నా వయసు 29 సంవత్సరాలు. కొంతకాలంగా నెలసరి సమయంలో నాకు చాలా తక్కువగా రక్తస్రావం జరుగుతోంది. ఆ సమయంలో పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటోంది. ఏడాది కిందట నాకు అబార్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచే ఈ సమస్య మొదలైంది. నేను ప్రభుత్వాసుపత్రిలో చూపించుకుంటే, మందులు ఇచ్చారు. మందులు వాడినా ఫలితం పెద్దగా లేదు. ఈ సమస్యకు పరిష్కారం ఉందా?
– అవంతి, మెంటాడ (విజయనగరం జిల్లా)
మీ ఎత్తు, బరువు రాయలేదు. కొందరిలో హార్మోన్లలో అసమతుల్యత పెరిగి ఉన్నట్లుండి బరువు పెరగడం వల్ల, బ్లీడింగ్ కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో అండాశయాలలో నీటిబుడగలు, థైరాయిడ్ సమస్య, మానసిక ఒత్తిడి వంటి వాటివల్ల కూడా రక్తస్రావం కొద్దిగానే అవ్వవచ్చు. కొందరిలో పీరియడ్స్ సమయంలో ప్రోస్టాగ్లాండిన్ హార్మోన్స్ ఎక్కువగా విడుదలవ్వడం వల్ల గర్భాశయ కండరాలు కుంచించుకున్నట్లయ్యి పొత్తికడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది. విడుదలయ్యే హార్మోన్ల మోతాదును బట్టి నొప్పి తీవ్రత ఒక్కొక్కరిలో ఒక్కోలాగా ఉంటుంది. కొందరిలో గర్భాశయంలో ఇన్‌ఫెక్షన్లు, ఫైబ్రాయిడ్స్, అడినోమయోసిన్ వంటి సమస్యల వల్ల కూడా పీరియడ్స్ సమయంలో నొప్పి విపరీతంగా ఉండవచ్చు.
కొందరిలో చాలా అరుదుగా అబార్షన్ కోసం డి అండ్ సి ద్వారా గర్భాశయం శుభ్రం చేసినప్పుడు, ఎక్కువగా చెయ్యడం వల్ల గర్భాశయ పొర దెబ్బతినడం వల్ల బ్లీడింగ్ తక్కువగా అవ్వవచ్చు. అలానే ఎక్కువసార్లు అబార్షన్లు చెయ్యించుకోవడం వల్ల కొందరిలో అడినోమయోసిన్ అనే సమస్య ఏర్పడి కూడా పీరియడ్ సమయంలో పొత్తి కడుపులో నొప్పి ఎక్కువగా ఉండే అవకాశాలు కొద్దిగా ఉంటాయి. ఒకసారి మళ్ళీ గైనకాలజిస్ట్‌ను సంప్రదించి సిబిపి, ఈఎస్‌ఆర్, ఎస్‌ఆర్–టిఎస్‌హెచ్, ఎస్.ఆర్.ప్రోలాక్టిన్ వంటి అవసరమైన రక్తపరీక్షలు చేయించుకుని పెల్విక్ స్కానింగ్ చేయించుకుని సమస్యలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుని, దానిని బట్టి చికిత్స తీసుకోవడం మంచిది. అలాగే బరువు ఎక్కువగా ఉంటే ఆహారనియమాలను పాటిస్తూ, నడక, యోగా వంటి వ్యాయామాలు చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తగ్గి నీ సమస్య తగ్గే అవకాశాలు బాగా ఉంటాయి.
- డా. వేనాటి శోభ, గైనకాలజిస్ట్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment