతి తల్లి తమ ఇంట్లో ఉన్న భర్త, అన్న, తమ్ముడు, కుమారుడు ఇలా అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ విషయం గురించి అవగాహన లేకపోవడం వల్ల ఎంతో మహిళలు బహిష్టు సమయంలో సరైన రక్షణ చర్యలు లేక అనారోగ్యాల బారిన పడి మరణిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయని అనగాని మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఇంట్లో మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యపై పీపుల్ ఫర్ అర్బన్ అండ్ రూరల్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు శైలా తాళ్లూరి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. రుతుక్రమం వచ్చినప్పడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన ఉదయం 6 గంటలకు నిర్వహించబోయే 2కే, 5కే రన్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ రన్లో ఆర్టీసీ ఎండి సజ్జనార్‌తో, రాకొండ సీపీ మహేష్‌భగవత్, హీరోయిన్ కీర్తి సురేష్, సినీ నటుడు సత్యదేవ్, సింగర్ సిద్ శ్రీరామ్, సంగీత దర్శకుడు ఎస్ఎస్ థమన్ పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అపోలో వైద్యురాలు షర్మిలా పెండ్యాల, సామాజిక వేత్త పార్వతి సుదర్శన్, ప్రేమా సుదర్శన్, ట్రాన్స్‌జెండర్ రచన పాల్గొన్నారు. చదవండి: Health Tips: అధిక రక్తపోటు ప్రాణాలకు కూడా ముప్పే! వీటిని తరచుగా తిన్నారంటే.. -
మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం.. ప్రమాదకర లక్షణమా?
నా వయసు 20 ఏళ్లు. ఎత్తు 5.4, బరువు 77 కిలోలు. పీసీఓడీ ఉన్నట్లు పరీక్షల్లో తేలింది. టాబ్లెట్లు వేసుకుంటే తప్ప పీరియడ్స్ రావడం లేదు. గడ్డంపై, పైపెదవి మీద వెంట్రుకలు వస్తున్నాయి. నా సమస్యకు తగిన చికిత్స సూచించగలరు. – మౌనిక, పిడుగురాళ్ల మీ ఎత్తు 5.4 అడుగులు. ఈ ఎత్తుకు గరిష్ఠంగా 60 కిలోల వరకు బరువు ఉండవచ్చు. కానీ మీరు 77 కిలోలు ఉన్నారు. అంటే, 17 కిలోలు అధిక బరువుతో ఉన్నారు. అధిక బరువుతో పాటు పీసీఓడీ సమస్య కూడా ఉందంటున్నారు. పీసీఓడీ సమస్యలో గర్భాశయానికి ఇరువైపులా ఉండే అండాశయాలలో నీటిబుడగలు ఏర్పడటం, మగవారిలో ఎక్కువగా ఉండే ఆండ్రోజన్ హార్మోన్లు వీరిలో ఎక్కువగా విడుదలవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏర్పడటం, వాటి ప్రభావం వల్ల పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, ముఖంపై అవాంఛిత రోమాలు, జుట్టు అధికంగా ఊడిపోవడం, మొటిమలు రావడం వంటి సమస్యలు ఏర్పడతాయి. మీ సమస్యకు చికిత్సలో ముఖ్యమైన భాగం బరువు తగ్గడమే! రోజూ కనీసం అరగంటైనా వాకింగ్, యోగా, ఏరోబిక్స్ వంటి వ్యాయామాలు చేస్తూ, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉంటూ, మితంగా పోషకాహారం తీసుకుంటూ బరువు తగ్గడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఆండ్రోజెన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గి, హార్మోన్లు సక్రమంగా పనిచేసి, పీరియడ్స్ సక్రమంగా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మరీ మందులు వాడితేనే పీరియడ్స్ వచ్చే పరిస్థితి కాకుండా, కనీసం రెండు నెలలకైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. బరువు తగ్గడంతో పాటు డాక్టర్‌ను సంప్రదిస్తే, హార్మోన్ల అసమతుల్యతను బట్టి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడం ద్వారా ఆండ్రోజన్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గించడానికి అవసరమైన మందులతో పాటు అవసరమైతే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు కలిసి ఉండే కొన్ని రకాల కాంట్రాసెప్టివ్ పిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. బరువు తగ్గుతూ, మందులు వాడుతూ ఇప్పటికే ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి డెర్మటాలజిస్టును సంప్రదించి లేజర్ వంటి చికిత్సలు తీసుకోవచ్చు. కొందరిలో కేవలం బరువు తగ్గడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా వచ్చి, అవాంఛిత రోమాలు ఇంకా ఎక్కువగా పెరగకుండా ఉంటాయి. నా వయసు 60 ఏళ్లు. రుతుక్రమం ఆగిపోయి దాదాపు పదేళ్లవుతోంది. ఆరునెలలుగా మూత్రానికి వెళ్లేటప్పుడు అప్పుడప్పుడు కొద్దిగా రక్తస్రావం కనిపిస్తోంది. ఇదేమైనా ప్రమాదకర లక్షణమా? నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – ప్రభావతి, ఒంగోలు మూత్రానికి వెళ్లేటప్పుడు రక్తస్రావం మూత్రంలో పడుతోందా లేక యోనిభాగం నుంచి వస్తోందా అనేది స్పష్టంగా తెలియాల్సి ఉంది. మూత్రంలో ఇన్ఫెక్షన్లు, మూత్రాశయంలో కంతులు, రాళ్లు, కిడ్నీ సమస్యలు వంటి ఇతర కారణాల వల్ల మూత్రంలో రక్తం పడవచ్చు. పీరియడ్స్ ఆగిపోయిన తర్వాత మళ్లీ రక్తస్రావం అవడాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. దీనికి అనేక కారణాలు ఉంటాయి. కొందరిలో ఈస్ట్రోజన్ హార్మోన్ పూర్తిగా తగ్గిపోయి, యోనిభాగం పూర్తిగా పొడిబారిపోయి, ఇన్ఫెక్షన్స్ ఏర్పడి కొద్దిగా బ్లీడింగ్ కనిపించవచ్చు. కొందరిలో గర్భాశయంలో కంతులు, గర్భాశయ పొర మందంగా ఏర్పడటం, గర్భాశయ క్యాన్సర్లు, గర్భాశయ ముఖద్వారం దగ్గర పుండ్లు, కండ పెరగడం (సర్వైకల్ పాలిప్స్), సర్వైకల్ క్యాన్సర్, అండాశయాలలో కంతులు వంటి అనేక కారణాల వల్ల పోస్ట్‌మెనోపాజల్ బ్లీడింగ్ రావచ్చు. మీకు రక్తస్రావం ఎందుకు వస్తుందో తెలుసుకోవడానికి, చికిత్సలు తీసుకోవడానికి ఒకసారి గైనకాలజిస్టును సంప్రదిస్తే, వారు అల్ట్రాసౌండ్, ట్రాన్స్‌వజైనల్ స్కానింగ్, ప్యాప్‌స్మియర్ వంటి పరీక్షలు చేయించి, సమస్యను బట్టి గర్భాశయ పొర మందంగా ఉండటం లేదా పాలిప్ వంటివి ఉండటం గుర్తిస్తే, దానికి డీ అండ్ సీ చేసి, గర్భాశయాన్ని శుభ్రపరచి తీసిన ముక్కలను బయాప్సీకి పంపించి, ఆ రిపోర్టును బట్టి క్యాన్సరా కాదా అనేది నిర్ణయించి, గర్భాశయం తొలగించడం అవసరమా లేదా అనేది నిర్ణయించి, తగిన చికిత్స అందిస్తారు. కొందరిలో గర్భాశయ ముఖద్వారం దగ్గర కండపెరగడం వల్ల బ్లీడింగ్ జరుగుతుంది. అలాంటప్పుడు అదనంగా పెరిగిన కండను తొలగిస్తే సరిపోతుంది. కొందరిలో ఇన్ఫెక్షన్ల వల్ల, గర్భాశయంలో నీరు చేరడం వల్ల బ్లీడింగ్ కావచ్చు. వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తే సరిపోతుంది. కొందరికి ఎండోమెట్రియమ్ పొరలో కండ పెరగడం వల్ల ఏర్పడే పాలిప్స్‌ను హిస్టరోస్కోపీ అనే పద్ధతి ద్వారా గర్భాశయం లోపలికి చూస్తూ, పాలిప్‌ను తొలగించి, బయాప్సీకి పంపడం జరుగుతుంది. అది సాధారణ పాలిప్ అని బయాప్సీలో తేలితే వేరే చికిత్స అవసరం ఉండదు. ఒకవేళ క్యాన్సర్‌కు సంబంధించినదని తేలితే, గర్భాశయాన్ని తొలగించడం జరుగుతుంది. -డా.వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ -
స్విగ్గీ చేసింది.. ఆమెకు అండగా... ఆరోజులలో సెలవు!
గతంలో జొమాటో తన డెలివరీ విమెన్‌కు సంవత్సరంలో 10 రోజుల బహిష్టు సెలవు ప్రకటించింది. ఆ సెలవులకు జీతం స్పష్టత లేదు. కాని స్విగ్గీ తన డెలివరీ విమెన్‌కు ప్రతి నెల రెండు రోజుల వేతన సెలవు ప్రకటించింది. అసంఘటిత రంగాలలో ఎందరో స్త్రీలు డెయిలీ వేజెస్ మీద పని చేస్తున్నారు. వారికి బహిష్టు సమయంలో రెండు రోజుల వేతన సెలవు ఎందుకు ఇవ్వకూడదు? స్విగ్గీ చేసిన ఆలోచన ఎందుకు చేయకూడదు? ఇంట్లో పనిమనిషిని అందరూ పెట్టుకుంటారు. రోజుకు రెండుపూట్ల రమ్మంటారు కొందరు. ఒకపూట చాలంటారు కొందరు. రోజూ పని చేయిస్తారు కొందరు. ఆదివారం రానక్కర్లేదు అంటారు మరికొందరు. పనిమనిషి అప్పుడప్పుడు పనికి రాదు. పోనీలే అని మొత్తం జీతం ఇస్తారు కొందరు. రాని రోజులకు జీతం కట్ చేస్తారు ఇంకొందరు. రాని రోజులకే జీతం కట్ చేసేవాళ్లు ఆమె బహిష్టు సమయంలో నలతగా అనిపించో, నొప్పిగా అనిపించో, చిరాగ్గా ఉండో, నీరసం వల్లో పనికి రానంటే జీతం ఇస్తారా? కాని ఇస్తే ఎంత బాగుంటుంది. ఆ ఇంటి యజమానురాలు ఏ ఆఫీస్‌లో అయినా పని చేస్తూ ఉంటే బహిష్టు సమయంలో సెలవు పెట్టుకుంటే ఆమె జీతం ఆమెకు వస్తుంది. కాని పనిమనిషికి రాదు. ఇది సబబా? పని మనిషి వరకూ అక్కర్లేదు. ఫ్యాక్టరీల్లో డెయిలీ లేబర్ ఉంటారు. భవన నిర్మాణరంగంలో స్త్రీలు ఉంటారు. బట్టల షోరూముల్లో, మాల్స్‌లో పని చేసే స్త్రీలు ఉంటారు. వీరందరికీ వారానికి సగం రోజు మాత్రమే సెలవు ఇచ్చేవారున్నారు. ఇక నెలలో ఏ రోజు రాకపోయినా ఆ రోజు జీతం కట్. వీరందరూ బహిష్టు సమయంలో కష్టమయ్యి సెలవు పెడితే ఆ రెండుమూడు రోజుల పాటు డబ్బు నష్టపోవాల్సిందే. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? కాని ఫుడ్ డెలివరీ సంస్థ ‘స్విగ్గీ’ రెండు రోజుల క్రితం అందరి చూపు ఆకర్షించింది. దాదాపు 45 నగరాల్లో 45,000 హోటళ్ల నుంచి నెలకు 20 లక్షల ఆహార ఆర్డర్లు సరఫరా చేసే ఈ సంస్థకు దాదాపు లక్షన్నర మంది ఫుడ్ డెలివరీ పార్టనర్స్ (బాయ్స్/గర్ల్స్) ఉన్నారు. వారిలో 1000 మంది ఫుడ్ డెలివరీ విమెన్ ఉన్నారు. ఈ సంఖ్యను 2000కు పెంచాలని స్విగ్గీ అనుకుంది కాని కరోనా వల్ల ఆ భర్తీ మందగించింది. అయితే ఇప్పుడు ఆ సంస్థ తన ఫుడ్ డెలివరీ విమెన్‌కు నెలలో రెండు రోజుల వేతన సెలవును ఇస్తున్నట్టు ప్రకటించింది. అంటే ఆ రెండురోజులు వాళ్లు రెగ్యులర్‌గా కనిష్టంగా రోజువారీ ఎంత కమీషన్ పొందుతారో అంత కమీషన్ వారికి ఇస్తారు. ‘నాకు పిరియెడ్స్. రెండు రోజులు సెలవు కావాలి’ అని మా డెలివరీ విమెన్ అడిగితే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా వెంటనే మంజూరు చేసే సదుపాయం ఏర్పాటు చేస్తున్నాం అని స్విగ్గీ వైస్‌ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) మిహిర్ షా ప్రకటించారు. ఆ రెండు రోజులకు జీతం కూడా ఇస్తాం అని ఆయన తెలియచేశారు. 2014లో బెంగళూరులో ఆరు మంది డెలివరీ బాయ్స్‌తో మొదలైన స్విగ్గీ అనతికాలంలో మహా సంస్థగా అవతరించింది. 2016లో పూణెలో మొదటి డెలివరీ ఉమన్ ఉద్యోగంలో చేరితే 2019లో చెన్నైలో ఆ తర్వాత ముంబైలో డెలివరీ పార్టనర్స్‌గా చేరడం మొదలెట్టి ఇప్పుడు ఆ సంఖ్య వెయ్యికిపైగా మారింది. ‘మా మహిళా ఉద్యోగులకు ప్రత్యేక యాప్ ఉంటుంది. వారు దాని ద్వారా ఎమర్జన్సీ నంబర్‌కు కాల్ చేసే వీలు ఉంది. వారికి తక్షణం సహాయం కావాలంటే అందుతుంది. మేము వారి కోసం శుభ్రమైన టాయిలెట్లు కల్పిస్తున్నాము. షెల్ పెట్రోల్ బంకులతో ప్రత్యేకంగా చేసుకున్న ఏర్పాటు వల్ల మా డెలివరీ విమెన్ ఆ బంకుల్లోని టాయిలెట్లను ఉపయోగించుకోవచ్చు. డెలివరీ, ట్రావెల్ రంగాల్లో కేవలం బహిష్టు సమస్య వల్ల స్త్రీలు రాకుండా ఉండకూడదు. వారికి సౌకర్యాలు కల్పించాలి. అలాగే ఆ రోజులకు వేతన సెలవు ఇవ్వాలి’ అని స్విగ్గీ ప్రతినిధి ఒకరు అన్నారు. స్విగ్గీలో పని చేస్తున్న మహిళల్లో దాదాపు 90 శాతం మంది 45 ఏళ్ల లోపువారే. వీరిలో జీవితంలో తొలి సంపాదన స్విగ్గీతో మొదలెట్టిన వారు 24 శాతం మంది ఉన్నారు. తమకు వీలున్న టైమ్‌లోనే పని చేసే అవకాశం ఉండటంతో చేరుతున్నారు. చాలామంది తమ సంపాదన ఇంటి అద్దెకు, కరెంటు బిల్లుకు ఉపయోగిస్తున్నారు. కొంతమంది యువతులు చదువుకోవడానికి. ‘మహిళా డెలివరీ పార్టనర్స్‌కు వాహనాలు లేకపోతే వారి కోసం మా సంస్థ ఎలక్ట్రిక్ సైకిల్/బైక్‌లను అద్దెకు ఏర్పాటు చేయడానికి ఆయా సంస్థలతో మాట్లాడుతున్నాం’ అని కూడా స్విగ్గీ సంస్థ ప్రతినిధి అన్నారు. ప్రస్తుతం నగరాల్లో ఫుడ్ డెలివరీ సిబ్బంది తమ పెట్రోల్ ఖర్చులు పోను 20 వేల నుంచి 25 వేలు సంపాదిస్తున్నారు. బహిష్టు అనేది స్త్రీ శరీరధర్మం. ప్రకృతి ధర్మం. ఆ సమయంలో వారికి విశ్రాంతినివ్వడం, ఆర్థికంగా నష్టం జరక్కుండా చూడటం మానవీయ విషయం. కాని బహిష్టు వల్ల సెలవు పెడితేనే విడ్డూరం చాలాచోట్ల. ఇక ఆ సెలవుకు డబ్బు అడిగితే ఇంకేమైనా ఉందా? -
Ayesha Goyal: కళ్లింత పెద్దవి చేసుకుని చూడొద్దు
నేటితరం మానవుడు గంటల వ్యవధిలో స్పేస్‌లోకి అడుగుపెట్టి తిరిగి భూమిపైకి వస్తున్నాడు.అయినా సమాజంలో సె**,పీరియడ్స్ గురించి బాహాటంగా మాట్లాడలేని పరిస్థితి. పొరపాటున మాట్లాడినా,వాటి గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినా కళ్లింత పెద్దవి చేసుకుని చూస్తుండడం మనం తరుచూ గమనిస్తుంటాం.ఇలాంటి సమస్య ఇంట్లోవాళ్లకో, స్నేహితులకు ఎదురైతే ఏం చేస్తాం. మౌనంగా ఉండిపోతాం. కానీ ఈ చిన్నారి అలా అనుకోలేదు.తన స్నేహితురాలికి ఎదురైన ఇబ్బందులకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. ఓ యాప్‌ను బిల్డ్ చేసి అందరి చేత శబాష్ అనిపించుకుంటోంది. 11ఏళ్ల చిన్నారి అయోషా గోయల్ గుజరాత్‌లోని అహమ్మాదాబాద్లో నివాసం ఉంటుంది.అయితే ఓ రోజు పీరియడ్స్ సమయంలో తన స్నేహితురాలు శరీరంలో చోటు చేసుకున్న మార్పుల గురించి తెలుసుకునేందుకు ఎంతో ఇబ్బంది పడింది. ఆ ఇబ్బందుల్లో నుంచి 'ఫ్రీ ఫ్లో' యాప్ ను బిల్డ్ చేసింది. ఈ యాప్‌లో మహిళ పిరియడ్స్ గురించి, ట్రాకింగ్ పీరియడ్ డేట్స్, వెన్నునొప్పి, మొటిమలు,తిమ్మిరి ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు బోట్ ఫీచర్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా అయోషా గోయల్ తల్లి షెలీజా మాట్లాడుతూ..రుతుస్రావం సమయంలో కుమార్తెలకు ఎలాంటి సహకారం అందించాలో ఈ యాప్ ద్వారా నాకు ప్రత్యక్షంగా అర్ధమైంది. ఇక యాప్ డిజైన్ విషయంలో గోయల్‌కు మెంటార్ పర్ణ మెహతా వ్యవహరించినట్లు చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌లో గోయల్‌కు సలహాలు, సూచనలు ఇచ్చింది.ఆమె తన స్నేహితులు ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సానుభూతి కలిగింది. వాటిని పరిష్కరించేందుకు 'ఫ్రీ ఫ్లో' యాప్ ను డెవలప్ చేసిందని చిన్నారిపై మెహాత ప్రశంశల వర్షం కురిపించారు. చదవండి: సోషల్ మీడియాలో 'దమ్ మారో దమ్'..యువతకు చెక్ పెట్టేలా -
Menstrual Hygiene Day: ప్యాడ్ ఎక్కడ మార్చుకుందాం?
స్త్రీల బహిష్టు సమస్యలను ప్రపంచం 2013 నుంచి మాట్లాడటం మొదలెడితే భారతదేశం గత నాలుగైదేళ్లుగా మాట్లాడుతోంది. విద్యార్థినులకు ప్యాడ్స్ ఇవ్వడం, పేద వర్గాల మహిళలకు ప్యాడ్స్ అవసరం చెప్పడం ఇప్పుడిప్పుడే జరుగుతోంది. కాని నిజంగా బహిష్టును దాంతో పాటు స్త్రీలను అర్థం చేసుకుని దానితో ముడిపడిన సమస్యలకు పరిష్కారాన్ని, ఆపై స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవాన్ని సమాజం ఇస్తోందా? బహిష్టులో ఉన్న స్త్రీ ఇంట్లో ఉంటే సరే, బయటకు వస్తే ప్యాడ్ ఎక్కడ మార్చుకోవాలో తెలియని ఆందోళన లో నేటికీ ఉందంటే బహిష్టు ధర్మం పట్ల ఈ సమాజం ఇంకా స్నేహంగా లేనట్టే లెక్క. మే 28 ‘బహిష్టు పరిశుభ్రతా దినోత్సవం’ సందర్భంగా కొన్ని చర్చలో ఉన్న ఆలోచనలు.... ఒక రచయిత్రి రాసిన తెలుగు కథలో ఒక మహిళా పాత్రధారి విమాన ప్రయాణం చేస్తూ ఉంటుంది. సడన్‌గా ఆమెకు పిరియెడ్స్ మొదలైపోతాయి. దగ్గర ప్యాడ్స్ ఉండవు. చీరలో ఉంటుంది. ప్రయాణ హడావిడిలో ప్యాంటిస్ కూడా వేసుకుని ఉండదు. ఒక పెద్ద దురవస్థగా ఉంటుందామెకు. విమానంలో మహిళలకు సడన్ గా పిరియడ్స్ వస్తాయేమోనని ప్యాడ్స్ ఉంచరు. ఇప్పటికీ ఎన్ని విమానాలలో ఈ సదుపాయం ఉందో మనకు తెలియదు. కాని తోటి ప్రయాణికులు ఆమెను అభ్యంతరకరంగా చూస్తూ ఉంటే ఎయిర్ హోస్టెస్‌లు సహకరిస్తే ఆ మహిళా పాత్రధారి ఆ దురవస్థ నుంచి బయటపడుతుంది. ఆ కథలో రచయిత్రి అంటుంది– ‘ఈ పాత్రధారి దురవస్థ సరే, దేశంలో బహిష్టు వస్త్రాన్ని ఉతికి మళ్లీ వాడుకునే కోట్లాది మహిళలు ఆ వస్త్రాలను ఆరేసుకోవాలంటే కొంచెం ఎండ కూడా దొరకదు’ అని. అంటే బహిరంగంగా వాటిని ఆరబెట్టుకోవడానికి ఈ సమాజం అంగీకరించదు అని. చీకటిలో, నీడలో, ఇంట్లో దండేలకు వాటిని ఆరబెట్టి తిరిగి వాడటం వల్ల ఎన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయో వచ్చాయో వైద్యనిపుణులు చెబుతూనే ఉన్నారు. ∙∙ విమానం వంటి ఖరీదైన వ్యవస్థలో, ‘నాగరికులు’ రాకపోకలు జరిపే ప్రయాణ సాధనాలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఈ దేశంలో నేటికీ రైళ్లలో, రైల్వే స్టేషన్లలో, బస్టాండ్లలో, బస్సులలో ఎంతమేరకు స్త్రీలకు ప్యాడ్స్ అందుబాటులో ఉన్నాయి? వాటి అవసరాన్ని ఈ సమాజం, వ్యవస్థలు ఏ మేరకు గుర్తించాయి? ఇంకా గుర్తించాల్సి ఉంది? ఫస్ట్ ఎయిడ్ బాక్స్‌లు ఉన్నట్టు ప్యాడ్ బాక్స్‌లు ఎందుకు ఉండవు అని ఇంకా అడగాల్సిన పరిస్థితే ఉంది. ∙∙ గత సంవత్సరం కేరళ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ కార్యాలయ్యాల్లో ఫ్రీ ప్యాడ్స్‌ను ఏర్పాటు చేయడమే కాక, వాడిన ప్యాడ్స్‌ను బూడిద చేసే ‘ఇన్సినెరేటర్’లు కూడా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. పిరియెడ్స్లో ఉన్న మహిళా ఉద్యోగులకు ఆఫీసులో ప్యాడ్స్ మార్చుకునే వీలు ఏదో మేరకు ఉన్నా అంతవరకూ ఉపయోగించిన ప్యాడ్‌ను ఎక్కడ పడేయాలనే వత్తిడిలో ఉంటారు. అందువల్ల ఒకే ప్యాడ్‌ను ఎక్కువ సేపు వాడుతూ ఆరోగ్య సమస్యలను తెచ్చుకుంటూ ఉంటారు. వాటిని మార్చుకునే స్థలంతో పాటు వాటిని ఎవరూ చూడకుండా చేసే బూడిద యంత్రాలు అందుబాటులో ఉన్నప్పుడే వారికి మరింత సౌకర్యంగా ఉంటుంది. అయితే మహిళలు ప్రభుత్వ ఆఫీసుల్లో పని చేస్తారా? ప్రయివేటు ఆఫీసుల్లో చేయరా? ఎన్ని ప్రయివేటు కార్యాలయాలు ఇలాంటి ఏర్పాటు చేస్తున్నాయి అనేది పెద్ద ప్రశ్న. మహిళలు తమ బహిష్టు పరిశుభ్రతను పాటించాలంటే సమాజం మొత్తం అడుగడుగునా అందుకు అవసరమైన స్నేహాన్ని, సౌకర్యాన్ని కలిగించాల్సి ఉంటుంది. ∙∙ ‘బాడీ లిటరసీ’ అనే మాటను వాడుతున్నారు మహిళల కోసం పని చేసే కార్యకర్తలు, ఆలోచనాపరులు. అంటే స్త్రీ శరీర ధర్మాలను సమాజం సరిగ్గా అర్థం చేసుకుని ఆ ధర్మాలను గౌరవించే స్థాయిలో విద్యావంతం కావాలి. అప్పుడే ‘బహిష్టు’కు సంబంధించిన కట్టుబాట్లు, ఏహ్యత, వెలి దూరం అవుతాయి. స్త్రీల శరీరం గురించి స్త్రీలకు తెలుసు. స్త్రీలు తమ లోపలి దొంతరల్లో మొదట ఈ శరీర ధర్మాల పట్ల స్వీయగౌరవం పెంచుకోవడం ఎంత అవసరమో ఇంటి పురుషులతో మొదలెట్టి అధికార పదవులలో కూచుని పురుషదృష్టితో పాలసీలు చేసే పాలకుల వరకూ వీటి పట్ల గౌరవం కలిగించడం కూడా అంతే అవసరం. ఇంట్లోని తల్లి, కుమార్తె బహిష్టు గురించి నార్మల్‌గా మాట్లాడే పరిస్థితితోపాటు తండ్రి, కుమారుడు కూడా అంతే నార్మల్‌గా మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు అవసరమైన మార్పు వస్తుంది. ∙∙ బహిష్టు పట్ల ఉండే చూపును, అప్రకటిత నిబంధనలను వ్యతిరేకిస్తూ ‘హ్యాపీ టు బ్లీడ్’తో మొదలెట్టి ఇటీవలి కాలంలో ఎన్నో విజ్ఞాన నిరసనలు స్త్రీలు చేస్తున్నారు. తమ శరీర ధర్మాన్ని తాము ఓన్ చేసుకోవడం అవసరమని, గట్టిగా మాట్లాడటం కూడా అవసరమే అని వారు తెలుసుకుని మాట్లాడుతున్నారు. దాంతోపాటు ‘నల్ల కవర్‌ను పారేయడం’ గురించి కూడా మాట్లాడుతున్నారు. మెడికల్ షాప్‌కు వెళ్లి ప్యాడ్స్ అడిగితే వాటిని ఒక నల్ల కవర్లో చుట్టి ఇచ్చే ఆనవాయితీ ఉంది ఈ దేశంలో. ఎందుకు నల్లకవర్? అదేమైనా తప్పు పదార్థమా? మామూలు టానిక్‌లు ఎంత ఓపెన్ గా కొంటామో అంతే ఓపెన్‌గా వీటిని కొని, తీసుకెళ్లే పరిస్థితి ఉండాలని స్త్రీలు అంటారు. భార్యకు అవసరమైన ప్యాడ్స్ కోసం భర్త, కుమార్తెకు అవసరమైన ప్యాడ్స్ కోసం తండ్రి మెడికల్ షాపుకు వెళ్లడం ఏ మేరకు ఉంది... వాటిని తెచ్చిపెట్టడం లో ఇబ్బంది/నామోషీ ఎందుకు ఉంది అని ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిన రోజు ఈ రోజు. ∙∙ సాధారణంగా స్త్రీలకు పిరియెడ్స్ 28 రోజులకు వస్తాయి. అవి ఐదు రోజులు ఉంటాయి. అందుకే సంవత్సరంలో ఐదో నెల అయిన మేలో, 28వ తేదీని ‘మెన్స్ట్రువల్ హైజీన్ డే’గా పాటిస్తున్నారు. ఈ రోజు స్త్రీలు తమ శరీర ధర్మం పట్ల సమాజంలో రావాల్సిన మార్పు గురించి మాట్లాడతారు. గుర్తు చేస్తారు. సమాజం దీనిగురించి స్పందించాల్సి ఉంటుంది. స్త్రీల గురించి ఎన్నో చేయాలి. అనుక్షణం ఆలోచించాలి. ప్రత్యేకంగా రోజులను ఖరారు చేసి పదే పదే చెప్పేది అందుకే. స్త్రీలు కోరే ‘విద్యావంతమైన’ సమాజం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. – సాక్షి ఫ్యామిలీ -
నెలసరి సమయంలో నొప్పి సమస్య.. డాక్టర్ పరిష్కారం
నా వయసు 33 ఏళ్లు. ఎత్తు 5.2, బరువు 77 కేజీలు. పెళ్లయి నాలుగేళ్లయినా, ఇంకా పిల్లలు కలగలేదు. నెలసరి సమయంలో బాగా నొప్పిగా ఉంటుండటంతో స్థానిక ప్రభుత్వాస్పత్రి డాక్టర్ సూచనపై పరీక్షలు చేయించుకున్నాను. యుటెరిన్ ఫైబ్రాయిడ్స్ ఉన్నట్లు చెప్పారు. నా సమస్యకు పరిష్కారం చెప్పగలరు. – చంచల, టెక్కలి మీ ఎత్తు 5.2 అంటే, ఈ ఎత్తుకి గరిష్ఠంగా 60 కేజీల బరువు ఉండవచ్చు. మీరు 17 కేజీలు అధికంగా బరువు ఉన్నారు. కొందరిలో కొద్దిగా కండరం లేదా ఫైబ్రస్ టిష్యూ అధికంగా ఎక్కడైనా పెరిగి గడ్డలాగా, కంతుల్లాగ తయారవుతాయి. వాటినే ఫైబ్రాయిడ్స్ అంటారు. ఇవి గర్భాశయంలో ఏ భాగంలోనైనా పెరగవచ్చు. జన్యుపరమైన కారణాలు, హార్మోన్ల సమతుల్యత లోపం, ఈస్ట్రోజెన్ హార్మోన్ ఎక్కువగా స్రవించడం వల్ల, అధిక బరువు వంటి కారణాలతో పాటు ఇంకా ఎన్నో తెలియని కారణాల వల్ల ఫైబ్రాయిడ్స్ ఏర్పడవచ్చు. ఇవి 0.5 మిల్లీమీటర్ల సైజు నుంచి 10 సెంటీమీటర్ల సైజు వరకు పెరగవచ్చు. ఇవి ఒకటి నుంచి రెండు మూడు కణితులు లేదా అంతకంటే ఎక్కువగా కూడా ఉండవచ్చు. ఇవి గర్భాశయం పైన ఉంటే సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ అని, మయోమెట్రియమ్ పొరలో ఉంటే ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ అని అంటారు. మీకు ఉన్న ఫైబ్రాయిడ్స్ ఎంత పరిమాణంలో ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేది వివరించలేదు. నెలసరి సమయంలో నొప్పి ఎక్కువగా ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్స్ వల్ల వస్తుంది. మీకు బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉందా లేక మామూలుగా ఉందా అనే విషయం కూడా తెలియవలసి ఉంది. సబ్ మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే నొప్పితో పాటు బ్లీడింగ్ కూడా అధికంగా అవుతుంది. పీరియడ్స్ తొందరగా రావడం, మధ్య మధ్యలో బ్లీడింగ్ అవడం వంటి లక్షణాలు ఉంటాయి. సబ్‌మ్యూకస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే అవి చిన్నగా ఉన్నా, తప్పనిసరిగా వాటికి హిస్టరోస్కోపి మయోమెక్టమీ ద్వారా తొలగించవలసి ఉంటుంది. లేకపోతే అది ఎండోమెట్రియమ్ పొరలో బిడ్డను ఎదగనివ్వకుండా చెయ్యడం వల్ల గర్భధారణలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఒకవేళ ఇంట్రామ్యూరల్ ఫైబ్రాయిడ్ ఉంటే వాటి పరిమాణం 5 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా ఉండి, పీరియడ్స్‌లో ఇబ్బందులు ఉండి పిల్లలు కలగకపోతే వాటిని మయోమెక్టమీ ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. ఒకవేళ వీటి వల్ల గర్భం రాకపోతే, ఇతరత్రా సమస్యలు లేకపోతే అవి తొలగించిన తర్వాత గర్భం నిలిచే అవకాశాలు పెరుగుతాయి. సబ్సిరీస్ ఫైబ్రాయిడ్స్ ఉంటే వాటి వల్ల గర్భం నిలవడానికి పెద్దగా ఇబ్బందులేవీ ఉండవు. అవి మరీ పెద్దగా ఉండి కడుపులో నొప్పి ఇతర ఒత్తిడి సమస్యలు ఉంటేనే తొలగించవలసి ఉంటుంది. మీకు ఇప్పటికే 33 సంవత్సరాలు ఉన్నాయి కాబట్టి, మళ్లీ ఒకసారి గైనకాలజిస్టును సంప్రదించి, త్వరగా తగిన చికిత్స తీసుకుని గర్భం కోసం ప్రయత్నం చేయడం మంచిది. -డా. వేనాటి శోభ గైనకాలజిస్ట్ హైదరాబాద్ చదవండి: ఇంకా ఎంత కాలం ఆగాలి? చదవండి: నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? -
నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా?
మేడమ్! నా వయసు 32 సంవత్సరాలు, బరువు 80 కిలోలు. రీసెంట్గా డీ అండ్ సీ, ఇంకా రైట్ ఎక్టోపిక్ లాపరోస్కోపీ సర్జరీ జరిగింది. లాపరోస్కోపీ సర్జరీ అంటే ఏంటి? సర్జరీలో ఎఫెక్ట్ అయిన ట్యూబ్‌కే కాకుండా, సెకండ్ ట్యూబ్‌కి కూడా బ్లాకేజెస్ ఉన్నాయా అని చెక్ చేస్తారా? హెచ్ఎస్జీ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉందా? నాకు పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా? గతంలో నాకు పీసీఓడీ కూడా ఉండేది. సర్జరీ తర్వాత స్కాన్ చేస్తే అందులో పీసీఓడీ సింప్టమ్స్ ఏమీ లేవు. ఇప్పుడు నేను ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఎలాంటి డైట్ తీసుకోవాలి? దయచేసి సలహా ఇవ్వగలరు. – భావన (ఈ–మెయిల్) బరువు 80కిలోలు అన్నారు. ఎత్తు ఎంత ఉన్నారు అని రాయలేదు. అయినప్పటికీ 80కిలోలు అంటే కొద్దిగా అధిక బరువు ఉన్నట్లు అనిపిస్తుంది. అధిక బరువు వల్ల కూడా హార్మోన్లలో అసమతుల్యత ఏర్పడి పీసీఓడీ ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పెల్విక్ స్కానింగ్‌లో రెండు రకాలుగా చేస్తారు. ట్రాన్స్‌అబ్డామినల్ స్కానింగ్ అంటే నీరు బాగా తాగిన తర్వాత పొట్టపైన నుంచి చేస్తారు. ఇందులో పొట్టలావుగా ఉండి పొత్తికడుపు దగ్గర కొవ్వు ఎక్కువగా ఉన్నప్పుడు కొందరిలో నీటి బుడగలు పీసీఓడి, గర్భాశయంలో కొన్ని సూక్ష్మమైన సమస్యలు అంతగా తెలియకపోవచ్చు. అలాంటప్పుడు కొన్ని గర్భాశయంలో, అండాశయంలో సమస్యలను గుర్తించలేకపోవచ్చు. పెళ్ళయిన వారికి ట్రాన్స్‌వెజైనల్ స్కానింగ్ (టీవీఎస్) అంటే యోని ద్వారం నుంచి స్కానింగ్ చేస్తారు. ఇందులో అండాశయంలో ఉండే నీటి బుడగల సమస్య, ఒవేరియన్ సిస్ట్లు, అవి ఎలాంటివి, గర్భాశయంలో గడ్డలు, కంతులు, ఇన్ఫెక్షన్లు, ఇంకా ఇతర చిన్నచిన్న సమస్యలను వివరంగా గుర్తించవచ్చు. నీకు ముందు పీసీఓడి ఉండి, ఇప్పుడు లేదు అంటున్నారు అంటే అబ్డామినల్ స్కానింగ్ చెయ్యడం వల్ల సరిగా కనిపించకపోయి ఉండవచ్చు, లేదా కొందరిలో వయసు పెరిగే కొద్దీ అండాలు తగ్గే క్రమంలో అండాశయాలు మామూలుగా ఉండవచ్చు. మీకు పీరియడ్స్ నెలనెలా సక్రమంగా వస్తున్నాయా లేదా అనేది తెలియవలసి ఉంది. నెలనెలా పీరియడ్స్ సక్రమంగా ఉంటే చాలావరకు ఒక నెల ఒక అండాశయం నుంచి, ఇంకొక నెల ఇంకొక అండాశయం నుంచి అండం విడుదల అవుతుంది. నీకు లాపరోస్కోపీ సర్జరీలో కుడిట్యూబ్లో ప్రెగ్నెన్సీ రావడం (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) వల్ల ఆ ట్యూబ్‌ని తొలగించి ఉంటారు. కాబట్టి ఇంకొక ట్యూబ్ సరిగా ఉంటే, ఎడమవైపు అండం విడుదలయిన నెలలో గర్భం వచ్చే అవకాశం ఉంటుంది. పొట్టలో కొన్నిరకాల సమస్యలకు, పొట్ట కోసి కాకుండా పొట్టపైన 25సెం.మీ గాటు పెట్టి కడుపులోకి కార్బన్డయాక్సైడ్ గ్యాస్‌ను పంపించి పొట్ట ఉబ్బిన తర్వాత 2 నుంచి 3, 0.5సెం.మీ గాట్లు పెట్టి టీవీలో చూస్తూ ఆపరేషన్ చెయ్యడం జరుగుతుంది. ఈ సమయంలో ఇంకొక ట్యూబ్ ఎలా ఉందని చెక్ చెయ్యడం జరుగుతుంది. ఇంకొక ట్యూబ్ సరిగా ఉంటే మళ్ళీ మామూలుగానే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అప్పుడు చెక్ చెయ్యకపోతే, అవసరమనుకుంటే హిస్టరోసాల్సింగ్గ్రామ్ (హెచ్‌ఎస్‌జి) పరీక్ష ద్వారా, ఇంకొక ట్యూబ్‌లో బ్లాకేజీలు ఉన్నాయా లేదా తెరుచుకుని ఉందా అని తెలుసుకోవడం జరుగుతుంది. మీకు ఆపరేషన్ ఈ మధ్యనే జరిగింది కాబట్టి, మూడునెలల తర్వాత మళ్ళీ గర్భం కోసం ప్రయత్నించవచ్చు. ఈ లోపల మీరు 80కేజీలు ఉన్నారు కాబట్టి ఆహార నియమాలను పాటిస్తూ, కొద్దిగా వాకింగ్, చిన్న వ్యాయామాలు చేస్తూ బరువు తగ్గడానికి ప్రయత్నం చెయ్యడం మంచిది. ఆహారంలో పిండిపదార్థాలు (కార్బోహైడ్రేట్స్) కొవ్వుపదార్థాలు తక్కువ తీసుకుంటూ, ఎక్కువ ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం మంచిది. మీ వయసు 32 సంవత్సరాలు కాబట్టి, ఎక్కువ సమయం వృథా చేయకుండా మూడు నుంచి ఆరు నెలలలో గర్భం కోసం ప్రయత్నించి తర్వాత గైనకాలజిస్ట్‌ను సంప్రదించి వారి సలహాలను పాటిస్తూ, అండం విడుదల అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఫాలిక్యులార్ స్టడీ స్కానింగ్ వంటి అవసరమైన పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవడం మంచిది. మేడమ్, నమస్కారాలు! నా వయసు యాభై సంవత్సరాలు. కొన్నాళ్లుగా సుగర్ ఉన్నందువల్ల వైద్యం చేయించుకుంటున్నాను. మెన్సెస్ ఆగిపోయి ఐదు సంవత్సరాలైంది. ఎడమరొమ్ములో చిన్న కంతి ఏర్పడి నొప్పిగా ఉంటోంది. నుదురుపై రెండు కాయలు ఉన్నాయి. ఈ మార్పులు కేన్సర్ లక్షణాలేమోనని భయంగా ఉంది. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నాను. –తంగేటి పాపాయమ్మ, ఏలేశ్వరం (తూ.గో.జిల్లా) 50 సంవత్సరాల వయసు కాబట్టి రొమ్ములో చిన్న కంతి నొప్పిగా కూడా ఉందంటున్నారు కాబట్టి మీకుమీరే భయపడుతూ అశ్రద్ధ, ఆలస్యం చేయకుండా ఒకసారి డాక్టర్ని సంప్రదించి యుఎస్‌జి బ్రెస్ట్, మామోగ్రామ్, అవసరమైతే బయాప్సీ వంటి పరీక్షలు చేయించుకుంటే ఈ కంతి సాధారణమైనదేనా లేక క్యాన్సర్‌కు సంబంధించినదా అని తెలుస్తుంది. కొందరిలో నొప్పితో కూడిన కంతి అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా చీముగడ్డ లాగా కూడా అయ్యిండవచ్చు. కాకపోతే ఈ గడ్డ చాలా రోజుల నుంచి లేదా ఈ మధ్యనే వచ్చిందా అనేది తెలియవలసి ఉంది. సాధారణంగా రొమ్ములు అటూఇటూ కదిలే ఫైబ్రోఅడినోమా అనే గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి. కాకపోతే వాటిలో నొప్పి పెద్దగా ఏమీ ఉండదు. అవి మరీ పెద్దగా అయితే తప్ప, ముందు నుంచీ లేకుండా ఇప్పటికిప్పుడే కంతి అంటే సాధారణంగా అవి చీముగడ్డలు అయ్యిండవచ్చు. నుదిటి మీద కాయలు కూడా అనేక రకాల కారణాల వల్ల రావచ్చు. ఇవి ఈ మధ్యనే వచ్చాయా, లేక చాలా రోజుల నుంచి ఉన్నాయా అనేది చెప్పలేదు. ఏమైనప్పటికీ కూడా మీరు ఒకసారి డాక్టర్ని సంప్రదించి కారణాన్ని బట్టి తగిన చికిత్స తీసుకోవడం మంచిది. - డా.వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదా?
మహిళలు రుతు సమయంలో వ్యాయామం చేయకూడదన్నది కేవలం అపోహ మాత్రమే. చాలామంది క్రీడాకారిణులు తమ ప్రాక్టీస్‌లో భాగంగా రుతుసమయంలోనూ వ్యాయామం చేస్తుంటారు. దాంతో ఎలాంటి నష్టమూ జరగదు. కాకపోతే రుతు సమయంలో యువతులు రక్తం కోల్పోతూ ఉండటం వల్ల వాళ్ల దేహంలో ఐరన్ పాళ్లు తగ్గే అవకాశం ఉంది కాబట్టి... ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. అంటే... వేటవూంసం, చికెన్, చేపలు, వూంసాహారంతో లివర్, శాకాహారులైతే తాజా ఆకుకూరలు, ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు పీరియడ్స్ సమయంలోనేగాకుండా మామూలుగానూ తీసుకుంటుంటే వారు కోల్పోయే ఐరన్ ఎప్పటికప్పుడు భర్తీ అవుతుంది. అయితే... రుతుసవుయంలో వారు ఉప్పు, కొవ్వులు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే మందకొడిగా మారి వ్యాయామం చురుగ్గా చేయలేకపోవచ్చు. కేవలం రుతు సమయంలోనే గాక... మిగతా టైమ్‌లో అలాంటి ఆహారం వల్ల చురుగ్గా ఉండలేకపోవచ్చు.. కాబట్టి చురుగ్గా ఉండాలంటే... యువతులు, మహిళలు తమ ఆహారంలో ఉప్పు, కొవ్వులు తగ్గించాలి. రుతు సవుయంలో సాధారణ రోజుల కంటే నీళ్లు, పళ్లరసాల వంటి ద్రవ పదార్థాలు ఎక్కువగా తాగాలి. వేళకు పడుకోవాలి. కంటినిండా నిద్రపోవాలి. అప్పుడే మహిళలకు ఏ ఇబ్బందీ లేకుండా ఉంటుంది. -
అబార్షన్: మందులు వాడినా ఫలితం లేదు
నా వయసు 29 సంవత్సరాలు. కొంతకాలంగా నెలసరి సమయంలో నాకు చాలా తక్కువగా రక్తస్రావం జరుగుతోంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటోంది. ఏడాది కిందట నాకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచే ఈ సమస్య మొదలైంది. నేను ప్రభుత్వాసుపత్రిలో చూపించుకుంటే, మందులు ఇచ్చారు. మందులు వాడినా ఫలితం పెద్దగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా? – అవంతి, మెంటాడ (విజయనగరం జిల్లా) మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో హార్మోన్లలో అసమతుల్యత పెరిగి ఉన్నట్లుండి బరువు పెరగడం వల్ల, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో అండాశయాలలో నీటిబుడగలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల కూడా రక్తస్రావం కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు కుంచించుకున్నట్లయ్యి పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఇన్ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిన్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా ఉండవచ్చు. కొందరిలో చాలా అరుదుగా అబార్షన్ కోసం డి అండ్ సి ద్వారా గర్భాశయం శుభ్రం చేసినప్పుడు, ఎక్కువగా చెయ్యడం వల్ల గర్భాశయ పొర దెబ్బతినడం వల్ల బ్లీడింగ్ తక్కువగా అవ్వవచ్చు. అలానే ఎక్కువసార్లు అబార్షన్లు చెయ్యించుకోవడం వల్ల కొందరిలో అడినోమయోసిన్ అనే సమస్య ఏర్పడి కూడా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సిబిపి, ఈఎస్ఆర్, ఎస్ఆర్–టిఎస్హెచ్, ఎస్.ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని పెల్విక్ స్కానింగ్ చేయించుకుని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే ఆహారనియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నీ సమస్య తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి. - డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
ప్రధాని సంచలన నిర్ణయం: ఉచితంగా ప్యాడ్స్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెర్న్ గురువారం కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో విద్యార్థినిలకు ఉచితంగా నెలసరి కిట్‌ను అందించనున్నట్లు ప్రకటించారు. జూన్ నుంచి దశల వారీగా ఈ పంపిణీ ప్రారంభమవుతుందేని పేర్కొన్నారు. పాఠశాలలు, ఇంటర్మీడియట్, సెకండరీ స్కూల్స్‌లో ఈ కిట్‌ను ఉచితంగా అందిస్తామని తెలిపారు. కాగా పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా 15 పాఠశాలల్లోని 3200 మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ సహా మరికొన్ని ఉత్పత్తులను అందించారు. ఇది విజయవంతం కావడంతో వాటిని దేశవ్యాప్తంగా ఫ్రీగా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు దాదాపు 25 మిలియన్ల న్యూజిలాండ్ డాలర్లు ఖర్చు కానున్నాయి. శానిటరీ న్యాప్కిన్ల ధర ఎక్కువగా ఉండటంతో పేద బాలికలు వాటిని కొనలేకపోతున్నారని, దీంతో రుతుక్రమం సమయంలో వారు స్కూలుకు వెళ్లడమే మానేస్తున్నారని ఓ అధ్యయనం పేర్కొంది. దీంతో నెలసరి సమస్యల వల్ల అమ్మాయిలు చదువుకు దూరం కావద్దనే ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టినట్లు జెసిండా చెప్పుకొచ్చారు. "పీరియడ్ పావర్టీ"ని తగ్గించాలనేదే తన లక్ష్యమని తెలిపారు. శానిటరీ కిట్ల ఉచిత పంపిణీ మూడేళ్ల వరకు కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ఇలా మహిళల రుతుక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని వారికోసం నెలసరి కిట్లను ఉచితంగా అందించిన తొలి దేశంగా స్కాట్లాండ్ ఇదివరకే చరిత్రకెక్కింది. నెలసరి సమయంలో మహిళలకు అవసరమయ్యే వస్తువులన్నింటినీ ఉచితంగా అందించాలని స్కాట్లాండ్ ప్రభుత్వం నిర్ణయించడమే కాక గతేడాది నవంబర్ నుంచే దాన్ని అమల్లోకి తెచ్చింది. చదవండి: త్వరలోనే పెళ్లి చేసుకోనున్న ప్రధాని జెసిండా! వైరల్: వంటకు సాయం చేస్తున్న కోతి! -
ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?: హాస్టల్ గర్ల్
నా వయస్సు 19. ఎత్తు 5.6 బరువు 42. అయితే నాకూ 5 సంవత్సరాల నుండి రొమ్ము లో కొంత బాగం గట్టిగా ఉంది కదులుతూ ఉంటుంది కూడా. నేను చాలా సన్నగా ఉంటాను నాకూ ఛాతీ కూడా చిన్నగా ఉంటుంది. పీరియడ్ రెగ్యులర్‌గానే ఉంటుంది కాని, కడుపు నొప్పి ఉంటుంది. తెలిసిన డాక్టర్ని అడిగితే పెరుగుతున్న కొద్దీ శరీరంలో వచ్చే మార్పులకు పోతుంది అన్నారు. కానీ కొన్ని నెలల నుండి నొప్పి ఎక్కువగా ఉంటోంది. మసాజ్ చేయడం వల్ల కొంతకాలం ఉపశమనం లభిస్తోంది. నేను హాస్టల్లో ఉండి చదువుకుంటున్నా, అక్కడ ఫుడ్ బాగా ఉండదు. ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవు. కడుపు నొప్పి కోసం హోమియోపతి మందులు 3 నెలలు వాడాను. నా సమస్య ఏంటో అర్థం కావడం లేదు. ఏమయినా ట్యూమర్ అయ్యే అవకాశం ఉందా?? సమస్య ఏంటో దానికి కారణం చికిత్స తెలియచేయాలని మనవి. – శ్రీ విద్య, కరీంనగర్ నువ్వు నీ ఎత్తుకి తగ్గ బరువు లేవు, సన్నగా ఉన్నావు. నీకు రొమ్ములో కదులుతూ ఉండే గడ్డ ఉన్నట్లుంది. అది ఫైబ్రోఅడినోమా గడ్డ కావచ్చు. ఒకసారి డాక్టర్ని సంప్రదించి రొమ్ము స్కానింగ్ చేయించుకుంటే అది సాధారణ గడ్డా కాదా అని తెలుస్తుంది. అది మామూలు చిన్న ఫైబ్రోఅడినోమా గడ్డ అయితే... దానిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. పీరియడ్స్ సమయంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్ల మోతాదును బట్టి, ఒక్కొక్కరి శరీర తత్వాన్ని బట్టి గర్భాశయ కండరాలు ముడుచుకుంటూ... గర్భాశయ పొరని బ్లీడింగ్ రూపంలో బయటకు పంపిస్తుంది. ఈ సమయంలో కొందరిలో కడుపునొప్పి, నడుంనొప్పి ఎక్కువగా ఉంటుంది. కొందరిలో నొప్పి తీవ్రత కొద్దిగా ఉంటుంది. ఇంకొందరిలో ఏమీ ఇబ్బంది ఉండదు. ఇలా హార్మోన్స్ విడుదలలో మార్పుల వల్ల వచ్చే నొప్పి వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. ఈ సమయంలో నొప్పి నివారణ మాత్రలు రెండు మూడు రోజులు వేసుకోవచ్చు. కాని కొందరిలో గర్భాశయంలో కంతులు, ఫైబ్రాయిడ్స్, ఇన్ఫెక్షన్లు, ఆడినోమయోమా, వాపు, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో కంతులు, సిస్ట్లు వంటి అనేక సమస్యల వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి ఎక్కువగా ఉంటుంది. నెలనెలా నొప్పి తీవ్రత పెరుగుతూ ఉంటుంది. కాబట్టి నువ్వు గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకుని పైన చెప్పిన సమస్యలు ఏమైనా ఉన్నాయా, లేవా అని నిర్ధారించుకుని దానినిబట్టి సమస్య ఏమిటో తెలుసుకుని చికిత్స తీసుకోవడం మంచిది. హాయ్ మేడం.. నాకు 25 ఏళ్లు. గవర్నమెంట్ ఆఫీసర్ని. నాకు 4 నెలల కింద లెఫ్ట్ ఒవేరియన్ సిస్ట్ ఆపరేషన్ అయింది. దాంతో మొత్తం ఎడమవైపు ఓవరీనే తీసేశారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు.పెళ్లి అయ్యాక పిల్లలు పుట్టడంలో ఏదైనా సమస్య ఉంటుందా? లేక పిల్లలు పుడతారా లేదా అని భయంగా ఉంది. మా తల్లి తండ్రులు బాధ పడుతున్నారు. ప్లీజ్ చెప్పండి. – ఇ– మెయిల్ సాధారణంగా గర్భాశయానికి రెండువైపులా ఒక్కొక్క అండాశయం (ఓవరీ) అతుక్కుని ఉంటాయి. అంటే మొత్తంగా రెండు అండాశయాలు ఉంటాయి. ఒక నెల ఒక వైపు అండాశయం నుంచి, మరలా నెల ఇంకొక వైపు అండాశయం నుండి అండం విడుదల అవుతుంది. ఈ సమయంలో కలయికలో ఉండటం వల్ల మగవారి నుంచి శుక్రకణాలు యోని నుంచి గర్భాశయంలోకి వెళ్లి అక్కడి నుండి ఫెలోపియన్ ట్యూబ్‌లోకి చేరి, అక్కడికి చేరిన అండాశయం నుంచి విడుదలయిన అండంతో ఫలధీకరణ చెంది పిండం ఏర్పడుతుంది. ఈ పిండం ట్యూబ్‌లో నుంచి గర్భాశయంలోకి చొచ్చుకుని గర్భం ఏర్పడి పెరగడం మొదలవుతుంది. నీకు ఒక అండాశయం తొలగించినా, ఇంకొక అండాశయం ఉంది కాబట్టి, దాని నుంచి విడుదలయ్యే అండం వల్ల గర్భం తప్పకుండా వస్తుంది. (ఇతర వేరే సమస్యలు లేకపోతే) కాబట్టి నువ్వు భయపడకుండా, మీ తల్లిదండ్రులకు కూడా ఏమీకాదని ధైర్యాన్ని చెప్పడం మంచిది. నా వయసు 43 ఏళ్లు. ఆరు నెలలుగా పీరియడ్స్ సమయంలో విపరీతంగా బ్లీడింగ్ అవుతోంది. కడుపులో నొప్పిగా ఉంటోంది. గత రెండు నెలల్లో పీరియడ్స్‌కి పీరియడ్స్‌కి మధ్య కూడా బ్లీడింగ్ అయ్యింది. ఇదేమైనా ప్రమాదకరమా? – నాగమణి, సోంపేట ఆడవారిలో 40 సంవత్సరాలు పైబడిన తర్వాత హార్మోన్లలో మార్పులు, అండాశయం పనితీరులో మార్పులు, గర్భాశయంలో ఫైబ్రాయిడ్ కంతులు, ఎండోమెట్రియల్ పాలిప్స్, సర్వైకల్ పాలీప్స్, ఇన్ఫెక్షన్లు, గర్భాశయంలో వాపు, అడికోమయోసిన్, ఎండోమెట్రియోసిస్, అండాశయాలలో సిస్ట్లు, కంతులు ట్యూమర్స్, అరుదుగా గర్భాశయ క్యాన్సర్ వంటి అనేక సమస్యల వల్ల బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం, కడుపులో నొప్పి, మధ్యలో బ్లీడింగ్ కనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. మీరు కంగారు పడకుండా ఒకసారి గైనకాలజిస్ట్‌ను సంప్రదించి, స్పెక్యులమ్ పరీక్ష, పెల్విక్ స్కానింగ్, పాప్‌స్మియర్, ధైరాయిడ్ పరీక్ష చేయించుకుని, అవసరమైతే సర్వైకల్ బయాప్సీ, ఎండోమెట్రియల్ బయాప్సీ వంటివి కూడా చేయించుకుని సమస్య ఏమిటి, ఎక్కడ ఉంది అని తెలుసుకుని దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. - డా‘‘ వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్ -
నెలసరి ఉన్నా ఈ గర్భగుడిలోకి వెళ్లవచ్చు!
చెన్నై: తమిళనాడు రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఆలయం ఉంది. ఈ ఆలయంలో నెలసరి సమయంలో కూడా మహిళలలు పూజలు చేసుకోవచ్చు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ ప్రత్యేక ఆలయం కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశ్రమంలో ఉంది. దీని పేరు ‘మా లింగా భైరవి’. ఇక్కడ బైరాగిని అమ్మవారు కొలువుదేరి ఉన్నారు. ఈ ఆలయ గర్భగుడిలోకి కేవలం మహిళలకు మాత్రమే అనుమతి ఉండటం మరో విశేషం. సద్గురు జగ్గీ వాసుదేవ్ ఉన్నత భావాలు కలిగిన స్వామిజీ అని అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఆశ్రమంలో.. మా లింగా భైరవి ఆలయానికి ప్రతిరోజు పురుషులు, మహిళా భక్తులు దర్శనార్థం వస్తుంటారు. కానీ ఈ ఆలయ గర్భగుడి లోపలికి వెళ్లి పూజలు చేసుకునే అవకాశం కేవలం మహిళలకు మాత్రమే ఆయన కల్పించారు. దీనికి కారణం రుతుస్రావం సమయంలో వారిని అంటరాని వారిగా చూడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏర్పాటు చేశారు. అదే విధంగా మహిళలకు రుతుస్రావం అనేది ప్రకృతిలో భాగమనీ.. ఆ సమయంలో మహిళలు గుడికి రాకూడదు, పూజలు చేయకూడదంటూ ఆంక్షలు విధించడం సరైనది కాదని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా! ఈ విషయం గురించి నిర్మలా అనే ఆశ్రమ మహిళా సన్యాసిని మాట్లాడుతూ.. ‘ ఇది స్వామీ సద్గురు జగ్గీ వాసుదేవ్ నిర్ణయం. రుతుస్రావ సమయంలో మహిళల అభద్రతా భావాన్ని పోగొట్టేందుకే ఆయన ఇలా చేస్తున్నారు. దీంతో బైరాగిని మాతను పూజించుకోవడానికి రోజూ మహిళలు, పురుషులు వస్తారు. కానీ గర్భగుడిలోకి కేవలం మహిళలను మాత్రమే అనుమతించడం పట్ల మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఆలయాల్లోని గర్భగుడిలోకి మహిళలకు అనుమతి ఉండక పోవడం.. ఇక్కడ ఆ ఏర్పాటు ఉండటంతో వారంతా సంతోషిస్తున్నారు’ అని ఆమె చెప్పారు. ‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’ ‘‘కంప్యూటర్ యుగంలో కూడా చాలా ప్రాంతాల్లో రుతుస్రావంలో ఉన్న మహిళలను, యువతులను అంటరానివారుగా భావిస్తారన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో వారిని ఇంట్లోకి అనుమతించరు. ఇక వారికి తినడానికి ప్లేటు, గ్లాసు విడిగా ఉంచుతారు. ఆ సమయంలో ఇంట్లోని వారంతా వారి పట్ల ప్రవర్తించే తీరు చూస్తే అభద్రత భావం కలుగుతుంది. ఈ ఆచారాన్ని వారు అవమానకరంగా భావించడంతో పాటుగా.. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అందుకే వీటన్నింటికీ అడ్డుకట్ట వేసేందుకే సద్గురు వాసుదేవ్ ఇలా చేస్తున్నట్లు’’ నిర్మల తెలిపారు. -
గత జన్మలో మహిళ.. ఈ జన్మలో ఇలా!
మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ మహిళలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యాలపై బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నటి లిసా రే స్పందించారు. స్వామి నారాయణ్ భుజ్ మందిర్‌కు చెందిన కృష్ణస్వరూప్ దాస్జీ.. నెలసరి సమయంలో భర్తలకు వండిపెట్టిన స్త్రీలు వచ్చే జన్మలో కుక్కలై పుడతారని, ఆ వంట తిన్న భర్తలు ఎద్దులై పుడతారంటూ వ్యాఖ్యానించిన వీడియోలు తాజాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నటి లిసా రే ఓ కుక్క ఫోటోను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘దీని పేరు జిన్ని.. తను గత జన్మలో తను ఓ మహిళ. నెలసరి సమయంలో భర్తకు వండిపెట్టింది. అంతేగాక ఓసారి తన భర్తను కూడా వండి తినేసింది. అందుకే ఈ జన్మలో ఇలా కుక్కలా పుట్టి తన జీవితాన్ని సంతోషంగా గడుపుతోంది. ఇక స్త్రీలంతా జిన్నిలా చేసి జీవితాన్ని ఆనందంగా గడపండి’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆమె ట్వీట్‌కు కొంత మంది బాలీవుడ్ నటులు ఫన్నీ మీమ్స్‌తో సమాధానం ఇస్తున్నారు. ఈ ఫన్నీ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.(‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’) This is Ginni. She was a woman in her past life. Ginni used to cook for her husband while she was menstruating. Once she cooked her husband and ate him as well. Now Ginni is born as Kutri and enjoying her life at fullest. Be like Ginni. Via Mamta Jaswal pic.twitter.com/pvtemTl5tQ — Lisa Ray (@Lisaraniray) February 21, 2020 అలాగే హీరో ఆయుష్మాన్ ఖురానా ‘అవునా.. తనని అనుకరించే ముందు ప్రజలు కూడా ఎవరిని అనుకరిస్తున్నారో ముందుగా తెలుసుకోవాలి. అంతేకాదు ప్రస్తుతం మనం అభివృద్ధి చెందుతున్న సమాజంలో ఉన్నాం. కాలానుగుణంగా మన ఆలోచనలు మారాలి. అయితే ఈ సమాజంలో రెండు రకాలుగా ఆలోచించే మనుషులు ఉన్నారు. కొంతమంది మారుతున్న కాలానుగుణంగా తమ ఆలోచనలను మార్చుకుంటుంటే.. మరికొందరు పాత పద్దతులనే ఆచరిస్తూ.. అవే సరైనవని బలంగా నమ్ముతారు. ఏదేమైనా ప్రజలు ప్రస్తుత సమాజాన్ని, మారుతున్న కాలాన్ని బట్టి నడుచుకోవాలన్న విషయాన్ని తప్పక అంగీకరించాల్సిందే’ అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇక మత భోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని తన అనుయాయులకు చెప్పిన వీడియోలు బయటకు రావడంతో ఆయనపై ప్రగతిశీల వాదులు మండిపడుతున్నారు. -
‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’
-
‘నెలసరిలో వంట చేస్తే కుక్కలుగా పుడతారు’
అహ్మదాబాద్: నెలసరితో ఉన్న విద్యార్థినుల పట్ల అనాగరికంగా వ్యవహరించిన గుజరాత్‌లోని శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్ ఘటన వెనక ఓ స్వామిజీ నీచపు బుద్ధి ఉన్నట్టు తెలిసింది. పురాణాల కాలం నుంచి నెలసరితో ఉన్న మహిళలు కొన్ని కట్టుబాట్లను పాటిస్తున్నారని, అవి పాటించని పక్షంలో వాళ్లను ద్వేషించినా తప్పు లేదని స్వామి నారాయణ్ భుజ్ మందిర్ మత బోధకుడు కృష్ణస్వరూప్ దాస్జీ తన అనుయాయులకు చెప్పినట్టున్న వీడియోలు కొన్ని బయటపడ్డాయి. శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌ను స్వామి నారాయణ్ టెంపుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రుతుక్రమంలో ఉన్న మహిళలు వండి పెట్టిన ఆహారం తిన్నవారెవరైనా వచ్చే జన్మలో ఎద్దులై పుడతారని స్వామిజీ ఓ వీడియోలో చెప్పుకొచ్చారు. అందుకే నెలసరి ఉన్న మహిళలు వంట చేయకూడదని స్వామీజీ సెలవిచ్చారు. ఒక వేళ శాస్త్రాలు పట్టించుకోకుండా నెలసరిలో ఉన్నా కూడా భర్తకు వండి పెడితే.. ఆ మహిళలు మరు జన్మలో కుక్కలై పుడతారని పేర్కొన్నారు. మగాళ్లంతా వంట నేర్చుకుని, నెలసరి సమయంలో మహిళలు ‘ధర్మం’ పాటించేలా చూడాలని అన్నారు. ఇక స్వామీజీ వ్యాఖ్యలపై స్థానిక మీడియా వివరణ కోరగా.. అక్కడి సిబ్బంది నిరాకరించారు. (చదవండి : 68 మంది విద్యార్థినుల లోదుస్తులు తొలగించాలంటూ..) నలుగురు అరెస్టు.. శ్రీ సహజానంద్ గర్ల్స్ ఇనిస్టిట్యూట్‌లో నెలసరి సమయంలో విద్యార్థినిలు అందరితో కాకుండా వేరుగా తినాలనే నిబంధన ఉంది. అయితే, కొందరు దానిని పాటించలేదు. దాంతో అక్కడి హాస్టల్ యాజమాన్యం 60 మంది విద్యార్థినిలను వాష్‌రూమ్‌కు తీసుకెళ్లి లోదుస్తులు చెక్ చేశారు. కాగా, ఈ ఘటనలో పోలీసులు నలుగురిని సోమవారం అరెస్టు చేశారు. ప్రిన్సిపల్ రీటా రనింగా, మహిళా సిబ్బంది రమీలాబెన్ హిరాణీ, నైనా గోర్సీయా, అనితా చౌహన్ అరెస్టయిన వారిలో ఉన్నారు. ఇక కాలేజీ యాజమాన్యం తీరుపై సీరియస్ అయిన జాతీయా మహిళా కమిషన్ 7 మంది సభ్యులతో విచారణ కమిటీ వేశారు. ఆదివారం కమిటీ సభ్యులు విద్యార్థులను కలిశారు. -
మహిళల శ్రమ దోపిడీకి ‘పిల్స్’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణాదిలోనే వస్త్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన తమిళనాడులో దాదాపు నాలుగువేల ఫ్యాక్టరీలు, స్పిన్నింగ్ మిల్లులు ఉండగా, వాటిల్లో దాదాపు మూడు లక్షల మంది మహిళలు పనిచేస్తున్నారు. వారు రోజంతా పది గంటలపాటు అవిశ్రాంతంగా పనిచేస్తేనే వారికి పూర్తి వేతనం వస్తుంది. మహిళలు రుతుస్రావం సమయంలో కనీసం మూడు రోజులపాటు సెలవు పెట్టాల్సి వస్తుంది. అలా చేస్తే ఉద్యోగాలే పోతాయి. అందుకని వారు ఆ సమయాల్లో కూడా ఫ్యాక్టరీల్లో పనికి హాజరవుతున్నారు. రుతుస్రావం సందర్భంగా వచ్చే నీరసం, బలహీనత పది గంటల పాటు పనిచేయనీయదు. వారి పనిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించే ‘టైమ్‌కీపర్’ వారికి గంట విశ్రాంతి కూడా ఇవ్వరు. మూత్రానికి వెళ్లిన పది నిమిషాల్లో తిరిగి రావాలి. మూత్రానికి కూడా ఎక్కువ సార్లు పోనీయరు. పోతే గంటకింతా, అరగంటకింతా అని వేతనాలు కట్ చేస్తారు. మరి రుతుస్రావం సమయంలో మహిళలు పనిచేసేది ఎలా ? దీనికి సులభమైన మార్గాన్ని ఫ్యాక్టరీ యాజమాన్యాలే కనిపెట్టాయి. రుతుస్రావం సమయంలో మహిళలకు పెయిన్ కిల్లర్స్ లాంటి మాత్రలను టైమ్ కీపర్ల ద్వారా యాజమాన్యాలే సరఫరా చేస్తున్నాయి. ‘థామ్సన్ రాయటర్స్ ఫౌండేషన్’ ఇటీవల వస్త్ర పరిశ్రమల్లో పనిచేస్తోన్న వంద మందికి పైగా మహిళా కార్మికులను ఇంటర్వ్యూ చేయగా వారిలో 90 శాతం మంది ఇలాంటి పిల్స్ తీసుకొని పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇది చాలా భయంకరమైన విషయం. తరచుగా ఈ పిల్స్‌ను వాడడం వల్ల మహిళల్లో మానసిక ఒత్తిడి, గాబరా పెరుగుతుంది. గర్భాశయం వద్ద క్యాన్సర్ రహిత కణతులు ఏర్పడతాయి. ఇతర ఇన్ఫెక్షన్లూ వస్తాయి. కొందరిలో గర్భస్రావం కూడా జరుగుతుంది. ఫ్యాక్టరీలు సరఫరా చేస్తున్న ఈ పిల్స్‌పై ఓ కాగితంగానీ, బ్రాండ్ నేమ్‌గానీ, ఆఖరికి అది ఎక్స్పైర్ అయిందా, లేదా కూడా తెలియడం లేదని దర్యాప్తులో తేలింది. ఈ పిల్స్ కారణంగా తాను తీవ్ర అస్వస్థతకు గురైనట్లు సుధా అనే 17 ఏళ్ల యువతి తెలిపింది. చిత్తు కాగితాలు ఏరుకుని బతికే తన తల్లికి తోడుగా ఉండేందుకు తానీ పనిలో చేరానని, నెలకు ఆరు వేల రూపాయలు వస్తాయని, వారానికి ఒక్క రోజు మినహా ఎలాంటి సెలవులు ఉండవని, సెలవు పెడితే జీతం కట్ చేస్తారని తెలిపింది. తమ కుటుంబానికి లక్షన్నర రూపాయల అప్పు ఉండడం వల్ల తప్పనిసరిగా తానీ పనిలో కొనసాగాల్సి వస్తోందని వాపోయారు. మరో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కనగ మరిముత్తు అనే 21 ఏళ్ల యువతి పిల్స్ కారణంగా తన ఆరోగ్యం పాడవుతోందని, తీసుకోకపోతే పనిచేసే పరిస్థితి ఉండడం లేదని చెప్పారు. ఈ పిల్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్న విషయం తెలియదని, తమకు ఎవరు ఆ విషయం తెలపలేదని చెప్పారు. ఐబ్రూఫెన్, అడ్విల్ లాంటి యాంటీ ఇన్‌ఫ్లామేటరీ డ్రగ్స్‌ను మహిళలకు ఇస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉంటాయని వైద్యులు అంటున్నారు. రుతుస్రావాన్ని అరికట్టేందుకు మందులు ఇస్తున్న మాట వాస్తవమేనని పేరు బహిర్గతం చేయడానికి ఇష్టపడని ఓ టైమ్ కీపర్ తెలిపారు. యాజమాన్యమే వాటిని తమకు సరఫరా చేస్తోందని, అయితే వాటి పేరేమిటో, వాటి వల్ల లాభమా, నష్టమా కూడా తనకు తెలియదని, తాను వాటిని వాడాల్సిన అవసరం రాలేదని మధ్యవయస్కురాలైన ఆమె చెప్పారు. తమ దృష్టికి ఈ విషయం రాలేదని, ఇలాంటి అనైతిక చర్యలకు తాము పాల్పడమని 500 వస్త్ర కంపెనీలకు సభ్యత్వం కలిగిన ‘సదరన్ మిల్లర్స్ అసోసియేషన్’ ప్రధాన కార్యదర్శి సెల్వరాజు కందస్వామి చెప్పారు. ఈ డ్రగ్స్ తీసుకొని బాధ పడుతున్న వస్త్ర ఫ్యాక్టరీల మహిళలు తమ వద్దకు పదుల సంఖ్యలో వస్తున్నారని దిండిగుల్లో క్లినిక్ నడుపుతున్న డాక్టర్ పీ. నళిన కుమారి తెలిపారు. కార్మిక చట్టాల ప్రకారం అర్హులైన నర్సులు, డాక్టర్లతో కంపెనీలే స్వయంగా డిస్పెన్సరీలను ఏర్పాటు చేయాలి. ఎక్కువ ఫ్యాక్టరీలను కలిగిన అతికొద్ది మంది మాత్రమే డిస్పెన్సరీలను నడుపుతున్నారు. చాలా కంపెనీలు ఫ్యాక్టరీల్లో టైమ్ కీపర్ల ద్వారా కడుపు నొప్పికి, తల నొప్పికి, నడుము నొప్పులకు సాధారణ మాత్రలను సరఫరా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలియజేశారు. -
వరద మయూరి
అస్సాం రాష్ట్రం.. తేజ్‌పూర్ సమీపంలోని ఓ గ్రామం.తరచుగా వరదలకు గురయ్యే భౌగోళిక పరిస్థితుల మధ్యనివసించే ప్రజలు. అక్కడ పదిహేడేళ్ల కిందట వచ్చిన వరదల్లో ఓ సంఘటన జరిగింది. నిజానికి అదిసంఘటన కాదు. అనుభవం. ఓ పదిహేనేళ్ల బాలికకుఎదురైన చేదు అనుభవం. ఆ అనుభవమే‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’ అనే ఉద్యమానికి నాంది పలికింది. నది ఒక్కసారిగా దిశ మార్చుకున్నట్లు.. ఇళ్లలోకి చొచ్చుకుని వచ్చింది ప్రవాహం. వీధులు అప్పటికే జలమయ్యాయి. పొలానికి వెళ్లినవాళ్లు, ఇంట్లో ఉన్న వాళ్లు ఒకరికోసం ఒకరు చూసుకునే పరిస్థితి లేదు. ఎవరికి వాళ్లు మోకాళ్లలోతు నీటిలో నేల ఎక్కడుందో పాదాలతో వెతుక్కుంటూ దగ్గరలో ఉన్న షెల్టర్ హోమ్ దగ్గరకు చేరుకున్నారు. ‘హమ్మయ్య, ప్రాణాలు దక్కాయి’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. బెంగపడి ఏడుస్తున్న పిల్లలకు ధైర్యం చెబుతున్నారు పెద్దవాళ్లు. ఎవరి పెద్దవాళ్లు ఏ షెల్టర్‌లో ఉన్నారో, ఎవరి పిల్లలు ఏ షెల్టర్‌లో ఉన్నారో తెలియదు. ఓ పదిహేనేళ్ల అమ్మాయి రెండో రోజుకి కూడా ఏడుపు ఆపడం లేదు. సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. వాళ్ల దగ్గరకు వెళ్లిందా అమ్మాయి. అందరూ మగవాళ్లే, ఒక్క మహిళ కూడా లేదు. తన అవసరాన్ని చెప్పుకోలేక వెనక్కి వచ్చేసింది. తన అవసరాన్ని తల్లికి తప్ప మరెవరికీ చెప్పుకోలేని వయసు ఆమెది. ఆ మర్నాడు పినతల్లి వచ్చి తీసుకెళ్లే వరకు పీరియడ్ బ్లీడింగ్‌తో అవస్థలు పడిందా అమ్మాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీసేటప్పుడు ఇలాంటి ఉపద్రవం ముంచుకు వస్తుందని ఊహించలేదామె. షెల్టర్ హోమ్‌కి వచ్చిన మర్నాడే పీరియడ్ మొదలైంది. షెల్టర్ హోమ్‌లో స్త్రీలకు అవసరమైన ఎటువంటి సౌకర్యాలూ లేవు. నాటి దయనీయమైన సంఘటన ఆ అమ్మాయిని సోషల్ యాక్టివిస్టుగా మార్చింది. ఆమే.. మయూరి భట్టాచార్జీ ‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’ మయూరి ఇప్పుడు ఊరూరా తిరిగి స్కూలు పిల్లలను, గ్రామీణ మహిళలను చైతన్య పరుస్తున్నారు. మెన్స్ట్రువల్ హైజీన్ పాటించాల్సిన అవసరాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇది మాట్లాడడానికి బిడియపడాల్సిన నిషిద్ధమైన విషయమేమీ కాదు, ధైర్యంగా మాట్లాడవచ్చు’ అని చెబుతున్నారు. వరదల సమయంలో సహాయక బృందాలు ఆహారం, కట్టుకోవడానికి దుస్తులు, మందులు పంపిణీ చేస్తుంటారు. అయితే అలాంటి సమయాల్లో స్త్రీ, పురుషుల ఉమ్మడి అవసరాలే కాదు. ప్రత్యేకించి మహిళల అవసరాలు కూడా ఉంటాయని వాళ్లకు తెలియదు. వాళ్లకే కాదు, ప్రభుత్వంలో నిర్ణయాలు చేసే వాళ్లకీ తెలియదు. అందుకే ఆడవాళ్ల అవసరాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని షెల్డర్ హోమ్స్‌లో శుభ్రమైన బాత్రూమ్లు, పాడ్స్, సబ్బులు కూడా ఉంచాలని కూడా ఆమె అస్సాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్స్’ పేరుతో మయూరి మహిళల నుంచి అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదిక కూడా పంపారు. వనితల వినతులు మయూరి భట్టాచార్జీ తనకు ఎదురైన నాటి దుర్భరస్థితి నుంచి ఈ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. సమాజంలో నెలకొని ఉన్న సామాజిక రుగ్మతను తొలగించాలి, మహిళలకు ఎదురవుతున్న గర్భాశయ సంబంధిత అనారోగ్యాలను నివారించాలని నిర్ణయించుకున్నారు. మెన్స్ట్రువల్ ఎడ్యుకేటర్, ట్రైనర్‌గా ఇప్పుడామె స్కూళ్లకు వెళ్లి టీనేజ్‌లోకి వచ్చిన పిల్లలకు గర్భాశయం బొమ్మ గీసి, రుతుక్రమం అనేది దేహధర్మాల్లో ఒక భాగమనే విషయాన్ని వివరిస్తున్నారు. వరద ముప్పును పసిగట్టిన వెంటనే మగవాళ్లలాగ ఉన్న ఫళాన పరుగులు తీయవద్దని, ఇంటి నుంచి పీరియడ్ కిట్ పట్టుకెళ్లమని, పీరియడ్ కిట్ లేకపోతే కనీసం శుభ్రమైన వస్త్రాన్నయినా పట్టుకెళ్లమని చెబుతున్నారు. కొంచె పెద్ద వయసు వాళ్లకయితే ‘‘మీరు ఈ అవసరాన్ని దాటి వచ్చిన వాళ్లే అయినా సరే... కిట్ పట్టుకెళ్లడం మర్చిపోవద్దు. వరద ముప్పును గ్రహించిన తర్వాత ఇంటికి వెళ్లి రావడానికి కూడా వీలుండదు. అలాంటి వాళ్లకు మీరు పట్టుకెళ్లిన కిట్ ఉపయోగపడుతుంది’’ అని వాళ్లకు ముందు జాగ్రత్త చెబుతున్నారు. అలాగే ప్రభుత్వాలు చేయాల్సిన పనిని గుర్తు చేస్తూ అధికారులకు వినతి పత్రాలను సమర్పించడానికి స్థానిక గ్రామీణ మహిళలను కలుపుకుంటున్నారు మయూరి. ఈ క్రమంలోనే ఉమెన్ ఫ్రెండ్లీ ఫ్లడ్ షెల్టర్స్‌ను నిర్మించాల్సిందిగా ‘డిగ్నిటీ ఇన్ ఫ్లడ్’ కాంపెయిన్ నిర్వహించి ముప్పై వేలకు పైగా సంతకాలు సేకరించారామె. సంతకాలు చేసిన ఆ విజ్ఞప్తి పత్రంలో.. షెల్టర్ హోమ్స్‌లో శానిటరీ పాడ్స్, శుభ్రమైన వస్త్రాలు, సబ్బులు సిద్ధంగా ఉంచాలని అస్సాం మహిళలు కోరారు. మయూరి భట్టాచార్జీ ఆధ్వర్యంలో వారంతా నిన్న (మే 28) ‘వరల్డ్ మెన్స్ట్రువల్ డే’ సందర్భంగా అధికారులకు వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు మరో ముఖ్యమైన విషయాన్ని సోషల్ వెల్ఫేర్ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వరదలు లేని సందర్భంలో షెల్టర్ హోమ్స్ ఖాళీగా ఉంటాయి. అప్పుడవి అసాంఘిక శక్తుల అడ్డాగా మారుతున్నాయి. మహిళల మీద అత్యాచారాలకు వేదికలవుతున్నాయి. కాబట్టి అధికారులు గట్టి నిఘా పెట్టాలని కోరారు. గతంలో ఇచ్చిన నివేదికలకు స్పందించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు షెల్టర్హోమ్స్ని పర్యవేక్షించి అవసరమైన మార్పుల గురించి చర్చించాయి కూడా. రాష్ట్రంలోని షెల్టర్ హోమ్స్ అన్నీ ఉమెన్ ఫ్రెండ్లీగా మారే వరకు తమ ఉద్యమం కొనసాగుతుందని అంటున్నారు మయూరి భట్టాచార్జీ. – మంజీర బిడియం వీడాలి ప్రపంచం ఆధునికతలో దూసుకుపోతోంది. కానీ మన సమాజం అపోహలను వదిలించుకోవడంలోనే ఇంకా కొట్టుమిట్టాడుతోంది. గ్రామాలే కాదు, పట్టణాలు కూడా ఇందుకు మినహాయింపుగా ఏమీ లేవు. పీరియడ్ అనేది సహజమైన దేహధర్మం అని సమాజం గుర్తించాలి, దాని గురించి మాట్లాడాల్సిన అవసరాన్ని నొక్కి పెట్టాల్సిన అవసరం లేదని గ్రహించాలి, మరొకరికి వివరించి చెప్పగలిగినంతగా చైతన్యం కావాలి. అలాంటి చైతన్యం రానంత వరకు అత్యవసరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా తన అవసరాన్ని చెప్పడానికి గొంతు పెగలదు. బిడియం లేకుండా మాట్లాడగలిగినప్పుడు ఇలాంటి అవసరం గురించి వాళ్లే మాట్లాడుకోగలుగుతారు. నాలాగ ఒకరు వచ్చి వాళ్ల తరఫున మాట్లాడాల్సిన అవసరం ఉండదు. – మయూరీ భట్టాచార్జీ (స్విట్జర్లాండ్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లోని ప్రసంగ భాగం) రుతుక్రమ పరిశుభ్రతలపై ఆస్కీ చైతన్య సదస్సులు యునిసెఫ్ లెక్కల ప్రకారం మనదేశంలోని యుక్తవయసులో ఉన్న బాలికలు నెలకు కనీసం ఒకటి – రెండు రోజులు స్కూలుకు పోవడం లేదు. ఇందుకు కారణం ఆయా స్కూళ్లలో విద్యార్థినులకు సరైన టాయిలెట్ సౌకర్యాలు లేకపోవడమే. నెలసరి సమయంలో ప్యాడ్ మార్చుకోవడానికి వీల్లేకపోవడంతో ఆ రోజుల్లో స్కూలు మానేస్తున్నారు. అమ్మాయిలకు, మహిళలకు రుతుక్రమ పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించడం, ఆ విషయాలను మాట్లాడడానికి ఎదురవుతున్న బిడియాన్ని తొలగించడం కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖలు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నాయి. యునిసెఫ్, ఆస్కీ (అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా)ల సహకారంతో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రారంభించిన స్వచ్‌భారత్, స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమాలు కూడా పాఠశాలల్లో పరిశుభ్రత, రుతు పరిశుభ్రతల కల్పన కోసం రూపొందినవే. గత ఏడాది ‘వాష్ యునైటెడ్’ సహకారంతో ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో 154 స్కూళ్లలో, పాతిక వేల మంది బాలికలకు రుతుక్రమంపై అవగాహన కల్పించినట్లు ‘ఆస్కీ’ ప్రతినిధి డాక్టర్ మాలినీ రెడ్డి చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా అనేక కంపెనీలు ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో చదువుకుంటున్న, సంక్షేమ హాస్టళ్లలో ఉండే ఇరవై లక్షల మందికి బాలికలకు ఉచితంగా సానిటరీ పాడ్స్ అందచేసినట్లు తెలిపారు. వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డే సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ రుతుక్రమ అవగాహన కోసం నిర్వహించిన కార్యక్రమాలను మాలిని వివరించారు. ‘ఎలాంటి హద్దులు లేవు– మహిళలు, బాలికల సాధికారత చక్కటి రుతు సంబంధ పరిశుభ్రతనివ్వడం ద్వారానే’ అనేది ఈ ఏడాది మెన్స్ట్రువల్ హైజీన్ డే థీమ్. ఈ అవగాహన కార్యక్రమాల్లో పాల్గొని చైతన్యవంతమైన అమ్మాయిలు ‘మేమిప్పుడు షాప్‌కెళ్లి ప్యాడ్స్ కొనుక్కోవడానికి బిడియపడడం లేదు. నేరుగా అడిగి కొనుక్కోగలుగుతున్నాం’ అంటున్నారని డాక్టర్ మాలిని చెప్పారు. -
అక్షింతలు రక్షించలేవు
ప్రపంచంలోని ప్రతి ముగ్గురు బాలికా వధువులలో ఒకరు మన దేశంలోని చిన్నారే! అంతేకాదు, మనదేశంలో జరుగుతున్న ప్రతి నాలుగు పెళ్లిళ్లలో ఒకరు 18 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న వధువే! ఇలా చిన్న వయసులోనే ఆడపిల్లలకు పెళ్లి చేసెయ్యడం వల్ల వారు అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని ‘యునిసెఫ్’ సంస్థ తాజాగా హెచ్చరికను జారీ చేసింది. తలపై అక్షింతలు వేసి చేతులు దులుపుకుంటే ఆడపిల్ల బాధ్యత తీరిపోవచ్చేమో కానీ, ఆ తర్వాత ఆమె అనుభవించే ఆరోగ్య సమస్యల్నుంచి.. పెళ్లిరోజు మనం వేసిన అక్షింతలు ఆమెను రక్షించలే వని గమనించాలి. 18 లోపు పెళ్లయితే! ►అనేకసార్లు గర్భం దాల్చడం వల్ల పొత్తికడుపు బలహీనం అవుతుంది. ►జననాంగ శుభ్రత లోపిస్తే గర్భాశయ కంఠద్వారం (సెర్విక్స్) నుంచి లైంగిక వ్యాధులు, హెచ్.పి.వి. (హ్యూమన్ పాపిల్లోమా వైరస్), సెర్వికల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ►అసంఖ్యాక కలయికల కారణంగా జననాంగనాళం వాచి, భరించలేనంత నొప్పిని కలిగించవచ్చు. ►వయసుకు సరిపడని లైంగిక కృత్యాల కారణంగా మైనరు బాలికలు మానసిక ఆరోగ్యాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది. కనీస జాగ్రత్తలు ►రుతుస్రావ సమయంలో ప్రతి ఆరు గంటలకొకసారి ప్యాడ్స్ మారుస్తుండాలి. ►వస్త్రాన్ని వాడుతుంటే కనుక, ఒకసారి వాడిన వస్త్రాన్ని మళ్లీ మళ్లీ వాడకూడదు. వస్త్రంలో వృద్ధి చెందే బాక్టీరియా జననాంగంలో ఇన్ఫెక్షన్కు దారి తీయవచ్చు. ►రుతుస్రావంలోను, మిగతా సమయాల్లోనూ జననావయవాన్ని నీటితో శుభ్రం చేసుకోవాలి. ►అవసరం అయినప్పుడల్లా వాష్‌రూమ్‌కి వెళ్లి వస్తుండాలి. గంటలకొద్దీ మూత్రాన్ని బిగబట్టి ఉంచకూడదు. అలా ఉంచితే అది ఇతరత్రా ఆరోగ్య సమస్యలకు మూలం కావచ్చు. ►తరచు బ్రెస్ట్ క్యాన్సర్, సెర్వికల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటుండాలి. -
‘అదే దక్షిణాదైతే నిన్ను ముక్కలుగా నరికేవారు’
రుతుచక్రం.. మెన్సురేషన్, పిరియడ్స్ పేరేదైనా కావచ్చు. కానీ ఇప్పటికి మన దేశంలో ఇది ఒక అంటరాని మాటే. ఆడపిల్లగా పుట్టి మహిళగా ఎదిగే క్రమంలో స్త్రీ శరీరంలో జరిగే అతి సహజమైన మార్పుల్లో ఇది ఒకటి. కానీ ఇప్పటికి మన సమాజంలో నూటికి తొంభై తొమ్మిది మంది బహిరంగంగా ఈ పేరును పలకడానికి కూడా ఇష్టపడరు. మనిషి జీవితంలో ఆకలి, నిద్ర, బాధ, కోపంలాగానే పిరియడ్స్ కూడా ఓ భాగమైనప్పుడు మరేందుకు దాన్ని గురించి మాట్లాడలంటే జంకు. ఇప్పటికి మనదేశంలో పిరియడ్స్ సమయంలో ఆడవారు ఇంట్లో అన్ని గదుల్లో తిరగకూడదు.. మరీ ముఖ్యంగా పూజ గదిలోకి కానీ, ఆలయంలోకి కానీ ప్రవేశించకూడదు. పండగలు వంటి కార్యక్రమాల్లో పాల్గొనకూడదు. అరే.. సృష్టికి మూలం స్త్రీ అయినప్పుడు.. పిరియడ్స్ పేరు చెప్పి ఆ స్త్రీనే దేవునికి దూరంగా ఉంచడం ఎంత వరకూ సమంజసం. ఇదే ఆలోచన వచ్చింది ముంబైకు చెందిన అనికేత్ మిత్రా అనే కళాకారునికి. ఈ విషయం గురించి సమాజంలో చైతన్యం కల్గించడం కోసం కాస్తా విభిన్నమైన ఆర్ట్ వర్క్‌ని రూపొందించారు. అయితే మంచిని ఆలోచించి చేసిన ఆర్ట్ వర్క్ కాస్తా ఇప్పుడు అతనికి సమస్యలు తెచ్చిపెట్టింది. వివరాలు.. రానున్న నవరాత్రి ఉత్సవాలను దృష్టిలో పెట్టుకుని అనికేత్ అమ్మవారి రూపాన్ని ఎవరి ఊహకు అందనటువంటి విధంగా రూపొందించారు. స్త్రీ సహజమైన రుతుక్రమాన్ని ప్రధాన థీమ్‌గా తీసుకున్నారు. అందులో భాగంగా శానిటరీ నాప్కిన్ మీద ఎరుపు రంగులో ఉన్న కమలాన్ని చిత్రించారు. ఈ ఎరుపు రంగును పిరియడ్స్ సమయంలో జరిగే బ్లీడింగ్‌కు ప్రతి రూపంగా ఎంచుకున్నానని చెప్తారు మిత్రా. శానిటరీ నాప్కిన్ వెనక భాగాన దుర్గమాతాను అలంకరించే విధంగా డెకరేట్ చేసి ఫొటో తీసి తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దాంతో ఈ ఆర్ట్ వర్క్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఆర్ట్ వర్క్ గురించి ప్రజల్లో మిశ్రమ స్పందన వెలువడింది. ‘ఇది కోల్‌కతా కాబట్టి కేవలం నీ మీద కంప్లైంట్ ఇచ్చి వదిలేస్తున్నాం. అదే దక్షిణ భారతదేశంలో నువ్వు ఇలాంటి వేషాలు వేస్తే ఈ పాటికే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేసేవారు’ అంటూ విమర్శిస్తున్నారు. అంతేకాక ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే నీకే ప్రమాదం అంటూ బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలిపారు అనికేత్. కానీ మరో వర్గం నెటిజన్లు అనికేత్ సృజనను మెచ్చుకోవడమే కాక ఈ ఫొటోని షేర్ చేస్తున్నారు. పోస్ట్ చేసిన 24 గంటల్లోనే దాదాపు 4 వేల మంది ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ విషయం గురించి అనికేత్ మాట్లాడుతూ.. ‘మన దేశంలో స్త్రీలు పిరియడ్స్ సమయంలో తమను తామే అపవిత్రంగా భావించుకుంటారు. అందువల్లే ఎటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనరు. ఈ ఆలోచనను తప్పు అని చెప్పి వారిలో చైతన్యం కల్గించడం కోసమే నేను ఇలాంటి ఆర్ట్ వర్క్‌ని రూపొందించాను. నన్ను విమర్శించేవారిని, బెదిరించేవారిని నేను పట్టించుకోను. ఈ విషయంలో నాకు మద్దతు ఇస్తున్నవారే నాకు ముఖ్యం’ అన్నారు. పిరియడ్స్ కారణంగానే కేరళ శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి 10 - 50 ఏళ్ల మహిళల ప్రవేశంపై నిషేధం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధం చెల్లదంటూ.. శారీరక కారణాలు చెప్పి మహిళలను ఆలయంలోకి ప్రవేశించకుండా చేయడం నేరమని సుప్రీం కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
ఛీ.. సిగ్గు పడాలి.. వైరల్ వీడియో
హైదరాబాద్: టాలీవుడ్ నటి మాధవిలత మరో అంశంపై తెరపైకి వచ్చారు. భారత్‌లో ఉన్న రూల్స్ చూసి సిగ్గుపడాలంటూ కామెంట్ చేస్తూ ఓ వీడియోను షేర్ చేశారు. గతంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కూతురు హైదరాబాద్‌కు వస్తున్నారన్న నేపథ్యంలో రంగులు వేస్తూ హడావుడి చేయడంపై మాధవిలత ప్రశ్నించిన విషయం తెలిసిందే. తాజాగా మహిళలకు సంబంధించిన సమస్యను చూపిస్తూ.. ఈ విషయంలో మహిళలకు సహకరించని ప్రభుత్వ నిబంధనలపై ఆమె మండిపడ్డారు. ఆడవాళ్లు రుతుస్రావం సమయంలో వాడే ప్యాడ్స్‌పై 12 శాతం పన్ను(టాక్స్) విధించిన ప్రభుత్వం కండోమ్స్ పై మాత్రం వేయలేదన్నది వీడియోలో చూడవచ్చు. ప్రియాంక పెరుమాల్ అనే నెటిజన్ పోస్ట్ చేసిన వీడియోను నటి మాధవిలత తన ఫేస్బుక్లో షేర్ చేస్తూ 'షేమ్ ఆన్ ఇండియన్ రూల్స్' అంటూ అసహనం వ్యక్తం చేశారు. శానిటరీ ప్యాడ్ కొనేందుకు వచ్చిన ఆమెకు పన్ను కలిపిన ధర చెప్పిన దుకాణాదారుడు, మరో వ్యక్తి వచ్చి కండోమ్ అడిగితే ప్రభుత్వం దీనిపై ట్యాక్స్ విధించలేదంటూ అతి తక్కువ ధరకు (కండోమ్) విక్రయిస్తాడు. టాలీవుడ్ నటి మాధవిలత షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. 88 శాతం ఆడవాళ్లు శానిటరీ ప్యాడ్స్ బదులుగా గుడ్డలు, బూడిద, ఇసుక లాంటివి వాడుతున్నారట. -
పాలిచ్చే తల్లులకు
మంచి రుచికరమైన ధాన్యాల్లో సజ్జలు ముఖ్యమైనవి. వీటిల్లో పిండి పదార్థాలు ఎక్కువ. దాంతోపాటు క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియమ్, సోడియం, పొటాషియమ్, జింక్, కాపర్, మాంగనీస్ వంటి ఖనిజలవణాలు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్–ఈ, విటమిన్–కె కూడా ఎక్కువే. సజ్జలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో కొన్నివి. పాలిచ్చే తల్లులు రొమ్ముపాలు పుష్కలంగా పడేలా చేసే గుణం సజ్జలకు ఉంది. ఇందులో ఉండే మెగ్నీషియమ్ వల్ల మహిళల్లో రుతుసమయంలో వచ్చే ‘మెన్స్ట్రువల్ క్రాంప్స్’ తగ్గుతాయి. సజ్జల్లో ఫాస్ఫరస్ పాళ్లు చాలా ఎక్కువ. అందుకే అవి ఎముకలను దృఢంగా మార్చుతాయి. అంతేకాదు.. సజ్జలు కండరాలను మరింత శక్తిమంతంగా చేస్తాయి. సజ్జలు రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను తగ్గించి, గుండెజబ్బులను నివారిస్తాయి. మంచి కొలెస్ట్రాల్ హెచ్‌డీఎల్ పాళ్లను పెంచి రక్తనాళాలు పెళుసుబారకుండా కాపాడతాయి. వీటిల్లో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణకోశ వ్యవస్థ ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు పైల్స్, పెద్దపేగు క్యాన్సర్ వంటి వ్యాధులను నివారిస్తాయి. సజ్జల్లో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనోఎంజైమ్ త్వరగా కడుపు నిండేలా చేసి, సంతృప్తభావనను పెంచుతుంది. ఆరోగ్యకరంగా బరువు తగ్గాలనుకునేవారికి సజ్జలు మంచి ఆహారం. ఇదే ఎంజైమ్ ఒత్తిడిని తగ్గించి, బాగా నిద్రపట్టేలా కూడా చేస్తుంది. తరచూ ఆహారంలో సజ్జలు తీసుకునేవారిలో గాల్‌స్టోన్స్ ఏర్పడటం చాలా తక్కువ. -
హ్యాపీ డేస్
‘మౌనం వద్దు... మాట్లాడదాం..’ అంటూ ఆడపిల్లల రుతుస్రావ పరిశుభ్రత మీద ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్ష అభియాన్ చేపట్టిన అవగాహనా కార్యక్రమం ‘సహజ’ సత్ఫలితాలనిస్తోంది. అమ్మాయిలకు రుతుస్రావం సహజం అని, శానిటరీ నాప్కిన్స్ వాడటానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదంటూ అభియాన్ చేపట్టిన ప్రచారం అమ్మాయిల ఆలోచనల్లో మార్పు తీసుకొచ్చింది. అభియాన్ ఆధ్వర్యంలో నడుస్తున్న కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాల్లో చదువుతున్న మొత్తం 70 వేల మంది అమ్మాయిలలో నలభై వేల మంది అమ్మాయిలు ఇప్పుడు పెన్సిల్ అడిగినంత సహజంగా శానిటరీ నాప్కిన్ కావాలని అడిగి తీసుకొని వాడుతున్నారు. దీనికి కారణం సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ చూపిన చొరవ. ప్రదర్శించిన సహానుభూతి. అందువల్లే ఇప్పుడు ఆయన ‘ప్యాడ్‌మేన్’గా ప్రశంసలు అందుకుంటున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఆసరా కోసం అల్లాడుతున్న అమ్మాయిలను అక్కునచేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పి చేయూతనిస్తున్న ‘కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు’ (కేజీబీవీ) నడుస్తున్న తీరుతెన్నులను ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనివాస్ వివరించారు. దేశంలో శానిటరీ నాప్కిన్స్ వాడకం గురించి, రుతుస్రావ పరిశుభ్రత గురించి చైతన్య కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఆ విధంగా చూసినప్పుడు కొంత ముందుగానే మీరు ‘సహజ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం విశేషం అనే చెప్పాలి. అవును. ఆడపిల్లల రుతుస్రావ పరిశుభ్రత కోసం ‘సహజ’ కార్యక్రమం మేము మొదలుపెట్టాం. ఇది సత్ఫలితాలను ఇవ్వడం ఆనందంగా ఉంది. వివరంగా చెప్పండి. ఆంధ్రప్రదేశ్‌లో 352 కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో 200 మంది విద్యార్థినులు ఉన్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు, సమాజంలో ఏ ఆసరా లేని పిల్లలకు వీటిలో ప్రవేశం ఉంటుంది. మధ్యలో చదువు మానేసిన(డ్రాపవుట్) పిల్లలనూ చేర్చుకుంటాం. ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు అన్నీ ఉచితమే. ఇంటర్ కూడా ప్రారంభిస్తున్నాం. చదువుతో పాటు దుస్తులు, పుస్తకాలు, భోజనం, వసతి, కాస్మోటిక్స్.. అన్నీ ఉచితంగా ఇస్తాము. కేజీబీవీల్లో 70 వేల మంది విద్యార్థినులు ఉంటే వారిలో 45 వేల మంది రుతుస్రావం దశలో ఉన్నారు. రుతుస్రావం సమయంలో వీరు సంప్రదాయ పద్ధతులను అనుసరించడం, అసురక్షిత పద్ధతులను ఆశ్రయించి అనారోగ్యం బారిన పడటం మా దృష్టికి వచ్చింది. రుతుస్రావం సమయంలో తాము రుతుస్రావంలో ఉన్నాం అని చెప్పుకోవడానికి కూడా వారు సంకోచించే పరిస్థితి. అదీగాక రుతుస్రావం భయంతో డ్రాపవుట్స్‌గా మారుతున్నారు. సాటి విద్యార్థినుల హేళన కూడా వాళ్లను కుంచించుకుపోయేలా చేసి చదువు మానేస్తున్నారు. ఇది చాలా తప్పు. అందువల్ల ముందు వారిలో చైతన్యం కలిగించాం. రుతుస్రావంకు సంబంధించి న్యూనత అక్కర్లేదని వారిలో ధైర్యం నూరిపోశాం. ‘మౌనం వద్దు... మాట్లాడదాం’ పేరిట వారిలో సంకోచాలన్నీ తొలగించాం. నాప్కిన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ విద్యార్థినులకు పుస్తకాలు, బట్టలు ఇస్తున్నప్పుడు నాప్కిన్స్ ఎందుకు ఇవ్వకూడదు అని అనిపించింది. ఒకవేళ ఇచ్చే పరిస్థితి ఉన్నా ఇచ్చే పరిస్థితి ఉండాలి కదా. ముందు వారికి అడగడం చాలా మామూలు విషయమని ప్రిపేర్ చేశారు. ఆ తర్వాత ప్రతినెలా ఉచితంగా ‘సహజ’ బ్రాండ్ పేరుతో శానిటరీ నాప్కిన్స్ ఇస్తున్నాం. మూడు నెలలకు సరిపడా నిల్వలు ముందస్తుగా స్కూళ్లకు చేరుస్తాం. మొదట టీచర్లు వాడి చూశారు. నాణ్యత సంతృప్తికరంగా ఉన్న తర్వాతే సరఫరా కాంట్రాక్టర్‌ను ఎంపిక చేశాం. ‘సహజ’ అమలుకు ఏటా రూ. కోటి ఖర్చు చేస్తున్నాం. ఇంతకుమునుపు నాప్కిన్స్ అంటేనే సంకోచించే ఆడపిల్లలు ఇప్పుడు పెన్సిల్ అడిగినంత సులభంగా వాటిని తీసుకుని ఉపయోగిస్తున్నారు. కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలకు ఆదరణ ఎలా ఉంది? కేజీబీవీల్లో చదువుకుని జీవితంలో స్థిరపడిన 20 వేల మంది విద్యార్థినుల వివరాలు మా వద్ద ఉన్నాయి. దీనిని బట్టే ఈ విద్యాలయాల పని తీరు అంచనా వేయవచ్చు. కేజీబీవీలో చదువుకొని బయటకు వెళ్లిన వారు తమకాళ్ల మీద నిలబడగలిగే సత్తా ఉండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్, ఆత్మరక్షణ.. అన్ని రకాలుగా శిక్షణ ఇస్తాం. ఎంతో మంది అమ్మాయిలు డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యారు. ఉన్నత చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. కేజీబీవీల్లో చదువుకున్న విద్యార్థినిలకు చదువుతో పాటు సామాజిక విషయాల్లో అవగాహన, వ్యక్తిగత పరిశుభ్రత, లలిత కళలు, బ్రతుకుదెరువుకు దోహదపడే నైపుణ్యాలు.. తప్పకుండా ఉంటాయి. కేజీబీవీల్లో అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి వాటి నుంచి బయటపడటానికి చేపట్టిన కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? పేదరికం, వెనకబాటుతనం కారణంగా పదో తరగతి కాగానే చాలా మంది అమ్మాయిలకు వివాహం చేస్తున్నారు. పదోతరగతి పరీక్షలు రాసి ఇళ్లకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి విద్యాలయానికి రావడం లేదు. ఎందుకు రావడం లేదనే విషయాన్ని ఆరా తీస్తే.. పెళ్లిళ్లు చేస్తున్నారని తెలిసింది. పదోతరగతి పరీక్షల తర్వాత ఇళ్లకు వెళుతున్న విద్యార్థినులకు.. పెళ్లికి ఇది తగిన వయసు కాదని, బలవంతంగా పెళ్లి చేస్తే ఎదిరించాలని చెప్పి పంపిస్తున్నాం. విద్యాలయం ప్రిన్సిపాల్, స్థానిక పోలీస్ అధికారి, డీజీడీవో (గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్)... అందరి నంబర్లు ఇచ్చి పంపుతున్నాం. తల్లిదండ్రులు పెళ్లికి బలవంతం చేస్తే.. సమాచారం ఇవ్వమని చెబుతున్నాం. మేం చేసిన ఈ ప్రయత్నం ఫలించింది. చాలా మంది అమ్మాయిలు ధైర్యంగా ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. ‘పది తర్వాత పెళ్లి కాదు.. 11వ తరగతి’ అని ప్రచారం చేయడంతో పాటు తల్లిదండ్రులకూ కౌన్సిలింగ్ ఇస్తున్నాం. కేజీబీవీల్లో విద్యార్థినుల భద్రతకు తీసుకుంటున్న చర్యలు? ఈ విద్యాలయాల్లో సెక్యూరిటీ గార్డు నుంచి ప్రిన్సిపాల్ వరకు.. అందరూ మహిళలే. పురుషులకు ప్రవేశం లేదు. సమీపంలోని పోలీస్ స్టేషన్ నుంచి ఒక మహిళా కానిస్టేబుల్‌ను రాత్రి బీట్ కోసం పంపించమని అన్ని జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశాం. నైట్‌బీట్ కానిస్టేబుల్‌ను పంపించడానికి ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది. అన్ని స్కూళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఈ విద్యాలయాల్లో విద్యార్థినిలు సురక్షితమైన వాతావరణంలో ఉంటారు. ఉత్తీర్ణత శాతం ఎలా ఉంది? పదో తరగతిలో ఉత్తీర్ణత శాతం 87 నుంచి 96 శాతానికి పెరిగింది. ఇంటర్మీడియెట్‌లోనూ ఇదే తరహాలో ఉత్తీర్ణత నమోదవుతోంది. మధ్యలో స్కూలు మానేస్తున్న విద్యార్థినిల సంఖ్య ఇటీవల బాగా తగ్గింది. ఎస్ఎస్ఏ తీసుకొస్తున్న ‘కస్తూరి’ ద్వైమాసిక పత్రికకు ఆదరణ ఎలా ఉంది? దేశంలో అమ్మాయిల కోసం ప్రత్యేకంగా పత్రిక తీసుకురావడం ఇదే తొలిసారి. కస్తూరి పత్రికను ఇటీవల కాలం వరకు కేజీబీవీ విద్యార్థినిలకు మాత్రమే ఇచ్చే వాళ్లం. పత్రిక కావాలని మిగతా వాళ్లు కూడా అడుగుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి బహిరంగ మార్కెట్లోకి కూడా విడుదల చేశాం. ( సర్వశిక్ష అభియాన్ డైరెక్టర్ జి. శ్రీనివాస్) – మల్లు విశ్వనాథరెడ్డి,సాక్షి ప్రతినిధి, అమరావతి బ్యూరో -
కారణం కనుక్కున్నారు
మహిళలకు మానవజాతి ప్రణమిల్లవలసిన కారణాల్లో ప్రధానమైనది మానవ మనుగడ కోసం ఆమె రక్తాన్ని స్రవించడం! రుతుస్రావం వల్ల ప్రతినెలా ఆమె రక్తాన్ని కోల్పోతుంటుంది. కొంత మందిలో ఆ కోల్పోవడం పరిమితికి మించి ఉంటుంది. అప్పుడు వారు పడే అవస్థ అంతా ఇంతా కాదు. ‘ప్యాడ్మాన్’ సినిమా ట్రైలర్లో అక్షయ్ కుమార్ ఒక మాట అంటాడు. ‘ఇదే పరిస్థితి మగాళ్లకు ఉంటే చచ్చిపోతారు’ అని! ఆలోచిస్తే నిజమేననిపిస్తుంది. గర్భాశయం లోపల ఎండోమెట్రియమ్ అనే పొర ఉంటుంది. ఈస్ట్రోజెన్, ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ల ప్రభావం వల్ల రుతుచక్రంలో ఈ ఎండోమెట్రియమ్ పొర అనేక మార్పులకు లోనవుతుంది. రుతుస్రావం తర్వాత ఈస్ట్రోజెన్ హార్మోన్ గర్భాశయం లోపలి గోడలపై ప్రభావం చూపడం వల్ల అక్కడ ఎండోమెట్రియమ్ అనే పొర మొదటి పద్నాలుగు రోజులు వృద్ధి చెందుతూ ఉంటుంది. పదిహేనవ రోజు నుంచి విడుదల అయ్యే ప్రోజెస్టెరాన్ అనే హార్మోన్ ప్రభావం వల్ల పొర మరింత వృద్ధి చెందుతుంది. దానికి సన్నటి రక్తనాళాలు కూడా అభివృద్ధి చెందుతాయి. మహిళలోని అండం, పురుష శుక్రకణంతో కలిసి పిండంగా మారనంత వరకు ప్రతి నెలా.. పద్నాల్గవ రోజు తర్వాత ప్రోజెస్టెరాన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దాంతో ఎండోమెట్రియమ్‌లో అభివృద్ధి చెందిన రక్తనాళాలు కుంచించుకు పోతాయి. ఫలితంగా ఎండోమెట్రియమ్ పొర గర్భాశయం గోడ నుంచి ఊడిపోయి సన్నటి ముక్కలుగా రక్తంలో కలిసి బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. అదే రుతుస్రావం. అధికంగా ఎందుకవుతుంది? మహిళల్లో ఆక్సిజన్ తగ్గినప్పుడు వారి ఒంట్లో హెచ్ఐఎఫ్–1 (హైపాక్సియా ఇండ్యూసిబుల్ ఫ్యాక్టర్–1) అనే ప్రొటీన్ తయారవుతుంది. ఇది గర్భాశయంలోని పొర ఊడిపోయాక అయ్యే గాయాన్ని త్వరగా మానేలా చేస్తుంది. కొన్ని కారణాల వల్ల కొందరు మహిళల్లో ఈ హెచ్ఐఎఫ్–1 చాలా తక్కువగా తయారవుతుంది. అలాంటివాళ్ల లోనే రుతుస్రావం సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుంటుందని తాజా అధ్యయనంలో వెల్లడయింది. ఈ హెచ్ఐఎఫ్–1ను ఎక్కువగా తయారయ్యేలా చేస్తే... ఆటోమేటిగ్గా రక్తం పోవడం కూడా తగ్గుతుందని పరిశోధకులు గుర్తించారు! రుతు సమయంలో ఎక్కువ రక్తం కోల్పోయే మహిళలు మిగతా వారిలా ఆ రోజుల్లో స్వేచ్ఛగా బయటకు రావాలంటే బిడియపడుతుంటారు. పదిమంది దృష్టిలో పడతామేమోనంటూ ఆందోళనగా ఉంటారు. ఇప్పుడిక వారి దేహంలో హెచ్ఐఎఫ్–1 ప్రొటీన్‌ను ఎక్కువ స్రవించేలా చేయడం ద్వారా వారి ఆందోళనను దూరం చేయవచ్చునని భావిస్తున్నారు. దీని నిర్ధా్థరణకు ప్రయోగాలు కూడా మొదలయ్యాయి. -
రుతుస్రావంపై పోస్టు చేసిన హీరో!
మహిళల రుతుస్రావంపై సమాజంలో అనేక మూఢనమ్మకాలు, దుష్ప్రచారాలు ఉన్నాయి. మహిళల పిరియడ్స్ గురించి మాట్లాడటమే తప్పు, ఈ విషయాన్ని గుప్తంగా ఉంచాలి అన్నంతగా ఈ మూఢనమ్మకాలు ప్రబలిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై క్రమంగా మార్పు వస్తున్నది. అయితే, ఈ అంశం గురించి ఇప్పటికీ సమాజంలో పలు దురభిప్రాయాలు లేకపోలేదు. పిరియడ్స్ గురించి మాట్లాడలంటే 'ఆ రోజుల్లో' అని మాట్లాడే పరిస్థితి ఇప్పటికీ ఉంది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై అవగాహన కల్పించేందుకు 'టు బ్లీడ్ వితౌట్ వాయిలెన్స్' పేరిట అరణ్య జోహర్ ఓ పవర్ఫుల్ కవితను చదివి వినిపించారు. పిరియడ్స్‌ను బలహీనతకు సంకేతంగానో, రహస్య అంశంగానో చూడకూడదని, మహిళ సాధికారితలో ఇది కూడా భాగంగా పరిగణించి.. వారిని ప్రోత్సహించాలంటూ ఆమె పఠించిన ఈ కవితను బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసుకున్నారు. రుతుస్రావ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా ఈ అంశంపై మౌనాన్ని వీడాలంటూ ఆయన ట్వీట్ చేశారు. అక్షయ్ తన రాబోవు చిత్రంలో ప్యాడ్మన్గా కనిపించబోతున్నాడు. తన గ్రామంలోని మహిళలకు తక్కువ ధరకు సానిటరీ ప్యాడ్స్ అందించడం ద్వారా సమాజంలో అవగాహన కల్పించిన అరుణాచలం మురుగనాథమ్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. Break the silence on menstruation, periods are nothing to hide! #MenstrualHygieneDay --> https://t.co/BoNedwz20C pic.twitter.com/DvV0HvEsHx — Akshay Kumar (@akshaykumar) 28 May 2017 -
మహిళలపై కాంగ్రెస్ నేత దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు!
త్రివేండ్రం: మహిళలపై కేరళ కాంగ్రెస్ నేత ఎంఎం హసన్ దిగ్భ్రాంతికర వ్యాఖ్యలు చేశారు. రుతుస్రావం సమయంలో మహిళలు మలినంగా ఉంటారని, కాబట్టి వారిని ఆధ్యాత్మిక ప్రదేశాల్లోకి అనుమతించకూడదని పేర్కొన్నారు. 'రుతుస్రావం అనేది మలినమైనది. ఈ సమయంలో మహిళలను ఆలయాల్లోకి రానివ్వకూడదు. ఈ సమయంలో మహిళలకు రాకూడదన్న సూచన వెనుక సైంటిఫిక్ కారణం ఉంది. దీనిని తప్పుగా వ్యాఖ్యానించకూడదు. ఈ సమయంలో మహిళలు ఉపవాసం ఉండకూడదు. నా అభిప్రాయం ప్రకారం మహిళల శరీరం మలినంగా ఉన్నప్పుడు వారు ఆలయాలు, మసీదులు, చర్చిల వంటివాటికి వెళ్లకపోవడమే మంచిది' అని ఆయన పేర్కొన్నారు. కేరళ పీసీసీ చీఫ్‌గా తాత్కాలిక బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది. గతకొంతకాలంగా ఖాళీగా ఉన్న కేరళ కాంగ్రెస్ చీఫ్ పదవిని తనకు సన్నిహితుడైన ఎంఎం హసన్‌కు మాజీ సీఎం ఊమెన్ చాందీ పట్టుబట్టి మరీ ఇప్పించారు. -
సేఫ్ సైకిల్
మహిళగా పుట్టడం మహాభాగ్యమైనా మహిళలకు సామాజికంగా మానసికంగా ఎన్నో ఒడిదొడుకులు ఉంటాయి. ఆ కష్టాలు చాలవన్నట్లు ప్రకృతి ఇచ్చిన ఇంకో కష్టం రుతుచక్రంలో అపశ్రుతులు. ఈ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి? మెన్స్ట్రువల్ సైకిల్‌ను సేఫ్‌గా ఎలా చేసుకోవాలో తెలుసుకోడానికే ఈ సమగ్ర ప్రత్యేక కథనం. మెన్స్ట్రువల్ సమస్యలు – మహిళలకు సూచనలు మరో జీవిని సృష్టించడం కోసం ప్రతి జీవీ తపన పడుతుంది. సృష్టి ధర్మం ఇది. ఈ ధర్మాన్ని నెరవేర్చడం కోసం పురుషులు, మహిళల్లో వేర్వేరు ప్రత్యుత్పత్తి వ్యవస్థలు పనిచేస్తుంటాయి. ఇందుకు మహిళల్లో కొనసాగే క్రతువే రుతుక్రమం. ఈ రుతుక్రతువు ప్రతినెలా సజావుగా సాగాలంటే ఎన్నో సంక్లిష్టతలతో కూడిన సమతౌల్యాలు అవసరం. అవన్నీ సమంగా సాగితేనే సక్రమంగా వస్తుంది నెలసరి. నిజంగా నెలసరి సరిగా రావడం అన్నది మహళకు సిరి. ఈ సంక్లిష్ట హార్మోన్లలో ఏ ఒక్కదానిలో కాస్త తేడా ఏర్పడ్డా నెలసరి అస్తవ్యస్తం. అంటే సైకిల్ సరిగ్గా నడవదన్నమాట. అందుకే యుక్తవయసు మహిళ గైనకాలజిస్ట్ వద్దకు వెళ్లగానే మొదట అడిగే మాట ‘నెలసరి సరిగానే వస్తోందా?’ అని. అంతటి ప్రాధాన్యం ఉంటుందా ప్రశ్నకు. రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకు అవకాశాలూ, రాకపోవడానికి కారణాలు తెలుసుకొని... మహిళ తన సైకిల్‌ను సేఫ్‌గా ఉంచుకోడానికి అవసరమైన అవగాహన కోసం... ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ రుతుస్రావం మొదలయ్యే కొంత కాలం ముందుగా ఈ బాధలు కనపడుతుంటాయి. కాబట్టి దీనిని పీ–మెన్స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) అంటారు. హార్మోన్ల పరిమాణాల్లో మార్పుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. పీఎంఎస్‌తో బాధపడే మహిళలు అత్యంత తీవ్రమైన భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంటారు. వేగంగా, విపరీతంగా కోపం తెచ్చుకోవడం, టెన్షన్, తీవ్రమైన విచారం వంటి భావోద్వేగాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కొందరిలో ఇలాంటి మానసికమైన ఉద్వేగాలు లేకుండా కేవలం శారీరకమైన బాధలు మాత్రమే ఉంటాయి. అంటే కండరాలు బిగదీసుకు పోవడం (ముఖ్యంగా పొట్ట కండరాలు), కింది నుంచి గ్యాస్ పోతుండటం వంటివి ఇబ్బంది పెడతాయి. రుతుక్రమం రాబోయే ముందు కనిపించే ఈ బాధలన్నీ రుతుస్రావం మొదలయ్యాక క్రమంగా తగ్గిపోతాయి. కొందరు యువతుల్లో ఈ బాధలు ఎంత తీవ్రంగా ఉంటాయంటే... అవి రోజువారీ జీవితాన్ని సజావుగా సాగనివ్వవు. ఆ సమయంలో కనిపించే కొన్ని తీవ్ర ఇబ్బందులివే... ⇒ఎవరైనా పలకరిస్తే తీవ్రంగా విసుక్కోవడం ∙ ⇒త్వరగా కోపం తెచ్చుకోవడం ⇒తీవ్రమైన వెన్నునొప్పులు ⇒తలనొప్పి, ∙రొమ్ములలో సలపరం ⇒మొటిమలు ⇒ఎప్పుడూ ఏదో తినాలనిపించడం ⇒తీవ్రమైన నిస్సత్తువ ⇒వ్యాకులత (డిప్రెషన్) ⇒యాంగై్జటీ ⇒తీవ్రమైన ఒత్తిడిలో ఉన్న భావన ⇒నిద్రలేమి ⇒మలబద్దకం కడుపు కండరాలు తీవ్రంగా బిగదీసుకుపోయి విపరీతంగా నొప్పిని కలిగించడం వంటివి... ఉపశమనం ఇలా : ఉప్పును తగ్గించడం లేదా పరిమితంగా తీసుకోవడం, కాఫీ వంటి కెఫిన్ ఉండే ద్రవాల జోలికి పోకపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం, తేలికపాటి వ్యాయామాలు చేయడం వంటివి పీఎంఎస్ లక్షణాలను తగ్గిస్తాయి. క్యాల్షియమ్, విటమిన్ – డి సప్లిమెంట్లు వాడటం కూడా చాలావరకు ఉపయోగపడుతుంది. ‘ప్యూబర్టీ’తో మొదలు... ‘మెనోపాజ్’తో ముగింపు మహిళ జీవితంతో దాదాపు సమాంతరంగా సాగే ఈ రుతుక్రమం ‘సైకిల్’ తాను వ్యక్తురాలు కాగానే (ప్యూబర్టీ అటెయిన్ చేయగానే) మొదలై మెనోపాజ్‌తో ఆగుతుంది. అప్పటి వరకూ క్రమం తప్పకుండా నడుస్తూనే ఉంటుందీ ‘సైకిల్’. రక్తస్రావం అయ్యే రోజు ‘డేట్’... నెల తర్వాత రుతుస్రావం వచ్చే రోజును వాడుక భాషలో ‘డేట్’ వచ్చిందా అని అడుగుతుంటారు. అది వచ్చాక నాలుగైదు రోజులు ఉంటుంది కాబట్టి ఆ వ్యవధి ‘పీరియడ్’. తన నుంచి మరో చిన్నారికి జన్మనివ్వడానికి ఒక మహిళ తన దేహాన్ని సంసిద్ధపరచేందుకు అవసరమైన జీవ, రసాయన ప్రక్రియలన్నీ ఈ ‘పీరియడ్’లో క్రమం తప్పకుండా చోటు చేసుకుంటుంటాయి. ఏదైనా క్రమం తప్పితే... ఆ ‘అ’క్రమతే సమస్యగా ముందుకొస్తుంది. ముంచుకొస్తుంది. ►సైకిల్ నడిపే అనేక డ్రైవర్లు ‘హార్మోన్లు’... మహిళకు వచ్చే ఈ సైకిల్‌ను ఏమాత్రం క్రమం తప్పకుండా నడిపేవి ‘హార్మోన్లు’. అందుకే ఏమాత్రం అంతరాయం రాకుండా నడపాలంటే ప్రతి హార్మోన్ అత్యంత సక్రమంగా పనిచేయాలి. వాటిల్లో ఏ హార్మోన్ కాస్త క్రమం తప్పినా సైకిల్ దెబ్బతింటుంది. ప్రతి మహిళలోనూ సైకిల్ (రుతుస్రావం) మొట్టమొదట ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌తో మొదలవుతుంది. ఇది అండాశయం (ఓవరి)లోని అండాన్ని అభివృద్ధి చెందేలా చేస్తుంది. ఈ ప్రక్రియలను ఓవ్యులేషన్ అంటారు. ఇందులో అండం పూర్తిగా అభివృద్ధి చెందుతుంది. ►తర్వాతి స్టెప్ ప్రో – జెస్టెరాన్... ఓవ్యులేషన్ జరిగాక గర్భసంచిలోని లోపలి లైనింగ్ పొరలు కాస్త మందంగా మారుతాయి. ఇలా మారేందుకు ప్రోజెస్టెరాన్ అనే హోర్మోన్ త్పోడుతుంది. ప్రో... అంటే ముందుదశ... అని అర్థం. జెస్టెషన్ అంటే గర్భధారణ... రాన్ అంటే అందుకు సిద్ధం చేసే హార్మోన్. ఓవ్యులేషన్లో అభివృద్ధి జరిగిన ‘అండం’ గనక... వీర్యకణ సంపర్కంతో ‘పిండం’గా రూపొందితే... ఆ పిండం సక్రమంగా పెరగడానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్ల కోసమే ఈ ‘ప్రో’... ‘జెస్టెషన్’ ఏర్పాట్లన్నటమాట. ఈలోకంలోకి రాబోయే చిన్నారి అతిథి కోసం ప్రకృతి చేసిన అద్భుత ఏర్పాటిది. అండంతో వీర్యకణం సంపర్కం చెంది పిండంగా ఏర్పడితే జరిగేది ఇక అది క్రమంగా పెరగడమే. ►గర్భం రాకపోతే... మరి ఒకవేళ గర్భం రాకపోతే... సుమారు నెలరోజుల్లో ఆ డేట్‌కి రుతుస్రావం మొదలవుతుంది. పిండానికి మంచి ఆవాసం ఇవ్వడం కోసం మందంగా మారిన లైనింగ్ పొరలు... గర్భధారణ జరగనప్పుడు క్రమంగా క్షీణించిపోతాయి. అలా క్షీణించే సమయంలో అవి రక్తస్రావాన్ని వెలువరుస్తాయి. దాంతో ఆ పీరియడ్ ముగుస్తుంది. మళ్లీ దేహం మరో పీరియడ్‌కు కావాల్సిన ఏర్పాట్లను చేసుకోవడం మొదలు పెడుతుంది. అంటే మరో సైకిల్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇదీ ఒక నెల వ్యవధిలో సాగే క్రమం. అత్యంత సక్రమం. కానీ ఏదైనా కారణాల వల్ల ఈ సైకిల్లో క్రమత్వం తప్పే అవకాశాలు, దాంతో సమస్య ఏర్పడే పరిస్థితులు నెలకొంటాయి. రుతుసంబంధ సమస్యలు – నిర్ధారణ పరీక్షలు రుతుక్రమానికి సంబంధించిన అనేక సమస్యల నిర్ధారణ కోసం సాధారణంగా కొన్ని పరీక్షలు చేస్తుంటారు. అవే... ∙ఎండోమెట్రియల్ బయాప్సీ (ఇందులో యుటెరస్లోని చిన్న పొరను తొలగించి, దాన్ని విశ్లేషణకు పంపుతారు) ∙హిస్టెరోస్కోపీ (ఒక చిన్న గొట్టానికి కెమెరా అమర్చి గర్భసంచిలోకి పంపి, అక్కడి అబ్నార్మాలిటీస్ ఏవైనా ఉన్నాయేమోనని తెలుసుకుంటారు ∙అల్ట్రాసౌండ్ పరీక్ష (ఇందులో శబ్దతరంగాల సహాయంతో గర్భసంచి ఎలా ఉందో తెలుసుకుంటారు). రుతుక్రమం ఆగిపోయిన తర్వాత (మెనోపాజ్) వచ్చే సమస్యలు మహిళల సంతానోత్పత్తి వయసు దాటాక రుతుక్రమం కూడా ఆగిపోతుంది. దీన్ని మెనోపాజ్ అంటారు. ఈ సాధారణ పరిణామం కొందరిలో మరిన్ని సమస్యలు తెస్తుంది. ఉదాహరణకు మూడ్స్ సరిగా లేకపోవడం, మాటిమాటికీ భావోద్వేగాలకు లోనుకావడం, ఒంట్లోంచి ఆవిర్లు... వంటివి. ఈ లక్షణాలను బట్టి మెనోపాజ్ తర్వాత జీవితాన్ని సాధారణంగా ఉండేలా చేయడానికి హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ వంటి అనేక చికిత్స విధానాలు అందుబాటులో ఉన్నాయి. రుతుక్రమానికి సంబంధించి సమస్యలు మహిళలందరిలోనూ ఒకేలా ఉండవు. వేర్వేరు యువతులు వేర్వేరు తరహా రుతు సమస్యలను ఎదుర్కొంటు ఉంటారు. తమ సైకిల్ విషయంలో వారు ఎదుర్కొనే సమస్యల్లో ముఖ్యమైనవి కొన్ని ... మెనోరియా... పీరియడ్స్ సమయంలో చాలా ఎక్కువగా రక్తం పోతుండటాన్ని మెనోరియా అంటారు. పీరియడ్స్ సమయంలో 80 ఎం.ఎల్. వరకు రక్తస్రావం సాధారణం. అంతకు మించితే ఇబ్బందికరం. హార్మోన్ల అసమతౌల్యతే దీనికి ప్రధాన కారణం. కొందరిలో భారీగా అయ్యే ఈ రక్తస్రావం 5 నుంచి 15 రోజులు, మరికొందరిలో అంతకు మించి కూడా కొనసాగుతుంది. కొన్నిసార్లు రక్తపు గడ్డలుగా కూడా రుతుస్రావం అవుతుంటుంది. రుతుక్రమం మొదలైన మొదటి రెండురోజుల్లో ఉండే తీవ్రత నాలుగు, ఐదు రోజుల వరకు కూడా కొనసాగుతుంది. ఇలాంటప్పుడు కారణాలను తెలుసుకోడానికి వైద్యపరీక్షలు చేయించాలి. రక్తహీనత (అనీమియా) ఉన్న మహిళలకు రుతుసమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉంటుంది. అసలే రక్తం తక్కువగా ఉండడం, దానికి తోడు మళ్లీ ఎక్కువ రక్తం కోల్పోవడంతో తీవ్రమైన నిస్సత్తువ ఆవరిస్తుంది. రక్తంలో ఆక్సిజన్‌ను మోసుకెళ్లే సామర్థ్యం కొరవడటంలో ఇలాంటి వారికి ఆయాసం వస్తుంటుంది. సాధారణ మోతాదుకు మించి రక్తస్రావం అవుతుందంటే... హైపోథైరాయిడిజమ్, ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, యుటెరస్ (గర్భసంచి)లో లేదా గర్భాశయ ముఖద్వారం (సర్విక్స్)లో ఇన్ఫెక్షన్లు వంటివి కారణం కావచ్చు. కారణాన్ని గుర్తించి తగిన చికిత్స అందిస్తారు. తొలి దశలో హార్మోన్ పిల్స్‌తో జీవన నాణ్యత మెరుగవుతుంది. దాంతో నయం కాకపోతే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. ►డిస్ మెనోరియా పీరియడ్స్ సమయంలో తీవ్రమైన నొప్పి రావడాన్ని ‘డిస్మెనోరియా’గా వ్యవహరిస్తారు. సాధారణంగా పీరియడ్స్ మొదలు కాగానే... ఆ టైమ్‌లో పొత్తికడుపులో నొప్పి, పొట్ట, నడుము ప్రాంతపు కండరాలు అతిగా బిగదీసుకుపోయి తీవ్రంగా నొప్పి కలిగించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పీరియడ్స్ సమయంలో కొద్దిపాటి నొప్పి ఉండటం సహజమే. కానీ తట్టుకోలేనంత నొప్పి ఉంటే ఫైబ్రాయిడ్స్, ఎడెనోమయోసిస్, ఎండోమెట్రియాసిస్, పెల్విస్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ వంటి ఇతర ఏవైనా సమస్యలు ఉన్నాయేమోనని ఒకసారి పరీక్ష చేయించుకోవాలి. ►ఉపశమనం కోసం తాత్కాలిక ఉపశమనం కోసం పొట్ట దగ్గర వేడినీళ్ల కాపడం (హీటింగ్ ప్యాడ్) పెట్టడం, నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పి నివారణ మందులు వాడటం వంటివి చేయవచ్చు. అంతటి నొప్పికి అసలు కారణాన్ని కనుగొని దానికి తగిన చికిత్స చేయించుకోవడం ద్వారా ఈ తరహా సమస్యనుంచి విముక్తి పొందవచ్చు. ఇలాంటి వారు విటమిన్ బి కాంప్లెక్స్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం మేలు. వ్యవధి పరమైన సమస్యలిలా... సాధారణంగా రుతుక్రమ చక్రం అంటే 28 రోజులు. చాలామందిలో క్రమం తప్పకుండా 28 రోజులకే పీరియడ్స్ మొదలవుతుంటే... కొందరిలో 25 రోజులకే వస్తుంటుంది. మరికొందరిలో 35 రోజులు పట్టవచ్చు. అదే నిడివి కొనసాగినా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఒకసారి 23 – 25 రోజులు... మరోసారి 32 – 35 రోజులు ఉంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌గా చెబుతారు. ఇక మరికొందరిలో నెలల తరబడి నెలసరి రాకపోవచ్చు కూడా. ఇలా జరుగుతున్నప్పుడు హార్మోన్ల స్రావాలలో అపసవ్యతలు ఉన్నాయనీ, అవి పీరియడ్స్ క్రమతపై ప్రభావం చూపుతున్నాయని అర్థం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు అసలు కారణం ఏమిటో తెలుసుకొని ఆ మూల కారణాన్ని సరిదిద్ది సైకిల్‌ను మళ్లీ ‘సేఫ్’గా కొనసాగేలా చూసుకోవాలి. అమెనోరియా కొందరిలో రావాల్సిన సమయానికి పీరియడ్స్ రావు. అవి వచ్చే దాఖలా కూడా కనిపించదు. ఇలా పీరియడ్స్ రాకుండా పోవడాన్ని వైద్య పరిభాషలో ‘అమెనోరియా’ అంటారు. పిల్లలకు పాలిచ్చే సమయంలో ‘అమెనోరియా’ సర్వసాధారణం. సాధారణంగా యుక్తవయసు నాటికి రుతుక్రమం మొదలువుతుంది. కానీ... ఈ వయసు దాటుతున్నా రుతుక్రమం రాకపోతే ‘ప్రైమరీ అమెనోరియా’ అంటారు. పుట్టుకతోనే ప్రత్యుత్పత్తి సంబంధిత సమస్యలు, గర్భసంచి (యుటెరస్) లేకపోవడం, అండాశయాలు (ఓవరీస్) పెరగకపోవడం వంటి సమస్యలు ఉంటే యుక్తవయసు వచ్చాక సెకండరీ సెక్సువల్ క్యారెక్టర్స్... రొమ్ములు పెరగడం, బాహుమూలాలు, ప్రైవేట్ పార్ట్స్‌లో వెంట్రుకలు పెరగడం వంటివి జరగవు. దీన్ని ప్రైమరీ అమెనోరియా అనవచ్చు. అయితే కొందరిలో సెంకడరీ సెక్సువల్ కారెక్టర్లు పెరిగినా 16వ ఏట వరకూ వ్యక్తురాలు కాకపోతే సెకండరీ అమెనోరియా అంటారు. ఇక కొందరిలో ఒకటి రెండు రుతుస్రావాలు కనిపించాక చాలా కాలం పీరియడ్ రాదు. దానిని సెకండరీ అమెనోరియా అంటారు. క్రమంతప్పకుండా నెలసరి వచ్చే వచ్చే మహిళల్లో కంటిన్యువస్‌గా మూడు నెలలు రుతుక్రమం రాకపోవడాన్ని అమెనోరియా అనవచ్చు. ఒకవేళ తొమ్మిది నెలల వ్యవధిలో అస్సలు రాకపోవడం, వచ్చీరానట్లుగా అనిపిస్తూ... అంటే... ఆ స్రావాలు తగినంతగా కాక ఏదో చుక్కలుగా రావడాన్ని ఆలిగోమెనిరియా అంటారు. అమెనోరియాకు సందర్భాన్ని బట్టి చికిత్స చేస్తుంటారు. ఉదాహరణకు గర్భనిరోధక మాత్రలు లేదా హార్మోన్ మాత్రలు ఇస్తారు. దాంతో రుతుక్రమం మొదలయ్యేందుకు అవకాశం ఉంది. థైరాయిడ్, పిట్యూటరీ గ్రంథుల లోపాల వల్ల రుతుస్రావం ఆగిపోయిన వారికి తగిన మందులతో చికిత్స చేస్తారు. ఒకవేళ శరీర నిర్మాణంలో అడ్డంకులు ఉంటే, దాన్ని శస్త్రచికిత్స ద్వారా సరిచేస్తారు. ఇలాంటి ఏ లోపాలు లేనప్పుడు మహిళలకు మంచి పౌష్టికాహారం ఇవ్వడం, తగినంత విశ్రాంతి, ఆహ్లాదకరమైన జీవనశైలిని అనుసరించేలా చేయడం, ఒత్తిడిని తగ్గించడం వంటి వాటితో పీరియడ్స్‌ను పునరుద్ధరించవచ్చు. ఇక్కడ పేర్కొన్నవి మహిళల్లో వచ్చే రుతుక్రమంలోని కొన్ని సాధారణ సమస్యలు మాత్రమే. ఇవి సక్రమంగా కొనసాగితే వారిది ‘సేఫ్ సైకిల్’గానే పరిగణించవచ్చు. ఇక్కడి పరిమిత సమాచారంలో మీ సమస్యలేమైనా ఉంటే వాటి గురించిన ప్రాథమిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోండి. అవగాహనను పెంపొందించుకోండి. తగిన చికిత్స తీసుకొని నిశ్చింతగా, నిర్భయంగా ఉండండి. ఇంకేమైనా అనుమానాలు ఉంటే మాకు రాయండి. డాక్టర్ ప్రభా అగర్వాల్ సీనియర్ గైనకాలజిస్ట్ అండ్ అబ్‌స్టెట్రీషియన్ మ్యాక్స్‌క్యూర్ సుయోషా ఉమన్ అండ్ ఛైల్డ్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ -
ఇంకా పెద్దమనిషి కాలేదు
ఆయుర్వేద కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 15 ఏళ్లు. చాలా సన్నగా, బక్కగా ఉంటుంది. ఇంకా పెద్దమనిషి కాలేదు (రుతుస్రావం రాలేదు). పొడవు ఐదు అడుగుల మూడు అంగుళాలు. బరువు 41 కిలోలు మాత్రమే. ఆమె విషయంలో వాడాల్సిన ఆయుర్వేద మందులు, ఆహారం సూచించండి. - అరుంధతి, కాజీపేట ఆడపిల్లలు ఏ వయసులో రజస్వల అవుతారన్నది చాలా అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాథమికంగా, స్త్రీలకు ఉండాల్సిన ప్రత్యేక బాహ్య, అభ్యంతర జననాంగాలన్నీ సక్రమంగా ఉన్నాయా లేక నిర్మాణ లోపాలున్నాయా అని నిర్ధారించుకోవాలి. ఈ వ్యవస్థ సక్రమంగా ఉన్నప్పుడు ఇతర అంశాలను గురించి విశ్లేషించాలి. తల్లి, అమ్మమ్మల రుతుక్రమ చర్యలు, రజస్వల అయిన వయసులు కూడా పరిగణనలోకి వస్తాయి. రజస్వలావస్థ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. పెరుగుతున్న వయసులో కావాల్సిన ప్రోటీన్లు, కొవ్వులు, చక్కెర, విటమిన్లు, ఖనిజలవణాలు ఒక రీతిలో క్రమబద్ధంగా శరీరానికి లభించడం లేదు. కాబట్టి ఈ కింద పేర్కొన్న ఆహార విహారాలను పాటిస్తూ, సూచించిన మందులు వాడుతూ రెండు నెలలు వేచి చూడండి. ఫలితం రావడానికి అవకాశాలు ఎక్కువ. ఆ తర్వాత పరీస్థితిని సమీక్షించుకోవచ్చు. ఆహారం : పూర్తిగా నిషేధించాల్సినవి : ఐస్‌క్రీములు, చాక్లెట్లు, శీతల పానీయాలు, పిజ్జాలు, ఫాస్ట్ఫుడ్స్, నిల్వ చేసి అమ్మే డబ్బాలలోని తినుబండారాలు, కల్తీ సరుకులతో చేసిన ఆహార పదార్థాలు, ముఖ్యంగా బయట బజారులో తయారు చేసి అమ్మే పదార్థాలు పూర్తిగా నిషేధించండి. ఉప్పు, కారం, నూనె పదార్థాలను 90 శాతం వదిలేయండి. కేవలం 10 శాతం మాత్రమే తినండి. తినాల్సినవి : ప్రతిరోజూ ఆకుకూరలు, పప్పు, శాకాహారం, పచ్చికొబ్బరి, మొలకెత్తే తృణధాన్యాలు, ముడిబియ్యపు అన్నం, గోధుమరొట్టెలు పండ్లరసాలు, కొబ్బరినీళ్లు, స్వచ్ఛమైన చెరుకురసం, మజ్జిగ, బార్లీ జావలు తీసుకోవాలి తాజా ఫలాలు, శుష్కఫలాలు విధిగా ప్రతినిత్యం తినాలి ఆకుకూరలు ప్రతిరోజూ వండుకొని తినాలి పొట్టుతీయని మినపపప్పు, పెసరపప్పు, కందిపప్పు వంటకాల్లో వాడాలి. గారెలు, పెరుగు గారెలు, మినపసున్ని, పచ్చిఖర్జూరంతో చేసిన నవ్వుల ఉండలు, వేరుశనగ పలుకు ఉండలు, తేనెతో చేసిన పాయసం తినాలి. ఆవునెయ్యి, ఆవువెన్న, ఆవుపెరుగు, ఆవుమజ్జిగ, నువ్వుల నూనె విధిగా ఉపయోగించండి. విహారం : రోజూ తగినంత నిద్ర, తేలికపాటి వ్యాయామం, పదినిమిషాలు ప్రాణాయామం చేయాలి. మందులు : పునర్నవాది మండూర (మాత్రలు) : ఉదయం 1 రాత్రి 1 శతావరీ కల్ప (గ్రాన్యూల్స్) : రెండు పూటలా ఒక్కొక్క చెంచా పాలతో. కూష్మాండ లేహ్యం : రెండు పూటలా ఒక్కొక్క చెంచా చప్పరించాలి. కుమార్యాసవ (ద్రావకం) : మూడు చెంచాలకు సమానంగా నీళ్లు కలిపి, రెండుపూటలా తాగాలి. గమనిక : లభిస్తే ఉసిరికాయ (ఆమలకీ) రసం రోజూ ఒక చెంచా తేనెతో సేవించాలి. - డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద నిపుణులు, సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్ -
మొదటి రుతుస్రావానికీ... గుండెజబ్బులకూ సంబంధం ఇలా!
కొత్త పరిశోధన సాధారణంగా యుక్తవయస్కురాలైన అమ్మాయి మొదటి రుతుస్రావానికీ, ఆమెకు గుండెపోటు వచ్చే అవకాశాలకూ సంబంధం ఉందని చెబుతున్నారు ఆక్స్‌ఫర్డ్‌కు చెందిన పరిశోధకులు. ప్రపంచవ్యాప్తంగా 50 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న దాదాపు కోటీ ముప్ఫయి లక్షలమంది మహిళలను వారి మొదటి రుతుస్రావం ఎప్పుడు వచ్చిందని అడిగి ప్రశ్నించడంతో పాటు అనేక వివరాలను సేకరించి ఈ వివరాలను కనుగొన్నారు. సాధారణంగా మరీ చిన్న వయసులో అంటే 10 ఏళ్ల ప్రాయంలోనూ, లేదా మరీ పెద్ద వయసులో అంటే 17 ఏళ్ల తర్వాత రుతుస్రావం వచ్చిన కౌమార బాలికలకు... వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువని తేలింది. ఇక గుండె జబ్బులేగాక రక్తపోటు, పక్షవాతం వంటి ఇతర జబ్బులు వచ్చే అవకాశాలూ ఎక్కువేనని తేలింది. ఇక 13 ఏళ్ల వయసులో తొలిసారి రుతుస్రావం వచ్చిన అమ్మాయిల్లో... వారు పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చే అవకాశాలు చాలా తక్కువని ఇదే పరిశోధనల్లో వెల్లడయ్యింది. అంతేకాదు... 17 ఏళ్ల తర్వాత రజస్వల అయిన అమ్మాయిల్లో 27 శాతం మందికి పెద్దయ్యాక గుండె జబ్బులు వచ్చిన దాఖలాలు కనుగొన్నట్లుగా ఈ పరిశోధన పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ ఆక్స్ఫర్డ్ నిపుణులు ‘సర్క్యులేషన్’ అనే మెడికల్ జర్నల్‌లో పొందుపరిచారు. -
హోమియోపతి కౌన్సెలింగ్
నా భార్యకు పీసీఓడి.. ఏం చేయాలి? నా భార్య వయసు 32 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? - సునీల్, అనంతపురం గర్భాశయానికి ఇరువైపులా అండాశయాలు ఉంటాయి. ఈ అండాశయాల్లో నీటిబుడగల వంటివి ఉండటాన్ని పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ (పీసీఓడీ) అంటారు. రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11-18 రోజుల మధ్యకాలంలో రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అయితే ఈ పీసీఓడీ సమస్య ఉన్నవారిలో అండాశయం నుంచి అండం విడుదల కాకుండా, అపరిపక్వమైన అనేక అండాలు నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోతాయి. చూడటానికి ఇవి ముత్యాల్లా కనిపిస్తుంటాయి. ఇలా రెండువైపులా కనిపిస్తుంటే దీన్ని వైద్యపరిభాషలో ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తం పోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానం కలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో ప్రక్రియలో సరైన కాన్స్టిట్యూషన్ సిమిలియం విధానంలో హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు. డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్